రషీద్‌ హత్యకేసులో అసలు దోషులేరీ..? | - | Sakshi
Sakshi News home page

రషీద్‌ హత్యకేసులో అసలు దోషులేరీ..?

Published Sat, Jul 27 2024 11:20 AM | Last Updated on Sat, Jul 27 2024 1:15 PM

రషీద్

కేసును నీరుగారుస్తున్న పోలీసులు 

ప్రభుత్వ ఒత్తిడితో రాజకీయ హత్యను వ్యక్తిగత కక్షగా మార్చేందుకు కుట్ర

ఎమ్మెల్యే జీవీ, మాజీ ఎమ్మెల్యే మక్కెన, షమీమ్‌, ఆయూబ్‌ల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చని పోలీసులు

హత్యకు కుట్రపన్నిన టీడీపీ కీలక నేతలు పరారీలో ఉన్నా పట్టించుకోని వైనం

హంతకుడు వెంట ఉన్న టీడీపీ గూండాలను మాత్రమే అరెస్ట్‌ చూపిన పోలీసులు

పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రషీద్‌ తల్లిదండ్రులు

సాక్షి, నరసరావుపేట: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వినుకొండ వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ హత్యను ప్రభుత్వం నీరుగారుస్తోంది. రాజకీయ ప్రతీకార హత్య అయినప్పటికీ వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. మృతుడి రక్త సంబంఽధీకులు ఇచ్చిన ఫిర్యాదులోని నిందితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చకుండా నామమాత్రంగా కొందరిని అరెస్ట్‌ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు బాధిత కుటుంబం నుంచి వ్యక్తమవుతున్నాయి.

 హత్య జరిగిన రోజే రషీద్‌ సోదరుడు ఖాదర్‌బాషా ఇచ్చిన ఫిర్యాదులో రషీద్‌ మరణానికి కారణంగా పేర్కొంటూ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, వినుకొండ మున్సిపాలిటీకి చెందిన కీలక టీడీపీ నేతలు షమీమ్‌ఖాన్‌, అయూబ్‌ఖాన్‌, హంతకుడు జిలానీ స్నేహితులైన కొందరు టీడీపీ రౌడీల పేర్లు ప్రస్తావించారు. అయితే పోలీసులు కేవలం హత్యలో పాల్గొన్న టీడీపీ గూండాల పేర్లు మాత్రమే పొందుపరచి, హత్యకు కుట్ర పన్నిన ప్రజాప్రతినిధులు, పట్టణ టీడీపీ ముఖ్యనేతల పేర్లు తొలగించారు. దీనిపై తొలిరోజు నుంచి రషీద్‌ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హత్యకు కుట్ర పన్నిన వారిని పక్కకు తప్పించి ఇది కేవలం వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగిన హత్యగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు.

హత్యలో పాల్గొన్న టీడీపీ గూండాలు అరెస్ట్‌
రషీద్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు జిలానీని ఇప్పటికే అరెస్ట్‌ చేయగా, హత్యతో సంబంధం ఉన్న మరో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్ట్‌ చూపారు. ఈ కేసులో అరెస్ట్‌ అయిన నిందితులు జిలానీ కూడా టీడీపీకి చెందిన వారే. ఈ ఏడాది జనవరి 17న ప్రచురితమై ఆంధ్రజ్యోతి దినపత్రికలో వీరంతా టీడీపీ కార్యకర్తలని, వారిపై వినుకొండలో జరిగిన ఓ దాడి కేసులో కేసు నమోదు చేశారని వార్త రాశారు. గురువారం అరెస్ట్‌ అయిన ఒక్కొక్కరిపై అనేక క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. వీరంతా పక్కా పథకం ప్రకారం రెక్కీ నిర్వహించి హత్య ఉదంతాన్ని ముగించారు. 

మద్యం దుకాణంలో సూపర్‌వైజర్‌గా పనిచేసే రషీద్‌ ఎప్పుడు బయటకు వస్తాడో, ఎలా వెళ్తాడు అనేది వారం ముందు నుంచే జిలానీ, అతని అనుచరులు అక్కడ సంచరిస్తూ ఆరా తీశారు. హత్య జరిగిన ప్రాంతంలో పలు దుకాణాల వద్ద లభ్యమైన సీసీ ఫుటేజ్‌ల్లో ఈ విషయం వెల్లడైనట్టు పోలీసులు చెబుతున్నారు. రషీద్‌ను పాశవికంగా హత్య చేస్తున్న సమయంలో హంతకుడు జిలానీ అనుచరులు ఒక వలయంగా ఏర్పడి పహారా కాశారు. కొందరు హత్యకు ముందు మారణాయుధాలను అందించారు.

పోలీసులపై తీవ్ర ఒత్తిడి?
రషీద్‌ హత్య కేసులో తెరవెనుక కీలకంగా వ్యవహరించిన షమీమ్‌ఖాన్‌, అయూబ్‌ఖాన్‌లను ఎలాగైనా కేసు నుంచి తప్పించాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు తెలియవచ్చింది. ఈ ఒత్తిడితో తాను న్యాయం చేయలేకపోతున్నానంటూ ఓ పోలీసు అధికారి బాధిత కుటుంబానికి చెప్పి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేసులో వీరిద్దరిని అరెస్ట్‌ చేస్తే టీడీపీ ప్రతిష్ట దెబ్బతింటుందని అందుకు వారిద్దరిని అరెస్ట్‌ చేయకుండా చూడాలని పోలీసు శాఖలో ఓ ఉన్నతాఽధికారిని ఎమ్మెల్యే కోరినట్టు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.

మాజీ ముఖ్యమంత్రి డిమాండ్‌ చేస్తున్నా...

తన పార్టీ క్యారకర్త రషీద్‌ హత్యను జీర్ణించుకోలేని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వినుకొండకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు మనో ధైర్యం చెప్పారు. నిందితుడు జిలానీ ఎమ్మెల్యే జీవీ అంజనేయులు సతీమణి లీలావతికి కేక్‌ తినిపిస్తున్న ఫొటోలు వైఎస్‌ జగన్‌కు చూపి తమ పార్టీ వాడు కాదని టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మృతుడి తల్లిదండ్రులు ఎండగట్టారు. అయినప్పటికీ పోలీసులు ఆ దిశగా ఎందుకు విచారణ చేపట్టడం లేదని బాధితులు వాపోతున్నారు. రషీద్‌ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని దేశ రాజధాని వేదికగా వైఎస్‌ జగన్‌ నిలదీశారు. ప్రభుత్వం, పోలీసులు మాత్రం ఈ కేసును వ్యక్తిగత కక్షలతో అని అర్థం చెప్పేలా ప్రయత్నిస్తున్నాయి.

అజ్ఞాతంలో అసలు నిందితులు
రషీద్‌ హత్యకు కుట్ర పన్నారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న షమీమ్‌ ఖాన్‌, ఆయూబ్‌ ఖాన్‌లు హత్య జరిగిన రోజు నుంచి వినుకొండ నుంచి పారిపోయినట్టు సమాచారం. రషీద్‌ హత్యకు కఽథా, స్క్రీన్‌ప్లే మొత్తం షమీమ్‌, అయూబ్‌ఖాన్‌లే రచించారనదే వినుకొండలో అందరినోటా వినిపిస్తోంది. ప్రధాన నిందితుడు జిలానీ, షమీమ్‌, అయూబ్‌ ఖాన్‌లపై ఈ ఏడాది జనవరిలో షాదీఖానా వద్ద జరిగిన గొడవలో నిందితులుగా ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా వీరు ముగ్గురి మధ్య సంత్ససంబంధాలు ఉన్నాయి. హత్యానంతరం వీరిద్దరు అజ్ఞాతంలో ఉండి తమ ఫోన్లను స్విచ్‌ఆఫ్‌ చేసి మారు నెంబర్లతో మాట్లాడి రషీద్‌ హత్యకేసులో నిందితులను పోలీసులకు అప్పగించడంలో కీలకపాత్ర పోషించారు. 

దీనికి ప్రతిఫలంగా కేసు నుంచి వీరి ఇరువురు పేర్లు తప్పించేందుకు ఒప్పందం కుదిరిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హత్యతో సంబంధం లేకపోతే వీరు పారిపోవాల్సిన అవసరమేముంది? పరారైన నిందితులు ఆశ్రయం కోసం వీరి వద్దకు ఎందుకు వెళ్లారనే ప్రశ్నలు బాధిత కుటుంబం నుంచి వినిపిస్తున్నాయి. చిన్నచిన్న కేసుల్లో నానా హడావుడి చేసే పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షమీమ్‌, ఆయూబ్‌లను అరెస్ట్‌ చేయడంలో అలసత్వం వహించడం పోలీసుశాఖ పనితీరుకు అద్దం పడుతోంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement