ద్వితీయార్ధంలో ఎకానమీ జోరు  | India economic activity gained momentum in the second half of FY25 | Sakshi
Sakshi News home page

ద్వితీయార్ధంలో ఎకానమీ జోరు 

Published Fri, Feb 21 2025 5:13 AM | Last Updated on Fri, Feb 21 2025 7:49 AM

 India economic activity gained momentum in the second half of FY25

ఆర్‌బీఐ బులెటిన్‌ వెల్లడి 

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయార్ధంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నట్టు ఆర్‌బీఐ బులెటిన్‌ (ఫిబ్రవరి నెల) వెల్లడించింది. వాహన విక్రయాలు, విమాన ప్రయాణికుల రద్దీ, స్టీల్‌ వినియోగం, జీఎస్‌టీ ఈ–వే బిల్లులు తదితర కీలక గణాంకాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నట్టు పేర్కొంది. డాలర్‌ బలోపేతం కావడంతో వర్దమాన ఆర్థిక వ్యవస్థల నుంచి పెట్టుబడులు వెనక్కి పోవడం కరెన్సీ రిస్క్ లను పెంచుతున్నట్టు తెలిపింది.

 ‘‘ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా కొనసాగనున్నాయి. బలమైన గ్రామీణ వినియోగానికి, వ్యవసాయ రంగం పటిష్ట పనితీరు మద్దతునివ్వనుంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, బడ్జెట్‌లో పన్ను రాయితీలు పెంపుతో పట్టణ వినియోగం సైతం కోలుకోనుంది’’అని బులెటిన్‌ వివరించింది.  27 రకాల కీలక సూచికల ఆధారంగా ఆర్థిక కార్యకలాపాల తీరును అంచనా వేస్తుండడం గమనార్హం. 

ద్రవ్యోల్బణం తగ్గుదల నిదానంగా ఉండడం, టారిఫ్‌ల రిస్క్‌ పట్ల ఫైనాన్షియల్‌ మార్కెట్లలో ఆందోళన నెలకొందని చెబుతూ.. వర్ధమాన మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు తోడు డాలర్‌తో కరెన్సీలు బలహీనపడడాన్ని ఈ బులెటిన్‌ ప్రస్తావించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిలోనే ఉన్నప్పటికీ, అది మోస్తరుగా ఉన్నట్టు తెలిపింది. ‘‘వృద్ధిని, ద్రవ్య స్థీకరణను యూనియన్‌ బడ్జెట్‌ చక్కగా సమతుల్యం చేసింది. మూలధన వ్యయాలలు, వినియోగానికి మద్దతుతోపాటు డెట్‌ స్థిరీకరణకు స్పష్టమైన కార్యాచరణను ప్రకటించింది. దీనికి అదనంగా రెపో రేటు తగ్గింపుతో దేశీ డిమాండ్‌ పుంజుకోనుంది’’అని ఆర్‌బీఐ బులెటిన్‌ వెల్లడించింది.  

2025లో జీడీపీ 6.4 % మూడిస్‌ ఎనలిటిక్స్‌ అంచనా 
న్యూఢిల్లీ: భారత జీడీపీ 2025లో 6.4 శాతం మేర వృద్ధిని సాధించొచ్చని అంతర్జాతీయ సంస్థ మూడిస్‌ ఎనలిటిక్స్‌  తెలిపింది. యూఎస్‌ టారిఫ్‌లు, అంతర్జాతీయంగా డిమాండ్‌ బలహీనపడడం ఎగుమతులపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. 2024లో జీడీపీ 6.6%గా ఉందని గుర్తు చేసింది. 2025లో ఆసియా పసిఫిక్‌ వ్యాప్తంగా వృద్ధి నిదానిస్తుందని మూడిస్‌ ఎనలిటిక్స్‌  తెలిపింది. వాణిజ్య ఉద్రిక్తతలు, విధానపరమైన మార్పులు ఈ ప్రాంతం వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. చైనా జీడీపీ 2024లో 5%గా ఉంటే.. 2025లో 4.2%కి, 2026లో 3.9 శాతానికి తగ్గుముఖం పడుతుందని వివరించింది. భారత వృద్ధి 2024లో ఉన్న 6.6% నుంచి వచ్చే రెండేళ్లు 6.4 శాతానికి తగ్గొచ్చని అంచనా .

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement