Sleep
-
అవును... ఆమెకు కొంచెం ఎక్కువ నిద్ర అవసరం
అందరికీ 7–8 గంటల నిద్ర అవసరమని అందరికీ తెలిసిందే. అయితే ఎనిమిది గంటలసేపు నిద్రపోయిన తర్వాత కూడా, ఉదయం ఇంకా రిఫ్రెషింగ్‌గా లేకుండా, ఇంకా అలసటగా... బద్ధకంగా ఉన్నట్లయితే నిద్ర సరిపోలేదని అర్థం. అయితే స్త్రీల విషయంలోనే! అందరికీ కాదు. వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఇది అక్షరాలా నిజం. వైద్య పరిశోధకులు వివరణాత్మకంగా చెప్పిన విషయమే.పురుషులు 7–8 గంటల నిద్రలో బాగా పని చేయగలిగినప్పటికీ, మహిళలకు నిద్రకు మరికాస్త ఎక్కువ సమయం అవసరం. మహిళలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో తెలుసుకునే ముందు, నిద్ర గురించి మరికొంత అర్థం చేసుకుందాం.మంచి నిద్ర ఎందుకు ముఖ్యం?మంచి నిద్ర మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మెరుగైన గుండె ఆరోగ్యం, జీవక్రియలు, చర్మం, జుట్టు నాణ్యతను, దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది. నాణ్యమైన నిద్ర మీ భావోద్వేగాలను మెరుగ్గా నిర్వహించడానికి కూడా మిమ్మల్ని సన్నద్ధం చేస్తుంది. కంటినిండా నిద్రపోయేవారికి ఆందోళన, డిప్రెషన్ స్థాయులు తక్కువ గా ఉండటం వల్ల వారు కార్యాలయాల్లో మెరుగైన పనితీరును కనబరుస్తున్నట్లు రుజువైంది. నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం ఆర్టెమిస్ హాస్పిటల్‌లోని పల్మోనాలజీ అండ్ స్లీప్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ అరుణ్ కొటారు, నిద్ర సమయంలో శరీరం కణజాల మరమ్మత్తు, కండరాల పెరుగుదల, హార్మోన్ నియంత్రణ వంటి ముఖ్యమైన ప్రక్రియలకు లోనవుతుందని అంగీకరిస్తున్నారు. ‘దీర్ఘకాలిక నిద్ర లేమి శారీరక, మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఇది మన మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను దెబ్బతీస్తుంది, ఉత్పాదకత తగ్గుతుంది. ప్రమాదాల ప్రమాదాన్ని పెంచుతుంది‘ అని ఆయన చెప్పారు.పురుషుల కంటే మహిళలకు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవసరమని ఇటీవలి పరిశోధనలో తేలింది. ‘మెదడు కోలుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి నిద్ర చాలా ముఖ్యం. మహిళల్లో నిద్ర, నిద్ర రుగ్మతలకు సంబంధించి తక్కువ డేటా అందుబాటులో ఉన్నప్పటికీ, రోజువారీ కార్యకలాపాల నుండి కోలుకోవడానికి పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరమని పరిశోధనలు సూచిస్తున్నాయి‘ అని డాక్టర్ చెప్పారు.నిద్రకు సంబంధించి స్త్రీ పురుషులలో వ్యత్యాసం చాలా ఎక్కువని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కానీ వివిధ కారణాల రీత్యా పురుషుల కన్నా స్త్రీలకు కేవలం 11 నుంచి 13 నిమిషాల అధిక నిద్ర సరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగని వారికి కావలసిన అధిక నిద్రను సమస్యలా చేసి చూపడం లేదా వారికి ఎక్కువ నిద్ర కావాలనడాన్ని అంగీకరించకపోవడం వల్ల అసలే నిద్రలేమితో సతమతమవుతున్న మహిళలు మరింత ఒత్తిడికి గురవుతారు. దీని గురించి ఆలోచిస్తూ వారు సరిగ్గా నిద్రపోలేరు. దీంతో సమస్య మళ్లీ మొదటికొస్తుంది. ఇది చాలా సమస్యలను కొనితెస్తుంది. ఏది ఏమైనప్పటికీ పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువ నిద్ర అవసరమే అన్నది నిర్వివాదాంశం. అయితే వారు మరికాసేపు ప్రశాంతంగా పడుకునేందుకు పురుషుల సహకారం పూర్తిగా అవసరం. వయసును బట్టి నిద్ర అవసరాలు నవజాత శిశువులు, పసిబిడ్డలకు ఎక్కువ నిద్ర అవసరం. సరైన ఆరోగ్యం, పనితీరు కోసం సగటున, పెద్దలకు సాధారణంగా రాత్రికి 7–9 గంటల నిద్ర అవసరం. వయస్సుతో ΄ాటు నిద్ర అవసరాలు కొద్దిగా తగ్గవచ్చు, వృద్ధులకు ఇప్పటికీ రాత్రికి 7–8 గంటల నిద్ర అవసరం. -
ఒకే సమయం నిద్రతో ఒత్తిడికి కళ్లెం
న్యూఢిల్లీ: నిద్ర. అలసిన శరీరాన్ని అమాంతం ఆక్రమించి మరోలోకానికి తీసుకెళ్లే అదృశ్యదేవత. అలాంటి నిద్రాదేవత ఆవాహన చిన్నారుల్లో రోజూ ఒకేసమయంలో జరిగితే ఒనగూరే ప్రయోజనాలు అంతాఇంతా కాదని తాజా పరిశోధనాలో వెల్లడైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలోని పరిశోధకులు ఈ మేరకు ఆరేళ్ల వయసు చిన్నారులపై ఒక విస్తృతస్థాయి, సుదీర్ఘ పరిశోధన చేశారు. పుట్టినప్పటి నుంచి రెండున్నరేళ్ల వయసు వచ్చే వరకు కొందరు చిన్నారులను వారి తల్లిదండ్రులు శ్రద్ధాసక్తులతో పెంచేలా ఆ పేరెంట్స్‌కు శిక్షణనిచ్చారు. చిన్నారి వేర్వేరు సందర్భాలకు తగ్గ భావోద్వేగాలు, శారీరక అవసరాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తీరుస్తూ వారి ఆలనాపాలనా బాధ్యతలను చక్కగా నెరవేర్చేలా చూశారు. మారాంచేసినపుడు గారాబం చేయకుండా పరిస్థితిని చక్కగా విడమరిచి చెప్పేలా తల్లిదండ్రులకు తగు తరీ్ఫదునిచ్చారు. అలసపోయి నిద్రలోకి జారుకునేటపుడు నిద్రకు అనువైన వాతావరణం ఉండేలా చూడడం, దీపాలన్నీ ఆర్పేసి చిన్నారులను వీపుపై తడుతూ బుజ్జిగించి పడుకోబెట్టడం వంటివి చేయాలని పరిశోధకులు సూచించారు. పరిశోధనలో ఏం తేలింది? ఇలా చేయడం వల్ల చిన్నారులు రోజూ ఒకే సమయానికి పడుకోగలిగారు. నిద్రసమయం కూడా దాదా పు వారి వయసుకు తగ్గట్లు ఉండేది. దీంతో చిన్నారులు తమ దైనందిన జీవితంలో చవిచూసిన భావోద్వేగాలను చక్కగా నియంత్రించుకోవడం పరిశోధకులు గమనించారు. ఒకే సమయంలో నిద్రపోవడం వల్ల గాఢ నిద్ర సాధ్యమైంది. ‘‘స్థిరమైన నిద్రాకాలం అనేది పిల్లల ఎదుగుదలకూ ఎంతో తోడ్పడింది. నిద్రసరిగా పట్టకపోవడం వంటి సమస్యలు వీరిలో తలెత్తలేదు’’అని పరిశోధకులు చెప్పారు. సంబంధిత వివరాలు డెవలప్మెంటల్ అండ్ బిహేవియర్ పిడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇతర చిన్నారుల్లో ఇబ్బందులు పరిశోధనకు ఎంచుకున్న పిల్లలతో పోలిస్తే అస్తమానం అస్తవ్యస్త్య సమయాల్లో నిద్రించే పిల్లల్లో భావోద్వేగాలపై నియంత్రణ చాలా తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో కీలక పరిశోధకుడు అద్వా డాడ్జీ చెప్పారు. ఈయన పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీలో బిహేవియర్ హెల్త్ విభాగంలో సేవలందిస్తున్నారు. పరిశోధకులు పిల్లలు రోజు ఏ సమయానికి నిద్రపోతున్నారు, ఎంతసేపు నిద్రపోతున్నారు, గాఢనిద్ర వివరాలు తెల్సుకునేందుకు వాళ్ల మణికట్టుకు మానిటర్లను అమర్చారు. ఎలాంటి ప్రయోగాలు చేశారు? ఒకేసమయంలో నిద్రించే పిల్లలకు ఒక పెద్ద బొమ్మల సమూహం నుంచి ఒకేఒక్క బొమ్మను తీసుకుని ఆడుకోవాలని సూచించారు. ప్రతి బొమ్మను విడివిడిగా ఒక చిన్న పెట్టెలో తాళం వేసి దాచారు. ఆ పెట్టెల తాళంచెవులను ఇచ్చి తెరచి తీసి ఆడుకోవాలని సూచించారు. ఏ తాళంచెవికి ఏ పెట్టే తెరచుకుంటుందో కనిపెట్టేందుకు.. ఒకేసమయంలో నిద్రించే పిల్లలు మాత్రం శ్రద్ధగా ఒక్కో పెట్టెను తాళంచెవితో తెరచే ప్రయత్నంచేశారు. నిద్రానియమంలేని పిల్లలు మాత్రం ఒక్కో పెట్టెను తెరిచే ఓపికలేక ఆవేశంతో ఆ తాళం చెవులను విసిరిపారేశారు. మరో ప్రయోగంలో రెండు రకాల పిల్లలను ఒకచోటచేర్చి కలిసి ఆడుకోండని సూచించారు. ఈ సందర్భంలోనూ నిద్రనియంత్రణ ఉన్న పిల్లలు తోటి పిల్లలతో కలిసి ఆడుకునే ప్రయత్నంచేశారు. కొందరు పిల్లలను వారంలో ప్రతి రోజూ ఒక 20 నిమిషాలు ముందుగా లేదా 20 నిమిషాలు ఆలస్యంగా నిద్రపోయేలా చేశారు. ఇంకొందరిని వారంరోజులపాటు ఏకంగా రెండు గంటలు ముందుగా లేదంటే ఆలస్యంగా నిద్రపోనిచ్చారు. 20 నిమిషాల తేడాతో నిద్రించిన పిల్లల్లో భావోద్వేగాల నియంత్రణ చాలా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. -
బెడ్ వెట్టింగ్
సాధారణంగా పిల్లల్లో 95 శాతం మంది దాదాపుగా ఐదారేళ్ల వయసు వచ్చేసరికి నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ (బ్లాడర్ కంట్రోల్) సాధిస్తారు. కానీ నాలుగు శాతం మంది పిల్లల్లో ఇది కొద్దిగా ఆలస్యం కావచ్చు. చాలా కొద్దిమందిలో అంటే... ఒక శాతం (1%) మందిలో పెద్దయ్యాక కూడా నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ సాధించడం సాధ్యం కాకపోవచ్చు. దాంతో కాస్తపెద్దయ్యాక కూడా... అంటే 10 – 12 ఏళ్లు వచ్చాక కూడా కొందరు పిల్లలు రాత్రివేళ పక్క తడుపుతుంటారు. ఇలా పిల్లలు రాత్రిపూట నిద్రలో మూత్రవిసర్జన చేసే సమస్యను వైద్యపరిభాషలో ‘నాక్టర్నల్ అన్యురిసిస్’ అంటారు. ఇది అబ్బాయిల్లో ఎక్కువ. ఇది కుటుంబంలో ఎవరికైనా ఉంటే... అలాంటి కుటుంబాల్లో 50 శాతం మందిలో... వాళ్ల పిల్లల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది.అన్యురిసిస్ సమస్యలోనూ రెండు రకాలు ఉంటాయి. మొదటిది ‘ప్రైమరీ అన్యురిసిస్. రెండోది సెకండరీ అన్యురిసిస్. ప్రైమరీ అన్యురిసిస్ : చిన్నారులు ఒక్క రోజు కూడా విడవకుండా ప్రతిరోజూ పక్క తడుపుతుంటే దాన్ని ‘ప్రైమరీ అన్యురిసిస్’ అంటారు. సెకండరీ అన్యురిసిస్ : ఇలా రాత్రుళ్లు పక్క తడిపే పిల్లలు కొన్నాళ్ల పాటు పక్కతడపకుండా బాగానే ఉండి, కొంతకాలానికి వాళ్లలో సమస్య మళ్లీ తిరగబెట్టడాన్ని ‘సెకండరీ అన్యురిసిస్’గా చెప్పవచ్చు. ఇలా సెకండరీ అన్యురిసిస్ సమస్య రావడానికి తల్లిదండ్రుల మధ్య సయోధ్య లేకపోవడం, ఇంట్లో ప్రశాంత వాతావరణం లేకపోవడం, కుటుంబంలోకి తమ్ముడో, చెల్లెలో వచ్చినప్పుడు కలిగే ఈర్ష్య (సిబ్లింగ్ జెలసీ) వంటి కారణాలతో పిల్లల్లో నెలకొన్ని మానసిక ఆందోళన వంటి అంశాలను ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.ప్రైమరీ అన్యురిసిస్కు కారణాలు... ప్రైమరీ అన్యురిసిస్కు పిల్లల్లో నాడీ సంబంధమైన వికాసం కాస్త ఆలస్యంగా జరుగుతుండటం అంటే న్యూరోనల్ మెచ్యురేషన్ డిలే, మూత్రం ఉత్పత్తి కాస్త ఎక్కువగా జరుగుతుండటం (ఇన్క్రీజ్డ్ యూరిన్ ్ర΄÷డక్షన్), బ్లాడర్ సామర్థ్యం కాస్త తక్కువగా ఉండటం (డిక్రీజ్డ్ బ్లాడర్ కెపాసిటీ)తో పాటు జన్యుపరమైన అంశాలు కూడా ఇందుకు కారణమవుతాయి.ఇతర కారణాలు...ఇలా పెద్దయ్యాక కూడా రాత్రి నిద్రలో పక్కతడిపే సమస్య ఉన్న 20 శాతం మంది పిల్లల్లో యూరినరీ ట్రాక్ అబ్నార్మాలిటీస్, బ్లాడర్ డిస్ఫంక్షన్, నిద్రకు సంబంధించిన రుగ్మతలు (స్లీప్ డిజార్డర్స్), యాంటీ డైయూరెటిక్ హార్మోన్ (ఏడీహెచ్) లోపాలు, మానసికమైన కారణాలు, మలబద్ధకం, కొన్ని సందర్భాల్లో అడినాయిడ్స్ వల్ల నిద్ర సంబంధమైన సమస్యలు (స్లీప్ ఆప్నియా) వంటివి ఉన్నప్పుడు కూడా రాత్రివేళల్లో తెలియకుండానే మూత్రవిసర్జన చేస్తుంటారు. పిల్లల్లో ఈ సమస్య ఉంటే మూత్రపరీక్షలతో పాటు హార్మోనల్ స్టడీస్ చేయించడం, బ్లాడర్ అనాటమీ అండ్ ఫంక్షనల్ టెస్ట్ చేయించడం అవసరం. వాటిని బట్టి ఇది హార్మోన్లకు సంబంధించిన సమస్యా, కాదా అని తెలుసుకోవచ్చు.ఈ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ∙నిద్రలో మూత్రవిసర్జన చేసే పిల్లలను కించపరచడం, శిక్షించడం వంటివి అస్సలు చేయకూడదు. ∙సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్రవాహారం చాలా తక్కువగా ఇవ్వడం, నాలుగు దాటాక కెఫిన్, చక్కెర ఉన్న పదార్థాలు పూర్తిగా ఇవ్వకపోవడం అవసరం. రోజులో తీసుకునే ద్రవపదార్థానికి 20 శాతానికి మించి 5 గంటల తర్వాత ఇవ్వకూడదు. ∙పడుకునేముందు ఒకసారి మూత్రవిసర్జన చేయించడం, నిద్రపోయిన గంటలోపు లేపి మళ్లీ ఒకసారి మూత్రవిసర్జన చేయించడం వల్ల పక్క తడిపే అవకాశాలను తగ్గించవచ్చు.మేనేజ్మెంట్ / కేర్...ఇటీవల అందుబాటులోకి వచ్చిన అలారం వంటి పరికరాలతో బ్లాడర్‌పై నియంత్రణ సాధించేలా ప్రాక్టీస్ చేయించాలి. దీంతోపాటు డెస్మోప్రెసిన్, ఇమెప్రమిన్ వంటి కొన్ని మందులు బాగా పనిచేస్తాయి. అలాంటి పిల్లలను కొన్ని స్ప్రేల సహాయంతో సామాజిక ఉత్సవాలకు నిర్భయంగా తీసుకెళ్లవచ్చు. అలాంటి చర్యల వల్ల పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ∙ఈ సమస్యకు హార్మోన్లోపాలు కారణం అయితే 3–6 నెలలపాటు మందులు వాడటం వల్ల ఈ సమస్యను 50 శాతం మందిలో సమర్థంగా అదుపు చేయవచ్చు. ∙ -
ఎక్కువసేపు నిద్రా? ఆందోళన వద్దు...
చాలామంది తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతోనో లేదా బద్ధకం అలవాటవుతుందనో పిల్లలను ఎక్కువ సేపు నిద్రపోనివ్వరు. వాళ్లు కంటి నిండా నిద్రపోకముందే నిద్రలేపేస్తుంటారు. కారణం... వాళ్లు అలా నిద్రపోతూ ఉండటం, చురుగ్గా లేకపోవడంతో వాళ్లకేమైందో అన్న ఆందోళన వాళ్లను అలా నిద్రలేపేలా చేస్తుంది.పిల్లలు కంటినిండా నిద్రపోకపోవడం వల్ల వాళ్లు చికాకుగా, చిరాగ్గా ఉంటారని తెలుసుకోవాలి. రానున్నది చలికాలం. ఈ కాలంలో పిల్లలు ఎక్కువగా సేపు నిద్రపోవడం చాలా సాధారణం.చలికాలంలో ఎక్కువ సేపు నిద్ర ఎందుకు?పిల్లలు చలికాలంలో కొద్దిగా ఎక్కువగా నిద్రపోవడం చాలా సాధారణం. దీనికి మొదటి కారణం చలికాలంలో పగటి సమయం తక్కువ, రాత్రి నిడివి ఎక్కువ; రెండోకారణం వెలుగు తగ్గిపోయి చీకటి పడగానే నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ స్రావాలు పెరగడం, నిద్ర మేల్కోడానికి ఉపయోగపడే సెరటోనిన్ స్రావాలు తగ్గడం... వంటి మార్పుల వల్ల చలికాలంలో నిద్ర పెరుగుతుంది. పిల్లలు ఎక్కువసేపు పడుకోవడానికి కొన్ని కారణాలు... ⇒ బరువు ఎక్కువగా ఉన్న చిన్నారులు ⇒ శ్వాస తీసుకోవడంలో సమస్యలున్నప్పుడు ⇒ సర్కాడియన్ రిథమ్‌లో మార్పులు (మనుషుల్లో నిద్రపోవడం, నిద్రలేవడంలోని క్రమబద్ధతను నిర్వహించే రిథమ్‌ను సర్కాడియన్ రిథమ్ అంటారు) ⇒మెదడు పనితీరులో కొన్ని లోపాలు ∙దగ్గు, జలుబు, అలర్జీలకు వాడే కొన్ని మందులు ∙ఆహార పదార్థాలు, హర్మోన్లలో మార్పుల వల్ల నిద్ర వ్యవధిలో మార్పులు రావడం వంటి అంశాలు నిద్ర పెరగడానికి కారణమవుతాయి. మరి... ఎన్ని గంటల నిద్ర నార్మల్...? పిల్లల్లోగాని, పెద్దల్లోగాని ఖచ్చితంగా నిద్రపోవాల్సిన వ్యవధి ఇదీ అంటూ ఎవరూ నిర్దిష్టంగా, నిర్ధారణగా చెప్పలేరు. మనుషులకు ఎన్ని గంటల నిద్ర సరిపోతుందన్న అంశం ఎప్పుడూ చర్చనీయాంశమైన విషయమే. అయితే సాధారణంగా పిల్లలు 8–9 గంటల పాటు నిద్రపోవడాన్ని నార్మల్‌గా పరిగణించవచ్చు. రోజూ పది గంటలకు మించి నిద్రపోవడాన్ని మాత్రమే కొన్ని రుగ్మతలకు సూచికగా చెప్పవచ్చు. ఒక ఉజ్జాయింపుగా చె΄్పాలంటే రోజుకు పదిగంటల కంటే ఎక్కువ, నాలుగు గంటల కంటే తక్కువ నిద్రపోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చిన్నారులు ఈ వ్యవధి కంటే తక్కువగా నిద్రపోతుంటే ఒకసారి థైరాయిడ్ హార్మోన్ పరీక్షలు చేయించి, పిల్లల డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి. -
ఈ మెంటల్ ఎక్సర్‌సైజ్‌తో మంచి నిద్ర షురూ..!
ప్రస్తుత జీవన విధానంలో మంచి నిద్ర అనేది కరువైపోయింది. దీన్ని కూడా మనం కొనుక్కునే స్థితికి వచ్చేశాం. అంతలా మొబైల్ ఫోన్లు, గాడ్జెట్లకు పరిమితమైపోతున్నాం. ఆఫీసుల్లో గంటలకొద్ది కంప్యూర్ల ముంగిట కూర్చొవడం..తీరా ఇంటికొస్తే మొబైల్ స్క్రీన్‌కి అతుక్కుపోవడం తదితర కారణాలతో రెప్పవాలదే..అంటూ రాత్రంతా జాగారం అయిపోతుంది. ఇందుకోసం ఎన్నో పయత్నాలు చేసి అలిసి, విసిగిపోయి ఉంటే ఈ టెక్నీక్ ఫాలో అవ్వమని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు మంచి నిద్ర కోసం ఏం చేయాలో కూడా సూచించారు. అవేంటో సవివరంగా చూద్దామా..!.రాత్రిపూట నిద్రపోదామనుకుంటే బుర్రలో ఆలోచనలు నిరంతర ప్రవాహంలో ఒకదాని వెనుక ఒకటిగా వివిధ ఆలోచనలు వచ్చేస్తుంటాయి. కొందరూ యోగాతో నియంత్రించగలగినా..మరికొందరికి అది సాధ్యం కాకపోవచ్చు. "మొదట నిద్రకు ఉపకరించే ముందు.. మంచి నిద్ర కావాలంటే మెదడు ఎలాంటి ఆలోచనలు లేని ప్రశాంత స్థితిలో ఉంటేనే అది సాధ్యం. ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్‌నే సాగిస్తున్నారు.ఈ క్రమంలో ఆటో పోట్లు సహజం. అది అందరికీ కామన్ అనేది గుర్తించుకోండి. కాబట్టి మనమే పెద్ద ప్రాబ్లమ్‌లో లేం అనేది విస్మరించొద్దు. నాకు మాత్రమే ఇలా..అనే బాధను దూరం పెట్టేయాలి. ఆ తర్వాత ఈ మెంటల్ ఈ ఎక్సర్‌సైజ్‌ని ఫాలో అవ్వండి". అని చెబుతున్నారు నిపుణులు. ఏంటి వ్యాయామం అనుకోకండి. ఏం లేదు ఆలోచనలకు స్వస్తి చెప్పేలా..కాగ్నిటివ్ షఫులింగ్ అనే మెంటల్ ఎక్సర్‌సైజ్‌ని అనుసరించడని చెబుతున్నారు. ఏంటిదీ అంటే..మెదడు ఒక విషయంపై ఏకాగ్రతతో పనిచేసేలా చేయడం లాంటిది. ఒక రకంగా మెదడు మేతలాంటి ఫజిల్ అని చెప్పొచ్చు. ఈ టెక్నిక్‌లో ఏదోక ఒక వర్డ్‌ని అనుకోవాలి అందులో అక్షరంతో వచ్చే పలు పదాలు గుర్తు తెచ్చుకోవాలి అవన్ని ఓ వరుస క్రమంలో చెబుతుండాలి. ఈ మానసిక శ్రమ ఒక విధమైన అలసటకు గురై తెలియకుండానే గాఢనిద్రకు ఉపకరిస్తుంది. మొదట్లో సమయం తీసుకున్న రోజులు గడుస్తున్న కొద్ది మంచి మార్పు, చక్కటి ఫలితం పొందుతారని చెబుతున్నారు నిపుణులు. అలాగే దీంతోపాటు నిద్ర రాకుండా చేస్తున్న ఆహారం, భౌతిక కార్యకలాపాలను నివారించాలని సూచించారు. ముఖ్యంగా అవేంటంటే..నిద్రవేళకు ముందు కెఫిన్ నివారించడంనిర్ణిత సమయానికి నిద్రించడంసిగరెట్లు వంటి చెడు అలవాట్లు దూరం చేసుకోవడం.సాయం సమయాల్లో వ్యాయామం చేయడంమద్యానికి దూరంగా ఉండటం.టెలివిజన్ లేదా స్మార్ట్‌ఫోన్ నుంచి శబ్దం లేదా వెలుతురు వంటివి రాకుండా జాగ్రత్త పడటంయోగా, ధ్యానం వంటివి సాధన చేయడంతదితరాలతో ఆలోచనలు నియంత్రించడమే కాకుండా మంచి నిద్ర పొందగలుగుతారని చెబుతున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి.(చదవండి: నటి నీనాగుప్తా ఇష్టపడే రెసిపీలు ఇవే..!) -
'స్లీప్‌మాక్సింగ్': నిద్రను కూడా కొనుక్కునే దుస్థితా..?
ప్రస్తుత జీవన విధానంలో ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారో తెలిసిందే. ఒక్క క్షణం రెప్పవాలితే బాగుండును అన్నంతగా ఉంది పరిస్థితి. అందుకోసం మెడిసిన్స్ అని ఏవేవో చిట్కాలని పాటించేస్తున్నారు కూడా. కేవలం చక్కటి జీవనశైలితో శరీర ధర్మం దానంతట అదిగా సర్దుబాటు అయ్యేలా చేసుకోవాల్సిందేనని నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం దీన్ని కూడా క్యాష్ చేసుకునేలా కొన్ని కార్పొరేట్ కంపెనీలు చూస్తుండటం బాధకరం. ఏకంగా సాంకేతికతో కూడిన సాధనాలు, ప్రత్యేక పరుపులు వీటితో మంచి నిద్ర గ్యారంటీ అంటూ ప్రజలను ఊదరగొట్టేస్తున్నాయి కొన్ని కార్పొరేట్ కంపెనీలు. మరోవైపు ప్రజలు నిద్ర వస్తే చాలు అన్నట్లు వాటిని కొనితెచ్చేసుకోవాలనే ఆరాటంలో ఉన్నారు. అలా వచ్చిందే ఈ "స్లీప్‌మాక్సింగ్" వెల్నెస్ ట్రెండ్..!. అసలు ఏంటిది.? దీని వల్ల నిజంగా మంచి నిద్ర పడుతుందా..?నిద్ర కోసం సాగించిన అన్వేషణ కాస్త "స్లీప్‌మాక్సింగ్"కి దారితీసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. నిద్రలేమితో బాధపడేవారంతా సోషల్‌మీడియాలో గ్రూప్‌గా మారి ఒకరి అనుభవానలు ఒకరూ షేర్ చేసుకుంటున్నప్పుడూ వచ్చిందే ఈ "స్లీప్ మాక్సింగ్". ఒక ఔత్సాహిక సోషల్ మీడియా వినియోగదారు చెప్పడంతో ఇది రకరకాల చర్చలకు తెరలేపింది. 'స్లీప్‌మాక్సింగ్' అంటే..నిద్ర కోసం ఉపయోగించే ఒక విధమైన సాధనాలు లేదా ఉత్పత్తులుగా చెప్పొచ్చు. ఇయర్‌ప్లగ్‌లు, నాసికా డైలేటర్లు, మెగ్నీషియం ఫుట్ స్ప్రే, మౌత్ టేప్, చిన్ స్ట్రాప్స్ ట్రాకర్లతో మంచి నిద్రను పొందేలా మార్గం సుగమం చేసుకునే విధానమే స్లీప్‌మాక్సింగ్. దీని గురించి సోషల్ మీడియా వినియోగదారు డెరెక్ ఆంటోసిక్ చెప్పుకొచ్చారు. తన 20 ఏళ్ల జీవితంలోని అనారోగ్యకరమైన అలవాట్లు నిద్రలేమికి దారితీశాయని, దాన్ని అధిగమించేందుకు సాగిన అన్వేషణలో ఈ స్లీప్‌మాక్సింగ్ తనకు ఉపయోగపడిందంటూ వివరించాడు. ఈ సాధానాలతో మంచి నిద్రపట్టిందా లేదా అని ట్రాకర్‌తో చెక్ చేసుకునేవాడినని చెబుతున్నాడు అంతేగాదు ఆ సాధానాలు తనకు గాఢనిద్రను అందించాయని చెప్పాడు. దీన్ని క్యాష్ చేసుకునేలా కొన్ని కంపెనీలు స్మార్ట్ స్లీప్ సొల్యూషన్ అంటూ సాంకేతికతో కూడిన సాధనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ హెడ్‌బ్యాండ్ వంటవి గాఢనిద్రను ప్రేరేపించేలా నిశబ్ద వాతావరణాన్ని సృష్టించేందుకు మెదడు తరంగాలను ఉపయోగిస్తుందట. అలాగే మెదడు మెలుకువగా ఉండేలా చేసే కార్యకలాపాలను లక్ష్యంగా రూపొందిచామని ఊదరగొడుతున్నాయి కంపెనీలు. అంతేగాదు మంచినిద్రను తెచ్చిపెట్టే పరుపులు కూడా వచ్చేశాయి. అలాగే ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసే సాధనాలు, గురక తగ్గించే పరికరాలు వంటి వాటితో నిద్రను ప్రజలు కొనుక్కునే దుస్థితికి తీసుకొచ్చేయటం బాధకరం. అయితే నెటిజన్లు మాత్రం ఇవన్నీ మంచి నిద్రను అందించే సాధానలే అయిన..అవేమి సహజమైన నిద్రను అందివ్వలేవని తేల్చి చెబుతున్నారు. చక్కటి శారీరక శ్రమ, మంచి ఆహారపు అలవాట్లతోనే దాన్ని పొందగలమని నమ్మకంగా చెబుతుండటం విశేషం. ఆ గాడ్జెట్స్‌పై ఆధారపడితే క్రమేణ నాణ్యమైన నిద్రను కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తూ..పోస్టులు పెట్టారు. (చదవండి: 'సూసైడ్ పాడ్': జస్ట్ బటన్ నొక్కితే చాలు.!) -
లేలేలే.. లేలేలే.. నా రాజా
నిద్ర నుంచి ఎవరినైనా లేపొచ్చు.. ఈ పాటనే కాదు గానీ.. వేరే పాట పాడి కూడా లేపొచ్చు.. లేదా అలారం పెట్టి మరీ లేపొచ్చు. మరి.. శాశ్వత నిద్ర నుంచి.. అదేనండి.. చచ్చిపోయాక ఎవరినైనా లేపొచ్చా?? మేం లేపుతాం అని అంటున్నాయి కొన్ని కంపెనీలు.. అంతేకాదు.. తాము చెబుతున్నది అబద్ధం కాదని.. కావాలంటే మీరు చచి్చనంత ఒట్టు అని కొంచెం గట్టిగానే చెబుతున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో జనం ఈ ఒట్లను నమ్మారు. చచ్చాక కచి్చతంగా లేపుతారు కదూ అంటూ కంపెనీలతో తిరిగి ఒట్టేయించుకున్నారు కూడా.. వీళ్లంతా ఒట్లు తీసి గట్లు మీద పెట్టేలోపు.. మనం విషయంలోకి వెళ్లిపోదాం... రేయ్.. ఎవుర్రా వీళ్లంతావీళ్లంతా ఎవరంటే.. అల్కార్, టుమారో బయో, సదరన్ క్రయోనిక్స్, క్రియోరస్, క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్ అని ఇలా కొన్ని కంపెనీలు ఉన్నాయి. వీళ్లేం చెబుతున్నారంటే.. చనిపోయాక మన శరీరాన్ని ప్రత్యేక పద్ధతిలో పరిరక్షించి.. ‘ఫ్రిజ్’లాంటి దాంట్లో పెట్టేసి.. భవిష్యత్తులో అంటే ఏ 2100లోనో.. లేదా కల్కి 2898 ఏడీలోనో.. మరణాన్ని జయించే మందు లేదా ఏ జబ్బుతో చనిపోయారో దానికి చికిత్స వచి్చనప్పుడు మళ్లీ ‘లేపుతారట’!! ఇందుకోసం జస్ట్.. రూ.1.5–1.8 కోట్లు ఇస్తే చాలట.ఎవరు నమ్ముతారు అని అనుకుంటున్నారా.. చెప్పాంగా.. చాలామంది నమ్మారు. ఏకంగా 6 వేల మంది ఈ సరీ్వసును బుక్ చేసుకున్నారు. అందులో 500 మంది దాకా.. ఆల్రెడీ ‘ఫ్రిజ్’లో శాశ్వత నిద్రలో ఉన్నారు. భవిష్యత్తులో తమను నిద్ర లేపే అలారం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇందులో సదరన్ క్రయోనిక్స్ ఇటీవలే 80 ఏళ్ల సిడ్నీవాసి మరణించాక.. అతడిని ప్రత్యేక పద్ధతిలో పరిరక్షించి.. భద్రపరిచింది. ఇలా భద్రపరిచిన వాటిల్లో పెంపుడు జంతువులు కూడా ఉన్నాయి.ఏం జరిగింది.. ఏం జరుగుతోంది.. నాకు తెలియాలి.. అంతా క్రయోప్రిజర్వేషన్ మహిమ. అంటే.. అత్యంత శీతల వాతావరణంలోమానవ శరీరాన్ని భద్రపరచడం.1 మనిషి చనిపోయాక.. ఈ కంపెనీల ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగుతాయి. మెదడు ‘చనిపోకుండా’ప్రత్యేక పరికరాల ద్వారా ఆక్సిజన్, రక్తాన్ని సరఫరా చేస్తారు.2 శరీరాన్ని ఐసులో ఉంచుతారు. రక్తం గడ్డకట్టకుండా హెపారిన్ ఇంజెక్షన్ ఇస్తారు..3 ప్లాంట్‌కు వెళ్లాక.. శరీరంలోని కణాలు ఫ్రీజ్ అయి దెబ్బతినకుండా ఉండటానికి వాటి నుంచి ద్రవాలను తీసేసి.. బదులుగాగ్లిజరాల్ బేస్డ్ రసాయనాన్ని ఎక్కిస్తారు (ఈ కంపెనీల్లో టుమారో బయో మాత్రం వాహనంలో ప్లాంటుకు తెస్తున్నప్పుడే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెబుతోంది)4 తర్వాత శరీరాన్ని డ్రై ఐసులో –130 డిగ్రీల ఉష్ణోగ్రతకు వెళ్లేదాకా ఉంచుతారు..5 అనంతరం లిక్విడ్ నైట్రోజన్ (–196 డిగ్రీలు) ఉన్న మెటల్ కంటైయినర్‌లో తలకిందులుగా వేలాడదీస్తారు. ఎందుకంటే.. ఎప్పుడైనా ప్రమాదవశాత్తూ లిక్విడ్ నైట్రోజన్ లీక్ అయినా సరే.. మన మెదడు భాగం ద్రవాల్లోనే సురక్షితంగా ఉంటుంది. నమ్మకమే జీవితం..మనమా.. రెండు చేతులూ జేబులో పెట్టుకుని.. అలానడుచుకుంటూ వెళ్లిపోదాం.. ఇంత చెబుతున్నారు సరే.. ఇంతకీ ఇది సాధ్యమేనా అంటే.. సినిమాల్లోనే అయితే సాధ్యమే. కానీ బయట అంటే.. ప్రస్తుతానికైతే చాన్సే లేదని నిపుణులు చెబుతున్నారు. వీళ్లను బతికించే టెక్నాలజీయే లేనప్పుడు ఇలా చేయడం మోసపుచ్చడమే అని విమర్శిస్తున్నారు. ఎప్పటికి వస్తుంది అంటే.. చెప్పడం కష్టమేనంటున్నారు.అయితే.. ఏదో సినిమాలో ‘నమ్మకమే జీవితం’అన్నట్లు ఈ కంపెనీలు మాత్రం భవిష్యత్తుపై ఆశలు చూపుతున్నాయి. ఇటు జనమూ అలాగే డబ్బులు కట్టేస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మంది సంపన్నులే. వీరు తమ సంపదను అనుభవించడానికి.. అలాగే అమరత్వం సాధించడానికి అన్నట్లుగా చేస్తుంటే.. మరికొందరు భవిష్యత్తులో వచ్చే కొత్త టెక్నాలజీలు, అద్భుతాలను వీక్షించేందుకు ఇదో అవకాశమని భావిస్తున్నారు. ఇప్పుడు నయంకాని జబ్బులను నయం చేసే మందులు భవిష్యత్తులో వస్తాయని వాళ్లు నమ్ముతున్నారు. అందుకే ఇలా చేస్తున్నామని అంటున్నారు. ఇంతకీ మనమేం చేద్దాం.. -
గండం గడిచింది అనుకునే లోపే.. అక్కడున్నవారందరికీ షాకిచ్చింది!
క్షణికావేశంలోనో, జీవితంలో భరించలేని కష్టాలు వచ్చాయనో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇది నేరమని తెలిసినా, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్న వారిని చాలామందిని చూస్తుంటాం. కానీ బిహార్‌లో నమ్మశక్యం కాని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. జీవితంపై ఆశలు కోల్పోయిన ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఒక విద్యార్థిని పట్టాలపై ఆదమరిచి నిద్ర పోయిన ఘటన అందర్నీ విస్మయానికి గురి చేసింది.వివరాలను పరిశీలిస్తే బిహార్‌లోని మోతిహారిలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కారణం తెలియరాలేదు గానీ చాకియా రైల్వేస్టేషన్ ఔటర్ సిగ్నల్ దగ్గర పట్టాలపై పడుకుంది. ఇది గమనించిన రైలు డ డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. తక్షణమే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైలు డ్రైవర్ రైలు నుంచి కిందకు దిగి విద్యార్థినిని లేపేందుకు ప్రయత్నించగా, ఆమె నుంచి స్పందన లేకపోవడంతో పొరుగున ఉన్న మహిళల సాయంతో ఆమెను నిద్ర లేపి, ట్రాక్‌పై నుంచి పక్కకు తీసుకొచ్చారు. గండం గడిచింది అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. (ఇదీ చదవండి : కొంచెం స్మార్ట్‌గా..అదిరిపోయే వంటింటి చిట్కాలు) A girl reached Motihari's Chakia railway station to commit su!cide and fell asleep on the railway track while waiting for the train, Train Driver saved the girl's life by applying emergency brakes, Bihar pic.twitter.com/Jrg1VqjG2s— Ghar Ke Kalesh (@gharkekalesh) September 10, 2024 కానీ ఆ విద్యార్థిని మాటలు విన్న వారంతా షాకయ్యారు. ‘నేను చచ్చి పోదామనుకున్నా, నన్ను వదిలండి’’ అంటూ వాదనకు దిగింది. ఆమెను గట్టిగా పట్టుకున్న స్థానిక మహిళ నుంచి తనచేతిని విదిలించుకొని పారిపోవాలని చేసింది. దీంతో ఆమె ఆగ్రహంతో దాదాపు కొట్టినంత పనిచేసింది తలా ఒక మాట అనడంతో తాను కుటుంబ సమస్యల కారణంగా తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఈ గందర గోళం మధ్య రైలు కొద్ది సేపు నిలిచిపోయింది. పరిస్థితి సద్దుమణిగాక బయలు దేరింది. కాగా నిజంగానే ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుందా? ఇంత చిన్న వయసులో అంత కష్టం ఏమొచ్చిందీ? లేదంటే తల్లిదండ్రులను బెదిరించాలనుకుందా? లేదా ఏదైనా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు. -
12 ఏళ్లుగా అతనిది 30 నిమిషాల నిద్రే!..!
మంచిగా నిద్రపోకపోతే ఉదయం వేళ చురుకుగా పనిచేయడం సాధ్యం కాదు. ఏదో విధమైన చికాకు, కోపం ఎక్కువగా ఉంటాయి. అదీగాక వైద్యులు ఆరోగ్యకరమైన వ్యక్తికి సగటున ఆరు నుంచి 8 గంటలు నిద్ర అవసరమని సిఫార్సు చేస్తుంటారు. అలాంటిది ఓ జపాన్ వ్యక్తి కేవలం 30 నిమిషాల నిద్రపోతున్నాడట. అయినా ఎలాంటి సమస్యలు లేకుండా చాలా చురుగ్గా తన పనులు చేసుకుంటున్నాడు. ఇలా అరంగంట నిద్రతోనే తన పనిసామర్థ్యం మరింత మెరుగుపడిందని చెబుతుండటం విశేషం. వివరాల్లోకెళ్తే..జపాన్‌లో హ్యూగో ప్రిఫెక్చర్‌కు చెందిన డైసుకే హోరీ గత 12 ఏళ్లుగా అరగంటే నిద్రపోతున్నాడట. దీనివల్ల తన పని సామర్థ్యం మెరుగుపడిందని చెబుతున్నాడు. ఇలా 30 నిమిషాలే నిద్రపోయేలా తన శరీరానికి, మెదడుకు శిక్షణ ఇచ్చానని, అందుల్ల తాను అలిసిపోనని చెప్పాడు. తాను 12 ఏళ్ల క్రితం నుంచి ఇలా నిద్రను తగ్గించుకోవడం ప్రారంభించానని అలా ప్రస్తుతం తన నిద్రను రోజుకు 30 నుంచి 45 నిమిషాలకు తగ్గించుకోగలిగానని వెల్లడించాడు. తాను భోజనానికి ఒక గంట ముందు క్రీడలు లేదా కాఫీ తాగడం వంటివి చేసి నిద్ర వస్తుందనే భావన రాదని అంటున్నాడు. అలాగే తమ పని సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనుకునే వాళ్లు సుదీర్ఘ నిద్రకంటే నాణ్యమైన నిద్రతోనే ఎక్కువ ప్రయోజనం పొందగలరని చెబుతున్నాడు. ఇలాంటి టెక్నీక్తోనే సదా అప్రమత్తంగా ఉండే వైద్యులు, అగ్నిమాపక సిబ్బంది తక్కువసేపు నిద్రపోయినా అధిక సార్థ్యాన్ని కలిగి ఉంటారని చెప్పాడు. జపాన్‌లోని యోమియూరి టీవీ ఛానల్ డైసుకే ఎలా జీవిస్తున్నాడో చూపించే ఒక రియాలిటీ షో చేసింది. ఈ షో పేరు “విల్ యు గో విత్ మీ?”.వారు మూడు రోజుల పాటు డైసుకేని గమనించారు. అయితే ఒక ఎపిసోడ్లో డైసుకే కేవలం 26 నిమిషాలు మాత్రమే నిద్రపోయాడు.ఆ తర్వాత చాలా ఉత్సాహంగా లేచి, బ్రేక్‌ఫాస్ట్ చేసి పనికి వెళ్లడం, జిమ్ చేయడం వంటివి చేశాడు. ఇదంతా నమ్మశక్యంగా అనిపించకపోయినా అదే రియల్‌గా జరిగింది. అంతేగాదు 2016లో హోరీ జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసీయేషన్ని స్థాపించాడు. అక్కడ రెండు వేలకు పైగా విద్యార్థులకు తనలాగే తక్కువసేపు నిద్రపోవడం ఎలాగో నేర్పించాడు.అయితే ఈ అల్ట్రా షార్ట్ స్లీపర్స్‌కు ఎందుకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావడం లేదనేది శాస్త్రవేత్తలకు అర్థకాని చిక్కుప్రశ్నలా ఉంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఇది ఎలానో నేర్చుకోవాలనుకుంటున్నామని, మరికొందరూ అందరికీ సరిపోదని, దీని వల్ల పలు సమస్యలు వస్తాయని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: నటుడు ఆశిష్ విద్యార్థి ఇష్టపడే బెస్ట్ ఫుడ్ ప్లేస్‌లు ఇవే..!) -
పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతోంటే ఏం చేయాలి?
చిన్నారులు నిద్రలో పళ్లు కొరుకుతున్నారంటే అది వారిలో అంతర్గతంగా ఉన్న ఆందోళన, టెన్షన్, ఒత్తిడి కారణం వల్ల కావచ్చు. ఇలా నిద్రలో పళ్లు కొరికే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘బ్రక్సిజమ్’ అంటారు. పిల్లల్లో ఇది చాలా సాధారణంగా కనిపించడంతో పాటు వారి మెుదటి ఐదేళ్ల వ్యవధిలో మెుదలయ్యే సమస్య ఇది. సాధారణంగా చిన్నారుల్లో ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వంతో వ్యవహరించడం వంటివి ఉన్నప్పుడు ఈ బ్రక్సిజమ్ సమస్య వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించాలంటే ముందుగా వాళ్లలో ఆందోళన, వ్యాకులతకు కారణమయ్యే అంశాలేమిటో తెలుసుకుని, దాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. నిద్రకు వుుందు వాళ్లు సంతోషంగా, ఆహ్లాదంగా ఉండేలా తల్లిదండ్రులు చూడాలి. పిల్లలతో మాట్లాడుతూ వారి మనసుల్లో ఉన్న భయాలు, శంకలు తొలగించేలా వ్యవహరించాలి. అలాగే పిల్లలు నిద్రకుపక్రమించే సమయంలో కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు (కాఫీ, చాక్లెట్లు వంటివి) ఇవ్వకూడదు. సమస్య మరీ ఎక్కువగా ఉంటే నోట్లో అమర్చే మౌత్గార్డ్స్, మౌత్పీసెస్తో కొంత ఉపయోగం ఉంటుంది. ఈ సమస్య వల్ల కొన్నిసార్లు డెంటల్ సమస్యలు – మాల్ అక్లూజన్, పళ్లు వదులు కావడం (లూజెనింగ్), పళ్లు ఊడిపోవడం, దవడ ఎముక జాయింట్ (టెంపోరో మాంబడి బులార్ జాయింట్) సమస్యలు కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో దంతవైద్య నిపుణులను సంప్రదించాలి. -
పగటి నిద్ర మేలే సుమా!
పగటి నిద్ర పనికి చేటు అన్నారు మనవాళ్లు. కానీ పరిశోధకులు మరోరకంగా అంటున్నట్టున్నారు. పగటి పూట పని చేసుకునేట ప్పుడు కళ్ళు బరువెక్కుతాయి. నిద్ర వస్తున్న భావన కలుగుతుంది. అప్పుడు కాసేపు పడుకుంటే తప్పా? అంటే కాదు అంటున్నారు పరిశోధకులు. ఆరోగ్యం దృష్ట్యా చూస్తే కొంతసేపు పడుకోవడం మంచిదే అంటున్నారు. అయితే ఈ పగటి నిద్ర అందరిపైనా ఒకే ప్రభావం కలిగిస్తుందా అన్న ప్రశ్న కూడా ఉంది. చాలామందిలో మాత్రం కొంతసేపు పడుకుంటే మంచి జరుగుతుంది అని గమనించినట్లు పరిశోధకులు చెబు తున్నారు. క్రమంగా ప్రతి నిత్యం మధ్యాహ్నం కొంచెం సేపు పడుకుంటే అన్ని రకాల మంచిదే. దాని వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి అని కొంత కాలం క్రితమే తెలుసుకున్నారు. మెదడుకు కూడా మంచిదే అంటున్నారు. మెదడు కణాలు తగ్గకుండా ఉంటే జ్ఞాపకశక్తి తగ్గడం అనే సమస్య తగ్గుతుంది. అయితే ఎంతసేపు పడుకోవాలి అన్నది పెద్ద ప్రశ్న. అరగంట వరకు పడుకుంటే తప్పు లేదు. మెదడుకు మంచి ఆరోగ్యం అందుతుంది, అది పనిచేసే, పెరిగే తీరు సక్రమంగా సాగుతుంది అంటున్నారు విక్టోరియా గార్ఫీల్డ్. ఆమె యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో పరిశోధ కురాలు. సరైన సమయంలో కొద్దిపాటి నిద్ర వెంటనే మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. ఈ విష యాన్ని చాలా పరిశోధనల్లో నిర్ధారించారు. ఆరో గ్యంగా ఉన్నవారు ఒక క్రమంలో నిద్రపోతూ ఉంటే వాళ్ల మీద పరిశోధనలు జరిగాయి. పాత పరిశోధనల ఫలితాలను ఇక్కడి ఫలితాలతో సరిపోల్చి చూశారు. నిజానికి 2009లోనే ఇటు వంటి పరిశోధనా ఫలితాలు ‘స్లీప్ రీసెర్చ్’ అనే పత్రికలో వచ్చాయి. కొంతసేపు పడుకున్న వారిలో వారు పరిస్థితులకు ప్రతిచర్య చూపించే తీరు, చురుకుదనం, జ్ఞాపకశక్తి లాంటి అంశా లలో మంచి ప్రభావాలు కనిపించాయి. నిద్ర పోయి లేచిన తర్వాత సృజనాత్మకత కూడా పెరుగుతుంది. అంటే కొత్త అంశాలను ఊహించడం కూడా బాగా జరుగుతుంది. ఈ అంశం ఇటీవల పరిశోధనల్లో గమనించారు. పరిశోధనకు కూర్చున్న వారికి కొన్ని లెక్కలు ఇచ్చి చేయమన్నారు. ఆ లెక్కల్లో కొన్నింటికి సులభ మార్గాలు ఉన్నాయి. వాటి గురించి మాత్రం వాలంటీర్లకు చెప్పలేదు. ప్రశ్న ఇచ్చిన తర్వాత కాసేపు పడుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు అన్నారు పరిశోధకులు. కొద్దిసేపు కునికిన వారు కూడా ఆ లెక్కలను సులభంగా సాల్వ్ చేయగలిగారు. వారికి స్వల్ప మార్గాలు చటుక్కున తోచాయి. అదే ఎక్కువ సేపు నిద్ర పోయిన వారిలో మాత్రం ఇటువంటి చురుకు దనం కనిపించలేదు. అంటే మెదడులో ఎక్కడో విరామం కలిగే అవకాశం గల స్థానం ఉందని, దానివల్ల యురేకా అనుభవం కలుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. నిద్ర సరిగా రానివారూ, కావలసినంత నిద్ర పోలేని వారు కూడా కొద్దిసేపు పడుకున్నందుకు మంచి ప్రభావాలు ఉంటాయి అంటు న్నారు. షిఫ్ట్‌లలో పనిచేసేవారూ, చిన్న శిశు వులతో బతికే తల్లితండ్రులూ, రాత్రిపూట సరిగా నిద్ర పట్టని పెద్ద వయసు వారూ చిన్న కునుకు వల్ల లాభం పొందినట్టు గమనించారు. రాత్రి షిఫ్ట్‌లో పని చేస్తున్న వాళ్లు షిఫ్ట్ మధ్యలో కొద్ది సేపు పడుకుంటే తప్పకుండా నిద్ర మత్తు తగ్గుతుంది. అసలు నిద్ర వస్తున్న భావమే కలు గదు. కొద్దిసేపు పడుకుని లేచిన తరువాత త్వర లోనే పరిస్థితి మారిపోతుంది. వారిలో చురుకు దనం కనిపిస్తుంది. వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీలో పని చేస్తున్న నటాలి డాటోవిచ్ బృందం వారు కూడా ఈ అంశం గురించి పరిశోధిస్తున్నారు. వారికి నిజానికి ఔషధాలు తయారు చేసే కంపెనీలు, వైద్య పరికరాల కంపెనీలు ఆర్థిక సహాయం చేస్తున్నాయి. 20 నిమిషాలు పడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. గంటనుంచి గంటన్నరసేపు పడుకుంటే మరింతమంచి ఫలితాలు కనిపిస్తాయి అంటున్నారు నటాలి. పడుకుంటే 20 నిమిషాలు పడు కోవాలి, లేదంటే గంటపైన పడు కోవాలి. అంతే కానీ మధ్యలో లేస్తే అంత మంచి ప్రభావం ఉండదు అని గమనించారు. ఎక్కువ రోజులపాటు ఇలా కునుకులు తీసే వారి మీద ప్రభావం గురించి మాత్రం అంతగా సమాచారం లేదు. నిద్రకు ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి గల సంబంధాన్ని గురించి చెప్పడం అంత తేలిక కాదు అని కూడా ఈ పరిశోధకులు అంటున్నారు. ‘కొంచెం సేపు నిద్రపోతే మంచిదేనట’ అని నిద్రకు ఉపక్రమించేవారు ఫలితాలను గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.మంచి ఫలితాలు కనిపిస్తే కొంచెం సేపు నిద్రించ వచ్చు. ఆ నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసు కోవాల్సినది.డా‘‘ కె. బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ విషయాల రచయిత -
నిద్రారాక్షసం
కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర లేకుండా రోజుల తరబడి గడపడం అసాధ్యం. బొందిలో ప్రాణం నిలిచి ఉండాలంటే, ఈ రెండూ తప్పనిసరి. తిండి, నిద్ర మనుషులకే కాదు, జంతువులకూ అవసరమే! జంతువులకు నిద్ర ముంచుకొచ్చినప్పుడు నిద్రపోవడమే తెలుసు గాని, నిద్ర గురించి ఆలోచించడం తెలీదు. మనం మనుషులం. జంతువులతో పోల్చుకుంటే జ్ఞానులం. ‘ఆహార నిద్రా భయ మైథునాని/ సామాన్య మేతత్పశుభిర్నరాణాం/ జ్ఞానం హి తేషా మధికో విశేషో/ జ్ఞానేన హీన్యా పశుభిస్సమానాః’ అని పూర్వకవి సంస్కృతంలో పలికాడు. ఆహార నిద్రా భయ మైథునాలు మనుషులకు, జంతువులకు సమానమే! మిగిలిన జంతు సమూహం నుంచి మనిషిని వేరు చేసే లక్షణం జ్ఞానం మాత్రమే! జ్ఞానమే గనుక లేకుంటే, మనుషులకు, జంతువులకు తేడా ఏమీ ఉండదు.అందువల్ల జంతువుల కంటే జ్ఞానులైన మనుషులకు నానా విషయాలలో అవసర పరిజ్ఞానమూ అనవసర పరిజ్ఞానమూ సహజ లక్షణం. అందులో భాగంగానే మనుషులకు నిద్ర గురించిన పరిజ్ఞానం ఉండటం అంతే సహజం. నిద్ర ఎప్పుడు రావడం సహజమో, ఎంతసేపు నిద్రపోవాలో, సుఖనిద్రకు ఎలాంటి పరిసరాలు, పరిస్థితులు అనుకూలిస్తాయో మనుషులకు బాగా తెలుసు. బహుశా, ఈ జ్ఞానభారం వల్లనే నిద్రలేమి సమస్యలు కూడా మనుషుల్లోనే ఎక్కువ. ‘ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు’ అని మనకో నానుడి ఉంది. కొంత వరకు ఆ మాట నిజమే కావచ్చు గాని, సర్వసుఖాలు అందుబాటులో ఉన్నా, కంటి నిండా కునుకు లేక తిప్పలు పడే మనుషులు ప్రపంచమంతటా లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. ‘నిద్ర మంచిది, మరణం మెరుగైనది; అయితే, అత్యుత్తమమైనదేదీ ఇంకా పుట్టలేదు’ అని జర్మన్ కవి, రచయిత హేన్రిక్ హేనీ అన్నాడు. మరణాన్ని మనవాళ్లు శాశ్వతనిద్రగా అభివర్ణిస్తారు. శాశ్వతనిద్రలోకి జారుకునేలోగా మనిషికి జీవనయాత్ర తప్పదు. జీవనయాత్ర సజావుగా సాగడానికి ప్రతిరోజూ తగినంత నిద్ర అవసరం. ప్రశాంతమైన నిద్రతోనే మనశ్శరీరాలు జవజీవాలను పుంజుకుంటాయి. దైనందిన నిత్య నైమిత్తిక కార్యకలాపాలకు సంసిద్ధమవుతాయి. రోజంతా పనిచేసి అలసి సొలసిన శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత అవసరం. ఈ రెండూ నిద్రతోనే దొరుకుతాయి. అయితే, సంక్లిష్టమయమైన ఆధునిక జీవనశైలి మనుషులను నిద్రకు దూరం చేస్తోంది. ‘కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది/ కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది’ అన్నాడు మనసుకవి ఆత్రేయ. మనసుకు కుదురు లేనప్పుడు పట్టేది చెదురు మదురు నిద్రే! చెదురు మదురు నిద్రలో తీపికలలు కాదు, పీడకలలు వస్తాయి. ‘కంటికి నిద్రవచ్చునె? సుఖంబగునె రతికేళి? జిహ్వకున్/ వంటక మిందునే? యితర వైభవముల్ పదివేలు మానసం/బంటునె? మానుషంబుగల యట్టి మనుష్యున కెట్టివానికిన్/ గంటకుడైన శాత్రవుడొకండు తనంతటి వాడు గల్గినన్’ అన్నాడు శ్రీనాథుడు. ఈ పద్యం ‘కాశీఖండం’లోనిది. ఇది వింధ్యుడి స్వగతం. వింధ్యుడికి సమ ఉజ్జీ మేరువు. సూర్యుడు మేరువు చుట్టూ ప్రదక్షిణంగా పయనిస్తాడు. దేవతలు మేరుపర్వతాన్నే గౌరవిస్తారు. మేరువు కన్నా తానేమీ తక్కువ కాకున్నా, తనకు దక్కని గౌరవం మేరువుకు దక్కడం పట్ల అసూయతో రగిలిపోయే వింధ్యుడి కంటికి కునుకు పట్టకపోవడం సహజమే కదా! పురాణాల్లో మేరువు, వింధ్య పర్వతాలే అయినా, శ్రీనాథుడు రాసిన ఈ పద్యం మాత్రం మానవ ప్రవృత్తులకు అద్దం పడుతుంది. నిద్రను కరవు చేసే అనేకానేక కారణాల్లో సమ ఉజ్జీ అయిన ప్రత్యర్థితో తలెత్తే స్పర్థ కూడా ఒకటి.నిద్ర పట్ల అవగాహన మనుషులకు ప్రాచీనకాలం నుంచి ఉండేది. నిద్రకు భంగం కలిగించే అంశాలు, ప్రశాంతమైన నిద్ర ఆవశ్యకతను నాటి మానవులు బాగానే గుర్తించారు. ప్రాచీన నాగరికతలలో నిద్రను దేవతగా ఆరాధించేవారు. కావ్య పురాణేతిహాసాల్లో నిద్ర ప్రస్తావన విరివిగా కనిపిస్తుంది. రామాయణంలో కుంభకర్ణుడి నిద్ర, ఊర్మిళాదేవి నిద్ర సుదీర్ఘకాల నిద్రలకు ఉదాహరణలు. ఆకలి దప్పులను, నిద్రను జయించడానికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించిన ఉదంతం కూడా రామాయణంలో ఉంది. అరణ్యవాస కాలంలోను, లంకలో రామరావణ యుద్ధకాలంలోను బల అతిబల విద్యలు లక్ష్మణుడికి బాగా అక్కరకు వచ్చాయి. అరణ్యవాసానికి వెళ్లినది మొదలుకొని, రావణ సంహారం తర్వాత శ్రీరామ పట్టాభిషేకం వరకు లక్ష్మణుడు నిద్రపోలేదు. అంతకాలమూ అతడి అర్ధాంగి ఊర్మిళ నిద్రపోతూనే ఉంది. సరిగా రామ పట్టాభిషేకం జరుగుతుండగా, లక్ష్మణుడికి నిద్ర ముంచుకొచ్చి రెప్పలు మూతబడ్డాయి. అప్పుడు తన అవస్థకు తానే నవ్వుకున్నాడు లక్ష్మణుడు. పట్టాభిషేక సమయంలో లక్ష్మణుడు నవ్విన నవ్వును అక్కడ ఉన్న ప్రముఖుల్లో ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకున్నారు. అదంతా వేరే కథ. పురాణాల ప్రకారం నిద్రకు దూరంగా ఎక్కువకాలం గడిపిన రికార్డు లక్ష్మణుడిదే! అయితే, నూయెన్ న్యోక్ మై కిమ్ అనే యాభయ్యేళ్ల వియత్నాం మహిళ గడచిన ముప్పయ్యేళ్లుగా కనీసం నిమిషమైనా నిద్రపోలేదట! ఇన్నాళ్లుగా నిద్రపోకున్నా, ఆమె ఆరోగ్యంగా ఉండటం చూసి వైద్యులు సైతం విస్తుపోతున్నారు. ఈ నిద్రలేని నీలాంబరి ఉదంతం ఒక నిద్రారాక్షసం. -
గంటల తరబడి ఏసీతో అనర్థాలెన్నో!
గతకొద్దేళ్లుగా పర్యావరణ కాలుష్యం, మానవ కార్యకలాపాలు కారణంగా సమ్మర్లో ఎండలు దంచి కొట్టాయి. సూర్యుడి భగభగలు మాములుగా లేదు. అంతేగాదు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, ఆంటోనియో గుటెర్రెస్ సైతం ప్రజలు అధిక వేడిని ఎదుర్కొటున్నారని, బిలయన్లమంది ప్రజలు ప్రాణాంతక వేడి తరంగాలతో అల్లాడుతున్నారంటూ హెచ్చరించారు. అంతేగాదు ఇటీవల ఎన్నడూ చూడని విధంగా ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. దీంతో సామాన్య ప్రజలు సైతం అప్పో సొప్పో చేసి మరీ కూలర్ లేదా ఏసి కొనుక్కుని ఉపశమనం పొందుతున్నారు. ఈ విపరీతమైన వేడికి భయపడే ఏసీ గదుల్లో గంటల్లకొద్ది నిద్రిస్తున్నారు. కొందరైతే తెల్లవార్లు ఏసీ ఆన్‌చేసి పడుకుంటారు. అయితే ఇలా చేయడం అస్సలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఏసీలో పడుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు..పొడి కళ్ళు: ఏసీ గాలి నుంచి తేమను తొలగిస్తుంది. ఇది కళ్లను పొడిగా చేసి.. దురద, అసౌకర్యానికి దారితీస్తుంది.బద్ధకం: చల్లని ఉష్ణోగ్రతలు జీవక్రియ రేటును తగ్గించి, శరీర ప్రక్రియలను నెమ్మదిస్తాయి. ఇది అలసట, మగతకు దారితీస్తుంది.నిర్జలీకరణం: పొడి గాలి వేగవంతమైన తేమ నష్టాన్ని కలిగిస్తుంది. తగినంతగా నీళ్లను తాగకపోతే నిర్జలీకరణానికి దారితీస్తుంది.పొడి లేదా దురద చర్మం: తక్కువ తేమ చర్మం తేమను కోల్పోయేలా చేసి చర్మ పొడిబారినట్లుగా అయిపోతుంది. దీంతో ఒక విధమైన దురద, చికాకుకు కలుగుతుంది.తలనొప్పి: ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పులు, చల్లని పొడి గాలి తలనొప్పి, సైనస్‌కు కారణమవుతుంది.శ్వాసకోశ సమస్యలు: చల్లని మరియు పొడి గాలి వాయుమార్గాలను చికాకుపెడుతుంది, ఉబ్బసం మరియు అలెర్జీల వంటి అధ్వాన్నమైన పరిస్థితులు.అలెర్జీలు, ఉబ్బసం: ఎయిర్ కండిషనింగ్‌లో దుమ్ము ధూళి వంటి అలెర్జీ కారకాలను కలిగి ఉంటాయి. ఇది అలెర్జీ ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది.శబ్ద కాలుష్యం: నిరంతరం హమ్మింగ్ చేయడం వల్ల నిద్రకు భంగం కలిగించి, చికాకు కలిగిస్తుంది.అంటువ్యాధులు: పేలవంగా నిర్వహించబడే ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు బాక్టీరియా, వైరస్లు,శిలీంధ్రాలు వ్యాప్తి చెందుతాయి.నవజాత శిశువులపై ప్రభావంఎయిర్ కండీషనర్లను సరిగ్గా ఉపయోగిస్తే నవజాత శిశువులకు సురక్షితంగా ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులు శిశువు శరీర ఉష్ణోగ్రతకు ఉష్ణోగ్రతను నియంత్రించాలి, సర్దుబాటు చేయాలి. నవజాత శిశువును గదిలోకి తీసుకురావడానికి కనీసం 20 నిమిషాల ముందు AC ఆన్ చేయాలి, అదికూడా 25-27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య ఉంచాలి. దగ్గు, న్యుమోనియా వంటి వ్యాధుల బారినపడకుండా ఉండేలా చల్లటి గాలికి ప్రత్యక్షంగా గురికాకుండా జాగ్రత్తపడాలి. కొంతమంది నవజాత శిశువులకు కూడా చల్లని ఉష్ణోగ్రతలకు అలెర్జీని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి విపరీతమైన చలికి దూరంగా ఉండాలి. అంతే కాకుండా దుమ్ము వంటి అలర్జీలను నివారించడానికి ఎయిర్ కండీషనర్లను తరచుగా శుభ్రం చేయాలి.(చదవండి: ఈగను చంపడంతో ..ఏకంగా కన్నే పోగొట్టుకున్నాడు..!) -
వీకెండ్ మస్తీ..హాయిగా కునుకు : ‘స్లీప్ టూరిజం’
పర్యాటక రంగంలో ఇటీవలి కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది స్లీప్ టూరిజం. ఈ కొత్త కాన్సెప్ట్‌కు ఆదరణ క్రమంగా పెరుగు తోంది. స్లీప్ టూరిజం అంటే ఆహ్లాద కరమైన పర్యాటక ప్రదేశానికి వెళ్లి ఆనందంగా నిద్రపోతూ సేదదీరడమే. ప్రధానంగా వేళా పాళా లేకుండా పని ఒత్తిడిలో మునిగి తేలుతున్న కార్పొరేట్ ఉద్యోగులు, ఇతర వర్కింగ్ ప్రొఫెషనల్స్ , యువత ఈ స్లీప్ టూరిజంపై ఆసక్తి చూపుతోంది. స్లీప్ టూరిజం సేవలు అందించే కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం రండి!జీవనశైలి మార్పులు, మారుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా పర్యాటక రంగం కూడా ట్రెండ్ మార్చుకుంటోంది. అలా వచ్చిందే స్లీప్ టూరిజం. బిజీ బిజీ జీవితంనుంచి విశ్రాంతి, కోరుకునే వారి అభిరుచులకు అనుగుణంగానే అన్ని రంగాల్లాగే పర్యాటక రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. సస్టెయినబుల్ టూరిజం, ఫుడ్ టూరిజం, ఎక్స్పరిమెంటల్ టూరిజం, వెల్నెస్ టూరిజం.. ఈ జాబితాలో వచ్చిందే స్లీప్ టూరిజం. దీన్నే ‘నాప్కేషన్స్' లేదా 'నాప్ హాలిడేస్' అని కూడా పిలుస్తారు.స్లీప్ టూరిజంలో యోగ, స్విమ్మింగ్, స్పా, పార్లర్ సెషన్లు , ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు గంటల కొద్దీ నిద్ర ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పచ్చని ప్రకృతి, కొండలు, లోయలు, సెలయేరుల సవ్వడి, బుజ్జి పిట్టల కిలకిలా రావాలు వీటి మధ్య హాయిగా సేదతీరడం అన్నమాట. రొమాంటిక్ అనుభవం కావాలనుకుంటే జంటగా వెళ్లవచ్చు, లేదా ఏకాంతంగా గడపాలనుకుంటే సోలోగా కూడా వెళ్లవచ్చు. అసలు ఈ ఊహే కొండంత ప్రశాంతతనిస్తుంది కదా. మరింకెందుకు ఆలస్యం. భారతదేశంలో స్లీప్ టూరిజం ప్రదేశాలు, రిసార్ట్లు, ధ్యానం, ఆయుర్వేద చికిత్సలు, థెరపీలు,నిద్రకోసం మంచి ప్యాకేజీలను అందించే కొన్ని ప్రదేశాలను చెక్ చేద్దాం.కూర్గ్: కూర్గ్ కర్నాటకలోని ఒక సుందరమైన హిల్ స్టేషన్. అక్కడి పచ్చదనం , ప్రశాంతమైన వాతావరణం స్లీప్ టూరిజానికి బెస్ట్ డెస్టినేషన్.లేహ, లడాఖ్: అందమైన సరస్సులు, కొండలు, లోయలు, కేవలం ఎండకాలంలో మాత్రమే కాదు ఏ సీజన్లో అయినా మనల్ని ఆకట్టుకునే చక్కటి ప్రకృతి రమణీయ దృశ్యాలు మంచి ఆహ్లాదాన్ని పంచుతాయి.అలెప్పీ..కేరళలోని అలెప్పీ బ్యాక్ వాటర్స్ అందాలో మంచి పర్యాటక ప్రదేశంగా పాపులర్. ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు వీలుగా, హౌస్బోట్లలో హాయిగా నిద్రపోయే సౌకర్యాలున్నాయి.గోవా: స్లీప్ టూరిజం సేవలకు గోవా మరో మంచి ఆప్షన్. అప్పుడే లేలేత ఎండ ..అప్పుడే చిరుజల్లులొస్తాయి భలే ఉంటుంది. ఇక్కడ రిసార్ట్లు ,హోటళ్లు , స్పా చికిత్సలు, యోగా, మంచి ఆహారం తదితర సౌకర్యాలతో మంచి ప్యాకేజీలను అందిస్తున్నాయి.మైసూర్: మీరు ఒక వేళ దేవాలయాలను సందర్శించి, దైవ దర్శనం చేసుకొని, ప్రశాతంత పొందాలనుకుంటే మైసూర్ చక్కటి. ఇక్కడ స్లీప్ టూరిజం అవకాశాలు బాగానే ఉన్నాయి.రిషికేశ్: చుట్టూ పర్వతాలు ,బియాస్ నది పరవళ్లు, చల్లని గాలులతో రిషికేష్ కూడా హాయిగా కనుకు తీసేందుకు అనువైన ప్రదేశం.నాకో: హిమాచల్ ప్రదేశ్‌లోని పిన్ డ్రాప్ సైలెన్స్ ప్రాంతంగా గుర్తింపు పొందిన నాకో అనే హిల్‌స్టేషన్ కూడా స్లీప్ టూరిజానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ ఎంత చిన్న శబ్దమైనా చాలా దూరం వినిపిస్తుందని అంటారు. చుట్టూ పచ్చని అడవులు, అందమైన లొకేషన్ల మధ్య ఉండే ఈ ప్రాంతం హాయిగా కునుకు తీసేందుకు సరిగ్గా ఉంటుంది. దువార్స్: పశ్చిమ బెంగాల్‌లోని దువార్స్ పట్టణం స్లీప్ టూరిజాన్ని కోరుకునేవారికి చక్కటి ప్రదేశం అని చెప్పవచ్చు. చుట్టూ తేయాకు తోటలు, దట్టమైన అటవీ ప్రాంతం, రిసార్టులతో అత్యంత రమణీయంగా ఉంటుంది. -
ఆకలి... నిద్ర సరిగా లేవా? మెగ్నీషియం లోపం కావచ్చు
మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం దేహంలో అధికంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్ నుంచి మనకు శక్తి వచ్చేలా చేయడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మంచి శక్తితోపాటు చక్కటి నిద్ర పట్టేలా చేస్తుంది. రక్తంలో చక్కెరలను, హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది. మెగ్నీషియం తగినంత లేకపోతే కలిగే అనర్థాలేమిటో తెలుసుకుందాం. అనారోగ్యాలు వేధిస్తుంటాయి!శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే ఆకలి వేయదు. వికారంగా... వాంతులు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. నీరసంగా ఉంటారు. హార్ట్ బీట్‌రేట్ లో హెచ్చుతగ్గులు వస్తాయి. కళ్ళు మసక బారుతుంటాయి. కండరాలలో నొప్పి వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర సరిగ్గా పట్టదు. హైబీపీ వస్తుంది. ఆస్తమా రోగులకు మెగ్నీషియం లోపిస్తే ఈ సమస్య తీవ్రంగా మారుతుంది. ఆకుకూరలలోనూ, అవకాడో, అరటిపండ్లు, రాస్ బెర్రీస్, ఫిగ్స్ వంటి పండ్లలోనూ మెగ్నీషియం ఉంటుంది. అలాగే బ్రకోలీ, క్యాబేజి, పచ్చి బఠానీలు, మొలకలు వంటి వాటిలో కూడా ఇది దొరుకుతుంది. బ్రౌన్ రైస్, ఓట్స్, సీఫుడ్స్‌లో మెగ్నీషియం లభిస్తుంది. మెగ్నీషియం వెంటనే రావాలి అంటే ఒక కప్పు కాఫీ తాగాలి. చాక్లెట్ తిన్నా ఫలితం ఉంటుంది. మెగ్నీషియం లోపానికి వెంటనే జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్యానికి గురవుతారు.సబ్జా గింజలు, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మెగ్నీషియం లోపించదు. -
సంపూర్ణ జీవితం
భట్టి విక్రమార్క కథలో, విక్రమార్కుడి బుద్ధి కుశలతను మెచ్చి, వెయ్యేళ్లు పరిపాలించే సింహాసనాన్ని బహూకరిస్తాడు ఇంద్రుడు. అంటే వెయ్యేళ్ల ఆయువు. మరి నా సంగతేమిటని విక్రమార్కుడిని అడుగుతాడు సోదరుడు భట్టి. అన్నింటికీ వెన్నంటి ఉండే భట్టి సంగతి మరిచేపోయాడు విక్రమార్కుడు. దాంతో భట్టి ఆవేశంతో కాళికాదేవి తపస్సు చేసి, రెండు వేల ఏళ్లు బతికే వరం పొందుతాడు. మరి నా సంగతేమిటని అడుగుతాడు విక్రమార్కుడు. ఇద్దరు కలిసి కదా బతకాలి! అప్పుడు ఆలోచన చేస్తారు. సింహాసనం మీద వెయ్యేళ్లు కూర్చుని కదా పాలించమన్నది... అంటే అది ఆయువు పరిమితి కాదు, రాజ్యపాలన పరిమితి. అందుకే ఆరు నెలలు రాజ్య పాలన, ఆరు నెలలు అరణ్యవాస పథకం వేస్తారు. అలా భట్టి విక్రమార్కులు ఇద్దరూ రెండు వేల ఏళ్లు బతుకుతారు. ఒక్క భట్టి విక్రమార్కులేనా? రామాయణంలో దశరథుడు వేల ఏళ్లు బతికాడు. ఎందరో మునులు, రుషులు వేల ఏళ్లు తపస్సులోనే గడిపి ఎన్నో శక్తులు సాధించిన కథలున్నాయి. ఎప్పటికీ చనిపోని వరాలు పొందిన రాక్షసులు ఎందరో మన పురాణాల్లో ఉన్నారు. ఎప్పటికీ బతికివుండేలా దేవతలు అమృతాన్ని సేవించారు. చనిపోయినవాళ్లను అట్టే మళ్లీ పునర్జీవింపజేసే సంజీవని కథలు, గాయాలన్నీ మానిపోయి దృఢకాయులయ్యే లేపనాల గాథలు మనకున్నాయి. వేల ఏళ్లు బతకడం అంటే దాదాపుగా చావు లేకపోవడమనే! జీవితానికి అంతం పలికే చావు అనేదాన్ని తప్పించే అన్ని ప్రయత్నాలనూ మనిషి కనీసం కథల్లోనైనా, కలల్లోనైనా చేశాడనుకోవచ్చు.ఎప్పటికైనా చచ్చిపోతామనే వాస్తవం మనిషిని కలవరపెడుతుంది. సమస్త మానవాళి గురించి కాకపోయినా, కనీసం తన అయినవారు తనకు కాకుండాపోతారన్న చింత ఉండటంతోపాటు తానూ ఒకరోజు ఈ భూమ్మీద శూన్యంగా మిగిలిపోతాడన్నది జీర్ణం చేసుకోలేని చేదుమాత్ర. అన్ని మతాలూ మరణానంతర జీవితాలను వాగ్దానం చేయడంలో అందుకే విజయం సాధించి ఉంటాయి. చచ్చాక ఏమీ లేదు అనుకోవడం కంటే, ఆ పైనెక్కడో మళ్లీ బతుకుతాం అనేది ఒక ఊరట. అదే సమయంలో చిట్టచివర చావు అనేది ఉంటుందని తెలియడం కొంతమందికి ఒక రిలీఫ్ కూడా. లేకపోతే ఎంతకాలం ఈ రోజువారీ సంకెళ్ల లాంటి వ్యవహారాలను లాక్కురావడం? అందుకే మన పెద్దలు మళ్లీ పుట్టుక లేని ముక్తిని కోరుకున్నారు కాబోలు.సృష్టిలోని ప్రతి జీవికీ ఒక ఆయుఃప్రమాణాన్ని నిర్దేశించిన ప్రకృతి, మనిషికి 120 ఏళ్లు ఇచ్చింది. శతమానం భవతి అని పెద్దలు దీవిస్తుంటారుగానీ, దాన్ని నూరేళ్లు అనికాక, పూర్ణాయువుతో బతకమని దీవించడంగా అర్థం చేసుకోవచ్చు. అర్ధంతరంగా మరణించడం ఆ ప్రకృతి వరాన్ని పాడుచేసుకోవడమే. అర్ధంతర మరణం ఆధునిక మానవుడికి సంభవించడానికి కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు ఉన్నాయి. మృత్యువును, రోగాలను మోసం చేసి దీర్ఘకాలం బతగ్గలమా? మన ఆయుఃప్రమాణం కంటే చాలా ఏళ్ల పాటు బతకడాన్ని నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు సాధ్యం చేయనున్నాయా? మనిషి శాశ్వతత్వాన్ని సాధించగలడా? మన ఫిజియాలజీని మార్పు చేయడం ద్వారా జీవితకాలాన్ని పొడిగించవచ్చా? ఇలాంటి ప్రశ్నలను నోబెల్ పురస్కారం అందుకున్న వెంకీ రామకృష్ణన్ తన ‘వై వి డై: ద న్యూ సైన్స్ ఆఫ్ ఏజింగ్ అండ్ ద క్వెస్ట్ ఫర్ ఇమ్మోర్టాలిటీ’ పుస్తకంలో చర్చించారు. మనిషి శరీరం కోటానుకోట్ల కణాల నిర్మితం. ప్రతి కణంలో ఉండే డీఎన్ ఏ ప్రతిరోజూ లక్ష మార్పులకు గురవుతుంది. డీఎన్ ఏను నాలుగక్షరాల వర్ణమాలలో రాసిన సుదీర్ఘమైన కోడ్ అనుకుంటే, నెమ్మదిగా దాని కార్యకలాపంలో అంతరాయం రావడమే ముదిమి రావడం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 బయోటెక్ కంపెనీలు ముదిమి, జీవితకాల పొడిగింపు మీద పని చేస్తున్నాయి. ‘యవ్వనంలో ఉన్నప్పుడు ధనికులం కావాలనుకుంటాం; ధనికులం అయ్యాక యవ్వనాన్ని కోరుకుంటాం. యవ్వనాన్ని కొనలేకపోయినా, కనీసం దానిమీద పరిశోధనలనైనా (ఏజింగ్ రీసెర్చ్) ధనికులు కొంటున్నా’రంటారు వెంకీ రామకృష్ణన్ . ఒకవేళ శాస్త్ర పరిశోధనలు ముదిమిని ఆపడంలో విజయం సాధించినా ఆ ఫలితాలు సంపన్నులకు తప్ప పేదవాళ్లకు తేలిగ్గా అందుబాటులోకి రావని చెబుతారు.ఈ శాస్త్రాలు, పరిశోధనలతో నిమిత్తం లేకుండా; ధనిక, పేద అనే తేడా లేకుండా జీవితాన్నే ఒక సాధనగా మలుచుకున్న కొన్ని ప్రాంతాల్లో మనుషులు సంపూర్ణ ఆయువును అనుభవిస్తున్నారు. ఒకినావా (జపాన్ ), సార్డీనియా (ఇటలీ), నికోయా (కోస్టా రికా), ఇకారియా (గ్రీస్), లోమ లిండా (కాలిఫోర్నియా, అమెరికా)... లాంటి ప్రదేశాల్లో ఎక్కువమంది వందేళ్లు బతకడమో, దీర్ఘకాలం బతకడమో కనబడుతుంది. ఇలాంటి ప్రదేశాలు ప్రపంచంలో ‘బ్లూ జోన్స్’గా నిలుస్తున్నాయి. ‘లివ్ టు 100: సీక్రెట్స్ ఆఫ్ ద బ్లూ జోన్స్’ డాక్యుమెంటరీ ప్రయోక్త డాన్ బ్యూట్నర్... ఈ బ్లూ జోన్స్ అని నామకరణం చేయడమే కాకుండా, వాళ్ల దీర్ఘాయువు రహస్యాలను పరిశోధించారు. శారీరక కార్యకలాపాలు, తక్కువ ఒత్తిడి, స్థానికంగా దొరికే ఆహారాన్ని వినియోగించడం, బలమైన కుటుంబ, సామాజిక సంబంధాలు వీరిని ఆరోగ్యవంతులుగా ఉంచుతున్నాయని బ్యూట్నర్ చెబుతారు. రసాయనిక ఎరువులు వేయని పంటలు, 95 శాతం మొక్క ఆధారిత ఆహారం, ఎనభై శాతం మాత్రమే తిని కడుపులో కొంత ఖాళీ ఉంచుకోవడంతోపాటు, జీవితానికి ఒక ఉద్దేశం ఉంచుకోవడం వారిని ఉత్సాహవంతులుగా ఉంచే అదనపు విషయాలు. వెంకీ రామకృష్ణన్ అయినా, బ్లూ జోన్స్ శతాధికులైనా మనిషి ఆరోగ్యానికి కీలకమని చెప్పేవి మూడు: ఆహారం, వ్యాయామం, నిద్ర. ఇవైతే మన చేతిలోనే ఉన్నాయి. -
ఢైలీ రొటీన్‌ను ఇలా ప్లాన్ చేయండి
ఆర్థిక విషయాలను పకడ్బందీగా నిర్వహించడం ఎంత అవసరమో ఆరోగ్య భరోసానిచ్చే దైనందిన కృత్యాలు నిర్వహించడమూ అంతే అవసరం. ఆర్‌ఎన్‌ఎ- డీఎన్ఏ మొదలు గుండె–మెదడు వరకూ ప్రతీ అణువు, కణము శరీరంలో కీలకమే. ఒక్క అణువు విచ్ఛిన్నమైనా అనారోగ్యమే. సుమారుగా 37.2 ట్రిలియన్ కణాల సమూహంతో నిర్మితమైన మానవ దేహం నిద్ర లేచింది మొదలు మళ్లీ నిద్రకు ఉపక్రమించే వరకూ.. అంతవరకూ ఎందుకు నిద్రలో సైతం నిత్య జీవ క్రియలను కొనసాగిస్తుంది. మరి అంతటి అమూల్యమైన శరీరం తన విధులను తాను సక్రమంగా నిర్వర్తించాలంటే అందుకు తగినట్లుగా మన పని విధానం ఉండాలి? అలా ఉండాలంటే మనం ఏం చేయాలి..ఏమిటా పనులు? ఎలా చేయాలి? ఇలాంటి అంశాలపై హైదరాబాదీల కోసం ప్రత్యేక కథనం...– ఆరోగ్య భరోసానిచ్చే నిత్యకృత్యాలపై దృష్టి సారించండి– అందుకు తగ్గట్లుగా మీ పని విధానం, అలవాట్లు మార్చుకోండి– శారీరక, మానసిక, ఆరోగ్య సంరక్షణపై బీ కేర్ ఫుల్– పలు అధ్యయనాల పరిశోధనల్లో ఆసక్తికర అంశాలు వెల్లడిఆహారం ఇలా... పెద్దలకు రోజుకు 1,600–3,000 కేలరీల ఆహారం అవసరం. 19–30 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీలకు 1,800–2,400 కేలరీలు, పురుషులకు 2,400–3,000 కేలరీలు, 31–59 ఏళ్ల వయసున్న స్త్రీలకు 1,600–2,200 కేలరీలు, పురుషులకు 2,200–3,000 కేలరీలు అవసరం. అయితే, ఒక వ్యక్తి రోజుకు ఎన్ని కేలరీలు తినాలి అనేది ఆ వ్యక్తి జెండర్, వయస్సు, ఎత్తు, జీవనశైలిని బట్టి మారుతుంది. ఆహారంలో..క్యాల్షియం రోజుకు 1గ్రా, ఫైబర్ రోజుకు 40 గ్రా,–మెగ్నీషియం రోజుకు 410 మిగ్రా, విటమిన్ ఇ రోజుకు 15 మిగ్రా. విటమిన్ సి రోజుకు 75–90 మిగ్రా, విటమిన్ ఎ రోజుకు 600–900 గ్రా, విటమిన్ డి రోజుకు 600 ఐయూ, పొటాషియం రోజుకు 4.7 గ్రా,ప్రొటీన్ రోజుకు 46–56 గ్రా. ఐరన్ రోజుకు 15– 18 గ్రాల వరకూ కావాలి. జాతీయ పరిశోధనా సంస్థ ఐసీఎమ్ఆర్న్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్) సూచనల ప్రకారం..ప్రతి రోజూ తీసుకునే ఆహరంలో ధాన్యాలు–చిరు ధాన్యాలు 250 గ్రా, పప్పులు 85 గ్రా, పాలు–పెరుగు 300గ్రా, కూరగాయలు–ఆకుకూరలు 400 గ్రా, పండ్లు 100 గ్రా, నూనెగింజలు 35 గ్రా, కొవ్వులు–నూనెలు 27 గ్రా ఉండాలి. మెదడుకు మేత కావాలి... విజా్ఞనమే కాకుండా మానసిక స్పందనలపై పుస్తక పఠనం అత్యంత ప్రభావం చూపించేది. రోజుకు 30 నిమిషాల పుస్తక పఠనం లేదా పజిల్స్ సాల్వేషన్ మెదడును యాక్టివ్‌గా ఉంచుతుంది. హైసూ్కల్, కాలేజ్ విద్యార్థులకు రోజుకు 2–3 గంటల చదువు సరిపోతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విరామం లేకుండా ఏకధాటిగా చదవడం ఒత్తిడిని పెంచుతుంది. ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారి విషయంలో పఠన సమయం వేరుగా ఉంటుంది.ప్రాణవాయువు ప్రాముఖ్యత... మనిషి రోజుకు 550 లీటర్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవాలి. పీల్చే గాలిలో 15 శాతం ఆక్సిజన్ ఉంటుంది. కాలుష్యరహిత పరిసరాల్లో రోజూ కొంత సమయం గడపడం ద్వారా తగినంత ఆక్సిజన్ పొందవచ్చు. నవ్వు...కరిగే కొవ్వు... ఓ అధ్యయనం ప్రకారం రోజుకు 10 నుంచి 15 నిమిషాలు నవ్వడం వల్ల దాదాపు 40 కేలరీలు బర్న్ అవుతాయి. నవ్వు తర్వాత 45 నిమిషాల వరకూ కండరాలు రిలాక్స్‌గా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం, ఒత్తిడి హార్మోన్లను తగ్గించడం, సహజమైన ఎండార్ఫిన్ విడుదల చేయడం, గుండెపోటు నివారణ తదితర విషయాల్లో మేలు చేస్తుంది. నవ్వడం వల్ల జీవిత కాలం పెరుగుతుందని నార్వే అధ్యయనం వెల్లడించింది. కప్పు కాఫీ... శరీరానికి కెఫిన్లు ప్రమాదకరమే అయినా రోజుకు 400 మిల్లీగ్రాముల వరకూ సురక్షితమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇది దాదాపు నాలుగు కప్పుల బ్రూ కాఫీ, 10 క్యాన్ల కోలా, రెండు ఎనర్జీ షాట్ డ్రింక్స్‌లతో లభిస్తుంది. ఈ కెఫిన్ మొదడు, నరాల పనితీరును మెరుగు పరుస్తుంది. అయితే ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్ కంటెంట్‌లో చాలా తేడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది రొ‘టీ’న్... రోజుకు సగటున 3 నుంచి 5 కప్పుల చాయ్ ఆరోగ్యకరమే. సాధారణ టీలో ఉండే సమ్మేళనాలకు శరీరం ప్రతిస్పందించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అలాగే క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడం, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. తాగు...ఆగు... రోజుకు 15–30 మి.లీ మించి ఆల్కహాల్ ప్రమాదకరం. బీర్, వైన్, జిన్, విస్కీ వంటి ఆల్కహాల్స్‌లో ఏదో ఒకటి మాత్రమే సేవించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఆల్కహాల్ పరిమాణాల్లో తేడాలుంటాయి. మహిళలకు రోజుకు ఒక పానీయం, పురుషులకు రోజుకు రెండు పానీయాల పరిమితి మించకూడదు. వేడి...రెడీ... శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం మానవ శరీరం 36 నుంచి 37.5 సె.. వరకూ వేడిని తట్టుకుంటుంది. ఇది 40సె మించితే ప్రమాదకరం. అతి వేడి డీహైడ్రేషన్‌తో పాటు ప్రాణాపాయ స్థితికి చేరుకునే అవకాశముంది. అలాగే 21 సె.డిగ్రీల వరకూ చల్లదనాన్ని తట్టుకుంటుంది. సిట్...రైట్ రోజులో 4 గంటల కన్నా మించి కూర్చుంటే ఆరోగ్య సమస్యలు ప్రారంభమై, ఇది 8 గంటలకు చేరితే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని జస్ట్ స్టాండ్ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఉద్యోగ రీత్యా 8 నుంచి 11 గంటల వరకూ కదలకుండా కూర్చోడం వల్ల ఒబెసిటీ సహా అనేక అనారోగ్యాలు దాడి చేస్తున్నాయి.నిద్రే ఆరోగ్యం... అనేక రకాల శారీరక, మానసిక రుగ్మతలకు నిద్రలేమే ప్రధాన కారణమని పలు అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడించాయి. నిద్ర అలవాట్లు, పర్యవసానాల పై మ్యాట్రెస్ మేకర్ వేక్‌ఫిట్ నిర్వహించిన సర్వేలో భాగంగా నగరంలో 56 శాతం మంది వారి పని వేళల్లో నిద్ర మత్తుతో అవస్థలు పడుతున్నారని తేల్చంది. అంతేకాకుండా నిద్ర లేవగానే రిఫ్రెష్ ఫీలింగ్ అనిపించట్లేదని నగరవాసులు పేర్కొన్నారు. ‘ది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్కార్డ్ఙ్గా పిలువబడే ఈ సర్వేలో నగరంలో దాదాపు 33 శాతం మంది తమ నిద్రలేమికి కేవలం అర్థరాత్రి వరకూ డిజిటల్ స్క్రీల్లు తిలకించడమే కారణమని తద్వారా 32 శాతం మంది ఉద్యోగాలకు ఆలస్యంగా వెళ్తున్నారని తేల్చారు. ఆరోగ్యకర జీవనానికి రోజూ 7–8 గంటల నిద్ర అవసరం. అయితే వయస్సులను బట్టి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. 4 నుంచి 12 నెలల చిన్నారులకు 12 నుంచి 16 గంటల పాటు, 1–2 ఏళ్లు... 11–14 గంటలు, 3–5 ఏళ్లు 10–13 గంటలు, 6–12 ఏళ్లు... 9–12 గంటల నిద్ర 13–18 ఏళ్లు.. 8–10 గంటలు... ఆపై వయసు వారికి 7–8గంటలు, పీరియడ్స్‌లో ఉన్న ఆడవారికి కనీసం 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. తాగునీరు...ఇదే తీరు... మనిషి మనుగడకు ప్రామాణికం నీరు. శరీరంలో దాదాపు 60 శాతం నీరే ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనానికి ప్రతీరోజు పురుషులు రోజూ 3.7 లీటర్లు, మహిళలు 2.7 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణుల సూచన. ఉష్ణోగ్రత, ఆరోగ్య పరిస్థితులను బట్టి హెచ్చుతగ్గులు అవసరం. సరైన మోతాదులో శరీరానికి నీరు అందకపోవడం రోగకారకంగా మారుతుంది. కేలరీలు కరగాలి...రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం శరీరాన్ని చురుగ్గా మార్చుతుంది. ఇందులో భాగంగా జిమ్, ఏరోబిక్, జుంబా వంటివి ఇందుకు ఉపకరిస్తాయి. వారంలో కనీసం..150 నిమిషాలు(రోజుకి 20 ని.) వ్యాయామం చేయాలని హెల్త్ అండ్ హ్యూమన్ సరీ్వసెస్ గైడ్‌లై ప్రకటించిది. యోగా 20 నిమిషాలు. ధ్యానం 5 నుంచి 20 నిమిషాలు చేయడం మంచి ఫలితాలను అందిస్తుంది. ఇక ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక ఆరోగ్యకరం. సాధారణంగా రోజుకు 10,000 అడుగులు వేయాలని సీడీసీ (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) సైతం సిఫార్సు చేసింది. ఈత 30 నిమిషాలు, ఆటలైతే 30 నిమిషాల పాటు, సైక్లింగ్ రోజుకు 30 నిమిషాలు సరిపోతుంది. 30 నిమిషాలకు మించి సైకిల్ తొక్కే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం 40 శాతం తక్కువని ఫిన్లాండ్ పరిశోధనలో తేలింది. బీ అలర్ట్ సిటీజన్నిద్ర లేచింది మొదలు... ఏమేం పనులు చేయాలి? ఏ టైమ్‌కి ఎక్కడ ఉండాలి? ఎవర్ని కలవాలి? తదితర పనుల జాబితాను ముందు రోజే సిద్ధం చేసుకునే అలవాటుందా? ఈ ప్రశ్నకు చాలా మంది సిటిజనుల నుంచి అవును అనే సమాధానం వస్తుంది. మరి అదే విధంగా రోజూ ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఎన్ని గంటలు నిద్రపోవాలి? ఎన్ని కేలరీల ఆహారం తీసుకోవాలి? ఎన్ని కేలరీలు ఖర్చు చేయాలి? ఎన్ని గంటలు మొబైల్ చూడాలి?.. వగైరా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? అని ప్రశి్నస్తే మాత్రం అవును అని బదులిచ్చేవారు అరుదే. ‘స్మార్ట్’గా వాడాలి... మొబైల్, ల్యాప్‌టాప్ వంటి స్క్రీన్ లను రోజులో 2 గంటల కన్నా ఎక్కువ సమయం చూడటం హానికరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన సూచనల ప్రకారం..సంవత్సరం కంటే తక్కువ వయస్సున్న పిల్లలు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండాలి. ఐదేళ్లలోపు చిన్నారులు గంటకు మించి ఫోన్ వాడకూడదు. 10 మిలియన్ల రంగులను వేరు చేయగల శక్తి గల మనిషి కన్నుకు ఫోన్ హానికరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉప్పు.. ఎక్కువైతే ముప్పు... శరీర క్రియల కోసం ప్రతిరోజూ 500మి.గ్రా సోడియం (ఉప్పు) అవసరం. ఇది నరాలను ప్రేరేపించడంతో పాటు కండర సంకోచానికీ సహాయం చేస్తుంది. ముఖ్యంగా దేహంలోని నీరు–ఖనిజాల సమతుల్యతను కాపాడుతుంది. అతిగా వాడితే బ్లెడ్ ప్రెజర్, గుండె సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్యానికి...‘పండు’గ రోజువారీ ఆహారంలో 25 నుంచి 30 శాతం పండ్లు ఉండాలనేది ఆరోగ్య నిపుణుల మాట. ద్రవ రూపంలో తీసుకోవాలనుకుంటే... రోజూ 150 మి.లీ లోపు పండ్ల రసాలు తీసుకోవాలి. అతిగా పండ్ల రసాలు సేవించడం వల్ల శరీరంలో గ్లూకోజ్, చక్కెర స్థాయిలు పెరిగే అవకాశముంది. -
మిర్యాలగూడ: కునుకు తీస్తూ కమిషనర్ ఇలా..
సాక్షి, నల్గొండ జిల్లా: ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విధులు నిర్వహించాల్సిన వారు పట్టపగలే కార్యాలయంలో కుర్చీలో కునుకు తీస్తున్నారు.తాజాగా, పని వేళల్లో దర్జాగా ఆఫీసులో నిద్రపోతున్న మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ యూసఫ్ అలీ తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. టేబుల్‌పై కాళ్లేసి మరీ కమిషనర్ గాఢ నిద్రలోకి జారుకున్నారు. నిద్రపోతున్న కమిషనర్ ఫొటో వైరల్‌గా మారింది. కమిషనర్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. పనులను పక్కన పెట్టి కార్యాలయంలోనే కునుకు తీయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
నిద్రలేమి ముప్పు : హైదరాబాద్ న్యూరాలజిస్ట్ కీలక పోస్ట్ వైరల్
మానవ శరీరం సక్రమంగా పనిచేయాలంటే నిద్ర అవసరం. రోజువారీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నా, మరుసటి రోజుగా చురుగా పనులు చేసుకోవాలన్నా నిద్ర చాలా అవసరం.రనిద్ర తక్కువైతే ఎన్నో రోగాలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర లేమి కారణంగా ఏకాగ్రత లోపించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. తాజాగా హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ మరికొన్ని కీలక విషయాలను ప్రకటించారు. దీంతో ఆయన పోస్ట్ వైరల్‌గా మారింది.తగినంత నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే చాలా అధ్యయనాలు తేల్చాయి. రోజులో కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. అనేక అధ్యయనాలు నిద్ర లేమి వల్ల బరువు పెరగడం, ఆకలి లేకపోవడం, ఏకాగ్రత తగ్గడం, పనితీరులో మార్పు ,హార్మోన్ల లోపాలు వంటి అనేక రుగ్మతలకు దారి తీస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు , మానసిక రుగ్మతలు అలాగే కొన్ని సందర్భాల్లో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. కానీ పెద్దలలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర పోవడం లేదు. ఇది మానవ శరీరంపై, మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చాలా మంది న్యూరాలజిస్టులు, నిపుణులు నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలో డా. సుధీర్ కుమార్ కూడా మరో కీలక విషయాన్ని వెల్లడించారు.If you lose just one hour of sleep, it could take 4 days to recover from that. Sleep deprivation can cause various symptoms, such as headache, poor focus and attention, increased irritability, poor judgement, poor decision making and increased sleepiness. #sleep #HealthyHabits— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) May 21, 2024కేవలం ఒక గంట నిద్రకోల్పోతే కోలుకోవడానికి నాలుగు రోజులు పడుతుందని సుధీర్ కుమార్ పేర్కొన్నారు. నిద్రలేమితో తలనొప్పి, కంటి చూపులో లోపం, చికాకు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంలో సమస్యలొస్తాయని ఆయన తన ఎక్స్‌లో వెల్లడించారు. అధిక ఒత్తిడి ,పేలవమైన జీవనశైలి అలవాట్ల కారణంగా నిద్రలో సమస్యలొస్తాయని ఆయన వివరించారు. అంతేకాదు ఏ వయసులో ఎంత సమయం నిద్ర పోవాలి అనేది కూడా ఆయన స్పష్టం చేశారు.వయసుల వారీగా సగటు రోజువారీ నిద్ర, నవజాత శిశువులు (3 నెలల వరకు): 14 నుండి 17 గంటలు నిద్రపోవాలి. శిశువులు (4 నుండి 12 నెలల వయస్సు): 12 నుండి 16 గంటలు నిద్రపోవాలి.చిన్నపిల్లలు (1 నుండి అయిదేళ్ల వయస్సు): 10 నుండి 14 గంటల వరకు, పాఠశాల వయస్సులో ఉన్న పిల్లలు (6 -12 సంవత్సరాలు): 8 నుండి 10 గంటల నిద్ర.అలాగే రాత్రిపూట 7-9 గంటలు ఒకేసారి నిద్రపోవడం సరైనది, ఉత్తమమైంది. ఒక వేళ రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే అతను/ఆమె పగటిపూట నిద్రపోవడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవచ్చుఅని సుధీర్ కుమార్ తెలిపారు -
నిద్రను దూరం చేసేవి ఇవే! నివారించాలంటే..!
నగరజీవితం ప్రతి మారుమూల పల్లెల్నీ తాకాక, జీవితాల్లోకి సెల్‌ఫోన్ దూసుకువచ్చాక ప్రధానంగా మొన్న కరోనా అందరినీ తాకి వెళ్లాక నిద్రలేమి ఓ పెద్ద సమస్యగా మారింది. రాత్రి ఒంటిగంటా, రెండు వరకూ నిద్రపట్టకపోవడం మామూలేంది. వైద్యపరిభాషలో ‘ఇన్సామ్నియా డిజార్డర్’ అని పిలిచే ఈ సమస్య ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుంది. నిద్రను దూరం చేసే అంశాలేమిటో, నిద్రపట్టేదెలాగో తెలిపేదే ఈ కథనం. నిద్రలేమి సమస్య అందరిలో ఒకలా ఉండదు. కొందరికి రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపట్టవచ్చు. కొందరికి త్వరగా నిద్రపట్టినప్పటికీ, కాసేపటికే మెలకువ వచ్చి... ఇక ఆపైన ఎంత ప్రయత్నించినా నిద్రరాక΄ోవచ్చు. కొందరికి ఏ తెల్లవారుజామున మూడు, మూడున్నరకు మెలకువ వచ్చాక... మళ్లీ ఏ ఆరు, ఏడు గంటలప్పుడో నిద్ర రావడం, కానీ ఎలాగూ తెల్లవారి΄ోయింది కదాని బలవంతంగా నిద్రలేస్తే... రోజంతా డల్‌గానూ ఉండవచ్చు. ఇవన్నీ నిద్రలేమి సమస్యలే. నిద్రలేమి రెండు రకాలుగా ఉండవచ్చు. మొదటిది తాత్కాలిక నిద్రలేమి, రెండోది దీర్ఘకాలిక నిద్రలేమి. మొదటిది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అదే మూడువారాల కంటే ఎక్కువకాలంగా బాధిస్తుంటే దాన్ని క్రానిక్ ఇన్‌సామ్నియాగా చెప్పవచ్చు. కారణాలను బట్టి నిద్రలేమిలో మరో రెండు రకాలుంటాయి. అవి... ప్రైమరీ ఇన్సామ్నియా: నిర్దిష్టమైన ఎలాంటి కారణాలూ లేకుండా మామూలుగా నిద్రపట్టక పోవడాన్ని ‘ప్రైమరీ ఇన్సామ్నియా’ అంటారు. సెకండరీ ఇన్సామ్నియా: ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల వచ్చే నిద్రలేమిని ‘సెకండరీ ఇన్సామ్నియా’ అంటారు. అంటే మానసిక సమస్యలతో బాధపడుతుండటం లేదా గ్యాస్ వల్ల కలిగే ఛాతీలో మంట, ఆస్తమా, క్యాన్సర్ (కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌కు తీసుకునే చికిత్సల వల్ల కూడా); గుండెజబ్బులు, కీళ్లనొప్పులు లేదా దేహంలో మరెక్కడైనా తీవ్రమైన నొప్పి వల్ల నిద్రపట్టకపోవడం; కొన్ని సందర్భాల్లో మత్తుపదార్థాలను అధికంగాతీసుకున్నప్పుడూ నిద్రకు దూరం కావడం మామూలే. పట్టరాని సంతోషమూ లేదా భరించలేనంత దుఃఖం వల్ల కూడా నిద్రపట్టకపోవచ్చు. ఇలా వచ్చే నిద్రలేమిని ‘సెకండరీ ఇన్సామ్నియా’గా చెప్పవచ్చు. ఇన్సామ్నియాకు కారణాలు చిన్నతనంలో తీవ్రవేదనకు గురికావడం డిప్రెషన్, యాంగై్జటీ వంటి మానసిక సమస్యలు నిద్రమేల్కొని షిఫ్టుల్లో పనిచేయడం ∙వాతావరణ పరిస్థితులు (పెద్ద పెద్ద శబ్దాలు, తీక్షణమైన కాంతి, ఎక్కువ వేడి/చలి) జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు (ప్రియమైన వారి మరణం, అకస్మాత్తుగా ఉద్యోగం మారడం, విడాకుల వంటివి) కొన్నిరకాల మందులతో (ఉదా: అలర్జీ, ఆస్తమా, డిప్రెషన్, బీపీలకు వాడే కొన్ని మందులు).మేనేజ్మెంట్ / చికిత్స: తాత్కాలిక నిద్రలేమికి చికిత్స అవసరం లేదు. కాక΄ోతే వేళకు నిద్రపోవడం వంటి మంచి అలవాట్ల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. కానీ దీర్ఘకాలిక నిద్రలేమి ఉన్నప్పుడు ఏ కారణాల వల్ల ఇలా జరుగుతుందో చూడాలి. అంటే... మానసిక సమస్యల వల్లనా లేదా ఏవైనా శారీరక సమస్యలున్నాయా అని పరీక్షలు జర΄ాల్సిన అవసరముంటుంది. మానసిక సమస్యలతో ఇలా జరుగుతుంటే తగిన చికిత్స తీసుకోవాలి. ∙నిద్రమాత్రలు వాడటం ఒక చికిత్స. అయితే ఇవి తాత్కాలికంగానే వాడాలి. బాధితులు వాటికి అలవాటు పడే (అడిక్షన్‌కు) అవకాశం ఉంటుంది. అప్పుడు వాటిని వదిలించడానికి మరో చికిత్స చేయాల్సిరావచ్చు. అందుకే వాటిని దీర్ఘకాలం వాడటం సరికాదు. అందువల్ల జీవనశైలి మార్పులతో వేళకు నిద్ర΄ోయేలా చేసుకోవడం మంచిది. నిద్రలేమి నివారణ ఇలా... వేళకు నిద్ర΄ోవాలి. నిద్రకు అరగంట ముందర గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది ∙మధ్యాహ్నం నిద్ర ఓ పవర్న్యాప్లా అరగంట చాలు. ఒకవేళ మధ్యానం చాలాసేపు నిద్రపోతే అది రాత్రి నిద్రకు చేటుగా మారవచ్చు కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కాఫీతో తోపాటు కొన్ని కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి ∙సిగరెట్లలోని నికోటిన్‌తో కూడా నిద్రను దూరం చేస్తుంది.ఆల్కహాల్‌తో నిద్ర పట్టినప్పటికీ ఒక్కోసారి తెల్లవారుజామున మెలకువ వచ్చి మళ్లీ నిద్రపట్టక΄ోవడం, నిద్ర సమయం తగ్గి΄ోవడం మామూలే. అందుకే మద్యం అలవాటుకు దూరంగా ఉండాలి ∙వ్యాయామంతో అలసిపోతే బాగా నిద్రపడుతుంది. అయితే నిద్రపోవడానికి 4–5 గంటల ముందు వ్యాయామం చేయకూడదు. పడక గదిలో టీవీ ఎట్టిపరిస్థితుల్లో ఉండకూడదు తీవ్రమైన ఉద్విగ్నత, ఆందోళన నిద్రను దూరం చేసే అంశాలు. అందుకే మానసిక ప్రశాంతత అవసరం. ఇందుకోసం యోగా, ధ్యానం చాలావరకు ఉపయోగపడతాయి నిద్ర టైముకు అరగంట ముందర గోరువెచ్చని పాలు తాగాలి. అందులోని ట్రిప్టోఫాన్ అనే ఎసెన్షియల్ అమైనో యాసిడ్ మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. నిద్రమాత్ర కంటే ఇది చాలా ఆరోగ్యకరమైన అలవాటని గుర్తుంచుకోవాలి. డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జువ్వా, స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మనాలజిస్ట్ (చదవండి: మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ) -
అడవుల్లో ఆరని మంటలు.. చల్లార్చే పనిలో 30 గ్రామాల ప్రజలు!
ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో చెలరేగుతున్న మంటలు చల్లారడం లేదు. తాజాగా అల్మోరా జిల్లాలోని అడవిలో మంటలను ఆపేందుకు 30 గ్రామాల ప్రజలు నిరంతరం శ్రమిస్తున్నారు.7.5 హెక్టార్లలో విస్తరించి, జిల్లాకే మోడల్ ఫారెస్ట్‌గా పేరుగాంచిన శ్యాహీదేవి-శీతలఖేత్ అటవీప్రాంతాన్ని కాపాడటంతోపాటు తమ పొలాలు, గడ్డివాములను రక్షించుకునేందుకు ఆయా గ్రామాల్లోని ప్రజలంతా అటవీ ప్రాంతాన్ని చల్లార్చేపనిలో పడ్డారు. వీరు తమ తిండితిప్పలను కూడా అడవుల్లోనే కొనసాగిస్తున్నారు.2003 నుంచి శ్యాహీదేవి-శీతలఖేత్ అడవులను అభివృద్ధి చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఆరోగ్య శాఖకు చెందిన ఫార్మసిస్ట్ గజేంద్ర కుమార్ పాఠక్ ఆధ్వర్యంలో ‘సేవ్ జంగిల్’ పేరుతో 30 గ్రామాల ప్రజలు అటవీ శాఖ సహాయంతో ఓక్, బురాన్ష్, ఫాల్యంట్ తదితర జాతుల అడవులను అభివృద్ధి చేశారు.ప్రస్తుతం ఈ అడవుల్లో మంటలు చెలరేగుతుండటంతో గ్రామస్తులు పగలనక రాత్రనక మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. అడవిలో మంటలు తాడిఖేట్లోని సుదూర గ్రామానికి చేరుకున్నాయి. తమ ఇళ్లు, పొలాలు, గడ్డివాముల గురించి ఆందోళన చెందుతున్న గ్రామస్తులు అటవీ మంటలను చల్లాచ్చే పనిలో తలమునకలవుతున్నారు. గ్రామస్తులు తీవ్రంగా శ్రమించి గ్రామంలోకి మంటలు వ్యాపించకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. -
వింత గ్రామం: నిద్ర ముంచుకొచ్చిందా ఇక అంతే!.. ఏకంగా..
నిద్ర అనేది మని షి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అలా అతిగా నిద్రపోయినా ప్రమాదమే. దీని వల్ల ఆరోగ్యానికే కాదు, దైనందిన జీవితానికి ఆటంకంగానే ఉంటుంది. అలాంటి నిద్ర ఓ గ్రామంలోని ప్రజలకు శాపంగా మారింది. వారికి నిద్ర ఏదోమైకం కమ్మినట్లుగా ముంచుకొచ్చి ఎక్కడపడితే అక్కడే మత్తుగా నిద్రపోతారట. పైగా చాలా రోజుల వరకు లేవరట. ప్రయత్నించిన ప్రయోజనం ఉండదట. చెప్పాలంటే మన రామాయణ ఇతిహాసంలో ఉండే కుంభకర్ణుడి మాదిరి నిద్రపోతారు. ఆ వింత గ్రామం ఎక్కడుందంటే.. కజకిస్తాన్‌లో కలాచి అనే ఊరు ఉంది. అక్కడ ప్రజ ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా చాలా నెలల పాటు నిద్రపోతూనే ఉంటారు. ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తి దాదాపు నెల పాటు నిద్రపోతాడు. ఇలా నిద్ర పోయిన వ్యక్తి మళ్లీ నెల పాటు మేల్కోడట. అందుకే ఈ ఊరును "స్లీపీ హోల్" అని అంటారు. వారి దగ్గర బాంబు పేల్చిన కూడా నిద్రలేవరట. నిజానికి వాళ్లు నిద్రపోవాలని అనుకోరు. కానీ వారికి తెలియకుండానే వచ్చేస్తుంది. ఈ నిద్ర వల్ల ఆ ఊరి ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారట. కొన్ని సార్లు రోడ్డు మీద కూడా నిద్ర పోతారట. ఇలా ఎక్కడపడితే అక్కడే నిద్ర ముంచుకొస్తే గనుక ఏకంగా నెల రోజులు అక్కడే అలాగే పడుకుంటారట ఆ ఊరి ప్రజలు. ఈ కలాచి గ్రామంలో సుమారు 600 మంది ప్రజలు ఉన్నారు. ఇందులో 14 శాతం మంది ఇలాంటి సమస్యతోనే బాధ పడుతుండటం బాధకరం. అయితే 2010లో ఓ పాఠశాలలో జరిగిన సంఘటన వల్ల ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. కొందరు విద్యార్థులు క్లాసులోనే నిద్రపోయి ఎంతకీ నిద్రలేవలేదట. ఉపాధ్యాయులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో.. ఈ విషయం బయటకు పొక్కింది. అలా ఈ వ్యాధితో దాదాపు 14 శాతం మంది బాధపడుతున్నారని తెలిసింది. దీని గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ ఇది ఏదో వ్యాధి వల్లే ఇలా జరుగుతుందని భావించారట. అయితే ఆ వ్యాధి ఏంటన్నది కనిపెట్టలేకపోయారు. దీంతో ఈ విషయం ఓ అంతు చిక్కని మిస్టరీలా ఉండిపోయింది. మొత్తం మీత కలాచి గ్రామం ఓ వింత వ్యాధి వల్ల ఇలా ప్రజలు నెలల తరబడి నిద్రపోతున్నట్లు తెలుస్తోంది. (చదవండి: రిజర్వాయర్ని వేలానికి పెట్టడం గురించి విన్నారా?) -
SLIM: జాబిల్లిపై మళ్లీ నిద్రలోకి జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్
టోక్యో: చందమామ మీద రాత్రి వేళల్లో ఉండే అసాధారణ చలిని తట్టుకుని రెండు వారాల తర్వాత మేల్కొని చరిత్ర సృష్టించిన జపాన్ మూన్ ల్యాండర్ స్లిమ్(స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్) నిద్రలోకి జారకుంది. జపాన్ కాలమానం ప్రకారం శుక్రవారం(మార్చ్1)వ తేదీన ఉదయం మూడు గంటలకు స్లిమ్ నిద్రలోకి వెళ్లింది. ఈ విషయాన్ని జపాన్ ఎయిరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా) ఎక్స్(ట్విటర్)లో వెల్లడించింది. రెండు వారాల తర్వాత చంద్రుని మీద మళ్లీ సూర్యుడు ఉదయించాక స్లిమ్‌ను పనిచేయించడానికి ప్రయత్నిస్తామని జాక్సా తెలిపింది. అయితే జాబిల్లి మీద ఉన్న అసాధారణ ఉష్ణోగ్రతల మార్పుల వల్ల స్లిమ్ మళ్లీ పనిచేసేందుకు అవకాశాలు తక్కువేనని పేర్కొంది. స్లిమ్‌ను కచ్చితమైన ల్యాండింగ్ జోన్ టార్గెట్ టెక్నాలజీతో డిజైన్ చేసినందున దీనిని మూన్ స్నైపర్‌గా కూడా పిలిచారు. చంద్రునిపై ల్యాండర్లను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాల్లో భారత్ తర్వాత జపాన్ ఐదో దేశంగా చరిత్రకెక్కింది. కాగా, అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా, ప్రైవేట్ కంపెనీ ఐఎమ్ సంయుక్తంగా చంద్రునిపైకి పంపిన ఒడిస్సియస్ గురువారం(ఫిబ్రవరి 29) చంద్రుని నుంచి ఆఖరి చిత్రాన్ని పంపింది. పవర్ బ్యాంకుల్లోని ఇంధనం ఖాళీ అవడంతో ఒడిస్సియస్ ల్యాండ్ అయిన వారం రోజుల తర్వాత శాశ్వత నిద్రలోకి జారుకుంది. చంద్రుని మీద ఒక్క రాత్రి పూర్తవ్వాలంటే భూమి మీద రెండు వారాలు గడవాలి. 3/1午前3時過ぎ(日本標準時)にしおりクレータは日没を迎え、SLIMは再び休眠に入りました。厳しい温度サイクルを繰り返すことになるため故障確率は上がりますが、次回の日照(3月下旬)でもSLIMは再び運用を試行する予定です。#JAXA #SLIM #たのしむーん 2/29 23:00過ぎ 航法カメラによる周辺画像 pic.twitter.com/xutv56uSU9 — 小型月着陸実証機SLIM (@SLIM_JAXA) March 1, 2024 ఇదీ చదవండి.. టెక్సాస్‌లో విజృంభిస్తున్న కార్చిచ్చు.. భారీగా నష్టం -
30 సెకెన్లలో గాఢ నిద్రకు మూడు సూత్రాలు: ప్రధాని మోదీ!
ఏడవ ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు గాఢనిద్రకు గల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తనకున్న ఒక అలవాటును వివరిస్తూ, దాని కారణంగానే తాను ప్రతిరోజూ సులభంగా గాఢ నిద్రలోకి జారుకుంటానని తెలిపారు. తాను గాఢ నిద్రలోకి వెళ్లడానికి కేవలం 30 సెకన్లు మాత్రమే సరిపోతుందని ప్రధాని మోదీ తెలిపారు. మంచంపై పడుకున్నాక కేవలం 30 సెకన్లలో గాఢ నిద్రలోకి జారుకుంటానని, ఇది సంవత్సరంలో 365 రోజులూ జరుగుతుందని మోదీ పేర్కొన్నారు. ‘పరీక్షా పే చర్చా’లో విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోదీ.. తాను పనిచేసే సమయంలోనే పనిచేస్తానని, నిద్రపోయే సమయంలో మాత్రమే నిద్రపోతానని అన్నారు. మేల్కొన్నప్పుడు పూర్తి మెలకువలో ఉంటానని, నిద్రించేటప్పుడు పూర్తి నిద్రలో ఉంటానని పేర్కొన్నారు. ఇదే ప్రధాని మొదటి గాఢ నిద్రా రహస్యం. ఇక ప్రధాని మోదీకి అలవాటైన రెండో గాఢ నిద్రా రహస్యం సమతుల ఆహారం. వయసును బట్టి సమతులాహారం తీసుకోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది కూడా గాఢ నిద్రకు సహాయ పడుతుందన్నారు. గాఢ నిద్రకు ప్రధాని మోదీ చెప్పిన మూడవ కీలక సూత్రం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. కుస్తీ తరహాలోని వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదని, తేలికపాటి వ్యాయామాలు కూడా గాఢ నిద్రకు సహాయపడతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గాఢ నిద్రతోనే మనిషికి సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందన్నారు. విద్యార్థుల విజయానికి ప్రధాని సూచనలు ఒత్తిడి మీపై ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోండి. జీవితంలో పోటీతత్వం ఉండటం చాలా ముఖ్యం. తల్లిదండ్రులను తక్కువ చేసి చూడకూడదు. మంచి విద్యార్థులతో స్నేహం చేయండి. వారిపై అసూయ పెంచుకోవద్దు. ఉపాధ్యాయుని పని కేవలం ఉద్యోగం చేయడం మాత్రమే కాదు. జీవితాలను మెరుగుపరచడం. పరీక్షకు ముందు విద్యార్థులు తగిన శ్రద్ధ వహించాలి. అప్పుడు పరీక్ష సులువవుతుంది. రాసే అభ్యాసం కూడా విద్యార్థులకు చాలా ముఖ్యం. మొబైల్‌కు ఛార్జింగ్ ఎంత ముఖ్యమో, శారీరక ఆరోగ్యానికి క్రీడలు కూడా అంతే ముఖ్యం. -
తొలి రోజు రాములోరి నిద్ర 15 నిముషాలే!
అయోధ్య నగరి త్రేతాయుగాన్ని తలపిస్తోంది. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు రాజభవనంలో ఆశీనులు కాగా, లక్షలాది మంది రామభక్తులు ఆయన దర్శనం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో ఎక్కడ చూసినా కాషాయ వస్త్రాలు, కాషాయ జెండాలు కనిపిస్తున్నాయి. అంతటా జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయి. బాలరాముడు అద్భుతమైన భవనంలో కూర్చుని, భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. తొలిరోజు రామ్‌లల్లా దినచర్య ఎలా గడిచిందంటే.. నూతన రామాలయంలో శ్రీరాముడు ఐదేళ్ల చిన్నారి రూపంలో కొలువయ్యాడు. రామనంది సంప్రదాయం ప్రకారం బాలరామునికి సేవలు, పూజలు జరుగుతున్నాయి. రోజంతా బాలరామునికి ఐదు హారతులు అందిస్తున్నారు. అలాగే నైవేద్యాలు సమర్పిస్తున్నారు. తొలిరోజు రామ్‌లల్లా రెండు గంటలపాటు కూడా గంటలు నిద్రపోలేదు. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులకు నిరంతరం దర్శనం ఇస్తూనే ఉన్నాడు. కేవలం 15 నిముషాలు మాత్రమే రామ్‌లల్లా నిదురించాడు. అనంతరం దర్శన ద్వారాలు తెరుచుకున్నాయి. రామమందిరం ప్రధాన పూజారి ఆచార్ సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ ‘రాముడు తన భవ్యమైన భవనంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. త్రేతాయుగం మళ్లీ ప్రారంభమైనట్లుంది. ఐదేళ్ల రూపంలోని బాలరాముని విగ్రహం చూడగానే ఉప్పొంగిపోయాను. తొలిరోజు బాలరాముడు రెండు గంటలపాటు నిద్రించాల్సి ఉండగా, భక్తుల రద్దీ దృష్ట్యా కేవలం 15 నిమిషాల తర్వాత ఆలయ తలుపులు తెరవాల్సి వచ్చింది. లక్షలాది మంది రామభక్తులు నిరంతరం బాలరాముని సందర్శించుకుంటున్నారు’ అని అన్నారు.