పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వాహనాలు తయారు చేసుకుంటూ పోతూ.. భూమిని కాలుష్యం చేస్తున్నాం. అధిక మొత్తంలో కార్బన ఉద్గారాలు విడుదలవ్వడం వల్ల భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడమేకాకుండా వాతావరణాన్ని సమస్థితిలో ఉంచే సముద్రాలను ప్రభావితం చేస్తున్నాము. మనుషులు చేసే వివిధ రకాల పనుల వల్ల విడుదలయ్యే శబ్దాలతో సముద్రపు గర్భంలోనే గాక ఉపరితలంలో సహజసిద్ధంగా వినిపించే ధ్వనులు కూడా మార్పులకు లోనవుతున్నాయి. దీనివల్ల సముద్ర జీవుల మనుగడ ప్రమాదం లో పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పరిమాణంలో చిన్నగా ఉండే రొయ్యల నుంచి భారీ శరీరం కలిగిన తిమింగలాలపైన కూడా వీటి ప్రభావం తీవ్రంగా ఉంటున్నట్లు తాజా అధ్యయనాల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
శబ్దాలు నీటి అడుగుభాగంలో చాలా దూరం వరకు ప్రయాణిస్తాయి. చేపలకు తాము నివసించే వాతావరణాన్ని కనుగొనడానికి కాంతి కంటే ధ్వని బాగా ఉపయోగపడుతుందని కెనడాలోని విక్టోరియా యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ చెప్పారు. నీటిలో కాంతి చెల్లాచెదురుగా ప్రయాణిస్తుంది. కానీ ధ్వని గాలిలోకంటే నీటిలో వేగంగా ప్రయాణిస్తుంది. అందువల్ల.. నీటిలో జీవించే జలచరాలు శబ్దాల ద్వారానే ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటాయి. చాలా రకాల చేపలు ఆహారం దొరికే మంచి ప్రదేశాలను గుర్తించడానికి, వేటాడే జంతువులను గుర్తించడానికి సంతానోత్పత్తివంటి అనేక విషయాలకు ధ్వని మీద ఆధారపడతాయి. సముద్రాల్లో ఏర్పడే షిప్పుల ట్రాíఫిక్ జామ్, చేపలు పట్టేందుకు వాడే మోటార్ వలలు, సముద్ర గర్భంలో ఉన్న ముడి చమురును, గ్యాస్‌ను వెలికితీసేందుకు చేసే డ్రిల్లింగ్ సౌండ్స్, సముద్రంలో చేపట్టే నిర్మాణ పనుల్లో పాల్గొనే మనుషులు చేసే శబ్దాల వల్ల చేపలు ఒకదానికి ఒకటి మాట్లాడుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది.
నీటి అడుగుభాగంలో మైక్రోఫోన్స్‌ను ఉపయోగించి షిప్పుల నుంచి వెలువడే శబ్దాల వల్ల చేపలు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాయో శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచంలో ఉన్న కీలక షిప్పింగ్ కారిడార్స్‌లో ఎర్రసముద్రం ఒకటి. ఈ సముద్రం మీదుగా∙అనేక షిప్పులు ఆసియా, యూరప్, ఆఫ్రికా దేశాలకు ప్రయాణిస్తుంటాయి. వీటినుంచి వెలువడే శబ్దాలను తట్టుకోలేక అక్కడ నివసించే చేపలు, కొన్ని అకశేరుకాలు ప్రశాంతమైన వాతావర ణాన్ని వెతుక్కుని తమ ఆవాసాలను మార్చుకుంటున్నాయి.
దీంతో 1970 నుంచి ఇప్పటిదాకా ఇక్కడ జీవించే జలచరాల సంఖ్య సగానికి పైగా తగ్గింది. కొన్ని జీవులు అయితే తమ సొంతస్వరాలను మర్చిపోయాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సముద్ర శబ్దాల్లో ఏర్పడే మార్పులు.. వాతావరణ మార్పులు, గాలుల దిశలు మారడం, తరంగాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడడం, మంచు ద్రవీభవన వంటి భౌతిక ప్రక్రియలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. భూమిమీద ఉన్న ప్రతిజీవి మనుగడ సక్రమం గా ఉన్నప్పుడే మనవుని మనుగడ సాధ్యమవుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment