గాలిలోనూ గరళమేనా? | Sakshi Editorial On Air Pollution | Sakshi
Sakshi News home page

గాలిలోనూ గరళమేనా?

Published Fri, Mar 17 2023 2:38 AM | Last Updated on Fri, Mar 17 2023 2:38 AM

Sakshi Editorial On Air Pollution

సంవత్సరాలు మారుతున్నా దేశంలో కాలుష్య పరిస్థితులు మాత్రం మెరుగుపడుతున్నట్టు లేదు. ప్రభుత్వాలు చర్యలు చేపట్టామంటున్నా, వాయు కాలుష్య స్థాయి ఆందోళనకరంగానే కొనసాగుతోంది. భారతదేశ వాయు నాణ్యతా సూచి ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. ప్రపంచంలోని వివిధ రాజధానుల్లోకెల్లా రెండో అత్యంత కలుషిత రాజధానిగా, మొత్తం నగరాల లెక్కలో నాలుగో స్థానంలో నిలిచి ఢిల్లీ అప్రతిష్ఠ మూటగట్టుకుంది.

ప్రపంచంలోని 50 అగ్రశ్రేణి కాలుష్య నగరాల్లో 39 భారత్‌లోవే. స్విట్జర్లాండ్‌కు చెందిన వాయు నాణ్యతా టెక్నాలజీ సంస్థ ‘ఐక్యూ ఎయిర్‌’ మార్చి 14న విడుదల చేసిన అయిదో వార్షిక ‘ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక–2022’లోని సంగతులివి. ఇవన్నీ మనల్ని అప్రమత్తం చేస్తున్నాయి. పౌరులు స్వచ్ఛమైన గాలి పీల్చి, ఆరోగ్యంగా జీవించాలంటే కాలుష్య నివారణకు తక్షణ చర్యలే శరణ్యమని పాలకులకు గుర్తు చేస్తున్నాయి. 

ప్రపంచంలోని 131 దేశాల్లో 7,327 ప్రాంతాల్లో 30 వేలకు పైగా వాయునాణ్యతా పరిశీలక కేంద్రాలు పెట్టి, డేటా సేకరించి, ఈ నివేదికను సిద్ధం చేశారు. దీన్నిబట్టి గడచిన 2022లో అత్యధిక కాలుష్య దేశాల్లో అగ్రభాగాన నిలిచినవి... ఉత్తర – మధ్య ఆఫ్రికాలోని ఛాడ్, ఇరాక్, బహ్రెయిన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌. భారత్‌ 8వ స్థానంలో నిలిచింది. వాయుకాలుష్యం దారుణంగా ఉన్న ప్రపంచంలోని 10 నగరాల్లో ఏకంగా 8 మధ్య, దక్షిణాసియా ప్రాంతాల్లోవే! మన దేశంలో దాదాపు 60 శాతం నగరాల్లో ఈ సర్వే సాగింది.

మనం పీల్చే గాలి నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కన్నా ఏడు రెట్లు అధమంగా ఉందని ఇందులో తేలింది. పైకి చూస్తే, నిరుటి సర్వేలో కాలుష్యంలో ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్న మనం ఈసారి 8వ స్థానానికి రావడం శుభవార్తే. కానీ, నిరుడు ప్రపంచంలోని 100 కాలుష్యనగరాల్లో 61 మనవైతే, ఈసారి ఆ సంఖ్య 65కు పెరగడం గమనార్హం. 

చిత్రం ఏమిటంటే, ప్రపంచ నగరాల్లో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉన్నా, మన దేశంలో అత్యంత కలుషిత నగరం మాత్రం ఢిల్లీ శివార్లలో రాజస్థాన్‌ పరిధిలోకి వచ్చే భివాడీ! ఆ తరువాతే ఢిల్లీ. వాయుకాలుష్యం ఎక్కువైన దేశ రాజధానిలో సహజమైన నేలను సైతం కాంక్రీట్‌ కాలిబాటలతో మార్చేసరికి, చెట్ల నరికివేత పెరిగి, జీవం పోతోంది. సహజమైన స్థానిక మొక్కలను కాక, వేరెక్క డివో నాటడం లాంటి సమస్యలూ ఉన్నాయి. అలాగే, వాహన ఉద్గారాలు కాలుష్యానికి మరో ప్రధాన కారణం.

ఎయిర్‌ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు అధిక స్థాయిలో ఉద్గారాలను వెలువరిస్తూ, మరింత వాయు కాలుష్యానికి దారి తీస్తున్నాయి. ఇవన్నీ ఆరుబయట పనిచేసే భవన నిర్మాణ కార్మికులు, వీధి వర్తకులు సహా పలువురిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శరవేగపు పట్టణీకరణతో, 2020 నుంచి 2030 మధ్య మన పట్టణ ప్రాంత జనాభా 48.3 కోట్ల నుంచి 67.5 కోట్లకు, అంటే 40 శాతం పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని స్థాయుల్లో గట్టి చర్యలు చేపట్టక తప్పదు. 

అనూహ్యంగా ఇటీవల గ్రామీణ భారతావనిలోనూ వాయు నాణ్యతలో తేడాలొస్తున్నాయి. గ్రామాల్లో నైట్రోజన్‌ డయాక్సైడ్‌ (ఎన్‌ఓ2) స్థాయులు, దరిమిలా వాయు కాలుష్యం పెరుగుతున్నట్టు ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనం గత నెలలో వెల్లడించింది. భారత్‌లో మొత్తం ఎన్‌ఓ2 కాలుష్యంలో 41 శాతం గ్రామీణ ప్రాంతాల్లో అదీ అధికంగా రవాణా తదితర రంగాల ద్వారా జరుగుతోంది.

పెరుగుతున్న పట్టణీకరణ, శివార్లకు పరిశ్రమలు మారడం, జనాభా పెరుగుదల లాంటి అనేక కారణాల వల్ల ప్రబలుతున్న ఈ ధోరణి ఆందోళనకరం. నిజానికి, గాలిలో పార్టిక్యు  లేట్‌ మేటర్‌ 2.5 (పీఎం 2.5) సాంద్రతల్ని వచ్చే 2026 కల్లా 40 శాతం మేర తగ్గించడం లక్ష్యమని భారత్‌ 2022లో ప్రకటించింది. అందుకు తగ్గట్టు 2019లో పర్యావరణ శాఖ ఆరంభించిన ‘జాతీయ స్వచ్ఛ వాయు పథకా’న్ని (ఎన్సీఏపీ) పునర్నిర్వచిస్తామనీ హామీ ఇచ్చింది.

కానీ, లక్ష్యసాధనలో వెనుకడుగు వేసింది. బొగ్గు గనులకు పర్యావరణ నిబంధనల్లో సడలింపులు ఇవ్వడం, గాలిలో ధూళి కణాలకు కారణమయ్యే ఉత్పత్తుల పెంపునకు అనుమతులివ్వడం లాంటి అనేక ప్రభుత్వ నిర్ణయాలు సమస్యను పెంచిపోషించాయి. భారత లక్ష్యానికి అవన్నీ ప్రతిబంధకాలయ్యాయి. 

ఇప్పటికైనా ప్రభుత్వం కాలుష్య నివారణకు సత్వర కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలి. పరిశ్ర మలు, వాహనాలపై కఠిన నిబంధనలు విధించాలి. రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గేలా అసలు సిసలు ప్రజా రవాణా వ్యవస్థలపై దృష్టి పెట్టాలి.

పునరుత్పాదక శక్తిపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే, పర్యావరణ, కాలుష్య సంక్షోభాల నుంచి బయటపడాలంటే, ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్ని మెరుగుపరుచుకొనే కృషి చేయాలి. కేవలం వ్యక్తిగత కృషి సరిపోదు. వ్యక్తివాదం నుంచి సమష్టి వాదం వైపు మళ్ళాలి. అందరూ కలసికట్టుగా సుస్థిర విధానాలను అనుసరించడం కీలకమని గుర్తించాలి. సాముదాయక కృషి సత్ఫలితాలిస్తుంది. 

కోవిడ్‌ కాలంలో దేశంలో కాలుష్యం కట్టడి అయినట్టు కనిపించినా, తిరిగి మళ్ళీ కోవిడ్‌ ముందు స్థాయికి చేరిపోయిందని గత ఏడాది ఇదే ‘ఐక్యూ ఎయిర్‌’ నివేదిక తేల్చింది. అనారోగ్యానికి రెండో అతి పెద్ద కారణంగా దేశ ప్రజానీకంపై పెను ప్రభావం చూపుతున్న గాలి కాలుష్యంతో ఏటా 15 వేల కోట్ల డాలర్ల పైగా ఆర్థికంగా నష్టపోతున్నట్టు లెక్క.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాయుకాలుష్య ప్రాంతంలో నివసిస్తున్న వేళ భావితరాల బాగు కోసమైనా దేశాలు నిద్ర లేవాలి. పీల్చే గాలిలోనూ ధనిక, పేద దేశాల మధ్య తేడాలు దుర్భరం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement