ఢిల్లీ: ఢిల్లీ కాలుష్యంపై సరైన చర్యలు తీసుకోకపోవటంలో విఫలమైనందుకు సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వంతో పాటు హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించటంపై సమావేశాలు జరపటం తప్ప క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకోవలేదని అసహనం వ్యక్తం చేసింది.
పంట వ్యర్థాలను కాల్చుతూ.. కాలుష్యానికి కారణమవుతున్న రైతులపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని సూటిగా ప్రశ్నించింది. ఈ క్రమంలో తమ ఆదేశాలను పాటించటం లేదని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఎక్యూఎం)పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు పంట వ్యర్థాలు కాల్చిన వారి నుంచి నామమాత్రపు జరిమానాలు మాత్రమే వసూలు చేస్తోందని తెలిపింది.
‘‘కాలుష్య నియంత్రణ మండలి చివరి సమావేశం ఆగస్టు 29న జరిగింది. అందులో పంట వ్యర్థాల దహనంపై ఎలాంటి చర్చా జరగలేదు. సెప్టెంబర్ నెలలో ఒక్క సమావేశం కూడా జరగలేదు. సమావేశాలకు చాలా మంది కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు హాజరు కాలేదు. కాలుష్య నియంత్రణపై నిర్లక్ష్యంగా ఉన్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికి నామమాత్రపు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోవటం లేదు’’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
ఇక.. ఈ విషయంపై కేంద్రం ప్రభుత్వం, ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనంతరం సుప్రీంకోర్టు తదుపరి విచారణ అక్టోబర్ 16కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment