Polluted environment
-
గాలిలోనూ గరళమేనా?
సంవత్సరాలు మారుతున్నా దేశంలో కాలుష్య పరిస్థితులు మాత్రం మెరుగుపడుతున్నట్టు లేదు. ప్రభుత్వాలు చర్యలు చేపట్టామంటున్నా, వాయు కాలుష్య స్థాయి ఆందోళనకరంగానే కొనసాగుతోంది. భారతదేశ వాయు నాణ్యతా సూచి ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. ప్రపంచంలోని వివిధ రాజధానుల్లోకెల్లా రెండో అత్యంత కలుషిత రాజధానిగా, మొత్తం నగరాల లెక్కలో నాలుగో స్థానంలో నిలిచి ఢిల్లీ అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ప్రపంచంలోని 50 అగ్రశ్రేణి కాలుష్య నగరాల్లో 39 భారత్‌లోవే. స్విట్జర్లాండ్‌కు చెందిన వాయు నాణ్యతా టెక్నాలజీ సంస్థ ‘ఐక్యూ ఎయిర్’ మార్చి 14న విడుదల చేసిన అయిదో వార్షిక ‘ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక–2022’లోని సంగతులివి. ఇవన్నీ మనల్ని అప్రమత్తం చేస్తున్నాయి. పౌరులు స్వచ్ఛమైన గాలి పీల్చి, ఆరోగ్యంగా జీవించాలంటే కాలుష్య నివారణకు తక్షణ చర్యలే శరణ్యమని పాలకులకు గుర్తు చేస్తున్నాయి. ప్రపంచంలోని 131 దేశాల్లో 7,327 ప్రాంతాల్లో 30 వేలకు పైగా వాయునాణ్యతా పరిశీలక కేంద్రాలు పెట్టి, డేటా సేకరించి, ఈ నివేదికను సిద్ధం చేశారు. దీన్నిబట్టి గడచిన 2022లో అత్యధిక కాలుష్య దేశాల్లో అగ్రభాగాన నిలిచినవి... ఉత్తర – మధ్య ఆఫ్రికాలోని ఛాడ్, ఇరాక్, బహ్రెయిన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. భారత్ 8వ స్థానంలో నిలిచింది. వాయుకాలుష్యం దారుణంగా ఉన్న ప్రపంచంలోని 10 నగరాల్లో ఏకంగా 8 మధ్య, దక్షిణాసియా ప్రాంతాల్లోవే! మన దేశంలో దాదాపు 60 శాతం నగరాల్లో ఈ సర్వే సాగింది. మనం పీల్చే గాలి నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కన్నా ఏడు రెట్లు అధమంగా ఉందని ఇందులో తేలింది. పైకి చూస్తే, నిరుటి సర్వేలో కాలుష్యంలో ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్న మనం ఈసారి 8వ స్థానానికి రావడం శుభవార్తే. కానీ, నిరుడు ప్రపంచంలోని 100 కాలుష్యనగరాల్లో 61 మనవైతే, ఈసారి ఆ సంఖ్య 65కు పెరగడం గమనార్హం. చిత్రం ఏమిటంటే, ప్రపంచ నగరాల్లో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉన్నా, మన దేశంలో అత్యంత కలుషిత నగరం మాత్రం ఢిల్లీ శివార్లలో రాజస్థాన్ పరిధిలోకి వచ్చే భివాడీ! ఆ తరువాతే ఢిల్లీ. వాయుకాలుష్యం ఎక్కువైన దేశ రాజధానిలో సహజమైన నేలను సైతం కాంక్రీట్ కాలిబాటలతో మార్చేసరికి, చెట్ల నరికివేత పెరిగి, జీవం పోతోంది. సహజమైన స్థానిక మొక్కలను కాక, వేరెక్క డివో నాటడం లాంటి సమస్యలూ ఉన్నాయి. అలాగే, వాహన ఉద్గారాలు కాలుష్యానికి మరో ప్రధాన కారణం. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు అధిక స్థాయిలో ఉద్గారాలను వెలువరిస్తూ, మరింత వాయు కాలుష్యానికి దారి తీస్తున్నాయి. ఇవన్నీ ఆరుబయట పనిచేసే భవన నిర్మాణ కార్మికులు, వీధి వర్తకులు సహా పలువురిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శరవేగపు పట్టణీకరణతో, 2020 నుంచి 2030 మధ్య మన పట్టణ ప్రాంత జనాభా 48.3 కోట్ల నుంచి 67.5 కోట్లకు, అంటే 40 శాతం పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని స్థాయుల్లో గట్టి చర్యలు చేపట్టక తప్పదు. అనూహ్యంగా ఇటీవల గ్రామీణ భారతావనిలోనూ వాయు నాణ్యతలో తేడాలొస్తున్నాయి. గ్రామాల్లో నైట్రోజన్ డయాక్సైడ్ (ఎన్ఓ2) స్థాయులు, దరిమిలా వాయు కాలుష్యం పెరుగుతున్నట్టు ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనం గత నెలలో వెల్లడించింది. భారత్‌లో మొత్తం ఎన్ఓ2 కాలుష్యంలో 41 శాతం గ్రామీణ ప్రాంతాల్లో అదీ అధికంగా రవాణా తదితర రంగాల ద్వారా జరుగుతోంది. పెరుగుతున్న పట్టణీకరణ, శివార్లకు పరిశ్రమలు మారడం, జనాభా పెరుగుదల లాంటి అనేక కారణాల వల్ల ప్రబలుతున్న ఈ ధోరణి ఆందోళనకరం. నిజానికి, గాలిలో పార్టిక్యు లేట్ మేటర్ 2.5 (పీఎం 2.5) సాంద్రతల్ని వచ్చే 2026 కల్లా 40 శాతం మేర తగ్గించడం లక్ష్యమని భారత్ 2022లో ప్రకటించింది. అందుకు తగ్గట్టు 2019లో పర్యావరణ శాఖ ఆరంభించిన ‘జాతీయ స్వచ్ఛ వాయు పథకా’న్ని (ఎన్సీఏపీ) పునర్నిర్వచిస్తామనీ హామీ ఇచ్చింది. కానీ, లక్ష్యసాధనలో వెనుకడుగు వేసింది. బొగ్గు గనులకు పర్యావరణ నిబంధనల్లో సడలింపులు ఇవ్వడం, గాలిలో ధూళి కణాలకు కారణమయ్యే ఉత్పత్తుల పెంపునకు అనుమతులివ్వడం లాంటి అనేక ప్రభుత్వ నిర్ణయాలు సమస్యను పెంచిపోషించాయి. భారత లక్ష్యానికి అవన్నీ ప్రతిబంధకాలయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కాలుష్య నివారణకు సత్వర కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలి. పరిశ్ర మలు, వాహనాలపై కఠిన నిబంధనలు విధించాలి. రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గేలా అసలు సిసలు ప్రజా రవాణా వ్యవస్థలపై దృష్టి పెట్టాలి. పునరుత్పాదక శక్తిపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే, పర్యావరణ, కాలుష్య సంక్షోభాల నుంచి బయటపడాలంటే, ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్ని మెరుగుపరుచుకొనే కృషి చేయాలి. కేవలం వ్యక్తిగత కృషి సరిపోదు. వ్యక్తివాదం నుంచి సమష్టి వాదం వైపు మళ్ళాలి. అందరూ కలసికట్టుగా సుస్థిర విధానాలను అనుసరించడం కీలకమని గుర్తించాలి. సాముదాయక కృషి సత్ఫలితాలిస్తుంది. కోవిడ్ కాలంలో దేశంలో కాలుష్యం కట్టడి అయినట్టు కనిపించినా, తిరిగి మళ్ళీ కోవిడ్ ముందు స్థాయికి చేరిపోయిందని గత ఏడాది ఇదే ‘ఐక్యూ ఎయిర్’ నివేదిక తేల్చింది. అనారోగ్యానికి రెండో అతి పెద్ద కారణంగా దేశ ప్రజానీకంపై పెను ప్రభావం చూపుతున్న గాలి కాలుష్యంతో ఏటా 15 వేల కోట్ల డాలర్ల పైగా ఆర్థికంగా నష్టపోతున్నట్టు లెక్క. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాయుకాలుష్య ప్రాంతంలో నివసిస్తున్న వేళ భావితరాల బాగు కోసమైనా దేశాలు నిద్ర లేవాలి. పీల్చే గాలిలోనూ ధనిక, పేద దేశాల మధ్య తేడాలు దుర్భరం. -
మితిమీరిన వాయు కాలుష్యం.. 2 లక్షల మంది ఆస్పత్రి పాలు!
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో వాయు కాలుష్యం మితిమీరిపోయింది. కలుషిత గాలిని పీల్చి సుమారు 13 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో సుమారు 2 లక్షల మంది గతవారం ఆస్పత్రుల్లో చేరారు. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొగ, వ్యవసాయ వ్యర్థాల దహనం వంటి కారణాలతో దేశంలో గాలి నాణ్యత స్థాయిలు గణనీయంగా పడిపోయాయి. బ్యాంకాక్‌లోని 50 వరకు జిల్లాల్లో గాలి నాణ్యత సురక్షితం కాని 2.5 పీఎం స్థాయికి పడిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న గాలి కాలుష్య స్థాయిని మించి పోయింది. ఈ స్థాయిలో గాలి కణాలు రక్తంలో కలిసిపోయి అవయవాలను దెబ్బతీస్తాయి. -
వామ్మో కోవిడ్ వ్యర్థాలు
కోవిడ్–19.. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి. దాని నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా జనం మాస్కులు, చేతికి ప్లాస్టిక్ తొడుగులు, పీపీఈ కిట్లు, కరోనా టెస్టింగ్ కిట్లు, ప్లాస్టిక్ శానిటైజర్ సీసాలు విపరీతంగా ఉపయోగించారు. వీటిలో చాలావరకు ఒకసారి వాడి పారేసేవే. ఇవన్నీ చివరికి ఏమయ్యాయో తెలుసా? వ్యర్థాలుగా మారి సముద్రాల్లో కలిసిపోయాయి. ఎంతగా అంటే ఏకంగా 25,000 టన్నులకుపైగా పీపీఈ కిట్లు, ఇతర కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలు, నదులు, చెరువుల్లోకి చేరుకున్నాయి. ఇంకా చేరుతూనే ఉన్నాయి. ఇవి జల వనరుల్లోని జీవజాలం పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. జీవ జాతులకు ప్రత్యక్ష ముప్పు 2019 డిసెంబర్లో కరోనా మహమ్మారి జాడ తొలుత చైనాలో బయటపడింది మొదలు 2021 ఆగస్టు వరకే 193 దేశాల్లో ఏకంగా 84 లక్షల టన్నుల కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడినట్లు అంచనా. వీటిలో ఏకంగా 70 శాతం జల వనరుల్లోకి చేరుకున్నాయని చెబుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సురక్షితంగా నిర్వీర్యం చేయడానికి సరైన సదుపాయాలు లేకపోవడమే ప్రధాన సమస్య అంటున్నారు. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ప్రపంచమంతటా నెలకు ఏకంగా 129 బిలియన్ల మాస్కులు, 65 బిలియన్ల గ్లౌజ్‌లు వాడేసినట్టు అంచనా. వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో ఇవి వ్యర్థాలుగా మారిపోయాయి. మాస్కు.. ప్లాస్టిక్ బాంబు ఒకసారి వాడి పారేసే ఫేస్ మాస్కులను ప్లాస్టిక్ బాంబుగా పరిశోధకులు అభివర్ణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మాస్క్‌లు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ కిట్ల ముప్పు ఇప్పటికిప్పుడు ప్రత్యక్షంగా అనుభవంలోకి రాకున్నా రానున్న దశాబ్దాల్లో మాత్రం వాటి ప్రభావం దారుణంగా ఉంటుందని చెప్పారు. భూమిపై, సముద్రంలో ఉంటే జీవజాలానికి ప్రమాదం తప్పదని, వ్యర్థాల నిర్వహణపై ప్రపంచదేశాలు ఇప్పటికైనా దృష్టి పెట్టాలని సూచించారు. వేస్ట్ మేనేజ్మెంట్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలని, సామర్థ్యం పెంచుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారులు దాడి చేస్తే పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఇప్పటి నుంచి సన్నద్ధం కావాలని ప్రభుత్వాలకు హితవు పలికారు. వాడి పారేసిన పీపీఈ కిట్లు, మాస్క్‌ల కుప్పల్లో పక్షులు చిక్కుకుపోయి విలవిల్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాల్లో అత్యధికంగా ఆసుపత్రుల నుంచి వెలువడినవే కావడం గమనార్హం. ఇవీ ప్రత్యామ్నాయాలు... ► చేతులు శుభ్రం చేసుకోవడానికి ప్లాస్టిక్ సీసాల్లో వచ్చే శానిటైజర్ కంటే వేడినీరు, సబ్బు వాడుకోవడం ఉత్తమం. సబ్బులు ఇప్పుడు భూమిలో సులభంగా కలిసిపోయే ప్యాకేజింగ్‌లో వస్తున్నాయి. ప్లాస్టిక్ సీసాల్లోని హ్యాండ్ శానిటైజర్లు కాకుండా సబ్బులు వాడుకుంటే పర్యావరణానికి ఎంతోకొంత మేలు చేసినట్టే. ► సింగిల్ యూజ్ ఫేస్‌మాస్క్‌లు వాడితే ప్రతి ఏటా కోట్లాది టన్నుల వ్యర్థాలు పేరుకుపోతాయి. వీటికంటే పునర్వినియోగ మాస్క్‌లు మంచివి. అంటే శుభ్రం చేసుకొని పలుమార్లు వాడుకునేవి. వీటిని వాషబుల్ మాస్క్‌లు అని పిలుస్తున్నారు. వీటిని పర్యావరణహిత మెటీరియల్‌తో తయారు చేస్తున్నారు. ► ప్లాస్టిక్ ముప్పు తెలిసినవారూ కరోనా సమయంలో వైరస్ భయంతో ప్లాస్టిక్ బ్యాగ్‌లు వాడారు. కానీ కాగితపు సంచులు, బట్ట సంచులు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. ► హోటళ్లలో వాడే ప్లాస్టిక్ పొర ఉన్న కాగితపు కప్పులు లక్షల టన్నుల వ్యర్థాలుగా మారుతున్నాయి. గాజు, పింగాణి గ్లాసులను వేడి నీరు, సబ్బుతో శుభ్రం చేసి వాటిని మళ్లీ ఉపయోగించుకోవడం దీనికి మంచి ప్రత్యామ్నాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
99 శాతం ప్రజలు పీల్చేది కలుషిత గాలే!
జెనీవా: ప్రపంచంలోని 99 శాతం జనాభా కలుషిత గాలి పీలుస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దాదాపు జనాభా మొత్తం ప్రమాణాలకు తగినట్లుగా లేని గాలినే పీలుస్తున్నారని, దీన్ని నివారించాలంటే వెంటనే శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించాలని సూచించింది. ఈ ఇంధన వాడకాలతో వాయుకాలుష్యం ఏర్పడుతోందని, దీనివల్ల రక్త సంబంధ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు ప్రబలి ఏటా 70 లక్షల మరణాలు జరుగుతున్నాయని తెలిపింది. గాల్లో పీఎం 2.5, పీఎం10 అనే పర్టిక్యులేట్ మేటర్‌ను ఆధారంగా చేసుకొని వాయునాణ్యతను సంస్థ నిర్ధారిస్తుంది. భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్షణమే కర్బన ఉద్గారాల స్థాయిల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని, పర్యావరణహిత ఇంధన వాడకాన్ని ప్రోత్సహించాలంది. -
గాలి నిండా గరళమేనా?!
మనం పీలుస్తున్న గాలి ఎంత నాణ్యమైనది? ఎంత సురక్షితమైనది? పైకి మామూలుగా అనిపించినా, ఇవి ఎంతో కీలకమైన ప్రశ్నలని తాజా ‘ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక –2022’తో మరోసారి తెలిసొస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యభరిత రాజధానిగా ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచిందన్న మాట ఆందోళన రేపుతోంది. వరుసగా నాలుగో ఏడాది ఢిల్లీకి ఈ అపకీర్తి కిరీటం దక్కడం పరిస్థితి తీవ్రతకు దర్పణం. ప్రపంచ వ్యాప్తంగా 117 దేశాల్లోని 6475 ప్రాంతాల్లో కాలుష్యగణన చేసి, స్విట్జర్లాండ్ సంస్థ ‘ఐక్యూ ఎయిర్’ మంగళవారం విడుదల చేసిన ఈ నివేదిక ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. గడచిన 2020 నాటి కాలుష్య ర్యాంకులను కొట్టిపారేసిన పాలకులు తిరుగులేని సాక్ష్యంతో వచ్చిన తాజా 2021 నివేదికకు ఏం జవాబిస్తారు? కాలుష్యంలో ‘టాప్–100’ నగరాల జాబితా తీస్తే, అందులో 63 నగరాలు మన దేశంలోవే! వాటిలో సగానికన్నా ఎక్కువ ఢిల్లీ చుట్టుపక్కలి హరియాణా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోవే. ఈ కఠిన వాస్తవం దేశంలో తక్షణ చర్యల అవసరాన్ని మళ్ళీ గుర్తు చేస్తోంది. గాలిలో కాలుష్యకారక కణాల (పీఎం) వార్షిక సగటు 2.5 స్థాయి అంటే, ఘనపుమీటరుకు 5 మైక్రో గ్రాములకు మించి కాలుష్య కణాలు ఉండకూడదు. కానీ, మన దేశంలో ఏ నగరంలో పరిస్థితీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) నిర్దేశిత ప్రమాణాలకు తగ్గట్టు లేదు. ఉత్తరాదిన మరీ దారుణం. కాలుష్యంలో అగ్రభాగాన నిలిచిన తొలి 15 ప్రపంచ స్థలాల చిట్టాలోనూ ఏకంగా 10 భారతీయ నగరాలే! రాజస్థాన్‌లోని భివాడీ, ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజియాబాద్, చైనాలోని హోటన్ తర్వాత వాయు కాలుష్యంలో నాలుగో ర్యాంక్ ఢిల్లీదే. రాజధానిలో కాలుష్యం గత ఏడాది కన్నా దాదాపు 15 శాతం ఎక్కువైంది. అక్కడ డబ్ల్యూహెచ్ఓ పరిమితుల కన్నా దాదాపు 20 రెట్లు ఎక్కువ వాయు కాలుష్యం నెలకొంది. విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి తెలుగు ప్రాంతాలూ ఈ వాయు కాలుష్య జాబితాలో ఉన్నాయి. ప్రకృతి, పర్యావరణం, జలాశయాల పరిరక్షణ ధ్యేయంగా దశాబ్దాల క్రితం చేసిన జీవో 111ను సైతం తెలంగాణ సర్కార్ ఎత్తివేస్తామంటున్న వేళ... హైదరాబాద్ 232వ స్థానంలో నిలవడం మరింత ఆందోళనకరం. మన దేశంలో ఇప్పుడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న రెండో అతి పెద్ద కారణం – వాయు కాలుష్యమే. దీనివల్ల ఏటా దాదాపు 15 వేల కోట్ల అమెరికన్ డాలర్ల పైగా ఆర్థిక నష్టం కలుగుతోందని అంచనా. కరోనా కాలంలో లాక్డౌన్ల పుణ్యమా అని దేశంలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిందని వార్తలు వచ్చాయి. కానీ చిత్రం ఏమిటంటే – ఇప్పుడు మన దేశంలో పీఎం స్థాయి మళ్ళీ లాక్డౌన్ల పూర్వం ఉన్న 2.5కి చేరుకోవడం! వాహన ఉద్గారాలు, ఇంధన ఉత్పత్తి, పారిశ్రామిక వ్యర్థాలు, వంట కోసం బయోమాస్ దహనం, నిర్మాణ రంగం, పంటల కాల్చివేత లాంటివన్నీ ఈ వాయు కాలుష్యానికి మూలాలు. పట్టణ భారతావనిలో అయితే ఈ పీఎం 2.5 స్థాయిలో 20 నుంచి 35 శాతం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మోటారు వాహనాల ఇంజన్ల వల్లేనని నిపుణుల మాట. ఏటా వాహనాల అమ్మకాలు పెరిగిపోతున్న భారత్‌లో వచ్చే 2030 నాటి కల్లా వాహనాల సంఖ్య 1.05 కోట్లకు చేరుతుందన్న అంచనా మరింత భయపెడుతోంది. నిజానికి, దేశంలో వాయు కాలుష్యాన్ని పర్యవేక్షించడం కోసం 2015 ఏప్రిల్ 7న మోదీ సర్కార్ ఆర్భాటంగా ‘జాతీయ వాయు నాణ్యతా సూచి’ పథకాన్ని ప్రకటించింది. కానీ, వాక్శూరత్వమే తప్ప ఒరిగిందేమీ లేదని తాజా లెక్కలు తేల్చేస్తున్నాయి. 2024 నాటి కల్లా గుర్తించిన నగరాలలో పీఎం స్థాయి 20 నుంచి 30 శాతం మేర తగ్గేలా చూస్తామనీ పాలకులు సంకల్పం చెప్పుకున్నారు. అందు కోసం 2019లో ‘జాతీయ స్వచ్ఛ వాయు పథకం’ (ఎన్సీఏపీ)ని కేంద్ర పర్యావరణ శాఖ చేపట్టింది. అది ఏ మేరకు సఫలమైందన్నదీ స్పష్టం కాలేదు. మూడేళ్ళుగా లాక్డౌన్ సహా రకరకాల కారణా లతో గాలి నాణ్యత పెరుగుతోందని ఆశిస్తుంటే, వాస్తవం తద్విరుద్ధంగా ఉందని తాజా నివేదిక తేల్చేసింది. గత 2020 నాటి నివేదిక వాయు కాలుష్యంలో ప్రపంచంలో భారత్‌ది మూడో స్థానమని పేర్కొంది. అది ఉపగ్రహ డేటాయే తప్ప క్షేత్రస్థాయి వాస్తవం కాదంటూ అప్పట్లో కేంద్రం కొట్టిపారే సింది. ఇప్పుడీ 2021 నివేదిక క్షేత్రస్థాయి సెన్సర్ల నుంచి సేకరించినదే. ఆ సెన్సర్లలో సగం సాక్షాత్తూ ప్రభుత్వ సంస్థలు నడుపుతున్నవే. పాలకులు బుకాయించడం, మాటలతో మభ్యపెట్టడం కష్టమే. ప్రజల ఆరోగ్యానికే ప్రమాదం గనక సర్కారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ప్రధానంగా నగరాల మీదే దృష్టి పెట్టడమూ ఎన్సీఏపీ లాంటి పథకాలలోని లోపమని గుర్తించాలి. కాలుష్య నియంత్రణలో వర్తమాన విధానం విఫలమైనందున సరికొత్త వ్యూహరచన చేయాలి. తాజా నివేదికలో సిఫార్సు చేసినట్టుగా వ్యక్తిగత వినియోగానికి కాలుష్యరహిత స్వచ్ఛ వాయు వాహనాలను వాడేవారికి ప్రోత్సాహకాలు ఇచ్చేలా చట్టాలు చేయడం లాంటివి ఆలోచించాలి. రాష్ట్ర పాలకులు సైతం సీజన్లో మళ్ళీ కొయ్యకాళ్ళను కాల్చడం లాంటివి మొదలు కాకముందే బయో డీకంపోజర్ లాంటివి విస్తృతంగా రైతులకు అందుబాటులోకి తేవాలి. అటు ఢిల్లీ, పంజాబ్‌ల్లో అధికారంలో ఉన్న ‘ఆప్’, ఇటు హరియాణా, యూపీల్లో గద్దె మీదున్న బీజేపీ సమన్వయంతో జాతీయ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యతను కాపాడాలి. అటవీ పెంపకం లాంటి ఆలోచనలు ఎన్ని చేసినా, చివరకు వాటి అమలులో చిత్తశుద్ధి అవసరం. అది లోపించి, ఆరావళి సహా అనేక అంశాలపై తప్పుదోవలో కొనసాగితే పరిస్థితి ఏటేటా దిగజారుతుంది. మాటల కన్నా చేతలు ముఖ్యమంటున్నది అందుకే! -
కాల్చేస్తే ఖతం.. కుళ్లిపోతే విషం!
సాక్షి, అమరావతి: చెత్తాచెదారం కుళ్లిపోతే ఎరువుగా మారుతుంది. ఇది భూమికి లాభం చేకూరుస్తుంది. అదే మనుషులకొచ్చే జబ్బులను నయం చేసే మందులు కుళ్లిపోతే విషమవుతాయి. ఇవి భూమిని విషతుల్యంగా మారుస్తాయి. భూగర్భ జలాలు కలుషితమై కొత్త జబ్బులొస్తాయి..ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య (100–200 డిగ్రీల సెల్సియస్‌ల మధ్య) కాలి్చవేయాల్సిన మందులు..మున్సిపాలిటీ డంపింగ్ యార్డుల్లో కుళ్లిపోతుండడంతో ప్రమాదం ముంచుకొస్తోంది. కొత్తరకం బాక్టీరియా పుట్టుకొస్తోంది. కాలం చెల్లిన మందులతోనే తీవ్ర సమస్యలు మందుల షాపుల యాజమాన్యాలు కాలం చెల్లిన మందులను చెత్త డబ్బాల్లో వేసి కొత్త సమస్యలకు తెరతీస్తున్నారు. వీటితో పాటు పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీవరేజీ ట్రీట్మెంటు ప్లాంట్లు లేకపోవడం వల్ల బయో ద్రవ వ్యర్థాలు (బయో లిక్విడ్ వేస్ట్) మురికి కాలువల్లో కలుస్తున్నాయి. దీనివల్ల కూడా భయంకరమైన జబ్బులు వస్తున్నాయి. దీనిపై సీపీసీబీ (కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి) ఇటీవలే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులు ఏ మాత్రం ఉపేక్షించతగ్గవి కావని, దీనిపై ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అన్నిటికీ మించి కాలం చెల్లిన యాంటీబయోటిక్స్ మందులు కుళ్లిపోయి తీవ్ర ముప్పును తెస్తున్నట్టు సీపీసీబీ పేర్కొంది. మందులు కుళ్లిపోతే వచ్చే నష్టాలు... ►కాలం చెల్లిన యాంటీబయోటిక్స్ కుళ్లిపోవడం వల్ల కొత్తరకం బాక్టీరియా పుట్టుకొస్తోంది. ఈ బాక్టీరియా వల్ల జబ్బులు సోకితే అత్యంత సామర్థ్యం కలిగిన యాంటీబయోటిక్స్ వాడినా తగ్గే అవకాశం ఉండదు. ►చెత్త కుప్పల్లో మందులు కుళ్లిపోతే వాయు కాలుష్యం తీవ్రమవుతుంది. గాలి ద్వారా వ్యాప్తి చెందే జబ్బుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ►భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయి ►ఈ జలాలు తాగడం వల్ల మూత్రపిండాలు, కాలేయ సమస్యలు, హెపటైటిస్ బి వంటి జబ్బులు వస్తున్నాయి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చెబుతోంది పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం మందులను బయట పడేయకూడదు. వాటిని విధిగా బయోవ్యర్థాల నిర్వహణ సంస్థలకే అప్పజెప్పాలి. పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా వీటిని క్లోజ్డ్ డిగ్రేడబుల్ హౌస్ (నాలుగు గోడల మధ్య ఉన్న బయోవ్యర్థాల ప్లాంటు)లో కాలి్చవేయాలి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే హక్కు, జరిమానాలు విధించే అధికారం ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లకు ఉంది. కేరళలో ‘ప్రౌడ్’ ప్రాజెక్టు వినియోగించని మందుల నిర్వీర్యంపై కేరళ అద్భుతమైన చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రౌడ్ (ప్రోగ్రాం ఆన్ రిమూవల్ ఆఫ్ అన్యూజ్డ్ డ్రగ్స్)ను ప్రారంభించింది. కేరళ డ్రగ్ కంట్రోల్ అథారిటీ, కేరళ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పనికిరాని, కాలం చెల్లిన మందుల నిరీ్వర్యం చేయడంలో ముందంజ వేశాయి. ఒక్క మాత్ర కూడా మున్సిపాలిటీ డబ్బాల్లోకి వెళ్లకుండా చేయగలుగుతున్నాయి. తిరువనంతపురంలో మొదలైన ఈ పైలెట్ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కేరళ యోచిస్తోంది. రాష్ట్రంలో ఫార్మసీ సంస్థల వివరాలు ఇలా ►మాన్యుఫాక్చరింగ్ లైసెన్సులు 258 ►రిటైల్ అండ్ హోల్‌సేల్ ►మెడికల్ స్టోర్లు 33,039 ►బయోవ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు 12 ►2018–19లో నిబంధనల ఉల్లంఘనలు 6,385 ►సీజ్చేసిన షాపుల సంఖ్య 66 అగ్రిమెంటు లేకుంటే లైసెన్సులు రద్దు చేస్తాం మందుల షాపులు గానీ, సీ అండ్ ఎఫ్ (క్యారీ ఫార్వర్డ్ ఏజెన్సీలు)లు గానీ కాలం చెల్లిన మందులను చెత్త బుట్టల్లో వేయడానికి వీల్లేదు. కచి్చతంగా బయోవ్యర్థాల ప్లాంట్లకు పంపించాల్సిందే. సీ అండ్ ఎఫ్ ఏజెన్సీలు బయోవ్యర్థాల నిర్వాహకులతో అవగాహన ఒప్పందం చేసుకోకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పాం. మందులు మున్సిపాలిటీ చెత్త డబ్బాల్లో వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో నిఘా పెంచాం. – ఎంబీఆర్ ప్రసాద్, సంచాలకులు, ఔషధనియంత్రణ మండలి ఈ చట్టం ఆస్పత్రులకు మాత్రమే వర్తిస్తోంది ఎన్వీరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కేవలం ఆస్పత్రుల బయోవ్యర్థాల నిర్వీర్యం కోసం మాత్రమే ఉపయోగపడుతోంది. ఇప్పటివరకూ మెడికల్‌షాపులు లేదా మాన్యుఫాక్చరింగ్ సంస్థలు మందులను నిబంధనలకు విరుద్ధంగా పారబోస్తే వాటిపై చర్యలు తీసుకుని, జరిమానాలు విధించిన దాఖలాలు కనిపించలేదు. – ఎ.విజయభాస్కర్‌రెడ్డి, ఫార్మసీ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు -
కాలుష్య భూతాలు మన నగరాలు
ప్రపంచంలోని 20 కాలుష్యకారక నగరాల్లో 15 వరకు భారత్‌లోనే ఉంటున్నాయని అంతర్జాతీయ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. అటు నగరాలూ ఇటు పల్లెలు కూడా మౌలిక వసతులు అనే భావనకే దూరంగా ఉంటున్న దుస్థితే ఈ విధ్వంసానికి కారణం. ప్రణాళికాబద్ధ నిర్మాణాలకు ఎంతో దూరంలో ఉన్న భారతీయ నగరాలు ప్రజా జీవన నాణ్యతకు ఆమడదూరంలో మనుగడ సాగిస్తున్నాయి. నగరాలు చెడుకు, పల్లెలు మంచితనానికీ ప్రతీకలు అనే పురాతన విశ్వాసం పాలకుల్లో, ప్రణాళికా కర్తల్లో, ప్రజల్లో కూడా బలంగా సాగుతున్నంత కాలం భారత్‌లో నగరాలూ, పల్లెలు కూడా నాణ్యతకు దూరంగానే ఉంటాయి. ఇలాగా సాగితే నగరకాలుష్యంలో ఎప్పటికీ మనమే నంబర్ వన్‌గా ఉండటం ఖాయం. మన నగరాలు అక్షరాలా మనుషుల ప్రాణాలను తోడేస్తున్నాయి. ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్యకారక నగరాల్లో 15వరకు భారత్‌లోనే ఉన్నాయని అంతర్జాతీయ సంస్థలు మనకు గుర్తు చేస్తున్నాయి. మనం ఎంత వేగంగా నగరీకరణ పాలబడుతూ మన పరిస్థితిని ఇంకా దుర్భరం చేసుకుంటున్నామంటే ప్రపంచంలోని 30 అత్యంత కాలుష్య కారకనగరాల్లో 25వరకు భారత్‌లోనే ఉన్నాయనే పేరు తెచ్చుకోవడానికి కూడా ఎంతో కాలం పట్టదు. మన మహానగరాల్లో ట్రాఫిక్ నత్తనడక నడుస్తోంది. ముంబైలో గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగం మాత్రమే సాధ్యం. ఇక బెంగళూరు అయితే మరీ దుర్భరం. హైదరాబాద్ కాస్త ఉత్తమంగా ఉండవచ్చు. తన ఆర్థిక పతనం కారణంగా కోల్కత్తా నగర కాలుష్యం కాస్త మెరుగ్గా ఉండవచ్చు. ముంబై, బెంగళూరుతో పోలిస్తే కాలుష్యం విషయంలో ఢిల్లీ పోటీపడలేకపోవచ్చు కానీ దాని పయనం కూడా అదే దారిలో నడుస్తోంది. ప్రత్యేకించి దాని జంటనగరాలైన గుర్గావ్, నోయిడాల్లో ప్రయాణిస్తే మీకు సులభంగా అర్థమవుతుంది. మన దేశ అతిపెద్ద మహానగరాల కేసి చూస్తే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లలో 9 కోట్లమంది జీవిస్తున్నారు. ముంబైలో 60 నుంచి 80 శాతం మంది అర్ధ–మురికివాడల్లో నివసిస్తున్నారు. మనకంటే న్యూజిలాండ్ వంటి చిన్న దేశం 20 రెట్లు మిన్నగా అద్భుత జాతిగా పేరొందింది. మన వాణిజ్య రాజధానిలో న్యూజిలాండ్ కంటే రెండున్నర రెట్లమంది జనం అమానుషమైన జీవన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. భారత్‌లోని ఏ ఇతర నగరంలోనూ చివరకు సర్కారీ ఊహాస్వర్గమైన చండీగఢ్ కూడా మురికివాడలు లేకుండా మనటం లేదు. ముంబైలో మురికివాడగా పిలుస్తుంటే ఢిల్లీలో అనధికారికమైన లేక అక్రమ కాలనీగా పిలుస్తున్నారు. ఢిల్లీ కాలనీని చూస్తే జీవితం ముంబై అంత అధోగతిలో కనిపించకపోవచ్చు కానీ ముంబైకంటే ఉత్తమంగా మాత్రం లేదు. కేన్ విలియమ్స్ వంటి అత్యుత్తమ క్రికెట్ కేప్టెన్ని కన్న న్యూజిలాండ్ కంటే మన జాతీయ రాజధానిలో రెండు రెట్లు అధిక జనాభా ఉంటున్నారు. స్పష్టంగా చెప్పాలంటే వీరిది అక్రమ, అనధికారిక జీవితమే. మన ప్రజా ఆస్పత్రులు, వైద్య సంరక్షణ వ్యవస్థలు, విద్య, కళాశాలలు మొత్తంగా కునారిల్లిపోయి ఉన్నాయి. ఎక్కడకు వెళ్లి చూసినా పోటెత్తుతున్న జనమే. ఇక్కడ చాలామంది జీవితం సబ్ సహారా దేశాల కంటే నాణ్యత కలిగి మాత్రం లేదు. మన నగరాలు ఇంత పాడైపోతూంటే, కోట్లాదిమంది ప్రజలు గ్రామాలు వదిలి ఇప్పటికీ నగరాలకు ఎందుకు పరిగెత్తి వస్తున్నారు? ఎందుకంటే మన గ్రామాలు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. గాలి నాణ్యతతో సహా జీవితానికి సంబంధించిన ప్రతి పరామితిలోనూ అవి మన నగరాల కంటే ఘోరంగా మారిపోతున్నాయి. ప్రపంచంలోనే భారతదేశం అయిదో లేక మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చు కానీ మన నగరాల పట్ల మన ఆలోచనా విధానం మాత్రం మనం గొప్పగా పెంచిపోషిస్తున్న గాంధియన్ కపటత్వంతో కొట్టుమిట్టాడుతోంది. నగరాలు చెడుకు, గ్రామాలు మంచితనానికీ ప్రతీక అనేది మన పురాతన నమ్మిక. భారతదేశం గ్రామాల్లోనే జీవి స్తోందని చెప్పిన గాంధీకి సమాధానంగా అంబేడ్కర్ వేసిన ప్రశ్నను చూడాలి. మన గ్రామాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలా అన్నారాయన. కేంద్ర మంత్రివర్గంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఉండటం అనవాయితీగా ఉంటోంది. కాని స్వాతంత్య్రం వచ్చాక దాదాపు అయిదు దశాబ్దాల వరకు కేంద్రంలో పట్టణాభివృద్దికి పూర్తి మంత్రిత్వ శాఖ లేకపోయింది. కారణం.. భారతదేశం గ్రామాల్లోనే జీవిస్తోంది అనే కాల్పనికభావనకు పాలకులు ప్రభావితులు కావడంతో భారతీయ నగరాలు, పట్టణాల అభివృద్ధికి వాటిలోని పేదల అభ్యున్నతికి తీవ్ర హాని జరిగింది. రాష్ట్రపతి భవన్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఉన్న కాలంలో కూడా ఒకసారి అయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు సభికులు హర్షధ్వానాలు చేశారు. ఆయన కూడా ఆ సందర్బంలో పురా అనే పదాన్ని ఉపయోగించారు. ఇంగ్లీషులో దీన్ని ప్రొవైడింగ్ అర్బన్ ఆమెనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల్లోని సౌకర్యాలను అందించడమని దీనర్థం. మొట్టమొదట, భారతీయ గ్రామం అని మనం చెబుతున్నది పట్టణ స్థాయి మౌలిక వ్యవస్థల నిర్మాణానికి తగిన ఆర్థిక స్థాయిని కలిగి లేదు. ప్రత్యేకించి నీరు, విద్యుత్తు, లేదా మరే ఇతర సౌకర్యాలనైనా కల్పిస్తున్నప్పుడు గ్రామీణులనుంచి రుసుము వసూలు చేయడం భారతీయ రాజకీయ వర్గం ఇష్టపడదు. పైగా మన నగరాలు, పట్టణాలు ఇంత వినాశనకరంగా ఉంటున్నప్పుడు నగర సదుపాయాలు అనే పదాన్ని కలామ్ ఏ అర్థంతో ఉపయోగించినట్లు? నగరాలు, గ్రామాలపట్ల మన ఆలోచనా విధానం ఎంతగా దెబ్బతినిపోయిందంటే దానివల్ల దారుణ ఫలితాలు ఎదురయ్యాయి. నగరాలు చెడుకు, గ్రామాలు మంచికి ప్రతీకలని మనం ఆలోచిస్తుండటంతో భారతీయ నగరాలు ఎన్నడు కూడా ప్రణాళికాబద్ధ నిర్మాణానికి నోచుకోలేదు. నిజానికి అవి తమకు తాముగా స్వయంపాలిత మురికివాడలు, వ్యక్తిగత భవననిర్మాతలు సృష్టించిన భవన ద్వీపాలుగా వృద్ధి చెందుతూ వచ్చాయి. ఈ నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మాఫియా మాత్రమే మొత్తం వ్యవస్ధను నడిపిస్తున్నాయి. కాబట్టే మన నగరాలు మౌలిక వసతుల కల్పన లేకుండానే పెరుగుతూ వచ్చాయి. దాదాపు మూడు తరాల తర్వాత మాత్రమే మన నగరాలకు మౌలిక వసతులు వచ్చాయి. అప్పటికే వాటిలో జీవిస్తున్న కోట్లాది, లక్షలాది ప్రజలకు నీరు, విద్యుత్, రోడ్లు, రైళ్లు, మెట్రోలు అవసరమయ్యాయి. దాంతో నగరాల కింద తవ్వాల్సి వచ్చింది. నగరంపైన నిర్మాణాలు చేయాల్సి వచ్చింది. ఇవి చాలక సముద్రాలపైన వంతెనలు కూడా కట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ మన నగరాల్లోని లక్షలాది కార్లకు, టూ వీలర్లకు సరైన పార్కింగ్ స్థలం నేటికీ ఉండటం లేదు. రహదారుల పక్కన, బహిరంగ స్థలాల్లో మాత్రమే వాటిని పార్క్ చేయాల్సి వస్తోంది. దీనివల్ల ఒక్కోసారి మొత్తం రోడ్డు జామ్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల పేదలు మాత్రమే కాదు.. సంపన్నులు కూడా బాధితులే అవుతున్నారు. ఉదాహరణకు ముంబైలోని వర్లి–పారెల్ అభివృద్ధిలోని తమాషాను ఒకసారి చూడండి. ఈ ప్రాంతంలో గత రెండు దశాబ్దాలుగా ఫ్యాన్సీ అపార్ట్మెంట్లు, బిజినెస్ టవర్ల నిర్మాణం జరి గింది. ఈ ప్రాంతంలోని పాత టెక్స్టైల్ మిల్ భూముల్లో వీటిని నిర్మిం చారు. కానీ ఇక్కడ సైతం ఒక పద్దతిలేకుండా నీటి వసతి నుంచి పార్కింగ్, సెక్యూరిటీ దాకా ఈ నిర్మాణాలన్నీ తమ తమ సొంత మౌలిక వసతులనే నిర్మిస్తూ వచ్చాయి. ఈ కాసిన్ని సౌకర్యాలతో కూడిన నిర్మాణాల మధ్యనే అత్యంత నిరుపేదలతో కూడిన ప్రజారాసులు ఇరుకు జీవితం గడుపుతుంటారు. దీంతో ఆర్థిక స్థితి రీత్యా మాత్రమే కాకుండా, నగరవాసులందరికీ సమాన స్థాయి కల్పించే తరహా అభివృద్ధికి బదులుగా అత్యంత అసమాన జీవిత స్థాయితో కూడిన ఇరుగుపొరుగు జనాలతో ఇలాంటి పట్టణ ప్రాంతాలు నిండిపోయాయి. మరోవైపున అత్యంత విలాసంగా, ఆకర్షణీయంగా కనిపించే గుర్గావ్ భవంతుల కేసి చూడండి. ఇవి భారీ సెప్టిక్ ట్యాంకులు, డీజిల్ రిజర్వాయర్లమీద తేలియాడుతున్నాయి. ఎందుకంటే భారతదేశంలోనే సంస్కరణల తర్వాత అత్యంత ఆకర్షణీయమైన అభివృద్ధిని కనబరుస్తున్న ఈ ప్రాంతంలోనూ ఒక క్రమపద్ధతితో కూడిన మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మించుకోవాలనే ఆలోచనే ఎవరికీ లేకుండా పోయింది. ఇక రెండోది ఏమిటంటే ప్రభుత్వ విద్యుత్ వ్యవస్థను ఎవరూ ఇక్కడ విశ్వసించలేదు. అందుకే ఎక్కడ చూసినా డీజెల్ నిల్వలు కనబడుతుంటాయి. ఇదెంత వింతగొలుపుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఈ వారం జాతి హితం లక్ష్యం ముంబై ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ ను హైకోర్టు అడ్డుకోవడంపై స్పందన. ప్రధాన న్యాయమూర్తి ప్రదీప్ నంద్రజోగ్, న్యాయమూర్తి ఎన్.ఎం. జందార్ ఇచ్చిన 219పేజీల నివేదిక ఈ మధ్యకాలంలో నేను చదివిన అద్భుతమైన తీర్పుల్లో ఒకటి. చట్టానికి లోబడి పర్యావరణానికీ, అభివృద్ధికీ మద్య వివాదం తలెత్తకుండా న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు. వాళ్లు కేవలం ఆ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలు, పర్యావరణ హాని అంశాలపై కాకుండా సాంకేతిక అంశాలను దృష్టిలో పెట్టుకుని తిరస్కరించారు. నగరాభివృద్ధి ప్రాజెక్ట్ కోణంలో మరిన్ని అనుమతులు తీసుకుని ప్రభుత్వం మళ్లీ ముందుకు రావచ్చు. ఈ విషయంలో ఆందోళనకారులపై ఆగ్రహిం చాల్సిన అవసరం లేదు. వాళ్లదే విజయం. తీర్పును క్షుణ్ణంగా చదివితే మీకు బాధ కలుగవచ్చు. అది చట్టంలో లోపం అని నేను చెప్పడం లేదు. ఈ ప్రాజెక్టుకు వన్యప్రాణి సంరక్షణకు సంబంధించిన అనుమతి కూడా అవసరం. ఎందుకంటే, సముద్రం తీరం వెంబడి వున్న అనేక పగడాలు అదృశ్యమైపోతాయని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిందే. ఇంకో ఏడాది గడిస్తే దీని ఖరీదు వేలకోట్లు పెరుగుతుంది. బస్తీల్లో, మురికివాడల్లో నివసించేవారు దీని కోసం ఎదురు చూస్తున్నారు. ‘నాలుగు అడుగుల ఎత్తు ఉండే పగడాలు 2 కోట్ల మంది మానవుల కంటే ఉత్తమమైనవి’ అనే రకం భ్రమలు మనలో పోనంతవరకు మన నగరాలు ఇలాగే కునారిల్లుతూ ఉంటాయి. వాటికంటే దుర్భర స్థితిలో ఉంటున్న మన గ్రామాలనుంచి లక్షలాది జనం నిత్యం అదే నగరాలు, పట్టణాలకు వలస వస్తూనే ఉంటారు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
కాలుష్యం.. చిన్నారుల పాలిట శాపం
ఏటా 17 లక్షల చిన్నారుల మృత్యువాత జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ కాలుష్యం వల్ల ఏటా 17 లక్షల మంది అయిదేళ్లలోపు చిన్నారులు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తేల్చిచెప్పింది. కలుషిత నీరు, ఇంట్లో పొగతాగడం, పారిశుధ్యం లేకపోవడం తదితర కారణాల వల్ల చిన్నారుల్లో మరణాలు ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ సోమవారం తన నివేదికలో తెలియజేసింది. పిల్లల్లో ఎక్కువమంది డయేరియా, మలేరియా, న్యుమోనియాతో చనిపోతున్నారని తేల్చిచెప్పింది. వాతావరణ కాలుష్యం చిన్నారుల పట్ల శాపంగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్గరెట్ చాన్ ఆవేదన వ్యక్తం చేశారు. లేత శరీరాలు, అప్పుడప్పుడే ఏర్పడుతున్న రోగనిరోధక వ్యవస్థ ఈ కాలుష్యాన్ని తట్టుకోలేక పోతున్నాయని చాన్ విశ్లేషించారు. ‘ప్రతి సంవత్సరం న్యుమోనియా వల్ల అయిదేళ్లలోపు 5,70,000 మంది చిన్నారులు చనిపోతున్నారు. పరిశుభ్రమైన నీరు దొరక్క డయోరియాతో 3,61,000 మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. పుట్టిన చిన్నారుల్లో దాదాపు 2.70 లక్షల మంది అపరిశుభ్ర వాతావరణం కారణంగా నెలరోజుల్లోనే కన్నుమూస్తున్నారు. మలేరియాతో ఏడాదికి 2 లక్షల మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. మరో రెండు లక్షల మంది అయిదేళ్లలోపు పిల్లలు గాయాలు విషపూరితమై చనిపోతున్నారు. విషపూరితమైన పర్యావరణం మన పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంద’ ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ మారియా నైరా తెలిపారు. పరిశుభ్రమైన నీటిని అందించడంతో పాటు పునర్వియోగ ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ కాలుష్యాన్ని చాలా వరకూ తగ్గించవచ్చని నీరా అభిప్రాయపడ్డారు. వాయు కాలుష్యం వల్ల నెలలు నిండకుండానే పిల్లలు పుడుతున్నారని తెలిపింది. -
చిగురంత ఆశ
= చిరు ధాన్యాలతో ఆహార భద్రతకు భరోసా = పోషక విలువలతో కూడిన ఆహారం = పట్టణాల్లోనూ పెరుగుతున్న వినియోగం అనకాపల్లి, చింతపల్లి, న్యూస్‌లైన్: పోషక విలువలతో కూ డిన తృణ, చిరు ధాన్యాలపై నేడు విస్తృత ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత కలుషిత వాతావరణంలో అందరి చూపు ఆరోగ్యంపై పడింది. రుచికరమైన తిండికి ప్రాధాన్యమిస్తూనే పోషక విలువల కోసం ఎదురుచూస్తున్నారు. మన దేశంలో అధికంగా వరి, గోధుములనే ఆహారంగా స్వీకరి స్తున్నా.. ఆహార భద్రతకు సవాళ్లు ఎదురవుతున్న తరుణం లో చిరు ధాన్యాలైన రాగి, కొర్ర, సామా పంటలపై దృష్టి సారిస్తున్నారు. దీనిలో అగ్ర స్థానం రాగి (చోడి) పంటదే. ఏజెన్సీలో ఎక్కువగా సాగు చేసే చోడి పంటను ప్రోత్సహించేందుకు ఇప్పటికే ఇన్సింప్, ఆత్మ, ట్రైబల్ సబ్‌ప్లాన్, పరిశోధన కేంద్రాలు పలు పథకాలను అమలు చేస్తున్నా యి. దశాబ్ద కాలం క్రితం వరకు ఆశాజనకంగా ఉన్న చిరుధాన్యల విస్తీర్ణం కొన్నాళ్లు తగ్గి మళ్లీ ఊపందుకుంటుంది. చిరు ధాన్యాలైన ఊద, వరిగా, అరికా పంటలను దాదాపు గా సాగు చేయడం మానేశారు. ఉన్నా ఆ పంటలు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోనే. సామా పంట ఏజెన్సీకే పరిమితమైంది. సామాతో తయారు చేసిన అంబలి, అన్నాలను ఇప్పటికీ ఏజెన్సీవాసులు ఇష్టంగా భుజిస్తారు. కొర్రలతో చేసిన జావ గిరిజనులకు బహు ప్రీతి. ఈ రెండు పంటల లోను పోషక విలువలు అద్భుతంగా ఉన్నా మైదాన ప్రాం తవాసులు సాగు చేయడం లేదు. చిరు ధాన్యాలలో అత్యం త ప్రాధాన్యం సంతరించుకున్న రాగి (చోడి)తో చేసిన అంబలిని ఇప్పుడు అన్ని ప్రాంతాల వారు ఉదయాన్నే స్వీకరిస్తున్నారు. రాగితో చేసిన బిస్కెట్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్య పరిరక్షణ కోసం కొనుగోలు చేస్తున్నారు. ఎటువంటి వాతావరణంలోనైనా... చిరు ధాన్యాలలో అధికంగా వినియోగించే రాగిని ఎటువం టి వాతావరణంలోనైనా సాగు చేసుకోవచ్చు. పంట కాలం కనిష్టంగా 85 రోజులు నుంచి గరిష్టంగా 120 రోజుల వర కు ఉంటుంది. మన జిల్లాలో ఖరీఫ్‌లో ఏజెన్సీలోను, రబీలో అన్ని ప్రాంతాల్లోను రెండవ పంటగా సాగు చేస్తున్నారు. వేసవి కాలం సైతం సాగుకు అనుకూలం. ఇటీవల కాలం లో మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉండడం సానుకూలమైన పరిణామం. పెరిగిన విస్తీర్ణం దేశంలో చిరుధాన్యాల విస్తీర్ణం నాలుగు లక్షల హెక్టార్లు కాగా ఒక్క మన రాష్ట్రంలోనే లక్ష హెక్టార్లు. దీనిలో అగ్ర తాంబూలం చోడి(60 వేల హెక్టార్లు)కి దక్కుతుంది. చిరుధాన్యాలను అధికంగా ఉత్తర కోస్తాలోనే సాగు చేస్తారు. కొర్రను నంద్యాల పరిసరాలలో అధికంగా పండిస్తారు. 2001-02 సీజన్లో విశాఖ జిల్లాలో రాగి 34 వేల హెక్టారల్లోను, సామా 22 వేల హెక్టార్లల్లోను సాగైంది. దీనికితోడు కొర్రలు, ఊద, వరిగ, అరిక పంటల విస్తీర్ణం కూడా తోడైంది. దశలవారీగా రాగి విస్తీర్ణం పడిపోయింది. 2008-09 సంవత్సరానికి 27 వేల హెక్టార్లకు రాగి విస్తీర్ణం పరిమితమైంది. 2012లో రాగి మరీ దయనీయంగా 18 వేల 458 హెక్టార్లకు పడిపోగా తాజాగా ముగిసిన ఖరీఫ్ సీజన్లో 23 వేల 268 హెక్టార్లల్లో రాగి పంట సాగైంది. మరో 11 వేల 312 హెక్టార్లల్లో ఇతర చిరుధాన్యాలు సాగవ్వగా జొన్న 441 హెక్టార్లలో, సజ్జ 3 వేల 37 హెక్టార్లకు చేరింది. అయితే చిరుధాన్యాల పంటల అభివృద్ధికి పలు పథకాలు తోడవ్వడంతోపాటు మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉండడంతో చిరుధాన్యాల విస్తీర్ణం మరింత పెరగనుందని వ్యవసాయాధికారులు ఆశిస్తున్నారు. చోడిలోని రకాలు... చోడిలో ప్రస్తుతం శ్రీ చైతన్య (కాల పరిమితి 115 -120 రోజులు) రకం అత్యంత ప్రాచుర్యంలో ఉంది. ఇదే కాకుం డా గోదావరి, రత్నగిరి, భారతి, చంపావతి, తెల్లరాగులను రైతులు వినియోగిస్తున్నారు. అయితే జిల్లాలో పంటలను వేగంగా పూర్తి చేయాలని భావించే వారు బురదచోడిని ఆశ్రయిస్తున్నారు. కానీ ఇది అధికంగా పురుగులు, తెగుళ్లు దాడికి లోనవుతున్నందున రైతులు నష్టపోతున్నారు. 90 రోజులు కాలపరిమితి ఉండే బురదచోడి పంటల మధ్య విరామ సమయంలో రైతులు వినియోగిస్తున్నారు. తెల్లరాగి ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ దీనికి అధికంగా నైట్రోజన్ అవసరం ఉంటుంది. ఆరోగ్య ప్రదాయిని ఇనుము, కాలుష్యం వంటి ఖనిజ లవణాలు చిరు ధాన్యాలలో లభిస్తాయి. పీచు పదార్ధం కావడంతో సులభంగా జీర్ణమవుతుంది. దీంతో ఆధునిక కాలంలో ప్రతి వైద్యుడు చిరు ధా న్యాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. రాగులు, కొర్రలు, సామలు, సజ్జల వంటి చిరు ధాన్యాల్లో ఉండే ఇనుము రక్త సరఫరాను మెరుగుపర్చి శరీరంలో ఆక్సిజన్ సరఫరాకు ఉపయోగపడుతుంది. ఈ ధాన్యాల్లో లభించే మెగ్నీషియం ఆస్తమా, లోబీపీ, మైగ్రేన్, గుం డె జబ్బులు రాకుండా నివారిస్తుంది. శరీరంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. రాజ్మా చిక్కుళ్లలో ఉండే మాంసకృత్తులు, అమైనోఆమ్లాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. మినుముల్లో ఉండే విటమిన్-ఎ, అమైనో ఆమ్లాలు చర్మ సౌం దర్యానికి, అంధత్వ నివారణకు, స్త్రీలలో గర్భం నిలవడానికి దోహదపడుతుంది. రుతుక్రమం సమయంలో కడుపు, నడుం నొప్పులను తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కందిపప్పులో ఉండే పోలిక్ యాసిడ్ స్త్రీలలో రక్తహీనత తగ్గిస్తుంది. మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్స్ మెదడును చురుకుగా పనిచేసేలా చేయడంతోపాటు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తా యి. పెసరపప్పులో ఉండే ఇనుప ఖనిజం స్త్రీలు, పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. మొలకెత్తిన పెసలను ఉపయోగించడం వలన త్వరగా సన్నబడతారు. శనగ పప్పులో ఉండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థలో ఉండే చిన్నచిన్న సమస్యలు తొలగిస్తుంది. పోషక విలువలతో చక్కని ఆరోగ్యం తృణ చిరుధాన్యాలతో ఎన్నో రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. చిరుధాన్యాలు ప్రతి రోజు ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మం చిది. రాజ్మా, కందిపప్పు, సోయాబీన్స్, పెసలులో ఉండే పోషక పదార్ధాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వివిధ రకాల వ్యాధులకు ఈ ధాన్యాలు దివ్య ఔషధం వంటివి. -సునీత, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, చింతపల్లి