
యశవంతపుర(కర్ణాటక): కొందరు పెడదారి పడుతూ పిల్లలను కూడా పాడు చేస్తున్నారు. తీసుకున్న అప్పును ఎగ్గొట్టడం కోసం ఏకంగా ఓ మహిళను హత్య చేసింది మరో మహిళ. ఇందుకు కొడుకు, కూతురు సహకారం కూడా తీసుకుంది. ఫలితంగా ముగ్గురూ కటకటాలు లెక్కిస్తున్నారు. ఈ దారుణం బెళగావి నగరంలో చోటుచేసుకుంది.
దృశ్యం తరహాలో
వివరాలు.. బెళగావి నగరంలోని లక్ష్మీనగరలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 21న రాత్రి అంజనా దడ్డీకర్ (49) అనే మహిళను గొంతు పిసికి హత్య చేశారు. మంగళసూత్రం, బంగారు నగలను కూడా హంతకులు ఎత్తుకెళ్లారు. అంజన కూతురు అక్షత ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన క్యాంప్ ఏరియా పోలీసులు జ్యోతి బాందేకర్, ఆమె కూతురు సుహాని (19), మైనర్ కొడుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. దృశ్యం సినిమాలో మాదిరిగా నిందితులు కుట్ర పన్నారు. హత్య జరిగిన రోజున తాము ఊళ్లోనే లేమని పోలీసులతో బుకాయించారు. అయితే ఫోన్ కాల్స్, సీసీ కెమెరా దృశ్యాలు, వేలిముద్రలతో నేరం బయటపడింది.
తలపై బాది..
అంజనా దడ్డీకర్, జ్యోతి స్నేహితులు. ఆమె నుంచి జ్యోతి రూ.15 వేలు అప్పు తీసుకుంది. డబ్బులు వాపస్ ఇవ్వాలని అంజనా అడుగుతోంది. డబ్బు ఇవ్వడం ఇష్టం లేని జ్యోతి, కూతురు హత్యకు కుట్ర పన్నారు.
కొడుకుతో కలిసి ఆ రోజు ఆమె ఫ్లాటుకు వెళ్లారు. ఆమెతో మాట్లాడుతూ తలపై బాది, గొంతు పిసికి చంపి మంగళసూత్రం, దొరికిన బంగారు నగలతో ఉడాయించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు బంగారు నగలు, బైక్, మొబైల్‌ఫోన్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.