నిలిచి గెలిచిన శాస్త్రవేత్తలు | The role of women is crucial to existence and progress of humanity | Sakshi
Sakshi News home page

నిలిచి గెలిచిన శాస్త్రవేత్తలు

Published Sun, Mar 9 2025 4:11 AM | Last Updated on Sun, Mar 9 2025 4:11 AM

The role of women is crucial to existence and progress of humanity

మానవజాతి ఉనికికి, పురోగమనానికి మహిళ పాత్ర కీలకం. ఆ మాటకొస్తే ఏ జాతి ప్రగతికైనా స్త్రీ పురుషుల భాగ స్వామ్యం తప్పనిసరి. కానీ అనాదిగా స్త్రీ వివక్షను ఎదుర్కొంటూనే ఉంది. ఇది ఏ ఒక్క రంగానికో, ప్రాంతానికో, దేశానికో పరిమితం కాదు. అందుకు సైన్సు కూడా మినహాయింపు కాదు. అవధులు లేని అభివృద్ధిని సాధించామనుకుంటున్న నేటి పరిస్థితుల్లో కూడా మహిళ వివక్షను, ప్రతికూలతలను ఎదుర్కొంటూనే ఉంది. విజయాలందుకొంటూనే ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల ప్రగతిలో తనదైన ముద్రను కనబరుస్తూనే ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె లేని సమాజాన్నెలా ఊహించుకోలేమో, ఆమె చేయూత లేని సైన్సు అభివృద్ధి కూడా ఊహాతీతం. నూరేళ్ల చరిత్ర కలిగిన నోబెల్‌ బహుమతులకు మహిళా శాస్త్రవేత్తలను ఎంపిక చేయటంలో కూడా ఈ వివక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇన్నేళ్లయినా సైన్సులో నోబెల్‌ బహు మతి వచ్చిన మహిళలు రెండు పదులకు మించి లేరు. రెండు సార్లు నోబెల్‌ బహుమతిని గెలుచుకున్న ఏకైక మహిళా శాస్త్రవేత్త మేరీ క్యూరి సైతం ఈ ప్రతికూలతను ఎదుర్కొంది. 1903లో తొలుత పియరీ క్యూరీ, హెన్రీ బెక్‌రెల్‌ల పేర్లే ఎంపికయినాయి. 

పియరీ దాన్ని తిరస్కరించటంతో ఆ తర్వాత మేరీతో కలసి వారు నోబెల్‌ బహుమతిని అందుకున్నారు. నేటి శాస్త్ర రంగాన్ని అత్యంత గణనీయంగా ప్రభావితం చేసినది వాట్సన్, క్రిక్‌ల డీఎన్‌ఏ నిర్మాణ డిస్కవరీ. ఇంత గొప్ప ఆవిష్కరణలో కీలక పరిశోధన లు అందించిన మహిళ రోజాలిండ్‌ ఫ్రాంక్లిన్‌కు నోబెల్‌ బహుమతి దక్కలేదు. డీఎన్‌ఏ నిర్మాణాన్ని కళ్లకు కట్టి చూపిన ఆమె ఎక్స్‌రే ఫొటో (ఫొటో నం. 51)నే ఆధారమన్న సంగతి మరచి పోలేని నిష్ఠుర సత్యం.

ఈ డిస్క వరీ అనేకానేక విజ్ఞాన శాస్త్ర రంగా లకు ప్రాణం పోసింది. నేడది డార్విన్‌ జీవపరిణామ సిద్ధాంతాన్ని నిగ్గు తేల్చటమే కాకుండా, కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన శిలాజాల నుండి సంగ్రహించిన డీఎన్‌ఏ నమూనాలతో సరి కొత్త శిలాజ జీనోమిక్‌ శాస్త్ర విజ్ఞా నానికి నాంది పలికింది. ఆ పరిశో ధనలు చేసిన స్వాంటే పేబో వంటి శాస్త్ర జ్ఞులకు నోబెల్‌ బహుమతిని అందించింది కూడా.

క్రోమోజోమ్‌లపై జన్యువులు ఒక స్థానం నుండి మరొక స్థానానికి దూకుతాయన్న ‘దూకుడు జన్యువుల’ డిస్కవరీ జన్యు శాస్త్రాన్ని గొప్ప మలుపు తిప్పింది. జెనెటిక్‌ ఇంజనీరింగ్‌లో కొత్త ప్రక్రియలకు పునాది వేసింది. దీనిని కనిపెట్టింది కూడా బార్బరా మెక్లింటాక్‌ అనే గొప్ప మహిళా శాస్త్రవేత్త. ఈ డిస్కవరీకి తానొక్కతే నోబెల్‌ బహుమతి మొత్తాన్ని గెలుచుకున్న తొలి మహిళ కూడా ఆమె. ఏ జన్యువు ఎప్పుడు పని చేయాలో, ఎక్కడ ఆగిపోవాలో అనేది పరిణామంలో ఒక పజిల్‌. ఈ డిస్కవరీలో పరిణామ జీవ శాస్త్రం కొత్త పుంతలు తొక్కింది. 

విద్యాధికులూ, శాస్త్రవేత్తలూ మాత్రమే గొప్ప ఆవిష్కరణలు చేస్తారని సాధా రణంగా అనుకుంటాం. ఇందుకు భిన్నంగా ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి చదువు కూడా పెద్దగా లేని మహిళ మేరీ యానింగ్‌ శిలాజ విజ్ఞాన శాస్త్ర వేత్తగా ఎదిగి జీవ పరిణామ సిద్ధాంతాన్ని పరిపుష్టం చేసింది. బ్రిటన్‌ లైమ్‌రెజిస్‌ ప్రాంతపు సముద్ర తీరంలో పర్యాటకులకు గవ్వలమ్ముకుని జీవించే సాదా సీదా అమ్మాయి యానింగ్‌. పన్నెండేళ్ల వయసులోనే ఇక్తియోసార్‌ పుర్రెను వెలికి తీయటంలోతండ్రికి తోడ్పడింది. 

ఒకప్పుడు నీళ్లలో నివసించిన సరీసృపాల జాతికి చెందిన శిలాజానికిది నిదర్శనం. ఆమె కృషి పట్టుదలతో వెలికి తీసిన అనేక శిలాజాలు జీవులు పరిణామం చెందు తాయన్న ఆలోచనలకు బలం చేకూర్చాయి. డార్విన్‌ పరిణామ సిద్ధాంతాన్ని ఆమె కనిపెట్టిన శిలాజాలు పరిపుష్టం చేశాయి. అందుకే ఆమె ప్రపంచంలో తొలి మహిళా శిలాజ శాస్త్రవేత్తగా ఖ్యాతి గడించింది. 

బ్రిటన్‌లో శాస్త్రవేత్తలకిచ్చే అత్యున్నత పురస్కారా లను సైతం ఈ సామాన్య యువతి అందుకుంది. అవాంతరాలు, ప్రతికూలతలు ఎన్ని ఉన్నా మహిళ సాధించలేనిది లేదని చెప్ప డానికివి మచ్చుకు ఒకటి రెండు ఉదాహరణలే. సైన్సు ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ అందాలంటే పురుషులతో సమా నంగా మహిళల భాగస్వామ్యాన్ని సాధించాలి.

శాస్త్ర రంగంలో భారతదేశపు పరిస్థితి, మహిళల ప్రాతి నిధ్యం అంతంత మాత్రంగానే ఉంది. 2005లోనే సైన్స్‌రంగంలో మహిళలపై భారత ప్రభుత్వ (డీఎస్‌టీ) నియమించిన నిపుణుల కమిటీ కూడా మహిళలు అత్యల్ప సంఖ్యలో ఉన్నారని తేల్చింది. డాక్టరేట్లు చేసిన మహిళలు శాస్త్ర సంస్థలు, యూనివర్సిటీ సిబ్బందిలో అతి తక్కువగా ఉన్నారు. మరీ ముఖ్యంగా విధాన నిర్ణ యాలు చేసే స్థాయిలో, సంస్థల డైరెక్టర్లు, విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్స్‌లర్లు, ఇతర పాలనాపరమైన ముఖ్య స్థానాల్లో పరిమితంగా ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

మహిళలకు సైన్సులో మరింత ప్రోత్సాహం ఇవ్వాలనీ, ఉద్యోగ నియామకా లను క్రమబద్ధంగా జరపాలనీ ఆ కమిటీ సూచించింది. అయినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. శాస్త్ర రంగంలో మహిళలు ముందడుగు వేయటానికి నిపుణుల సూచనలు అమలు చేయటం ఒక అవసరమైతే, ప్రభుత్వాల దృష్టి కోణంలో మార్పు రావటం అత్యవసరం.          

-వ్యాసకర్త జన విజ్ఞాన వేదిక ఉమ్మడి ఏపీ మాజీ అధ్యక్షులు
-ప్రొ‘‘ కట్టాసత్యప్రసాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement