
మా పక్కింటాయన నేను నిద్రలేచే సమయానికి చక్కగా స్నానం ముగించుకొని మరికొన్ని పనులు కూడా చేసి ఆనాటి పనికి సిద్ధంగా ఉంటాడు. అసలు మొదటి నుంచి త్వరగా నిద్రకు ఉపక్రమించి, పొద్దున్నే త్వరగా లేచే వాళ్ళు, ఆరోగ్యంగానూ, ఆనందంగానూ ఉంటారని చెబుతారు. అయితే అందరికి ఆ రకంగా ఉండడం వీలు కాదు. కొంతమంది రాత్రి చాలాసేపు వరకు పని చేసి, ఉదయాన కొంచెం నెమ్మదిగా నిద్ర లేస్తారు. ఈ రకం తేడాలను పరిశోధకులు ‘క్రోనోటైప్’ అని గుర్తిస్తుంటారు. వారు మాత్రం త్వరగా నిద్రలేచేవారు గొప్పవారు, మిగతావారు కారు అన్న విషయాన్ని అంత సులభంగా అంగీకరించరు.
అన్నిటికన్నా ముందు గుర్తించవలసిన విషయం మరొకటి ఉంది. కనీసం 60 శాతం మంది అటు రాత్రి పని చెయ్యరు, ఇటు ఉదయాన త్వరగా లేవరు. వాళ్ళ పద్ధతి రెండు పద్ధతుల కలగలుపుగా ఉంటుంది. క్రోనోటైప్స్ అన్నది కేవలం నిద్రకు ఉపక్రమించడం, ఉదయాన నిద్ర లేవడం అన్న లక్షణాల మీదనే ఆధారపడి లేదు అంటున్నారు పరిశోధ కులు. ఇంగ్లీష్‌లో రాత్రి పనిచేసే వాళ్లను గుడ్లగూబలు, త్వరగా నిద్రలేచే వాళ్ళను భరత పక్షులు అంటారు. ఈ తేడాలకు రకరకాల కారణాలు ఉంటాయి. కొన్ని ఉద్యోగాలలో రాత్రి పని చేయవలసి వస్తుంది. కొంత మందికి అవసరం ఉండదు.
పరిశోధకులు చెబుతున్న ప్రకారం సాధారణంగా ఆడవాళ్ళు రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉంటారు. మగవాళ్లు ఎక్కువగా ఉదయాన త్వరగా లేస్తారు అనే అర్థం అవుతున్నది. ఈ తేడాలకు మరొక కారణంగా వయసు కూడా ఉంది. కుర్రవాళ్లు గబ్బిలాలుగా రాత్రి ఎక్కువ సేపు మేల్కొంటారట. వయసు పెరుగుతున్న కొద్దీ, త్వరగా పడుకుని త్వరగా లేవడం అలవాటు అవుతుందట. ఇంతకు నిద్ర, మెలకువల కారణంగా ఆనందంగా బతకడం గురించి చాలా పరి శోధనలు జరిగాయి. ఉదయాన త్వరగా లేచేవారు దినమంతా హుషారుగా, సాధార ణంగా ఆనందంగా ఉంటారు. టర్కీలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనలో త్వరగా నిద్ర లేచే వాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉన్నట్టు తేలింది. విద్యార్థులు త్వరగా నిద్ర లేస్తే పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తున్నారు అని కూడా తెలిసింది.
విద్యార్థులలో 26.6 శాతం మంది గబ్బిలాలు (అంటే రాత్రి ఎక్కువ సేపు మెలకువగా ఉంటారు). అటువంటి వారికి ఆనందం తక్కువగా ఉందట. భరత పక్షులు అనిపించుకున్న పిల్లలు చురు కుగా ఉన్నారట. ఈ మధ్య ఒక జర్మన్ యూని వర్సిటీ పరిశోధనలో త్వరగా నిద్రలేచే వాళ్ళకు జీవితాలలో మంచి సంతృప్తి ఉంటుంది అని తెలిసింది. ఇక రాత్రి ఎక్కువ కాలం మెలకువ ఉండేవారిలో డిప్రెషన్, కాలానుగుణంగా మరికొన్ని మానసిక సమస్యలు, మత్తు పదార్థాల వాడకం వంటి సమస్యలు కనిపించాయి. విషయం అను కున్నంత సజావుగా లేదు. రాత్రి ఎక్కువ కాలం మెలకువగా ఉన్న వాళ్లు, అసలు తక్కువ కాలం నిద్రపోతున్నట్టు తెలుస్తున్నది. త్వరగా నిద్రలేవడం కన్నా నిద్ర సమయం ఎక్కువ సమస్యగా ఉంటున్నది. త్వరగా నిద్రలేచే వారికీ తమ మీద తమకు మంచి నియంత్రణ ఉన్నట్టు కూడా కనిపించింది.
ఇంతకు నిద్రలో ఈ తేడాలు అసలు ఏ కారణంగా మొదలవు తాయి? సహజంగా ఉన్న ఈ పరిస్థితిని ప్రయత్నించి మార్చడానికి వీలు కుదురుతుందా అన్నది మరో ప్రశ్న. ఈ అంశం గురించి వార్విక్ విశ్వవిద్యాలయంలో వివరంగా పరిశోధనలు జరిగాయి. అక్కడ తమను తాము చక్కని క్రమశిక్షణతో నియంత్రించుకోగల వారు త్వరగా పడుకొని త్వరగా నిద్రలేస్తారు అని గమనించారు. అసలు వ్యక్తిత్వంలో స్వయం నియంత్రణ, చక్కని క్రమపద్ధతి, ఆశాభావం ఉంటే నిద్ర వారి నియంత్రణలో ఉంటుంది అని గమనించారు. ఇక సులభంగా మనసును బయటపెట్టి గలగలా మాట్లాడే వారు, రహస్యాలు దాచుకోకుండా ఉండేవారు రాత్రి ఎక్కువ కాలం మెలకువగా ఉంటున్నారని గమనించారు. జన్యుపరంగా వ్యక్తిత్వ లక్షణాలు వచ్చేవారు, దాని ఆధారంగా నిద్ర విషయంగా కూడా తేడాలు కనబరుస్తారని తెలిసింది.
అన్నిటికీ మించి మరొక్క విషయం గుర్తించాలి. క్రోనోటైప్స్ అంటే గుడ్లగూబలు (రాత్రి పని చేసేవారు), భరత పక్షులు (త్వరగా నిద్రలేచే వారు) అన్న లక్షణాలు, శిలాక్షరాలుగా గట్టిగా నిలిచి ఉండవు అంటున్నారు. ఈ పరిస్థితి జన్యుపరంగా కాక మరెన్నో లక్షణాల కారణంగా స్థిరమవుతుంది. కేవలం జన్యు కారణాల వల్లనే కాక నిద్ర తీరు మీద మరెన్నో ప్రభావాలు ఉన్నాయి. కనుక ఈ లక్షణాలు కొంత ప్రయత్నిస్తే మారే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు పరిశోధకులు.
త్వరగా నిద్ర లేవదలుచుకున్నవారు, రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు, ఫోన్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో ఎక్కువగా పని చేయకుండా ఉండటం మంచిది అంటున్నారు. ఉదయాన త్వరగా నిద్ర లేచినందుకు చక్కని బహుమతి కూడా ఉండేట్లు ఏర్పాటు చేసుకోవాలని వారి సలహా. నిద్ర లేవగానే హాయిగా వేడి వేడి కాఫీ తాగడం కూడా అటువంటి బహుమతులలో ఒకటి కావచ్చు. లేదంటే త్వరగా లేచినందుకు హాయిగా వాకింగ్‌కు వెళ్లి రావచ్చు.
వార్సా యూనివర్సిటీలో ఈ అంశం గురించి మరికొన్ని పరిశోధనలు జరిగాయి. రుతువుల ప్రకారం కూడా నిద్రపోయే విషయంలో మార్పులు వస్తాయి అని అక్కడ గమనించారు. దినమంతా చురుకుగా పని చేయాలి, బ్రతుకులో మంచి గమ్యాలు ఉండాలి. అప్పుడు సమయానికి నిద్ర వస్తుంది. కావాలనుకున్నప్పుడు మెలకువ కూడా వస్తుంది. అది చివరగా అర్థం చేసుకోవాల్సిన సూత్రం.
వ్యాసకర్త సైన్స్ రచయిత
డా‘‘ కె. బి. గోపాలం
Comments
Please login to add a commentAdd a comment