
పక్షుల, పాముల, జంతువుల ప్రవర్తనను చూసీ...ఆకాశం తీరుతెన్నులు గమనించీ, గాలివాటు, దాని వేగం గ్రహించీ వాతావరణాన్ని అంచనా కట్టే గతకాలపు రోజుల నుంచి ఇవాళ ఏం జరుగుతుందో, వచ్చే నాలుగైదు రోజుల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతున్నదో, రాగల సంవత్సరమంతా ఎలాంటి స్థితిగతులుంటాయో స్పష్టంగా వివరించే సమాచారం అందరికీ అందుబాటులో కొచ్చింది.
గత నూట యాభయ్యేళ్లుగా అవిచ్ఛిన్నంగా ఈ పనిలోనే నిమగ్నమై కోట్లాది పౌరులకు చేదోడువాదోడుగా నిలిచిన భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) తన వార్షికోత్సవాన్ని మంగళ వారం ప్రధాని మోదీ సమక్షంలో ఘనంగా నిర్వహించుకుంది. ఒక దేశ విజ్ఞాన శాస్త్ర అవగాహన ఆ దేశంలోని వైజ్ఞానిక సంస్థల ప్రగతిలో ప్రతిఫలిస్తుందని ఈ సందర్భంగా మోదీ చెప్పిన మాట అక్షరసత్యం.
ఈ నూటయాభయ్యేళ్లలో ఐఎండీ సాధించిన ప్రగతి ఇందుకు సాక్ష్యం. ‘వాన రాకడ... ప్రాణం పోకడ’ ఎవరికీ తెలియదనే నానుడి నుంచి మనం చాలా దూరం వచ్చాం. ఇక పోవటం ఖాయమనుకున్న ప్రాణాన్ని నిలబెట్టడానికీ, పునర్జన్మ ఇవ్వడానికీ అధునాతన వైద్య సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకొచ్చాయి. అలాగే వాన ఎక్కడ కురుస్తుందో, దాని తీవ్రత ఏపాటో అంచనా వేయగలుగుతున్నాం.
తుపాను ఏర్పడే అవకాశాలు, దాని గమ్యం, గమనం, అది మోసుకు రాగల విపత్తు గురించీ హెచ్చరించటంతో పాటు కరవుకాటకాల ప్రమాదాన్ని తెలియజెప్పటం ఆ రంగంలో సాధించిన ప్రగతికి తార్కాణం. మూడు రోజుల వరకూ వాతావరణం ఎలా ఉండబోతు న్నదో చెప్పే స్వల్పకాలిక అంచనాలు, పదిరోజుల వరకూ వాతావరణ పోకడల్ని వివరించగల మధ్య శ్రేణి అంచనాలు, నెల పాటు ఏ వారమెలా వుంటుందో తెలియజేయగల సామర్థ్యం ఇప్పుడు మన సొంతం. ఇంకా స్థానిక వాతావరణాలను అంచనా వేయగలిగే దిశగా ఐంఎండీ ముందుకెళ్తోంది.
పేరులో తప్ప జనాభా రీత్యా, సంపద రీత్యా, లేదా విస్తీర్ణం రీత్యా ఏ రకంగానూ ‘గ్రేట్’ అనే పదానికి అర్హత లేని బ్రిటన్ నుంచి వచ్చిన వలస పాలకులు ఈ దేశంలోని వాతావరణ తీరుతెన్నులు చూసి అయోమయంలో పడ్డారు. వీటిని సక్రమంగా అంచనా వేసే సాధనాలు లేకపోతే సరిగా పాలించటం అసాధ్యమన్న నిర్ణయానికొచ్చిన ఫలితంగానే 1875లో సర్ చార్లెస్ చాంబర్లేన్ నేతృత్వంలో ఐఎండీని నెలకొల్పారు.
అంతవరకూ రైతులు సంప్రదాయంగా అనుసరిస్తూ వచ్చిన విధానాలన్నీ క్రమేపీ కనుమరుగై వాతావరణ అధ్యయనం కొత్త పుంతలు తొక్కటం ప్రారంభించింది. కేవలం బ్రిటన్ వాతావరణాన్ని పోలి వుంటుందన్న ఏకైక కారణంతో తమ వెసులుబాటు కోసం సిమ్లాలోని పర్వత ప్రాంతంలో మొదలెట్టిన ఐఎండీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని గ్రహించాక 1928లో పుణేకు తరలిరావటం, ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఢిల్లీకి వెళ్లటం తప్పనిసరైంది.
ఐఎండీ డైరెక్టర్ జనరల్‌గా వచ్చిన గిల్బర్ట్ వాకర్ 1904–1924 మధ్య రెండు దశాబ్దాల సమయంలో భారత వాతావరణంలో చోటుచేసుకున్న అసాధారణతలపై అధ్యయనం చేయటంతో అనేక అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంత పసిఫిక్ మహా సముద్ర జలాలపై ఉండే వాయుపీడనంలో వచ్చే హెచ్చుతగ్గులే ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ స్థితిగతులను ప్రభావితం చేస్తున్నాయని ఆ అధ్యయనం తేల్చాక వాతావరణాన్ని అర్థంచేసుకునే తీరే మారిపోయింది.
పసిఫిక్ జలాలపై ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతలో మైనస్ 17 డిగ్రీల సెల్సియస్ మేరకు హెచ్చితే లాæనినో... ఆ ఉష్ణోగ్రత మైనస్ 17 డిగ్రీల కన్నా తగ్గితే లానినా ఏర్పడు తుందని తేలింది అప్పుడే. ఇదంతా అర్థమయ్యాక రాగల కాలంలో వాతావరణమెలా వుండనున్నదో అంచనా వేయటం సులభమైంది. వాతావరణంలో విడిచిపెట్టే బెలూన్‌లు గాలిలో తేమనూ, ఉష్ణోగ్రతనూ ఇట్టే చెప్పగలుగుతుండగా ఉపగ్రహాలు నేల పరిస్థితుల గురించి సమాచారం ఇస్తున్నాయి.
స్వాతంత్య్రానంతరం వాతావరణాన్ని కొలవటానికి రాడార్ల వంటి ఉపకరణాలు అందుబాటు లోకొచ్చాయి. 1971లో తొలి తుపాను హెచ్చరిక కేంద్రం ఏర్పాటైతే, 1990ల్లో ఇస్రో ఉపగ్రహాలు పంపే డేటాతో వాతావరణ అంచనాల కచ్చితత్వం పెరిగింది. సెకనుకు కొన్ని లక్షల గణనలను చేయగలిగిన అధునాతన సూపర్ కంప్యూటర్ వినియోగం మొదలయ్యాక రుతుపవనాలు, తుపానుల గురించి మాత్రమే కాదు... వడగాల్పులు, వరదల వంటి వైపరీత్యాల గురించి కూడా చెప్పగలుగుతున్నారు.
మన దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో 60 శాతం కేవలం వర్షాధారం కావటం, జనాభాలో మూడింట రెండొంతుల మందికి జీవనాధారం వ్యవసాయమే కావటం వల్ల ఐఎండీ చెప్పే అంచనాలు ఎంతో అవసరం. అందుకే వర్షాలు సరిగ్గా ఎక్కడ పడతాయో, ఏ ప్రాంతంలో వడగాడ్పులు వీచవచ్చో, ఎక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నదో కూడా పదేళ్లుగా చెప్పగలుగుతోంది. కృత్రిమ మేధ దీన్ని మరింత పదునెక్కించింది.
ఐఎండీ అంచనాల వల్ల ప్రభుత్వాలు అప్రమత్తమై లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించటం, వేలాది ప్రాణాలను కాపాడుకోవటం సాధ్యమవుతోంది. ఇది మున్ముందు ఇంకా విస్తరించి కనీసం అయిదురోజుల ముందు 90 శాతం కచ్చితత్వంతో చెప్పగలిగే విధానాలను అభివృద్ధి చేసుకోవాలనీ, ఆఖరికి భూకంపాల రాకడను సైతం పసిగట్టగలగాలనీ ఐఎండీ 2047 విజన్ డాక్యుమెంటు విడుదల సందర్భంగా మోదీ చేసిన సూచన శిరోధార్యం.
ఈ అంచనాలు మన దేశానికి మాత్రమే కాదు...ఆసియా ప్రాంత దేశాలకు సైతం ఎంతో మేలుచేస్తాయి. పంటల దిగుబడిపై, ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులపై మరింత మెరుగైన అంచనాలకు తోడ్పడతాయి.
Comments
Please login to add a commentAdd a comment