ముంబై: మళ్లీ ముంబై, ఢిల్లీ పోటీ పడ్డాయి. కానీ ఈసారి పోటీ పడింది వాయు కాలుష్యంలో. ఎప్పుడైనా వాయు కాలుష్యంలో ఢిల్లీ ముందుంటుంది. కానీ.. ఈసారి ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత 300 కంటే ఎక్కువగా నమోదు అయ్యింది. దేశ రాజధానిని ముంబై ఓడించినట్లు కనిపిస్తోంది. సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ డేటా ప్రకారం, బుధవారం ఉదయం 9 గంటలకు ముంబైలోని గాలి నాణ్యత 113 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)తో ‘మోడరేట్’ కేటగిరీలో నమోదు అయింది. అందుకు భిన్నంగా ఈ రోజు దేశ రాజధానిలో గాలి నాణ్యత మొత్తం 83తో ‘సంతృప్తికరమైన’ కేటగిరీలో ఉంది.
ప్రమాదకర ప్రాంతాలు..
ముంబై గాలి నాణ్యత ఇండెక్స్ సఫర్ ప్రకారం, బాంద్రా కుర్లా ప్రాంతంలోని కాలానగర్‌లో గాలి నాణ్యత 178కి చేరుకుంది. వర్లీ, భాండూప్, బోరివలి వంటి ప్రాంతాల్లో వరుసగా 139, 131, 135 వద్ద నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటా ప్రకారం, డియోనార్ వంటి ప్రాంతాల్లో గాలి నాణ్యత ఇండెక్స్ 216, చెంబూర్ 213 నమోదైంది. ముంబైలో మొత్తం గాలి నాణ్యత ‘మధ్యస్థంగా’ ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకరంగా నమోదైంది.
అంధేరీ–346, నవీ ముంబై –311, మజ్‌గావ్–307 నమోదయ్యాయి. విలే పార్లే వెస్ట్ 331, అంధేరి ఈస్ట్ 343 నమోదైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నగర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. గాలి నాణ్యత తక్కువగా ఉండటంతో ప్రజలు ఎక్కువగా బయట తిరగవద్దని, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేయాలని కోరింది. కాగా, పశ్చిమ కనుమల నుండి వీస్తున్న చల్లని గాలులు తీరం వెంబడి వెచ్చని గాలిని తాకడం వల్ల ఈ పొల్యూషన్ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
గాలి నాణ్యత ప్రమాణాలు
గాలి నాణ్యత ఇండెక్స్ 0 నుంచి 50 వరకు నమోదైతే సంతృప్తికరంగా ఉన్నట్టు. వాయు కాలుష్యం తక్కువగా ఉండి, ఎటువంటి ప్రమాదం ఉండదు. 51 నుంచి 100 కూడా కొంతమేరకు ఆమోదయోగ్యమైనది. 101 నుంచి 150 నమోదైతే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రమాదం. 151 నుంచి 200 నమోదైతే ఆరోగ్య సమస్యలున్నవారితోపాటు సాధారణ ప్రజానీకం కూడా కొందరు ప్రభావితమవుతారు. 201 నుంచి 300 నమోదైతే మాత్రం ప్రమాదకర పరిస్థతి ఉన్నట్టు. ఇది సాధారణ ప్రజల మీద ఆరోగ్యం మీదా ప్రభావం చూపుతుంది. 301, ఆపైన నమోదైతే అత్యవసర పరిస్థితులు ఉన్నట్టు. గాలి కాలుష్యం ఈ మేరకు ఉంటే ప్రతి ఒక్కరూ అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది.
చదవండి: ‘గాజాలోని భారతీయుల తరలింపు.. ప్రస్తుతం కష్టమే’
Comments
Please login to add a commentAdd a comment