ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. దాదాపు భూగోళమంతటా విస్తరించిన భూతం. చెరువులు, నదులు, సముద్రాల్లోనూ తిష్టవేసుకొని కూర్చుంది. విలువైన జలవనరులను కలుషితం చేస్తోంది. జలచరాల ఆయువును కబళిస్తోంది. తనను సృష్టించిన మనిషికే ముప్పుగా పరిణమిస్తోంది. సముద్రాల్లో మాటువేసిన ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచదేశాలకు ఇప్పుడొక పెద్ద సమస్యగా మారిపోయింది. భూమిపై అన్ని సముద్రాల్లో 19.90 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు నిపుణుల అంచనా.
వీటిని తొలగించి, మహాసాగరాలను పరిశుభ్రంగా మార్చడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఎంతోమంది పరిశోధకులు, ఇంజనీర్లు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. కృత్రిమ మేధ(ఏఐ) బీచ్ బగ్గీలు, ప్లాస్టిక్‌ను తినేసే కృత్రిమ ఎంజైమ్‌లు, ప్లాస్టిక్ ఇంటర్‌సెప్టర్లు, అక్వాటిక్ డ్రోన్లు వంటివి కొన్ని పరిష్కార మార్గాలుగా చెబుతున్నారు. ఎంజైమ్‌లతోపాటు మైక్రోబ్ నెట్‌లు, మ్యాగ్నెటిక్ లిక్విడ్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
వాటర్‌షార్క్‌లు
సముద్రాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా ప్లాస్టిక్ రక్కసి చొచ్చుకెళ్తోంది. మానవ సంచారం లేని అంటార్కిటికాలో కురిసిన మంచులోనూ సూక్ష్మ ప్లాస్టిక్ ఆనవాళ్లు బయటపడ్డాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) అంచనా ప్రకారం సముద్రాల్లో 199 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వివిధ రూపాలు, పరిణామాల్లో ఉంది. తక్కువ బరువు కలిగిన మైక్రోప్లాస్టిక్‌లు ఉపరితలంపై తేలుతుండగా, అధిక బరువు కలిగినవి అడుగు భాగానికి చేరుకున్నాయి.
నీటిపై తేలుతున్న ప్లాస్టిక్‌ను తొలగించడానికి అక్వాటిక్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. నీటి పై భాగంలోని చిన్నచిన్న ప్లాస్టిక్ ముక్కలను సైతం సులువుగా సేకరిస్తాయి. వీటిని వాటర్‌షార్క్‌లుగా వ్యవహరిస్తున్నారు. బీచ్‌లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను ఏరివేయడానికి కృత్రిమ మేధతో పనిచేసే బగ్గీలు (చిన్నపాటి వాహనాలు) వాడుతున్నారు. కంటికి కనిపించని సూక్ష్మ ప్లాస్టిక్‌ను నిర్మూలించడానికి మ్యాగ్నటిక్ నానో–స్కేల్ స్ప్రింగ్‌లను తయారు చేస్తున్నారు. మరికొన్ని ప్రయోగాలు అభివృద్ధి దశలో ఉన్నట్లు చెబుతున్నారు.
ప్లాస్టిక్‌ను భక్షించే ఎంజైమ్
నదులు, సముద్రాల్లోని ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌ను 2016లో కనిపెట్టారు. దీన్ని పెటేస్ అని పిలుస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ ఎంజైమ్ నిర్వీర్యం అవుతుండడంతో పెద్దగా ఉపయోగించడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక పాలిమర్‌ను డిజైన్ చేశారు. ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌ను అధిక ఉష్ణోగ్రతల్లోనూ కాపాడుతుందని అంటున్నారు. మోంటానా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్‌మౌత్ పరిశోధకులు టీపీఏడీఓ అనే మరో ఎంజైమ్‌ను అభివృద్ధి చేశారు. జల వనరుల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడానికి ఇది చక్కగా ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు.
సీబిన్ వాక్యూమ్ క్లీనర్లు
సౌరశక్తితో పనిచేసే ప్లాస్టిక్ ఇంటర్‌సెప్టర్లను పలు దేశాల్లో ఉపయోగిస్తున్నాయి. ఇందులో ఇంటర్‌సెప్టర్‌కు పొడవైన చేతుల్లాంటి ఉంటాయి. నీటిలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇంటర్‌సెప్టర్‌లోని బుట్టల్లోకి పంపిస్తాయి. బుట్టలు నిండిపోయిన తర్వాత ఒడ్డుకు చేరుస్తారు. ఇదే తరహాలో పనిచేసే వాటర్–వీల్ పవర్డ్ ప్లాస్టిక్ కలెక్టర్‌ను అమెరికాలో వాడుతున్నారు. సీబిన్ వాక్యూమ్ క్లీనర్లను 2015లో ఆస్ట్రేలియాలో రూపొందించారు. ఇవి ప్లాస్టిక్‌తో వ్యర్థాలతో కూడిన నీటిని యంత్రంలోకి సేకరిస్తాయి. రెండింటినీ వేరుచేసి, నీటిని మాత్రమే బయటకు పంపిస్తాయి. ప్లాస్టిక్ ముక్కలన్నీ క్లీనర్‌లోని సంచిలోకి చేరుకుంటాయి.
ప్రపంచమంతటా ఇప్పుడు 860 సీబిన్ వాక్యూమ్ క్లీనర్లలో వాడుకలో ఉన్నాయి. తుపాన్ల దిశను గుర్తించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ అభివృద్ధి చేసిన సైక్లోన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(సీవైజీఎన్‌ఎన్‌ఎస్) సముద్రాలు, నదుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల కదలికలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుండడం గమనార్హం. ప్లాస్టిక్ ముక్కలు ఏ ప్రదేశంలో అధికంగా ఉన్నాయో తెలుసుకొని, సేకరించడానికి ఈ పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నారు. హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ పరిశోధకులు అతుక్కునే గుణం ఉన్న బయోఫిల్మ్‌తో కూడిన మైక్రోబ్ నెట్‌లను రూపొందించారు. నెట్‌లను నీటిలోకి జారవిడిస్తే అక్కడున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు అతుక్కుపోతాయి. పైకి లాగితే వాటితోపాటు వ్యర్థాలు వచ్చేస్తాయి.
వామ్మో ప్లాస్టిక్ ...
► ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవాలంటే వేల సంవత్సరాలు పడుతుంది. సముద్రాల్లో కోట్లాది ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. వీటి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.
► నీటిలోని సూక్ష్మ ప్లాస్టిక్‌ను పూర్తిగా ఫిల్టర్ చేసే పరిజ్ఞానం ఇంకా అందుబాటులోకి రాలేదు.
► 2050 నాటికి సముద్రాల్లోని మొత్తం చేపల బరువు కంటే ప్లాస్టిక్ బరువే ఎక్కువగా ఉంటుందని 2016లో విడుదల చేసిన ఓ నివేదికలో నిపుణులు తేల్చిచెప్పారు.
► ప్రపంచంలో కుళాయి ద్వారా సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం నీరు ప్లాస్టిక్‌తో కలుషితమైందేనని 2017లో ఒక అధ్యయనంతో తేలింది.
► కుళాయి నీటిలో ప్లాస్టిక్ కాలుష్యం ముప్పు అధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా, లెబనాన్, భారత్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఫ్రాన్స్, జర్మనీ, యూకే చిట్టచివరి స్థానాల్లో ఉన్నాయి.
► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నీటి నమూనాలను సేకరించి, పరీక్షించగా.. 83 శాతం నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ కనిపించింది. ఈ మైక్రోప్లాస్టిక్ మనిషి శరీర అంతర్భాగాల్లోకి సులభంగా చొచ్చుకెళ్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను దూరం పెట్టడమే మంచిదని సూచిస్తున్నారు.
► సూక్ష్మ ప్లాస్టిక్‌లో విషపూరితమైన రసాయనాలు ఉంటాయి.
► భూగోళంపై నివసిస్తున్న అన్ని రకాల జీవులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్లాస్టిక్‌ను స్వీకరిస్తున్నాయి. ప్లాస్టిక్ వల్ల ప్రభావితమవుతున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment