ముంబై: ద్రవ్యోల్బణంపై పోరాటం చాలా కాలంపాటు కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అక్టోబర్ బులిటెన్‌లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ ఒకటి పేర్కొంది. దీర్ఘకాల ద్రవ్య విధానంసహా, పలు చర్యలు ధరల కట్టడికి పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది. ‘‘మనం ద్రవ్యోల్బణంపై విజయం సాధిస్తే, ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ ఆర్థికాభివృద్ధి అవకాశాలు మరింత సుస్థిరమవుతాయి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ద్రవ్యోల్బణం సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్ తగిన స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసినట్లవుతుంది. అలాగే ఈ హర్షణీయమైన పరిణామం విదేశీ పెట్టుబడిదారులను పునరుజ్జీవింపజేస్తుంది. మార్కెట్లను స్థిరీకరించి, శాశ్వత ప్రాతిపదికన భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని పొందేలా చేస్తుంది’ అని డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రాసిన కథనం పేర్కొంది. బులిటన్‌లో పబ్లిష్ అయిన ఆర్టికల్ అంశాలను ఆర్‌బీఐ అంగీకరించాల్సిన అవసరం లేకపోవడం గమనార్హం. 2022 సెప్టెంబర్ వరకూ గడచిన తొమ్మిది నెలల నుంచి ఆర్‌బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం సెంట్రల్ బ్యాంక్‌కు నిర్దేశిస్తున్న స్థాయి 6 శాతానికి మించి నమోదవుతున్న నేథ్యంలో ఈ ఆర్టికల్ వెలువడింది.
కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్‌బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్‌బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనా వేసింది.
అక్టోబర్, నవంబర్‌ల్లోనూ ద్రవ్యోల్బణం ఎగువబాటనే పయనిస్తే, తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 సమయంలో ఆర్‌బీఐ రెపో రేటును మరో అరశాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం కట్టడిలో ఎందుకు లేదన్న అంశంపై కేంద్రానికి ఆర్‌బీఐ త్వరలో ఒక నివేదిక సమర్పిస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాల్లో కీలకమైన రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయిని నమోదుచేసుకుంది.
రేటు పెంపు ప్రభావానికి ఆరు క్వార్టర్లు ఆగాలి: వర్మ
ద్రవ్యోల్బణం కట్టడికిగాను ఆర్‌బీఐ గడచిన మే నుంచి పెంచిన 190 బేసిస్ పాయింట్ల రెపో రేటు ప్రభావం వ్యవస్థలో కనబడ్డానికి 5 నుంచి 6 త్రైమాసికాలు (సంవత్సన్నర వరకూ) పడుతుందని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ పేర్కొన్నారు. ‘‘కఠిన ద్రవ్య పరపతి విధానాన్ని అవలంభిస్తున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం తప్పనిసరిగా దిగొస్తుంది’’ అని ఒక టెలిఫోనిక్ ఇంటర్వూలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (అహ్మదాబాద్) ప్రొఫెసర్‌గా ఉన్న వర్మ, మాంద్యం భయాలు లేనప్పటికీ, భారత్ ఆర్థిక వృద్ధి వాస్తవానికి చాలా సంవత్సరాలుగా అనుకున్న స్థాయిలో లేదని ఈ సందర్భంగా వర్మ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం కట్టడి-వృద్ధి ప్రస్తుతం పరపతి విధానానికి సవాళ్లు విసురుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ద్రవ్యోల్బణం కట్టడికే ఆర్‌బీఐ ఎంపీసీ తొలి ప్రాధాన్యతని వివరించారు. భారత్ రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి పడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు ప్రతి కరెన్సీపై డాలర్ ఇటీవల బలపడిందన్నారు. అమెరికా వాస్తవ ఎకానమీ పటిష్టత, ఫెడ్ అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానం డాలర్ బలపడ్డానికి కారణమని విశ్లేషించారు. అయితే ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల అంశమేనని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment