
భోపాల్: దేశంలో ఇటీవలి కాలంలో ‘రిలేషన్‌షిప్’ ఉంటున్న కొందరు క్షణికావేశంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇటువంటి దారుణ ఉదంతం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వెలుగు చూసింది. స్థానిక గాయత్రి నగర్‌లో రితికా సేన్(29) తన లివ్ ఇన్ పార్ట్‌నర్ సచిన్ రాజ్‌పుత్(32) చేతిలో దారుణ హత్యకు గురయ్యింది.
రితికా సేన్‌ను గొంతుకోసి, హత్యచేసిన తరువాత సచిన్ ఆమె మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, రెండు రోజుల పాటు ఆ మృతదేహం పక్కనే పడుకున్నాడు. జూన్ 27 రాత్రి వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, అది రితకా హత్యకు దారితీసింది. ఉద్యోగం లేకుండా అల్లరిచిల్లరిగా తిరుగుతున్న రాజ్‌పుత్ తన భాగస్వామి రితికా సేన్‌పై ఎప్పుడూ అసూయ పడేవాడు. ఆమె పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీ యజమానితో ఆమెకు సంబంధం ఉందని అనుమానించేవాడు. ఈ నేపధ్యంలోనే ఆమెను హత్య చేశాడు.
తరువాత ఆమె మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి, మంచం మీద పెట్టి, రెండు రోజుల పాటు అదే గదిలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మద్యం మత్తులో సచిన్ రాజ్‌పుత్ తన స్నేహితుడు అనుజ్‌తో తాను రితికా సేన్‌ను హత్య చేసినట్లు తెలిపాడు. దీంతో అనుజ్ పోలీసులకు ఫోన్ చేసి, విషయమంతా చెప్పాడు. వెంటనే బజారియా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రితికా సేన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టంనకు తరలించారు.
పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ శిల్పా కౌరవ్ మీడియాతో మాట్లాడుతూ మృతురాలు రితికా సేన్ తన ప్రియుడు సచిన్ రాజ్‌పుత్‌తో పాటు రెండున్నరేళ్లుగా సహజీవనం చేస్తున్నదన్నారు. సచిన్‌కు అప్పటికే వివాహం అయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. జూన్ 27న రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగి, అది రితికా హత్యకు దారితీసిందన్నారు. సింజోర్‌కు చెందిన సచిన్.. రితికతో పాటు తొమ్మిది నెలల క్రితం గాయత్రి నగర్‌కు వచ్చి ఉంటున్నాడు. రితిక ఉద్యోగం చేస్తుండగా, సచిన్ ఆమె జీతంపై ఆధారపడేవాడు. నిందితుడు సచిన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: దూరం పెట్టిందని.. నర్సింగ్ విద్యార్థినిపై ఘాతుకం