ప్లాస్టిక్ మన జీవితంలో భాగమైపోయింది. వాడే ప్రతి వస్తువూ ప్లాస్టిక్ మయం అయిపోతోంది. అదంతా ఎటు పోతోందో మీకు తెలుసా?.. చెత్తగా మారి అటు భూమిలో, ఇటు సముద్రాల్లో చేరి కలుషితం చేసేస్తోంది. మనం తినే తిండి, తాగే నీళ్లు.. ఓ లెక్కన చెప్పాలంటే మన శరీరం కూడా మైక్రో ప్లాస్టిక్‌తో నిండిపోతోంది. మంగళవారం ‘ప్రపంచ సముద్రాల దినోత్సవం’ సందర్భంగా.. సముద్రాల్లో ప్లాస్టిక్ పరిస్థితి ఏమిటో తెలుసుకుందామా?
లక్షల కిలోమీటర్ల చెత్త దీవులు
నదుల ద్వారా, నేరుగా డంపింగ్ చేయడం ద్వారా భారీ స్థాయిలో ప్లాస్టిక్ చెత్త సముద్రాల్లోకి చేరుతోంది. సముద్ర అంతర్గత ప్రవాహాల కారణంగా ఆ ప్లాస్టిక్ అక్కడక్కడా గుంపుగా చేరుతోంది. అలాంటి ఓ ప్లాస్టిక్ చెత్త ప్యాచ్‌ను 1990లోనే అమెరికాలోని హవాయి, కాలిఫోర్నియాల మధ్య పసిఫిక్ మహా సముద్రంలో గుర్తించారు. ప్రస్తుతం ఆ చెత్త ప్యాచ్ వైశాల్యం సుమారు 16 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నట్టు ఇటీవల గుర్తించారు. ఇంత భారీగా కాకున్నా.. మిగతా సముద్రాల్లోనూ పలుచోట్ల ఇలాంటి ప్లాస్టిక్ ప్యాచ్‌లు ఏర్పడ్డాయి.
ఏటా లక్షల టన్నులు
ప్రతి సంవత్సరం సముద్రాల్లో ఎంత ప్లాస్టిక్ కలుస్తోందో తెలుసా?.. సుమారు 80 లక్షల టన్నులు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్, అందులో రీసైకిల్ అవుతున్నది, భూమిపై డంప్ చేస్తున్నది, సముద్రాల్లో కలుస్తున్నది ఎంతనే దానిపై శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధన చేశారు. సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్‌లో ఒకట్రెండు శాతం మాత్రమే చెత్త ప్యాచ్‌లుగా చేరుతోందని గుర్తించారు. మిగతా అంతా ఏమైపోతోందని పరిశీలన చేపట్టారు.
అన్నీ ఆ చెత్తలోనే..
సముద్రాల్లో చేరుతున్న ప్లాస్టిక్ చెత్తలో మనం నిత్యం వాడే అన్ని రకాల సామగ్రి ఉంటున్నాయి. పసిఫిక్ ప్యాచ్‌లో శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు.. ప్లాస్టిక్ బాటిళ్లు, గ్లాసులు, పాత్రలు, బొమ్మలు, టాయిలెట్ సీట్లు, చేపల వలలు, ఎలక్ట్రానిక్ పరికరాల ప్లాస్టిక్ భాగాలు, ఇంట్లో వాడే ఇతర ప్లాస్టిక్ వస్తువుల ముక్కలు, థర్మాకోల్ ముక్కలు.. ఇలా చాలా రకాలు కనిపించాయి.
నీటి లోతుల్లోకి..
ఇటీవల ఆర్కిటిక్ సముద్రం అడుగున పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు సుమారు 2,500 మీటర్ల (రెండున్నర కిలోమీటర్ల) లోతులో ప్లాస్టిక్ బ్యాగ్, బాటిల్స్ వంటివి కనిపించాయి. ఆ ఒక్కచోటే కాదు.. జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు ఇలా సముద్రపు లోతుల్లో ప్లాస్టిక్ చెత్త కనిపించిన 2,100 ఫొటోలను సేకరించారు. ప్లాస్టిక్ చెత్తలో కొంత భాగం సముద్రాల అడుగున లోతైన భాగాల్లోకి చేరుతోందని తేల్చారు.
సముద్ర తీరాల మట్టి, ఇసుకలో..
అమెరికా సహా పలు దేశాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో మట్టి, ఇసుకను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వాటిల్లో ప్లాస్టిక్ అవశేషాలు గణనీయంగా ఉన్నట్టు గుర్తించారు. 1945 నుంచి 2009 మధ్య ఏటా ప్లాస్టిక్ అవశేషాల శాతం రెండింతలు అవుతూ వచ్చిందని తేల్చారు.
దాక్కుని ఉండేదెంతో..
2010లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. ఇప్పటివరకు సుమారు పది కోట్ల టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లో కలిసినట్టు అంచనా. ఇందులో సగందాకా.. భూమధ్యరేఖకు ఇరువైపులా కాస్త దూరంలోని (సబ్ ట్రాపికల్) సముద్రాల్లోనే చేరిందని ఓషియనోగ్రాఫర్ లారెంట్ లెబ్రెటన్ ఇటీవల వెల్లడించారు. తీర ప్రాంతాలకు, సముద్రంలో రవాణా మార్గాలకు దూరంగా.. ప్లాస్టిక్ ప్యాచ్‌లు ఉండటంతో మనకు కనిపించడం లేదని పేర్కొన్నారు.
మన చుట్టూరా.. మనలోనూ భాగంగా..
విపరీతంగా పెరిగిపోయిన ప్లాస్టిక్ వినియోగంతో భూమ్మీద దాదాపు అన్నింటిలోనూ భాగంగా మారిపోయిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అది ఎంతలా అంటే.. అసలు మైక్రో ప్లాస్టిక్ (సూక్ష్మస్థాయి ప్లాస్టిక్ ముక్కలు) లేని ప్రదేశమే లేకుండా పోయిందని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పరిశోధనల్లో గుర్తించిన ప్రకారం.. గాలిలోని దుమ్ములో, తాగే మంచినీళ్లలో, సముద్ర జీవుల కడుపుల్లో, చివరికి తల్లి గర్భంలోని శిశువులకు అన్నీ అందించే.. బొడ్డుతాడు (ప్లెసెంటా)లో కూడా మైక్రో ప్లాస్టిక్‌ను గుర్తించారు.
చదవండి: Elephanta Caves: ఎలిఫెంట్ లేదు! కేవ్స్ ఉన్నాయి!!
Comments
Please login to add a commentAdd a comment