ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకూ వాయు నాణ్యత క్షీణిస్తోంది. వాయుకాలుష్యం విపరీతంగా పెరగడంతో కట్టడి చర్యల్లో భాగంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్)–3 నియమనిబంధనలను కాలుష్య నియంత్రణ మండలి అమలు చేస్తోంది. తాజాగా ఢీల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కాలుష్య నిరోధక నాలుగో దశ చర్యలు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.
నిత్యావసరేతర వస్తువులు తీసుకొచ్చే ట్రక్కులు నగరంలోకి ప్రవేశించకుండా పోలీసు బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిషేధం ఉన్నప్పటికీ కాలుష్య కారక డీజిల్ ట్రకులు, బస్సులు రోడ్లపై తిరుగుతుండటంపై ప్రముఖ మీడియాలో వార్త కథనాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే 113 ప్రవేశ మార్గాల వద్ద చెక్‌పోస్టులను తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. జీఆర్‌ఏపీ-IV ఆంక్షలు సడలించాలా? వద్దా? అన్న విషయంపై వచ్చే వారం సమీక్షిస్తామని తెలిపింది.
ఇక జీఆర్‌ఏపీ 4 నిబంధనల ప్రకారం విద్యుత్, సీఎన్‌జీ, భారత్–6 ప్రమాణాల డీజిల్ బస్సులు మినహా ఇతర అంతర్రాష్ట బస్సులను ఎన్‌సీఆర్ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి అనుమతించబోరు. నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం అమల్లో ఉంటుంది. గనుల తవ్వకాన్నీ ఆపేస్తారు.
ఢిల్లీ సహా గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ్ నగర్ జిల్లాల్లో భారత్–3, భారత్–4 ప్రమాణాల డీజిల్ వాహనాల రాకపోకలను నిషేధించారు. అత్యధిక రద్దీ సమయాల్లో రోడ్లపై నీటిని చిలకరించనున్నారు. ఎవరికి వారు బైకులు, సొంత కార్లలో కాకుండా ప్రజారవాణా వ్యవస్థను వాడుకోవాలని సీఏక్యూఎం సూచించింది. ఐదోతరగతి వరకు ప్రైమరీ పాఠశాల క్లాసులను ఆన్‌లైన్‌లో చేపట్టాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment