దేశ రాజధానిలో 60 శాతం అధికంగా కుంభవృష్టి కురిపించి, వారంరోజులు ఆలస్యంగా నైరుతీ రుతుపవనాలు నిష్క్రమించాయో లేదో అక్కడి వాయు కాలుష్యంపై యథాప్రకారం చర్చ మొదలైంది. వాయు నాణ్యత మెరుగుదలకు తీసుకున్న చర్యలేమిటని గురువారం సర్వోన్నత న్యాయస్థానం హరియాణా, పంజాబ్ ప్రభుత్వాలను నిలదీసింది. వాయు కాలుష్యం ఉగ్రరూపం దాలుస్తోందని, రైతులు పంట వ్యర్థాలు తగులబెట్టకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది.
గోధుమ పంట చేతికొచ్చాక వ్యర్థాలను తొలగించటం ఖర్చుతో కూడుకున్నదన్న కారణంతో రైతులు అక్కడే తగలబెడతారు. ఆ మంటలకు పంటభూమిలోని పోషకాలు, పంటలు ఏపుగా పెరగడానికి తోడ్పడే సూక్ష్మజీవులు నశిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ వ్యర్థాలను సేకరించి ఇతరేతర పదార్థాలతో మిశ్రమం చేసి సేంద్రియ ఎరువుగా మార్చవచ్చని సూచిస్తున్నారు. కానీ దీన్ని రైతులకు చేరేయ టంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి.
రైతులకయ్యే వ్యయాన్ని భరిస్తే ఈ సమస్య చాలావరకూ తగ్గుతుందని గతంలో సుప్రీంకోర్టు ఢిల్లీ, పంజాబ్, హరియాణాలకు సలహా ఇచ్చింది. కానీ పట్టించుకున్నవారేరి? దానిసంగతలావుంచి సుప్రీం సూచనతో ఏర్పాటైన కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) సమావేశాలే సక్రమంగా జరగటం లేదు. ఆగస్టు నెలాఖరున జరిగిన కమిషన్ సమావేశానికి 11 మంది సభ్యుల్లో అయిదుగురే హాజరయ్యారంటే...అందులో పంట వ్యర్థాల విషయంపై చర్చించనేలేదంటే కమిషన్ తీరుతెన్నులెలా వున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఢిల్లీలో సాధారణంగా అక్టోబర్ మధ్యనుంచి వాయు కాలుష్యం పెరగటం మొదలై నవంబర్ నాటికి ఉగ్రరూపం దాలుస్తుంది. పర్యవసానంగా నగర జీవితం అస్తవ్యస్తమవుతుంది. పాఠశాలల పనివేళలు మార్చటం, ప్రభాతవేళ ఆరుబయట వ్యాయామాలు చేయొద్దని పౌరులకు సూచించటం వంటివి మొదలవుతాయి. వాయు కాలుష్యానికి మూలం ఎక్కడుందో గుర్తించటానికే దీర్ఘకాలం పట్టగా, అనంతర చర్యలైనా చురుగ్గా ముందుకు కదలటం లేదు.
కాలుష్యంలో 70 శాతం వాటా వాహనాలదేనని ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) తేల్చి కూడా చాన్నాళ్లయింది. ఆ తర్వాతి స్థానం పరిశ్రమలదేనని కూడా ఆ నివేదిక చెప్పింది. కానీ ఆ దిశగా పెద్దగా అడుగులు పడలేదు. మన దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ శక్తిమంతమైనది. దాదాపు అయిదు లక్షల కోట్ల టర్నోవర్ గల ఆ పరిశ్రమ రెండున్నర కోట్లమందికి ఉపాధి కల్పిస్తోంది.
అందువల్ల వాటి జోలికి పోయేందుకు ప్రభుత్వాలు సిద్ధపడవు సరికదా... వాహనాల అమ్మకాలు పెరగటానికి, ఆ పరిశ్రమల లాభార్జనకూ భిన్నరూపాల్లో తోడ్పాటునందిస్తాయి. మార్కెట్‌లోకొచ్చే వాహనాలు కాలుష్య కారకాలుగా ఉంటున్నాయని తేలినా నిర్లిప్తంగా ఉండిపోయిన సందర్భాలు గతంలో కోకొల్లలు. 2005 నుంచి అందుబాటులోకొచ్చిన బీఎస్ 3 (భారత్ స్టేజ్ 3) ప్రమాణాలున్న వాహనాలు అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఆరోపణలొచ్చినా చర్య తీసుకునేందుకు ఏ వ్యవస్థా సిద్ధపడలేదు.
ఆ ప్రమాణాలతో విడుదలైన ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు కార్లు, భారీ కమర్షియల్ వాహనాలపై చర్యలు తీసుకోలేదు. చివరకు సుప్రీంకోర్టే బీఎస్ 3 ప్రమాణాలున్న వాహనాల విక్రయాన్ని 2017లో నిషేధించింది. వీటి సంగతలావుంచి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచటానికి అవసరమైన పథకాల రూపకల్పన సక్రమంగా ఉండదు. త్వరితగతిన పనులు పూర్తిచేసుకోవాలంటే సొంత వాహనాలే దిక్కన్న అభిప్రాయం పౌరుల్లో స్థిరపడిపోయింది. దీనికి తోడు ప్రజా రవాణా కోసం ఇప్పటికీ చాలా రాష్ట్రాలు డీజిల్ బస్సులే వాడుతున్నాయి.
విద్యుత్, సీఎన్‌జీ వాహనాల వినియోగం మొదలైనా వాటి సంఖ్య స్వల్పం. ఢిల్లీ మెట్రో నిడివి ప్రస్తుతం దాదాపు 400 కిలోమీటర్ల మేర ఉంది. దాన్నింకా పెంచటానికి కృషిచేస్తున్నారు. ఈ సర్వీసును బస్సులతో అనుసంధానించి మారుమూల ప్రాంతాలకు కూడా సులభంగా వెళ్లగలిగే సదుపాయం కల్పిస్తే సొంత వాహనాల వినియోగం తగ్గుతుంది. ఇక ఏదైనా అనుకోనిది జరిగితే తప్ప పరిశ్రమలపై సాధారణంగా ప్రభుత్వాలు చర్యలకు సిద్ధపడవు.
నిర్దిష్ట కాల వ్యవధిలో నిర్వహించే తనిఖీలు చాలా సందర్భాల్లో లాంఛనప్రాయమవుతాయి. జరిమానాల వంటివి విధించినా అవి నామ మాత్రంగానే ఉంటున్నాయి. ఉపాధి కల్పనకూ, సంపద వృద్ధి కావటానికీ పరిశ్రమలు అవసరమే. కానీ ప్రజారోగ్యంతో ఆటలాడుకునేవారినీ, చట్టాలను ఉల్లంఘించేవారినీ దండించాల్సిందే.
వాయు కాలుష్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. రుతుపవనాలు నిష్క్రమించి శీతాకాలం ఇంకా ప్రవేశించని అక్టోబర్ నెల ఒకప్పుడు ఢిల్లీలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదని న్యాయమూర్తులు అన్న మాటల్లో వాస్తవం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ఉండే ఆ వాతావరణం ఇప్పుడు ఎందుకు మాయమైంది? కారకులెవరు? చిత్తశుద్ధితో ఆలోచించాలి.
కాలుష్యంలో తమ బాధ్యత లేదని, పొరుగు రాష్ట్రమే ఈ సమస్యకు కారణమని పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌లు పరస్పరారోపణలు చేసుకోవటం రివాజుగా మారింది. అటు కేంద్రం సైతం మొత్తం భారాన్ని రాష్ట్రాలపై వేసి తప్పుకుంటోంది. ఏతావాతా సమస్య యథాత థంగా మిగిలిపోతున్నది.
ఈ వైఖరి సరికాదు. ఇటీవల వెలువడిన లాన్సెట్ నివేదిక వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో ఏటా 12,000మంది మరణిస్తున్నారని తేల్చింది. అందుకే అందరూ మేల్కొ నాల్సిన సమయమిది. ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా కార్యాచరణకు దిగి తమవంతు బాధ్యత నెరవేర్చటంతోపాటు కాలుష్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి.
వాయు కాలుష్యంపై మొద్దునిద్ర
Published Fri, Oct 4 2024 4:28 AM | Last Updated on Fri, Oct 4 2024 4:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment