కోవిడ్–19.. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి. దాని నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా జనం మాస్కులు, చేతికి ప్లాస్టిక్ తొడుగులు, పీపీఈ కిట్లు, కరోనా టెస్టింగ్ కిట్లు, ప్లాస్టిక్ శానిటైజర్ సీసాలు విపరీతంగా ఉపయోగించారు. వీటిలో చాలావరకు ఒకసారి వాడి పారేసేవే. ఇవన్నీ చివరికి ఏమయ్యాయో తెలుసా? వ్యర్థాలుగా మారి సముద్రాల్లో కలిసిపోయాయి. ఎంతగా అంటే ఏకంగా 25,000 టన్నులకుపైగా పీపీఈ కిట్లు, ఇతర కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలు, నదులు, చెరువుల్లోకి చేరుకున్నాయి. ఇంకా చేరుతూనే ఉన్నాయి. ఇవి జల వనరుల్లోని జీవజాలం పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
జీవ జాతులకు ప్రత్యక్ష ముప్పు
2019 డిసెంబర్‌లో కరోనా మహమ్మారి జాడ తొలుత చైనాలో బయటపడింది మొదలు 2021 ఆగస్టు వరకే 193 దేశాల్లో ఏకంగా 84 లక్షల టన్నుల కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడినట్లు అంచనా. వీటిలో ఏకంగా 70 శాతం జల వనరుల్లోకి చేరుకున్నాయని చెబుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సురక్షితంగా నిర్వీర్యం చేయడానికి సరైన సదుపాయాలు లేకపోవడమే ప్రధాన సమస్య అంటున్నారు. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ప్రపంచమంతటా నెలకు ఏకంగా 129 బిలియన్ల మాస్కులు, 65 బిలియన్ల గ్లౌజ్‌లు వాడేసినట్టు అంచనా. వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో ఇవి వ్యర్థాలుగా మారిపోయాయి.
మాస్కు.. ప్లాస్టిక్ బాంబు
ఒకసారి వాడి పారేసే ఫేస్ మాస్కులను ప్లాస్టిక్ బాంబుగా పరిశోధకులు అభివర్ణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మాస్క్‌లు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ కిట్ల ముప్పు ఇప్పటికిప్పుడు ప్రత్యక్షంగా అనుభవంలోకి రాకున్నా రానున్న దశాబ్దాల్లో మాత్రం వాటి ప్రభావం దారుణంగా ఉంటుందని చెప్పారు. భూమిపై, సముద్రంలో ఉంటే జీవజాలానికి ప్రమాదం తప్పదని, వ్యర్థాల నిర్వహణపై ప్రపంచదేశాలు ఇప్పటికైనా దృష్టి పెట్టాలని సూచించారు.
వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలని, సామర్థ్యం పెంచుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారులు దాడి చేస్తే పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఇప్పటి నుంచి సన్నద్ధం కావాలని ప్రభుత్వాలకు హితవు పలికారు. వాడి పారేసిన పీపీఈ కిట్లు, మాస్క్‌ల కుప్పల్లో పక్షులు చిక్కుకుపోయి విలవిల్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాల్లో అత్యధికంగా ఆసుపత్రుల నుంచి వెలువడినవే కావడం గమనార్హం.
ఇవీ ప్రత్యామ్నాయాలు...
► చేతులు శుభ్రం చేసుకోవడానికి ప్లాస్టిక్ సీసాల్లో వచ్చే శానిటైజర్ కంటే వేడినీరు, సబ్బు వాడుకోవడం ఉత్తమం. సబ్బులు ఇప్పుడు భూమిలో సులభంగా కలిసిపోయే ప్యాకేజింగ్‌లో వస్తున్నాయి. ప్లాస్టిక్ సీసాల్లోని హ్యాండ్ శానిటైజర్లు కాకుండా సబ్బులు వాడుకుంటే పర్యావరణానికి ఎంతోకొంత మేలు చేసినట్టే.
► సింగిల్ యూజ్ ఫేస్‌మాస్క్‌లు వాడితే ప్రతి ఏటా కోట్లాది టన్నుల వ్యర్థాలు పేరుకుపోతాయి. వీటికంటే పునర్వినియోగ మాస్క్‌లు మంచివి. అంటే శుభ్రం చేసుకొని పలుమార్లు వాడుకునేవి. వీటిని వాషబుల్ మాస్క్‌లు అని పిలుస్తున్నారు. వీటిని పర్యావరణహిత మెటీరియల్‌తో తయారు చేస్తున్నారు.
► ప్లాస్టిక్ ముప్పు తెలిసినవారూ కరోనా సమయంలో వైరస్ భయంతో ప్లాస్టిక్ బ్యాగ్‌లు వాడారు. కానీ కాగితపు సంచులు, బట్ట సంచులు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు.
► హోటళ్లలో వాడే ప్లాస్టిక్ పొర ఉన్న కాగితపు కప్పులు లక్షల టన్నుల వ్యర్థాలుగా మారుతున్నాయి. గాజు, పింగాణి గ్లాసులను వేడి నీరు, సబ్బుతో శుభ్రం చేసి వాటిని మళ్లీ ఉపయోగించుకోవడం దీనికి మంచి ప్రత్యామ్నాయం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment