ప్రాణవాయువే... ప్రాణాంతకంగా మారితే అంతకన్నా ఘోరం ఉంటుందా? కాలుష్యం దెబ్బకు గాలి నాణ్యత గణనీయంగా పడిపోయిందనే కారణంతో ఏకంగా దేశరాజధానిలో కొద్ది రోజులు లాక్డౌన్ పెట్టే ఆలోచన చేస్తున్నారంటే ఇంకేమనాలి? దట్టంగా కమ్మేసిన వాయు కాలుష్యం... యమునా నదిని నింపేసిన విషపు నురగలతో జల కాలుష్యం... గత పది రోజుల్లో రెండున్నర వేలకు పైగా కొత్త డెంగ్యూ కేసులు... ఉన్నట్టుండి పెరుగుతున్న కోవిడ్ కేసులు – ఇలా ఢిల్లీలో పరిస్థితులు దయనీయం అనిపిస్తున్నాయి. సోమవారం సుప్రీమ్ కోర్టు వేసిన మొట్టికాయలను బట్టి చూస్తే, ఏయేటికాయేడు పెరుగుతున్న కాలుష్య సమస్యపై దృష్టి పెట్టని పాలకుల నిర్లక్ష్యం వెక్కిరిస్తోంది.
చలి పెరిగేవేళ, ప్రధానంగా కొయ్యకాళ్ళు కాల్చే అక్టోబర్ చివర నుంచి నవంబర్ వరకు ఒక పక్క వాతావరణం, మరోపక్క ఇతర కాలుష్యాలు కలగలిసి ఢిల్లీలో ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి. ఏడెనిమిదేళ్ళుగా ఇది చర్చనీయాంశమే. ఈ ఏడాది పంటకోతలు ఆలస్యమై, అక్టోబర్‌లో పరిస్థితి మెరుగ్గా ఉంటుందని ఆశలు రేపింది. కానీ, నవంబర్ మొదట్లో దీపావళి టపాసులు, పక్క రాష్ట్రాలలో పెరిగిన పంట వ్యర్థాల మంటలు తోడై, ఈ నెలలో తొలి పది రోజులూ ఢిల్లీలో వాయుకాలుష్యం తారస్థాయికి చేరింది. గాలి గరళంలా మారడంతో నవంబర్ 13న సుప్రీమ్ కోర్టు కొరడా జుళిపించింది. ఢిల్లీ సర్కారు అత్యవసరంగా సమావేశమై, కరోనా తర్వాత మొన్నామధ్యే తెరిచిన స్కూళ్ళను సైతం మూసేసి, నిర్మాణ కార్యకలాపాలకు బ్రేక్ ప్రకటించింది. లాక్డౌన్‌కు కూడా సిద్ధమైంది.
ప్రపంచ కాలుష్య నగరాల్లో ముందు వరుసలో ఉన్న ఢిల్లీలో ఏడాది పొడుగూతా ‘వాయు నాణ్యత సూచి’ (ఏక్యూఐ) ఆందోళనకరమే. సగటున గంటకో చెట్టు నరికివేతకు గురవుతోందని లెక్కిస్తున్న ఢిల్లీలో దుమ్ము ధూళి, పరిశ్రమలు, వాహనాల లాంటి అనేక కాలుష్య కారణాలున్నాయి. కేవలం 3 వేల చిల్లర ప్రభుత్వ బస్సులే నడుస్తున్నాయనీ, ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో గత ఏడేళ్ళలో కొత్త బస్సుల ఊసే లేదనీ ప్రతిపక్ష ఆరోపణ. ఏమైనా, ఢిల్లీలో ప్రైవేట్ వాహనాల సంఖ్య యథేచ్ఛగా పెరుగుతోంది. ఇక, పంటపొలాల మంటలు చుట్టుపక్కలి హర్యానా, పంజాబ్ మీదుగా రాజధాని దాకా వ్యాపిస్తున్న సమస్య. ఢిల్లీ హైకోర్టు, సుప్రీమ్ కోర్టు కొన్నేళ్ళుగా పంజాబ్ సహా అనేక ఉత్తరాది రాష్ట్రాలను కాలుష్యంపై హెచ్చరిస్తూనే వస్తున్నాయి. ఫలితం లేదు. యమునా నది శుద్ధీకరణకు రూ. 4 వేల పైగా కోట్లు పాలకులు ఖర్చు పెట్టారంటున్నా, జరిగిందేమిటో నురగ రూపంలో కనిపిస్తోంది.
మంగళవారం సాయంత్రానికల్లా నిర్దిష్టమైన ప్రణాళికతో రావాలని సుప్రీమ్ కోర్టు చెప్పడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. ఆ మాటకొస్తే – ప్రచార ప్రకటనల కోసం ఢిల్లీ ప్రభుత్వం పెడుతున్న వందల కోట్ల ఖర్చులో కాలుష్య నివారణకు పెడుతున్నది ఎంత అని సర్వోన్నత న్యాయస్థానమే నిలదీసిందంటే, పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరోపక్క ఢిల్లీ కాలుష్యానికి ఏది, ఎంత కారణమనే విషయంలో కేంద్రం సైతం తడవకో మాట మాట్లాడడం విచిత్రం. పంట కోసిన తరువాత మిగిలిన కొయ్యకాళ్ళను కాల్చడం ద్వారా రాజధానిలో తలెత్తుతున్న కాలుష్యం వంతు 10 శాతం లోపేనని కేంద్రం సోమవారం పేర్కొంది. కానీ, వరి మోళ్ళు 35 నుంచి 40 శాతం మేర కాలుష్యానికి కారణమన్న కమిటీ మాటలను కేంద్రమే తన అఫిడవిట్‌లో మరోచోట పేర్కొనడం విచిత్రం. ఏమైనా, ఢిల్లీలో గాలి నాణ్యత సూచి 500 దాటేయడం ఆందోళనకరం. పంట పొలాల పొగేæ కాదు... పరిశ్రమలు, రవాణా సహా ఇంకా అనేకం ఈ దుఃస్థితికి కారణం. ప్రభుత్వాలు మాత్రం సమస్యను వదిలేసి, రైతుల తప్పును ప్రస్తావిస్తూ రాజకీయాలు చేస్తుండడమే విచారకరం.
నిజానికి, పంట కోసేశాక, మిగిలిన వరి దుబ్బులనే ఇలా కాలుస్తున్నారనుకోవడం తప్పు. పత్తి, చెరకు, కాయధాన్యాలు, గోదుమలు – ఇలా అనేక పంటలకు పంజాబ్, హర్యానాల్లో ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. అందుకే, ఉత్తర భారతంలో కాలుష్య సమస్య మరింత తీవ్రంగా ఉంది. రైతుల వైపు నుంచి చూస్తే, కొయ్యకాళ్ళను వెంటనే తొలగిస్తే కానీ, తరువాతి పంట వేసుకోలేరు. అందుకు తగిన యంత్ర సామగ్రి అందుబాటులో లేకపోవడంతో, కాలుష్యమని తెలిసినా సరే కాల్చడమే మార్గమవుతోంది. ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి. వాయు ఉద్గారాలు లేకుండా, పంట వ్యర్థాలను ఇంధనంగా, ఎరువుగా మార్చే చౌకైన, పోర్టబుల్ యంత్రాన్ని రూపొందించి, అవార్డందుకున్న ‘తకచర్’ సంస్థ లాంటి వాటి అనుభవాన్ని ఉపయోగించుకోవాలి.
తాజా పర్యావరణ సదస్సు ‘కాప్–26’లో ప్రపంచ పరిరక్షణకు వాగ్దానాలు చేసిన మన ప్రభుత్వం, అంతకన్నా ముందుగా మన ‘జాతీయ రాజధాని ప్రాంతం’ (ఎన్సీఆర్)పై దృష్టి పెట్టడం అవసరం. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటికి రెండు మన నగరాలే కాబట్టి, నివారణ చర్యల్లో చైనా లాంటి దేశాల అనుభవాలను ఆదర్శంగా తీసుకోవాలి. విద్య మొదలు ఆర్థిక వ్యవస్థ దాకా అన్నీ స్తంభించే లాక్డౌన్ లాంటివి తాత్కాలిక ఉపశమనమే తప్ప, దీర్ఘకాలిక పరిష్కారాలు కాలేవు. అందుకే, ఇప్పటికైనా ఉత్తరాది రాష్ట్రాల పాలకులను ఒకచోట చేర్చి, కాలుష్యంపై ప్రణాళిక రూపకల్పనకు కేంద్రం చొరవ తీసుకోవాలి. కాలుష్యానికి కారణం వ్యవసాయ వ్యర్థాలా, వాహనాలా, పారిశ్రామిక ఉద్గారాలా అనే రాజకీయ చర్చ, పరస్పర రాజకీయ నిందారోపణలు మాని, పనిలోకి దిగడం మంచిది. ఎందుకంటే, ఈ అసాధారణ వాతావరణ ఎమర్జెన్సీ వేళ అసాధారణ రీతిలో స్పందించడమే అత్యవసరం. మీనమేషాలు లెక్కిస్తే... మొదటికే మోసం!
ఆ గాలిలోనే... గరళం
Published Tue, Nov 16 2021 1:03 AM | Last Updated on Tue, Nov 16 2021 10:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment