
మాధవ్ శింగరాజు
‘‘రేపటితో నీ రిమాండ్ ముగుస్తుంది...’’ అన్నాడు నా లాయర్. ‘‘తర్వాత ఏం జరుగుతుంది?’’ అని నేను నా లాయర్‌ని అడగలేదు.
నా తరఫున వాదించటానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన లాయర్ అతడు. ‘ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ’ నుంచి వచ్చాడు. గవర్నమెంట్ డబ్బులిచ్చి నడిపిస్తున్న లీగల్ అథారిటీ నుంచి, గవర్నమెంటే ఏర్పాటు చేస్తే నా కోసం వచ్చిన లాయర్‌ను నేను అడిగేది ఏముంటుంది? అతని పేరేమో పీయూష్ సచ్‌దేవ!
‘ఏమైనా తిన్నావా?’ అంటాడు!
‘ఏమైనా అన్నారా?’ అంటాడు!
‘ఆరోగ్యం ఎలా ఉంది?’ అంటాడు.
‘ఇక ఉండేదా మరి?!’ అంటాడు.
ఈ నాలుగే... రోజు మార్చి రోజు అతడు నన్ను అడిగే ప్రశ్నలు. ఊరికే వస్తుంటాడు, పోతుంటాడు. ‘ధైర్యంగా ఉండు, న్యాయం గెలుస్తుంది..’ అంటాడు! నేనడిగానా ‘నాక్కాస్త ధైర్యమివ్వు’ అని, నేనడిగానా ‘న్యాయాన్ని గెలిపించు’ అని!!
ఒకరోజు వచ్చాడు. ‘‘నువ్వు మందులేమీ వేసుకోవటం లేదనీ, కనుక నువ్వు చెప్పుకుం టున్నట్లుగా నీకు 33 అనారోగ్యాలేమీ లేవనీ, అందుచేత నీ ఇంటరాగేషన్ టైమ్‌ను తగ్గించే అవసరం లేదనీ వాళ్లు వాదించబోతున్నట్లు తెలిసింది...’’ అన్నాడు!
‘‘నువ్వూ, వాళ్లూ నా గురించి ఏదైనా వాదించుకోండి. అది నాకు సంబంధం లేని విషయం. నాకైతే ఒక ఖురాన్, ఒక పెన్ను, కొన్ని తెల్ల కాగితాలు తెప్పించు...’’ అన్నాను.
తెప్పించాక, ‘‘ఇవన్నీ ఎందుకు?!’’ అని అడిగాడు.
‘‘పవిత్ర ఖురాన్ గ్రంథం నా డాక్టర్. ఆ డాక్టర్ నాకు ప్రిస్క్రిప్షన్ రాయటానికి ఈ పెన్ను, ఈ తెల్ల కాగితాలు. ప్రవక్త సూక్తులే నేను వేసుకునే మందులు...’’ అని చెప్పాను.
తర్వాతి విజిట్‌లో ... ‘‘నా కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడించగలవా?!’’ అని అడిగాను.
‘‘కష్టం కావచ్చు’’ అన్నాడు.
‘‘ఎందుకు కష్టం కావచ్చు?!’ అన్నాను.
‘‘మీ ‘కుటుంబ సభ్యులు’ ఒకరు పాకిస్తాన్ లో 78 ఏళ్ల కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. ఇంకొకరు లాహోర్, రావల్పిండి వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ వారు జైల్లో ఉన్నారని పాకిస్తాన్ అంటోంది కనుక జైల్లోంచి మాట్లాడటం కుదరదు. మీ మిగతా కుటుంబ సభ్యులు పాకిస్తాన్‌లోని కోట్ లఖ్పట్ జైల్లో వెంటిలేటర్ మీద ఒకరు, అమెరికా జైల్లో ఒకరు, ముంబై ఆర్థర్ రోడ్ జైల్లో ఒకరు ఉన్నారు. కాబట్టి వారందరితో ఫోన్‌లో మాట్లాడించటం కష్టం’’ అన్నాడు నా లాయర్!
నా చేతిలో కనుక ఒక గన్ ఉండి ఉంటే అక్కడికక్కడ... అది ఎన్.ఐ.ఎ జైలు అని, నేను పోలీస్ రిమాండ్‌లో ఉన్నానని కూడా చూడ కుండా రూఫ్ టాప్ మీదకు బులెట్‌ని పేల్చి అతడి భయాన్ని కళ్లజూసేవాడిని!
‘‘నేను మాట్లాడతానంటున్నది నా కుటుంబ సభ్యులతో మిలార్డ్...’’ అన్నాను నా లాయర్‌తో, కోపంగా.
‘‘కానీ అవతలి వైపు వాళ్లు ఇలాగే వాదిస్తారు మిస్టర్ తహవ్వూర్. అయినా మన ప్రయత్నం మనం చేద్దాం...’’ అన్నాడు.
రెండు రోజుల తర్వాత వచ్చి – ‘‘మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి జడ్జి గారు ‘నాట్ అలౌడ్’ అనేశారు...’’ అని చెప్పాడు.
అతడు అటు వెళ్లగానే, ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ వచ్చి కూర్చున్నాడు. ‘‘నువ్వు 26ని వదిలి పెట్టటం లేదా? లేక 26 నిన్ను వదిలిపెట్టటం లేదా?’’ లేక... నువ్వూ, 26 కలిపి ఈ దేశాన్ని వదిలిపెట్టటం లేదా?’’ అన్నాడు!
నాకర్థమైంది! నా రిమాండ్ రేపే ముగిసి, మళ్లీ రేపే మొదలు కాబోతోంది.
‘‘చెప్పు... మొన్న పహల్గామ్‌లో 26 మందిని చంపిన టెర్రర్ ఎటాక్ వెనుక నీతో పాటు ఎవరెవరు ఉన్నారు?’’ అని ఫ్రెష్‌గా ఇంటరాగేషన్ మొదలుపెట్టాడు ఎన్.ఐ.ఎ. ఆఫీసర్!!