Economy
-
విదేశీ మారక ద్రవ్య నిల్వలు@644.391 బిలియన్ డాలర్లు
ముంబై: భారత్ విదేశీ మారక నిల్వలు డిసెంబర్ 20తో ముగిసిన వారంలో.. అంతక్రితం వారం (డిసెంబర్ 13) ముగింపుతో పోల్చితే 8.478 బిలియన్ డాలర్లు తగ్గి 644.391 బిలియన్ డాలర్లకు చేరాయి. డిసెంబర్ 13తో మగిసిన వారంలో కూడా నిల్వలు 1.988 బిలియన్ డాలర్లు తగ్గి ఆరు నెలల కనిష్ట స్థాయి 652.869 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి.నిల్వలు గత కొన్ని వారాలుగా తగ్గుతూ వస్తుండడం గమనార్హం. డాలర్ మారకంలో రూపాయి స్థిరీకరణ కోసం ఆర్బీఐ డాలర్లను మార్కెట్లోకి పంప్ చేయడం, మారకద్రవ్య రీ వ్యాల్యూయేషన్లు దీనికి ప్రధాన కారణం. సెపె్టంబర్ చివరిలో విదేశీ మారక నిల్వలు ఆల్‌టైమ్ గరిష్టం 704.885 బిలియన్ డాలర్లకు తాకిన సంగతి తెలిసిందే.విదేశీ కరెన్సీ ఆస్తులుయూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీల విలువల పెరుగుదల, క్షీణత ప్రభావానికి లోనయ్యే మొత్తం విదేశీ కరెన్సీ అసెట్స్ (డాలర్లు) 6.014 బిలియన్ డాలర్లు తగ్గి, 556.562 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం నిల్వలు విదేశీ మారకద్రవ్య నిల్వలో భాగమైన బంగారం నిల్వలు 2.33 బిలియన్ డాలర్లు తగ్గి 65.726 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద నిల్వల ప్రత్యేక డ్రాయింగ్ హక్కులకు సంబంధించిన ఈ విభాగం విలువ 112 మిలియన్ డాలర్లు తగ్గి 17.885 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. ఐఎంఎఫ్ వద్ద నిల్వలు ఐఎంఎఫ్ వద్ద నిల్వల పరిమాణం 23 మిలియన్ డాలర్లు తగ్గి, 4.217 బిలియన్ డాలర్లకు చేరింది. -
విలక్షణ జ్ఞాని... విధేయ ప్రధాని!
ఆర్థిక రంగంలో, మిశ్రమ రాజకీయాల్లో ఆయన భిన్న పాత్రలు పోషించినా... కేవలం సోనియా విధేయుడిగా మాత్రమే కొందరు మాట్లాడటం పాక్షికత్వాన్నే చెబుతుంది. నిస్సందేహంగా ఆయన దేశ సమగ్రతకూ, మానవీయ విలువలకూ విధేయుడిగా కనిపిస్తాడు. వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆయన అత్యధికంగా గౌరవించారంటే ఈ కొలబద్దలే కారణం. ‘వైఎస్ అక్కడ ఉన్నారు గనకే నేను ఇక్కడ ఉన్నాను’ అని ప్రధాని తనతో చెప్పేవారని మీడియా సలహాదారు సంజయ్ బారు ఇటీవల కూడా వెల్లడించారు. ‘మౌన ముని’ కాదు... మొండిమనిషిఅసహన రాజకీయాలూ, దూషణలూ– దుర్భాషలూ తాండవిస్తున్న ఈ రోజుల్లో కూడా... దశాబ్దకాలపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను దేశం మొత్తం ఏకోన్ము ఖంగా గౌరవించడం ఆయన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది. తన అధ్యయనం, అనుభవం, అంతర్గత విలువలు ఆయనను అందరికీ ప్రీతిపాత్రుణ్ణి చేశాయి. సరళీకరణ విధానా లతో పూర్తిగా, కచ్చితంగా విభేదించే వామపక్షాల వంటివి కూడా ఆయన లౌకిక నిబద్ధతను గౌరవించాయి. రాజకీయంగా బద్ధ శత్రువైన బీజేపీ నేతలు కూడా ఆర్థిక రంగంలో మన్మోహన్ ముద్రలను కీర్తిస్తున్నారు.బొత్తిగా పొసగని ఈ భిన్న శిబిరాల మన్ననకు పాత్రుడవడం ఆయనకే చెల్లింది. ఆర్థిక రంగంలో, మిశ్రమ రాజకీయాల్లో ఆయన భిన్న పాత్రలు పోషించినా... కేవలం, సోనియా విధేయుడుగా మాత్రమే కొందరు మాట్లాడటం పాక్షికత్వాన్నే చెబుతుంది. నిస్సందేహంగా ఆయన దేశ సమగ్రతకూ, మానవీయ విలువలకూ విధేయుడిగా కనిపిస్తాడు. వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆయన అత్యధికంగా గౌరవించారంటే ఈ కొలబద్దలే కారణం.‘వైఎస్ అక్కడ (ఉమ్మడి ఏపీలో) ఉన్నారు గనకే నేను ఇక్కడ ఉన్నాను’ అని ప్రధాని తనతో ఎప్పుడూ చెప్పేవారని మీడియా సలహాదారు సంజయ్ బారు ఇటీవల కూడా వెల్లడించారు. యాదృచ్ఛిక లేదా అనూహ్య ప్రధాని ఆని ఆయనపై పుస్తకమే రాసిన సంజయ్ బారు స్వయంగా చేసిన ఈ వ్యాఖ్యలు మన్మోహన్ మనస్తత్వాన్నీ, వ్యక్తిత్వాన్నీ చెబుతాయి. వైఎస్ హయాంలో ఎన్నో పథకాలకూ, కార్యక్రమాలకూ మన్మోహన్ ఇష్టపూర్వకంగా వచ్చేవారు. వామపక్షాల చొరవతో మొదలైన ‘గ్రామీణ ఉపాధి పథకా’న్ని అనంతపురంలోనే ప్రారంభించారు. విభజన ఉద్యమంతో తెలంగాణ విభజన చట్టాన్ని ఆమోదించడం ఒకటయితే... ఆలస్యంగానైనా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడం రెండు రాష్ట్రాలతో ఆయన బంధాన్ని బలోపేతం చేసింది.1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్న మవ్వడం, పీవీ నరసింహారావు ప్రధాని పదవి చేపట్టడం కాస్త అటూ ఇటూగా జరిగాయి. అప్పటి వరకూ అనుసరించిన అలీన, స్వావలంబన విధానాల నుంచి విడగొట్టుకుని... కార్పొరేట్, ప్రైవేటీకరణ విధానాల వైపు మరలే ప్రక్రియను జాగ్రత్తగా అమలు చేయడానికి మన్మోహన్ సరైన వ్యక్తి అని పీవీతో పాటు ఆ వర్గాలు కూడా భావించాయనేది నిర్వివాదాంశం. మళ్లీ 2004లో సోనియాగాంధీ ప్రధాని పదవి చేపట్టరాదని నిర్ణయించుకున్నాక ఆ స్థాయిలో విశ్వసనీయత, విషయజ్ఞత ఉన్న నేతగా మన్మోహన్‌నే ఎంచుకోవడంలో ఆశ్చర్యం లేదు. వ్యక్తిగతంగా ప్రణబ్ ముఖర్జీ సమర్థుడైనా ఆ విధంగా ఆమె ఆధారపడగల పరిస్థితి ఉండదు. వామపక్షాల మద్దతుపై ఆధారపడి ఏర్పడిన యూపీఏ–1కు సారథ్యం వహించడమంటే భిన్న కోణాలను సమన్వయం చేయవలసి ఉంటుందనీ తెలుసు. చిల్లర వ్యాపారంలో విదేశీ కంపెనీలకు ద్వారాలు తెరవడంతో మొదలై అమెరికాతో అణు ఒప్పందంతో పరాకాష్ఠకు చేరిన విభేదాలు వామపక్షాలను దూరం చేయడం ఊహించిన పరిణామమే. తర్వాత కాలంలో పదవులు, ప్రయోజనాల బేరాలు తప్ప మరే విధాన సమస్యలు లేని ప్రాంతీయ మిత్రులను నిలబెట్టుకోవడానికీ, ఇష్టం లేని వారిని మంత్రులను చేయడంతో సహా ఆయన చాలా విన్యాసాలే చేయవలసి వచ్చింది. రక రకాల ఆరోపణలు, కుంభకోణాల కేసులతో పెనుగులాడవలసి వచ్చింది. ఆ క్రమంలోనే మిశ్రమ ప్రభుత్వం గనక రాజీ పడాల్సి వచ్చిందని ఆయన బాహాటంగా ఒప్పేసుకున్నారు. చివరకు మీడియా ఛానళ్ల అధినేతలతో సమావేశమై... యూపీఏ అంటేనే అవినీతి అన్నట్టు చిత్రించవద్దని అభ్యర్థించాల్సి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయమేమంటే... ఇన్ని ఆరోపణల మధ్యనా ఎవరూ ఆయన నిజాయితీని శంకించడం గానీ, తనకు వ్యక్తిగత బాధ్యత ఆపాదించడం గానీ జరక్కపోవడం!2014 ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలోనే వెలువడిన సంజయ్ బారు పుస్తకంలో... ప్రధానిగా మన్మోహన్ ఫైళ్లు సోనియాగాంధీకి పంపించిన తర్వాతే నిర్ణయాలు తీసుకునేవారని ఆరోపించడంతో బీజేపీ వారు రంగంలోకి దిగిపోయారు. ఇది మోదీ బృందం ప్రచారానికి అస్త్రంగా వేసిన అభాండమని నాటి ప్రధాని కార్యాలయం ఖండించింది. అణు ఒప్పందం కుదరకపోతే రాజీనామా చేస్తానని అధిష్ఠానానికి సంకేతాలు ఇవ్వడం కూడా ఆయన ఎంత మొండి మనిషో నిరూపించింది. ఆర్థిక మంత్రిగా ఇన్ని తీవ్ర నిర్ణయాలు ఎలా తీసుకున్నారంటే... ఎప్పుడూ జేబులో రాజీనామా లేఖ పెట్టుకుని తిరిగేవాడినని ఆయన ఇచ్చిన జవాబులో చాలా ఆర్థముంది. రాజీవ్ గాంధీ దారుణ హత్య తర్వాత అనూహ్య పరిస్థితుల్లో పీవీ నరసింహారావు ప్రధాని అవడం, తనను ఆర్థికమంత్రిగా ఎంపిక చేయడం వెనక ఉన్న బలీయమైన పాలక వర్గాలేవో ఆయనకు తెలుసు.మోదీని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెచ్చిన కొత్తలో మన్మోహన్‌ను తీవ్రంగానే ఢీకొన్నారు. మోదీ వచ్చాక దర్యాప్తు సంస్థలు ఆయనకు నోటీసులు పంపించాయి. అయినా తగ్గకుండా నిలబడ్డారు. నోట్లరద్దును చారిత్రక ఘోరతప్పిదం అని నిప్పులు కక్కారు. చక్రాల కుర్చీలో వచ్చి మరీ సభలో ఓటేశారు. అనారోగ్యంలోనూ మొన్నటి ఏప్రిల్ దాకా రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడిగానే ఉన్నారు. ఆయనను ‘మౌన ముని’గా బీజేపీ అపహాస్యం చేసింది కానీ కీలక విషయాల్లో మౌనంగా లేరు. వాస్తవానికి నోట్ల రద్దు నుంచి అదానీ వ్యవహారం వరకూ చాలా విషయాల్లో మోదీయే సభలో సమాధానమివ్వకుండా మౌనం పాటించారు. మన్మోహన్‌ను, గాంధీ కుటుంబాన్నీ ప్రత్యర్థులుగా చూపడానికి ఎన్నిసార్లు ఎంత రెచ్చగొట్టినా మాజీ ప్రధాని సంయమనం వీడలేదు. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ తన ప్రభుత్వ ఉత్తర్వును చించి వేసి ఆధిక్యత చూపించినా భరించారే గాని భగ్గుమనలేదు. దీన్ని అతి విధేయత అనాలా సంయమనం అనాలా అన్నది వారి కోణాలను బట్టి ఉంటుంది. అయితే వాజ్‌పేయి వంటి దిగ్గజానికి మోదీ వంటి పరివార్ అగ్గి బరాటాకు మధ్యలో తొలి ఏకైక సిక్కు ప్రధానిగా తన స్థానం నిలబెట్టుకోవడం చిన్న విషయమేమీ కాదు. మన్మోహన్ స్వయంగా ఒకసారి కోరినట్టు... దేశం, చరిత్ర ఆయన పట్ల నిర్దయగా కాక వాస్తవికంగా గౌరవంగానే వ్యవహరిస్తున్నాయి. మూడో దీర్ఘకాల ప్రధానిగా ఇక ముందు కూడా మన్మోహన్ సింగ్‌కు ఓ ప్రత్యేక స్థానముండనే ఉంటుంది! వ్యాసకర్త సీనియర్ సంపాదకులు, విశ్లేషకులు- తెలకపల్లి రవిసంస్కరణల సారథిభారతదేశం గర్వించదగిన వ్యక్తులలో భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరు. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించి భారత దేశ ఆర్థిక గమనాన్ని మార్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. 1991లో భారత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి సంక్షోభంలో పడిన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు సాహసోపేతమైనవి. 1990లో చంద్రశేఖర్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్న కాలంలో రెండు అంకె లతో ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, రుణ భారంతో పెరిగిన కోశలోటు, మూడు వారాలకి కూడా సరిపోని విదేశీ మారక ద్రవ్య నిల్వలు, పడిపోతున్న ఆర్థిక వృద్ధిరేటు, పెరిగిపోతున్న నిరుద్యోగం, పేదరికంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను... దేశ ఆర్థిక మంత్రి అయిన తర్వాత గాడిలో పెట్టడం, 2008లో వచ్చిన ఆర్థికమాంద్యాన్ని తట్టుకొని భారత్ నిలబడేలా చేయడం వంటివాటిలో మన్మోహన్ కృషి అజరామరం. నేడు భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి మూడవ స్థానం వైపుకి అడుగులు వేయటానికి మన్మోహన్ సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలే పునాది వేశాయి. రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా, యూజీసీ చైర్మన్‌గా, అంతర్జాతీయ వ్యాపార అర్థశాస్త్రంలో నిష్ణాతుడైన ప్రొఫెసర్‌గా, ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, ఆర్థిక మంత్రిగా, భారత ప్రధాన మంత్రిగా... భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన గోడలు నిర్మించారనే చెప్పాలి. ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటాను పెంచే క్రమంలో తాను రూపొందించిన ఎగుమతులు– దిగుమతుల (ఎగ్జిమ్ పాలసీ) విధానం, విదేశాంగ విధానం భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయి. 1991 బడ్జెట్లో 1992 నూతన సరళీకరణ ఆర్థిక విధాన ప్రకటనతో భారత ఆర్థిక వ్యవస్థసంకెళ్లను తెంచి ప్రపంచంతో పోటీపడే విధంగా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిన తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. బంగారాన్ని తాకట్టుపెట్టి విదేశీ మారక ద్రవ్య నిల్వలను సమకూర్చుకునే స్థాయి నుండి నేడు ప్రపంచంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో భారత్‌ని 8వ స్థానంలో నిలబెట్టే స్థాయికి పునాదులు వేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. పది సంవత్సరాలు వరుసగా ప్రధానమంత్రిగా తాను తీసుకున్న అనేక విప్లవాత్మక నిర్ణయాలు దేశ ప్రజల మనః ఫలకంపై చెరగని ముద్రవేశాయి. 2005లో సమాచార హక్కు చట్టం, అమెరికాతో పౌర అణు ఒప్పందం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం), గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్యం లేని వారి ఉపాధి కోసం చేసిన ‘ఉపాధి హామీ చట్టం’ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్), 2013లో తెచ్చిన భూ సేకరణ చట్టం, ఆహార భద్రతా చట్టాలు, ఆధార్ కార్డ్, రైతు రుణమాఫీ దేశ పాలన వ్యవస్థలో మైలు రాళ్లుగా నిలబడిపోయాయి. ‘దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి బయటపడవేసి ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికీ, స్థిరమైన వృద్ధిని సాధించడానికీ ఆర్థిక సంస్క రణలను ప్రారంభిస్తున్నాము. ఎవరి మెప్పు కోసమో ఆర్థికసంస్కరణలను ప్రారంభించడం లేద’ని నాడు తాను చెప్పిన మాటలు నేడు నిజమైనాయి. మాటల కంటే నిశ్శబ్దంగా పనిచేయటా నికి ప్రాధాన్యత ఇచ్చే మన్మోహన్ సింగ్ నిరాడంబర వ్యక్తిత్వం గల వివాదరహితునిగా పేరు తెచ్చుకున్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యులైన పి.వి. నరసింహారావుని భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించిన విధంగానే మన్మోహన్ సింగ్‌కి కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఆ పురస్కారానికి ఆయన అన్ని విధాలా అర్హులు. -వ్యాసకర్త కాకతీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ ‘ 98854 65877-డా‘‘ తిరునహరి శేషు -
అమెరికా–చైనాలు దగ్గరయ్యేనా?
ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలూ, సైనిక శక్తులూ అయిన అమెరికా– చైనాల మధ్య సత్సంబంధాలు చోటు చేసుకోనున్నాయనే సూచనలు అభినందనీయం. ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరూ ఊహించలేరు. తాను మంచివనుకున్న, తనకు పేరు తెచ్చే పనులను చేస్తారు. అనుకోని పనులు చేయడం తన బలమని ట్రంప్ ప్రకటించు కున్నారు. అమెరికా– చైనాల పరస్పర సహకారంతో ప్రపంచ శాంతి సౌభాగ్యాలను సాధించవచ్చు.‘చైనా అపాయం’ బూచితో అమెరికా... చైనా వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ఆంక్షలు విధి స్తోంది. చైనా ఉత్పత్తులపై ఎక్కువ పన్నులు విధిస్తోంది. చైనా వాణిజ్య కట్టడికి కూటములు కడుతోంది. చైనా పొరుగు దేశా లకు ఆయుధాలను అమ్ముతోంది. విదేశాల్లో దూకుడుగా వ్యవహరిస్తోందనీ, స్వదేశంలో అణచివేతకు పాల్పడుతోందనీ, రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణలో రష్యాకు మద్దతు ఇస్తోందనీ చైనాపై అమెరికా ప్రచారం చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చైనా వ్యతిరేక వైఖరి ప్రదర్శించారు. అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ విదేశీ విధాన అమలుకు ఎన్నుకున్న వ్యక్తులను బట్టి ఆయన చైనా వ్యతిరేకత తెలుస్తుంది. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ దీనికి ఉదాహరణ. మరోవైపు ప్రపంచ ఘటనలు అంచనాలను తారు మారు చేస్తున్నాయి. సిరియాలో 5 దశాబ్దాల అల్ అసద్ కుటుంబ పాలన స్వల్ప ప్రతిఘటనతో కూలి అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. అతి బలీయమైన రష్యా, ఎదుగు తున్న ఇరాన్ అసద్‌ను దశాబ్ద కాలంగా గట్టిగా సమర్థించాయి. అయినా పేర్లే తెలియని తిరుగుబాటుదార్ల వేటలో కేవలం 2 వారాల్లో అసద్ దేశం వదిలి పారిపోయాడు. దీని వెనుక అనేక కారణాలున్నాయి. ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి; తర్వాత పాలస్తీనా, హమాస్, గాజా, వెస్ట్ బ్యాంక్‌లపై, లెబనాన్‌లో హెజ్ బొల్లాపై, వీరిని సమర్థించిన ఇరాన్‌పై ఇజ్రాయెల్ అమానవీయ దాడులు; ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు, అమెరికా ఆధీన ఐక్య రాజ్యసమితి అశక్తత వాటిలో కొన్ని.సిరియా ప్రభుత్వ పతనం తర్వాత 2 రోజుల్లో ఇజ్రా యెల్, సిరియా ఉన్నత స్థాయి సైనిక సంపదను, వాయు సేనను 80 శాతం ధ్వంసం చేసింది. క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఆయుధ కర్మాగారాలు, పరిశోధన కేంద్రాలు, రసాయనిక ఆయుధాలు నాశనమయ్యాయి. రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణలో ఉత్తర కొరియా రష్యా వైపు జోక్యం, రష్యాకు చైనా మద్దతు (చైనా దీన్ని తిరస్కరించింది) ఐరోపాలో ఆందోళన కలిగించాయి. చైనా చౌక విద్యుత్ వాహనాలు తమ వాహన పరిశ్రమకు హానికరమని ఐరోపా భయం. తమ దేశాల ఉత్పత్తులపై ట్రంప్ విధించబోయే అధిక పన్నులపై అమెరికా మిత్రులైన ఐరోపా, ఆసియా దేశాలు బాధ పడుతున్నాయి. ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను మెచ్చుకున్నారు. తాను యుద్ధాలను ప్రారంభించననీ, కొత్త ఒప్పందాలను ప్రేమి స్తాననీ గర్వంగా ప్రకటించారు. ట్రంప్ అధికారంలో అమె రికా, చైనా సంబంధాల మెరుగుకు ఇది శుభసూచకం. 2009 ఆర్థిక సంక్షోభం తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థలో స్వీయ ఉద్దీపన తగ్గింది. ప్రజల వినియోగాన్ని పెంచాలనీ, విదేశీ పెట్టుబడులకు అనుకూలత కల్పించాలనీ, గిరాకీని పెంచాలనీ చైనా గుర్తించింది. మార్కెట్ అనుకూల ఆర్థిక విధానాలను స్వీకరించింది. ప్రజలకు డబ్బు అందే విధంగా వడ్డీ తగ్గించింది. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ల స్థిరీకరణ పద్ధతులను పాటించింది. విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ప్రపంచ అభివృద్ధికి చోదకశక్తిగా పని చేస్తానంటోంది. ఇవి అమెరికా–చైనా సంబంధాల మెరుగు దలకు ప్రేరణ. సంగిరెడ్డి హనుమంత రెడ్డివ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి ‘ 94902 04545 -
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం: ఆ లావాదేవీలపై జీఎస్టీ లేదు
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశంలో.. ఆర్థిక రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఇందులో రూ. 2000లోపు లావాదేవీలు నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్లకు జీఎస్టీ మినహాయింపులు లభించనున్నట్లు.. ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' వెల్లడించారు. అయితే ఈ మినహాయింపు.. ఫిన్‌టెక్ సేవలకు వర్తించదు.రుణగ్రహీత రుణ నిబంధనలను పాటించనందుకు, అంటే.. ఈఎంఐ చెల్లింపు లేదా రీపేమెంట్ షెడ్యూల్‌లను ఉల్లంఘించిన్నప్పుడు బ్యాంకులు & నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జరిమానా విధిస్తుంది. అయితే ఈ జరిమానాలపై కూడా ఎటువంటి జీఎస్టీ విధింపు ఉండదని సీతారామన్ ప్రకటించారు.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ నిర్ణయం వాయిదాబీమా ప్రీమియంపై జీఎస్టీ వాయిదాజీఎస్టీ కౌన్సిల్.. ఆరోగ్య, జీవిత బీమాతో సహా ఇన్సూరెన్స్ ప్రీమియంలకు జీఎస్టీ రేట్లను తగ్గించే నిర్ణయాన్ని వాయిదా వేసింది. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆరోగ్య & జీవిత బీమా ప్రీమియంలకు GST తగ్గించడంపై చర్చ జరుగుతుండగా.. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి మరింత చర్చ అవసరమని అన్నారు. తరువాత జనవరిలో జరగనున్న సమావేశంలో బహుశా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
అమెరికాలో వలసదారులు
అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడేందుకు ప్రపంచ దేశాల్లోని ప్రజలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అమెరికా కలను సాకారం చేసుకునేందుకు పలు రకాల వీసాల కోసం అప్లే చేస్తారు. అయితే చాలా మందికి వీసాలు దొరక్క.. అక్రమ మార్గాల్లో సరిహద్దులు దాటి అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. దీంతో అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి అమెరికాలోకి అక్రమంగా వలసలు పెరగడం అక్కడ తీవ్ర ఆందోళన కలిగించే అంశం. అమెరికన్ జనాభాలో 14.3 శాతం మంది వలసదారులే. ప్రస్తుతం అమెరికాలో 1 కోటి 10 లక్షల మంది అక్రమ వలసదారులు ఉంటున్నారని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్, ప్యూ రీసర్చ్ లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా మెక్సికో నుంచి వస్తున్నారు. తర్వాతి స్థానంలో భారత్ ఉంది. 2040 నాటికి అమెరికాలో జననాల సంఖ్యను మరణాల సంఖ్య దాటిపోతుందని అంచనా.కరేబియన్, దక్షిణ అమెరికా, ఆసియా, యూరప్, సబ్ సహారా, ఆఫ్రికా నుంచి అనధికార వలసలు పెరిగాయని పరిశోధకులు తెలిపారు. అమెరికా అక్రమ వలసదారుల్లో వెనుజులా, బ్రిజిల్, కెనడా, మాజీ సోవియట్ దేశాలు, చైనా, డొమినికన్ రిపబ్లిక్ దేశాలకు చెందిన వారు ఉన్నారు.అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ డిపోర్టేషన్ పై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 2025 జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సరిహద్దులను బలంగా, శక్తిమంతంగా మార్చడంపై దృష్టి సారిస్తానని ట్రంప్ సృష్టం చేశారు.అయితే వలసదారులు లేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా వలసదారుల జనాభా అమెరికాలోనే ఉంది.మరి వలసదారులు అమెరికాలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? ఇమ్మిగ్రెంట్స్ లేకపోతే అమెరికా పరిస్థితి ఏంటి? వలసదారుల్ని భారీ సంఖ్యలో వెనక్కి పంపించడం సాద్యమేనా.. ? అక్రమ వలసదారుల్ని సామూహికంగా అమెరికా నుంచి తిప్పి పంపించటం ట్రంప్‌కు అంత ఈజీయేనా? వంటి విషయాలను తరువాత కథనంలో తెలుసుకుందాం..!- సింహబలుడు హనుమంతు -
అక్కడ భారీగా బయటపడ్డ తెల్ల బంగారం
చమురు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న సౌదీ అరేబియాలో లిథియం నిక్షేపాలను గుర్తించారు. దీంతో లిథియం ప్రత్యక్ష మైనింగ్‌ను ప్రోత్సహించడానికి త్వరలోనే కమర్షియల్ పైలెట్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్నట్లు సౌదీ అరేబియా మైనింగ్ వ్యవహారాల డిప్యూటీ మినిష్టర్ 'ఖలీద్ బిన్ సలేహ్ అల్ ముదైఫర్' వెల్లడించారు.ఇప్పటికే ఆర్థికంగా బలమైన దేశంగా ఉన్న సౌదీ అరేబియా.. లిథియం నిక్షేపాలు బయటపడంతో మరింత బలపడనుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ కంపెనీ 'సౌదీ అరామ్కో అకా అరమ్‌కో' (Saudi Aramco aka Aramco) లిథియంను వెలికి తీయనున్నట్లు.. దీనికోసం కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన కొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు సమాచారం.లిథియం నిక్షేపాలు బయటపడిన సందర్భంగా అల్ ముదైఫర్ మాట్లాడుతూ.. చమురు క్షేత్రాలు, ఉప్పునీటి ప్రవాహాల నుంచి లిథియం తీయడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. అయితే లిథియం ధరలు పెరిగితే కొత్త ప్రాజెక్ట్ త్వరలో వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉంటుందని అన్నారు.నిజానికి సౌదీ అరేబియా, దశాబ్దాలుగా చమురుపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు దీనికి లిథియం కూడా తోడైంది. చమురు మాత్రమే కాకుండా.. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను కనుగొనే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రయత్నాలలో భాగంగా ఈ నిక్షేపాలను గుర్తించారు.లిథియం ఉపయోగాలుఈ రోజు మనం రోజూ ఉపయోగిస్తున్న స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ బైకులు, కార్లు, సోలార్ పవర్ యూనిట్లు, ఎమర్జెన్సీ లైట్లు, బొమ్మలు వంటి ప్రతి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లో లిథియం ఉపయోగిస్తారు. నేడు ప్రతి రంగంలోనూ లిథియం అవసరం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే దీనిని తెల్ల బంగారం అని పిలుస్తారు. -
తిరుగు వలసలు చెబుతున్నదేమిటి?
కోవిడ్ మహమ్మారి కాలంలో లక్షలాది మంది నగరాల నుంచి తమ గ్రామాలకు తిరిగి వెళ్లారు. మహమ్మారి ముగిసిన తర్వాత వీరందరూ తిరిగి నగరా లకు చేరుకుంటారన్న అంచనాలకు భిన్నంగా గ్రామాల్లోనే ఉండిపోయారు. 2020–22 మధ్య కాలంలో గ్రామీణ శ్రామిక శక్తికి సుమారు 5 కోట్ల 60 లక్షల మంది కార్మికులు జోడించబడ్డారు. వీళ్లలో ఎక్కువమంది యువత. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లాంటివాటిని మినహాయిస్తే, చాలా రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల సంఖ్య పెరిగింది. ఇవన్నీ కూడా జీవనోపాధికి చెందిన సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యాన్ని చాటుతున్నాయి. వ్యవసాయం మీద ఆధారపడేవారి సంఖ్యను తగ్గించే ఆర్థిక విధానాలకు బదులుగా, వ్యవసాయాన్ని స్థిరమైన, లాభదాయకమైన వ్యవస్థగా మార్చాలి.భారత ప్రజలు ప్రస్తుతం పెద్ద సంఖ్యలో తమ గ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. గత ఐదేళ్లలో, పట్టణ కేంద్రాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం, ‘తక్కువ–ఉత్పాదకత’ కలిగిన వ్యవసాయం నుండి కార్మికులను బయటకు నెట్టడానికి సంకల్పించిన విధానం ఇప్పుడు అడ్డం తిరిగింది.కోవిడ్–19 మహమ్మారి కాలంలో మొదటిసారి తిరుగు వలసలు (రివర్స్ మైగ్రేషన్) మొదలయ్యాయి. లక్షలాది మంది పట్టణ పేదలు అనంత దూరాలు, చాలామంది కాలినడకన తమ తమ ఊళ్లకు ప్రయా ణించారు. దేశ విభజన రోజుల తర్వాత ఇది ప్రజల అతిపెద్ద చలనం. కనీవినీ ఎరుగనంత స్థాయిలో సాగిన ఈ అంతర్–రాష్ట్ర వలసలు, రాష్ట్రం లోపలి వలసలు తాత్కాలికమని నమ్మారు. కానీ, మహమ్మారి ముగిసిన తర్వాత శ్రామికశక్తి నగరాలకు తిరిగి వస్తుందనే అంచనాను తోసిపుచ్చుతూ, వాళ్లలో ఎక్కువ మంది తమ ఊళ్లలోనే ఉండడానికి ఇష్టపడటం జరిగింది.వ్యవసాయంలోనే ఉపాధి‘నేషనల్ శాంపిల్ సర్వే’, ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ల డేటా ఆధారంగా, ‘ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్’, న్యూఢిల్లీకి చెందిన ‘ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్’ రూపొందించిన ఒక నివేదికలో వ్యవసాయ ఉపాధి పెరిగిందని తేలింది. సాధారణ అభి ప్రాయానికి విరుద్ధంగా, 2020–2022 మధ్య గ్రామీణ శ్రామికశక్తికి 5 కోట్ల 60 లక్షలమంది కార్మికులు జోడించబడ్డారు. నిరుద్యోగం వృద్ధి చెందుతున్న సమయంలో, నగరాల్లో లభించే ఉపాధి అవకాశాలు వలస కార్మికులకు అంతగా ఆకర్షణీయంగా లేవని ఇది నిరూపిస్తోంది. తయారీ రంగంలో మందగమనం, నిర్మాణ రంగ ఉద్యోగాలు తగ్గుముఖం పట్టడం వల్ల నగరాలకు వలస వచ్చినవారు గ్రామాలకు తిరిగి వెళ్లడమే మంచిదని భావించారు.ఆసక్తికరమైన విషయమేమిటంటే, 2004–05, 2018–19 మధ్య అంటే 13 సంవత్సరాల కాలంలో 6 కోట్ల 60 లక్షల మంది వ్యవసాయ శ్రామికులు పట్టణాలలో చిన్న ఉద్యోగాల కోసం వలస వెళ్లారు. కానీ 2018–19, 2023–24 మధ్య ఐదేళ్లలో 6 కోట్ల 80 లక్షల మంది పైగా ప్రజలు గ్రామాలకు తిరిగి వచ్చారని జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యా లయానికి చెందిన ఆర్థికవేత్త హిమాన్షు అంచనా వేశారు. వ్యవసాయం అకస్మాత్తుగా లాభదాయకంగా మారిందని దీని అర్థం కాదు. ప్రజ లను పొలాల నుండి బయటకు నెట్టడం ఆచరణీయమైన వ్యూహం కాదని ఇది స్పష్టంగా చెబుతోంది.గ్రామీణ శ్రామిక శక్తిలో వ్యవసాయం వాటా 2018–19లో 42.5 శాతం నుండి 2023–24లో 46.1 శాతానికి పెరిగిందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక చెబుతోంది. పైగా ఇందులో గణనీయమైన యువ జనాభా కూడా ఉంది. ఇది విస్మరించలేని సందేశాన్ని ఇస్తోంది. ప్రజలను ఆ రంగం నుండి బయటకు నెట్టాలనే లక్ష్యంతో సంవత్సరాలుగా వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా వెనుకపట్టున ఉంచిన విధానాల మీద మన ఆర్థిక ఆలోచనలు నడుస్తున్నాయి. కానీ ఢిల్లీ సరిహద్దుల్లో ఒక సంవత్సరం పాటు జరిగిన ఆందోళనల తరువాత రైతుల నిరసనలు వెల్లువెత్తాయి. తమకు సరైన ఆదాయాన్ని నిరంతరం తిరస్కరించడంపై రైతాంగం ఆగ్రహంతో ఉంది.ప్రపంచ బ్యాంకుకు దూరంగా– గాంధీజీకి దగ్గరగా!భారతదేశం తన వ్యవసాయరంగం నుండి 40 కోట్ల మంది ప్రజలను నగరాలకు వలసబాట పట్టించాలని ప్రపంచ బ్యాంకు 1996లో కోరింది. ఇది బ్రిటన్, ఫ్రాన్ ్స, జర్మనీల ఉమ్మడి జనాభా కంటే రెండింతలకు సమానం. అయితే పట్టణ కేంద్రాలకు వలస వెళ్లడానికి వీలుగా ఆర్థిక పరిస్థితులను సృష్టించే బదులు, వ్యవ సాయాన్ని ఆచరణీయమైన వాణిజ్యంగా మార్చడం ద్వారా వ్యవ సాయాన్ని పునర్నిర్మించడంపై దృష్టి సారించాలి. మహాత్మా గాంధీ కోరుకున్నది ఇదే. వలస కార్మికులు తిరిగి వచ్చిన రేటు ఆయన అభి ప్రాయం ఎంత సరైనదో చూపిస్తుంది. అందువల్ల, ప్రపంచ బ్యాంకు ఆలోచనను విడనాడి వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేయడం, వ్యవసాయాన్ని స్థిరమైన, ఆచరణీయమైన, లాభదాయకమైన వ్యవస్థగా మార్చడంపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది.మీకు ఇంకా నమ్మకం లేకుంటే, ఇటీవల విడుదల చేసిన ‘నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్’ (నాబార్డ్)కు చెందిన ‘ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వే 2021–22’ నివేదికను చూడండి. దీని ప్రకారం, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న జనాభా వాటా సంవత్సరాలుగా గణనీయంగా పెరి గింది. 2016–17లోని 48 శాతం నుండి 2023–24లో గరిష్ఠంగా 57 శాతానికి చేరుకుంది. వ్యవసాయ కుటుంబాల సంఖ్యలో పెను గంతు స్థానికుల తిరిగిరాకను స్పష్టంగా సూచిస్తోంది. వ్యవసాయ కుటుంబాల వాటా 2016–17లో 42 శాతం నుండి 2021–22 నాటికి 36 శాతానికి తగ్గిన పంజాబ్; 70 నుండి 63 శాతానికి తగ్గిన హిమాచల్ ప్రదేశ్, కొంచెం తగ్గుదల చూపిన గుజరాత్, కర్ణాటకలను మినహాయిస్తే... అనేక రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల పెరుగుదల గణనీయంగా ఉంది. వ్యవసాయ కుటుంబాలు గోవాలో 3 నుండి 18 శాతానికి, హరియాణాలో 34 నుండి 58 శాతానికి పెరిగాయి. ఉత్తరా ఖండ్‌లో 41 నుంచి 57 శాతం; తమిళనాడులో 13 నుండి 57 శాతం పెరుగుదల కనబడింది. ఇతర రాష్ట్రాలు కూడా ఈ పెరుగుదల ధోరణినే చూపుతున్నాయి.కారణాలు ఏమైనప్పటికీ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, పీరి యాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, నాబార్డ్ చేసిన మూడు అధ్యయనాలు కూడా ఉపాధి, జీవనోపాధికి చెందిన సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యతను చాటుతున్నాయి. అందుకే గృహ ఆహార భద్రతను నిర్ధారించడంలో వ్యవసాయ రంగం సామర్థ్యాన్ని విస్మరంచకూడదు.ఆందోళనలో శుభవార్త వ్యవసాయంలో సంఖ్యలను తగ్గించడంపై ఆధారపడిన మును పటి ఆర్థిక విధానాలను రివర్స్ మైగ్రేషన్ తారుమారు చేసినప్పటికీ, వ్యవసాయంలో ఉపాధి పెరుగుదలను ప్రధాన ఆర్థికవేత్తలు ‘ఆందో ళన కలిగించే అంశం’గా చూస్తున్నారు. భారతదేశంలో కనిపిస్తున్న ఈ తిరుగు వలసల ధోరణి తక్కువ మధ్య–ఆదాయ వర్గానికి ప్రత్యే కమైనదిగా చూస్తున్నారు. కానీ వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన ఆర్థిక విధానాలను పునరుజ్జీవింపజేయవలసిన అవస రాన్ని ఇది సూచిస్తుంది. మారుతున్న క్షేత్ర వాస్తవికతను గుర్తించాల్సిన సమయం ఇది.ప్రభుత్వం తగిన వనరులను కల్పించడానికి సిద్ధంగా ఉంటే, వ్యవసాయంపై ఆధారపడటం దాని సొంత ఆచరణీయ మార్గాలను సృష్టిస్తుంది. వ్యవసాయం కోసం కేటాయించే బడ్జెట్ వ్యయంలో ఏదైనా పెరుగుదలను ప్రతిపాదిస్తే, అది ఆర్థిక లోటుకు అదనపు మొత్తంగా పరిగణించడాన్ని ఆర్థికవేత్తలు ఇకనైనా మానేయాలి. ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ (ఓఈసీడీ) ప్రకారం, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం మాత్రమే రైతుల నష్టాలను బడ్జెట్ కేటాయింపుల ద్వారా భర్తీ చేయడం లేదు. నేను తరచుగా చెప్పినట్లు, రైతులు దాదాపు 25 సంవత్సరాలుగా ఏటా పంట నష్టపోతున్నారు. రైతులకు ‘దేవుడే దిక్కు’ అయ్యే ఈ లోపభూయిష్ట ఆర్థిక రూపకల్పన ఇకనైనా అంతం కావాలి.ఒక విధంగా తిరుగు వలసలను శుభవార్తగా చూడాలి. వనరులను అత్యంత అవసరమైన చోట ఉంచడానికి ఇది సరైన సమయం. అది చివరకు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’కు దారి తీస్తుంది.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
పేదరికం నుంచి భారత్ బయటపడాలంటే..: నారాయణమూర్తి
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి.. పని గంటలపై తన వాదనను మరోసారి సమర్థించుకున్నారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాల్సిందేనని కుండ బద్ధలు కొడుతూ.. లేకుంటే పేదరికం నుంచి ఎలా బయటపడగలమని? ప్రశ్నించారాయన. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో నారాయణమూర్తి పాల్గొని మాట్లాడుతూ..‘‘ఇన్ఫోసిస్‌ను మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. అలా పోల్చుకున్నప్పుడే భారతీయులు చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి... వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?. భవిష్యత్తు కోసం మనమంతా కలసికట్టుగా బాధ్యత తీసుకోవాలి’’ అని నారాయణమూర్తి పిలుపు ఇచ్చారు.ఆ మధ్య ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘ది రికార్డ్’ అనే పాడ్‌కాస్ట్ తొలి ఎపిసోడ్లో నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలు, టెకీలు స్పందిస్తూ భిన్నాభిప్రాయాలు వ్యక్తపర్చారు. పలు దేశాల్లో పని గంటలపై చర్చ ఆ సమయంలో జరిగింది. అంతేకాదు.. ఇటీవల జపాన్‌లో వారానికి నాలుగు రోజుల పని దినాల అంశాన్ని ప్రస్తావిస్తూ.. నారాయణమూర్తిని నెట్టింట ట్రోల్ చేశారు కూడా.నారాయణమూర్తి ఏమన్నారంటే..‘ది రికార్డ్’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువని అన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా.. మరికొందరు మాత్రం నారాయణ మూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు. ఇదీ చదవండి: భారత్ బాగుండాలంటే.. పని గంటలు తగ్గాల్సిందే! -
దిక్కులు చూస్తున్న ఫ్రాన్స్!
యూరప్ దేశాల్లో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలిగిపోతున్న ఫ్రాన్స్ సంక్షోభం నుంచి సంక్షోభానికి ప్రయాణిస్తున్నది. దేశాన్ని చుట్టుముట్టిన అనిశ్చితి పోవాలంటే ఎన్నికలొక్కటే మార్గమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియెల్ మేక్రాన్ ఆర్నెలల క్రితం భావించి పార్లమెంటు రద్దుచేశారు. కానీ మొన్న జూలైలో నిర్వహించిన ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాకపోవటంతో సమస్య మొదటికొచ్చింది. దిక్కుతోచని స్థితిలో రెండు నెలల అనంతరం మైకేల్ బార్నియర్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. కానీ అది మూడునెలల ముచ్చటైంది. ఆరు దశాబ్దాల చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా పతనమైన తొలి ప్రభుత్వం బార్నియర్ దే. అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన అప్రదిష్ట కూడా ఆయనదే. ఫ్రాన్స్ పెద్ద ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఉద్యోగాల కోత, పరిశ్రమల మూత రివాజుగా మారాయి. అసలే పడిపోయిన నిజ వేతనాలతో, నిరుద్యోగ బెడదతో బతుకులు ఎలా నెట్టుకు రావాలో తెలియక పౌరులు కొట్టుమిట్టాడుతున్నారు.ప్రజల కొనుగోలు శక్తి క్షీణించటంతో రెస్టరెంట్లు, చిన్నా పెద్దా దుకాణాలు మూసేస్తున్నారు. ఈ దశలో పులి మీద పుట్రలా ప్రభుత్వ వ్యయాన్ని అదుపుచేసే పేరిట బార్నియర్ భారీ కోతలకు దిగారు. ఇది ప్రతిఘటనకు దారితీసింది. పబ్లిక్ రంగ సంస్థల సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పటికే సమ్మెకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి విరుచుకుపడక ముందు యూరప్ దేశాల్లో అగ్రగాములుగా వెలిగిన జర్మనీ, ఫ్రాన్స్‌లు రెండూ 2021నుంచి ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఆర్థిక స్వస్థతకు తీసుకున్న చర్యలు ఫలించ బోతున్నాయన్న సంకేతాలున్న తరుణంలోనే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వచ్చిపడి ఆర్థిక వ్యవస్థలను మరింత దెబ్బతీసింది. జర్మనీ కొంతవరకూ దీన్ని తట్టుకోగలిగినా ఇంధన సంక్షోభంతో, భారీ వడ్డీ రేట్లతో ఫ్రాన్స్ కుదేలవుతోంది. ఒకపక్క ఊపిరాడనీయని రుణ భారం, మరోపక్క ద్రవ్యలోటు ఆ దేశాన్ని పీడిస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో సజావుగా నడిచేందుకు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకూ పరిశ్రమలకు ప్రభుత్వం ఉదారంగా పంచిన 15,000 కోట్ల యూరోలు ఆవిరైపోయాయి. సరిగదా... ఇంధన ఆధారిత సంస్థలు ఉత్పత్తిని తగ్గించి వేలాదిమందిని తొలగించబోతున్నామని గత నెలలో ప్రకటించాయి. నెక్సిటీ వంటి భారీ నిర్మాణరంగ సంస్థ సైతం తడిసి మోపెడవుతున్న వడ్డీ రేట్ల కారణంగా కొత్త పెట్టుబడులకు వెళ్లటం లేదని తెలిపింది. పర్యవసానంగా వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోక తప్పని స్థితి ఏర్పడింది. ప్రభుత్వ రుణాలు కనీవినీ ఎరుగని రీతిలో 3 లక్షల 20 వేల కోట్ల యూరోలకు చేరాయి. ఇది దేశ జీడీపీ కన్నా 112 శాతం అధికం. గ్రీస్, స్పెయిన్ వంటి దేశాలను మించి ప్రభుత్వ లోటు 6.1 శాతం చేరుకుంది. సంపన్నులకూ, కార్పొరేట్ సంస్థలకూ ఇచ్చిన పన్ను రాయితీల వల్ల కాస్తయినా ప్రయోజనం లేకపోగా, వచ్చే ఏడాది కనీసం 6,000 కోట్ల యూరోలు పొదుపు చేయటానికి తాత్కాలికంగా పన్నులు పెంచుతామని మొన్న అక్టోబర్‌లో ప్రతిపాదించగానే అంతంత మాత్రంగా నడుస్తున్న సంస్థలు అంతెత్తున లేచాయి. కొత్త పెట్టుబడులకు ఆస్కారమే లేని స్థితిలో ఈ పన్నుల మోతేమిటని ప్రశ్నించాయి.ఫ్రెంచి పౌరులు గర్వపడే పారిస్‌లోని 860 యేళ్లనాటి పురాతన భవంతి నోటర్‌డామ్ కేథడ్రిల్కు 2019లో నిప్పంటుకుని చాలా భాగం ధ్వంసమైనప్పుడు సంక్షోభంలో కూరుకుపోయిన వర్తమాన ఆర్థిక స్థితికి అది అద్దం పడుతోందని అనేకులు వ్యాఖ్యానించారు. అయిదేళ్లలో దాన్ని పునర్నిర్మించి అద్భుతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన మేక్రాన్ జయప్రదంగా ఆ పని పూర్తిచేయగలిగారు. కానీ ఆర్థికవ్యవస్థ మాత్రం ఆయనకు చుక్కలు చూపిస్తోంది. మామూలుగా అయితే శనివారం 50మంది ప్రపంచాధినేతలు, కాబోయే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వగైరాల సమక్షంలో ఆ భవంతి ప్రారంభం కాబోయే వేళ మేక్రాన్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. కానీ తాజా రాజకీయ సంక్షోభం ఎదుర్కొనటం ఎలాగో తెలియక ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.577మంది సభ్యులుండే దిగువసభ ‘అసెంబ్లీ నేషనల్’లో ప్రభుత్వం ఏర్పాటుచేసే పక్షానికి కనీసం 289 స్థానాలు కావాలి. కానీ వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్‌కు 182, మేక్రాన్‌కు చెందిన ఎన్సెంబుల్కు 168 ఉన్నాయి. తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్)కి 143 సీట్లున్నాయి. వామపక్ష ఫ్రంట్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలపరచటం ద్వారా ఆర్ఎన్ ఇప్పుడు బార్నియర్ ప్రభుత్వ పతనానికి కారణమైంది. తన బడ్జెట్ పార్లమెంటులో నెగ్గే స్థితి లేదని తెలిసి రాజ్యాంగంలోని అధికరణ ఉపయోగించి బార్నియర్ దాన్ని అమల్లోకి తెచ్చారు.పర్యవసానంగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనక తప్పదని అర్థమైనా ఆయన ఈ మార్గం ఎంచుకున్నారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం ఏడాది గడిస్తే తప్ప... అంటే వచ్చే ఏడాది జూలై వరకూ మళ్లీ ఎన్నికలు జరపకూడదు. కనుక అప్పటివరకూ ఫ్రాన్స్‌కు ఆపద్ధర్మ ప్రభుత్వమే గతి. ఈలోగా తన వైఫల్యాలను అంగీకరించి మేక్రాన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిరావొచ్చు. ఫలితంగా దేశానికి మరిన్ని ఇక్కట్లు తప్పవు. అంతంతమాత్రంగా ఉన్న తమ బతుకులు ఆర్ఎన్ నిర్ణయంవల్ల మరింత అధోగతికి చేరాయని జనం అనుకుంటే అధ్యక్ష ఎన్నికల్లో ఆ పదవి దక్కించుకోవాలని తాపత్రయ పడుతున్న ఆర్ఎన్ అధినాయకురాలు మెరిన్ లీ పెన్ ఆశలు అడుగంటినట్టే. ఫ్రాన్స్ సంక్షోభం మరింత వికటిస్తే అది మొత్తం యూరప్ దేశాల ఆర్థికవ్యవస్థలను అనిశ్చితిలో పడేస్తుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతోసహా అన్ని సంక్షోభాలూ ఆగితేనే ఈ ప్రమాదం నుంచి గట్టెక్కడం యూరప్‌కు సాధ్యమవుతుంది. -
ఇదే జరిగితే.. దేశంలో అగ్రగామిగా తెలంగాణ
నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ డిమాండ్లకు అనుగుణంగా తెలంగాణ తన విద్యా వ్యవస్థను సర్దుబాటు చేయడానికి పరివర్తనాత్మక చర్యలు తీసుకుంటోంది. బ్రిడ్జింగ్ ది గ్యాప్: ఇంటిగ్రేటింగ్ స్కిల్లింగ్ ఇన్టు తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ నివేదికలో వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఎదుర్కోవలసిన సవాళ్ళను వెల్లడిస్తూ.. వృత్తి శిక్షణ, పరిశ్రమ-సమలేఖన నైపుణ్యాలను పాఠ్యాంశాల్లోకి చేర్చవలసిన అవసరాన్ని పేర్కొంది.తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 2023-24లో 187 బిలియన్లకు చేరుకుంటుందని.. ఇది 2030 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. ఇదే జరిగితే తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా అవతరిస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి.. వృద్ధికి తోడ్పాటునందించేందుకు తెలంగాణ ప్రభుత్వం యువతను లైఫ్ సైన్సెస్, ఐటీ, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ మొబిలిటీ, డిఫెన్స్ వంటి రంగాల్లో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలను సమకూర్చడంపై దృష్టి సారిస్తోంది.నివేదిక గురించి ఈవై పార్థినాన్ పార్ట్నర్ డాక్టర్ అవంతిక తోమర్ మాట్లాడుతూ.. సంప్రదాయ విద్యా విధానంలో మార్పు రాష్ట్రాభివృద్ధికి కీలకం. తెలంగాణకు ఉన్నత.. నైపుణ్య విద్యలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఇందులో పరిశ్రమ నైపుణ్యాల డిమాండ్లతో విద్యా పాఠ్యాంశాలను సర్దుబాటు చేయడం, ఇంటర్న్‌షిప్‌ల కోసం పరిశ్రమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, సాఫ్ట్ స్కిల్స్‌పై దృష్టిని పెంచడం, నిర్మాణాత్మక కోర్సు సమూహాలను అభివృద్ధి చేయడం వంటివి ఉన్నాయి.సీఐఐ తెలంగాణ చైర్మన్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి సీఐఐ సిద్ధంగా ఉంది. స్థిరమైన వృద్ధికి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం అవసరమని అన్నారు. మేము దృష్టి పెడుతున్న ముఖ్యాంశాలలో ఒకటి పరిశ్రమల ఇంటర్న్‌షిప్‌ల ఏకీకరణ. అధ్యాపకులకు కూడా ఇంటర్న్‌షిప్‌లను తప్పనిసరి చేయడం ద్వారా.. పరిశ్రమ ధోరణులతో మరింత సన్నిహితంగా ఉండేలా చేయవచ్చు. తద్వారా వారి బోధనా పద్ధతులు మెరుగుపడతాయని అన్నారు.విద్య.. నైపుణ్యంలో ఉన్న క్లిష్టమైన అంతరాలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. ఏఐసీటీఈ & ఇతర సంస్థలతో సహకార ప్రయత్నాల ద్వారా, మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా ప్రత్యక్షంగా ఉండేలా పరిశ్రమ-నిర్దిష్ట వృత్తి శిక్షణ కోర్సులను రాష్ట్రం ప్రవేశపెడుతోంది. 2030 నాటికి 100 శాతం యువత అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో, రాష్ట్రం అణగారిన వర్గాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యను విస్తరిస్తోంది.విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడానికి.. తెలంగాణ విద్యా సంస్థలు & వ్యాపారాల మధ్య సహకారానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు.. వాస్తవ ప్రపంచ ప్రాజెక్టుల ద్వారా అనుభవపూర్వక అభ్యాస అవకాశాలను పెంపొందించడం ద్వారా, విద్యార్థులు వారి ఉపాధిని మెరుగుపరిచే ఆచరణాత్మక, ప్రయోగాత్మక అనుభవాన్ని పొందుతారు. -
కొత్త ట్యాక్స్ కోడ్: రేపటి భారతదేశ నిర్మాణం కోసం..
2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనికోసం కొత్త ట్యాక్స్ కోడ్ అవసరమని నిపుణులు బడ్జెట్‌కు ముందే చెప్పారు. ఆర్ధిక వ్యవస్థను శక్తివంతం చేస్తూ.. నికర రాబడిని పెంచడం వంటివి అవసరం. 2025-26 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించనున్నారు.''ది న్యూ టాక్స్ కోడ్: రేపటి భారతదేశాన్ని నిర్మించడానికి ఆలోచనలు" అనే సెమినార్‌ను థింక్ చేంజ్ ఫోరమ్ (TCF) నిర్వహించింది. ఈ సెమినార్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ మాజీ చైర్మన్ పీసీ ఝా, పాలసీ అడ్వైజరీ & స్పెషాలిటీ సర్వీసెస్ పార్టనర్ అండ్ లీడర్ రాజీవ్ చుగ్, మేనేజింగ్ పార్టనర్ సూరజ్ మాలిక్, సీనియర్ పార్టనర్ రజత్ మోహన్ మొదలైనవారు పాల్గొన్నారు.జీఎస్టీ కింద చాలా పన్ను రేట్లు ఉండటం మంచి పరిస్థితి కాదు. జీఎస్టీ అనేది ఒక పన్ను రేటుగా మాత్రమే ఉండాలి. కానీ.. మన దేశంలో ఒక పన్ను రేటును కలిగి ఉండటం సాధ్యం కాదు. కాబట్టి మూడు పన్ను రేట్లను పరిశీలించే అవకాశం ఉంది. అవి 5 శాతం, 16 శాతం & 28 శాతం. 16 శాతం అనేది.. 12 శాతం, 18 శాతానికి బదులుగా రానుందని పీసీ ఝా చెప్పారు.పన్నుల వ్యవస్థలో ప్రస్తుత నిబంధనలను సరళీకృతం చేయాల్సిన అవసరాన్ని సమర్ధిస్తూ.. పన్ను రేట్ల తగ్గింపు పౌరులు.. కంపెనీల చేతుల్లో ఆదాయం పెరగడానికి దారి తీస్తుందని, తద్వారా ఆర్ధిక వృద్ధి పెరుగుతుందని రాజీవ్ చుగ్ పేర్కొన్నారు. సెమినార్లో పాల్గొన్న ప్రముఖులందరూ కూడా పన్ను చట్టాలలో మార్పుల అవసరని తమ అభిప్రాయాలను వెల్లడించారు. -
వృద్ధి ఆశావహమే.. కానీ అప్రమత్తత
భవిష్యత్తులో దేశ ఆర్థిక వృద్ధి పట్ల ఆశావహంగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అయితే అదే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని స్పష్టం చేసింది. సరిపడా వర్షాలు, రిజర్వాయర్లలో మెరుగైన నీటి నిల్వలు, కనీస మద్దతు ధరలను (ఎంఎస్పీ) పెంచడం, ముడి సరుకుల లభ్యత ఇవన్నీ ఆర్థిక వృద్ధికి సానుకూల అంశాలుగా పేర్కొంది.‘ప్రస్తుతం కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, మెరుగైన వ్యవసాయ ఉత్పాదకత వల్ల రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం దిగొస్తుంది. నవంబర్ నెల ప్రారంభ ధోరణులు కీలక ఆహార ధరలు మోస్తరు స్థాయికి చేరుతున్నట్టు సంకేతమిస్తున్నాయి. అయినప్పటికీ భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం దేశీయంగా ద్రవ్యోల్బణం, సరఫరా వ్యవస్థలపై కొనసాగుతుంది’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదిక వెల్లడించింది. ఖరీఫ్ సీజన్లో పెద్ద ఎత్తున పెరిగిన సాగుతో ఆహార ధరలు దిగొస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్థిక కార్యకలాపాలు వర్షాకాలంలో కొంత నిదానించినప్పటికీ, తిరిగి అక్టోబర్‌లో పుంజుకున్నట్టు కొన్ని సంకేతాలు వస్తున్నట్లు తెలిపింది. గ్రామీణ, పట్టణ డిమాండ్‌తోపాటు, పీఎంఐ సూచీ, ఈవే బిల్లుల జారీ తదితర సంకేతాలను ప్రస్తావించింది.ఉపాధి విస్తరణ.. సంఘటిత రంగంలో ఉద్యోగుల సంఖ్య విస్తరిస్తోందని.. తయారీ రంగంలో చెప్పుకోతగ్గ మేర ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నట్టు ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో డిమాండ్ తగ్గడం వల్ల దేశ ఎగుమతులు పుంజుకునే విషయంలో సవాళ్లను ఎదుర్కోవచ్చని అంచనా వేసింది. మరోవైపు సేవల రంగం ఊపందుకుంటున్నట్టు తెలిపింది. ఇక 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐలు) చెప్పుకోతగ్గ వృద్ధి లేదని వెల్లడించింది. విదేశీ మారకం నిల్వలు ఈ ఏడాది ఇప్పటి వరకు 64.8 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్టు, చైనా తర్వాత అధిక వృద్ధి నమోదైనట్టు తెలిపింది. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు, కంపెనీల ఆదాయాల వృద్ధి, విలువలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, ట్రంప్ సర్కారు విధాన నిర్ణయాలు తదుపరి విదేశీ పెట్టుబడుల రాకను ప్రభావితం చేస్తాయని వివరించింది. ఇదీ చదవండి: ఆకాశవీధిలో 1.36 కోట్ల మందిఅంతర్జాతీయ పరిణామాలు..రష్యా–ఉక్రెయిన్ మధ్య తాజా ఉద్రిక్తతలతో ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆందోళనకు దారితీసిందని, దీంతో భద్రత ఎక్కువ ఉండే సాధనాలైన యూఎస్ ట్రెజరీలు, బంగారానికి డిమాండ్ ఏర్పడినట్టు ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. యూరప్, చైనాలో ఆర్థిక మందగమనం ప్రభావం అంతర్జాతీయ వృద్ధిపై కొనసాగుతుందని అంచనా వేసింది. అదే సమయంలో యూఎస్ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి పనితీరు చూపిస్తున్నట్టు పేర్కొంది. -
ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి మరో 500 శాఖలు: నిర్మలా సీతారామన్
భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) తన నెట్‌వర్క్‌ను ఎప్పటికప్పుడు విస్తరిస్తూ.. ప్రజలకు చేరువవుతోంది. తాజాగా ఎస్బీఐ తన ముంబైలోని ప్రధాన కేంద్రం 100వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.ముంబైలో జరిగిన ఎస్బీఐ 100వ వార్షికోత్సవంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' మాట్లాడుతూ.. 1921లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IBI)గా ఏర్పాటు చేశారు. 1955 సంవత్సరంలో ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిందని గుర్తు చేశారు.ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 22,500 శాఖలను కలిగి ఉంది. ఈ సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 23వేలుకు చేరుతుందని సీతారామన్ పేర్కొన్నారు. అంటే మరో 500 ఎస్బీఐ కొత్త శాఖలు ఏర్పాటు అవుతాయని స్పష్టం చేశారు. 1921లో ఎస్బీఐ కేవలం 250 శాఖలను మాత్రమే కలిగి ఉండేది. ప్రస్తుతం ఆ సంఖ్య 90 రెట్లు పెరిగింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో 65,000 ఏటీఎంలను కలిగి ఉంది. ఎస్బీఐకు 50 కోట్ల కంటే ఎక్కువ కస్టమర్లు ఉన్నట్లు సమాచారం. దేశంలోని మొత్తం డిపాజిట్లలో ఎస్బీఐ వాటా 22.4 శాతంగా ఉంది. అంతే కాకుండా రోజుకు 20 కోట్ల యూపీఐ లావాదేవీలను ఎస్బీఐ నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని తెలుస్తోంది.SBI today has 22,500 branches and is expected to add another 500 in this financial year. SBI has 65,000 ATMs which is 29% of all ATMs in the country, has 85,000 banking correspondents, share of its deposits are 22.4 per cent of total deposits, has 50 crore plus customers,… pic.twitter.com/lPF3FShDua— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) November 18, 2024 -
చెత్త సంపాదన రూ.2,364 కోట్లు: ప్రశంసించిన మోదీ
కేంద్ర ప్రభుత్వం 'స్వచ్ఛత' ప్రచారాల ద్వారా స్క్రాప్‌ల (చెత్త) తొలగింపుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే కేవలం మూడేళ్ళలో ప్రభుత్వం ఏకంగా 2,364 కోట్ల రూపాయలను ఆర్జించింది. ఈ విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి 'జితేంద్ర సింగ్' సోషల్ మీడియాలో వెల్లడించారు.స్క్రాప్‌ల ద్వారా భారీ మొత్తాన్ని ప్రభుత్వానికి చేకూర్చడానికి సహకరించిన 'డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్' (DPIIT)ను భారత ప్రధాని 'మోదీ' ప్రశంసించారు. జితేంద్ర సింగ్ పోస్ట్‌ను షేర్ చేస్తూ.. ప్రశంసనీయం! సమర్థవంతమైన నిర్వహణ, చురుకైన చర్యపై దృష్టి సారించడం ద్వారా గొప్ప ఫలితాలను సాధించారు. పరిశుభ్రత, ఆర్థిక వివేకం రెండింటినీ ప్రోత్సహిస్తూ.. సమిష్టి ప్రయత్నాలు స్థిరమైన ఫలితాలకు ఎలా దారితీస్తాయో ఇది చూపిస్తుందని మోదీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: రతన్ టాటా చేసిన పని నాకింకా గుర్తుంది.. ఆ రోజు: ప్రధాని మోదీస్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఫిజికల్ ఫైళ్లను తొలగించడం వల్ల 15,847 అడుగుల స్థలం ఖాళీ అయింది. దీని ద్వారా సుమారు రూ. 16,39,452 ఆదాయం లభించింద వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫిజికల్ ఫైల్స్ ప్రతి ఏటా భారీగా పెరగడం వల్ల కార్యాలయాల్లో స్థలం కూడా నిండుతుంది. వీటన్నింటిని తొలగించడం వల్ల ఖాళీ స్థలం ఏర్పడమే కాకుండా.. ప్రభుత్వ ఖజానాకు డబ్బు చేరుతుంది.Commendable! By focussing on efficient management and proactive action, this effort has attained great results. It shows how collective efforts can lead to sustainable results, promoting both cleanliness and economic prudence. https://t.co/E2ullCiSGX— Narendra Modi (@narendramodi) November 10, 2024 -
ఏ హామీ లేకుండానే లోన్: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) తయారీ సామర్థ్యాలను పెంపొందించేందుకు కొలేటరల్-ఫ్రీ టర్మ్ లోన్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని త్వరలోనే కేబినెట్ ముందు ఉంచుతామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.బెంగళూరులో జరిగిన నేషనల్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈ కొలేటరల్-ఫ్రీ టర్మ్ లోన్ స్కీమ్ గురించి వెల్లడించారు. ఈ కొత్త పథకం ద్వారా కేంద్రం ఎంఎస్ఎంఈలకు ఏకంగా రూ. 100 కోట్ల వరకు రుణాలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.నిర్మలా సీతారామన్ వెల్లడించిన ఈ పథకానికి కేంద్ర మంత్రి మండలి అనుమతి దక్కితే ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ.. బ్యాంకుల ద్వారా లోన్ అందిస్తుంది. కేంద్రం అందించే ఈ లోనుకు ఎలాంటి హామీ అవసరం లేదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.ఎంఎస్ఎంఈలు బ్యాంకుల నుంచి వర్కింగ్ క్యాపిటల్‌ను పొందవచ్చు. కానీ వారికి టర్మ్ లోన్లు, ప్లాంట్.. మెషినరీ కోసం లోన్ లభించడం లేదని ఈ సందర్భంగా సీతారామన్ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టనున్న కొత్త పథకం ద్వారా.. ప్లాంట్స్, యంత్రాలకు కూడా లోన్స్ అందించనున్నట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: రతన్ టాటా చేసిన పని నాకింకా గుర్తుంది.. ఆ రోజు: ప్రధాని మోదీఎంఎస్ఎంఈ రంగంలో కర్ణాటక చేస్తున్న కృషిని సీరాటమన్ ప్రశంసిస్తూ.. రాష్ట్రంలో 35 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని, అవి 1.65 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తున్నాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఈ రంగం మరింత వృద్ధి చెందుతుందని, ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుందని ఆమె అన్నారు. -
రూ. 34కే బియ్యం.. మళ్ళీ భారత్ బ్రాండ్ సేల్స్
అధిక ధరల నుండి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు.. కేంద్ర ప్రభుత్వం మంగళవారం రెండవ దశ భారత్ బ్రాండ్ కింద సబ్సిడీ ధరలకు గోధుమ పిండి, బియ్యం విక్రయాలను ప్రారంభించింది. ఎన్సీసీఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయాలు జరగనున్నాయి.భారత్ బ్రాండ్ కింద కేజీ గోధుమ పిండి ధర రూ. 30 కాగా.. బియ్యం రూ. 34వద్ద అందుబాటులో ఉన్నాయి. గతంలో గోధుమ పిండిని రూ. 27.5కు, బియ్యాన్ని రూ. 29కే విక్రయించారు. అయితే ఇప్పుడు ఈ ధరలు కొంత పెరిగాయి. అయితే ప్రభుత్వం లక్ష్యం వ్యాపారం కాదని, మార్కెట్ ధరల కంటే తక్కువకు అందించడమే అని, ఫేజ్-2 ప్రారంభించిన సమయంలో కేంద్ర మంత్రి 'ప్రహ్లాద్ జోషి' తెలిపారు.గోధుమ పిండి, బియ్యం రెండూ కూడా 5 కేజీలు, 10 కేజీల ప్యాకెట్ల రూపంలో లభిస్తాయి. తక్కువ ధరకే గోధుమ పిండి, బియ్యాన్ని సరఫరా చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నుంచి 3.69 లక్షల టన్నుల గోధుమ, 2.91 లక్షల బియ్యాన్ని సేకరించినట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ స్టాక్ ఉన్నంత వరకు విక్రయాలు జరుగుతాయి, అవసరమైతే ఇంకా ఎక్కువ కేటాయిస్తామని పేర్కొన్నారు.ఇదీ చదవండి: శుభవార్త.. మరోమారు తగ్గిన బంగారం, వెండి ధరలుప్రజలు కోరుకుంటే గోధుమ పిండి, బియ్యాన్ని మరింత చిన్న ప్యాకెట్ల రూపంలో కూడా అందించడానికి సిద్ధమని ప్రహ్లాద్ జోషి అన్నారు. మునుపటి దశలో కేంద్రం.. 15.20 లక్షల టన్నుల గోధుమ పిండిని, 14.58 లక్షల టన్నుల బియ్యం (అక్టోబర్ 2023 నుంచి జూన్ 30, 2024 వరకు) పంపిణీ చేసినట్లు సమాచారం.A Step Towards Food Affordability: Bharat Atta & Bharat Rice at Subsidized RatesDelighted to launch Phase II of 'Bharat Atta' & 'Bharat Rice' sales from Krishi Bhawan, New Delhi today.This latest initiative by the @narendramodi Govt aims to support consumers by providing… pic.twitter.com/iaQpUfnjjA— Pralhad Joshi (@JoshiPralhad) November 5, 2024 -
ధరల తగ్గుదలపై వరల్డ్ బ్యాంక్ క్లారిటీ
అంతర్జాతీయ మార్కెట్లలో వస్తువుల ధరలకు సంబంధించిన విషయాలను వరల్డ్ బ్యాంక్ తన అక్టోబర్ ఎడిషన్ కమోడిటీ మార్కెట్ ఔట్‌లుక్‌లో వెల్లడించింది. వస్తువుల ధరలు 2025లో 5 శాతం, 2026లో 2శాతం.. ఈ ఏడాది 3 శాతం క్షీణతను పొందుతాయని పేర్కొంది.క్రూడ్ ఆయిల్ ధరల విషయానికి వస్తే.. 2024లో బ్యారెల్ ధర 80 డాలర్లు కాగా, ఇది 2025లో 73 డాలర్లకు చేరుతుందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. 2026 నాటికి ఈ ధరలు 72 డాలర్లకు పడిపోతుందని కూడా స్పష్టం చేసింది. చమురు ధరలు గణనీయంగా తగ్గుతాయని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్దాలు ప్రమాదం అని హెచ్చరించింది.ఇంధన మార్కెట్లు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు దగ్గరగా ఉంటాయి. కాబట్టి దీనివల్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. 2023 అక్టోబర్ - 2024 ఏప్రిల్ మధ్య ప్రాంతీయ వైరుధ్యాల కారణంగా చమురు ధరలు 90 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఈ ధరలు కొంత శాంతించినప్పటికీ.. రాబోయే రోజుల్లో భౌగోళిక ఉద్రిక్తతలు దీనిపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది.చమురు ధరల విషయం పక్కన పెడితే.. లోహాల ధరలు 2025 - 26లలో తగ్గే సూచనలున్నాయి. బేస్ మెటల్ ధరలు 2026లో 3 శాతం మేర తగ్గుతాయి. అయితే వచ్చే ఏడాది ఈ ధరలు స్థిరంగా ఉంటాయని సమాచారం.ఇదీ చదవండి: తండ్రి నుంచి అప్పు తీసుకుని మరీ!! మకుటం లేని మహరాజుగా ఎదిగి..బంగారం ధరల విషయానికి వస్తే.. 2024లో మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీనికి కారణం పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు అని తెలుస్తోంది. అంతే కాకుండా సెంట్రల్ బ్యాంకుల నుంచి బలమైన డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తున్నాయి. -
వృద్ధి మందగమనంలోకి భారత్
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ సైక్లికల్ వృద్ధి మందగమనంలోకి అడుగు పెట్టినట్టు జపాన్ బ్రోకరేజీ దిగ్గజం నోమురా ప్రకటించింది. జీడీపీ 7.2 శాతం వృద్ధి సాధిస్తుందన్న ఆర్బీఐ అంచనాలు మరీ ఆశావహంగా ఉన్నట్టు పేర్కొంది. 2024–25లో 6.7 శాతం, 2025–26లో 6.8 శాతం మేర భారత జీడీపీ వృద్ధి సాధిస్తుందన్న తమ అంచనాలు మరింత క్షీణించడానికి రిస్క్‌లు పెరుగుతున్నట్టు పేర్కొంది.వృద్ధి సూచికలు జీడీపీ మరింత మోస్తరు స్థాయికి చేరుకుంటుందని సూచిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధిని సాధిస్తుందని ఇటీవలి ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష తన గత అంచనాలను కొనసాగించడం తెలిసిందే.పట్టణాల్లో వినియోగం సాధారణంగా మారుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయని.. ప్యాసింజర్ వాహన విక్రయాలు తగ్గడం, విమాన ప్రయాణికుల రద్దీ మోస్తరు స్థాయికి దిగిరావడం, ఎఫ్ఎంసీజీ సంస్థల అమ్మకాలు దీనికి నిదర్శనాలుగా పేర్కొంది. పట్టణ వినియోగంలో ఈ బలహీన ధోరణి కొనసాగుతుందని తాము భావిస్తున్నట్టు నోమురా తెలిపింది.కంపెనీలు వేతన వ్యయాలను తగ్గించుకుంటున్న విషయాన్ని ప్రస్తావించింది. ‘‘కరోనా అనంతరం ఏర్పడిన పెంటప్ డిమాండ్ సమసిపోయింది. ద్రవ్య విధానం కఠినంగా మారింది. అన్ సెక్యూర్డ్ రుణాలపై ఆర్బీఐ ఆంక్షలు వ్యక్తిగత రుణాలు, ఎన్బీఎఫ్సీ రుణాల వృద్ధి క్షీణతకు దారితీశాయి’’ అని నోమురా తన నివేదికలో వివరించింది. -
క్రిప్టో కరెన్సీ ప్రమాదం!.. ఆర్బీఐ గవర్నర్
క్రిప్టో కరెన్సీ ఆర్థిక స్థిరత్వానికి భారీ నష్టం కలిగిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వెల్లడించారు. పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అనే థింక్-ట్యాంక్ కార్యక్రమంలో 'శక్తికాంత దాస్' ఈ వ్యాఖ్యలు చేశారు.క్రిప్టో కరెన్సీ ద్రవ్య స్థిరత్వానికి మాత్రమే కాకుండా.. బ్యాంకింగ్ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఆర్ధిక వ్యవస్థపైన క్రిప్టోల ఆధిపత్యం ఉండకూడదని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాపై సెంట్రల్ బ్యాంక్ నియంత్రణ కోల్పోయే పరిస్థితిని కూడా ఇది సృష్టించే అవకాశం ఉందని ఆయన అన్నారు.క్రిప్టో కరెన్సీ వల్ల కలిగే నష్టాలను గురించి తెలుసుకోవాలి. ఈ సమస్య మీద అందరికి అవగాహన ఉండాలి. క్రిప్టోకరెన్సీల వల్ల కలిగే నష్టాల గురించి ప్రభుత్వాలు కూడా తెలుసుకుంటున్నాయని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీల గురించి ప్రశ్నించిన మొదటి దేశం భారత్ అని ఆయన అన్నారు.భారతదేశ అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశంలో క్రిప్టో అంశం మీద అవగాహన పెంపొందించడానికి ఒక ఒప్పందం జరిగింది. అప్పట్లో దీనిపైన తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేసిన మొదటి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కావడం గమనార్హం. ఈ విషయంలో ఇప్పటికే కొంత పురోగతి సాధించాము. దీనిపై ఇంకా పనిచేయాల్సి ఉందని శాంతికాంత దాస్ అన్నారు. క్రిప్టోల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. -
ప్రపంచ వేదికపై భారత్: నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికాలో సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) ప్రెసిడెంట్ అండ్ సీఈఓ జాన్ జే హామ్రేతో జరిగిన సమావేశంలో ఆర్థిక సాధికారతలో భారత్ అభివృద్ధిని గురించి వివరించారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.2014లో రాష్ట్ర రాజధానులకు సమీపంలో ఉన్న గ్రామాలకు కూడా విద్యుత్ సదుపాయం అంతంత మాత్రంగానే ఉండేది. నేడు ప్రతి గ్రామంల్లో విద్యుత్ సదుపాయం మాత్రమే కాకుండా.. ప్రతి ఇంటికి కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయని.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'జల్ జీవన్ మిషన్' కార్యక్రమం గురించి కూడా సీతారామన్ వెల్లడించారు.ఇంతకు ముందు గ్రామాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉండేవి, కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి కుళాయి నీటి కనెక్షన్స్ అందించడం జరిగింది. లక్షలాది భారతీయ కుటుంబాల ఆరోగ్యం, పారిశుధ్యం వంటి సౌకర్యాలపై కూడా కేంద్రం సానుకూల దృష్టి పెట్టిందని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.ఇదీ చదవండి: పండక్కి 13 స్పెషల్ ఎడిషన్స్.. మార్కెట్లో కొత్త కార్ల జోరుమున్సిపాలిటీలు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో కొంత భాగాన్ని, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా అదనపు నిధులను పొందుతాయని ఆమె వివరించారు. అంతే కాకుండా మార్కెట్ నుంచి వనరులను సేకరించేందుకు వారి సామర్థ్యాలను పెంచుతున్నాము. ఇది దేశాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్మలా సీతారామన్ వివరించారు.భారతదేశ ఆర్థిక వృద్ధికి కొన్ని సంస్కరణలు జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికే ఎంతోమంది పెట్టుబడిదారులు కొత్త రంగాలలో విరివిగా పెట్టుబడులు పెడుతున్నారు. కొనసాగుతున్న సంస్కరణలు, పెరిగిన గ్లోబల్ ఎంగేజ్మెంట్తో.. భారతదేశం ప్రపంచ వేదికపై ప్రత్యేక గుర్తింపు పొందుతుందని సీతారామన్ స్పష్టం చేశారు. -
ముద్ర లోన్ లిమిట్ పెంపు: రూ.10 లక్షల నుంచి..
2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రకటించినట్లుగా.. ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఏవై) కింద ముద్ర లోన్ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.నిధులు లేని వారికి నిధులు సమకూర్చే ముద్రా పథకం.. వారి వృద్ధి, విస్తరణను మరింత సులభతరం చేయడానికి లోన్ పరిమితిని రెట్టింపు చేయడం జరిగింది. ఇది రాబోయే వ్యవస్థాపకులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బలమైన వ్యవస్థాపక పర్యావరణాన్ని పెంపొందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.'తరుణ్ కేటగిరీ' కింద గతంలో రుణాలను పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన వ్యాపారవేత్తలకు ముద్ర లోన్ పరిమితి రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. అంటే వీరు ముద్ర లోన్ కింద రూ. 20 లక్షల లోన్ తీసుకోవచ్చు. అంతే కాకుండా రూ. 20 లక్షల వరకు ఉన్న పీఎంఏవై లోన్ హామీ కవరేజ్.. మైక్రో యూనిట్ల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ (CGFMU) కింద అందించనున్నారు.ప్రధాన్ మంత్రి ముద్ర యోజనప్రధాన్ మంత్రి ముద్ర యోజన (PMMY) అనేది కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న/సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు అందించడం కోసం 2015 ఏప్రిల్ 8న ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ రుణాలను పీఎంఏవై కింద ముద్ర రుణాలుగా వర్గీకరించారు. ఈ లోన్స్ మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్లు అందిస్తారు. అంటే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో-ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా లోన్స్ మంజూరు చేస్తాయి.పీఎంఏవై కింద లోన్స్ అనేవి పౌల్ట్రీ, డైరీ, తేనెటీగల పెంపకం మొదలైన వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న కార్యకలాపాలకు మాత్రమే కాకుండా తయారీ, వ్యాపారం వంటి వాటికి కూడా అందిస్తారు. ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ఈ లోన్స్ చాలా ఉపయోగపడతాయి.Union Budget 2024-25 provides special attention to #MSMEs and #manufacturing, particularly labour-intensive manufacturing.👉New mechanism announced for facilitating continuation of bank credit to #MSMEs during their stress period👉Limit of #Mudra loans increased from ₹10 lakh… pic.twitter.com/wPbMvnwBhz— Ministry of Finance (@FinMinIndia) July 23, 2024 -
మూడు నగరాల ముచ్చట
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి డోకూరి వెంకటేశ్వర్‌రెడ్డి) ఈశాన్య ఆసియాలో దక్షిణ కొరియాను ఆర్థిక హబ్‌గా నిలపాలన్న లక్ష్యంతో 2003లో ది ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ (ఐఎఫ్ఈజెడ్)ను ఏర్పాటు చేశారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడమే దాని ప్రధాన ఉద్దేశం. ఇక్కడే రూ.5 లక్షల కోట్ల వ్యయంతో మూడు అంతర్జాతీయ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేశారు. మూసీ పునరుజ్జీవం, ముచ్చర్లలో ఫ్యూచర్ సిటీ బృహత్తర ప్రాజెక్టులపై అధ్యయనానికి రాష్ట్ర మంత్రుల బృందం దక్షిణ కొరియాలోని సియోల్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మూడో రోజైన బుధవారం ఇంచియాన్ నగరంలో అభివృద్ధి చేసిన 3 అంతర్జా తీయ స్మార్ట్ సిటీలను మంత్రులు, అధికారుల బృందం పరిశీలించింది. పనిలోపనిగా స్టోర్స్ యూనివర్సిటీని కూడా సందర్శించింది. సాంగ్డో నగరంలో ఐటీ, బయోటెక్నాలజీ (బీటీ), సేవల పరిశ్రమలు, చెయోంగ్నాలో ఫైనాన్స్, హైటెక్ ఇండస్ట్రీలు, యోంగ్జోంగ్లో లాజిస్టిక్, టూరిజం పరిశ్రమలను అభి వృద్ధి చేశారు. ప్రస్తుతం 122.34 చదరపు కిలో మీటర్లు (చ.కి.మీ.) విస్తీర్ణంలో ఉన్న ఈ మూడు నగరాల్లో 5,43,653 జనాభా నివాసం ఉంటోంది. 3 గంటల్లో ఇతర నగరాలకు..ఇంచియాన్ నుంచి షాంఘై, బీజింగ్, హాంగ్‌కాంగ్ వంటి నగరాలకు మూడు గంటల్లో చేరుకోవచ్చు. దీంతో ఎగుమతి, దిగుమతి కేంద్రాలకు ఇంచియాన్ నిలయంగా మారింది. పబ్లిక్, మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్‌లతో పాటు ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఓడరేవు, ఫెర్రీ టెర్మినల్స్తో మెరుగైన రవాణావ్యవస్థ ఉంది. ఇంచియాన్లోని అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఉండటంతో పరిశ్రమ అవసరాలకు తగ్గిన నిపుణులు, నైపుణ్యమున్న ఉద్యోగులకు కొరతే లేదు. అన్ని రకాల మౌలిక సదుపాయాలున్న స్థలాలు, దీర్ఘకాలంపాటు లీజు, నిర్మాణ వ్యయంలో రాయితీలు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ) భద్రత, విదేశీ సంస్థలకు ప్రత్యేక పన్ను మినహాయింపులు వంటివి అందిస్తున్నారు.స్టార్టప్ పార్క్..ఇప్పటివరకు ఐఎఫ్ఈజెడ్లో 14.8 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లు వచ్చాయి. ఇందులో 206 గ్లోబల్, 3,481 స్థానిక సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సెమీ కండక్టర్లు, రోబో, డ్రోన్ వంటి పరిశ్రమలకు చెందిన సంస్థలతో పాటు గ్రీన్ క్లైమెట్ ఫండ్ (జీసీఎఫ్) వంటి ఐక్యరాజ్య సమితికి చెందిన 15 కార్యాలయాలు న్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువతను ఆకర్షించేందుకు ఇంచియాన్ నగరంలో స్టార్టప్ పార్క్‌ను కూడా నెలకొల్పారు. ప్రస్తుతం ఇందులో 422 స్టార్టప్స్ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సుమారు 208 బిలియన్ వాన్ నిధులను సమీకరించాయి. ఇంచియాన్ గ్లోబల్ క్యాంపస్‌తో పాటు 6 కొరియన్ వర్సిటీలు, విదేశీ విశ్వ విద్యాలయాలున్నాయి. -
అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
డారన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ. రాబిన్సన్లకు 2024 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. వీరు ''సంస్థలు ఏవిధంగా ఏర్పాటవుతాయి, అవి ప్రజా శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయి'' అనే అంశం మీద చేసిన పరిశోధనలకు ఈ బహుమతి లభించింది.ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ ప్రైజ్.. ఆల్ప్రైడ్ నోబెల్ పేరు మీదుగా వివిధ రంగాలలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా అందిస్తారు. ఈ బహుమతులను ప్రతి ఏటా డిసెంబర్ 10న గ్రహీతలకు అందిస్తారు. ఇప్పటికే భౌతిక, రసాయన, సాహిత్య, వైద్య రంగాలలో విశిష్ట సేవలను అందించిన వారికి నోబెల్ బహుమతులను ప్రకటించారు. ఇప్పుడు తాజాగా అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం ముగ్గురుకి నోబెల్ ప్రైజ్ అందిస్తున్నట్లు వెల్లడించారు.BREAKING NEWSThe Royal Swedish Academy of Sciences has decided to award the 2024 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Daron Acemoglu, Simon Johnson and James A. Robinson “for studies of how institutions are formed and affect prosperity.”… pic.twitter.com/tuwIIgk393— The Nobel Prize (@NobelPrize) October 14, 2024 -
ఎకానమీకి ప్రభుత్వ వ్యయం, వ్యవసాయం దన్ను
న్యూఢిల్లీ: మెరుగైన వ్యవసాయోత్పత్తి, అధిక ప్రభుత్వ వ్యయాలు భారత్ ఆర్థిక కార్యకలాపాలకు దన్నుగా ఉంటాయని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అంచనావేసింది. వ్యవసాయం రంగం పురోగమనం నేపథ్యంలో గ్రామీణ వినియోగం బాగుంటుందని విశ్లేషించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ వృద్ధి 7 శాతంగా ఉంటుందని తన సెప్టెంబర్ అప్డేటెడ్ అవుట్‌లుక్ (ఏడీఓ) నివేదికలో అంచనా వేసింది.2025–26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతంగా అవుట్‌లుక్ విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులకు సేవల రంగం తోడ్పాటును అందిస్తుందని నివేదిక వివరించింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 6.7 శాతం ఎకానమీ వృద్ధి నమోదయినప్పటికీ, రానున్న కాలంలో ఈ రేటు పుంజుకుంటుందన్న భరోసాను నివేదిక వెలిబుచ్చింది. ఎకానమీ 2023–24లో 8.2 శాతం పురోగమించగా, 2024–25లో 7.2 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తోంది. ‘‘ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో భారత్ ఆర్థిక వ్యవస్థ చక్కటి, స్థిరమైన పనితీరు కనబరిచింది’’అని ఏడీబీ కంట్రీ (ఇండియా) డైరెక్టర్ మియో ఓకా చెప్పారు. కాగా, 2024–25లో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతంగా ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది.దక్షిణాసియాకు భారత్ భరోసా: డబ్ల్యూఈఎఫ్ సర్వేఇదిలావుండగా, ఎకానమీ దృఢమైన పనితీరుతో భారత్ మొత్తం దక్షిణాసియా ప్రాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ స్థాయిలో నిలుపుతున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సర్వేలో పాల్గొన్న మెజారిటీ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే గ్లోబల్ రికవరీ పట్ల ఆశావహ దృక్పదాన్ని వెలువరిస్తూనే కొన్ని సవాళ్లూ ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు.ముఖ్యంగా పెరుగుతున్న రుణ స్థాయిలు ఆందోళన కలిగిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. దీనివల్ల మౌలిక, విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ వ్యయాలకు గండిపడే అవకాశం ఉందని అంచనావేశారు. మొత్తంమీద 2024, 2025లో ప్రపంచ ఎకానమీ ఒక మోస్తరు, లేదా పటిష్టంగా పురోగమించడం ఖాయమన్నది వారి అభిప్రాయం. అమెరికా ఎన్నికల ఫలితాలు కూడా ప్రపంచ ఎకానమీపై ప్రభావం చూపే కీలక అంశాల్లో ఒకటిగా ఆర్థికవేత్తలు పేర్కొనడం గమనార్హం. -
అర్హతకు తగిన ఉపాధి లేకపోతే...
నేడు భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి అల్ప ఉద్యోగిత. అర్హత, నైçపుణ్యాలకు తగిన ఉద్యోగానికి బదులు... తక్కువ స్థాయి ఉద్యోగం లభించే స్థితినే అల్ప ఉద్యోగిత అంటారు. ఇది ఆర్థిక వ్యవస్థలో ఉపాధి, శ్రామిక శక్తుల వినియోగానికి కొలమానం. అల్ప ఉద్యోగితకు అనేక కారణాలు ఉన్నాయి. పరిశ్రమల డిమాండ్‌లో మార్పుల కార ణంగా పాత నైపుణ్యాలు కలిగిన కార్మికులకు ఉపాధి దొరకదు. భౌగోళిక అసమానతలు ఉద్యోగ అవకాశాలను పరిమితం చేస్తాయి. లింగ, జాతి లేదా వయస్సు ఆధారంగా చూపే పక్షపాతం వ్యక్తులు తగిన ఉపాధిని పొందకుండా అడ్డుకుంటుంది. కొన్ని రంగాలలో అధిక పోటీ కారణంగా అర్హత కలిగిన అభ్యర్థులు తమ నైపుణ్యానికి సరి పోయే ఉద్యోగాలను పొందడం కష్టమవుతుంది. ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్త రంగంలోకి మారి తగిన ఉద్యోగాలు సంపాదించాలన్నా... ఆ రంగా నికి అవసరమైన నైపుణ్యాల కొరత కారణంగా ఉద్యోగాలు పొందడం కష్టమవుతుంది. అల్ప ఉద్యోగిత వ్యక్తిగతంగానూ, సామాజిక పరంగానూ నష్టదాయకం. వ్యక్తులు తరచుగా ప్రాథమిక అవసరాలు తీరడానికి కూడా ఖర్చు చేయలేరు. అందువల్ల అప్పుల పాలవుతారు. ఆర్థిక అభద్రతకూ గురవుతారు. అల్ప ఉద్యోగిత ఎక్కు కాలం కొనసాగడం వల్ల వ్యక్తుల నైపుణ్యాలు క్షీణిస్తాయి. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలపై ఎక్కువ ఆధారపడటానికి అల్ప ఉద్యోగిత దారి తీస్తుంది. ప్రజా వనరులపై భారం పడుతుంది. ఈ స్థితి ఆర్థిక అసమానతలను పెంచుతుంది. వ్యక్తుల నైపుణ్యాలు పూర్తిగా వినియోగించుకోలేని కారణంగా ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఉత్పాదకత క్షీణించవచ్చు. అల్ప ఉపాధి వల్ల తక్కువ ఆదాయం వస్తుంది కనుక వస్తు వినియోగం తగ్గి ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిరుద్యోగం లాగానే అల్ప ఉద్యోగిత కూడా ప్రపంచ దేశాల సమస్య. దేశాలు, ప్రాంతాలను బట్టి దీని తీవ్రత మారుతూ ఉంటుంది.ముఖ్యంగా స్పెయిన్, గ్రీస్, ఇటలీ దేశాలలో చాలా మంది నైపుణ్యం కలిగిన కార్మికులు తక్కువ జీతాలు పొందుతున్నారు లేదా పార్ట్‌టైమ్ ఉద్యో గాలు చేస్తున్నారు.కొన్ని అధ్యయనాల ప్రకారం భారతదేశంలో అల్ప ఉద్యోగిత 15–20 శాతం ఉన్నట్లు తేలింది. వివిధ రాష్ట్రాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటాను బట్టి... కేరళలో 10–15%, తమిళ నాడులో దాదాపు 10–20%, గుజరాత్, మహా రాష్ట్రల్లో 10–15% వరకు అల్ప ఉద్యోగిత ఉందని అంచనా. ఉత్తరప్రదేశ్‌లో వ్యవసాయం ఎక్కువగా ఉండి ఉద్యోగాల కల్పన పరిమితంగా ఉన్నందున 20–30% అల్ప ఉద్యోగిత ఉంది. బిహార్‌లో వ్యవ సాయంపై ఆధారపడి ఉండటం, తక్కువ పారిశ్రా మిక వృద్ధి జరగడం వల్ల అక్కడ, బహుశా 30% కంటే ఎక్కువ అల్ప ఉద్యోగిత ఉంది. అనేక దేశాలు అల్ప ఉద్యోగితను తగ్గించే లక్ష్యంతో కొన్ని విధానాలను అమలు చేశాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగాల కోసం కార్మికులు సన్నద్ధమయ్యారని నిర్ధారించుకోవడానికి వృత్తి శిక్షణ–నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడిని ప్రోత్సహించడం అందులో ఒకటి. ఉద్యోగ భద్రతను పెంచే విధానాలు చేపట్టడం, పని పరిస్థితులను మెరుగు పరచడం, న్యాయమైన వేతనాలను ప్రోత్సహించడం; గ్రాంట్లు, రుణాలు, శిక్షణ ద్వారా చిన్న వ్యాపార అభివృద్ధిని ప్రోత్సహించడం; పార్ట్ టైమ్ లేదా గిగ్ వర్క్‌కు మద్దతు ఇచ్చే విధానాలు రూపొందించడం వంటి విధానాలను ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. అల్ప ఉద్యోగితను పరిష్కరించడానికి తరచుగా నైపుణ్యాల శిక్షణ, ఆర్థిక మద్దతు, ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించే బహు ముఖ విధానం అవసరం. ప్రభుత్వాలు ఈ దిశలో చర్యలు తీసుకుంటే కొంత పరిష్కారం లభిస్తుంది.డా‘‘ పి.ఎస్. చారి వ్యాసకర్త బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ మొబైల్: 83090 82823