
ఇదేమిటో తెలుసా? అలనాటి భారతీయ నౌకా పాటవానికి నిదర్శనం. వేల ఏళ్ల క్రితమే సముద్రాలపై రాజ్యం చేసిన వైనానికి తిరుగులేని గుర్తు. ఐదో శతాబ్దం దాకా సముద్రాలపై భారతీయులకు ఆధిపత్యం కట్టబెట్టిన విశాలమైన నావలివి. ఇనుము వాడకుండా కేవలం కలప దుంగలు, చెక్క, తాళ్లు తదితరాలతో వీటిని తయారు చేసేవారు. అయినా ఇవి అత్యంత ప్రతికూల వాతావరణాలను కూడా తట్టుకుంటూ సదూర సముద్రయానాలకు ఎంతో అనువుగా ఉండేవి.
ఈ భారతీయ నావలకు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా యమ గిరాకీ ఉండేదట. ఇంతటి చరిత్ర ఉన్న పురాతన భారతీయ నావకు వాయుసేన, కేంద్ర సాంస్కృతిక శాఖ ఇప్పుడిలా ప్రాణం పోశాయి. వారి ఆలోచనలకు రూపమిస్తూ గోవాకు చెందిన నౌకా నిర్మాణ సంస్థ హోడీ ఇన్నొవేషన్స్ అచ్చం అలనాటి విధానంలోనే దీన్ని రూపొందించింది. బాబు శంకరన్ సారథ్యంలో కేరళకు చెందిన నిపుణులైన పనివాళ్లు అహోరాత్రాలు శ్రమించి దీన్ని పూర్తి చేశారు.
అప్పట్లో మాదిరిగానే ఈ నావను ముందుగా రెండు అర్ధ భాగాలుగా నిర్మించారు. తర్వాత కొబ్బరి నార నుంచి అల్లిన తాళ్ల సాయంతో ఒడుపుగా ఒక్కటిగా బిగించారు. సముద్ర జలాల్లో తడిసి పాడవకుండా నావ అడుగు, పక్క భాగాలకు అప్పటి పద్ధతుల్లోనే సార్డిన్ ఆయిల్ తదితరాలతో పూత పూశారు. మన్నిక కోసం టేకు, పనస వంటి చెక్కలు మాత్రమే వాడారు.
ఈ తరహా భారతీయ నావల హవా క్రీస్తుశకం ఐదో శతాబ్ది దాకా ప్రపంచమంతటా నిరి్నరోధంగా సాగింది. ఆ ఘన వారసత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో ఇదో ముందడుగని నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆ‘పాత’నావకు ఇంకా పేరు పెట్టాల్సి ఉంది. ఇది బుధవారం ఘనంగా జలప్రవేశం చేసింది. ఈ ఏడాది చివర్లో 15 మంది నేవీ అధికారులతో ప్రాచీన సముద్ర మార్గాల్లో ఈ నావ మస్కట్, ఇండొనేసియాలకు తొలి ప్రయాణం ప్రారంభించనుంది. దీన్ని నడిపే విధానం తదితరాలపై వారు ముందస్తు శిక్షణ కూడా పొందనున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment