oceans
-
ప్లాస్టిక్ ప్రళయం
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని ప్లాస్టిక్ మింగేస్తోంది. సముద్ర జీవులు, అడవి జంతువులను హరించడంతో పాటు మానవుల ఆహారంలోకి చొరబడుతోంది. గ్లోబల్ ప్లాస్టిక్ కాలుష్యం 1950లో రెండు మిలియన్ టన్నులు ఉండగా.. తాజా వినియోగం 391 మిలియన్ టన్నులను దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి చిన్న పనిలోనూ ప్లాస్టిక్‌పై ఆధారపడటంతో వీటి వినియోగం క్రమేపీ ఎక్కువైంది. ఇది 2040 నాటికి రెట్టింపు అవుతుందని పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారు. పండ్లలోనూ ప్లాస్టిక్ భూతమే మానవులు తరచూ తినే పండ్లు, కూరగాయలను కూడా ప్లాస్టిక్ వదలడం లేదు. తాజాగా ఇటలీలోని కాటానియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు క్యారెట్, పాలకూర, యాపిల్స్, బేరి పండ్లలో చిన్నచిన్న ప్లాస్టిక్ కణాలను కనుగొన్నారు. యాపిల్స్‌లో అత్యధికంగా సగటున గ్రాముకు 1.95 లక్షలు, బేరిలో 1.89 లక్షలు, క్యారెట్, బ్రొకోలీలో లక్ష వరకు అతి సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులను గుర్తించారు. ప్లాస్టిక్ కలుషిత నీరు, భూమి ద్వారా ఆహార ఉత్పత్తుల్లోకి చేరుతున్నట్టు పేర్కొన్నారు. తాబేలు పొట్టలోనూ చేరుతోంది గతంలో సముద్ర తీరాల్లో అకారణంగా తాబేళ్లు మృత్యువాత పడుతుండటంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అరచేతిలో ఒదిగిపోయే చిన్న తాబేలు పొట్టలో దాదాపు 140 మైక్రో ప్లాస్టిక్ ముక్కలను కనుగొన్నారు. ప్రస్తుతం ఏటా 11 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతుండగా.. ఇది వచ్చే 20 ఏళ్లల్లోపే మూడు రెట్లు పెరగనుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 800కి పైగా సముద్ర, తీర ప్రాంత జాతులను ఆహారంగా తీసుకున్న వేలాది మంది ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు, వారి రక్తంలో అతి సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు ఉన్నట్టు వైద్యులు నిర్థారించారు. ముఖ్యంగా ప్రపంచంలో 1,557 సముద్ర జాతులు వేగంగా అంతరించిపోతున్నాయి. వీటిలో ఎక్కువ శాతం జీవులు ప్లాస్టిక్‌ను ఆహారంగా తీసుకుంటున్నాయని తేలింది. గజరాజుల పాలిట ప్లాస్టిక్ పాశం గతేడాది భారత దేశంలోని పెరియార్ అటవీ ప్రాంతంలో 20 ఏళ్ల అడవి ఏనుగు మృతి చెందింది. ప్రతి శీతాకాలంలో శబరిమలకు అడవుల ద్వారా కాలినడకన వెళ్లే లక్షలాది మంది భక్తులు విచ్చలవిడగా పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను తినడంతో పేగుల్లో అంతర్గత రక్తస్రావం, అవయవాలు విఫలమై అది చనిపోయినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక్క ఏనుగులే కాదు అతి శక్తివంతమైన వేటాడే జీవులైన హైనాలు, పులులతో పాటు జీబ్రాలు, ఒంటెలు, పశువులతో సహా భూ ఆధారిత క్షీరదాలు ప్రమాదవశాత్తు ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మృత్యువాత పడుతున్నాయి. భూసారానికి పెనుముప్పు ప్లాస్టిక్‌లోని మైక్రో ప్లాస్టిక్స్ భూసారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా భూమికి మేలు చేసే మిత్ర పురుగులు, లార్వాలు, అనేక కీటకాల క్షీణతలకు దారి తీస్తోంది. ప్లాస్టిక్ ఫుడ్ ప్యాకేజింగ్, ప్లాస్టిక్ గొట్టాలు, బయోవ్యర్థాలు హానికరమైన రసాయనాలను మట్టిలోకి విడుదల చేస్తాయి. అవి భూగర్భ జలాల్లోకి ప్రవేశించి నీటిని సైతం కలుషితం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడం, ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్‌పై అనేక స్వచ్ఛంద సంస్థలు, ఐక్యరాజ్య సమితి పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా 77 దేశాలు పాస్టిక్‌పై శాశ్వత, పాక్షిక నిషేధాన్ని విధించాయి. -
నీటి అడుగు రాజ్యాలు.. కాలుష్య కాసారాలు
మహా సముద్రాలు మన గ్రహానికి ఊపిరితిత్తులు. మానవ తప్పిదాల కారణంగా ఆ మహా సముద్రాలు కాలుష్య కాసారాలుగా మారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. భూ ఉపరితలంపై దాదాపు 70 శాతం నీటితో విలువైన వనరులుగా ఉంటూ.. భూమికి ఆక్సిజన్ సరఫరా చేయడంతోపాటు అనేక జాతుల మొక్కలకు, జంతువులకు నిలయంగా జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నాయి. అంతటి మహా సముద్రాలను ప్లాస్టిక్ పొరలు చుట్టేస్తున్నాయి. సాగర గర్భంలోని జాతులను నాశనం చేస్తున్నాయి. సముద్ర కాలుష్యంపై నిర్వహించిన అధ్యయనాల ప్రకారం ఏటా సుమారు 12 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తోంది. దీని బరువు లక్ష నీలి తిమింగలాలకు సమానం. ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోని చేపల కంటే ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అతిపెద్ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్‌తో నిండిపోయింది. ఇందులో 1.8 ట్రిలియన్ ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయి. దీని విస్తీర్ణం అమెరికాలోని టెక్సాస్ భూ భాగానికి రెండింతలు. - సాక్షి, అమరావతి సముద్ర కాలుష్యం ఇలా.. ♦ సముద్ర కాలుష్యం అనేది కేవలం ప్లాస్టిక్, ఇతర కాలుష్య కారకాల వల్లే కాకుండా.. ఓడలు నుంచి వెలువడే శబ్ద కాలుష్యం కూడా పెను ప్రమాదంగా ఉంది. తిమింగలాలు, డాల్ఫిన్లు వంటి అనేక సముద్ర క్షీరదాలు నీటిలో తమ పరిసరాలను అర్థం చేసుకోవడానికి శబ్దాలు చేయడం ద్వారా సంభాషించుకుంటాయి. దీనిని ఎకోలోకేషన్గా పిలుస్తారు. అయితే ఓడలు, సోనార్లు, ఇతర పరికరాల నుంచి వచ్చే కృత్రిమ శబ్దాలు సముద్ర జీవుల కమ్యూనికేషన్‌ను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా వలసలు చెదిరిపోవడంతో పాటు వాటి పునరుత్పత్తి, ఆహార వేట ప్రక్రియలను ప్రభావితం చేస్తోంది. ఒక్కోసారి ఓడలను ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడుతున్నాయి. ♦ చర్మ సౌందర్యానికి వినియోగించే సన్ స్క్రీన్ల తయారీలో పగడాలు, ఇతర సముద్ర జీవులను వాడటం వాటికి ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఆ జీవుల్లోని ఆక్సిబెంజోన్, ఆక్టినోక్సేట్ వంటి రసాయనాలు చర్మ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ♦ సముద్రంలో ముడి చమురు ట్యాంకర్లు రవాణా చేస్తున్నప్పుడు చమురు లీకవడంతో ఆ నీటిలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గుతున్నాయి. ఆ చమురు సముద్ర జీవుల రెక్కలకు బలంగా అంటుకోవడంతో ఈదే శక్తిని కోల్పోతున్నాయి. ఆ నీటిలోని చేపలు తినడంతో మానవ ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ♦ వ్యవసాయంలో విచ్చలవిడిగా వినియోగించే కృత్రిమ రసాయనాలు, పరిశ్రమల ద్వారా వెలువడే కలుíÙత నీరు.. చిన్నచిన్న ప్రవాహాలు, నదుల ద్వారా సముద్రాల్లోకి కలుస్తాయి. లోతైన సముద్రపు మైనింగ్ కారణంగా నీటి అడుగున జీవం ఉనికి కోల్పోతోంది. ♦ కృత్రిమ కాంతి కాలుష్యం కూడా సముద్ర జీవుల జీవనాన్ని ప్రభావితం చేస్తోంది. ఉదాహరణకు.. ఒక పిల్ల తాబేలు దాని గుడ్డు నుంచి బయటకు వచి్చనప్పుడు, అది సముద్రాన్ని కనుగొనడానికి చంద్రకాంతిని అనుసరిస్తుంది. సముద్రతీర రెస్టారెంట్లు, బీచ్ సైడ్ క్యాబనాస్ (గుడారాలు), క్యాంప్ ఫైర్ల వెలుతురు వాటిని అడ్డుకుంటుంది. మహా సముద్రాల్లో 500 డెడ్ జోన్లు వివిధ రకాల సముద్ర కాలుష్యం కారణంగా ఏటా 100 మిలియన్ సముద్ర జంతువులు ప్రాణాలు కోల్పోతున్నట్టు శాస్త్రవేత్తల అంచనా. ఇది వెయ్యికి పైగా సముద్ర జాతుల ఉనికిపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. మహా సముద్రాల కాలుష్యం 500 డెడ్ జోన్లను సృష్టించింది. ఇక్కడి ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువ ఉండటంతోపాటు జీవం ఉనికే ఉండని పరిస్థితి ఏర్పడింది. సముద్రాల్లో మితిమీరిన చేపల వేట కూడా ప్రమాదకరమని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మితిమీరిన చేపలు వేట, కాలుష్యం కారకాల నుంచి సముద్రాలను రక్షించాలని ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలు తీర్మానించాయి. 2030 నాటికి ప్రపంచంలోని 30 శాతం భూమి, సముద్రాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని ఒప్పందం చేసుకున్నాయి. ఇక స్విస్ ఆధారిత ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) రెడ్ లిస్ట్ జాబితా ప్రకారం నీటి అడుగున మొక్కలు, జంతువులు 10 శాతం అంతరించిపోయే స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. చేపల ద్వారా మానవ దేహంలోకి ప్లాస్టిక్ సముద్రాల్లో ప్లాస్టిక్ సీసాలు, బ్యాగ్‌లు, సిగరెట్ పీకలు, స్ట్రాలు, టైర్లు, వేట వలలు వంటివి చేపలు, ఇతర జీవుల మరణాలకు కారణమవుతున్నాయి. తాబేళ్లు, సముద్ర పక్షులు కొన్నిసార్లు వాటిని ఆహారంగా భావించి తినడంతో వాటి జీర్ణ వ్యవస్థ కోసుకుపోయి.. చివరికి ఆకలితో మరణిస్తున్నాయి. సాగరాల్లోని మైక్రో ప్లాస్టిక్‌లను చేపలు తింటుంటే.. ఆ చేపలను తిన్న మనుషుల శరీరాల్లోకి ప్లాస్టిక్ చేరుతోంది. ఉత్తర పసిఫిక్ తీరంలోని చేపలు ఏడాదికి 24 వేల టన్నుల ప్లాస్టిక్ ముక్కలు తింటున్నట్టు.. అవి మానవుల ఆహారంలో కలుస్తున్నట్టు కనుగొన్నారు. కాలిఫోరి్నయాలోని మార్కెట్లో విక్రయించే నాలుగింట ఒక వంతు చేపల పొట్టల్లో ప్లాస్టిక్ మైక్రో ఫైబర్స్‌ను గుర్తించారు. ఇక్కడ ఒక వ్యక్తి ఏడాదికి సగటున 74 వేల మైక్రో ప్లాస్టిక్లు తింటున్నట్టు తేల్చారు. భారతదేశంలో సముద్రంలో చేరే చెత్తలో 60 శాతం ప్లాస్టిక్ ఉంటోంది. స్వచ్ఛ్ సాగర్, సురక్షిత్ సాగర్ క్యాంపెయిన్ ప్రకారం ఇక్కడి సముద్ర తీరంలోని ప్రతి కిలో మీటరుకు సగటున 0.98 మెట్రిక్ టన్నుల చెత్తను గుర్తించారు. -
సముద్ర గర్భంలో ప్లాస్టిక్ పాగా!
సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఐదు మహాసముద్రాలు ప్లాస్టిక్ వ్యర్థాలకు కూపాలుగా మారాయా? సముద్ర గర్భం, ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడానికి అవే కారణమా? రుతుపవనాల గమనాన్ని ప్రభావితం చేస్తూ ఎల్‌నినో (పసిఫిక్ సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం), లానినో(పసిఫిక్ సముద్ర ఉష్ణోగ్రతలు తగ్గడం)ల సయ్యాటకు అవే దోహదం చేస్తున్నాయా? ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోతే భారీ ఉత్పాతాలు తప్పవా? అంటే అవుననే అంటోంది ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక. పర్యావరణ స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం అధ్యయనం చేస్తూ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు ఇవీ.. ప్లాస్టిక్ వ్యర్థాల డస్ట్‌బిన్‌గా మహాసముద్రాలు.. వివిధ దేశాల నుంచి ఏటా పది లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆసియా ఖండంలోని ఫిలిప్పీన్స్, భారత్, మలేసియా, చైనా, ఇండోనేషియా, మయన్మార్, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ దేశాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు అత్యధికంగా కడలిలోకి చేరుతున్నాయి. దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్ నుంచి కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు అత్యధికంగా సముద్రంలో కలుస్తున్నాయి. ఇప్పటికే కడలిలో 6.75 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. అమెరికాలోని కాలిఫోర్నియా, హవాయి రాష్ట్రాల మధ్య పసిఫిక్ మహాసముద్రంలో చేరిన ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం ఫ్రాన్స్ దేశం విస్తీర్ణం కంటే మూడింతలు అధికం కావడం గమనార్హం. నియంత్రించకుంటే ఉత్పాతాలే.. సముద్రంలోకి ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా చేరడం వల్ల.. సముద్ర ఉష్ణోగ్రతల్లో భారీ వ్యత్యాసాలు చోటుచేసుకుంటున్నాయి. కడలి గర్భం, ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులకు ప్లాస్టిక్ వ్యర్థాలే కారణం. ఇదే పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో, లానినో ప్రభావాలు ఏర్పడటానికి దారితీస్తోంది. లానినో ప్రభావం ఉంటే.. రుతుపవనాల గమనం సక్రమంగా ఉంటుంది. అప్పుడు ప్రధానంగా భారత్ సహా ఆసియా దేశాల్లో సక్రమంగా వర్షాలు కురుస్తాయి. అదే ఎల్‌నినో ప్రభావం ఏర్పడితే.. రుతుపవనాల గమనం అస్తవ్యస్తంగా ఉంటుంది. భారత్ సహా ఆసియా దేశాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే.. సాగు, తాగునీటికి ఇబ్బంలు తప్పవు. ఇది అంతిమంగా ఆహార సంక్షోభానికి.. తద్వారా ఆకలి చావులకు దారితీస్తుంది. ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావం వల్ల సముద్రంలో ఉష్ణప్రవాహాలు పెరగడంతో మత్స్యసంపద నానాటికీ తగ్గిపోతోంది. మత్స్యకారుల ఉపాధినే కాదు.. ఇది పర్యావరణాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తోంది. కారణాలు ఇవే.. ఆయా దేశాల్లో పేదరికం, తీర ప్రాంతం, వర్షపాతం అధికంగా ఉండటం, వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్లే ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా సముద్రంలోకి చేరుతున్నాయి. ఉదాహరణకు ఫిలిప్పీన్స్ ఏడు వేల ద్వీపాల సముదాయం. 36,289 కి.మీ.ల తీర ప్రాంతం ఆ దేశం సొంతం. ఆ దేశంలో 4,820 నదులు కడలిలో కలుస్తున్నాయి. అక్కడ పేదరికం అధికంగా ఉండటం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడికక్కడే పడేస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు వర్షపు నీటితో కలిసి వాగుల్లోకి.. అక్కడి నుంచి నదుల్లోకి.. వాటి మీదుగా సముద్రంలోకి చేరుతున్నాయి. ఏటా సముద్రంలో కలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో 35 శాతం ఫిలిప్పీన్స్‌కు చెందినవి కావడానికి ఇదే కారణం. అలాగే బ్రెజిల్ నుంచి అమెజాన్‌తోపాటు 1,240 నదులు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ దేశం నుంచి ఏటా 37,779 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు కడలిలోకి చేరుతున్నాయి. -
‘నాసా’ సైంటిస్టుల పురోగతి.. సౌర కుటుంబం అంచున జలరాశి!
జీవుల మనుగడకు ఆధారం జలం. భూగోళంపై తొలుత నీరు, ఆ తర్వాత మనుషులతో సహా రకరకాల జీవులు పుట్టుకొచ్చినట్లు అనేక పరిశోధనల్లో తేటతెల్లమయ్యింది. మొట్టమొదటి జీవి నీటిలోనే పుట్టిందట. విశ్వంలో భూమిపైనే కాకుండా ఇంకెక్కడైనా జలరాశి ఉందా? అనేదానిపై సైంటిస్టులు శతాబ్దాలుగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇతర గ్రహాలు లేదా వాటి ఉపగ్రహాలపై నీటి జాడ ఉన్నట్లు తేలితే అక్కడ జీవులు సైతం ఉండేందుకు ఆస్కారం లేకపోలేదు. సూర్యుడి ప్రభావం పెద్దగా ఉండని సౌర వ్యవస్థ అంచుల్లోనూ జల అన్వేషణ సాగుతోంది. ఈ విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సైంటిస్టులు పురోగతి సాధించారు. మన సౌర కుటుంబం కొసభాగాన యురేనస్ గ్రహానికి చెందిన ఉపగ్రహాలపై మహా సముద్రాలు ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు కనిపెట్టారు. ► యురేనస్ గ్రహానికి దాదాపు 27 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి యురేనస్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. వీటిలో ఏరియల్, అంబ్రియెల్, టైటానియా, ఒబెరాన్, మిరండా అనేవి ప్రధానమైనవి. ఇందులో టైటానియా అన్నింటికంటే పెద్దది. ► యురేనస్‌పై పరిశోధనల కోసం 1980వ దశకంలో ప్రయోగించిన వొయేజర్–2 అంతరిక్ష నౌక అందించిన సమాచారాన్ని, నాసా ప్రయోగించిన గెలీలియో, కాసినీ, డాన్, న్యూహోరిజాన్స్ స్పేస్‌క్రాఫ్ట్‌లు పంపించిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించారు. ఇందుకోసం నూతన కంప్యూటర్ మోడల్‌ను ఉపయోగించారు. ► యురేనస్ ఉపగ్రహాల అంతర్గత నిర్మాణం, వాటి ఉపరితలం స్వభావాన్ని సూక్ష్మస్థాయిలో పరిశీలించారు. ► ప్రధానమైన ఐదు ఉపగ్రహాల్లో నాలుగు ఉపగ్రహాల ఉపరితల పొర అంతర్గత వేడిని రక్షిస్తున్నట్లు గుర్తించారు. అంటే ఉపగ్రహ అంతర్భాగంలోని వేడి బయటకు వెళ్లకుండా ఆ పొర నిరోధిస్తున్నట్లు కనిపెట్టారు. ► ఏదైనా గ్రహంపై సముద్రం ఏర్పడాలంటే దాని అంతర్భాగంలో తగిన ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ ఉండాలి. ► సాధారణంగా గ్రహాల లోపలి భాగంలో సలసల కాగే శిలాద్రవం(లావా) ఉష్ణోగ్రతను విడుదల చేస్తూ ఉంటుంది. సముద్రాల ఉనికికి ఈ లావా నుంచి వెలువడే ఉష్ణం తోడ్పడుతుంది. యురేనస్ ఉప గ్రహాల్లో ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వెల్లడయ్యింది. ► సౌర వ్యవస్థ అంచున మిరండా సహా నాలుగు ఉపగ్రహాలపై సముద్రాలు కచ్చితంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నామని పరిశోధకులు వెల్లడించారు. ► యురేనస్ ఉపగ్రహాలపై ఉన్న సముద్రాల్లో క్లోరైడ్, అమోనియా వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండే అవకాశం ఉన్నట్లు భావిన్నారు. ► యురేనస్ గ్రహం సూర్యుడి నుంచి ఏడో గ్రహం. ఇది వాయువులతో నిండిన భారీ మంచు గ్రహం. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో యురేనస్‌ను ఇటీవల పరిశీలించారు. అది చిన్నపాటి సౌర వ్యవస్థతో కూడుకొని ఉన్న గ్రహమని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సముద్రంలో ‘పవన విద్యుత్’
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే... సహజ ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలనేది వాటి లక్ష్యం. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన (విద్యుత్) ఉత్పత్తికి ప్రాధాన్యత పెరుగుతోంది. స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించాల్సిన ఆవశ్యకతపై ప్రపంచ దేశాలన్నీ కలిసి ఇప్పటికే ఒక తీర్మానాన్ని కూడా చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సౌర విద్యుత్‌తోపాటు పవన విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో సరికొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు కొండలు, మైదాన ప్రాంతాల్లోనే పవన విద్యుత్ ప్లాంట్లు ఉండగా.. కొద్దికాలంగా సముద్రంలోనూ పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. 2026 నాటికి దాదాపు 20 గిగావాట్లు పవన విద్యుత్ సామర్థ్యం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూసీ) తాజా నివేదిక ప్రకారం... 2021లో ప్రపంచ పవన విద్యుత్ పరిశ్రమ కొత్తగా 93.6 గిగావాట్లు వృద్ధిని నమోదు చేసింది. దీంతో మొత్తం పవన విద్యుత్ పరిశ్రమ సామర్థ్యం 837 గిగావాట్లకు చేరింది. ఇది ఏటా 1.2 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను నివారించడంలో సహాయపడుతోంది. మన దేశంలో మొత్తం విద్యుత్ డిమాండ్ సగటు వృద్ధి రేటు 6 %గా ఉంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 40 గిగావాట్ల ఆన్‌షోర్ విండ్ కెపాసిటీ ఉన్నప్పటికీ, గాలి విస్తరణ వేగం మందగించడంతో ఉత్పత్తి ఆశించినంతగా ఉండటం లేదు. 2012–2016 మధ్య 13 శాతంగా ఉన్న వార్షిక పవన విద్యుత్ సగటు వృద్ధి రేటు... 2016–21 మధ్య 5 శాతానికి తగ్గింది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ విశ్లేషణ ప్రకారం ఈ వృద్ధి రేటు రానున్న దశాబ్దంలో 15శాతానికి పెరగాలి. ఇందుకోసం పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపన పెరగాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో సముద్రతీరంలో 2026 నాటికి దాదాపు 20 గిగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లను స్థాపించే ప్రయత్నం జరుగుతోంది. నిర్వహణకు సెన్సార్ సిస్టమ్ భూమి మీద కంటే సముద్రంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆఫ్‌షోర్ విండ్ పవర్ ప్లాంట్లతో అధికంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. సముద్రంలో ఏర్పాటు చేసే విండ్ పవర్ టరై్బన్లను బ్లేడ్లు, ఫైబర్ గ్లాస్ మిశ్రమంతో తయారు చేస్తారు. వందల అడుగుల పొడవు, అనేక టన్నుల బరువు ఉంటాయి. బ్లేడ్ల అంచులలో పగుళ్లు, రంద్రాల వల్ల టరై్బన్ విఫలమై, విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంటుంది. ఈ నేపథ్యంలో వాటిని పర్యవేక్షించడానికి ధ్వని ఆధారిత సెన్సార్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. దీనిలో భాగంగా బ్లేడ్లో వైర్లెస్ మైక్రోఫోన్లను ఆమర్చుతారు. దీనివల్ల సమస్యను వెంటనే గుర్తించి బాగుచేసే వీలు కలుగుతుంది. అంతేకాదు ఈ టరై్బన్లు తీరానికి దూరంగా ఉంటాయి. కాబట్టి రిమోట్ మానిటరింగ్ టెక్నాలజీని వాడతారు. ఇతర దేశాల్లో ఈ విధానం ఇప్పటికే ప్రాచుర్యంలోకి రాగా, మన దేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. దేశంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, డీకార్బనైజేషన్ లక్ష్యాలను చేరుకోవడానికి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైన, చవకైన సహజ వనరులను వినియోగించుకోవాల్సిన అసవరం ఉంది. అందులో సముద్రతీర గాలి మన దేశ విద్యుత్ వ్యవస్థకు ప్రధానమైనదిగా మారుతోంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అయ్యే ఖర్చు కంటే తక్కువకే పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఈ విద్యుత్‌కు ఓపెన్ యాక్సెస్, ఇంటర్–స్టేట్ ట్రాన్స్‌విుషన్ సిస్టమ్ చార్జీల మినహాయింపులు వంటి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. -
సముద్రాల గుండె చప్పుడు విందాం!
వాషింగ్టన్: వాతావరణ మార్పులు.. భూగోళంపై మానవళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించాయి. ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. ధ్రువ ప్రాంతాల్లోని మంచు వేగంగా కరిగిపోతోంది. ఫలితంగా సముద్రాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. తీర ప్రాంతాల్లో ముంపు భయం వెంటాడుతోంది. వీటన్నింటికి మానవుల అత్యాశే కారణమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సముద్రాల గుండె ఘోష వినేందుకు ఐర్లాండ్‌కు చెందిన కళాకారిణి సియోభాన్ మెక్‌డొనాల్డ్ నడుం బిగించారు. సముద్రాల అడుగు భాగంలో సంభవించే భూకంపాలు, విరిగిపడే కొండ చరియలు, జీవజాలం మనుగడ, కాలుష్యం, కరిగిపోతున్న మంచు గురించి సమగ్రంగా తెలుసుకొనేందుకు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సముద్రం వివిధ ప్రాంతాల్లో మైక్రోఫోన్లు(హైడ్రోఫోన్స్) జార విడుస్తున్నారు. ఇందుకోసం గ్రీన్‌ల్యాండ్, కెనడా మధ్య ఉన్న డెవిస్ అఖాతాన్ని ఎంచుకున్నారు. ఇప్పటిదాకా 12 మైక్రోఫోన్లను జారవిడిచారు. ఈ ప్రయోగానికి అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తోంది. ఈ ప్రయోగం ఒక టైమ్ క్యాప్సూల్ మైక్రోఫోన్లు రెండేళ్లపాటు సముద్రంలోనే ఉంటాయి. 2024లో బయటకు తీస్తారు. ఇవి ప్రతి గంటకోసారి సముద్ర అడుగు భాగంలోని శబ్దాలను స్పష్టంగా రికార్డు చేస్తాయి. ఈ శబ్దాలన్నింటిని కలిపి ఒక ఆడియోను రూపొందిస్తారు. ఇది ‘సముద్ర జ్ఞాపకం’గా మెక్‌డొనాల్డ్ అభివర్ణించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ విపత్తుల విషయంలో ఇదే మొట్టమొదటి సైన్స్, ఆర్ట్స్ ఉమ్మడి ప్రయోగమని చెబుతున్నారు. సముద్రాల గుండె చప్పుడు వినడం ద్వారా భూమిపై సమీప భవష్యత్తులో సంభవించే విపరిణామాలను ముందే అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రయోగం ఒక టైమ్ క్యాప్సూల్ లాంటిదేనని మెక్‌డొనాల్డ్ అన్నారు. పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ తనను ఈ ప్రయత్నానికి పురికొల్పిందని చెప్పారు. గ్రీన్‌ల్యాండ్‌లో పెద్ద ఎత్తున మంచు పేరుకొని ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు శిలాజ ఇంధనాల వాడకం ఆపేసినా సరే గ్రీన్‌ల్యాండ్‌లో 110 క్వాడ్రిలియన్ టన్నుల మంచు కరిగిపోయి సముద్ర మట్టం 27 సెంటీమీటర్లు(10.6 అంగుళాలు) పెరుగుతుందని అంచనా. -
వామ్మో కోవిడ్ వ్యర్థాలు
కోవిడ్–19.. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి. దాని నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా జనం మాస్కులు, చేతికి ప్లాస్టిక్ తొడుగులు, పీపీఈ కిట్లు, కరోనా టెస్టింగ్ కిట్లు, ప్లాస్టిక్ శానిటైజర్ సీసాలు విపరీతంగా ఉపయోగించారు. వీటిలో చాలావరకు ఒకసారి వాడి పారేసేవే. ఇవన్నీ చివరికి ఏమయ్యాయో తెలుసా? వ్యర్థాలుగా మారి సముద్రాల్లో కలిసిపోయాయి. ఎంతగా అంటే ఏకంగా 25,000 టన్నులకుపైగా పీపీఈ కిట్లు, ఇతర కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలు, నదులు, చెరువుల్లోకి చేరుకున్నాయి. ఇంకా చేరుతూనే ఉన్నాయి. ఇవి జల వనరుల్లోని జీవజాలం పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. జీవ జాతులకు ప్రత్యక్ష ముప్పు 2019 డిసెంబర్లో కరోనా మహమ్మారి జాడ తొలుత చైనాలో బయటపడింది మొదలు 2021 ఆగస్టు వరకే 193 దేశాల్లో ఏకంగా 84 లక్షల టన్నుల కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడినట్లు అంచనా. వీటిలో ఏకంగా 70 శాతం జల వనరుల్లోకి చేరుకున్నాయని చెబుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సురక్షితంగా నిర్వీర్యం చేయడానికి సరైన సదుపాయాలు లేకపోవడమే ప్రధాన సమస్య అంటున్నారు. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ప్రపంచమంతటా నెలకు ఏకంగా 129 బిలియన్ల మాస్కులు, 65 బిలియన్ల గ్లౌజ్‌లు వాడేసినట్టు అంచనా. వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో ఇవి వ్యర్థాలుగా మారిపోయాయి. మాస్కు.. ప్లాస్టిక్ బాంబు ఒకసారి వాడి పారేసే ఫేస్ మాస్కులను ప్లాస్టిక్ బాంబుగా పరిశోధకులు అభివర్ణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మాస్క్‌లు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ కిట్ల ముప్పు ఇప్పటికిప్పుడు ప్రత్యక్షంగా అనుభవంలోకి రాకున్నా రానున్న దశాబ్దాల్లో మాత్రం వాటి ప్రభావం దారుణంగా ఉంటుందని చెప్పారు. భూమిపై, సముద్రంలో ఉంటే జీవజాలానికి ప్రమాదం తప్పదని, వ్యర్థాల నిర్వహణపై ప్రపంచదేశాలు ఇప్పటికైనా దృష్టి పెట్టాలని సూచించారు. వేస్ట్ మేనేజ్మెంట్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలని, సామర్థ్యం పెంచుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారులు దాడి చేస్తే పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఇప్పటి నుంచి సన్నద్ధం కావాలని ప్రభుత్వాలకు హితవు పలికారు. వాడి పారేసిన పీపీఈ కిట్లు, మాస్క్‌ల కుప్పల్లో పక్షులు చిక్కుకుపోయి విలవిల్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా సంబంధిత ప్లాస్టిక్ వ్యర్థాల్లో అత్యధికంగా ఆసుపత్రుల నుంచి వెలువడినవే కావడం గమనార్హం. ఇవీ ప్రత్యామ్నాయాలు... ► చేతులు శుభ్రం చేసుకోవడానికి ప్లాస్టిక్ సీసాల్లో వచ్చే శానిటైజర్ కంటే వేడినీరు, సబ్బు వాడుకోవడం ఉత్తమం. సబ్బులు ఇప్పుడు భూమిలో సులభంగా కలిసిపోయే ప్యాకేజింగ్‌లో వస్తున్నాయి. ప్లాస్టిక్ సీసాల్లోని హ్యాండ్ శానిటైజర్లు కాకుండా సబ్బులు వాడుకుంటే పర్యావరణానికి ఎంతోకొంత మేలు చేసినట్టే. ► సింగిల్ యూజ్ ఫేస్‌మాస్క్‌లు వాడితే ప్రతి ఏటా కోట్లాది టన్నుల వ్యర్థాలు పేరుకుపోతాయి. వీటికంటే పునర్వినియోగ మాస్క్‌లు మంచివి. అంటే శుభ్రం చేసుకొని పలుమార్లు వాడుకునేవి. వీటిని వాషబుల్ మాస్క్‌లు అని పిలుస్తున్నారు. వీటిని పర్యావరణహిత మెటీరియల్‌తో తయారు చేస్తున్నారు. ► ప్లాస్టిక్ ముప్పు తెలిసినవారూ కరోనా సమయంలో వైరస్ భయంతో ప్లాస్టిక్ బ్యాగ్‌లు వాడారు. కానీ కాగితపు సంచులు, బట్ట సంచులు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. ► హోటళ్లలో వాడే ప్లాస్టిక్ పొర ఉన్న కాగితపు కప్పులు లక్షల టన్నుల వ్యర్థాలుగా మారుతున్నాయి. గాజు, పింగాణి గ్లాసులను వేడి నీరు, సబ్బుతో శుభ్రం చేసి వాటిని మళ్లీ ఉపయోగించుకోవడం దీనికి మంచి ప్రత్యామ్నాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నీటిలోని చేపను నీరే కబళిస్తే?.. దీని వెనకున్న మిస్టరీ ఏంటి!
చిన్న చేపను పెద్ద చేప.. పెద్ద చేపను సొర చేప మింగడం కామనే.. కానీ నీటిలోని చేపను నీరే కబళిస్తే? చేపలు సహా అక్కడి జలచరాలనే ‘మింగేస్తే’? విచిత్రంగా అనిపిస్తున్నా ఇది నిజమేనని శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధారించారు. దీని వెనకున్న మిస్టరీని బయటపెట్టారు. అదేమిటంటే... ఈజిప్ట్, సౌదీ అరేబియా మధ్యన ఉన్న ఎర్ర సముద్రానికి ఉత్తరాన ఉన్న గల్ఫ్ ఆఫ్ అకాబాలో శాస్త్రవేత్తలు అరుదైన ‘డెత్ పూల్’ను గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ మయామీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు రిమోట్ ద్వారా నడిచే అండర్‌వాటర్ వెహికల్ ద్వారా సముద్ర గర్భాన్ని పరిశీలించే క్రమంలో 1,770 మీటర్ల లోతున దీన్ని కనుగొన్నారు. సుమారు 100 అడుగుల పొడవున ఈ మడుగు ఉంది. సాంకేతికంగా బ్రైన్పూల్స్ అని పిలిచే ఈ నీటిలో లవణత అత్యంత ఎక్కువగా ఉంటుందని, ఫలితంగా అందులో ఆక్సిజన్ శాతం ఏమాత్రం ఉండదని పేర్కొన్నారు. చదవండి: ఆ చేప చిక్కడమే విషాదం ... హఠాత్తుగా మీదకు దూకి... అందువల్ల చేపలు సహా మరే జలచరాలైనా ఈ మడుగులోకి ప్రవేశించగానే మరణిస్తాయని శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ శామ్ పుర్కిస్ తెలిపారు. కానీ విచిత్రంగా ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సూక్ష్మజీవులు ఈ మడుగులో జీవిస్తున్నాయని... ఈ నీటిలోకి వచ్చి మరణించే జలచరాలను ఆహారంగా తీసుకుంటున్నాయని వివరించారు. భూమిపై లక్షల ఏళ్ల కిందట సముద్రాలు ఎలా ఏర్పడ్డాయనే విషయంలో చేపట్టబోయే భావి పరిశోధనలకు తాజా పరిణామం దోహదపడుతుందని చెప్పారు. భూమిపై జీవం మనుగడకు ఉన్న పరిమితులు ఏమిటో అర్థం చేసుకోనిదే ఇతర గ్రహాలపై జీవం ఉనికిని అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధన వివరాలను ప్రముఖ జర్నల్ ‘నేచర్’ ప్రచురించింది. -
ఈ 'రోబో చేప'తో సముద్రాలు క్లీన్.. ప్లాస్టిక్‌ను తినేస్తుందటా!
బీజింగ్: సముద్రాల్లో మాటువేసిన ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ దేశాలకు ఇప్పుడొక పెద్ద సమస్యగా మారిపోయింది. భూమిపై అన్ని సముద్రాల్లో 19.90 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు నిపుణుల అంచనా. వీటిని తొలగించి, మహాసాగరాలను పరిశుభ్రంగా మార్చడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. సముద్రాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు చైనా శాస్త్రవేత్తలు. మెక్రోప్లాస్టిక్‌ను తినే రోబో చేపను తయారు చేశారు. ప్రపంచంలోని కలుషితమైన సముద్రాలను శుభ్రపరిచేందుకు ఏదో ఒకరోజు తమ రోబో ఉపయోగపడుతుందని నైరుతి చైనాలోని సిచువాన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. స్పర్శకు మృదువుగా, కేవలం 1.3 సెంటీమీటర్లు (0.5 అంగుళాలు) పరిమాణంలోని ఈ రోబోలు ఇప్పటికే తక్కువ లోతైన నీటిలోని మైక్రోప్లాస్టిక్‌లను పీల్చుకుంటున్నట్లు తేలింది. అయితే.. అత్యంత లోతైన నీటిలోని మెక్రోప్లాస్టిక్‌ను సేకరించటమే లక్ష్యంగా పరిశోధకుల బృందం కృషి చేస్తోంది. అంతే కాదు ఈ రోబోల ద్వారా ఎప్పటికప్పుడు సముద్రాల కాలుష్యంపై వివరాలు తెలుసుకునేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు వాంగ్ యుయాన్ అనే శాస్త్రవేత్త. 'మేము అత్యంత తేలికపాటి సూక్ష్మీకరించిన రోబోట్‌ను తయారు చేశాం. దీనిని చాలా విధాలుగా ఉపయోగించవచ్చు. బయోమెడికల్, ప్రమాదక పనుల్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. అయితే.. మేము ప్రధానంగా మెక్రోప్లాస్టిక్‌ను సేకరించటంపైనే దృష్టి సారించాం. ఇది ఒక నమూనా రోబో మాత్రమే. దీనిని పలుమార్లు ఉపయోగించవచ్చు. ' అని తెలిపారు. ఈ బ్లాక్ రోబోట్ చేప కాంతి ద్వారా వికిరణం చెంది.. దాని రెక్కలను తిప్పడం, శరీరాన్ని కదిలిస్తుంది. ఇతర చేపలతో ఢీకొట్టకుండా కాంతి ద్వారా ఆ రోబో చేపను శాస్త్రవేత్తలు నియంత్రించవచ్చు. ఒకవేళ ఏదైనా చేప దానిని మింగేస్తే సులభంగా జీర్ణమయ్యేలా పోలియురెథేన్తో తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. కాలుష్యకారకాలను ఈ చేపలు ఆకర్షిస్తాయి. అలాగే.. ఏదైన ప్రమాదం జరిగినప్పుడు వాటిని అవి పునరుద్ధరించుకుంటాయి. సాధారణ రోబోల కన్నా ఇవి 2.76 రెట్లు వేగంగా ఈదుతాయి కూడా. ఇదీ చూడండి: భూగోళమంతటా ప్లాస్టిక్ భూతం.. సవాళ్లు ఎన్నున్నా.. స్వచ్ఛ సాగరం -
భూగోళమంతటా ప్లాస్టిక్ భూతం.. సవాళ్లు ఎన్నున్నా.. స్వచ్ఛ సాగరం
ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. దాదాపు భూగోళమంతటా విస్తరించిన భూతం. చెరువులు, నదులు, సముద్రాల్లోనూ తిష్టవేసుకొని కూర్చుంది. విలువైన జలవనరులను కలుషితం చేస్తోంది. జలచరాల ఆయువును కబళిస్తోంది. తనను సృష్టించిన మనిషికే ముప్పుగా పరిణమిస్తోంది. సముద్రాల్లో మాటువేసిన ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచదేశాలకు ఇప్పుడొక పెద్ద సమస్యగా మారిపోయింది. భూమిపై అన్ని సముద్రాల్లో 19.90 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు నిపుణుల అంచనా. వీటిని తొలగించి, మహాసాగరాలను పరిశుభ్రంగా మార్చడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఎంతోమంది పరిశోధకులు, ఇంజనీర్లు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. కృత్రిమ మేధ(ఏఐ) బీచ్ బగ్గీలు, ప్లాస్టిక్‌ను తినేసే కృత్రిమ ఎంజైమ్‌లు, ప్లాస్టిక్ ఇంటర్సెప్టర్లు, అక్వాటిక్ డ్రోన్లు వంటివి కొన్ని పరిష్కార మార్గాలుగా చెబుతున్నారు. ఎంజైమ్‌లతోపాటు మైక్రోబ్ నెట్లు, మ్యాగ్నెటిక్ లిక్విడ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాటర్షార్క్లు సముద్రాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా ప్లాస్టిక్ రక్కసి చొచ్చుకెళ్తోంది. మానవ సంచారం లేని అంటార్కిటికాలో కురిసిన మంచులోనూ సూక్ష్మ ప్లాస్టిక్ ఆనవాళ్లు బయటపడ్డాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) అంచనా ప్రకారం సముద్రాల్లో 199 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వివిధ రూపాలు, పరిణామాల్లో ఉంది. తక్కువ బరువు కలిగిన మైక్రోప్లాస్టిక్‌లు ఉపరితలంపై తేలుతుండగా, అధిక బరువు కలిగినవి అడుగు భాగానికి చేరుకున్నాయి. నీటిపై తేలుతున్న ప్లాస్టిక్‌ను తొలగించడానికి అక్వాటిక్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. నీటి పై భాగంలోని చిన్నచిన్న ప్లాస్టిక్ ముక్కలను సైతం సులువుగా సేకరిస్తాయి. వీటిని వాటర్షార్క్లుగా వ్యవహరిస్తున్నారు. బీచ్‌లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను ఏరివేయడానికి కృత్రిమ మేధతో పనిచేసే బగ్గీలు (చిన్నపాటి వాహనాలు) వాడుతున్నారు. కంటికి కనిపించని సూక్ష్మ ప్లాస్టిక్‌ను నిర్మూలించడానికి మ్యాగ్నటిక్ నానో–స్కేల్ స్ప్రింగ్‌లను తయారు చేస్తున్నారు. మరికొన్ని ప్రయోగాలు అభివృద్ధి దశలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్లాస్టిక్‌ను భక్షించే ఎంజైమ్ నదులు, సముద్రాల్లోని ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌ను 2016లో కనిపెట్టారు. దీన్ని పెటేస్ అని పిలుస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ ఎంజైమ్ నిర్వీర్యం అవుతుండడంతో పెద్దగా ఉపయోగించడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక పాలిమర్‌ను డిజైన్ చేశారు. ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌ను అధిక ఉష్ణోగ్రతల్లోనూ కాపాడుతుందని అంటున్నారు. మోంటానా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్మౌత్ పరిశోధకులు టీపీఏడీఓ అనే మరో ఎంజైమ్‌ను అభివృద్ధి చేశారు. జల వనరుల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడానికి ఇది చక్కగా ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు. సీబిన్ వాక్యూమ్ క్లీనర్లు సౌరశక్తితో పనిచేసే ప్లాస్టిక్ ఇంటర్సెప్టర్లను పలు దేశాల్లో ఉపయోగిస్తున్నాయి. ఇందులో ఇంటర్‌సెప్టర్‌కు పొడవైన చేతుల్లాంటి ఉంటాయి. నీటిలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇంటర్సెప్టర్లోని బుట్టల్లోకి పంపిస్తాయి. బుట్టలు నిండిపోయిన తర్వాత ఒడ్డుకు చేరుస్తారు. ఇదే తరహాలో పనిచేసే వాటర్–వీల్ పవర్డ్ ప్లాస్టిక్ కలెక్టర్‌ను అమెరికాలో వాడుతున్నారు. సీబిన్ వాక్యూమ్ క్లీనర్లను 2015లో ఆస్ట్రేలియాలో రూపొందించారు. ఇవి ప్లాస్టిక్‌తో వ్యర్థాలతో కూడిన నీటిని యంత్రంలోకి సేకరిస్తాయి. రెండింటినీ వేరుచేసి, నీటిని మాత్రమే బయటకు పంపిస్తాయి. ప్లాస్టిక్ ముక్కలన్నీ క్లీనర్లోని సంచిలోకి చేరుకుంటాయి. ప్రపంచమంతటా ఇప్పుడు 860 సీబిన్ వాక్యూమ్ క్లీనర్లలో వాడుకలో ఉన్నాయి. తుపాన్ల దిశను గుర్తించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ అభివృద్ధి చేసిన సైక్లోన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(సీవైజీఎన్ఎన్ఎస్) సముద్రాలు, నదుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల కదలికలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుండడం గమనార్హం. ప్లాస్టిక్ ముక్కలు ఏ ప్రదేశంలో అధికంగా ఉన్నాయో తెలుసుకొని, సేకరించడానికి ఈ పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నారు. హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ పరిశోధకులు అతుక్కునే గుణం ఉన్న బయోఫిల్మ్తో కూడిన మైక్రోబ్ నెట్లను రూపొందించారు. నెట్లను నీటిలోకి జారవిడిస్తే అక్కడున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు అతుక్కుపోతాయి. పైకి లాగితే వాటితోపాటు వ్యర్థాలు వచ్చేస్తాయి. వామ్మో ప్లాస్టిక్ ... ► ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవాలంటే వేల సంవత్సరాలు పడుతుంది. సముద్రాల్లో కోట్లాది ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. వీటి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ► నీటిలోని సూక్ష్మ ప్లాస్టిక్‌ను పూర్తిగా ఫిల్టర్ చేసే పరిజ్ఞానం ఇంకా అందుబాటులోకి రాలేదు. ► 2050 నాటికి సముద్రాల్లోని మొత్తం చేపల బరువు కంటే ప్లాస్టిక్ బరువే ఎక్కువగా ఉంటుందని 2016లో విడుదల చేసిన ఓ నివేదికలో నిపుణులు తేల్చిచెప్పారు. ► ప్రపంచంలో కుళాయి ద్వారా సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం నీరు ప్లాస్టిక్‌తో కలుషితమైందేనని 2017లో ఒక అధ్యయనంతో తేలింది. ► కుళాయి నీటిలో ప్లాస్టిక్ కాలుష్యం ముప్పు అధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా, లెబనాన్, భారత్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఫ్రాన్స్, జర్మనీ, యూకే చిట్టచివరి స్థానాల్లో ఉన్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నీటి నమూనాలను సేకరించి, పరీక్షించగా.. 83 శాతం నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ కనిపించింది. ఈ మైక్రోప్లాస్టిక్ మనిషి శరీర అంతర్భాగాల్లోకి సులభంగా చొచ్చుకెళ్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను దూరం పెట్టడమే మంచిదని సూచిస్తున్నారు. ► సూక్ష్మ ప్లాస్టిక్‌లో విషపూరితమైన రసాయనాలు ఉంటాయి. ► భూగోళంపై నివసిస్తున్న అన్ని రకాల జీవులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్లాస్టిక్‌ను స్వీకరిస్తున్నాయి. ప్లాస్టిక్ వల్ల ప్రభావితమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిజంగా ఏలియన్ల గుట్టు సముద్రాల్లో ఉందా? రెండింటి మధ్య లింకేంటి?
భూమి ఉపరితలంపై 70 శాతం ఆవరించి ఉన్నవి సముద్రాలే. పైకి సింపుల్‌గా కనిపిస్తున్నా.. తీవ్ర ఒత్తిడి ఉండే పరిస్థితులు, అసలు సూర్యరశ్మి సోకని నిండు చీకట్లో బతికే జీవులు.. వంటి విచిత్రాలెన్నో. అంతేకాదు సముద్రాల్లో పరిశోధనలతో గ్రహాంతర జీవం (ఏలియన్ల) గుట్టునూ తేల్చేయొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమ్మీద సముద్రాలేమిటి, ఏలియన్ల గుట్టు ఏమిటి అన్న సందేహాలు వస్తున్నాయి కదా.. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. మనకు తెలిసింది కొంచెమే! మానవ నాగరికత ఇంతగా అభివృద్ధి చెందినా.. అత్యాధునిక టెక్నాలజీలు వచ్చినా.. ఇప్పటివరకు సముద్రాల్లో జీవం, అడుగున పరిస్థితుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. భూమ్మీద ఉన్న మొత్తం సముద్ర భాగంలో 80 శాతం మేర ఏముందో, ఎలా ఉందో, అక్కడి పరిస్థితులు ఏమిటో అన్నది ఇప్పటివరకు తెలియకపోవడం గమనార్హం. మన సముద్రాల అడుగున భూమి కంటే.. చంద్రుడి ఉపరితలం, అంగారకుడి నేల గురించి మనకు ఎక్కువ తెలుసని శాస్త్రవేత్తలు కూడా చెప్తుంటారు. ఏలియన్లకు లింకేంటి? అసలు గ్రహాంతర జీవం గురించిన ఆనవాళ్లు సముద్రాల్లో ఉండవచ్చని ఎప్పటి నుంచో వాదనలున్నాయి. ఎందుకంటే భూమిపై 70 శాతానికిపైగా సముద్రాలు, మరో 10 శాతం మేర అంటార్కిటికా, ఆర్కిటిక్ వంటి మంచుతో మునిగి ఉన్న ప్రాంతాలే ఉన్నాయి. ఏలియన్లు గానీ, గ్రహాంతర జీవ పదార్థాలుగానీ భూమ్మీదికి వస్తే.. సముద్రాల్లో పడే అవకాశాలే ఎక్కువని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసలు భూమ్మీద జీవానికి మూలం గ్రహశకలాలు, తోక చుక్కల నుంచి వచ్చిన సేంద్రియ పదార్థాలే కారణమనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇటీవల ‘ర్యుగు’ అనే గ్రహ శకలం (ఆస్టరాయిడ్) నుంచి తెచ్చిన మట్టిలో సేంద్రియ పదార్థాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు కూడా.. అవే పదార్థాలు సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలు, వాటి ఉపగ్రహాలకూ చేరే అవకాశాలూ ఎక్కువే. అంటే.. వాటిలోనూ ఎక్కడో జీవం అభివృద్ధి చెంది ఉండొచ్చని అంచనా. ఇక సౌర కుటుంబంలో గ్రహాల చుట్టూ తిరుగుతున్న పలు ఉపగ్రహాల (ఆ గ్రహాలకు చందమామలు)లో ఉండే వాతావరణాన్ని పోలిన పరిస్థితులు.. భూమ్మీద సముద్రాల అడుగున ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. అత్యంత చల్లగా, తీవ్ర ఒత్తిడి (ప్రెషర్)తో కూడిన ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని రకాల జీవరాశులు మనుగడ సాగించగలుగుతున్నాయని తేల్చారు. ఈ లెక్కన సదరు ఉపగ్రహాల్లో కూడా జీవం మనగలదని.. మన సముద్రాల అడుగున పరిస్థితులపై పూర్తిస్థాయి పరిశోధన చేస్తే.. గ్రహాంతర జీవుల గుట్టు కనుగొనడం సులువని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. హడల్ జోన్.. గురుడి ఉపగ్రహం ‘యురోపా’లా.. గురుగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాల్లో ఒకటైన యురోపాపై.. దట్టమైన మంచుతో కప్పబడిన సముద్రాలు ఉన్నాయి. అక్కడి పరిస్థితులు అచ్చంగా.. మన భూమ్మీది సముద్రాల అడుగున ‘హడల్ జోన్’ను పోలి ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడ జీవంపై పరిశోధనలు చేస్తే.. యురోపాపై జీవం ఉండే అవకాశాలు, ఉంటే ఎలా ఉండొచ్చన్న వివరాలు తెలుస్తాయని వారు చెప్తున్నారు. సముద్రాల్లో ఆరు కిలోమీటర్ల కన్నా ఎక్కువ లోతున ఉండే ప్రాంతాన్ని ‘హడల్ జోన్’గా పిలుస్తారు. సూర్యరశ్మి ఏమాత్రం సోకని చిమ్మ చీకటి, అతి శీతల పరిస్థితులు, తీవ్రమైన ఒత్తిడి ఉండే హడల్ జోన్లో జీవం మనుగడ కష్టం. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కొన్ని రకాల జీవులు బతుకుతున్నాయి. ప్రయోగాలు మొదలెట్టిన నాసా.. సముద్రాల అట్టడుగున ఉండే క్లిష్టమైన పరిస్థితులపై నాసా ఇప్పటికే ప్రయోగాలు మొదలుపెట్టింది. ఈ పరిస్థితులపై పరిశోధన చేసి.. ఇతర గ్రహాలు, ఉపగ్రహాలపై సముద్రాలు, అక్కడి పరిస్థితులు ఎలా ఉండొచ్చనే అంచనాలను రూపొందిస్తోంది. ఈ అంచనాలకు అనుగుణంగా అన్నిరకాల పరిస్థితులను తట్టుకునే పరికరాలను రూపొందించి.. భవిష్యత్తులో ఆయా గ్రహాలు, ఉపగ్రహాలపై పరిశోధనలు చేయనుంది. చంద్రుడిపైకి నాసా ‘వైపర్’ మంచు, దాని అడుగున నీటిలో (సబ్ సీ) ప్రయాణిస్తూ, పరిశోధన చేయగల రోవర్ ‘వైపర్’ను నాసా వచ్చే ఏడాది చంద్రుడిపైకి పంపనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద మంచు, నీటి జాడ గుట్టును ‘వైపర్’ తేల్చనుంది. దీని పనితీరును భూమిపై సముద్రాల్లో పరిశీలిస్తున్నారు. ఆ నీటి అడుగున చిత్రాలెన్నో.. ► సౌర కాంతి సముద్రాల్లో 200 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోగలదు. తర్వాత ఒక కిలోమీటర్ వరకు స్వల్పంగా ఉంటుంది. అంటే మసక చీకటిలా ఉంటుంది. అంతకన్నా లోతున అంతా చిమ్మ చీకటే ఉంటుంది. ► గత ఏడాది అమెరికా తీరానికి సమీపంలో అట్లాంటిక్ సముద్రంలో అత్యంత అరుదైన భారీ ‘ఫాంటమ్ జెల్లీఫిష్’ను గుర్తించారు. రెండు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల లోతులో అవి జీవిస్తుంటాయని తేల్చారు. ►నాలుగైదు కిలోమీటర్ల లోతులో సముద్రపు నేలపై ‘హైడ్రో థర్మల్ వెంట్స్ (వేడి నీరు, పొగను వెలువరించే బిలాలు)’ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి నుంచి వెలువడే వేడి, సేంద్రియ రసాయనాల ఆధారంగా.. అంత లోతులో కూడా కొన్నిరకాల జీవులు బతుకుతున్నట్టు తేల్చారు. ► మంచుతో కప్పిఉన్న ఉపగ్రహాల్లోనూ ఇలాంటి ‘హైడ్రో థర్మల్ వెంట్స్’ ఉంటే.. జీవానికి అవకాశాలు ఎక్కువేనని అంచనా వేస్తున్నారు. -
తెలంగాణ ఒకనాటి ‘పండోరా’.. చిన్నపాటి సముద్రాలు.. లావా ప్రవాహాలు
సాక్షి, హైదరాబాద్: చుట్టూ చిన్నపాటి సముద్రాలు.. లావా ప్రవాహాలు.. వాటితో ఏర్పడిన కొండలు, గుట్టలు.. భారీ వృక్షాలు.. జీవరాశులు.. వీటన్నింటి మధ్య ఉప్పొంగి ప్రవహించే పెద్ద నది.. ఇవన్నీ ఏదో హాలీవుడ్ సినిమాలో సీన్లు కాదు. అచ్చంగా ఒకప్పుడు తెలంగాణ భూభాగంలో నెలకొన్న పరిస్థితులు. ఊహించుకోవడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇవన్నీ వాస్తవాలే. ఇప్పుడున్న ఖండాలు, భూభాగాలు అప్పట్లో కలిసి ఉండేవి. కోట్ల ఏళ్ల పరిణామక్రమంలో కొన్ని విడిపడి, కొంత కలిసిపోయి ఇప్పుడున్న రూపానికి వచ్చాయి. ఆ మార్పులను చూడటానికి మన జీవితకాలం సరిపోదు. కానీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో అలనాటి పరిస్థితులను గుర్తించారు. ఈ క్రమంలో జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాలరావును ‘సాక్షి’పలకరించగా.. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. చకిలం వేణుగోపాలరావు సున్నపురాతి గనులు వాటి చలవే.. తెలంగాణ ప్రాంతంలో ఇటు ఉమ్మడి నల్గొండ, అటు తాండూరు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో సున్నపురాతి నిల్వలకు కారణం నాటి సముద్ర భాగాలే. అప్పట్లో సముద్ర తీరం నుంచి తక్కువ లోతుండే భాగం వరకు భారీగా సున్నపురాతి నిల్వలు ఏర్పడ్డాయి. ఆ సముద్రాలు అంతం కాగా.. సున్నపురాయి నిల్వలు ఇప్పుడు మనకు పనికొస్తున్నాయి. ఈ బొగ్గు నిల్వలు 30 కోట్ల ఏళ్లవి.. తెలంగాణ భూభాగం, దీని పరిసరాల్లోని బొగ్గు పొరలు దాదాపు 30 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయి. ఈ ప్రాంతాన్ని జియోలజిస్టులు గోండ్వానా బేసిన్గా పేర్కొంటారు. అప్పట్లో ఈ ప్రాంతాల మీదుగా అమెజాన్ కంటే భారీ మంచినీటి నది ప్రవహించేది. ఆ నది ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖండం (అప్పట్లో ఈ భూభాగాలన్నీ కలిసి ఉండేవి) వరకు విస్తరించి ఉండేది. నది పరీవాహకంలో ఏకంగా ఆరేడు మీటర్ల చుట్టుకొలతతో కాండం ఉండే భారీ వృక్షాలు పెద్ద సంఖ్యలో ఉండేవి. అప్పట్లో ఏర్పడిన ప్రకృతి విపత్తులతో ఆ వృక్షాలన్నీ కూలిపడి.. పైన మట్టిపొరలు పేరుకుపోయాయి. లక్షల ఏళ్లు ఒత్తిడికి, ఉష్ణోగ్రతలకు గురై బొగ్గుగా మారాయి. ఇప్పుడా బొగ్గు నిల్వలనే మనం తవ్వి వినియోగించుకుంటున్నాం. అలనాటి భారీ నదితో సంబంధం లేకున్నా.. ఇప్పుడా పరిధిలోనే గోదావరి నది ప్రవహిస్తుండటం విశేషం. అవన్నీ లావా గుట్టలే.. ఒకప్పుడు తెలంగాణ భూభాగంలోని కొంత ప్రాం తంలో అగ్నిపర్వతాల లావా ప్రవహించింది. దాదాపు 15 లక్షల చదరపు కిలోమీటర్ల మేర ఘనీభవించి పీఠభూమి ఏర్పడింది. ఈ పరిధిని డెక్కన్ వల్కానిక్ ప్రావిన్స్ (డీవీపీ)గా పేర్కొంటారు. శంకర్పల్లి, చేవెళ్ల, వికారాబాద్, జహీరాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మహారాష్ట్రవైపున్న కొన్ని ప్రాంతాలు దాని పరిధిలో ఉంటాయి. ఈ ప్రాంతంలోని గుట్టలన్నీ సుమారు ఆరున్నర కోట్ల ఏళ్ల కింద ఉబికివచ్చిన లావాతో ఏర్పడినవే. మిగతా తెలంగాణలో గ్రానైట్, డోలరైట్ రాళ్ల గుట్టలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌కు కొంత దూరం చేవెళ్ల సమీపంలోని ముడిమ్యాల గ్రామం వద్ద ఆ లావా అవశేషాలను జియోలజిస్టులు గుర్తించారు. ఆ లావా ప్రవాహాల సమయంలోనే ఇక్కడి డైనోసార్లు అంతరించాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్ర సరిహద్దు గోదావరి తీర ప్రాంతాల్లో ఆ డైనోసార్ల శిలాజాలు లభిస్తున్నాయి. సముద్రాల మధ్య.. ఒకప్పుడు ప్రస్తుతమున్న తెలంగాణ పీఠభూమి ప్రాంతానికి పక్కన రెండు సముద్రాలు ఉండేవి. దిగువన ఉన్నదానికి కడప బేసిన్ అని, ఎగువన ఉన్నదానికి పాకాల బేసిన్ అని జియోలజిస్టులు పేరుపెట్టారు. శేషాచలం కొండలు, నగరి జగ్గయ్యపేట మొదలు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్, మహబూబ్‌నగర్–ఖమ్మం జిల్లాల్లోని కొంత ప్రాంతంలో కడప బేసిన్ విస్తరించి ఉండేది. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధి అంతా పాకాల బేసిన్ పరిధిలో ఉండేది. ఈ రెండు సముద్ర బేసిన్లు కూడా.. ఖమ్మం జిల్లా చిరునోముల గ్రామం వద్ద 10–12 మీటర్ల పాయతో అనుసంధానమై ఉండేవని గుర్తించారు. పాకాల బేసిన్లో సులువాయి, పెన్‌గంగ అన్న రెండు సబ్బేసిన్లను.. కడప బేసిన్లో కర్నూల్, పల్నాడు అనే రెండు సబ్ బేసిన్లను గుర్తించారు. ఇవన్నీ 160 కోట్ల ఏళ్ల నుంచి 55 కోట్ల ఏళ్ల కిందటి వరకు ఉండేవని అంచనా. ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలుడు.. తెలంగాణలో బూడిద సుమారు 75 వేల ఏళ్ల కింద ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో ఉన్న టోబా అనే అగ్నిపర్వతం భారీ స్థాయిలో బద్దలైంది. దాని నుంచి వెలువడిన బూడిద వేల కిలోమీటర్ల దూరం విస్తరించింది. అలా పడిన బూడిద నీటి ప్రవాహాలతో కొట్టుకుపోయి కొన్నిచోట్ల కుప్పగా చేరింది. అదే తరహాలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఆ అగ్నిపర్వతం బూడిద కుప్పలు మేటవేసి ఉన్నాయి. కొత్తగూడెం సమీపంలోని ముర్రేరు వద్ద, మంజీరా లోయలోని కొన్ని ప్రాంతాల్లో సదరు బూడిద కుప్పలను జియోలజిస్టులు ఇప్పటికే గుర్తించారు. ఏపీలోని బనగానపల్లి సమీపంలో జ్వాలాపురం గ్రామంలో మెరుగుసుద్దగా పిలుచుకునే బూడిద కుప్పలు వీటిలో భాగమే. ఆ బూడిదనే కొన్ని కంపెనీలు గిన్నెలు తోమేందుకు వినియోగించే పౌడర్‌గా తయారు చేసి అమ్ముతున్నాయి. -
కీలక ప్రాజెక్టుతో ఆ ఐదు దేశాల సరసన చేరిన భారత్!
సముద్ర గర్భంలో పరిశోధన కోసం భారతదేశం తన తొలి మానవసహిత సముద్ర మిషన్ 'సముద్రయాన్' ప్రారంభించింది. దీంతో సముద్ర జలాల లోపల కార్యకలాపాలు సాగించే వాహనాలు కలిగి ఉన్న యుఎస్ఎ, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా దేశాల జాబితాలో భారత్ చేరింది. చెన్నైలో ఈ మిషన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం గొప్ప పురోగతి సాధించిందని, గగన్ యాన్ కార్యక్రమంలో భాగంగా ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తుంటే, మరొకరు సముద్రంలోకి అడుగుభాగనికి వెళ్లబోతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం జలాంతర్గాములు సైతం సముద్రంలో 200 మీటర్ల లోతుకు మించి వెళ్లలేవు. కానీ మన సైంటిస్టులు ఏకంగా 6 వేల మీటర్ల లోతుకు ముగ్గురు సైంటిస్టులను, రోబోటిక్ పరికరాలను పంపేందుకు సిద్ధమవుతున్నారు! ఇందుకు అత్యంత ముఖ్యమైన క్రూ మాడ్యూల్ డిజైన్ కూడా పూర్తి చేశారు. దీంతో వందల కోట్లతో చేపట్టబోయే ఈ మిషన్ లో కీలక ముందడుగు పడినట్లయింది. ఈ మాడ్యూల్ డిజైన్ కు ఇస్రో అత్యంత క్లిష్టమైన టెక్నాలజీని వాడినట్లు చెప్పారు. గోళాకారంలో ఉండే ఈ చిన్న సబ్ మెర్సిబుల్ వెహికిల్ తయారీకి టైటానియం లోహాన్ని వాడనున్నట్లు తెలిపారు. సముద్ర గర్భంలో ఉన్న ఖనిజాలు, ఇంధన వనరులను వెతికిపట్టుకోవడం బ్లూ ఎకానమీకి దోహదం చేస్తుంది. సముద్రగర్భంలో ఉన్న జీవజాలంపై అధ్యయనం చేస్తారు. Launched India’s First Manned Ocean Mission #Samudrayan at #Chennai. India joins elite club of select nations USA, Russia, Japan,France & China having such underwater vehicles.A new chapter opens to explore ocean resources for drinking water, clean energy & blue economy. pic.twitter.com/FArZULj4NB — Dr Jitendra Singh (@DrJitendraSingh) October 29, 2021 సముద్రయాన్ గురించి ఆసక్తికర విషయాలు: నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ) చేపట్టిన ₹6,000 కోట్ల సముద్రయన్ ప్రాజెక్టు డీప్ ఓషన్ మిషన్ లో ఒక భాగం. సముద్రయాన్ ప్రాజెక్టు కోసం సముద్ర వాహనం అయిన మత్స్య 6000 రూపొందించారు. 2.1 మీటర్ల వ్యాసం కలిగిన ఈ టైటానియం గోళంలో ముగ్గురు సైంటిస్టులు సముద్ర అడుగుభాగనికి వెళ్లనున్నారు. క్రూ మాడ్యూల్ కనీసం 72 గంటల పాటు సముద్రం అడుగున అత్యంత తీవ్రమైన ప్రెజర్ ను తట్టుకుని ఉండగలిగేలా తయారు చేస్తున్నారు. సముద్రంలో దాదాపు 6 కిలోమీటర్ల లోతు వరకూ వెళ్లి అక్కడ సముద్రం అడుగున అనేక అంశాలను స్టడీ చేయనున్నారు. సముద్ర గర్భంలో ఉన్న పాలీమెటాలిక్ మాంగనీస్ నోడ్యూల్స్, గ్యాస్ హైడ్రేట్స్, హైడ్రో థర్మల్ సల్ఫైడ్స్, కోబాల్ట్ క్రస్ట్లు వంటి నాన్ లివింగ్ వనరుల అన్వేషణ కోసం ఈ ప్రాజెక్టు చెప్పటినట్లు తెలుస్తుంది. ఐరన్, మాంగనీస్, నికెల్, కాపర్, కోబాల్ట్ తో కూడిన ముడి ఖనిజాలనే పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటారు. మనం ఈ ఖనిజ సంపదలో కేవలం 10 శాతం తెచ్చుకోగలిగినా.. ఇండియాకు వందేళ్ల పాటు ఇంధన అవసరాలు తీరిపోతాయట!. ఎన్ఐఓటీ అధికారిక సమాచార ప్రకారం.. మత్స్య 6000 డిసెంబర్ 2024 నాటికి ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉంటుంది. కేంద్ర భూశాస్త్రా మంత్రిత్వ శాఖ 5 సంవత్సరాల కాలానికి మొత్తం ₹4,077 కోట్ల బడ్జెట్‌తో అమలు చేయాల్సిన డీప్ ఓషన్ మిషన్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. -
తాబేలును చుట్టేస్తూ.. మొప్పలతో భయపెడుతూ..
గుండ్రంగా తిరుగుతున్న బుజ్జి బుజ్జి పారదర్శక (గ్లాస్) చేపల మధ్య అమాయకంగా చూస్తున్న ఆకుపచ్చ తాబేలు భలే బాగుంది కదా. అమీ జాన్ అనే మహిళా ఫొటోగ్రాఫర్ ఆస్ట్రేలియా సముద్ర తీరంలో తీసిన చిత్రమిది. ‘‘సముద్రంలో డైవింగ్ చేస్తుండగా.. ఓ చోట పెద్ద సంఖ్యలో గ్లాస్ చేపలు కనిపించాయి. దగ్గరికి వెళ్లి చూస్తే.. అవన్నీ ఓ పెద్ద తాబేలు చుట్టూ వలయంలా తిరుగుతున్నాయి. వెంటనే క్లిక్‌మనిపించా..’’ అని అమీజాన్ తెలిపింది. ప్రఖ్యాత ఓసియన్ ఫొటోగ్రఫీ అవార్డ్స్–2021లో ఈ ఫొటో ఓవరాల్‌గా ప్రథమ బహుమతి కొట్టేసింది. ‘నా జోలికి వస్తే ఖబడ్దార్..’ అన్నట్టుగా భయపెడుతున్నది ఓ చేప పిల్ల. ఎదిగీ ఎదగని (లార్వా) దశలో ఉన్న కస్క్ ఈల్ రకం చేప ఇది. ఆ సమయంలో దాని రెక్కలు, మొప్పలు ఇలా వేలాడుతూ, కాంతికి మెరుస్తూ ఉంటాయి. శరీరం కూడా చాలా వరకు పారదర్శకంగా ఉండి, అవయవాలన్నీ బయటికి కనిపిస్తుంటాయి. సముద్రపు లోతుల్లో జీవించే ఈ అరుదైన చేపపిల్లను స్టీవెన్ కోవాక్స్ అనే ఫొటోగ్రాఫర్ చిత్రీకరించారు. ఈ ఫొటోకు ఓసియన్ ఎక్స్‌ప్లోరేషన్ విభాగంలో రెండో బహుమతి వచ్చింది. పై ఫొటోలు రెండూ చేపలవి అయితే.. ఈ ఫొటో వాటిని వేటాడి తినే సముద్ర పక్షులది. గాల్లో వేగంగా ఎగురుతూనే ఉన్నట్టుండి ఒక్కసారిగా గంటకు 60 కిలోమీటర్లకుపైగా వేగంతో సముద్రంలోకి డైవ్ చేసి, వేగంగా దూసుకెళ్లడం వీటి ప్రత్యేకత. ఈ పక్షులు అంత వేగంగా, అదీ సముద్రంలో డైవ్ చేసేప్పుడు ఇలా ఫొటో తీయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈ ఫొటో తీసిన మహిళా ఫొటోగ్రాఫర్ హెన్లీ స్పీర్స్కు ఓసియన్ ఫొటోగ్రఫీ అవార్డ్స్‌లో ఓవరాల్‌గా రెండో బహుమతి వచ్చింది. -
యూరోపా యాత్రకు లైన్‌క్లియర్!
అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయానికి రంగం సిద్ధమైంది... గురుగ్రహ ఉపగ్రహం యూరోపాపైకి నాసా ప్రయోగించనున్న... యూరోపా క్లిప్పర్ ప్రాజెక్టుకు గ్రీన్‌లైట్ పడింది. ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్‌పై 2024లో క్లిప్పర్ యూరోపా చుట్టూ చక్కర్లు కొట్టనుంది. సముద్రాలతో నిండిన ఆ ఉపగ్రహంపై జీవం ఉందా? లేదా తెలుసుకోవడమే లక్ష్యం! భూమికి ఆవల మనిషి జీవించేందుకు అనువైన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? అన్నది తెలుసుకునేందుకు చాలాకాలంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సౌర కుటుంబానికి ఆవల వేల సంఖ్యలో గ్రహాలను ఇప్పటికే గుర్తించినప్పటికీ ఈ ఎక్సోప్లానెట్లలో జీవం ఆనవాళ్లు కానీ.. జీవించేందుకు అనువైన పరిస్థితులు కానీ ఇప్పటివరకూ గుర్తించ లేదు. సూర్యుడికి (ఇతర గ్రహ వ్యవస్థల్లోనైతే మాతృ నక్షత్రం) తగినంత దూరంలో ఉండటం.. భూమితో సరిపోలేలా రాళ్లు రప్పలతో, నీళ్లతో ఉండటం జీవం ఉండేందుకు అత్యవసరమన్నది శాస్త్రవేత్తల అంచనా. ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రాంతాన్ని గోల్డీలాక్స్ జోన్ అని పిలుస్తుంటారు. సౌర కుటుంబంలోని గురు గ్రహానికి ఉన్న నాలుగు ఉపగ్రహాల్లో ఒకటైన యూరోపా కొంచెం అటు ఇటుగా ఈ గోల్డీలాక్స్ జోన్లోనే ఉంది. పైగా ఆ ఉపగ్రహంలో మహా సముద్రాలు ఉన్నాయని చాలా కాలంగా తెలుసు. ఈ నేపథ్యంలోనే యూరోపా చుట్టూ చక్కర్లు కొడుతూ దాన్ని మరింత నిశితంగా పరిశీలించేందుకు జరుగుతున్న యూరోపా క్లిప్పర్ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆ వివరాలు... 1610లో గెలీలియో గురుగ్రహం వైపు తన దుర్భిణిని మళ్లించి చూసినప్పుడు అతడికి గ్రహంతోపాటు వెలుగులు చిమ్ముతున్న నాలుగు చుక్కల్లాంటివి కనిపించాయి. గురుగ్రహానికి ఉన్న 67 ఉపగ్రహాల్లో అతిపెద్దవైన నాలుగు ఉపగ్రహాలివి. వీటిల్లో అతి చిన్నది యూరోపా! నాసా ప్రయోగించనున్న యూరోపా క్లిప్పర్ కంటే ముందు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2022లోనే జూపిటర్ ఐసీమూన్ ఎక్స్‌ప్లోరర్ లేదా జ్యూస్ పేరుతో ఓ పరిశోధక నౌకను యూరోపా పైకి ప్రయోగించనుంది. భవిష్యత్తులో అణుశక్తితో నడిచే జలాంతర్గాములను యూరోపాలోని సముద్రాల్లో ప్రయాణించేలా చేసి ఆ ఉపగ్రహం గురించి మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకూ ప్రణాళికలు ఉన్నాయి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
భూమ్మీద మరో మహా సముద్రం.. ఇది చాలా డిఫరెంట్!
సాక్షి సెంట్రల్ డెస్క్: భూమి ఉపరితలంపై 70% నీళ్లేనని, నాలుగు మహా సముద్రాలు ఉన్నాయని చిన్నప్పుడు బడిలో వల్లెవేసే ఉంటాం. వాటి పేర్లు బట్టీపట్టే ఉంటాం. మరి ఆ నాలుగు మహా సముద్రాలకు తోడుగా ఇప్పుడు ఇంకో మహా సముద్రం వచ్చి కలిసింది తెలుసా? ఆ నాలుగింటికి భిన్నంగా ఉండే ఈ కొత్త మహా సముద్రానికి ఎన్నో ప్రత్యేకతలు, దానితో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ మహా సముద్రం విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? ఇప్పటిదాకా ఆ నాలుగే.. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నట్టు పసిఫిక్, హిందూ, అట్లాంటిక్, ఆర్కిటిక్.. ఈ నాలుగూ మహా సముద్రాలు. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య నిలువుగా ఉండేది అట్లాంటిక్ మహా సముద్రం.. ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్య హిందూ మహా సముద్రం.. ఆసియా, ఆస్ట్రేలియాలకు, ఉత్తర, దక్షిణ అమెరికాలకు మధ్య అత్యంత భారీగా ఉండేది పసిఫిక్ మహా సముద్రం.. పైన ఉత్తర ధ్రువం ప్రాంతంలో ఉండేది ఆర్కిటిక్ మహా సముద్రం.. ఇప్పుడు కొత్తగా గుర్తించినది దక్షిణ (సదరన్) మహా సముద్రం. భూమి దక్షిణ ధ్రువ ప్రాంతంలో అంటార్కిటిక్ ఖండానికి చుట్టూ ఆవరించి ఉంది. ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీనే నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ దీనిని కొత్త మహా సముద్రంగా గుర్తిస్తూ.. మ్యాప్‌లో చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఆమోదం రావాల్సి ఉంది. ఈ మహా సముద్రం.. చాలా డిఫరెంట్.. నిజానికి వివిధ ఖండాల మధ్య సువిశాల నీటి భాగాలను మహా సముద్రాలుగా గుర్తించారు. ఉత్తర ధ్రువంలోని ఆర్కిటిక్ మహా సముద్రం కూడా భూభాగాల మధ్యనే ఉంటుంది. కానీ దక్షిణ ధ్రువ ప్రాంతంలోని సదరన్ మహా సముద్రానికి మాత్రం సరిహద్దులుగా భూభాగాలు లేవు. చుట్టూ సముద్రాలే సరిహద్దులు. ఇదేగాక మరో ప్రత్యేకత కూడా ఉంది. ఏ మహా సముద్రానికి కూడా మధ్యలో చిన్నా, పెద్ద దీవులు తప్ప ఖండాల వంటి భారీ భూభాగాలు లేవు. కానీ సదరన్ మహా సముద్రానికి మధ్యలో అంటార్కిటిక్ ఖండం ఉంటుంది. కొత్త సముద్రం.. సరిహద్దులు ఎలా? ప్రతి మహా సముద్రాన్ని ఖండాల మధ్య సరిహద్దులతో గుర్తిస్తే.. సదరన్ మహా సముద్రాన్ని దాని చుట్టూ ఉండే భారీ సముద్ర ప్రవాహాం (ఓసియన్ కరెంట్)తో నిర్ధారించారు. అంటార్కిటిక్ ఖండానికి రెండు, మూడు వేల కిలోమీటర్ల దూరంలో చుట్టూ.. పైన ఉపరితలం నుంచి సముద్రం అడుగు వరకు అత్యంత భారీ ప్రవాహం తిరుగుతూ ఉంటుంది. దానిని ‘అంటార్కిటిక్ సర్కమ్‌పోలార్ కరెంట్ (ఏసీసీ)’అంటారు. పసిఫిక్, హిందూ, అట్లాంటి మహా సముద్రాల నుంచి చిన్న ప్రవాహాలు దీనిలో కలిసిపోతాయి. ఈ భారీ ప్రవాహం నుంచి మధ్యలో పాయలు పాయలుగా చిన్న ప్రవాహాలు ఏర్పడి బయటికి వెళతాయి. ఈ ఏసీసీ మాత్రం కిలోమీటర్ల కొద్దీ వెడల్పుతో.. వేల కిలోమీటర్ల పొడవున తిరుగుతూనే ఉంటుంది. భూమ్మీద వేడి, చలువ సమస్థితికి కారణమిదే.. ఏసీసీ ప్రవాహానికి బయట పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహా సముద్రాల్లో నీళ్లు బాగా ఉప్పగా, కాస్త వేడిగా, తేలికగా ఉంటే.. ప్రవాహానికి లోపల సదరన్ మహా సము ద్రంలో నీళ్లు తక్కువ ఉప్పగా, బాగా చల్లగా, కాస్త మందంగా ఉంటాయి. భూమ్మీద ఎక్కువ ఉపరితలాన్ని ఆక్రమించిన మూడు సముద్రాల నుంచి వేర్వేరు ఉష్ణోగ్రతలు ఉన్న నీళ్లు ఏసీసీ ప్రవాహంలో కలిసిపోతాయి. ప్రవాహంలో సమాన ఉష్ణోగ్రతకు చేరిన నీళ్లు.. మధ్యలో చిన్న పాయలుగా ఈ సముద్రాల్లోనే కలుస్తాయి. దీనివల్ల వేడిగా ఉన్న నీళ్లు చల్లగా, చల్లగా ఉన్న నీళ్లు వేడిగా మారుతూ.. ప్రపంచవ్యాప్తంగా సముద్రాల ఉష్ణోగ్రత స్థిరంగా ఉండటానికి కారణమవుతాయి. దీనిద్వారా మొత్తం భూమి మీద ఉష్ణోగ్రతల్లో స్థిరత్వం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రవాహం లేకుంటే.. ప్రమాదమే.. అంటార్కిటిక్ కరెంట్ సముద్రాల్లో స్థిర ఉష్ణోగ్రతలకు తోడ్పటమే కాకుండా.. భూవాతావరణంపై చాలా ప్రభావం చూపుతుందని, అది లేకుంటే చాలా సమస్యలు ఏర్పడుతాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఏసీసీ మిగతా సముద్రాల్లోని వేడి నీళ్లు అం టార్కిటికా ఖండానికి చేరకుండా ఆపు తుంది. అది లేకుంటే వేడి నీళ్లు చేరి అం టార్కిక్ మంచు వేగంగా కరిగిపోతుంది. అంటార్కిక్ ప్రాంతంలోని మంచు, నీటి సాంద్రత ఎక్కువగా ఉండటం వంటివి అక్కడి సముద్రపు లోతుల్లో భారీ స్థాయిలో కార్బన్ నిక్షేపం అవడానికి కారణమయ్యా యి. అలాకాకుండా ఉంటే భూవాతావరణంలో కార్బన్ వాయువుల శాతం పెరిగి.. గ్లోబల్ వార్మింగ్ మరింత పెరుగుతుంది. మంచు కరగడం, గ్లోబల్ వార్మింగ్ పెరిగితే.. వరదలు, తుఫాన్లు, లోతట్టు ప్రాం తాలు మునిగిపోవడం, అధిక ఉష్ణోగ్రతలు వంటి సమస్యలకు కారణమవుతాయి. ‘గుర్తింపు’పై గొడవలెన్నో.. నిజానికి దక్షిణ మహా సముద్రానికి 1937లోనే ఈ గుర్తింపు ఇచ్చారు. కానీ ప్రపంచ దేశాల మధ్య కొన్ని వివాదాలు తలెత్తడంతో 1953లో ఆ హోదా తొలగించారు. కేవలం ఓ సముద్ర భాగంగానే పరిగణించారు. దీనికి ఉన్న ప్రత్యేకతల నేపథ్యంలో మహా సముద్రంగా గుర్తించాలని, ఆ ప్రాంతంలోని జీవజాతుల రక్షణ, ఇతర అంశాలకు అది తోడ్పడుతుందని చాలా కాలంగా శాస్త్రవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. అమెరికాకు చెందిన జియోగ్రఫిక్ నేమ్స్ బోర్డ్.. 1999లో దీనికి మహా సముద్రంగా గుర్తింపు ఇచ్చింది. తాజాగా నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ మ్యాప్‌లలో చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, ఇతర జల భాగాలకు గుర్తింపు ఇచ్చే ‘ఇంటర్నేషనల్ హైడ్రోఫోనిక్ ఆర్గనైజేషన్ (ఐహెచ్ఓ)’ఓకే చేయాల్సి ఉంది. చదవండి: చైనాలో మరో విపత్తు! -
World Oceans Day: ‘ప్లాస్టిక్’ సముద్రాలు!
ప్లాస్టిక్ మన జీవితంలో భాగమైపోయింది. వాడే ప్రతి వస్తువూ ప్లాస్టిక్ మయం అయిపోతోంది. అదంతా ఎటు పోతోందో మీకు తెలుసా?.. చెత్తగా మారి అటు భూమిలో, ఇటు సముద్రాల్లో చేరి కలుషితం చేసేస్తోంది. మనం తినే తిండి, తాగే నీళ్లు.. ఓ లెక్కన చెప్పాలంటే మన శరీరం కూడా మైక్రో ప్లాస్టిక్‌తో నిండిపోతోంది. మంగళవారం ‘ప్రపంచ సముద్రాల దినోత్సవం’ సందర్భంగా.. సముద్రాల్లో ప్లాస్టిక్ పరిస్థితి ఏమిటో తెలుసుకుందామా? లక్షల కిలోమీటర్ల చెత్త దీవులు నదుల ద్వారా, నేరుగా డంపింగ్ చేయడం ద్వారా భారీ స్థాయిలో ప్లాస్టిక్ చెత్త సముద్రాల్లోకి చేరుతోంది. సముద్ర అంతర్గత ప్రవాహాల కారణంగా ఆ ప్లాస్టిక్ అక్కడక్కడా గుంపుగా చేరుతోంది. అలాంటి ఓ ప్లాస్టిక్ చెత్త ప్యాచ్‌ను 1990లోనే అమెరికాలోని హవాయి, కాలిఫోర్నియాల మధ్య పసిఫిక్ మహా సముద్రంలో గుర్తించారు. ప్రస్తుతం ఆ చెత్త ప్యాచ్ వైశాల్యం సుమారు 16 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నట్టు ఇటీవల గుర్తించారు. ఇంత భారీగా కాకున్నా.. మిగతా సముద్రాల్లోనూ పలుచోట్ల ఇలాంటి ప్లాస్టిక్ ప్యాచ్‌లు ఏర్పడ్డాయి. ఏటా లక్షల టన్నులు ప్రతి సంవత్సరం సముద్రాల్లో ఎంత ప్లాస్టిక్ కలుస్తోందో తెలుసా?.. సుమారు 80 లక్షల టన్నులు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్, అందులో రీసైకిల్ అవుతున్నది, భూమిపై డంప్ చేస్తున్నది, సముద్రాల్లో కలుస్తున్నది ఎంతనే దానిపై శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధన చేశారు. సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్‌లో ఒకట్రెండు శాతం మాత్రమే చెత్త ప్యాచ్‌లుగా చేరుతోందని గుర్తించారు. మిగతా అంతా ఏమైపోతోందని పరిశీలన చేపట్టారు. అన్నీ ఆ చెత్తలోనే.. సముద్రాల్లో చేరుతున్న ప్లాస్టిక్ చెత్తలో మనం నిత్యం వాడే అన్ని రకాల సామగ్రి ఉంటున్నాయి. పసిఫిక్ ప్యాచ్‌లో శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు.. ప్లాస్టిక్ బాటిళ్లు, గ్లాసులు, పాత్రలు, బొమ్మలు, టాయిలెట్ సీట్లు, చేపల వలలు, ఎలక్ట్రానిక్ పరికరాల ప్లాస్టిక్ భాగాలు, ఇంట్లో వాడే ఇతర ప్లాస్టిక్ వస్తువుల ముక్కలు, థర్మాకోల్ ముక్కలు.. ఇలా చాలా రకాలు కనిపించాయి. నీటి లోతుల్లోకి.. ఇటీవల ఆర్కిటిక్ సముద్రం అడుగున పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు సుమారు 2,500 మీటర్ల (రెండున్నర కిలోమీటర్ల) లోతులో ప్లాస్టిక్ బ్యాగ్, బాటిల్స్ వంటివి కనిపించాయి. ఆ ఒక్కచోటే కాదు.. జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు ఇలా సముద్రపు లోతుల్లో ప్లాస్టిక్ చెత్త కనిపించిన 2,100 ఫొటోలను సేకరించారు. ప్లాస్టిక్ చెత్తలో కొంత భాగం సముద్రాల అడుగున లోతైన భాగాల్లోకి చేరుతోందని తేల్చారు. సముద్ర తీరాల మట్టి, ఇసుకలో.. అమెరికా సహా పలు దేశాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో మట్టి, ఇసుకను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వాటిల్లో ప్లాస్టిక్ అవశేషాలు గణనీయంగా ఉన్నట్టు గుర్తించారు. 1945 నుంచి 2009 మధ్య ఏటా ప్లాస్టిక్ అవశేషాల శాతం రెండింతలు అవుతూ వచ్చిందని తేల్చారు. దాక్కుని ఉండేదెంతో.. 2010లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. ఇప్పటివరకు సుమారు పది కోట్ల టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లో కలిసినట్టు అంచనా. ఇందులో సగందాకా.. భూమధ్యరేఖకు ఇరువైపులా కాస్త దూరంలోని (సబ్ ట్రాపికల్) సముద్రాల్లోనే చేరిందని ఓషియనోగ్రాఫర్ లారెంట్ లెబ్రెటన్ ఇటీవల వెల్లడించారు. తీర ప్రాంతాలకు, సముద్రంలో రవాణా మార్గాలకు దూరంగా.. ప్లాస్టిక్ ప్యాచ్‌లు ఉండటంతో మనకు కనిపించడం లేదని పేర్కొన్నారు. మన చుట్టూరా.. మనలోనూ భాగంగా.. విపరీతంగా పెరిగిపోయిన ప్లాస్టిక్ వినియోగంతో భూమ్మీద దాదాపు అన్నింటిలోనూ భాగంగా మారిపోయిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అది ఎంతలా అంటే.. అసలు మైక్రో ప్లాస్టిక్ (సూక్ష్మస్థాయి ప్లాస్టిక్ ముక్కలు) లేని ప్రదేశమే లేకుండా పోయిందని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పరిశోధనల్లో గుర్తించిన ప్రకారం.. గాలిలోని దుమ్ములో, తాగే మంచినీళ్లలో, సముద్ర జీవుల కడుపుల్లో, చివరికి తల్లి గర్భంలోని శిశువులకు అన్నీ అందించే.. బొడ్డుతాడు (ప్లెసెంటా)లో కూడా మైక్రో ప్లాస్టిక్‌ను గుర్తించారు. చదవండి: Elephanta Caves: ఎలిఫెంట్ లేదు! కేవ్స్ ఉన్నాయి!! -
300 కోట్ల మందికి సముద్రమే ఆధారం
వెబ్‌డెస్క్: భూమిపై 29 శాతం నేల ఉంటే మిగిలిన 71 శాతం సముద్ర నీరే ఉంది. ఈ ధరణిపై నివసించే ప్రాణులన్నీ ప్రత్యక్షంగా , పరోక్షంగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నాయి. కడలి బాగుంటేనే జీవరాశులన్నీ బాగుంటాయి. సముద్రాలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించే ప్రతీ ఏడు జూన్ 8న ప్రపంచ సముద్ర దినోత్సం నిర్వహిస్తున్నారు. బాగుండాలి బ్రెజిల్‌లోని రియో డిజనీరో నగరంలో 1992లో జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సులో సముద్రాలపై అవగాహన పెంచాలని నిర్ణయించారు. చివరకు ఐక్యరాజ్యసమితి 2008, జాన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది. సముద్రాలు బాగుండాలి... జీవులూ బాగుండాలి అనేది ఈ ఏడాది అంతర్జాతీయ సముద్ర దినోత్సం థీమ్‌గా ఎంపిక చేశారు. అరుదైన అవకాశం ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి జూన్ 8న కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది. 45 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన తాడి దీపిక పాల్గొంటున్నారు. గ్రీన్‌వార్మ్స్ ప్రాంతీయ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. సముద్రం....మరికొన్ని విశేషాలు - ప్రపంచ జనాభాలో సగం మంది సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నారు. సముద్రం, తీరంలో దొరికే వనరులే వారికి జీవనాధారం. - భూమిపై ఉన్న జీవంలో 50 నుంచి 80 శాతం సముద్రంలోనే ఉంది. - సముద్ర జలాల్లో కేవలం 1 శాతం జలాల్లోనే సెక్యూరిటీ ఉంది. మిగిలిన జలాలు రక్షణ లేదు. అందువల్లే టెక్నాలజీ ఇంతగా పెరిగినా సముద్రపు దొంగలు రెచ్చిపోతున్నారు. ఇక అభివృద్ధి చెందిన దేశాలు గుట్టుచప్పుడు కాకుండా సముద్ర జలాల్లో అణు పరీక్షలు నిర్వహిస్తాయనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. - సముద్ర జలాల్లో క్రమంగా ఆల్గే నాచు పేరుకుపోతుంది. దీని వల్ల సముద్ర జలాలు కాలుష్యమవుతున్నాయి. దీంతో సముద్ర జీవుల రక్షణ, భద్రత ప్రమాదంలో పడుతోంది. - భారీ ఎత్తున కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకోవడం ద్వారా సముద్రాలు పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నాయి. అయితే రోజురోజుకి కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగిపోవడంతో క్రమంగా సముద్ర జలాలు ఆమ్ల లక్షణాలను సంతరించుకుంటున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. - మనం పీల్చే ఆక్సిజన్‌లో 70 శాతం సముద్రం నుంచే వాతావరణంలోకి వెలువడుతుంది. - పసిఫిక్ మహసముద్రంలో 2,600 కిలోమీటర్ల దూరం విస్తరించిన గ్రేట్ బారీయర్ రీఫ్ జీవవైవిధ్యానికి ప్రతీక. చంద్రుడి నుంచి చూసినా ఈ రీఫ్ కనిపిస్తుంది. - నాగరికత మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సముద్రంలో 5 శాతాన్నే మనం ఇప్పటి వరకు శోధించగలిగాం. ఇంకా సముద్రంలో తెలుసుకోవాల్సిన వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. - ఇప్పటి వరకు 2,36,878 సముద్ర జీవులను గుర్తించగలిగారు శాస్త్రవేత్తలు. - అగ్నిపర్వతాల్లో 90 శాతం సముద్రంలోనే ఉన్నాయి. -
అరుదైన ఎండ్రకాయ.. 20 లక్షల్లో ఒకటి ఈ విధంగా..
కార్న్‌వాల్: సాధారణంగా జాలర్లు సముద్రంలో వేటకు వెళ్తుంటారు. ఒక్కోసారి వారి వలకు అరుదైన జీవులు చిక్కుకుంటాయి. అలాంటి సంఘటన జరిగినప్పుడు జాలరులు చాలా అదృష్టంగా భావిస్తారు. ఒకవేళ అలాంటి జీవులు వారి వలలో చిక్కుకుంటే ఆ వేటగాడి ఆనందానికి అవధులే ఉండవు. అయితే, ఇలాంటి ఘటనే కార్న్‌వాల్ సముద్ర తీరం వెంబడి ఉన్న సముద్రంలో చోటుచేసుకుంది. డైలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం, 25 ఏళ్ల వయసున్న టామ్ ఒక రోజు లాంబోర్న్ తీరం వెంబడి సముద్రంలో వేటకోసం వెళ్లాడు. రోజులాగే ఏదో చేపలో, రోయ్యలో.. ఏవో జీవులు పడతాయనుకున్నాడు టామ్. కానీ, ఆ రోజు టామ్ తనవలలో పడిన జీవిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ జీవిని అంతకు ముందేప్పుడు చూడలేదు. అదోపెద్ద ఎండ్రకాయ. నీలి రంగులో ఉంది. చాలా పెద్దదిగా కూడా ఉంది. కాసేపు దాన్ని పరీక్షగా చూశాడు. అయితే, ఇంటికి తీసుకెళ్లటానికి కుదరక పోవడంతో దాన్ని తిరిగి సముద్రంలో వదిలేయాలని టామ్ అనుకున్నాడు. నీటిలోకి ఎండ్రకాయను వదలే ముందు దాన్ని పట్టుకున్నట్లు గుర్తుగా కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత దాన్ని తిరిగి సముద్రంలోకి విడిచిపెట్టాశాడు. అయితే, కొన్నిరోజులకు టామ్ ఈ ఫోటోలను కార్న్‌వాల్‌లోని నేషనల్ లోబ్ట్సర్ విభాగానికి పంపించాడు. ఈ చిత్రాలను చూసిన వారు ఇది చాలా అరుదైనదని, కొన్నిరకాల జన్యువైవిధ్యాల వలన భిన్న రంగులను కల్గిఉంటుందని తెలిపారు. సాధారణంగా 20 లక్షల జీవుల్లో ఒకటి మాత్రమే ఇలాంటి అరుదైన వైవిధ్యాన్ని కల్గి ఉంటుందని పేర్కొన్నారు. ఇది, దాని జీవితకాలమంతా పెరుగుతునే ఉంటుందని అన్నారు. -
అమ్మో ఎంత పెద్ద షార్కో..
భువనేశ్వర్: సముద్రంలో ఉన్న షార్క్‌లను చూడటానికి ప్రతి ఒక్కరు తెగ ఆసక్తికనబరుస్తారు.. దీనికోసం సముద్రంలోనికి వెళ్ళడానికి కూడా ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ షార్క్ మీకేందుకు శ్రమ ఇవ్వాలనుకుందో ఏమో తనే సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకుని వచ్చేసింది. వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్‌లోని సునాపుర్ బీచ్ వద్ద 20 ఫీట్ల పొడవైన షార్క్ తీరానికి కొట్టుకుని వచ్చింది. ఇది మాములు షార్క్‌లకన్నా చాలా పెద్దది. మొదట మత్య్సకారులు చనిపోయి వచ్చిందేమోనని భావించారు. తీరా దగ్గరికి వెళ్ళిచూసేసరికి అది ప్రాణాలతోనే ఉంది. ఈ భారీ షార్క్‌ను చూడటానికి స్థానికులు, పర్యాటకులు పెద్దఎత్తున ఎగబడ్డారు. వెంటనే మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు షార్క్ బతికే ఉందని నిర్థారించుకుని, స్థానికుల సహకారంతో తిరిగి సముద్రంలోనికి వదిలివేశారు. అయితే, గతంలోను బాలసోర్, సునాపుర్ బీచ్‌ల వద్ద చనిపోయిన షార్క్‌లు తీరానికి కొట్టుకుని వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, తిమింగలాలను వైల్డ్‌లైఫ్ ప్రొటేక్షన్యాక్ట్ కింద అంతరించిపోతున్న జీవజాతుల జాబితా కింద సంరక్షిస్తున్నారు. చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కుప్పలుగా తల్లో పేలు! -
హిరోషిమా బాంబులకన్నా వేడెక్కిన సముద్రాలు
సాక్షి, న్యూఢిల్లీ : 2019లో మానవ జాతి చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ప్రపంచంలోని సముద్రాలన్నీ వేడెక్కాయని ‘చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ లీజింగ్ చెంగ్ బందం వెల్లడించింది. ప్రపంచంలోని సముద్రాల సరాసరి ఉష్ణోగ్రత 0.135 ఫారిన్‌హీట్‌లకు పెరిగిందని, ఇది 360 కోట్ల హిరోషిమా బాంబు పేలుళ్ల నుంచి వెలువడే వేడికి సమానమైనదని ఆయన పేర్కొన్నారు. గత 25 సంవత్సరాల్లోనే సముద్ర జలాల వేడి బాగా పెరిగిందని, భూతాపోన్నతికి ఇది మరో ఉదాహరణని ఆయన తెలిపారు. లీజింగ్ చెంగ్‌తో పాటు ఈ బందంలో చైనా, అమెరికాలకు చెందిన 11 సంస్థల పరిశోధకులు పాల్గొన్నారు. ప్రపంచ సముద్రాల్లోకెల్లా అట్లాంటిక్, దక్షిణ సముద్రాలు బాగా వేడెక్కాయని, సముద్రం ఉపరితలంపైనే కాకుండా ఉపరితలానికి 6,500 అడుగుల లోతులో కూడా సముద్ర జలాలు వేడెక్కాయని ఆయన చెప్పారు. 1955 నుంచి 1986 మధ్య కాలంలో పెరిగిన సముద్ర జలాల వేడితో పోలిస్తే 1987 నుంచి 2019 మధ్య 450 శాతం వేడి పెరిగిందని ఆయన తెలిపారు. భూతాపోన్నతిలో 96 శాతం వేడిని సముద్రాలే పీల్చీసుకుంటాయని, నాలుగు శాతం మాత్రమే జంతుజాలం నివసించే భూమి వాతావరణంలో కలుస్తుందని, అందుకు వేడికి తనలో కలిపేసుకునే గుణం సముద్రాలకు ఉండడమేనని ఆయన చెప్పారు. అమెజాన్, కాలిఫోర్నియా, ఆస్ట్రేలియాలో భూతాపోన్నతి ఎక్కువగా పెరుగుతోందని ఆయన తెలిపారు. గత మూడు నెలలుగా ఆస్ట్రేలియాలో అడవులు, పొదలు తగులబడడానికి కారణం కూడా భూతాపోన్నతి పెరగడమే కారణమని భావిస్తున్న విషయం తెల్సిందే. ఇలాగే సముద్ర జలాలు వేడెక్కుతూ పోతే 2300 సంవత్సరం నాటికి సముద్ర మట్టాలు నాలుగు అడుగులు పెరుగుతాయని పరిశోధకులు ఇదివరకే అంచనా వేశారు. తద్వారా అనేక భూభాగాలు నీట మునుగుతాయని, ఆ విపత్తును నివారించడానికి భూతాపోన్నతికి కారణం అవుతున్న ఉద్ఘారాలు తగ్గించాలని పలు ప్రపంచ సదస్సులు తీర్మానించినప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లే దు. -
సముద్రాన్ని కాపాడతా!
పుణె: మహారాష్ట్రలోని పుణేకు చెందిన 12 సంవత్సరాల బాలుడు వినూత్న ఆవిష్కరణతో ఔరా అనిపించాడు. సముద్రంలో కాలుష్యాన్ని తగ్గించి, సముద్ర జీవజాలాన్ని కాపాడేందుకు ఎర్విస్ పేరుతో నౌకను రూపొందించిన బాలుడు హజీక్ ఖాజీ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. సముద్ర జీవజాలంపై వ్యర్థాల ప్రభావం ఎలా ఉంటోందో పలు డాక్యుమెంటరీల ద్వారా తెలుసుకున్న ఖాజీ.. ఎలాగైనా సముద్ర జీవులను కాపాడాలని, అందుకోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్లాస్టిక్ ప్రధాన కారణంగా గుర్తించి.. సముద్ర జీవుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న కారకాల్లో ప్రధానమైనది ప్లాస్టిక్ అని తెలుసుకున్న ఖాజీ.. ఆ ప్లాస్టిక్‌ను నిర్మూలించేలా ఓ నౌకను డిజైన్ చేశాడు. దానికి ఎర్విస్ అని పేరు పెట్టాడు. ఖాజీ రూపొందించిన ఈ నౌక సముద్ర జలాల్లో వ్యర్థాలను వేరుచేసి, శుద్ధ జలాలను సముద్రంలోకి తిరిగి పంపుతుంది. మేధావుల నుంచి ప్రశంసలు.. టెడ్ఎక్స్, టెడ్ 8 వంటి పలు అంతర్జాతీయ వేదికలపై ఈ నౌక గురించి ఖాజీ వివరించడంతో శాస్త్రవేత్తలు, మెరైన్ నిపుణులు, మేధావుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. వారంతా ఖాజీ ప్రతిభకు అబ్బురపడ్డారు. ఇక ఎర్విస్ నౌక కింది భాగంలో ఉండే మెషీన్ సముద్రంలోని ప్లాస్టిక్‌ను సంగ్రహించి, దాని పరిమాణం ఆధారంగా దాన్ని విడగొడుతుంది. హాట్సాఫ్ ఖాజీ.. సముద్ర జీవజాలాన్ని పరిరక్షిస్తూ, వ్యర్థాలను ఏరివేస్తూ సముద్రం నలుచెరుగులా ఈ నౌక సంచరిస్తుంది. సముద్రంలో ప్లాస్టిక్ కాలుష్యం వల్ల జరిగే అనర్థాలు, ముప్పుపై ఖాజీ ప్రస్తుతం పలురంగాలకు చెందిన వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. సముద్ర జీవజాలాన్ని కాపాడేందుకు పన్నెండేళ్ల బాలుడు హజీక్ ఖాజీ చేస్తున్న ప్రయత్నానికి అంతా హాట్సాఫ్ అంటున్నారు. -
పూణే బాలుడి వినూత్న ఆవిష్కరణ
పూణే : మహారాష్ట్రలోని పూణేకు చెందిన 12 సంవత్సరాల బాలుడు వినూత్న ఆవిష్కరణతో ఔరా అనిపించాడు. సముద్రంలో కాలుష్యాన్ని తగ్గించి, సముద్ర జీవజాలాన్ని కాపాడేందుకు ఎర్విస్ పేరుతో నౌకను రూపొందించిన బాలుడు హజీక్ ఖాజీ అందరి మన్ననలూ అందుకున్నాడు. తాను పలు డాక్యుమెంటరీలు చూసి సముద్ర జీవజాలంపై వ్యర్ధాల ప్రభావాన్ని అర్ధం చేసుకున్నానని, దీనికోసం ఏదైనా తలపెట్టాలని నిర్ణయించుకున్నానని ఖాజీ చెబుతాడు. ఆహారంలో మనం తీసుకునే చేప సముద్రంలోని ప్లాస్టిక్‌ను తింటుండటంతో మానవులపైనా ఈ ప్రభావం పడుతుందని, అందుకే తాను ఎర్విస్‌ను డిజైన్ చేశానని చెప్పుకొచ్చాడు. ఖాజీ రూపొందించిన ఈ నౌక సముద్ర జలాల్లో వ్యర్ధాలను వేరు చేసి శుద్ధ జలాలు, జీవజాలాన్ని సముద్రంలోకి తిరిగి పంపుతుంది, వ్యర్ధాలను ఐదు భాగాలుగా విడగొడుతుంది. టెడ్ఎక్స్, టెడ్ 8 వంటి పలు అంతర్జాతీయ వేదికలపై ఈ నౌక డిజైన్‌ను ఖాజీ ప్రపంచం ముందుంచగా పలువురు అంతర్జాతీయ మేథావులు, సంస్ధలు అతడి ప్రతిభకు అబ్బురపడ్డాయి. ఇక ఎర్విస్ నౌక కింది భాగంలో ఉండే మెషీన్ సముద్రంలోని ప్లాస్టిక్‌ను సంగ్రహించి దాని పరిమాణం ఆధారంగా దాన్ని విడగొడుతుంది. సముద్ర జీవజాలాన్ని పరిరక్షిస్తూ, వ్యర్ధాలను ఏరివేస్తూ సముద్రం నలుచెరుగులా ఈ నౌక సంచరిస్తుంది. సముద్రంలో ప్లాస్టిక్ కాలుష్యం వల్ల జరిగే అనర్దాలు, ముప్పుపై ఖాజీ ప్రస్తుతం పలు రంగాలకు చెందిన వ్యక్తులు, సంస్ధలతో కలిసి పనిచేస్తున్నారు. సముద్ర జీవజాలాన్ని కాపాడేందుకు పూనుకున్న పన్నెండేళ్ల బాలుడు హజీక్ ఖాజీకి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. -
సిసలైన సమ్మర్ సీజన్!
‘బ్లాక్‌పాంథర్’ వచ్చి సూపర్ హిట్ అయింది. ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ రిలీజయి బ్లాక్‌బస్టర్ అయింది. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. జూన్ వచ్చేసింది. తొలకరి పలకరించేసింది. ఇంకేం.. హాలీవుడ్ సినిమాల జోరు తగ్గిపోతుంది అనుకుంటే పొరపాటే! హాలీవుడ్ అసలు సిసలు హంగామా ఇప్పుడే మొదలవుతుంది. జూన్ నెల్లోనే. అమెరికాలో సమ్మర్ సీజన్ జూన్‌లో మొదలై ఆగష్టు చివరి వారం వరకూ ఉంటుంది. సమ్మర్లో మొదటి నెలైన జూన్‌లో సూపర్ క్రేజ్ ఉన్న సినిమాలు హంగామా చేస్తాయి. ఈ జూన్‌లో ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’, ‘ఇంక్రెడిబుల్స్ 2’, ‘ఓషన్స్ 8’ లాంటి భారీ అంచనాలున్న సినిమాలు విడుదలవుతున్నాయి.. జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్ 2001తో ‘జురాసిక్ పార్క్’ కథ ముగిసింది. అప్పటికి ఇండియన్ సినిమాకు హాలీవుడ్ వచ్చిందంటే అది ‘జురాసిక్ పార్క్’ సిరీస్ వల్లనే! జురాసిక్ పార్క్ కథ ముగిశాక మళ్లీ దాన్ని కొత్తగా పరిచయం చేయాలన్న ఆలోచనతో పుట్టిందే ‘జురాసిక్ వరల్డ్’. 2015లో జురాసిక్ వరల్డ్ సిరీస్‌లో భాగంగా మొదటి సినిమా వచ్చింది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు సినిమాలు ప్లాన్ చేశారు. ఇప్పుడు జూన్ 7న మన ముందుకు వస్తోంది రెండో భాగం. పేరు ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’. అమెరికా కంటే రెండు వారాల ముందు ఇండియాలో విడుదలవుతోంది. ‘‘మీరిప్పటి వరకూ చూసిన డైనోసర్లు ఒక ఎత్తు. ఈ సినిమాలో చూసే డైనోసర్లు మరో ఎత్తు’’ అంటున్నాడు చిత్రదర్శకుడు జె.ఎ.బయోనా. భారీ అంచనాల మధ్య విడుదలవుతోన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని ట్రేడ్ భావిస్తోంది. ఇండియాలో హాలీవుడ్ సినిమా రికార్డులను ఫాలెన్ కింగ్డమ్ తిరగరాస్తుందని అందరూ భావిస్తున్నారు. పిల్లలకు ఈ సినిమా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని దర్శకుడు ధీమాగా చెబుతున్నాడు. క్రిస్ ప్రాట్, బ్రైస్ డల్లస్ హోవార్డ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇన్‌క్రెడిబుల్స్ 2 2004లో వచ్చిన ‘ది ఇన్‌క్రెడిబుల్స్’ గుర్తుంది కదా. ఈ కంప్యూటర్ యానిమేటెడ్ సూపర్ హీరో ఫిల్మ్‌కు అప్పట్లో కాసుల వర్షం కురిసింది. సూపర్ హీరో జానర్లో ఈ ప్రయోగానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది ‘ఇన్‌క్రెడిబుల్స్ 2’. మన సూపర్ హీరోలు మిష్టర్ ఇన్క్రెడిబుల్, ఎలాస్టిగర్ల్ చేసే హంగామా ఈ సీక్వెల్లో మామూలుగా ఉండదట. ట్రైలర్ ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. జూన్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఓషన్స్ 8 స్టీవెన్ సోడర్బర్గ్ ‘ఓషన్స్’ సిరీస్‌కు రీబూట్ ఈ ‘ఓషన్స్ 8’. జూన్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గ్యారీ రోస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై కూడా హాలీవుడ్లో భారీ అంచనాలున్నాయి. ఆద్యంతం అదిరిపోయే థ్రిల్స్‌తో సాగుతుందట. జైలు నుంచి బయటికొచ్చాక సింపుల్ లైఫ్ బతుకుతానని చెప్పి, ఓషన్ అతిపెద్ద రాబరీలు చేస్తూ ఉంటుంది. ఈ కథ ఏయే మలుపులు తిరుగుతుందన్నది సినిమా. ఆసక్తికరంగా, థ్రిల్లింగ్‌గా సాగిపోయే ఈ సినిమాలో సాండ్రా బుల్లక్ రోల్, ఆమె యాక్టింగ్ మేజర్ హైలైట్స్‌గా నిలుస్తాయని టాక్. ఈ మూడు సినిమాలూ హాలీవుడ్ సమ్మర్‌కు గ్రాండ్ ఓపెనింగ్ ఇస్తాయని ట్రేడ్ భావిస్తోంది. ఏయే సినిమాలు ఎలా ఆడతాయో చూడాలి మరి!! . -
నా ఉప్పు తిన్నారు
సముద్రాలంటే మనకు గొప్ప ఫాసినేషన్. సముద్రాన్ని ఒక్కసారి కూడా కళ్లతో చూడకున్నా, ఆ సముద్రాన్ని బాల్యంలోనే పరిచయం చేసుకొని ఉంటాం. దాన్ని కలలు కనుంటాం. కథలుగా వినుంటాం. కథలు కథలుగా చెప్పుకొని ఉంటాం. ఒక్కసారైనా చూసొస్తే ఇంక తెలీకుండానే ప్రేమలో పడిపోతాం. మనకు ఏకాంతాలన్నా సముద్రాలే, సమాధానాల్లేని ప్రశ్నలకైనా సముద్రాలే! అలాగని ఉల్లాసాన్నిచ్చేదిగా మాత్రమే ఉంటే అది మనం ఇంత ఇష్టపడే సముద్రం అయ్యేది కాదు. జీవి మనుగడకు కూడా సముద్రం ఒక కేంద్రం. అది లేకపోతే మన ఈ జీవితాన్ని ఇలాగే ఊహించుకోను కూడా లేం. మనకు ఇన్ని ఇచ్చి, ఇంతా చేసిన సముద్రానికి మనం తిరిగి ఏమిస్తున్నామంటే? కాలుష్యం. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాల కాలుష్యం. సముద్రం ఉప్పు తిని మనం చేస్తోంది ఏంటంటే.. ఆ సముద్రాన్నే ముంచేస్తున్నాం. ఇప్పటికీ ఓ అవకాశం ఉంది, ఎప్పటికీ ఉండదు అది.. సేవ్ ఓషన్... సేవ్ లైఫ్... కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నామని కొందరు మనుషులు వాపోతుంటారు గాని, కడలి కష్టాల గురించి ఎవరైనా ఏనాడైనా పట్టించుకున్నారా? సముద్రాల లోతు ఎరిగిన కొద్దిమంది శాస్త్రవేత్తలు మాత్రమే వాటి కష్టనష్టాల గురించి నిష్ఠుర సత్యాలను ఎప్పటికప్పుడు లోకానికి వెల్లడిస్తున్నారు. జీవరాశుల మనుగడకు కీలకమైన సముద్రాలను కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్లేనని శాస్త్రవేత్తలు ఎంతగా గొంతు చించుకుంటున్నా, వారి గోడును ఆలకించే వారే కరువవుతున్నారు. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు సైతం కడలి కష్టాలను కడతేర్చేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. భూమి మొత్తం విస్తీర్ణంలో దాదాపు మూడొంతులు సముద్రాలే నిండి ఉన్నాయి. మిగిలిన ఒక వంతు స్థలభాగంలో మైదానాలు, పీఠభూములు, అరణ్యాలు, ఎడారులు, నదులు, సరస్సులు వంటివి ఉన్నాయి. ఒకవంతు స్థలభాగంలో జీవిస్తున్న మనుషులు సహా మిగిలిన జీవరాశుల మనుగడకు సముద్రాల ఉనికి చాలా కీలకం. సముద్రాలను క్షేమంగా కాపాడుకుంటేనే మనుషులూ, మిగిలిన జీవులు క్షేమంగా ఉండటానికి వీలవుతుంది. నానా చెత్తను సముద్రాల్లో పారవేయకుండా నియంత్రణ పాటిస్తేనే వాటిని కాపాడుకోగలుగుతాం. కష్టాలనేవి మనబోటి మనుషులకు ఉంటాయే తప్ప కడలికి కష్టాలేముంటాయని విసుక్కోకండి. కష్టాలు కడలికి కూడా ఉంటాయి. వాటిలో చాలా వరకు కష్టాలు మనబోటి మనుషుల వల్ల వచ్చిపడేవే. మనుషుల నిర్లక్ష్యం సముద్రాలను సమస్యల్లోకి నెట్టేస్తోంది. వాటిని కాలుష్య కాసారాలుగా మార్చేస్తోంది. తీరాల వెంబడి సంచరించే జనం ఎడాపెడా వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలను ముంచెత్తుతున్నాయి. ఎందులోనూ నాశనం కాని ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రజీవుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. మితిమీరిన చేపల వేట సముద్రాల్లోని జీవ వైవిధ్యానికి విఘాతం కలిగిస్తోంది. కాలాలతో నిమిత్తం లేకుండా ఇష్టానుసారం కొనసాగించే వేట వల్ల సముద్రాల్లోని అరుదైన జీవరాశులు అంతరించిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. భూమ్మీద మితిమీరిన వాయు కాలుష్యం సముద్రాలనూ వదలడం లేదు. కార్బన్ డయాక్సైడ్ మోతాదుకు మించి సముద్రాల్లోకి చేరుతుండటంతో సముద్ర జలాల్లో ఆమ్లగాఢత పెరుగుతోంది. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోకుంటే, సముద్రంలోని అరుదైన జీవరాశులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కలుషిత వాయువుల వల్ల భూతాపం పెరుగుతున్నందున సముద్రంలోని విలువైన పగడపు దీవులు క్రమంగా క్షీణించిపోతున్నాయి. బొగ్గు విద్యుత్ కేంద్రాలు, ఇతర పరిశ్రమల నుంచి వెలువడే పాదరసం వ్యర్థాలు కూడా సముద్రంలోనికి మోతాదుకు మించి చేరుతున్నాయి. సముద్రంలోకి చేరే పాదరసం చేపలు తదితర జలచరాల్లోకి చేరుతోంది. చేపలను తినే మనుషులకు ఇది ప్రమాదకరంగా పరిణమిస్తోంది. సముద్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటివల్ల సముద్రగర్భంలోని జీవరాశితో పాటు, నేల మీద నివసించే మనుషులకు వాటిల్లే ముప్పు గురించి శాస్త్రవేత్తలు చాలాకాలం నుంచే మొత్తుకుంటున్నా, ఇరవయ్యో శతాబ్ది చివరి రోజుల్లో మాత్రమే ప్రపంచ దేశాల ప్రభుత్వాల్లో కొంత చలనం వచ్చింది. తొలిసారిగా 1992 జూన్ 8న వివిధ దేశాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ‘వరల్డ్ ఓషన్స్ డే’గా ప్రకటించి కెనడాలో ఒక సమావేశం నిర్వహించాయి. సముద్రాల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరిపాయి. ఐక్యరాజ్య సమితి మాత్రం వరల్డ్ ఓషన్స్ డేను 2008లో అధికారికంగా గుర్తించింది. అప్పటి నుంచి వివిధ దేశాల ప్రభుత్వాలు, సముద్ర పరిశోధనలు సాగించే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఈ రోజున సాగరాల పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. కార్బన్ కాలుష్యంతో చేటు భూమ్మీద మనుగడ సాగించే మనుషులు సహా సమస్త జీవరాశులకు అవసరమయ్యే ప్రాణవాయువును అందించడంలో సముద్రాల పాత్ర చాలా కీలకం. ప్రపంచంలోని జీవులకు అవసరమయ్యే ఆక్సిజన్‌లో దాదాపు సగానికి సగం సముద్రాల ద్వారానే అందుతోంది. అంతేకాదు, భూమిపై వాతావరణంలో వ్యాపించి ఉన్న దానికి యాభై రెట్ల పరిమాణంలోని కార్బన్ డయాక్సైడ్ను సముద్రాలు పీల్చుకుంటున్నాయి. సముద్రాలకు కార్బన్ డయాక్సైడ్ను ఇముడ్చుకునే శక్తి ఉన్నా, వాటి సామర్థ్యానికి మించిన పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ సముద్రాల్లోకి చేరుతోంది. సముద్రాల్లో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పరిమితిని మించితే, సముద్ర జలాలు ఆమ్లతత్వాన్ని సంతరించుకుంటాయి. గడచిన రెండువందల సంవత్సరాల్లో సముద్రాల్లో ఆమ్లతత్వం 30 శాతం మేరకు పెరిగినట్లు ‘గ్లోబల్ బయో డైవర్సిటీ’ నివేదిక వెల్లడించింది. సముద్ర జలాల్లో ఆమ్లతత్వం పెరుగుతున్న ప్రాంతాల్లో జలచరాలకు ప్రధాన ఆహారమైన నాచు నశిస్తోంది. ఫలితంగా ఆ ప్రాంతాల్లో జలచరాల సంఖ్య కూడా తగ్గుతోంది. విలువైన పగడపు దీవులు సైతం 30 శాతం మేరకు క్షీణించాయి. సముద్రాల్లోకి కార్బన్ డయాక్సైడ్ మితిమీరి చేరుతున్న కొన్ని ప్రాంతాల్లో సముద్ర ఉపరితలంపై ఆక్సిజన్ పరిమాణం గణనీయంగా తగ్గిపోయి ‘డెడ్ జోన్లు’గా తయారవుతున్నాయి. ఇలాంటి డెడ్‌జోన్ల సంఖ్య 1910 సంవత్సరం నాటికి పట్టుమని పదికి లోపే ఉంటే, 2010 నాటికి వీటి సంఖ్య 500 వరకు చేరుకుంది. ఈ డెడ్‌జోన్ల విస్తీర్ణం దాదాపు 2.50 లక్షల చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. గడచిన మూడు దశాబ్దాలుగా డెడ్‌జోన్ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్తులోనే సముద్రాల్లోని జీవ వైవిధ్యానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సముద్రతీరాల వెంబడి ఉండే మడ అడవులు కార్బన్ కాలుష్యాన్ని హరించడంలో చాలా వరకు ఉపయోగపడతాయి. మడ అడవుల విస్తీర్ణం కూడా ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గిపోతుండటం ఆందోళనకర పరిణామం. గడచిన అరవయ్యేళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 శాతం మేరకు మడ అడవులు అంతరించాయి. ఫలితంగా సముద్రాల్లో కార్బన్ కాలుష్యం పెరుగుతోంది. కేవలం మడ అడవుల్లో మాత్రమే కనిపించే 70 రకాల అరుదైన జీవజాతుల్లో 11 జీవజాతులు పూర్తిగా అంతరించిపోయాయని ‘కన్జర్వేషన్ ఇంటర్నేషనల్’ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇకనైనా ప్రభుత్వాలు కళ్లుతెరిచి, విస్తారంగా మడ అడవుల పెంపకం చేపట్టకపోతే పసిఫిక్, అట్లాంటిక్ తీర ప్రాంతాల్లోని మడ అడవుల్లో మాత్రమే కనిపించే 40 రకాల అరుదైన జీవజాతులు త్వరలోనే అంతరించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించింది. సాధారణ అడవులతో పోలిస్తే, అదే విస్తీర్ణంలో సముద్ర తీరాల వెంబడి ఉండే మడ అడవులు, సముద్రపు గడ్డి, నాచు, ఉప్పుమేటలు దాదాపు యాభై రెట్లు ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయని, వీటి విస్తీర్ణం తగ్గుతూ పోతే భూతాపం గణనీయంగా పెరిగి, భూమ్మీద చాలా అనర్థాలు వాటిల్లుతాయని యూనెస్కో ఒక నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ప్లాస్టిక్‌తోనే పెనుముప్పు మనుషుల వల్ల సముద్రాలకు చాలా రకాల సమస్యలే ఎదురవుతున్నా, వాటిలో ప్లాస్టిక్ కారణంగానే పెను ముప్పు కలుగుతోందని పర్యావరణ శాస్త్రవేత్తలు, సముద్ర శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటి లెక్కలకు అందుతున్న అంచనాల ప్రకారం సముద్రాల్లో వాడి పారేసిన ప్లాస్టిక్ వస్తువుల సంఖ్య 5.25 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని, వాటి బరువు 28 కోట్ల టన్నుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, 2025 నాటికి సముద్రాల్లో చేరే ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం మరో మూడు రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా సముద్ర జీవుల సంఖ్య గణనీయంగా నశించిందని, 1970 నుంచి 2012 మధ్య కాలంలో సముద్రంలో సంచరించే వెన్నెముక గల జీవులు 49 శాతం మేరకు నశించాయని, మిగిలిన రకాల జీవరాశులను కూడా కలుపుకొని చూస్తే ఇదే కాలంలో 39 శాతం మేరకు సముద్రాల్లోని జీవ వైవిధ్యం నాశనమైందని యూకే ప్రభుత్వ నిపుణులు ఒక నివేదికలో వెల్లడించారు. ప్లాస్టిక్ వాడకాన్ని కనీస స్థాయికి తగ్గిస్తే తప్ప సముద్రాల్లోని జీవ వైవిధ్యాన్ని కాపాడుకోలేమని వారు చెబుతున్నారు. ప్లాస్టిక్ వాడుక నియంత్రణను ఈ ఏడాది ‘వరల్డ్ ఓషన్స్ డే’ థీమ్‌గా పాటిస్తున్నారు. ‘వరల్డ్ ఓషన్స్ డే’ను ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించిన తర్వాత 120 దేశాలు సముద్రాల పరిరక్షణపై అవగాహన, చైతన్యం పెంపొందించే కార్యక్రమాలను చేపడుతున్నాయి. పలు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్లాస్టిక్ వాడకంలో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. సముద్రాలకు మరిన్ని అనర్థాలు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా వాడే రసాయనాలు, చమురు, సహజవాయువుల కోసం సముద్రగర్భంలో జరిపే తవ్వకాలు, ‘డీప్ సీ మైనింగ్’, చేపల కోసం మితిమీరి సాగిస్తున్న వేట, సముద్ర తీర ప్రాంతాల్లో పట్టణీకరణ, పెరుగుతున్న భవన నిర్మాణాలు, తీర ప్రాంతాలకు చేరువలో వస్తూత్పత్తి కేంద్రాలు, ఔషధ తయారీ, ఎరువుల తయారీ కేంద్రాల పెరుగుదల, ఓడరేవులు, తీర ప్రాంత పర్యాటకం వంటి కార్యకలాపాలు సముద్రాల్లోకి నానా రకాల కాలుష్యాలను చేరవేస్తున్నాయి. సముద్రాల్లోకి దాదాపు లక్షకు పైగా రసాయన వ్యర్థాలు చేరుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే విషపూరితమైన లోహాలు, చమురు కూడా సముద్రాల్లోకి చేరుతున్నాయి. ఇవన్నీ అరుదైన జలచరాలను, సముద్రాల్లోని జీవ వైవిధ్యాన్ని హరించివేస్తున్నాయి. ఈ ప్రక్రియ ఇక్కడితోనే ఆగిపోవడం లేదు. సముద్రం నుంచి లభించే చేపలు, రొయ్యలు, పీతలు వంటి జలచరాల్లోకి చేరుతున్నాయి. వీటిని తినే మనుషుల ఆరోగ్యాలపై కూడా దుష్ప్రభావాలు కలిగిస్తున్నాయి. సముద్రం ఎగువ భాగంలో కాకుండా, అట్టడుగున సంచరించే అరుదైన జలచరాలు సైతం రసాయనిక కాలుష్యం బారిన పడుతున్నాయి. సముద్రాలు మనకేమిస్తున్నాయంటే..! మనం రోజూ ఆహారంలో వాడే ఉప్పు, మాంసాహారులు తినే చేపలు, రొయ్యలు, పీతలు వంటి జలచరాలు సముద్రాల నుంచే లభిస్తున్నాయనే సంగతి తెలిసిందే. మనుషులు రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకునే జంతు సంబంధిత ప్రొటీన్లలో 15 శాతం ప్రొటీన్లు చేపలు వంటి జలచరాలకు చెందినవే. ఉప్పు, చేపలు వంటి జలచరాలే కాకుండా, ఆహారంలో వినియోగించే మరికొన్ని పదార్థాలు కూడా మనకు సముద్రం నుంచే దొరుకుతున్నాయి. సముద్రపు పాచి, నాచు నుంచి సేకరించే అగర్, కరాజీనాన్ ఆల్గిన్ వంటి పదార్థాలు ఐస్‌క్రీమ్‌లు, పెరుగు, సలాడ్లు, కేక్ మిక్స్‌ల తయారీలో ఉపయోగపడుతున్నాయి. సముద్రంలో దొరికే స్పాంజ్, ‘సీ విప్ కోరల్స్’ అనే ఒక రకమైన పగడాల నుంచి సేకరించిన పదార్థాలు పెయిన్ కిల్లర్స్, యాంటీ అలెర్జిక్ ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతున్నాయి. సముద్ర తీరాల్లో విస్తారంగా లభించే ఇసుక భవన నిర్మాణాల్లో ఉపయోగపడుతోంది. సముద్రంలో లభించే శంఖాలు, నత్త గుల్లలు వంటివి అలంకరణల కోసం, ఇతర ప్రయోగాల కోసం చిరకాలంగా వాడుకలో ఉన్నాయి. సముద్రాల గురించి అవీ ఇవీ.. సముద్రాల సగటు లోతు 12,400 అడుగులు. సూర్యుని నుంచి వెలువడే కాంతి కిరణాలు సముద్రాల్లో 330 అడుగుల లోతును దాటి ముందుకు సాగలేవు. అందువల్ల సముద్రాల్లో 330 అడుగులు దాటిన తర్వాత దిగువన ఉండే ప్రాంతమంతా నిరంతరం చీకట్లోనే ఉంటుంది.ప్రపంచంలోనే అతి పొడవాటి పర్వతపంక్తులు ఉన్నది నేల మీద ఎక్కడో కాదు, ఆ పర్వత పంక్తులు సముద్రం అట్టడుగున ఉన్నాయి. ‘మిడ్–ఓషియానిక్ రేంజ్’ అనే ఈ పర్వత పంక్తులు అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల అడుగున 56 వేల కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్నాయి. సముద్రాల గురించి మనుషులు తెలుసుకున్నది చాలా తక్కువ. ఇప్పటి వరకు సముద్రాల్లోని కేవలం 5 శాతం మేరకు మాత్రమే మనుషులు అన్వేషణలు కొనసాగించగలిగారు. మిగిలిన 95 శాతం ఏమేమి వింతలు ఉంటాయో ఇంకా తెలుసుకోవాల్సి ఉంది.ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియం సముద్ర గర్భమే. పెద్దపెద్ద మ్యూజియంలలో కనిపించే వాటి కంటే సముద్రం అట్టడుగున పెద్ద సంఖ్యలో పురాతన వస్తువులు, కళాఖండాలు దాగి ఉన్నాయి. సముద్రం అడుగున కొన్ని చోట్ల అగ్నిపర్వతాలు, వేడినీటి బుగ్గలు ఉంటాయి. సముద్రగర్భంలోని అగ్నిపర్వతాలు లావాను కాకుండా, వేడి బురదను, మిథేన్ వాయువును వెదజల్లుతూ ఉంటాయి. సముద్రం అడుగున కొన్నిచోట్ల ఉండే వేడి నీటి బుగ్గలు ఏకంగా 3600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వేడినీటిని పైకి ఎగజిమ్ముతుంటాయి. వాటి నుంచి వెలువడే నీటి వేడికి సీసం లాంటి లోహాలు కరిగిపోతాయి. ఆస్ట్రేలియా తీరానికి ఆవల పసిఫిక్ మహాసముద్రం అడుగున ఉండే ‘గ్రేట్ బ్యారీర్ రీఫ్’ పగడపు దీవి విస్తీర్ణం దాదాపు 2575 చదరపు కిలోమీటర్లు. భూ గ్రహంలోని అతిపెద్ద సజీవ నిర్మాణం ఇదే కావడం విశేషం.సముద్రంలో జీవించే భారీ జలచరాల్లో భయంకరమైన షార్క్‌ల గురించి అందరికీ తెలిసిందే. షార్క్ జాతుల్లో దాదాపు 99 శాతం రకాలు ఇప్పటికే అంతరించాయి. కేవలం ఒక్క శాతం జాతులకు చెందిన షార్క్‌లు మాత్రమే ప్రస్తుతానికి మిగిలి ఉన్నాయి. సముద్రం అట్టడుగున దాదాపు 2 కోట్ల టన్నుల బంగారం నిక్షిప్తమై ఉన్నట్లు నిపుణుల అంచనా. నేల మీద మనకు అందుబాటులో ఉన్న బంగారం కంటే ఇది చాలా ఎక్కువ. భూమ్మీద ఇప్పటి వరకు గనుల నుంచి తవ్వగలిగిన బంగారం 1,87,200 టన్నులు మాత్రమే.సముద్రపు నీటిలో కంటికి కనిపించని చాలా సూక్ష్మజీవులు ఉంటాయి. ఒక మిల్లీలీటరు సముద్రపు నీటిలో దాదాపు పది లక్షల బ్యాక్టీరియా కణాలు, కోటి వరకు వైరస్ కణాలు ఉంటాయి. అయితే, వీటిలో చాలా వరకు హానికరమైనవి కావు. సాహిత్యంలో సముద్రం అనాదిగా సముద్రాలు మనుషులను అబ్బురపరుస్తూనే ఉన్నాయి. వాటి ఆటుపోట్లు, అప్పుడప్పుడు తెచ్చిపెట్టే తుపానులు, ఉప్పెనలు వంటి భయపెట్టే సందర్భాలు ఎన్ని ఉన్నా, సముద్రాలపై మనుషుల్లో తీరని కుతూహలం ఇంకా మిగిలే ఉంది. ప్రకృతిని పరిపరి విధాలుగా వర్ణించిన ప్రాచీన కవులు, సాహితీవేత్తలు తమ తమ రచనల్లో సముద్రాల గురించి కూడా విశేషంగా ప్రస్తావించారు. సముద్రాల చుట్టూ బోలెడన్ని కల్పనలను జోడించి కథలల్లారు. రామాయణంలో సముద్రం ప్రస్తావన తెలిసిందే. సీతమ్మవారిని చూడటానికి హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకుంటాడు. రామాయణంలో ఇదొక కీలక ఘట్టం. ఆ తర్వాత వానరసేన సముద్రాన్ని దాటడానికి వారధి నిర్మించడం మరో కీలక ఘట్టం. మన జానపద గాథల్లో సప్త సముద్రాలను దాటి రావడం రాకుమారుల శౌర్యానికి నిదర్శనం. అరేబియన్ జానపద గాథల్లో సముద్రంలో నౌకాయానానికి సంబంధించిన సాహస గాథలు అనేకంగా ఉన్నాయి. గ్రీకు మహాకవి హోమర్ రాసిన ‘ఒడెస్సీ’ కావ్యంలో పదేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన సముద్రయానం గురించి వర్ణన ఉంటుంది. ‘నోబెల్’ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన ‘ఓల్డ్‌మేన్ అండ్ సీ’ ఇంగ్లిష్ సాహిత్యంలో ఒక క్లాసిక్‌గా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ నావికాదళంలో పనిచేసిన సైనికుల సాధక బాధకాలను వివరిస్తూ నికోలస్ మోన్సారట్ రాసిన ‘ది క్రూయెల్ సీ’ నవల కూడా ప్రసిద్ధి పొందింది. సినిమాల్లో సముద్రం సముద్రం చుట్టూ అల్లుకున్న కథలతో అనేక సినిమాలు కూడా వచ్చాయి. వాటిలో కొన్ని అమిత ప్రజాదరణ పొందాయి. అలాంటి వాటిలో ‘జాస్’, ‘టైటానిక్’ ‘ఫైండింగ్ నెమో’, ‘లైఫ్ ఆఫ్ పై’, ‘20,000 లీగ్స్ అండర్ ది సీ’, ‘పైరేట్స్ ఆఫ్ కరీబియన్: ది కర్స్ ఆఫ్ ది బ్లాక్ పెర్ల్’, ‘ది పెర్ఫెక్ట్ స్టోర్మ్’, ‘అట్లాంటిస్: ది లాస్ట్ ఎంపైర్’, ‘ది లైఫ్ ఆక్వాటిక్’ వంటివి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. – పన్యాల జగన్నాథదాసు