Seas
-
నిజంగా ఏలియన్ల గుట్టు సముద్రాల్లో ఉందా? రెండింటి మధ్య లింకేంటి?
భూమి ఉపరితలంపై 70 శాతం ఆవరించి ఉన్నవి సముద్రాలే. పైకి సింపుల్‌గా కనిపిస్తున్నా.. తీవ్ర ఒత్తిడి ఉండే పరిస్థితులు, అసలు సూర్యరశ్మి సోకని నిండు చీకట్లో బతికే జీవులు.. వంటి విచిత్రాలెన్నో. అంతేకాదు సముద్రాల్లో పరిశోధనలతో గ్రహాంతర జీవం (ఏలియన్ల) గుట్టునూ తేల్చేయొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమ్మీద సముద్రాలేమిటి, ఏలియన్ల గుట్టు ఏమిటి అన్న సందేహాలు వస్తున్నాయి కదా.. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. మనకు తెలిసింది కొంచెమే! మానవ నాగరికత ఇంతగా అభివృద్ధి చెందినా.. అత్యాధునిక టెక్నాలజీలు వచ్చినా.. ఇప్పటివరకు సముద్రాల్లో జీవం, అడుగున పరిస్థితుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. భూమ్మీద ఉన్న మొత్తం సముద్ర భాగంలో 80 శాతం మేర ఏముందో, ఎలా ఉందో, అక్కడి పరిస్థితులు ఏమిటో అన్నది ఇప్పటివరకు తెలియకపోవడం గమనార్హం. మన సముద్రాల అడుగున భూమి కంటే.. చంద్రుడి ఉపరితలం, అంగారకుడి నేల గురించి మనకు ఎక్కువ తెలుసని శాస్త్రవేత్తలు కూడా చెప్తుంటారు. ఏలియన్లకు లింకేంటి? అసలు గ్రహాంతర జీవం గురించిన ఆనవాళ్లు సముద్రాల్లో ఉండవచ్చని ఎప్పటి నుంచో వాదనలున్నాయి. ఎందుకంటే భూమిపై 70 శాతానికిపైగా సముద్రాలు, మరో 10 శాతం మేర అంటార్కిటికా, ఆర్కిటిక్ వంటి మంచుతో మునిగి ఉన్న ప్రాంతాలే ఉన్నాయి. ఏలియన్లు గానీ, గ్రహాంతర జీవ పదార్థాలుగానీ భూమ్మీదికి వస్తే.. సముద్రాల్లో పడే అవకాశాలే ఎక్కువని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసలు భూమ్మీద జీవానికి మూలం గ్రహశకలాలు, తోక చుక్కల నుంచి వచ్చిన సేంద్రియ పదార్థాలే కారణమనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇటీవల ‘ర్యుగు’ అనే గ్రహ శకలం (ఆస్టరాయిడ్) నుంచి తెచ్చిన మట్టిలో సేంద్రియ పదార్థాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు కూడా.. అవే పదార్థాలు సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలు, వాటి ఉపగ్రహాలకూ చేరే అవకాశాలూ ఎక్కువే. అంటే.. వాటిలోనూ ఎక్కడో జీవం అభివృద్ధి చెంది ఉండొచ్చని అంచనా. ఇక సౌర కుటుంబంలో గ్రహాల చుట్టూ తిరుగుతున్న పలు ఉపగ్రహాల (ఆ గ్రహాలకు చందమామలు)లో ఉండే వాతావరణాన్ని పోలిన పరిస్థితులు.. భూమ్మీద సముద్రాల అడుగున ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. అత్యంత చల్లగా, తీవ్ర ఒత్తిడి (ప్రెషర్)తో కూడిన ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని రకాల జీవరాశులు మనుగడ సాగించగలుగుతున్నాయని తేల్చారు. ఈ లెక్కన సదరు ఉపగ్రహాల్లో కూడా జీవం మనగలదని.. మన సముద్రాల అడుగున పరిస్థితులపై పూర్తిస్థాయి పరిశోధన చేస్తే.. గ్రహాంతర జీవుల గుట్టు కనుగొనడం సులువని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. హడల్ జోన్.. గురుడి ఉపగ్రహం ‘యురోపా’లా.. గురుగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాల్లో ఒకటైన యురోపాపై.. దట్టమైన మంచుతో కప్పబడిన సముద్రాలు ఉన్నాయి. అక్కడి పరిస్థితులు అచ్చంగా.. మన భూమ్మీది సముద్రాల అడుగున ‘హడల్ జోన్’ను పోలి ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడ జీవంపై పరిశోధనలు చేస్తే.. యురోపాపై జీవం ఉండే అవకాశాలు, ఉంటే ఎలా ఉండొచ్చన్న వివరాలు తెలుస్తాయని వారు చెప్తున్నారు. సముద్రాల్లో ఆరు కిలోమీటర్ల కన్నా ఎక్కువ లోతున ఉండే ప్రాంతాన్ని ‘హడల్ జోన్’గా పిలుస్తారు. సూర్యరశ్మి ఏమాత్రం సోకని చిమ్మ చీకటి, అతి శీతల పరిస్థితులు, తీవ్రమైన ఒత్తిడి ఉండే హడల్ జోన్లో జీవం మనుగడ కష్టం. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కొన్ని రకాల జీవులు బతుకుతున్నాయి. ప్రయోగాలు మొదలెట్టిన నాసా.. సముద్రాల అట్టడుగున ఉండే క్లిష్టమైన పరిస్థితులపై నాసా ఇప్పటికే ప్రయోగాలు మొదలుపెట్టింది. ఈ పరిస్థితులపై పరిశోధన చేసి.. ఇతర గ్రహాలు, ఉపగ్రహాలపై సముద్రాలు, అక్కడి పరిస్థితులు ఎలా ఉండొచ్చనే అంచనాలను రూపొందిస్తోంది. ఈ అంచనాలకు అనుగుణంగా అన్నిరకాల పరిస్థితులను తట్టుకునే పరికరాలను రూపొందించి.. భవిష్యత్తులో ఆయా గ్రహాలు, ఉపగ్రహాలపై పరిశోధనలు చేయనుంది. చంద్రుడిపైకి నాసా ‘వైపర్’ మంచు, దాని అడుగున నీటిలో (సబ్ సీ) ప్రయాణిస్తూ, పరిశోధన చేయగల రోవర్ ‘వైపర్’ను నాసా వచ్చే ఏడాది చంద్రుడిపైకి పంపనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద మంచు, నీటి జాడ గుట్టును ‘వైపర్’ తేల్చనుంది. దీని పనితీరును భూమిపై సముద్రాల్లో పరిశీలిస్తున్నారు. ఆ నీటి అడుగున చిత్రాలెన్నో.. ► సౌర కాంతి సముద్రాల్లో 200 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోగలదు. తర్వాత ఒక కిలోమీటర్ వరకు స్వల్పంగా ఉంటుంది. అంటే మసక చీకటిలా ఉంటుంది. అంతకన్నా లోతున అంతా చిమ్మ చీకటే ఉంటుంది. ► గత ఏడాది అమెరికా తీరానికి సమీపంలో అట్లాంటిక్ సముద్రంలో అత్యంత అరుదైన భారీ ‘ఫాంటమ్ జెల్లీఫిష్’ను గుర్తించారు. రెండు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల లోతులో అవి జీవిస్తుంటాయని తేల్చారు. ►నాలుగైదు కిలోమీటర్ల లోతులో సముద్రపు నేలపై ‘హైడ్రో థర్మల్ వెంట్స్ (వేడి నీరు, పొగను వెలువరించే బిలాలు)’ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి నుంచి వెలువడే వేడి, సేంద్రియ రసాయనాల ఆధారంగా.. అంత లోతులో కూడా కొన్నిరకాల జీవులు బతుకుతున్నట్టు తేల్చారు. ► మంచుతో కప్పిఉన్న ఉపగ్రహాల్లోనూ ఇలాంటి ‘హైడ్రో థర్మల్ వెంట్స్’ ఉంటే.. జీవానికి అవకాశాలు ఎక్కువేనని అంచనా వేస్తున్నారు. -
తోలు తీసి.. నదిని దాటేసి.. ఏ కాలం నుంచి మొదలు?
వాగులు, వంకలు దాటేందుకు ఇప్పుడంటే పడవలు, బోట్లు ఉన్నాయి. సముద్రాలను కూడా అలవోకగా దాటేస్తున్నాం. ఇవన్నీ ఎందుకనుకుంటే పెద్ద పెద్ద వంతెనలే కట్టుకుంటున్నాం. మరి ఇలాంటి సౌకర్యాలేవీ లేని పూర్వకాలంలో కొన్ని ప్రాంతాల్లో వాగులు, నదులను ఎలా దాటే వాళ్లో తెలుసా? చనిపోయిన జంతువుల కళేబరాలను ఒలిచి, వాటిలో గాలిని ఊది బెలూన్లలా చేసుకొని వాడేవారు. వినడానికి విచిత్రంగా ఉన్నా అప్పట్లో ఇలాగే చేసేవారు. అసలు రంధ్రాలు పడకుండా జంతువుల కళేబరాలను పక్కాగా ఎలా ఒలిచేవాళ్లు, వాటి నుంచి గాలి పోకుండా ఏం చేసేవాళ్లు, కదిలే నీటిలో వాటితో ఎలా ప్రయాణించే వాళ్లు, ఇలాంటి పద్ధతులు ఏ ప్రాంతాల్లో వాడేవారో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ ఏ కాలం నుంచి మొదలు? ఆదిమ కాలం నాటి ఈ నదులు దాటే పద్ధతి మెసపటోమియా కాలం నుంచి కనిపిస్తోంది. క్రీస్తుపూర్వం 880ల కాలంలో నిర్ముడ్ ప్రాంతంలోని (ప్రస్తుతం ఇరాక్‌లో ఉంది) ఓ శిల్పంలో ఈ విధానం గురించి చెక్కారు. అప్పటి ఆ ప్రాంతపు అస్సీరియన్ సైనికులు గాలి నింపిన మేక ఆకారంలోని జంతు చర్మాల సాయంతో వాగును దాటుతున్నట్టు ఆ శిల్పంలో ఉంది. అప్పట్లో గ్రీకు రాజు సైరస్ కూడా ఇలాంటి జంతు చర్మాల సాయంతో బాబిలోనియన్ నదిని దాటాడని నాటి తత్వవేత్త జెనోఫోన్ చెప్పాడు. పర్షియా రాజు డేరియస్, మంగోలియన్ సైనికులు, రోమన్లు, అరబ్బులు కూడా ఈ పద్ధతి వాడారు. చర్మాలను ఎలా ఒలిచేవాళ్లు? ఓ ప్రత్యేక పద్ధతిలో జంతువుల చర్మాలను ఒలిచేవారు. ఆ తర్వాత చర్మాన్ని కొన్నిరోజులు పాతి పెట్టేవారు. తర్వాత దానిని తీసి పదును లేని కత్తితో రాసి వెంట్రుకలను తొలిగించేవారు. ఆ తర్వాత చర్మాన్ని తిప్పి లోపలి భాగంవైపు ముక్కు, మూతి, కళ్లు, చెవులు లాంటి ఇతర రంధ్రాలుండే ప్రాంతాలను కుట్టేసేవారు.4 కాళ్లలో మూడింటిని కట్టేసేవారు. నాలుగో కాలును గాలి ఊదేందుకు, తీసేందుకు వాడేవారు. చర్మంలోపల తారు లాంటి పదార్థాన్ని పోసి పూర్తిగా అంటుకునేవరకు ఊపేవారు. వాడనప్పుడు తోలును ఎండబెట్టి ఉంచేవారు. వాడాలనుకున్నప్పుడు తోలుకు సున్నితత్వాన్ని పెంచడానికి నీళ్లలో నానబెట్టేవారు. నదులను ఎలా దాటేవాళ్లు? చర్మం బెలూన్‌లో గాలి ఊదాక తమకు తాముగా ఆ బెలూన్‌తో పాటు నదిలో దూకేవారు. ఒకవైపు కాలుతో, మరోవైపు చిన్న తెడ్డుతో నీటిని వెనక్కి తోస్తూ ముందుకెళ్లేవారు. జంతు చర్మం బెలూన్ మాములూగానే గుండ్రంగా ఉంటుంది. దూకగానే పడిపోయే అవకాశం ఉంటుంది. అయితే సాధన చేస్తూ చేస్తూ ఆ చర్మం బెలూన్ సాయంతో ఈదడం నేర్చుకునేవారు. వీటిపైన ఇతర ప్రయాణికులను, చిన్న చిన్న వస్తువులు, సరుకును కూడా రవాణా చేసేవారు. ప్రయాణికులను తీసుకెళ్లేటప్పుడు రెండు, మూడు చర్మం బెలూన్లను ఒక చిన్న సైజు తెప్పలా చేసి వాడేవారు. మనదేశంలో వాడేవాళ్లా? మనదేశంలోనూ పంజాబ్, కశ్మీర్, సిమ్లాల్లో ఇలాంటి వాటిని వాడేవారు. 1900వ సంవత్సరం తొలినాళ్లలో అమెరికా స్కూల్ టీచర్ జేమ్స్ రికాల్టన్ మన దేశాన్ని చూసేందుకు వచ్చినప్పుడు పంజాబ్‌లోని కొండ ప్రాంత గ్రామాల్లో జంతు చర్మాల సాయంతో సట్లెజ్ నదిని గ్రామస్తులు దాటడం గమనించాడు. ఆ దృశ్యాలను తన స్టీరియోస్కోపిక్ కెమెరాలో బంధించాడు. సరుకులనూ నది దాటించేవాళ్లా? సరుకు రవాణాకూ ఈ జంతు చర్మాల బెలూన్లను వాడేవారు. ఇంగ్లిష్ అన్వేషకుడు విలియం మూర్‌క్రాఫ్ట్ మన దేశానికి వచ్చినప్పుడు తనకు సంబంధించిన వ్యక్తులు 300 మంది, 16 గుర్రాలు, కంచర గాడిదలు, దాదాపు 7,400 కిలోల వివిధ రకాల బ్యాగులను 31 మంది తమ జంతు చర్మాల సాయంతో సట్లెజ్ నదిని దాటించారని చెప్పాడు. ఈ పనినంతా వాళ్లు కేవలం గంటన్నరలోనే పూర్తి చేశారన్నాడు. చైనా వాళ్లు కూడా ఇలాంటి జంతు చర్మాలతో చేసిన తెప్పలపై రకరకాల సరుకులను రవాణా చేసేవారు. -
World Oceans Day: ‘ప్లాస్టిక్’ సముద్రాలు!
ప్లాస్టిక్ మన జీవితంలో భాగమైపోయింది. వాడే ప్రతి వస్తువూ ప్లాస్టిక్ మయం అయిపోతోంది. అదంతా ఎటు పోతోందో మీకు తెలుసా?.. చెత్తగా మారి అటు భూమిలో, ఇటు సముద్రాల్లో చేరి కలుషితం చేసేస్తోంది. మనం తినే తిండి, తాగే నీళ్లు.. ఓ లెక్కన చెప్పాలంటే మన శరీరం కూడా మైక్రో ప్లాస్టిక్‌తో నిండిపోతోంది. మంగళవారం ‘ప్రపంచ సముద్రాల దినోత్సవం’ సందర్భంగా.. సముద్రాల్లో ప్లాస్టిక్ పరిస్థితి ఏమిటో తెలుసుకుందామా? లక్షల కిలోమీటర్ల చెత్త దీవులు నదుల ద్వారా, నేరుగా డంపింగ్ చేయడం ద్వారా భారీ స్థాయిలో ప్లాస్టిక్ చెత్త సముద్రాల్లోకి చేరుతోంది. సముద్ర అంతర్గత ప్రవాహాల కారణంగా ఆ ప్లాస్టిక్ అక్కడక్కడా గుంపుగా చేరుతోంది. అలాంటి ఓ ప్లాస్టిక్ చెత్త ప్యాచ్‌ను 1990లోనే అమెరికాలోని హవాయి, కాలిఫోర్నియాల మధ్య పసిఫిక్ మహా సముద్రంలో గుర్తించారు. ప్రస్తుతం ఆ చెత్త ప్యాచ్ వైశాల్యం సుమారు 16 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నట్టు ఇటీవల గుర్తించారు. ఇంత భారీగా కాకున్నా.. మిగతా సముద్రాల్లోనూ పలుచోట్ల ఇలాంటి ప్లాస్టిక్ ప్యాచ్‌లు ఏర్పడ్డాయి. ఏటా లక్షల టన్నులు ప్రతి సంవత్సరం సముద్రాల్లో ఎంత ప్లాస్టిక్ కలుస్తోందో తెలుసా?.. సుమారు 80 లక్షల టన్నులు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్, అందులో రీసైకిల్ అవుతున్నది, భూమిపై డంప్ చేస్తున్నది, సముద్రాల్లో కలుస్తున్నది ఎంతనే దానిపై శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధన చేశారు. సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్‌లో ఒకట్రెండు శాతం మాత్రమే చెత్త ప్యాచ్‌లుగా చేరుతోందని గుర్తించారు. మిగతా అంతా ఏమైపోతోందని పరిశీలన చేపట్టారు. అన్నీ ఆ చెత్తలోనే.. సముద్రాల్లో చేరుతున్న ప్లాస్టిక్ చెత్తలో మనం నిత్యం వాడే అన్ని రకాల సామగ్రి ఉంటున్నాయి. పసిఫిక్ ప్యాచ్‌లో శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు.. ప్లాస్టిక్ బాటిళ్లు, గ్లాసులు, పాత్రలు, బొమ్మలు, టాయిలెట్ సీట్లు, చేపల వలలు, ఎలక్ట్రానిక్ పరికరాల ప్లాస్టిక్ భాగాలు, ఇంట్లో వాడే ఇతర ప్లాస్టిక్ వస్తువుల ముక్కలు, థర్మాకోల్ ముక్కలు.. ఇలా చాలా రకాలు కనిపించాయి. నీటి లోతుల్లోకి.. ఇటీవల ఆర్కిటిక్ సముద్రం అడుగున పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు సుమారు 2,500 మీటర్ల (రెండున్నర కిలోమీటర్ల) లోతులో ప్లాస్టిక్ బ్యాగ్, బాటిల్స్ వంటివి కనిపించాయి. ఆ ఒక్కచోటే కాదు.. జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు ఇలా సముద్రపు లోతుల్లో ప్లాస్టిక్ చెత్త కనిపించిన 2,100 ఫొటోలను సేకరించారు. ప్లాస్టిక్ చెత్తలో కొంత భాగం సముద్రాల అడుగున లోతైన భాగాల్లోకి చేరుతోందని తేల్చారు. సముద్ర తీరాల మట్టి, ఇసుకలో.. అమెరికా సహా పలు దేశాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో మట్టి, ఇసుకను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వాటిల్లో ప్లాస్టిక్ అవశేషాలు గణనీయంగా ఉన్నట్టు గుర్తించారు. 1945 నుంచి 2009 మధ్య ఏటా ప్లాస్టిక్ అవశేషాల శాతం రెండింతలు అవుతూ వచ్చిందని తేల్చారు. దాక్కుని ఉండేదెంతో.. 2010లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. ఇప్పటివరకు సుమారు పది కోట్ల టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లో కలిసినట్టు అంచనా. ఇందులో సగందాకా.. భూమధ్యరేఖకు ఇరువైపులా కాస్త దూరంలోని (సబ్ ట్రాపికల్) సముద్రాల్లోనే చేరిందని ఓషియనోగ్రాఫర్ లారెంట్ లెబ్రెటన్ ఇటీవల వెల్లడించారు. తీర ప్రాంతాలకు, సముద్రంలో రవాణా మార్గాలకు దూరంగా.. ప్లాస్టిక్ ప్యాచ్‌లు ఉండటంతో మనకు కనిపించడం లేదని పేర్కొన్నారు. మన చుట్టూరా.. మనలోనూ భాగంగా.. విపరీతంగా పెరిగిపోయిన ప్లాస్టిక్ వినియోగంతో భూమ్మీద దాదాపు అన్నింటిలోనూ భాగంగా మారిపోయిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అది ఎంతలా అంటే.. అసలు మైక్రో ప్లాస్టిక్ (సూక్ష్మస్థాయి ప్లాస్టిక్ ముక్కలు) లేని ప్రదేశమే లేకుండా పోయిందని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పరిశోధనల్లో గుర్తించిన ప్రకారం.. గాలిలోని దుమ్ములో, తాగే మంచినీళ్లలో, సముద్ర జీవుల కడుపుల్లో, చివరికి తల్లి గర్భంలోని శిశువులకు అన్నీ అందించే.. బొడ్డుతాడు (ప్లెసెంటా)లో కూడా మైక్రో ప్లాస్టిక్‌ను గుర్తించారు. చదవండి: Elephanta Caves: ఎలిఫెంట్ లేదు! కేవ్స్ ఉన్నాయి!! -
సౌండ్స్ ఆపండ్రా బాబు!
పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వాహనాలు తయారు చేసుకుంటూ పోతూ.. భూమిని కాలుష్యం చేస్తున్నాం. అధిక మొత్తంలో కార్బన ఉద్గారాలు విడుదలవ్వడం వల్ల భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడమేకాకుండా వాతావరణాన్ని సమస్థితిలో ఉంచే సముద్రాలను ప్రభావితం చేస్తున్నాము. మనుషులు చేసే వివిధ రకాల పనుల వల్ల విడుదలయ్యే శబ్దాలతో సముద్రపు గర్భంలోనే గాక ఉపరితలంలో సహజసిద్ధంగా వినిపించే ధ్వనులు కూడా మార్పులకు లోనవుతున్నాయి. దీనివల్ల సముద్ర జీవుల మనుగడ ప్రమాదం లో పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పరిమాణంలో చిన్నగా ఉండే రొయ్యల నుంచి భారీ శరీరం కలిగిన తిమింగలాలపైన కూడా వీటి ప్రభావం తీవ్రంగా ఉంటున్నట్లు తాజా అధ్యయనాల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శబ్దాలు నీటి అడుగుభాగంలో చాలా దూరం వరకు ప్రయాణిస్తాయి. చేపలకు తాము నివసించే వాతావరణాన్ని కనుగొనడానికి కాంతి కంటే ధ్వని బాగా ఉపయోగపడుతుందని కెనడాలోని విక్టోరియా యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ చెప్పారు. నీటిలో కాంతి చెల్లాచెదురుగా ప్రయాణిస్తుంది. కానీ ధ్వని గాలిలోకంటే నీటిలో వేగంగా ప్రయాణిస్తుంది. అందువల్ల.. నీటిలో జీవించే జలచరాలు శబ్దాల ద్వారానే ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటాయి. చాలా రకాల చేపలు ఆహారం దొరికే మంచి ప్రదేశాలను గుర్తించడానికి, వేటాడే జంతువులను గుర్తించడానికి సంతానోత్పత్తివంటి అనేక విషయాలకు ధ్వని మీద ఆధారపడతాయి. సముద్రాల్లో ఏర్పడే షిప్పుల ట్రాíఫిక్ జామ్, చేపలు పట్టేందుకు వాడే మోటార్ వలలు, సముద్ర గర్భంలో ఉన్న ముడి చమురును, గ్యాస్‌ను వెలికితీసేందుకు చేసే డ్రిల్లింగ్ సౌండ్స్, సముద్రంలో చేపట్టే నిర్మాణ పనుల్లో పాల్గొనే మనుషులు చేసే శబ్దాల వల్ల చేపలు ఒకదానికి ఒకటి మాట్లాడుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. నీటి అడుగుభాగంలో మైక్రోఫోన్స్‌ను ఉపయోగించి షిప్పుల నుంచి వెలువడే శబ్దాల వల్ల చేపలు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాయో శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచంలో ఉన్న కీలక షిప్పింగ్ కారిడార్స్‌లో ఎర్రసముద్రం ఒకటి. ఈ సముద్రం మీదుగా∙అనేక షిప్పులు ఆసియా, యూరప్, ఆఫ్రికా దేశాలకు ప్రయాణిస్తుంటాయి. వీటినుంచి వెలువడే శబ్దాలను తట్టుకోలేక అక్కడ నివసించే చేపలు, కొన్ని అకశేరుకాలు ప్రశాంతమైన వాతావర ణాన్ని వెతుక్కుని తమ ఆవాసాలను మార్చుకుంటున్నాయి. దీంతో 1970 నుంచి ఇప్పటిదాకా ఇక్కడ జీవించే జలచరాల సంఖ్య సగానికి పైగా తగ్గింది. కొన్ని జీవులు అయితే తమ సొంతస్వరాలను మర్చిపోయాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సముద్ర శబ్దాల్లో ఏర్పడే మార్పులు.. వాతావరణ మార్పులు, గాలుల దిశలు మారడం, తరంగాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడడం, మంచు ద్రవీభవన వంటి భౌతిక ప్రక్రియలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. భూమిమీద ఉన్న ప్రతిజీవి మనుగడ సక్రమం గా ఉన్నప్పుడే మనవుని మనుగడ సాధ్యమవుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. -
తొండల్లో జంబలకిడి పంబ!
గ్లోబల్ వార్మింగ్ (భూతాపోన్నతి)తో వాతావరణంలో మార్పులొస్తాయని.. సముద్రాలు ఉప్పొంగుతాయని, వ్యాధులు విజృంభిస్తాయని వింటూ ఉంటాం. కానీ... భూమి వేడెక్కితే అప్పుడెప్పుడో వచ్చిన జంబలకిడి పంబ సినిమాలో మాదిరిగా లింగమార్పిడి జరుగుతుందా? మనుషుల మాట ఎలా ఉన్నా... తొండల్లో మాత్రం ఇది వాస్తవమే నని అంటున్నారు ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా విశ్వవిద్యాలయ శాస్త్ర వేత్తలు. జన్యుపరంగా మగజాతికి చెందిన తొండలు వాతావరణంలో వేడి ఎక్కువ కావడం వల్ల ఆడ తొండల్లా మారిపోతున్నాయని, దాదాపు 131 తొండలను పరి శీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని డాక్టర్ క్లార్ హోలెలే అంటున్నారు. లింగ మార్పిడికి గురైన తొండలు సాధా రణ తొండల కంటే ఎక్కువ సంఖ్యలో గుడ్లు పెట్టాయని, వీటి సంతానం ఉష్ణోగ్రత ఆధారంగా లింగమార్పిడికి గురయ్యేవిగా పరిణమించాయని ఆయన వివరించారు. ఆసక్తికరమైన ఈ పరిశోధన వివరాలు అంతర్జాతీయ జర్నల్ ‘నేచర్’లో ప్రచురితమయ్యాయి. -
అరుదైన పక్షి అర్కిటిక్ టెర్న్
ప్లే టైమ్ సృష్టిలో అత్యంత సుదీర్ఘమైన దూరం వలస వెళ్లే పక్షి అర్కిటిక్ టెర్న్. 28 నుంచి 39 సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ పక్షి రెక్క చాచితే దాదాపు 75 సెంటీమీటర్లుంటుంది. ఆహారం కోసం, సంతానోత్పత్తిలో భాగంగా పొదగడం కోసం ఈ జాతి పక్షులు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఈ జాతి పక్షులు ఆర్కిటిక్ ఉత్తర భాగంలోని గ్రీన్లాండ్ నుంచి అంటార్కిటికాలోని వెడెల్ సీ వరకూ ప్రయాణిస్తాయి. అంటే దాదాపు 90 వేల కిలోమీటర్లన్నమాట! ఇప్పటి వరకూ గుర్తించిన పక్షుల వలసల్లో అత్యంత దూరం ప్రయాణించే పక్షి ఇదే. ఈ పక్షి దాదాపు 30 యేళ్ల పాటు జీవిస్తుంది. ఆహారం కోసం సముద్రాల మీదే ఆధారపడుతుంది. చేపలను ఇష్టంగా భుజిస్తుంది. వలస విషయంలో అరుదైన శక్తి ఉన్న ఈ పక్షి జాతి అంతరిస్తున్న జాతుల్లో ఒకటిగా ఉండటం ఆందోళనకరమైన పరిణామం.