
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగ్రహం
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిపై బీబీసీ కవరేజ్ పట్ల కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీబీసీది పక్షపాత రిపోర్టింగ్ అని విమర్శించింది. పాక్ జాతీయుల వీసాల రద్దుపై బీబీసీ రాసిన కథనంలో ఉగ్రదాడిని మిలిటెంట్ అటాక్‌గా పేర్కొనడంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది దేశం మనోభావాలను దెబ్బతీస్తుందని బీబీసీ ఇండియా హెడ్ జాకీ మార్టిన్‌కు విదేశాంగశాఖ లేఖ రాసింది.
బీబీసీ రిపోర్టింగ్‌ను విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తుందని లేఖలో పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దు వెంబడి తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే సందేశాలను నిరోధించడానికి 16 పాకిస్తాన్ యూట్యూబ్ చానళ్లను భారత్ నిషేధించింది. నిషేధానికి గురైన చానళ్లలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానల్ ఉండటం గమనార్హం.