
భౌగోళిక–రాజకీయ మార్పులు
2025లో అనిశ్చితి, అనూహ్య పరిస్థితులు
కుమార మంగళం బిర్లా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి పగ్గాలు చేపట్టడమనేది అంతర్జాతీయ భౌగోళిక–రాజకీయాల్లో మార్పులకు దారి తీయొచ్చని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఎకానమీ, వ్యాపారాలపై గణనీయమైన ప్రభావాలు పడొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో చోటు చేసుకున్న పరిణామాలను విశ్లేషించిన సందర్భంగా బిర్లా ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
2025లో ప్రపంచంలో అనిశ్చితి, అనూహ్యమైన, సాంప్రదాయానికి భిన్నమైన పరిస్థితులు నెలకొంటాయని బిర్లా చెప్పారు. ఒకవైపు అవకాశాలు మరోవైపు అనిశ్చితి ఉంటుందన్నారు. భారత్ వెలుపల అమెరికా తమకు అతి పెద్ద మార్కెట్ అని, అక్కడ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం కాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు.
అవకాశాలు అందిపుచ్చుకోనున్న భారత్ ..
పుష్కలంగా పారిశ్రామిక సామర్థ్యాలున్నా అంతగా గుర్తింపునకు నోచుకోని భారత్.. ఇప్పుడు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సంసిద్ధంగా ఉందని బిర్లా చెప్పారు. యాపిల్ ఉత్పత్తుల తయారీ భారత్‌కి రావడం మంచి పరిణామమని, త్వరలోనే ప్రపంచంలోనే పావు వంతు ఐఫోన్లు భారత్‌లోనే ఉత్పత్తి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారతీయ ఆటోమొబైల్, సిమెంటు పరిశ్రమ మొదలైనవన్నీ అంతర్జాతీయంగా ఎదుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ తయారీ రంగంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని పేర్కొన్నారు. 21వ శతాబ్దపు తొలి రెండు దశాబ్దాల్లో టెక్నాలజీ విప్లవం చోటు చేసుకుందని.. దీనితో ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ తగు మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తోందని తెలిపారు. రాబోయే దశాబ్దంలో ప్రపంచాన్ని ఏకం చేయగలిగే శక్తిగా టెక్నాలజీని వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment