నిద్రారాక్షసం | Sakshi Editorial On Sleep | Sakshi
Sakshi News home page

నిద్రారాక్షసం

Published Mon, Aug 5 2024 4:00 AM | Last Updated on Mon, Aug 5 2024 4:00 AM

Sakshi Editorial On Sleep

కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర లేకుండా రోజుల తరబడి గడపడం అసాధ్యం. బొందిలో ప్రాణం నిలిచి ఉండాలంటే, ఈ రెండూ తప్పనిసరి. తిండి, నిద్ర మనుషులకే కాదు, జంతువులకూ అవసరమే! జంతువులకు నిద్ర ముంచుకొచ్చినప్పుడు నిద్రపోవడమే తెలుసు గాని, నిద్ర గురించి ఆలోచించడం తెలీదు. మనం మనుషులం. జంతువులతో పోల్చుకుంటే జ్ఞానులం. 

‘ఆహార నిద్రా భయ మైథునాని/ సామాన్య మేతత్పశుభిర్నరాణాం/ జ్ఞానం హి తేషా మధికో విశేషో/ జ్ఞానేన హీన్యా పశుభిస్సమానాః’ అని పూర్వకవి సంస్కృతంలో పలికాడు. ఆహార నిద్రా భయ మైథునాలు మనుషులకు, జంతువులకు సమానమే! మిగిలిన జంతు సమూహం నుంచి మనిషిని వేరు చేసే లక్షణం జ్ఞానం మాత్రమే! జ్ఞానమే గనుక లేకుంటే, మనుషులకు, జంతువులకు తేడా ఏమీ ఉండదు.

అందువల్ల జంతువుల కంటే జ్ఞానులైన మనుషులకు నానా విషయాలలో అవసర పరిజ్ఞానమూ అనవసర పరిజ్ఞానమూ సహజ లక్షణం. అందులో భాగంగానే మనుషులకు నిద్ర గురించిన పరిజ్ఞానం ఉండటం అంతే సహజం. నిద్ర ఎప్పుడు రావడం సహజమో, ఎంతసేపు నిద్రపోవాలో, సుఖనిద్రకు ఎలాంటి పరిసరాలు, పరిస్థితులు అనుకూలిస్తాయో మనుషులకు బాగా తెలుసు. 

బహుశా, ఈ జ్ఞానభారం వల్లనే నిద్రలేమి సమస్యలు కూడా మనుషుల్లోనే ఎక్కువ. ‘ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు’ అని మనకో నానుడి ఉంది. కొంత వరకు ఆ మాట నిజమే కావచ్చు గాని, సర్వసుఖాలు అందుబాటులో ఉన్నా, కంటి నిండా కునుకు లేక తిప్పలు పడే మనుషులు ప్రపంచమంతటా లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. 

‘నిద్ర మంచిది, మరణం మెరుగైనది; అయితే, అత్యుత్తమమైనదేదీ ఇంకా పుట్టలేదు’ అని జర్మన్‌ కవి, రచయిత హేన్రిక్‌ హేనీ అన్నాడు. మరణాన్ని మనవాళ్లు శాశ్వతనిద్రగా అభివర్ణిస్తారు. శాశ్వతనిద్రలోకి జారుకునేలోగా మనిషికి జీవనయాత్ర తప్పదు. జీవనయాత్ర సజావుగా సాగడానికి ప్రతిరోజూ తగినంత నిద్ర అవసరం. 

ప్రశాంతమైన నిద్రతోనే మనశ్శరీరాలు జవజీవాలను పుంజుకుంటాయి. దైనందిన నిత్య నైమిత్తిక కార్యకలాపాలకు సంసిద్ధమవుతాయి. రోజంతా పనిచేసి అలసి సొలసిన శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత అవసరం. ఈ రెండూ నిద్రతోనే దొరుకుతాయి. అయితే, సంక్లిష్టమయమైన ఆధునిక జీవనశైలి మనుషులను నిద్రకు దూరం చేస్తోంది. 

‘కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది/ కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది’ అన్నాడు మనసుకవి ఆత్రేయ. మనసుకు కుదురు లేనప్పుడు పట్టేది చెదురు మదురు నిద్రే! చెదురు మదురు నిద్రలో తీపికలలు కాదు, పీడకలలు వస్తాయి. ‘కంటికి నిద్రవచ్చునె? సుఖంబగునె రతికేళి? జిహ్వకున్‌/ వంటక మిందునే? యితర వైభవముల్‌ పదివేలు మానసం/బంటునె? మానుషంబుగల యట్టి మనుష్యున కెట్టివానికిన్‌/ గంటకుడైన శాత్రవుడొకండు తనంతటి వాడు గల్గినన్‌’ అన్నాడు శ్రీనాథుడు. ఈ పద్యం ‘కాశీఖండం’లోనిది. ఇది వింధ్యుడి స్వగతం. వింధ్యుడికి సమ ఉజ్జీ మేరువు. 

సూర్యుడు మేరువు చుట్టూ ప్రదక్షిణంగా పయనిస్తాడు. దేవతలు మేరుపర్వతాన్నే గౌరవిస్తారు. మేరువు కన్నా తానేమీ తక్కువ కాకున్నా, తనకు దక్కని గౌరవం మేరువుకు దక్కడం పట్ల అసూయతో రగిలిపోయే వింధ్యుడి కంటికి కునుకు పట్టకపోవడం సహజమే కదా! పురాణాల్లో మేరువు, వింధ్య పర్వతాలే అయినా, శ్రీనాథుడు రాసిన ఈ పద్యం మాత్రం మానవ ప్రవృత్తులకు అద్దం పడుతుంది. నిద్రను కరవు చేసే అనేకానేక కారణాల్లో సమ ఉజ్జీ అయిన ప్రత్యర్థితో తలెత్తే స్పర్థ కూడా ఒకటి.

నిద్ర పట్ల అవగాహన మనుషులకు ప్రాచీనకాలం నుంచి ఉండేది. నిద్రకు భంగం కలిగించే అంశాలు, ప్రశాంతమైన నిద్ర ఆవశ్యకతను నాటి మానవులు బాగానే గుర్తించారు. ప్రాచీన నాగరికతలలో నిద్రను దేవతగా ఆరాధించేవారు. కావ్య పురాణేతిహాసాల్లో నిద్ర ప్రస్తావన విరివిగా కనిపిస్తుంది. రామాయణంలో కుంభకర్ణుడి నిద్ర, ఊర్మిళాదేవి నిద్ర సుదీర్ఘకాల నిద్రలకు ఉదాహరణలు. 

ఆకలి దప్పులను, నిద్రను జయించడానికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించిన ఉదంతం కూడా రామాయణంలో ఉంది. అరణ్యవాస కాలంలోను, లంకలో రామరావణ యుద్ధకాలంలోను బల అతిబల విద్యలు లక్ష్మణుడికి బాగా అక్కరకు వచ్చాయి. అరణ్యవాసానికి వెళ్లినది మొదలుకొని, రావణ సంహారం తర్వాత శ్రీరామ పట్టాభిషేకం వరకు లక్ష్మణుడు నిద్రపోలేదు. అంతకాలమూ అతడి అర్ధాంగి ఊర్మిళ నిద్రపోతూనే ఉంది. 

సరిగా రామ పట్టాభిషేకం జరుగుతుండగా, లక్ష్మణుడికి నిద్ర ముంచుకొచ్చి రెప్పలు మూతబడ్డాయి. అప్పుడు తన అవస్థకు తానే నవ్వుకున్నాడు లక్ష్మణుడు. పట్టాభిషేక సమయంలో లక్ష్మణుడు నవ్విన నవ్వును అక్కడ ఉన్న ప్రముఖుల్లో ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకున్నారు. అదంతా వేరే కథ. 

పురాణాల ప్రకారం నిద్రకు దూరంగా ఎక్కువకాలం గడిపిన రికార్డు లక్ష్మణుడిదే! అయితే, నూయెన్‌ న్యోక్‌ మై కిమ్‌ అనే యాభయ్యేళ్ల వియత్నాం మహిళ గడచిన ముప్పయ్యేళ్లుగా కనీసం నిమిషమైనా నిద్రపోలేదట! ఇన్నాళ్లుగా నిద్రపోకున్నా, ఆమె ఆరోగ్యంగా ఉండటం చూసి వైద్యులు సైతం విస్తుపోతున్నారు. ఈ నిద్రలేని నీలాంబరి ఉదంతం ఒక నిద్రారాక్షసం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement