
బోయింగ్ విమానాలు ఆలస్యం కావడంపై ట్రంప్ అసహనం
వాషింగ్టన్: కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం బోయింగ్ కంపెనీ ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలను అందజేయడంలో ఆలస్యం చేస్తుండటంపై అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా బోయింగ్ పాత విమానాలను కొనుగోలు చేసి, వాటిని అవసరాలకు అనుగుణంగా మార్చనున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడి పర్యటనల కోసం ప్రత్యేకంగా వాడే ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానాలను బోయింగ్ కంపెనీ రూపొందిస్తుంది.
రెండు విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఖరీదు చాలా ఎక్కువైందంటూ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలో కాంట్రాక్టును మార్చారు. మారిన నిబంధనల ప్రకారం 2024లోనే బోయింగ్ మొదటి విమానాన్ని అందజేయాల్సి ఉంది. కానీ, ఉద్యోగుల సమ్మె, కరోనా మహమ్మారి వంటి కారణాలతో ఆ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి పనులు నిలిచిపోయాయి. తాజా అంచనాల ప్రకారం, మొదటిది 2027లో, 2028లో ట్రంప్ పదవి నుంచి దిగిపోయే సమయానికి రెండో విమానం అందుతుంది.
35 ఏళ్లనాటి బోయింగ్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానంలో బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..బోయింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కాంట్రాక్టుకు ప్రత్యామ్నాయం చూస్తున్నామన్నారు. యూరప్ కంపెనీ ఎయిర్ బస్ నుంచి కొంటారా అన్న ప్రశ్నకు ఆయన.. అలాంటిదేమీ లేదన్నారు. విదేశీ కంపెనీ కంటే స్వదేశీ కంపెనీకి ప్రాధాన్యం ఇస్తామన్నారు. బోయింగ్ కంపెనీకే చెందిన వాడిన విమానాన్ని కొని, దానిలో మార్పులు చేయిస్తామని చెప్పారు.
ఖరీదు ఎక్కువనే కారణంతో ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో డిజైన్ చేసిన కొత్తతరం వీసీ–25బీ రకం విమానాలను సైతం ట్రంప్ తిరస్కరించారు. గాలిలో ఉండగానే ఇంధనం నింపుకునే సౌకర్యంతోపాటు అధ్యక్షుడికి అవసరమైన మరెన్నో ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇలా ఉండగా, అధ్యక్షుడు ట్రంప్ శనివారం బోయింగ్ 747–800 రకం కొత్త విమానాన్ని పరిశీలించారని వైట్ హౌస్ తెలిపింది. ఇందులో అత్యాధునిక హార్డ్‌వేర్, ఇతర సాంకేతిక ప్రత్యేకతలను ఆయన తెలుసుకున్నారు. అదేవిధంగా, పామ్‌బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కు చేసిన ఉన్న ఖతార్ రాజకుటుంబానికి చెందిన 15 ఏళ్లనాటి ప్రైవేట్ విమానం లోపల కూడా ఆయన తిరిగి చూశారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment