Wife Assassinated Her Husband Extramarital Affair Woman At Vijayawada - Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. పట్టిచ్చిన సీసీ కెమెరా

Published Sat, Dec 11 2021 9:16 AM | Last Updated on Sun, Dec 12 2021 9:09 PM

Wife Assassinated Her Husband Extramarital Affair Woman At Vijayawada - Sakshi

రౌతు సత్య (ఫైల్‌)

కృష్ణలంక (విజయవాడ తూర్పు): వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. ఓ వివాహిత తన భర్తతో సహజీవనం చేస్తున్న మహిళ గొంతు కోసి, రోకలిబండతో తలపై మోది హత్య చేసింది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. సీఐ పి.సత్యానందం కథనం మేరకు.. రాణిగారితోటలోని కరెంట్‌ ఆఫీస్‌ రోడ్డులో రౌతు సత్య(35) తన భర్త, కుమార్తెతో నివసిస్తోంది. ఏడేళ్లుగా సత్య విజయవాడ నగర పాలక సంస్థలో స్వీపర్‌గా పనిచేస్తోంది.

ఆమె కుమార్తె సీవీఆర్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతూ అప్పుడప్పుడు క్యాటరింగ్‌ పనులకు వెళ్తుంటుంది. సత్య భర్తకు మద్యం, గుట్కా, ఖైనీ అలవాటు ఉండటంతో అప్పుడప్పుడు దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఏడాది క్రితం రాణిగారితోటకు చెందిన ముఠా పనిచేసే ఒరుసు ఆదినారాయణతో సత్యకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారం నేపథ్యంలోనూ సత్య, ఆమె భర్త మధ్యలో గొడవలు జరిగేవి. సత్య భర్త ఇంటిలో లేని సమయంలో ఆదినారాయణ ఆమె వద్దకు వచ్చి వెళ్తుండేవాడు.

ఈ విషయం ఆదినారాయణ భార్య మల్లేశ్వరికి తెలియడంతో ఆమె తరచూ సత్యతో గొడవపడి కొట్టేందుకు కూడా ప్రయత్నించేది. సుమారు 20 రోజుల క్రితం సత్య తీరు నచ్చక ఆమె భర్త గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మూడు రోజులకు ఆదినారాయణ సత్యతో ఇంటిని ఖాళీ చేయించి, లక్కీ బార్‌ పక్క వీధిలో మరో ఇంటిలోకి తల్లీకుమార్తెలను చేర్చాడు.

అప్పటి నుంచి ఆదినారాయణ నిత్యం ఆ ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మల్లేశ్వరి ఆగ్రహంతో సత్య వద్దకు వెళ్లి గొడవపడి, చంపేస్తానని బెదిరించింది. ఎలాగైనా సత్యను చంపాలని నిర్ణయించుకున్న మల్లేశ్వరి గురువారం రాత్రి సుమారు 8.30 నుంచి తొమ్మిది గంటల సమయంలో సత్య ఇంటికి వెళ్లింది. ఇద్దరి మధ్య కొంతసేపు ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తురాలైన మల్లేశ్వరి తనతో తెచ్చుకున్న బ్లేడుతో సత్య గొంతు కోసింది. తీవ్రంగా రక్తస్రావమై కిందపడిపోయిన సత్య తలపై పక్కనే ఉన్న రోకలిబండతో బలంగా మోదింది.

ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మల్లేశ్వరి తన వెంట తెచ్చుకున్న చాకు, బ్లేడ్‌ను తీసుకుని తలుపులు వేసి అక్కడ నుంచి వెళ్లిపోయింది. గురువారం మధ్యాహ్నం క్యాటరింగ్‌ పనికి వెళ్లిన సత్య కుమార్తె రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి తలుపులు తీసి చూడగా తల్లి రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో వేలి ముద్రలు సేకరించి రోకలి బండను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సత్య కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

పట్టిచ్చిన సీసీ కెమెరా  
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీఐ పి.సత్యానందం ఆధ్యర్యంలో సమీపంలోని సీసీ కెమెరా పుటేజీలు సేకరించారు. అందులో మల్లేశ్వరి సంచి తీసుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. డాగ్‌ స్క్వాడ్‌ కూడా ఘటనాస్థలం నుంచి మల్లేశ్వరి ఇంటి వద్దకు వెళ్లి ఆగింది. ఆమెను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

తన భర్తతో వివాహేతర సంబంధం వద్దని పలుమార్లు హెచ్చరించినా లెక్కచేయకపోవడంతో సత్యను హత్య చేశానని మల్లేశ్వరి అంగీకరించిందని పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన బ్లేడు, దానితో పాటు ఒక చాకు ఉన్న సంచిని సైడు కాలువలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో మద్యం సీసా, రెండు కాల్చిన సిగరెట్‌ ముక్కలు ఉండడాన్ని బట్టి హత్యలో మల్లేశ్వరితో పాటు ఇంకా ఎవరి ప్రమే యమైనా ఉండి ఉంటుందని స్థానికుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement