ఈ నగరానికి ఏమైంది? | Sakshi Editorial Special Story On Why Air Pollution Increasing In Delhi, Explained In Telugu - Sakshi
Sakshi News home page

Delhi Air Pollution: ఈ నగరానికి ఏమైంది?

Published Wed, Nov 8 2023 4:40 AM | Last Updated on Wed, Nov 8 2023 10:09 AM

Sakshi Editorial On Delhi Air pollution

ప్రభుత్వాల మధ్య ఆరోపణల పర్వం వింత కాకపోవచ్చు. కానీ, పర్యావరణ అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిందారోపణలు సాగడం విచిత్రమే. దేశ రాజధానిలోని వాయు కాలుష్యం వ్యవహారంలో ఇప్పుడు కేంద్రానికీ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికీ నడుమ చోటుచేసుకుంటున్నది అదే. ఢిల్లీ – ఎన్సీఆర్‌ (దేశ రాజధాని ప్రాంతం)లో మంగళవారం సైతం వాయునాణ్యత ‘తీవ్ర ఆందోళన దశ’లో ఉన్న వేళ... చివరకు సర్వోన్నత న్యాయస్థానం సైతం జోక్యం చేసుకుంది.

వాయు కాలుష్యాన్ని ఓ రాజకీయ పోరుగా మార్చరాదనీ, గాలి నాణ్యత ప్రజారోగ్యాన్ని హత్య చేస్తోందనీ న్యాయస్థానం చెప్పాల్సి వచ్చింది. పొరుగున పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో పంట వ్యర్థాలను తగలబెట్టడమే ఏటా చలికాలంలో ఢిల్లీ వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని కోర్ట్‌ అభిప్రాయపడింది. రాష్ట్రాలన్నీ ఈ కొయ్యకాళ్ళ దహనాన్ని ఆపాలని ఆదేశించింది. ఢిల్లీలో కాలుష్యం తగ్గించడానికి సరి – బేసి వాహనాల ట్రాఫిక్‌ నియంత్రణ విధానాన్ని మళ్ళీ తేవాలన్న ఢిల్లీ ఆప్‌ సర్కార్‌ నిర్ణయం కంటితుడుపేనని కోర్ట్‌ కుండబద్దలు కొట్టడం పరాకాష్ఠ.

ఢిల్లీ పరిసరాల్లో వాయునాణ్యత తృప్తికరమైన దాని కన్నా నాలుగు రెట్లు క్షీణించి, మంగళవారం సైతం వాయు నాణ్యత సూచి దాదాపు 400 మార్కుకు దగ్గరగా నిలిచిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డ్‌ మాట. ఏడేళ్ళ తర్వాత కాలుష్యం దెబ్బతో స్కూళ్ళు మూతబడ్డాయి. ఇప్పటికే ఆఫీసులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పెట్టారు. దట్టమైన పొగ నిండిన రోడ్లతో, గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ, ముక్కులకు మాస్కులు తగిలించుకొని సాహసించి జనం బయటకు రావాల్సిన పరిస్థితి.

ఈ కాలుష్య బాధ నుంచి తప్పించుకోవడానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో పర్యాటకులు హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలకు తరలిపోయిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో తిరిగాయి. మనుషులే కాదు మూగజీవాలైన పక్షులూ పెద్దయెత్తున అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి. ఉన్నంతలో వాహన కాలుష్యాన్ని తగ్గించాలని ఈ నెల 13 నుంచి సరి – బేసి విధానం పాటిస్తామని ఢిల్లీ సర్కార్‌ ప్రకటించింది. 2019 తర్వాత ఢిల్లీలో మళ్ళీ ఈ పద్ధతిని తేవడం ఇదే తొలిసారి. పరిస్థితి తీవ్రతకు ఇది ప్రతీక.

ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి ఒక్కసారిగా పెరిగిపోవడం, పరిసర రాష్ట్రాల్లో కొయ్యకాళ్ళను కాల్చడం లాంటివి కనీసం పదేళ్ళుగా చూస్తున్నాం. కొన్నేళ్ళుగా ఇది రాజకీయ అంశమూ అయింది. పంట వ్యర్థాలను తగలబెడుతున్నవారిపై చర్యలు తీసుకోవడంలో పొరుగున ప్రత్యర్థి పార్టీలు అధికా రంలో ఉన్న పంజాబ్, హర్యానాలు విఫలమవుతున్నాయని ఢిల్లీ ఆప్‌ సర్కార్‌ గతంలో ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు పంజాబ్‌లో సొంత సర్కారే ఉన్నా, పరిస్థితిలో మార్పు లేదు.

విడ్డూరమేంటంటే, పర్యావరణ అంశాలకు వచ్చేసరికి సుప్రీమ్‌ కోర్టే ప్రతిసారీ జోక్యం చేసుకోవాల్సి రావడం! ‘పర్యావ రణ పరిరక్షణ కోర్టు బాధ్యత అనుకోవడం తప్పు. వాయు, శబ్ద కాలుష్య నియంత్రణ బాధ్యత ప్రతి ఒక్కరిదీ’ అని సుప్రీమ్‌ మరో కేసులోనూ హితవు పలకాల్సొ చ్చింది. టపాసుల్లో నిర్ణీత రసాయనాల వాడకంపై నిషేధం ఢిల్లీకే కాక, అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని కుండబద్దలు కొట్టాల్సి వచ్చింది.

రాజధానిలో ఇంత రచ్చ జరుగుతున్నా, పంజాబ్‌ లాంటి చోట్ల ఇప్పటికీ యథేచ్ఛగా మోళ్ళ కాల్చివేత కొనసాగుతూనే ఉంది. ఇటీవల పంజాబ్‌లో ఈ దహనాలు 740 శాతం మేర హెచ్చాయి. ఒకే రోజు వెయ్యి నుంచి 3 వేల పైగా అలాంటి ఘటనలు రికార్డవుతున్నాయి. ఫలితంగా ఏటా నవంబర్, జనవరి మధ్యన ఢిల్లీ వాయునాణ్యత దారుణంగా పడిపోవడం రివాజైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు తప్పును పక్కవారి మీదకు నెట్టివేస్తే లాభం లేదు.

ఢిల్లీలోని ఈ వాయు కాలుష్యాన్ని జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలి. స్థానిక అవసరాలు, దీర్ఘకాలిక సంప్రదాయా లను దృష్టిలో పెట్టుకొంటూనే మోళ్ళను కాల్చడాన్ని నిషేధిస్తూ, కేంద్ర స్థాయిలో చట్టం తీసుకు రావచ్చు. దశాబ్దాల క్రితమే అమెరికా లాంటి చోట్ల తెచ్చిన కఠినమైన చట్టాలు ఫలితాన్నిచ్చాయి. అయితే, పంజాబ్‌ లాంటి చోట్ల మోళ్ళ కాల్చివేతను నిషేధిస్తూ, చట్టమున్నా అమలు శూన్యం. 

అందుకే, వట్టి చట్టం చేయడం కన్నా అందరూ పాటించే ఆచరణాత్మక మార్గం చూడడం ఉత్తమం. నిజానికి, ఖరీఫ్‌లోని పంట కోత తర్వాత, రబీ సీజన్‌కు 10 నుంచి 14 రోజుల్లో రైతులు త్వరితగతిన పొలాల్ని సిద్ధం చేయాలి. అందుకు వరి మోళ్ళను తగులబెట్టడమే మార్గమని వారి భావన. ఈ పరిస్థితుల్లో హానికారక కాలుష్యంపై చైతన్యం పెంచాలి. పంట వ్యర్థాలను వదిలించుకొనేందుకు ఆధునిక ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి.

దాదాపు 3.3 కోట్ల జనాభాకు నివాసమైన దేశ రాజధాని ఇవాళ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరం. ఈ గాలి పీల్చడం వల్ల ఢిల్లీ వాసులకు శ్వాసకోశ వ్యాధులు రావడమే కాదు, సగటు ఆయుర్దాయం దాదాపు 11.9 ఏళ్ళు తగ్గుతోందని చికాగో విశ్వవిద్యాలయ అధ్యయనం. గతంలో బీజింగ్, లండన్‌ లాంటివీ ఈ సమస్యను ఎదుర్కొని బయటపడ్డవే. వారి అనుభవాల నుంచి పాఠాలు నేర్వాలి.

ఢిల్లీలో స్మోక్‌ టవర్ల ఏర్పాటును పెంచాలి. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరిగేలా సబ్సిడీలతో ప్రోత్సహించాలి. కేంద్రం సైతం వాయుకాలుష్య పరిష్కారం తన బాధ్యత కాదని చేతులు దులుపు కోలేదు. ముందుకొచ్చి, నిర్ణీత బడ్జెట్‌ కేటాయింపుతో సమస్య తీవ్రత ఉన్న ఢిల్లీ లాంటి రాష్ట్రాలకు అండగా నిలవాలి.

ఢిల్లీ లాంటి చోట్ల బయో డీకంపోజర్లను తెస్తామంటూ భారీ వాగ్దానాలు, ప్రచారం చేసి ఇప్పుడా ఊసే ఎత్తని పాలకపక్షాలు సమన్వయంతో సమగ్ర కార్యాచరణకు దిగితేనే సత్ఫలితాలు వస్తాయి. లేదంటే, ప్రతి ఏటా ఇదే వాయు కాలుష్యం మాట వినాల్సి వస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement