Nobel Prizes
-
రెండుసార్లు నోబెల్ పొందిన ఏకైక మహిళ
ఆమె పుట్టింది రష్యా దేశంలోని వార్సాలో. ఐదుగురు పిల్లల్లో ఈ పాప చిన్నది. పదేళ్ల వయసులో తల్లి క్షయ వ్యాధితో మరణించింది. దీంతో తోబుట్టువులే ఆమెను పెంచారు. చిన్ననాటి నుంచి ఆమెకు విజ్ఞాన శాస్త్రమంటే చాలా ఇష్టం. ఆ విషయాల గురించి ఆ పాప తెలుసుకుంటూ ఉండేది. ఇంట్లో పేదరికం కారణంగా ఆమె ఎక్కువగా చదువుకోలేకపోయింది. తనకొచ్చిన చదువుతో ఉపాధ్యాయురాలిగా మారింది. విశ్వవిద్యాలయానికి వెళ్లాలనే ఉద్దేశంతో 1891లో ఫ్రాన్స్‌కు వెళ్లి అక్కడ సోర్బోన్ యూనివర్సిటీలో చేరింది. అక్కడ భౌతిక, గణిత శాస్త్రాలను చదివింది. 1894లో ప్యారిస్ నగరంలో శాస్త్రవేత్త పియరీ క్యూరీని కలుసుకుంది. ఏడాది తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పరిశోధనలు చేశారు. యురేనియంపై పలు ప్రయోగాలు చేసి కీలకమైన విషయాలు కనుక్కున్నారు. ఆ సమయంలోనే రేడియో ధార్మికతను కనిపెట్టారు. ఆ పరిశోధనలకుగానూ 1903లో ఆమెతోపాటు ఆమె భర్త పియర్, హెన్రీ బెక్వెరెల్లకు భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇచ్చారు. 1906లో పియరీ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. జీవితంలో మరోసారి ఆమెను విషాదం చుట్టుముట్టింది. అయినా కుంగిపోక పరిశోధనలు కొనసాగించింది. ప్రపంచానికి ఎన్నో కొత్త విషయాలు నేర్పింది. రేడియో ధార్మికతను కొలిచే సాధనాన్ని రూపొందించినందుకు 1911లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకుందామె. ఇలా రెండు వేర్వేరు విభాగాల్లో నోబెల్ బహుమతి అందుకున్న ఏకైక మహిళ ఆమె. ఆమె కనిపెట్టిన రేడియో ధార్మికత ఇవాళ అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో దానికి కీలకపాత్ర ఉంది. తన జీవితమంతా పరిశోధనలకే అంకితం చేసిన ఆమె పేరు ‘మేరీ క్యూరీ’. ఆమెనే ‘మేడమ్ క్యూరీ’ అని కూడా అంటారు. తన జీవితంలో ఆమె ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా ఏనాడూ వెనకడుగు వేయకుండా కష్టపడి అనుకున్నది సాధించారు. ఆమె స్ఫూర్తితో మీరూ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి. -
ఆర్థికశాస్త్రంలో నోబెల్ విజేతలు వీరే
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఆర్థిక శాస్త్రవేత్తలు పాల్ ఆర్ మిల్గ్రామ్, రాబర్ట్ బి విల్సన్‌లను వరించింది. వేలం సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడం, కొత్త వేలం విధానాలను కనుగొన్నందుకు గానూ వీరద్దరికి ఈ ఏడాది ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. వేలం ప్రతిచోటా ఉంది . అది దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. పాల్ మిల్గ్రామ్, రాబర్ట్ విల్సన్ వేలం సిద్ధాంతాన్ని మెరుగుపరిచారు కొత్త వేలం ఆకృతులను కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అమ్మకందారులకు, కొనుగోలుదారులకు, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నారని అకాడమీ వ్యాఖ్యానించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు 10 మిలియన్ క్రోనా (1.1 మిలియన్ డాలర్లు) నగదు బహుమతి, బంగారు పతకం లభిస్తుంది. (అప్పటికి 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్) ప్రపంచవ్యాప్తంగా అమ్మకపుదారులకు, వినియోగదారులకు, టాక్స్ పేయర్స్‌కు లబ్ది చేకూర్చేలా వేలం సిద్దంతాన్ని సరళీకరించడమే కాకుండా, కొత్త వేలం విధానాలను ఆవిష్కరించిన పాల్ ఆర్ మిల్గ్రామ్, రాబర్ట్ బి విల్సన్‌కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందజేస్తున్నామని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ గోరన్ హాన్సన్ ప్రకటించారు. రాబర్ట్ విల్సన్.. కామన్ వాల్యూతో వస్తువులను వేలం విధానాన్ని అభివృద్ది చేశారు. మరోవైపు పాల్ మిల్గ్రామ్, వేలం సిద్ధాంతాన్ని మరింత సరళీకరించారు. కేవలం కామన్ వాల్యూ మాత్రమే కాకుండా ఒక బిడ్డర్ నుంచి మరో బిడ్డర్ మారేలా ప్రైవేటు వాల్య్సూను అనుమతించారు. కాగా ఆల్ ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం 1969 నుంచి ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారం ఇస్తున్నారు. గత ఏడాది ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రదానం చేయగా వీరిలో భారతీయ అమెరికన్ అభిజిత్ బెనర్జీ ఉన్న సంగతి తెలిసిందే. -
పుస్తక ప్రదాతలు.. నోబెల్ మహిళలు
జీవితం ఎలా ఉండాలి? ఎలాగైనా ఉండొచ్చు. ఇంటికి చేరుకుని, ఇంత తిని పడుకున్నాక మాత్రం.. చేతులు గుండెలపైకి వెళ్లిపోవాలి. హాయిగా నిద్ర పట్టాలి. చేతులు డిస్టర్బ్ అవనంతగా! అంత ఇస్తుందా జీవితం? వెతుక్కోవాలి. బతుకు దారుల్లో దొరక్కపోతే.. బతుకునిచ్చే పుస్తకాల్లో..! గుండెలపై పాపాయిని జో కొడతాం. మనల్ని జోకొట్టే పాపాయి.. గుండెలపై బతుకు పుస్తకం. ఆ పుస్తక ప్రదాతలు, ప్రదీప్తులు..ఈ నోబెల్ మహిళలు. అన్మిస్టేకబుల్, ఆస్టియర్ బ్యూటీ అనే మాటలు రెండు రోజులుగా సాహితీ ప్రపంచంలో వినిపిస్తున్నాయి. అమెరికన్ కవయిత్రి లూయీ గ్లూక్‌ను ఈ ఏడాది విజేతగా ప్రకటిస్తూ నోబెల్ కమిటీ ఈ రెండు మాటలతో ఆమెను ప్రశంసించింది. తను ఏం రాసినా నిశ్చయంగా (అన్ మిస్టేకబుల్), నిరాడంబర బుది ్ధసౌందర్యంతో (ఆస్టియర్ బ్యూటీ) రాశారని, మనిషి గుండెకాయను తీసుకెళ్లి ఈ విశ్వానికి అమర్చి లబ్‌డబ్ మనిపించిన మహోన్నత సాహితీవేత్త అని కీర్తించింది. గ్లూక్‌కి 77 ఏళ్లు. పదును తేలిన భావంలా మనిషి పలుచగా ఉంటారు. ఆటోబయోగ్రఫికల్ పొయెట్ అని ఆమెకు పేరు. అమెరికాలో ఆడపిల్లలు డిగ్రీ అయిపోగానే ‘సెక్రెటేరియల్’ వర్క్ చేయడానికి ఉవ్విళ్లూరుతుంటారు. గ్లూక్ కూడా అలాగే చేరి, మానేశారు. తర్వాత పొయెట్రీ రాశారు. పొయెట్రీ ప్రొఫెసర్ అయ్యారు! గ్లూక్ కి ముందు ముగ్గురు అమెరికన్ మహిళలకు సాహిత్యంలో నోబెల్ వచ్చింది. టోనీ మారిసన్, పెర్ల్ బక్, సల్మ లాగెర్లాఫ్. టోనీ నవలా రచయిత్రి. తన భావధార అంతా అమెరికన్ రియాలిటీ. పొయెట్రీ అక్కడక్కడా పుదీనాలా పడిపోతుంది తనకు తెలియకే. జీవితమంతా రచనే. వేరే వ్యాపకం లేదు. విజిటింగ్ ప్రొఫెసర్‌గా మాత్రం కాలేజీలకు వెళ్లొచ్చేవారు. మానవ సమాజశాస్త్రం ఆమె చెబుతుండగా విని వ్యక్తుల్ని కాకుండా, సమాజాన్ని ప్రేమించిన టీనేజర్లు ఉన్నార ని అంటారు! టోనీ 88 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆమెకన్నా 55 ఏళ్ల ముందు నోబెల్ పొందిన పెర్ల్ బక్ ఎనభై ఏళ్లు జీవించారు. అమెరికనే అయినా ఆమె జీవితంలోని ప్రారంభ కాలం అంతా చైనాలోని ఝెన్జియాంగ్ లో గడిచింది. చైనా రైతుల జీవన స్థితిగతులపై ఆమె రచనలకు, తను రాసిన తన తల్లిదండ్రుల జీవిత కథలకు ఆమెకు నోబెల్ లభించింది. మరో అమెరికన్ సల్మ లాగెర్లాఫ్ సాహిత్యంలో నోబెల్ గెలుచుకున్న తొలి మహిళ. ఉత్కృష్టమైన ఆదర్శవాదం, స్పష్టమైన ఊహాత్మకత, ఆధ్యాత్మిక దృక్పథం ఆమె రచనల్లోని విలక్షణతలు. వాటిని నోబెల్ వరించింది. సల్మ ఎనభై ఏళ్లకు పైగా జీవించారు. గర్ల్స్ హైస్కూల్ టీచర్‌గా ఆమె కెరీర్ మొదలై, రచయిత్రిగా స్థిరత్వం పొందింది. అమెరికా తర్వాత ఒక్క పోలెండ్‌కు మాత్రమే సాహిత్యంలో రెండు మహిళా నోబెల్ ప్రైజులు దక్కాయి. రెండేళ్ల క్రితం ఓల్గా తొకర్జూక్, పాతికేళ్ల క్రితం విస్లావా సింబోర్సా్క నోబెల్ గెలుచుకున్నారు. ఓల్గా రచయిత్రి, యాక్టివిస్టు. ఆమె నేరేటివ్ ఇమాజినేషన్ గొప్పదని అంటారు. అంటే కథనాత్మక కల్పన. ఆమె మానవ జీవన విషయక్రమ జిజ్ఞాస ఆమె రచనల్ని ఎల్లలు దాటించడమే ఆమెకు నోబెల్ రావడానికి కారణం అయింది. ఇక విస్లావా సింబోర్సా్క కవయిత్రి. వక్రోక్తుల వినయశీలి. మానవ జీవితంలోని చారిత్రకతల్ని కవితలు గా అల్లారు. అమెరికన్ నోబెల్ గ్రహీత టోనీలానే ఈమె కూడా సరిగ్గా 88 ఏళ్లు జీవించారు. తక్కిన పదిమంది మహిళా నోబెల్ విజేతలతో నాడైన్ గార్డిమర్ (దక్షిణాఫ్రికా), గేబ్రియేలా మిస్ట్రెల్ (చిలీ), ఆలిస్ మన్రో (కెనడా) మినహా అంతా ఐరోపా మహిళలే. నాడైన్ గార్డిమర్ రచయిత్రి, రాజకీయ కార్యకర్త. తొంభై ఏళ్లు జీవించారు. నోబెల్ ప్రైజ్ వ్యవస్థాపకులైన ఆల్ఫ్రెడ్ ఏ మానవాళి ప్రయోజనాన్నయితే ఆశించి నోబెల్‌ను నెలకొల్పారో ఆ ప్రయోజనమే అంతర్లయగా నాడైర్ రచనల్లో ఉండేది. గేబ్రియేలా మిస్ట్రెల్ గేయ కవయిత్రి. దట్టించిన ఉద్వేగం ఆమె ప్రతి వ్యక్తీకరణ. మధ్య అమెరికా వాసుల ఆదర్శప్రాయమైన ఆకాంక్షలకు ఆమె ఒక సంకేతాత్మకంగా వెలుగొందారు. విద్యావేత్త, మానవ ప్రేమిక. చిలీ దేశపు పద్యరాయబారి. 67 ఏళ్లు జీవించారు. ఆలిస్ మన్రో అయితే చిన్న కథల్లో చెయ్యి తిరిగిన కథనశిల్పి. థీమ్ జీవితాదర్శం. ఆ కథాచాతుర్యానికే నోబెల్ పడిపోయింది. 89 ఏళ్ల ఆలిస్ మన్రో ఇప్పుడు విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఐరోపా నుంచి సాహిత్యంలో నోబెల్ గెలుచుకున్న ఏడుగురు మహిళలూ ప్రధానంగా దేశవాళీ జీవనాంశాలను, జీవిత సమస్యలను కథాంశాలుగా తీసుకుని ఆదర్శప్రాయమైన పరిష్కారాలను విశ్లేషించినవారే. గ్రేసియా డెలెడా (ఇటలీ), సిగ్రిడ్ అండ్సెట్ (నార్వే), నెలీ సాచ్ (జర్మనీ), ఎల్ఫ్రీడ్ జెలినెక్ (ఆస్ట్రియా), డోరిస్ లెస్సింగ్ (బ్రిటన్), హెర్టా మ్యూలర్ (రొమేనియా), స్వెత్లానా అలెక్సివిచ్ (ఉక్రెయిన్) తమ రచనా వైవిధ్యాలను కనబరచడంతో పాటు సామాజిక ప్రతిఫలనాలను ఉన్నవి ఉన్నట్లుగా తమ వచనం చేసుకున్నారు. గ్రేసియా డెలడా మానవ జీవన సంక్లిష్టతలను సానుభూతితో తర్కించారు. సిగ్రిడ్ నార్వేలోని మధ్యయుగాల నాటి జీవితాన్ని శక్తిమంతంగా దర్శనం చేయించారు. నెలీ సాచ్ ఇజ్రాయెల్ భవిష్యత్‌ను కవిత్వీకరించారు. ఎల్ఫ్రీడ్ జెలినెక్ సమాజంలోని అర్థరహితాలను, అపసవ్యతల్ని గుండెకు హత్తుకునే గాఢమైన భావాలతో వ్యక్తం చేశారు. డోరిస్ లెస్సింగ్ నాగరికతల్ని, హెర్తా మ్యూలర్ ‘కోల్పోవడాన్ని’, స్వెత్లానా అలెక్సివిచ్ మానవ జన్మ వ్యాకులతల్ని స్పృశించారు. వాటికి దక్కిన గుర్తింపే నోబెల్. దీనిని మనం నోబెల్‌కు దక్కిన గుర్తింపు అని కూడా అనొచ్చు. జోకొట్టే పాపాయి పంచుకుంది ఒక్కరే నోబెల్ బహుమతులు ప్రారంభం అయిన 1901 నుంచి 2020 వరకు సాహిత్యంలో 113 సార్లు నోబెల్ ప్రదానం చేశారు. 117 మంది నోబెల్ గ్రహీతలు అయ్యారు. వీరిలో 101 మంది పురుషులు. 16 మంది స్త్రీలు. తాజా గ్రహీత అమెరికన్ కవయిత్రి లూయీస్ గ్లూక్. తొలి మహిళా విజేత స్వీడన్ రచయిత్రి సల్మ లాగెర్లాఫ్ (1909). సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఒక పుస్తకానికి అంటూ ఇవ్వరు. మొత్తం రచనల్ని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే తొమ్మిదిసార్లు మాత్రం పుస్తకానికి నోబెల్ ఇవ్వవలసి వచ్చింది. ఆ తొమ్మిది మందిలో మహిళలు లేరు. నోబెల్ సాహిత్య బహుమతిని మిగతా కేటగిరీలో మాదిరిగా ఇద్దరికి ముగ్గురికి పంచరు. ఒకరికే ఇస్తారు. అయితే నాలుగుసార్లు ఇద్దరిద్దరికి పంచవలసి వచ్చింది. అలా నోబెల్‌ను పంచుకున్న ఒకే ఒక మహిళ జర్మనీ కవయిత్రి నెలీ సాచ్ (1966). -
నోబెల్ ప్రైజ్, సత్తా చాటిన మహిళలు
2020 సంవత్సరానికి సంబంధించి నోబెల్ బహుమతి విజేతలను స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. వీటిలో మహిళలు తమ సత్తా చాటారు. రసాయన శాస్త్ర విభాగానికి సంబంధించి ఈ బహుమతి ఇద్దరు మహిళలను వరించింది. ఫ్రెంచ్ ప్రొఫెసర్ ఎమ్మాన్యుయెల్ చార్పెంటియర్‌కు, అమెరికన్ బయోకెమిస్ట్ జెన్నిఫర్ దౌడ్నాకు ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్కింది. జినోమ్ మార్పులపై చేసిన పరిశోధనలకుగాను వీరికి నోబెల్ అవార్డు వరించింది. ఇక ఇప్పటికే భౌతిక శాస్త్రంలో ముగ్గురు, వైద్య రంగంలో ముగ్గురుకు నోబెల్ బహుమతి దక్కిన సంగతి తెలిసిందే. ఇక నోబెల్ శాంతి బహుమతిని అక్టోబర్ 9వ తేదీన ప్రకటించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి రేసులో ఆప్ఘనిస్తాన్‌కు చెందిన ఫాజియా కూఫీ ఉన్నారు. చదవండి: భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ -
భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్
స్టాక్‌హోమ్ : భౌతికశాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను 2020సంవత్సరానికి గానూ ప్రఖ్యాత నోబెల్ పురస్కారం వరించింది. అంతరిక్షంలో కృష్ణ బిలం ఎలా ఏర్పాటవుతుందో సూత్రీకరించిన బ్రిటన్ సైంటిస్ట్ రోజర్ పెన్రోజ్, జర్మనీ శాస్త్రవేత్త రీన్‌హర్డ్ గెంజెల్‌తో పాటు పాలపుంత కేంద్రకంపై పరిశోధనలు చేసిన అమెరికన్ ప్రొఫెసర్ అండ్రియా గెజ్‌ను ఈ పురస్కారానికి నోబెల్ కమిటీ మంగళవారం ఎంపిక చేసింది. అవార్డు కింద బంగారు పతకం, కోటి స్వీడిష్ క్రోనార్లు (రూ.8.22 కోట్లు) నగదు లభిస్తుంది. అయితే ఇందులో రోజర్ పెన్రోస్కు సగం పురస్కారాన్ని ఇవ్వగా, మిగత సగాన్ని రిన్హార్డ్, ఆండ్రియాలు పంచుకోనున్నారు. (చదవండి : వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం) BREAKING NEWS: The Royal Swedish Academy of Sciences has decided to award the 2020 #NobelPrize in Physics with one half to Roger Penrose and the other half jointly to Reinhard Genzel and Andrea Ghez. pic.twitter.com/MipWwFtMjz — The Nobel Prize (@NobelPrize) October 6, 2020 -
సంక్షేమరాజ్య భావనకు నోబెల్ పట్టం
ప్రపంచ పేదరిక సమస్యను పరిష్కరించే మార్గాలను అన్వేషించడంలో వినూత్న పద్ధతుల్లో ఆలోచించిన ముగ్గురు ఆర్థిక చింతనాపరులకు ఈ ఏడాది అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించడం ముదావహం. ప్రపంచ పేదరిక సమస్య తాలూకు ప్రశ్నలను మరింత సరళమైన, నిర్దిష్టమైన రూపంలోకి వడకట్టి, తద్వారా పరిష్కారాన్ని సూచించే కృషిని చేశారనేది వారికి వస్తున్న ప్రశంస. భారత్ వంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల ప్రభుత్వాలు, తమ పరిమిత వనరులను చీకట్లో రాయి విసిరినట్లు గుడ్డిగా తమకు తోచిన విధంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం కాకుండా, ఆ నిధులను కచ్చితమైన ఫలితాలను ఇచ్చే పద్ధతుల పైన వాడవచ్చు అని వీరి భావన. నిత్య జీవితంలో విద్య, వైద్యం వంటి రంగాల్లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారం కోసం మనం అంతకుముందర ఆలోచించి ఉండని పరిష్కారాలను వారు ముందుకు తెచ్చారు. 2019 సంవత్సరానికి ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతిని ముగ్గురు ఆచార్యులు కలిసి గెలుచుకున్నారు. వారిలో భారత సంతతి అమెరికా జాతీయు డైన అభిజిత్ బెనర్జీ, ఆయన సహచరి ఎస్తర్ డఫ్లో, హార్వర్డ్ విశ్వ విద్యాలయ ఆచార్యుడు మైకెల్ క్రెమర్‌లు ఉన్నారు. అమర్త్యసేన్ తరువాత ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న రెండవ భారతీయునిగా అభిజిత్ నిలిచారు. అయితే ప్రపంచ పేదరిక సమస్య పరిష్కారానికి అభిజిత్ సూచించిన పరిష్కారాలు మాత్రమే సరైన ఫలితాలను ఇస్తాయని భావించపనిలేదు. ఆర్థిక అసమానత్వంపై విస్తృత పరిశోధనలు చేసిన ప్రఖ్యాత ఆర్థికవేత్త థామస్ పికెట్టీ సూచిం చిన పరిష్కార మార్గాలు కూడా జోడిస్తే వ్యవస్థాగత మౌలిక మార్పు లకు దోహదపడతాయి. అర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఈ ముగ్గురి పరిశోధనలూ ప్రధానంగా ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని నోబెల్ అకాడమీ పేర్కొంది. ప్రపంచ పేదరిక సమస్యను అర్థం చేసుకుని, పరిష్కరించేందుకు గాను వీరు ఆ సమస్య తాలూకు ప్రశ్నలను మరింత సరళమైన, నిర్దిష్టమైన రూపంలోకి వడకట్టి, తద్వారా ఆ సమస్యకు పరిష్కారాన్ని సూచించే కృషిని చేశారనేది వారికి వస్తున్న ప్రశంస. అలాగే పేదరి కానికి సంబంధించి ఈ సరళీకరించిన, నిర్దిష్ట ప్రశ్నలకు ప్రయోగా త్మక పద్ధతిలో పరిష్కారాలు కనుగొనేందుకు వీరు ప్రయత్నించారు. ఈ పరిశోధనల కోసం తమ విశ్వవిద్యాలయం ఎమ్.ఐ.టి లో వీరు ‘పేదరిక (పరిష్కార) కార్యాచరణ ప్రయోగశాల’ను ఒకదానిని 2000 సంవత్సరం ప్రాంతంలో ఏర్పరిచారు. ఈ పరిశోధనలో వీరు తాము ఎంచుకున్న ఒక పేదరిక అంశానికి లేదా సమస్యకు పరిష్కార పద్ధతిని రెండు బృందాల ద్వారా పరీక్షించేవారు. వాటిలో ఒక బృందంపై ఈ పరిష్కార పద్ధతిని అమలు జరిపేవారు. రెండవ బృందాన్ని ఈ పద్ధతి నుంచి మినహాయించే వారు. అంటే ఇది ఒక రకంగా ఫార్మా రంగంలోని క్లినికల్ ట్రయిల్స్ ప్రయోగ పద్ధతి వంటిది. తద్వారా వారు ఒక నిర్దిష్ట పేదరిక సమస్యకు తాము సూచి స్తోన్న పరిష్కార పద్ధతి సామర్థ్యాన్నీ పరీక్షించేవారు. ఈ విధంగా కనుగొన్న పరిష్కారం ద్వారా నిధుల కొరత అధి కంగా ఉన్న భారత్ వంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల ప్రభు త్వాలు, తమ పరిమిత వనరులను చీకట్లో రాయి విసిరినట్లు గుడ్డిగా తమకు తోచిన విధంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం కాకుండా, ఆ నిధులను కచ్చితమైన ఫలితాలను ఇచ్చే పద్ధ తులపైన వాడవచ్చు అనేది ఈ ఆర్థికవేత్తల వాదన. ఈ విధంగా, ఎమ్.ఐ.టి.లోని ప్రయోగశాలలో అభిజిత్, ఎస్తర్లు జరిపిన పరిశోధ నలూ, ఈ పరిశోధనా పద్ధతిని మైకెల్ క్రెమర్, కెన్యా దేశంలోని పాఠ శాలలలో పరీక్షించడం ద్వారానూ కనుగొన్న పేదరిక నిర్మూలన పద్ధతులు కొన్నింటిని పరిశీలిద్దాం. ఈ ప్రయోగ పద్ధతులను వారు ప్రధానంగా విద్య, వైద్య రంగా లలో కేంద్రీకరించారు. విద్యారంగంలో ఈ పద్ధతులను అనుసరిం చడం ద్వారా భారత్, ఆఫ్రికాలలో 60 లక్షలమంది పిల్లలకు మెరుగైన విద్య ద్వారా ప్రయోజనం చేకూరిందనేది ఒక అంచనా. కాగా, వీరి సూత్రీకరణల ప్రకారంగా పాఠశాలల విద్యార్థులకు మరిన్ని పాఠ్య పుస్తకాలూ, ఉచిత భోజనాలను అందించడం కంటే, చదువులో వెను కబడిన విద్యార్థులకు నిర్దిష్టంగా అదనపు ట్యూషన్ వంటి సాయం అందించడం ద్వారా, మరింత మెరుగైన ఫలితాలు వచ్చాయి. అలాగే, పిల్లలకు వారి కడుపులోని నులిపురుగులను నిర్మూలించే ఔషదాన్ని ఇవ్వడం అనే అతి చిన్న చర్య ద్వారా వారి ఆరోగ్యంలో మెరుగుదలా, వారి పాఠశాల హాజరును మెరుగుపరచడం సాధ్యం అయ్యాయని వారు చెబుతారు. ఇక తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు బోధిం చాల్సిన విద్యార్థుల సంఖ్య, ఒక పరిమితిని మించితే దాని వలన విద్యా బోధన నాణ్యత పడిపోతుందనేది మనం నేటి వరకు నమ్ము తోన్న అంశం. కాగా, ఇది పూర్తిగా సరైనది కాకపోవచ్చుననీ, ఈ విధంగా విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని తగ్గించే యత్నం కంటే, విద్యార్థులకు మంచి గ్రేడ్లు వచ్చేలా బోధించగలిగితేనే, ఆ ఉపా ధ్యాయునికి బోధనా కాంట్రాక్ట్‌ను పాఠశాల పొడిగించే విధానం మంచిదనేది ఈ నోబెల్ పరిశోధకుల తర్కం. స్థూలంగా, ‘‘పరిమిత’’ వనరులు వున్న భారత్ వంటి దేశాలకు పేదరిక నిర్మూలనకుగాను ఈ లక్షి్యత పరిష్కార చర్యలు మంచి దనేది ఈ ఆర్థికవేత్తల తర్కం. కాగా, నేడు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశా లలో అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ఆదేశిత పొదుపు చర్యలు అమలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ చర్యలలో భాగంగా వివిధ ప్రభుత్వాలు తమ తమ దేశాల విదేశీ అప్పులను తీర్చగలిగేటందుకు గాను తమ దేశాలలోని సామాన్య ప్రజలకు కల్పించే సంక్షేమ పథ కాలపై కోతలు పెడుతున్నాయి. అలాగే, వ్యయాల తగ్గింపులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను కుదించడం, కొత్తగా ఉద్యో గులను భర్తీ చేయకపోవడం, ఉద్యోగుల పింఛను సదుపాయం వంటి వాటిని కుదించడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఇటువంటి చర్యలకు పెట్టిన పేరే ‘‘సంస్కరణలు’’. కాగా, ఈ సంస్కరణలలో ఆయా దేశాల కార్పొరేట్లకూ, ధన వంతులకూ ఇచ్చే రాయితీలను పెంచుతూ పోవడం కూడా అంతర్భా గమే. ఉదాహరణకు, మన దేశంలో కూడా కార్పొరేట్లపై విధించే పన్నును తగ్గించడం... మరోవైపు, ద్రవ్య లోటును తగ్గించుకొనే పేరిట వంట గ్యాస్ సబ్సిడీ, కిరోసిన్ సబ్సిడీ, పంపిణీ వ్యవస్థ సబ్సి డీలు వంటి వాటిపై కోతలు వేస్తూ పోవడం వంటివన్నీ తెలిసినవే. ఇటువంటి విధానాల పలితంగా నేడు మన దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొని వుంది. ఈ విషయాన్ని అభిజిత్ కూడా అనేక దఫాలు ప్రస్తావించారు. అలాగే గత వారం అమెరికాలోని బ్రౌన్ విశ్వ విద్యాలయంలో తాను చేసిన ఓ.పి జిందాల్ ఉపన్యాసంలో, భారత దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ స్థితికి సూచించిన పరిష్కారాలలో ముఖ్యమైనవి ప్రజల చేతిలోకి డబ్బు చేరేలా చూడటం, జాతీయ ఉపాధి హామీ పథకంలో వేతనాలు పెంచడం, రైతులకు గిట్టుబాటు ధరను ఇవ్వడం వంటివన్నీ ఉన్నాయి. కాగా, ఈ పరిష్కారాలు అన్నీ ప్రస్తుతం అమలు జరుగుతోన్న పొదుపు చర్యలకు భిన్నంగా, ప్రభు త్వం మరింతగా వ్యయాలు పెంచడంతో కూడినవి. అయితే అభిజిత్‌తోపాటు ఈ ఏడాది ఆర్థికరంగంలో నోబెల్ గ్రహీతలకు ఆ బహుమతిని తెచ్చిపెట్టింది, నేడాయన భారత ఆర్థిక వ్యవస్థలోని మాంద్య స్థితి పరిష్కారానికి సూచించిన పై స్థూల ఆర్థిక పరిష్కారాలు కాదు. అభిజిత్, ఆయన సహచరులు తమ దృష్టిని ప్రధానంగా ఆర్థిక రంగం తాలూకు.. అందులోనూ ముఖ్యంగా విద్య, వైద్యరంగాలలోని సూక్ష్మ అంశాలపై కేంద్రీకరించారు. అత్యంత కేంద్ర స్థాయిలో తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకునే సమస్యలూ, వారి రోజువారీ పాఠశాల హాజరు, విద్యార్థుల విద్యార్జనపై వారి ఆరోగ్య ప్రభావం వంటి ప్రజల జీవితాల తాలూకు నిర్దిష్ట, అత్యంత సూక్ష్మ అంశాలపై వారు తమ పరిశోధనలను కేంద్రీకరించారు. తద్వారా, నిత్య జీవితంలో విద్య, వైద్యం వంటి రంగాల్లో తలెత్తు తున్న సమస్యలను పరిష్కరించేందుకుగాను మనం అంతకుముందు ఎన్నడూ ఆలోచించి ఉండని పరిష్కారాలను వారు ముందుకు తెచ్చారు. కాగా, ప్రభుత్వాల ఆర్థిక విధానాలూ, అవి ఆర్థిక వ్యవస్థ యాజ మాన్యంలో అనుసరించే భిన్నమార్గాలు అనేవి అభిజిత్ ఆయన సహ చరుల దృష్టిని కేంద్రీకరించిన సూక్ష్మస్థాయి అంశాలను ప్రభావితం చేసేవిగా ఉండగలవు. ఉదాహరణకు ప్రభుత్వ విధానాలు మారి, కార్పొరేట్లకు, ధనికులకు పన్నురాయితీలూ సబ్సిడీలు ఇవ్వడం కాకుండా వారిపై మరింతగా పన్నులు విధించడం వంటిది చేయ గలిగితే ప్రభుత్వ ఖజానాకు అదనపు నిధులు సమకూరుతాయి. ఆ స్థితిలో, నిధుల కొరత పరిస్థితుల్లో ఆమలు జరప వీలైనవిగా అభిజిత్, ఆయన సహచరులు చెప్పిన సూక్ష్మస్థాయి విధానాలకే ప్రభు త్వాలు పరిమితం కానవసరం ఉండదు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యానికి, అభిజిత్ సూచించిన పైన పేర్కొన్న పరిష్కార మార్గాల అమలుకు కావల్సిన వనరులు ప్రభుత్వం వద్ద ఉంటాయి. కాబట్టి అభిజిత్‌కు నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టిన విద్యా, వైద్య రంగా లలోని ప్రభావవంతమైన సూక్ష్మస్థాయి కార్యాచరణతోపాటుగా ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రపంచంలోని ఆర్థిక అసమానతలపై విస్తృత పరిశోధనలు చేసిన థామస్ పికెట్టీ వంటి వారు సూచించిన, వ్యవస్థా గతంగానే మౌలిక మార్పులను తెచ్చే విధానాలు కూడా నేటి తక్షణ అవసరం.. ఆగత్యం కూడా..!! డి. పాపారావు వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు ‘ మొబైల్ : 98661 79615 -
విశ్వ రహస్యాలు.. వినూత్న బ్యాటరీ
స్టాక్‌హోమ్: ముగ్గురు అంతరిక్ష పరిశోధకులు.. కెనడియెన్ అమెరికన్ జేమ్స్ పీబుల్స్, స్విట్జర్లాండ్‌కు చెందిన మైఖేల్ మేయర్, డిడియర్ క్యులోజ్‌లకు 2019 సంవత్సరానికి భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. వీరిలో పీబుల్స్‌కు ప్రైజ్ మనీ(9.14 లక్షల అమెరికన్ డాలర్లు – రూ. 6.5 కోట్లు)లో సగం, మిగతా ఇద్దరికి తలా 25 శాతం అందుతుందని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. బిగ్ బ్యాంగ్ అనంతరం విశ్వం ఎలా రూపాంతీకరణ చెందినదనే విషయంపై జేమ్స్ పీబుల్స్ చేసిన పరిశోధనలకు గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అకాడెమీ పేర్కొంది. 1995 అక్టోబర్‌లో తొలిసారి మన గ్రహ వ్యవస్థకు ఆవల, సూర్యుని తరహా నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఓ గ్రహాన్ని గుర్తించినందుకు స్విస్ పరిశోధకులు మేయర్, క్యులోజ్‌లకు ఈ అవార్డ్ అందజేయనున్నట్లు తెలిపింది. ఈ ముగ్గురి పరిశోధనలు విశ్వంపై మన అవగాహనను మరింత పెంచాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ గోరన్ హాన్సన్ ప్రశంసించారు. విశ్వంలో మనకు తెలిసిన గ్రహాలు, నక్షత్రాలు, ఇతర వివరాలు కేవలం 5 శాతమేనని, మిగతా 95 శాతం మనకు తెలియని కృష్ణ పదార్థం(డార్క్ మాటర్), దాని శక్తేనని పీబుల్స్ పరిశోధనల ద్వారా వెల్లడైనట్లు చెప్పారాయన. డార్క్ మాటర్, డార్క్ ఎనర్జీలపై ఇంకా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని, అవార్డ్ ప్రకటన అనంతరం ఒక ఇంటర్వ్యూలో 84 ఏళ్ల పీబుల్స్ స్పష్టం చేశారు. ప్రిన్స్టన్ యూనివర్సిటీలో సైన్స్ బోధిస్తున్న పీబుల్.. ఎంతో ఆసక్తి ఉంటే తప్ప సైన్స్ వైపు రావద్దని విద్యార్థులకు సూచించారు. యూనివర్సిటీ ఆఫ్ జెనీవాలో ప్రొఫెసర్లుగా ఉన్న మేయర్(77), క్యులోజ్(53)లు 1995లో ఫ్రాన్స్‌లోని తమ అబ్జర్వేటరీ నుంచి సూర్యుడి నుంచి 50 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మరో సూర్యుడి తరహా నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఒక గ్రహాన్ని గుర్తించారు. అది మన గ్రహవ్యవస్థకు ఆవల గురు గ్రహ పరిమాణంలో ఉంది. ఆ గ్రహానికి ‘51 పెగాసస్ బీ’ అని నామకరణం చేశారు. 97 ఏళ్ల వయస్సులో... నోబెల్ వరించింది లిథియం–అయాన్ బ్యాటరీ రూపకర్తలైన ముగ్గురు శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని బుధవారం ప్రకటించారు. అమెరికాకు చెందిన జాన్ గుడినఫ్, బ్రిటన్ శాస్త్రవేత్త స్టాన్లీ విటింగ్‌హమ్, జపాన్‌కు చెందిన అకిరా యోషినొలు 9,14,000(రూ. 6.5 కోట్లు) అమెరికా డాలర్ల ప్రైజ్‌మనీని సమంగా పంచుకుంటారు. వీరిలో 97 ఏళ్ల వయసులో ఈ పురస్కారం అందుకోనున్న గుడినఫ్.. నోబెల్ పురస్కార గ్రహీతల్లో అత్యంత పెద్ద వయస్కుడు కావడం విశేషం. ‘వీరు రూపొందించిన తక్కువ బరువుండే రీచార్జ్ చేయగల లిథియం బ్యాటరీలు ఎలక్ట్రానిక్ రంగంలో చరిత్ర సృష్టించాయి. మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటినే వినియోగిస్తున్నారు. ఇవి సౌర, పవన శక్తిని సైతం స్టోర్ చేసుకోగలవు. శిలాజేతర ఇంధన రహిత సమాజం సాధ్యమయ్యేలా వీరి పరిశోధనలు ఉపకరించాయి’ అని నోబెల్ కమిటీ ప్రశంసించింది. 1991లో మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఈ లిథియం బ్యాటరీలు మన జీవితాల్లో పెద్ద మార్పును తీసుకువచ్చాయని పేర్కొంది. స్టాన్లీ విటింగ్‌హమ్, జాన్ గుడినఫ్, అకిరా యోషినొ కనిపించేది 5 శాతమే బిగ్‌బ్యాంగ్ తర్వాత ఏం జరిగిందంటే... జేమ్స్ ఆవిష్కరించిన విశ్వ రహస్యాలేమిటి? సుమారు 24 ఏళ్ల క్రితమే సౌరకుటుంబానికి ఆవల తొలి ఎక్సోప్లానెట్‌ను గుర్తించిన మేయర్, డిడీర్ల పరిశోధన ఏమిటి? సుమారు 1470 కోట్ల ఏళ్ల క్రితం ఓ భారీ విస్ఫోటనం (బిగ్ బ్యాంగ్) కారణంగా ఈ విశ్వం పుట్టిందని మనం విన్నాం. అణువంత ప్రాంతంలోనే పదార్థమంతా అత్యధిక వేడి, సాంద్రతతో ఉన్నప్పుడు జరిగిన విస్ఫోటనం తరువాత ఏర్పడ్డ విశ్వం క్రమేపీ చల్లబడటంతోపాటు విస్తరించడమూ మొదలైంది. సుమారు నాలుగు లక్షల సంవత్సరాల తరువాతి నుంచి విశ్వం మొత్తం పారదర్శకంగా మారిపోవడంతో బిగ్‌బ్యాంగ్ కాలం నాటి కాంతి సుదూర ప్రాంతాలకు ప్రయాణించడం మొదలైంది. కాస్మిక్ బ్యాక్‌గ్రౌండ్ రేడియేషన్ అని పిలిచే ఈ కాంతి ద్వారా విశ్వం తాలూకూ ఆనుపానులు అనేకం తెలుసుకోవచ్చునని జేమ్స్ పీబుల్స్ చెబుతారు. 1960లలోనే ఈయన విశ్వం నిర్మాణం, విస్తృతి వంటి అంశాలపై పలు ఆవిష్కరణలు చేశారు. పీబుల్స్ చెప్పేది ఏమిటంటే... విశ్వంలో మొత్తం కిలో గ్రాము పదార్థం ఉందనుకుంటే.. మన చుట్టూ ఉన్న చెట్టూ చేమ, కంటికి కనిపించే గ్రహాలు, నక్షత్రాలు, కనిపించని ఇతర పదార్థమూ కలుపుకుని ఉన్నది 50 గ్రాములే. మిగిలిన 950 గ్రాముల పదార్థం కృష్ణశక్తి, కృష్ణ పదార్థం. ఈ రెండింటి వివరాలు తెలుసుకోవడం ఈనాటికీ భౌతిక శాస్త్రవేత్తలకు ఓ సవాలే. మరో ప్రపంచం, నవలోకం! 1995లో మైకేల్ మేయర్, డిడీర్ క్వెలోజ్‌లు తొలిసారి సౌరకుటుంబానికి ఆవల మన పాలపుంతలోనే ఇంకో గ్రహం ఉన్నట్లు గుర్తించారు. ఫ్రాన్స్‌లోని హాట్ ప్రావిన్స్ ్ఞఅబ్జర్వేటరీలో పరిశోధనలు చేసిన వీరు గుర్తించిన తొలి ఎక్సోప్లానెట్ పేరు పెగాసీ 51బి. ఇది మన గురుగ్రహాన్ని పోలి ఉంటుంది. అప్పటివరకూ సౌర కుటుంబానికి ఆవల గ్రహాలుండవన్న అంచనాతో ఉన్న భౌతిక శాస్త్రవేత్తలు ఆ తరువాత బోలెడన్ని పెద్ద గ్రహాలను గుర్తించారు. నాసా ప్రయోగించిన హబుల్, కెప్లర్ టెలిస్కోపులు పంపిన సమాచారం ఆధారంగా చూస్తే ఇప్పటివరకూ సుమారు 4000 ఎక్సో ప్లానెట్లను గుర్తించినట్లు తెలుస్తుంది. ఇదంతా ఆకాశంలో ఒక దిక్కున చిన్న ప్రాంతానికి సంబంధించినదే. ఆకాశం మొత్తాన్ని జల్లెడ పడితే వేల, లక్షల సంఖ్యలో ఎక్సోప్లానెట్లు గుర్తించవచ్చనేది అంచనా. గ్రహాల రూపురేఖలు, నిర్మాణాలపై శాస్త్రవేత్తలకు ఉన్న అవగాహన మొత్తాన్ని వీరిద్దరూ మార్చేశారనడంలో ఏమాత్రం సందేహం లేదు. చుట్టూ ఉన్న గ్రహాల గురుత్వాకర్షణ ప్రభావానికి గురయ్యే నక్షత్రాల కాంతిలో మార్పులొస్తుంటాయి. ఈ మార్పుల ఆధారంగానే మేయర్స్, డీడీర్లు పెగాసీ 51బీని గుర్తించారు. ఎలక్ట్రానిక్ శకానికి నాంది స్మార్ట్ఫోన్లు మొదలుకొని... విద్యుత్తు బస్సుల వరకూ అన్నింటినీ నడిపే అత్యంత శక్తిమంతమైన బ్యాటరీని తయారు చేసిన శాస్త్రవేత్తల త్రయమే స్టాన్లీ విటింగ్‌హ్యామ్, జాన్ గుడ్ఇనఫ్, అకిర యోషినో. తేలికగా ఉంటూ... పలుమార్లు రీచార్జ్ చేసుకునేందుకు అవకాశం కల్పించే లిథియం అయాన్ బ్యాటరీతో దైనందిన జీవితంలో వచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు. సౌర, పవన విద్యుత్తును సమర్థంగా తనలో నిక్షిప్తం చేసుకోగల ఈ బ్యాటరీలు.. పెట్రోలు, డీజిళ్లపై ఆధారపడటాన్ని తగ్గించి పర్యావరణానికి ఎంతో మేలు చేశాయి. పెట్రో పొగలతో మార్పు.. 1970ల్లో పెట్రోలు, డీజిళ్ల వినియోగం పెరిగాక నగరాలు నల్లటి పొగలో కూరుకుపోయాయి. పైగా ఈ శిలాజ ఇంధనాలు ఏనాటికైనా కరిగిపోక తప్పదన్న అంచనాలు బలపడటంతో ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సమయంలోనే స్టాన్లీ విటింగ్‌హ్యామ్ కాథోడ్ తయారీ కోసం ఓ వినూత్నమైన పదార్థాన్ని గుర్తించారు. టైటానియం డైసల్ఫైడ్ అతితక్కువ స్థలంలో ఎక్కువ మోతాదులో విద్యుత్తును నిల్వ చేసుకోగలదని గుర్తించారు. మెటాలిక్ లిథియంతో తయారైన ఆనోడ్‌ను ఉపయోగించినప్పుడు రెండు వోల్టుల సామర్థ్యమున్న తొలి లిథియం అయాన్ బ్యాటరీ తయారైంది. మరోవైపు స్టాన్లీ విటింగ్‌హ్యామ్ ఆవిష్కరణ గురించి తెలుసుకన్న జాన్ గుడ్ ఇనఫ్... అందులోని కాథోడ్ను మెటల్ సల్ఫైడ్‌తో కాకుండా మెటల్ ఆక్సైడ్తో తయారు చేస్తే సామర్థ్యాన్ని మరింత పెంచవచ్చునని కనుగొన్నారు. కోబాల్ట్ ఆక్సైడ్‌ను వాటం ద్వారా సామర్థ్యాన్ని నాలుగు వోల్టులకు పెంచగలిగారు. అంతేకాదు.. బ్యాటరీలను ఫ్యాక్టరీల్లోనే చార్జ్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. 1980లో గుడ్ ఇనఫ్ ఈ అంశాలపై ప్రచురించిన పరిశోధన వ్యాసాలు వైర్లెస్ రీచార్జబుల్ బ్యాటరీల శకానికి నాంది పలికాయి. చిన్న సైజు బ్యాటరీల కోసం యోషినో ప్రయత్నాలు... ఎలక్ట్రానిక్ పరికరాల్లో చిన్న బ్యాటరీల తయారీ అవసరమని గుర్తించిన అకిర యోషినోతో ఆ దిశగా పరిశోధనలు చేపట్టారు. ఆసాహీ కాసై కార్పొరేషన్లో పనిచేస్తున్న ఆయన గుడ్ ఇనఫ్ బ్యాటరీల్లో కార్బన్ ఆధారిత ఆనోడ్‌ను చేర్చేందుకు ప్రయత్నించారు. పెట్రోలియం కోక్‌ను వాడినప్పుడు వచ్చిన ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో ప్రస్తుతం మనం వాడుతున్న లిథియం అయాన్ బ్యాటరీ రూపుదిద్దుకుంది. తేలికగా ఉండటం, అత్యధిక సామర్థ్యం కలిగి ఉండటం యోషినో బ్యాటరీల ప్రత్యేకత. పైగా ఎక్కువసార్లు చార్జింగ్ చేసుకునేందుకూ వీలూ ఉంది. 1991లో వాణిజ్యస్థాయిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ మొదలు కావడంతో మొబైల్ఫోన్ల సైజు తగ్గడంతోపాటు అరచేతిలో ఇమిడిపోయే ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్లూ, ఎంపీ3 ప్లేయర్లు అందుబాటులోకి వచ్చేశాయి. అప్పటి నుంచి ఇప్పటివరకూ మరింత శక్తిమంతమైన బ్యాటరీ కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నా సాధించింది కొంతే. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
జగతి గుండె తట్టిన అక్షర వర్షం
1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ముగిసిన మూడేళ్లకి టాగోర్ (1861) జన్మించారు.జీవితం మొత్తం వలస సామ్రాజ్యంలో సాగింది. అక్షరాల మీద ఆంక్షలు. భావాల మీద నిషేధాల బరువు. అయినా ఎంత ఎత్తుకుఎదిగారాయన! ‘నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు/ కానీ కలమెత్తితే నాకు/ ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది...’ అంటారు శేషేంద్ర. మరి మూడు దేశాల జెండాల రెపరెపల మధ్య వినిపించే గీతాల కోసం ఎత్తిన ఆ కవి కలానికి ఇంకెంత ఘనత ఉండాలి? అంతటిది– విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ కలం.ప్రపంచ చరిత్రలో, భారత దేశచరిత్రలో టాగోర్ శిఖరాయమానమైన వ్యక్తి. కవితలలో తాను పోహళించిన పదాల మీద పాదముద్రలు వేయమని దేశద్రిమ్మర విహంగాలను కోరినవాడు (స్ట్రేబర్డ్స్) కదా! ఆ పక్షులు విశ్వకవి నామం మీద తమ పాదముద్రలను వేసి ఉంటాయి. అందుకే ఆ పేరు రెక్కలు ధరించి ఖండాంతరాలకు దూసుకుపోయింది. కాబట్టే ఈ జగత్తు అనంతత్వం అనే తన మహా ముసుగును తొలగించుకుని ఒక చిన్నపాటగా ఆ కవీశ్వరుడి కలంలో ఒదిగిపోయి ఉంటుంది. అలాంటివి ఎన్ని పాటలో! ‘ప్రభు’కు సమర్పించిన ‘గీతాంజలి’ నిండా అలాంటి పాటలే. ఏ గీతంలో అయినా విశ్వమంత భావ వైశాల్యం. సాగర గర్భమంత తాత్వికత. 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ముగిసిన మూడేళ్లకి టాగోర్ (1861) జన్మించారు. జీవితం మొత్తం వలస సామ్రాజ్యంలో సాగింది. అక్షరాల మీద ఆంక్షలు. భావాల మీద నిషేధాల బరువు. అయినా ఎంత ఎత్తుకు ఎదిగారాయన! తాత ద్వారకానా«థ్ టాగోర్ బ్రహ్మసమాజంలో తిరుగుబాటు వర్గానికి నాయకుడు. తండ్రి దేవేంద్రనాథ్ టాగోర్. ఆయన సంస్కర్త, దాత, సమాజ సేవకుడు. పదకొండో ఏట తండ్రితో కలసి హిమాలయాలను దర్శించారు రవికవి. తండ్రి చేయి పట్టుకుని భారతావనిని దర్శిస్తూనే కాళిదాసునీ చదివారాయన. సంప్రదాయ విద్య అంటే అప్పటికే లోపల తీవ్ర నిరసన. ఇంగ్లండ్‌లో చదివినా పట్టా పుచ్చుకోకుండానే తిరిగి స్వదేశం చేరుకున్నారు. చిన్నారులకు మాతృభాషలోనే చదువు చెప్పాలన్నది టాగోర్ ప్రగాఢ విశ్వాసం. విదేశీ భాషతో బరువైన విషయాలు పిల్లల మనసుల్లో దట్టించాలని చూడడం సరికాదన్నారాయన. నాలుగు గోడల మధ్య బంధించి చదువు చెప్పడం అసలే మంచిది కాదంటారాయన. రుషి వాటికలలోని గురుకులాలను పోలిన వాతావరణంలో ప్రకృతి పరిసరాల నడుమ, ఆడుతూ పాడుతూ పాఠాలు చెప్పాలి. పిల్లలు అలాగే వినాలి. ప్రకృతే ఉత్తమ గురువన్నది ఆయన అభిప్రాయం. అందుకే శాంతినికేతన్ ఏర్పాటు చేసిన తరువాత తరగతి గదులలో పిల్లలని బంధించకుండా చెట్ల నీడను చదువు చెప్పేవారాయన. వందేళ్ల క్రితమే ఆయన పిల్లల కోసం రాసిన ‘చిలుక కథ’ సంప్రదాయ విద్య పట్ల టాగోర్‌కు ఎంత ఏవగింపో తెలియచేస్తుంది. ఆ కథ ఒక అద్భుతం. రాజగురువులు చెప్పిన చదువును తట్టుకోలేక ప్రాణాలు వదిలిందా చిలుక– ఇప్పటి చిన్నారుల బాధను గుర్తుకు తెస్తూ. ‘చిలుక కథ’ మాత్రమేనా! ఎన్నెన్ని గొప్ప రచనలు చేశారని! నవలలు, నాటకాలు, నాటికలు, కథలు, చిన్న పిల్లల కథలు... ఇక కవిత్వం సరేసరి. ద్విపదుల వంటి స్ట్రేబర్డ్స్ కవితలు, మరణం కూడా ఉత్తరం లాంటిదేనని చెబుతూ రాసిన ‘పోస్టాఫీస్’ నాటకం అమోఘం బెంగాల్‌కే కాదు, భారతదేశం మొత్తం మీద చెప్పుకోదగిన కళాహృదయుడు టాగోర్. ఆయన రాసిన 103 గీతాల మాలిక ‘గీతాంజలి’. ఎలాంటి గీతాలు! ‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో/ ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతాడో/ ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో... ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి, తండ్రీ నా దేశాన్ని మేల్కాంచేటట్టు అనుగ్రహించు’ అన్నారాయన (అను: బెల్లంకొండ రామదాసు). ఈ గీతం మధ్యలోనే రాసిన మరో వాక్యం చదివితే జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది, ‘ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలో ఇంకిపోదో...’ అలాంటి చోటికి దేశాన్ని నడిపించాలని ఆకాంక్షించారాయన. అందుకే మరి, విఖ్యాత ఇంగ్లిష్ నాటకకర్త బెర్నార్డ్‌షా ఉండగా, బానిసదేశంలో ఎదిగిన కవికి సాహిత్య నోబెల్ (1913) ఇవ్వడం ఏమిటని శ్వేత దురహంకారం ప్రశ్నించినా, వాటికి విలువ లేకుండా పోయింది. టాగోర్‌కు పురస్కారం సబబేనంటూ విలియం బట్లర్ యేట్స్ అక్కడ ఉద్యమించాడు. గీతాంజలి ఆంగ్లానువాదానికి ఆ ఐరిష్ మహాకవే ముందుమాట రాశారు. అందులో అంటారాయన, ‘ఈ అనువాదాల వ్రాత ప్రతిని కొన్ని రోజుల పాటు నా వెంట తీసుకుని రైళ్లలో, బస్సులలో, రెస్టారెంట్లలో చదివేవాడిని. అది నన్ను ఎంతగా కదిలించి వేసిందో.. కొత్తవారు ఎవరైనా చూస్తారేమోనని తరుచుగా పుస్తకం మూసివేయవలసి వచ్చేది’. చిత్రమేమిటంటే నోబెల్ బహుమతి స్వీకారోత్సవానికి టాగోర్ హాజరు కాలేదు. ఆ సంవత్సరం నవంబర్‌లో విజేతలను ప్రకటించారు. డిసెంబర్లో ఉత్సవం జరిగింది. 1914 జనవరిలో నాటి బెంగాల్ గవర్నర్ దానిని రవీంద్రుడికి అందచేశారు. జనులందరిలోను నిన్ను నీవు, నీలో జనులందరినీ దర్శించుకుంటే నీవు ఎవరినీ ద్వేషించవు’ అని అర్థం చెప్పే ఒక ఉపనిషత్ శ్లోకంతో కూడిన ఉపన్యాసాన్ని టాగోర్ నోబెల్ కమిటీకి పంపారు. దానిని అప్పుడు చదవలేదు. ఎనిమిదేళ్ల తరువాత అది బయటపడింది. స్వీడిష్ అకాడమి దానిని భద్రపరచింది. టాగోర్‌కు వచ్చిన పుష్కరం తరువాత 1925లో షాకి ఆ పురస్కారం దక్కింది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలోను, యుద్ధం తరువాత తాము ఎదుర్కొన్న సంకట స్థితికి ప్రాగ్దిశ నుంచి వచ్చిన సమాధానంగా ‘గీతాంజలి’ని పాశ్చాత్యులు భావించారు. అంత సాంత్వన ఇచ్చిందా కవిత్వం. గాంధీజీ, టాగోర్‌ల బంధాన్ని గమనించినా ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. గాంధీజీని ‘మహాత్ముడు’ అని మొదటిగా సంబోధించినవారిలో టాగోర్ ఒకరు. గాంధీజీ టాగోర్‌ను గురుదేవ్ అని పిలిచేవారు. గాంధీజీ ఉద్యమకారుడు. జనాన్ని కదిలించారాయన. కానీ ఉద్యమానికి తాత్వికతను అందించినవారు టాగోర్. జాతీయోద్యమం పట్ల టాగోర్ ఒక కవిగా, తాత్వికునిగానే స్పందించారు. 1915లో గాంధీజీ భారతదేశానికి వచ్చిన తరువాత కలుసుకున్నవారిలో టాగోర్ ఒకరు. కానీ గాంధీజీ చెప్పిన ప్రతి మాటనీ, ప్రతి చర్యనీ టాగోర్ సమర్థించలేదు. 1921 నాటికి గాంధీజీ సహాయ నిరాకరణోద్యమంతో భారతదేశం ఊగిపోయింది. కానీ ఆ ఉద్యమాన్ని టాగోర్ సమర్థించలేదు. గాంధీజీ శాంతినికేతన్‌కు వచ్చి మద్దతు అడిగినా అంగీకరించలేదు. అలాగే రోజూ అరగంట చరఖా వడకమని, దీనితో స్వాతంత్య్రం వస్తుందని గాంధీజీ చేసిన ప్రకటనకు ‘చరఖా వడకడంతోనే ఆరు మాసాలలో వచ్చే స్వాతంత్య్రం కోరుకోదగిన స్వాతంత్య్రం కాబోదు’ అని టాగోర్ జవాబు ఇచ్చారు. టాగోర్ మహోన్నత దేశభక్తుడు. భారత స్వాతంత్య్రోద్యమాన్ని ఎంతో ప్రేమించారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 1886లో భారత జాతీయ కాంగ్రెస్ తొలి వార్షిక సమావేశం కలకత్తాలోనే జరిగింది. ఇందుకోసం టాగోర్ ఒక దేశభక్తి గీతం రాశారు. బెంగాల్ విభజన (1905)కు వ్యతిరేకంగా పెల్లుబికిన వందేమాతరం ఉద్యమంలో టాగోర్ చురుకుగా పాల్గొన్నారు. 1911 నాటి కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో ‘జనగణమన అధినాయక జయహే...’ అంటూ ఎలుగెత్తి పాడారు. నిజమే, గాంధీజీలో తనకు నచ్చని అంశాన్ని టాగోర్ నిర్మొహమాటంగా వ్యక్తీకరించారు. బ్రిటిష్ ప్రభుత్వం విషయంలోనూ అంతే. అందుకే ఆయన నిజమైన కవి అనిపిస్తాడు. నోబెల్ పురస్కారం అందుకున్న తరువాత టాగోర్‌కు బ్రిటిష్ ప్రభుత్వం 1915లో ‘సర్’ బిరుదుతో సత్కరించింది. కానీ 1919లో జరిగిన జలియన్‌వాలాబాగ్ మారణహోమానికి నిరసనగా ఆ బిరుదాన్ని తిరిగి ఇచ్చేశారాయన. టాగోర్ అంతర్జాతీయవాది. కానీ ఆయన అంతర్జాతీయవాద దృష్టిని దారుణంగా భగ్నం చేసిన ఘట్టం మొదటి ప్రపంచ యుద్ధం. ఆ యుద్ధం ఆయనను కలచివేసింది. అంతర్జాతీయ కవిగా, విశ్వమానవునిగా ఎదుగుతున్న క్రమంలోనే ఎన్నో విషాదాలను టాగోర్ చవి చూడవలసి వచ్చింది. తం్రyì 1905లో మరణించారు. అంతకు ముందే, అంటే 1902లోనే భార్య మృణాళిని కన్నుమూసింది. తనకు స్ఫూర్తినిచ్చిన పెద్దన్న ద్విజేంద్రనాథ్ మరణించారు. ఆయన కవి, గాయకుడు. తత్వవేత్త. పెద్దన్నయ్య టాగోర్‌కు గొప్ప ప్రేరణ. ద్విజేంద్రనాథ్ భార్య కాదంబరి. ఆమె కూడా టాగోర్‌కు ఎంతో ఆప్తురాలు. ఆమె తన 25వ ఏట ఆత్మహత్య చేసుకున్నారు. ఇది కూడా టాగోర్‌ను కుంగదీసింది. టాగోర్‌కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందులో ఒక కూతురు, ఒక కుమారుడు మాత్రమే మిగిలారు. ఎన్నోసార్లు ఆరోగ్యం క్షీణించింది. అయినా తుది శ్వాస విడిచేవరకు టాగోర్ కలాన్ని విడిచిపెట్టలేదు. జనగణమన అధినాయక జయహే పాటలోని భారత భాగ్యవిధాత పదం జార్జి చక్రవర్తిని గురించి రాసినదని టాగోర్ వ్యతిరేకులు ప్రచారం చేసినా, పండిట్ నెహ్రూ ఆ గీతాన్ని జాతీయ గీతంగా ప్రకటించారు. తరువాత బంగ్లాదేశ్ ఆవిర్భవించిన తరువాత ‘అమర్ సోనార్ బంగ్లా’ (నా బంగరు బంగ్లా) అన్న పాటను ఆ దేశం జాతీయగీతంగా స్వీకరించింది. ఇది టాగోర్ గీతమే. అయితే శ్రీలంక జాతీయగీత రచన మీద కూడా రవీంద్రుని ప్రభావం ఉంది. ఈ పాటను (నమో నమో మాతా, అప శ్రీలంక) ఆనంద సమరాకూన్ అనే సింహళీయుడు రాశారు. ఆయన శాంతినికేతన్ విద్యార్థి. నమో నమో అంటూ టాగోర్ రాసిన ఒక గీతాన్ని ఆయన సింహళంలోకి అనువదించుకున్నారు. దానినే తరువాత జాతీయ గీతం పోటీలకు పంపితే అందుకు ఎంపికైంది. ఇది కొద్దిమందికే తెలుసు. మరొక్క సంగతి కూడా కొద్దిమందికే తెలుసు. మైఖేల్ జాక్సన్ ఆఖరిరోజులలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్‌ను కలుసుకున్నారు. రహమాన్‌తో కలసి పనిచేయాలనీ, అంతర్జాతీయ సమాజానికి కానుకగా ఒక గీతాన్ని అందించాలనీ ఆకాంక్షను వెలిబుచ్చారు. సంగీతం రహమాన్. గానం జాక్సన్. పాట మాత్రం రవీంద్రనాథ్ టాగోర్ రాసినది తీసుకోవాలని కోరాడు జాక్సన్. టాగోర్ వీరాభిమాని జాక్సన్ విషాదంగా మరణించాడు. టాగోర్ ఇప్పటికీ కవితా ప్రపంచంలో జీవించే ఉన్నారు. కానీ ఆయన భౌతికంగా మరణించింది 1941లో. ఆఖరికి మృత్యువు గురించి ఎంత గొప్పగా రాశారో! మృత్యువును అతిథిగా భావించారాయన. ‘ఓ.. నా అతిథి ఎదుట నా పూర్ణ జీవిత కలశాన్ని ఉంచుతాను. రిక్తహస్తాలతో అతడిని ఎప్పటికీ తిరిగిపోనివ్వను’ (గీతాంజలి–90). టాగోర్ జీవితం ఒక సంక్షుభిత ప్రపంచానికి ప్రత్యక్ష సాక్షి. స్వదేశంలో బ్రిటిష్ జాతి దారుణాలను చూశారాయన. రెండు ప్రపంచ యుద్ధాలు ఈ భూమ్మీద సృష్టించిన ఉష్ట రక్తకాసారాలను వీక్షించారు. నియంతలను చూశారు. అయినా మనిషి మీద నమ్మకం పోగొట్టుకోలేదు. అందుకే ‘ఇక్కడి నుంచి నిష్క్రమించే ముందు నేనొక తుది మాట చెప్పి వెళ్లిపోతాను. నేను దర్శించినదంతా అద్భుతం’ (గీతాంజలి–96, అను: నండూరి రామమోహనరావు) అన్నారాయన. జీవితమంటే, లోకమంటే ఎంత ప్రేమ! నడుస్తున్న చరిత్ర నుంచి కవి, కవిత్వం నుంచి మామూలు మనిషి నేర్వాల్సింది ఇదే! – డా. గోపరాజు నారాయణరావు -
విజ్ఞానంతోనే వికాసం
• దేశ పురోగమనానికి, యువత వికాసానికి విజ్ఞానమే మూలం • ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ పునరుద్ఘాటన... • ముగిసిన 104వ ప్లీనరీ • 5 ప్రధాన, 30 ఉపభేటీలు..105వ ఇస్కా వేదిక భువనేశ్వర్ • సైన్స్, టెక్నాలజీ ప్రాధాన్యతతో పలు అంశాలపై చర్చలు తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఐదు రోజు ల పాటు జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 104వ సదస్సు శనివారంతో ముగిసింది. యువత వికాసానికి, దేశ పురోగమనానికి విజ్ఞానాభివృద్ధే మూలమని సదస్సు పునరుద్ఘా టించింది. ఈనెల 3న ప్రధాని నరేంద్రమోదీ సదస్సును ప్రారంభించారు. ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు హర్షవర్దన్, సుజనాచౌదరి, ముగింపు సభలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు తదితరు లు పాల్గొన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా 6వ మహిళా సైన్స్ కాంగ్రెస్, బాలల సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు కూడా జరిగాయి. మైసూర్లో జరిగిన 103వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో ప్రతిపాదించిన 2035 విజన్ డాక్యుమెంటు ఆధారంగా దేశపురోభివృద్ధికి 12 రంగాలను నీతి ఆయోగ్ గుర్తించిందని, ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించిందని ప్రధాని మోదీ తన ప్రారంభోపన్యాసంలో చెప్పారు. కాగా, ‘సైన్స్ అండ్ టెక్నాలజీ– దేశ పురోభి వృద్ధి’ భావన(థీమ్)తో సాగిన ఈ ప్లీనరీ సమావేశాల్లో రోజుకు 5 ప్రధాన సమావేశాలు, 30 వరకు ఉప భేటీలు జరిగాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేక ఆవిష్కరణల గురించి శాస్త్రవేత్తలు వివరించారు. వినూత్న సాంకేతిక పరిజ్ఞానం పోకడలను ప్రతిబింబించడంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నూటికి నూరుపాళ్లు విజయవంతమైందనే చెప్పాలి. వచ్చే ఏడాది నిర్వహించాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల వేదికగా భువనేశ్వర్‌ను ఎంపికచేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ 2017–18 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను, కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. పరిశోధనలకు నిధుల కొరత.. భారత్‌లో పరిశోధనలకు లేబొరేటరీలు, ఇతర వనరులతో పాటు నిధుల కొరత తీవ్రంగా ఉందనే అభిప్రాయం ఇస్కా 104 సమా వేశాల్లో వ్యక్తమైంది. రక్షణ, అంతరిక్ష పరిశోధనా రంగాల్లో దేశం సాధిస్తున్న ప్రగతి గురించి తదుపరి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చలు జరిగా యి. ఇంధన, పారిశ్రామిక రంగాల్లో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలూ ప్రస్తావనకు వచ్చాయి. ఈ రంగాల్లో భారత్ ఇతర దేశాల కన్నా భిన్నమైన పరిశోధనలు ఏమీ తెరమీదకు రాలేదు. సోలార్ ఎనర్జీలో స్విట్జర్లాండ్, దుబాయ్ వంటి దేశాలు చౌకగా విద్యుత్ ఇచ్చే టెక్నాలజీని సెమినార్లో పరిచయం చేశాయి. కానీ మన దేశంలో మాత్రం ఇంకా సోలార్ సమస్యలే ఉన్నాయని, వీటిపై క్షేత్రస్థాయి పరిశోధనలు జరగాలని మన శాస్త్రవేత్తలు అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధీకరణలో పలు దేశాలు నాణ్యమైన టెక్నాలజీని ఈ సదస్సు ద్వారా పరిచయం చేసే ప్రయత్నం చేశాయి. మన దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలనే అభి వృద్ధి చేసుకోలేదని ఒప్పుకోవాల్సి వచ్చింది. అణుథార్మికతపై జరిగిన సెమినార్లో చాలా మంది విదేశీ టెక్నాలజీని భారత్ ఎలా దిగుమతి చేసుకుంటోంది, వాటివల్ల ప్రయోజ నాలు ఏమిటి అనేది చెప్పారు. జన్యు ఎడిటింగ్ చేరువవుతోంది... ఆహారం నుంచి ఆరోగ్యం వరకూ మానవజాతి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కా రంగా భావిస్తున్న జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ ఈ సైన్స్ కాంగ్రెస్ ద్వారా భారతీయులకు ఒకింత చేరువైంది. జన్యువుల్లో అతిసులువుగా మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం కల్పించే క్రిస్పర్ క్యాస్–9 టెక్నాలజీపై కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల్లో ఓ ముసాయిదా విధానాన్ని సిద్ధం చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సలహాదారు ఎస్.ఆర్.రావు శుక్రవారం ప్రకటించారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిభను, నైపుణ్యతను మరోసారి చాటే భారత న్యూట్రినో అబ్జర్వేటరీపై ఈ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. భవిష్యత్తు అవసరాలకు పవన విద్యుత్తే ఆధారం కానుందని, భౌగోళిక సానుకూలత దృష్ట్యా పవన విద్యుత్తు ఉత్పత్తికి దేశంలో అనేక సానుకూలతలున్నాయని ఆ రంగంలోని శాస్త్రవేత్తలు వివరించారు. శాస్త్ర సాంకేతిక అంశాలతో పాటు ఉన్నత విద్యారంగం ఉన్నతికి తీసుకోవలసిన చర్యలపై యూజీసీ, న్యాక్ అధిపతులు, పలు యూనివర్సిటీల వీసీలు చర్చించారు. పాత తీర్మానాల అమలు ఎక్కడ? ప్రతి ఏటా సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరగడం సంతోషించదగ్గ విషయమే అయినా గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాల అమలు ఎంత అనేది ప్రశ్నార్థకం. సమస్యల్ని ఏకరవు పెడితే సరిపోదని ఏడాది కాలంలో ఏమి సాధించారో తెలియజేయాలని పలువురు కోరారు. కాగా సదస్సులో ఆరుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు, పలువురు దేశ, విదేశీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. విలియమ్ ఎస్కో(అమెరికా), టకాకి కజిత(జపాన్), సెర్జి హరోష్ (ఫ్రాన్స్), అడాయి యోనత్ (ఇజ్రాయెల్), మహ్మద్ యూనస్(బంగ్లాదేశ్), జీన్ టిరోలే(ప్రాన్స్), డాక్టర్ స్వామినాథన్, రక్షణ సలహాదారు సతీష్‌రెడ్డితో సహా దేశ, విదేశీ శాస్త్రవేత్తలు, కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, పలు విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు ఇతర ముఖ్యులు హాజరయ్యారు. వ్యవసాయానికి పెద్దపీట.. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే సుస్థిర వ్యవసా యాభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నందునేమో గానీ 104వ భారతీయ సైన్స్ కాంగ్రెస్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. పోషకాహారం, పర్యావరణ మార్పుల ప్రభావం, పంట మార్పిడి వంటి పలు అంశాలపై పెద్దఎత్తున చర్చ జరిగింది. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలపై ఏకంగా ఓ ప్లీనరీయే జరిగింది. మిగతా అన్ని అంశాలపై ఉప సద స్సులు జరిగాయి. నోబెల్‌కు రూ. 100 కోట్లపై విమర్శలు కాగా తెలుగు శాస్త్రవేత్తలు నోబెల్ బహుమతి సాధిస్తే రూ. 100 కోట్ల నగదు పురస్కారాన్ని అందిస్తామనడం, నోబెల్ ను సాధించడానికి చిట్కాలు చెప్పాలం టూ సీఎం చంద్రబాబు నోబెల్ గ్రహీత టకాకి కజితను అడగడం విమర్శలకు తావిచ్చింది. భట్రాగర్ అవార్డు గ్రహీత, ఇక్రిశాట్ శాస్త్రవేత్త రాజీవ్ కుమార్ వర్షి ఒకింత తీవ్రంగానే స్పందిస్తూ.. ఏపీలో నోబెల్ బహుమతులు గెలవడానికి అనువైన పరిస్థితులున్నాయో లేవో ముందు చూడాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై ఆలోచనలు చేయాలని చురకలంటించారు. పర్స్‌తో మొబైల్ చార్జింగ్! చూడ్డానికి పర్స్‌లా ఉన్నా దీనికో ప్రత్యేకత ఉంది. మీ మొబైల్ ఫోన్‌ను ఇం దులో పెట్టుకుని, జేబులో ఉంచితే చాలు బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. దీన్ని శక్తివంతమైన మైక్రాన్స్ తో తయారు చేశారు. థిన్ఫిల్మ్ టెక్నాలజీని జోడించారు. ఇందులోని మాడ్యుల్స్ రేడియేషన్ ద్వారా సూర్యరశ్మిని విద్యుత్‌గా మారుస్తాయి. దీంతో గంటసేపట్లోనే మీ మొబైల్ రీచార్జ్ అవుతుంది. ఇప్పుడే దీన్ని కొనేయాలనే ఆసక్తిగా ఉందా? అయితే మీరు కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది మార్కెట్లోకి రావడానికి మరింత సమయం పడుతుందని సైన్స్ కాంగ్రెస్‌కు వచ్చిన స్విట్జర్లాండ్ శాస్త్రవేత్త తెలిపారు. – తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ రోబో యూనివర్సిటీ క్యాంపస్: ఇప్పటివరకూ వైద్యులు శస్త్రచికిత్సలు చేస్తుంటే అవసర మైన సందర్భాల్లో రోబోలు సాయం చేస్తుండేవి. కానీ మున్ముందు రోబోలే శస్త్రచికిత్సలు చేస్తుంటే వైద్యులు వాటికి సహకరించే రోజులు రాబోతున్నాయని ఢిల్లీ ఐఐటీకి చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సుభీర్ కుమార్ సాహా పేర్కొన్నారు. సైన్స్ కాంగ్రెస్‌లో శనివారం ‘రోబోటిక్స్’ అంశంపై నిర్వహించిన సదస్సులో సాహా ప్రసంగించారు. మన దేశంలోకి ఇప్పటికే రోబోలు ప్రవేశించాయని, పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో వీటి వినియోగం పెరగనుందన్నారు. శస్త్రచికిత్సలు చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో వైద్యుల చేతులు వణికే అవకాశం ఉందని, రోబోటిక్ శస్త్ర చికిత్సల్లో ఈ పరిస్థితి ఉండదని చెప్పారు. అలాగే ఇప్పటివరకు శరీర భాగాలను కోసి ఆపరేషన్ చేయాల్సి వచ్చేదని, కానీ రోబోటిక్ విధానంలో సన్నని పరికరాన్ని శరీరంలోకి పంపి సులువుగా ఆపరేషన్ చేయొచ్చని వివరించారు. ముఖ్యంగా కేన్సర్ శస్త్రచికిత్సల్లో రోబోటిక్ విధానం మంచి ఫలితాలు ఇస్తోందని పేర్కొన్నారు. అలాగే డ్రోన్ల వినియోగం ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుందని చెప్పారు. మరికొన్ని రోజుల్లో భారత్‌లో కూడా డ్రోన్లను విస్తృతంగా వినియోగించే అవకాశం ఉందన్నారు. రోబోల కృత్రిమ మేధస్సు వల్ల ఎలాంటి నష్టముండదన్నారు. రోబోల వల్ల మానవ వనరుల వినియోగం తగ్గిపోతుందని, ఉపాధికి ప్రమాదం ఉంటుందన్న అనుమానాలున్నాయని, అయితే అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం లేదని చెప్పారు. -
'పాకిస్తానీ, భారతీయుడు కలసి పనిచేయగలరు'
-
'విశ్వశాంతికి అందరూ కృషి చేయాలి'
-
'పాకిస్తానీ, భారతీయుడు కలసి పనిచేయగలరు'
న్యూఢిల్లీ: ఒక పాకిస్థానీ, ఒక భారతీయుడు కలసి పనిచేయగలరని పాక్ ధీర బాలిక, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ అన్నారు. ప్రముఖ భారత బాలల హక్కుల కార్యకర్త కైలాస్ సత్యార్థితో కలసి నోబెల్ బహుమతి అందుకోవడం గర్వకారణంగా ఉందని మలాలా చెప్పారు. నార్వే రాజధాని ఓస్లోలో బుధవారం జరిగిన కార్యక్రమంలో మలాలా, సత్యార్థి సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు. అనంతరం మలాలా ప్రసంగిస్తూ తల్లిదండ్రులకు, గురువులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛగా ఎదగనిచ్చినందుకు తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పారు. బాలల హక్కుల కోసం జాలి చూపకుండా, వారి కోసం పోరాడాలాని మలాలా కోరారు. -
'విశ్వశాంతికి అందరూ కృషి చేయాలి'
న్యూఢిల్లీ: తూర్పు-పశ్చిమ, ఉత్తర-దక్షిణ ప్రాంతాలన్నీ విశ్వశాంతి కోసం పాటుపడాలని ప్రముఖ బాలల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నారు. పాకిస్థాన్ ధీర బాలిక మలాలా యూసఫ్జాయ్తో కలసి కైలాస్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకోనున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వీరికి సంయుక్తంగా బహుమతిని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కైలాస్ వేదాల్లోని ఓ శ్లోకాన్ని వినిపించి హిందీలో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ బహుమతిని బాలల హక్కుల కోసం పోరాడుతున్న అందరికీ అంకితం చేస్తున్నట్టు చెప్పారు. మలాలా తనకు కూతురు లాంటిదని, ఓస్లో వేదికగా పాక్ కూతురును ఓ భారతీయ తండ్రి కలుసుకున్నారని కైలాస్ చెప్పారు. 'ప్రతి చిన్నారి స్వేచ్ఛగా పాఠశాలకు వెళ్లాలి. ఆడుకోవాలి. చిన్నారులెవరూ బాలకార్మికులుగా మారరాదు. విముక్తులయిన బాల కార్మికుల్లో ఈశ్వరుడిని చూశాను' అని కైలాస్ అన్నారు. బుద్ధుడు జన్మించిన భూమి నుంచి నార్వే వరకు తన యాత్ర సాగిందని కైలాస్ అన్నారు. కైలాస్ స్వరాష్ట్రం మధ్యప్రదేశ్. అధ్యాపక వృత్తికి గుడ్ బై చెప్పి బాలల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. -
'నోబెల్' స్వీకరించిన కైలాస్, మలాలా
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్లకు చెందిన ప్రముఖ బాలల హక్కుల కార్యకర్తలు కైలాస్ సత్యార్థి, మలాలా యూసఫ్‌జాయ్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వీరికి సంయుక్తంగా బహుమతిని ప్రదానం చేశారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ఎనిమిదో భారతీయుడు కైలాస్. బాలల హక్కుల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. బహుమతి కింద కైలాస్ సత్యార్థి, మలాలాకు నోబెల్ పతకం, ప్రశంసాపత్రం, 1.1 మిలియన్ డాలర్ల (రూ.6.1 కోట్లు) నగదు చెరిసగం అందజేశారు. అవార్డును స్వీకరించడానికి సత్యార్థి తన భార్య సుమేధ, కుమారుడు, కోడలు, కూతురుతో సహా సోమవారమే ఓస్లోకు వెళ్లారు. ఓస్లోలో మంగళవారం జరిగిన చర్చా కార్యక్రమంలో కైలాస్ సత్యార్థి, మలాలా పాల్గొన్నారు. -
నేడు సత్యార్థి, మలాలాకు నోబెల్
-
నేడు సత్యార్థి, మలాలాకు నోబెల్
స్టాక్‌హోం(స్వీడన్): భారత్, పాకిస్తాన్లకు చెందిన ప్రముఖ బాలల హక్కుల కార్యకర్తలు కైలాస్ సత్యార్థి(60), మలాలా యూసఫ్‌జాయ్ (17)లు బుధవారం ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకోనున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో జరిగే కార్యక్రమంలో వీరికి సంయుక్తంగా బహుమతిని ప్రదానం చేయనున్నారు. బహుమతి కింద వీరికి నోబెల్ పతకం, ప్రశంసాపత్రం, 1.1 మిలియన్ డాలర్ల (రూ.6.1 కోట్లు) నగదు చెరిసగం అందజేస్తారు. అవార్డును స్వీకరించడానికి సత్యార్థి తన భార్య సుమేధ, కుమారుడు, కోడలు, కూతురుతో సహా సోమవారమే ఓస్లోకు చేరుకున్నారు. ఆయన ‘పీటీఐ’తో మాట్లాడుతూ.. ‘ఈ అవార్డును భారత్‌లోని బాలలకు అంకితమిస్తున్నా. ఈ బహుమతి వారి కోసమే. దేశ ప్రజల కోసం కూడా’ అని సంతోషం వ్యక్తం చేశారు. భారత్, పాకిస్తాన్ల మధ్య శాంతి కొనసాగడానికి విశ్వాసం, స్నేహమే ముఖ్యమని ఓస్లోలో జరిగిన ఓ కార్యక్రమంలో సత్యార్థి, మలాలా అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల ప్రధానుల చర్చల కన్నా ప్రజల మధ్య సంబంధాలు మరింత ముఖ్యమని సత్యార్థి అన్నారు. కాగా, భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక శాస్త్రాలు, సాహిత్యం విభాగాల్లో విజేతలుగా నిలిచిన మరో 11 మందికి స్వీడన్‌లోని స్టాక్‌హోంలో జరిగే కార్యక్రమంలో నోబెల్ బహుమతులను అందజేయనున్నారు. నోబెల్ బహుమతిని నెలకొల్పిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం ఆయన వర్ధంతి రోజైన డిసెంబరు 10న 1901 నుంచి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు.