జగతి గుండె తట్టిన అక్షర వర్షం | special story to Ravindra Nath Tagore | Sakshi
Sakshi News home page

జగతి గుండె తట్టిన అక్షర వర్షం

Published Sun, Oct 15 2017 12:37 AM | Last Updated on Sun, Oct 15 2017 12:37 AM

special story to  Ravindra Nath Tagore

1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ముగిసిన మూడేళ్లకి టాగోర్‌ (1861) జన్మించారు.జీవితం మొత్తం వలస సామ్రాజ్యంలో సాగింది. అక్షరాల మీద ఆంక్షలు. భావాల మీద నిషేధాల బరువు. అయినా ఎంత ఎత్తుకుఎదిగారాయన!

‘నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు/ కానీ కలమెత్తితే నాకు/ ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది...’ అంటారు శేషేంద్ర. మరి మూడు దేశాల జెండాల రెపరెపల మధ్య వినిపించే గీతాల కోసం ఎత్తిన ఆ కవి కలానికి ఇంకెంత ఘనత ఉండాలి? అంతటిది– విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్‌ కలం.ప్రపంచ చరిత్రలో, భారత దేశచరిత్రలో టాగోర్‌ శిఖరాయమానమైన వ్యక్తి. కవితలలో తాను పోహళించిన పదాల మీద పాదముద్రలు వేయమని దేశద్రిమ్మర విహంగాలను కోరినవాడు (స్ట్రేబర్డ్స్‌) కదా! ఆ పక్షులు విశ్వకవి నామం మీద తమ పాదముద్రలను వేసి ఉంటాయి. అందుకే ఆ పేరు రెక్కలు ధరించి ఖండాంతరాలకు దూసుకుపోయింది. కాబట్టే ఈ జగత్తు అనంతత్వం అనే తన మహా ముసుగును తొలగించుకుని ఒక చిన్నపాటగా ఆ కవీశ్వరుడి కలంలో ఒదిగిపోయి ఉంటుంది. అలాంటివి ఎన్ని పాటలో! ‘ప్రభు’కు సమర్పించిన ‘గీతాంజలి’ నిండా అలాంటి పాటలే. ఏ గీతంలో అయినా విశ్వమంత భావ వైశాల్యం. సాగర గర్భమంత తాత్వికత.

1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ముగిసిన మూడేళ్లకి టాగోర్‌ (1861) జన్మించారు. జీవితం మొత్తం వలస సామ్రాజ్యంలో సాగింది. అక్షరాల మీద ఆంక్షలు. భావాల మీద నిషేధాల బరువు. అయినా ఎంత ఎత్తుకు ఎదిగారాయన! తాత ద్వారకానా«థ్‌ టాగోర్‌ బ్రహ్మసమాజంలో తిరుగుబాటు వర్గానికి నాయకుడు. తండ్రి దేవేంద్రనాథ్‌ టాగోర్‌. ఆయన సంస్కర్త, దాత, సమాజ సేవకుడు. పదకొండో ఏట తండ్రితో కలసి హిమాలయాలను దర్శించారు రవికవి. తండ్రి చేయి పట్టుకుని భారతావనిని దర్శిస్తూనే కాళిదాసునీ చదివారాయన. సంప్రదాయ విద్య అంటే అప్పటికే లోపల తీవ్ర నిరసన. ఇంగ్లండ్‌లో చదివినా పట్టా పుచ్చుకోకుండానే తిరిగి స్వదేశం చేరుకున్నారు. చిన్నారులకు మాతృభాషలోనే చదువు చెప్పాలన్నది టాగోర్‌ ప్రగాఢ విశ్వాసం. విదేశీ భాషతో బరువైన విషయాలు పిల్లల మనసుల్లో దట్టించాలని చూడడం సరికాదన్నారాయన. నాలుగు గోడల మధ్య బంధించి చదువు చెప్పడం అసలే మంచిది కాదంటారాయన. రుషి వాటికలలోని గురుకులాలను పోలిన వాతావరణంలో ప్రకృతి పరిసరాల నడుమ, ఆడుతూ పాడుతూ పాఠాలు చెప్పాలి. పిల్లలు అలాగే వినాలి. ప్రకృతే ఉత్తమ గురువన్నది ఆయన అభిప్రాయం. అందుకే శాంతినికేతన్‌ ఏర్పాటు చేసిన తరువాత తరగతి గదులలో పిల్లలని బంధించకుండా చెట్ల నీడను చదువు చెప్పేవారాయన. వందేళ్ల క్రితమే ఆయన పిల్లల కోసం రాసిన ‘చిలుక కథ’ సంప్రదాయ విద్య పట్ల టాగోర్‌కు ఎంత ఏవగింపో తెలియచేస్తుంది.  ఆ కథ ఒక అద్భుతం. రాజగురువులు చెప్పిన చదువును తట్టుకోలేక ప్రాణాలు వదిలిందా చిలుక– ఇప్పటి చిన్నారుల బాధను గుర్తుకు తెస్తూ.

‘చిలుక కథ’ మాత్రమేనా! ఎన్నెన్ని గొప్ప రచనలు చేశారని! నవలలు, నాటకాలు, నాటికలు, కథలు, చిన్న పిల్లల కథలు... ఇక కవిత్వం సరేసరి. ద్విపదుల వంటి స్ట్రేబర్డ్స్‌ కవితలు, మరణం కూడా ఉత్తరం లాంటిదేనని చెబుతూ రాసిన ‘పోస్టాఫీస్‌’ నాటకం అమోఘం  బెంగాల్‌కే కాదు, భారతదేశం మొత్తం మీద చెప్పుకోదగిన కళాహృదయుడు టాగోర్‌. ఆయన రాసిన 103 గీతాల మాలిక ‘గీతాంజలి’. ఎలాంటి గీతాలు! ‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో/ ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతాడో/ ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో... ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి, తండ్రీ నా దేశాన్ని మేల్కాంచేటట్టు అనుగ్రహించు’ అన్నారాయన (అను: బెల్లంకొండ రామదాసు). ఈ గీతం మధ్యలోనే రాసిన మరో వాక్యం చదివితే జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది, ‘ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలో ఇంకిపోదో...’ అలాంటి చోటికి దేశాన్ని నడిపించాలని ఆకాంక్షించారాయన. అందుకే మరి, విఖ్యాత ఇంగ్లిష్‌ నాటకకర్త బెర్నార్డ్‌షా ఉండగా, బానిసదేశంలో ఎదిగిన కవికి సాహిత్య నోబెల్‌ (1913) ఇవ్వడం ఏమిటని శ్వేత దురహంకారం ప్రశ్నించినా, వాటికి విలువ లేకుండా పోయింది. టాగోర్‌కు పురస్కారం సబబేనంటూ విలియం బట్లర్‌ యేట్స్‌ అక్కడ ఉద్యమించాడు. గీతాంజలి ఆంగ్లానువాదానికి ఆ ఐరిష్‌ మహాకవే ముందుమాట రాశారు. అందులో అంటారాయన, ‘ఈ అనువాదాల వ్రాత ప్రతిని కొన్ని రోజుల పాటు నా వెంట తీసుకుని రైళ్లలో, బస్సులలో, రెస్టారెంట్లలో చదివేవాడిని. అది నన్ను ఎంతగా కదిలించి వేసిందో.. కొత్తవారు ఎవరైనా చూస్తారేమోనని తరుచుగా పుస్తకం మూసివేయవలసి వచ్చేది’.  చిత్రమేమిటంటే నోబెల్‌ బహుమతి స్వీకారోత్సవానికి టాగోర్‌ హాజరు కాలేదు. ఆ సంవత్సరం నవంబర్‌లో విజేతలను ప్రకటించారు. డిసెంబర్‌లో ఉత్సవం జరిగింది. 1914 జనవరిలో నాటి బెంగాల్‌ గవర్నర్‌ దానిని రవీంద్రుడికి అందచేశారు. జనులందరిలోను నిన్ను నీవు, నీలో జనులందరినీ దర్శించుకుంటే నీవు ఎవరినీ ద్వేషించవు’ అని అర్థం చెప్పే ఒక ఉపనిషత్‌ శ్లోకంతో కూడిన ఉపన్యాసాన్ని టాగోర్‌ నోబెల్‌ కమిటీకి పంపారు. దానిని అప్పుడు చదవలేదు. ఎనిమిదేళ్ల తరువాత అది బయటపడింది. స్వీడిష్‌ అకాడమి దానిని భద్రపరచింది. టాగోర్‌కు వచ్చిన పుష్కరం తరువాత 1925లో షాకి ఆ పురస్కారం దక్కింది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలోను, యుద్ధం తరువాత తాము ఎదుర్కొన్న సంకట స్థితికి ప్రాగ్దిశ నుంచి వచ్చిన సమాధానంగా ‘గీతాంజలి’ని పాశ్చాత్యులు భావించారు. అంత సాంత్వన ఇచ్చిందా కవిత్వం.

గాంధీజీ, టాగోర్‌ల బంధాన్ని గమనించినా ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. గాంధీజీని ‘మహాత్ముడు’ అని మొదటిగా సంబోధించినవారిలో టాగోర్‌ ఒకరు. గాంధీజీ టాగోర్‌ను గురుదేవ్‌ అని పిలిచేవారు. గాంధీజీ ఉద్యమకారుడు. జనాన్ని కదిలించారాయన. కానీ ఉద్యమానికి తాత్వికతను అందించినవారు టాగోర్‌. జాతీయోద్యమం పట్ల  టాగోర్‌ ఒక కవిగా, తాత్వికునిగానే స్పందించారు. 1915లో గాంధీజీ భారతదేశానికి వచ్చిన తరువాత కలుసుకున్నవారిలో టాగోర్‌ ఒకరు. కానీ గాంధీజీ చెప్పిన ప్రతి మాటనీ, ప్రతి చర్యనీ టాగోర్‌ సమర్థించలేదు. 1921 నాటికి గాంధీజీ సహాయ నిరాకరణోద్యమంతో భారతదేశం ఊగిపోయింది. కానీ ఆ ఉద్యమాన్ని టాగోర్‌ సమర్థించలేదు. గాంధీజీ శాంతినికేతన్‌కు వచ్చి మద్దతు అడిగినా అంగీకరించలేదు. అలాగే రోజూ అరగంట చరఖా వడకమని, దీనితో స్వాతంత్య్రం వస్తుందని గాంధీజీ చేసిన ప్రకటనకు ‘చరఖా వడకడంతోనే ఆరు మాసాలలో వచ్చే స్వాతంత్య్రం కోరుకోదగిన స్వాతంత్య్రం కాబోదు’ అని టాగోర్‌ జవాబు ఇచ్చారు.

టాగోర్‌ మహోన్నత దేశభక్తుడు. భారత స్వాతంత్య్రోద్యమాన్ని ఎంతో ప్రేమించారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 1886లో భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి వార్షిక సమావేశం కలకత్తాలోనే జరిగింది. ఇందుకోసం టాగోర్‌ ఒక దేశభక్తి గీతం రాశారు. బెంగాల్‌ విభజన (1905)కు వ్యతిరేకంగా పెల్లుబికిన వందేమాతరం ఉద్యమంలో టాగోర్‌ చురుకుగా పాల్గొన్నారు. 1911 నాటి కలకత్తా జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలలో ‘జనగణమన అధినాయక జయహే...’ అంటూ ఎలుగెత్తి పాడారు.  నిజమే, గాంధీజీలో తనకు నచ్చని అంశాన్ని టాగోర్‌ నిర్మొహమాటంగా వ్యక్తీకరించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం విషయంలోనూ అంతే. అందుకే ఆయన నిజమైన కవి అనిపిస్తాడు.  నోబెల్‌ పురస్కారం అందుకున్న తరువాత టాగోర్‌కు బ్రిటిష్‌ ప్రభుత్వం 1915లో ‘సర్‌’ బిరుదుతో సత్కరించింది. కానీ 1919లో జరిగిన జలియన్‌వాలాబాగ్‌ మారణహోమానికి నిరసనగా ఆ బిరుదాన్ని తిరిగి ఇచ్చేశారాయన. టాగోర్‌ అంతర్జాతీయవాది. కానీ ఆయన అంతర్జాతీయవాద దృష్టిని దారుణంగా భగ్నం చేసిన ఘట్టం మొదటి ప్రపంచ యుద్ధం. ఆ యుద్ధం ఆయనను కలచివేసింది. అంతర్జాతీయ కవిగా, విశ్వమానవునిగా ఎదుగుతున్న క్రమంలోనే ఎన్నో విషాదాలను టాగోర్‌ చవి చూడవలసి వచ్చింది. తం్రyì  1905లో మరణించారు. అంతకు ముందే, అంటే 1902లోనే భార్య మృణాళిని కన్నుమూసింది. తనకు స్ఫూర్తినిచ్చిన పెద్దన్న ద్విజేంద్రనాథ్‌ మరణించారు. ఆయన కవి, గాయకుడు. తత్వవేత్త. పెద్దన్నయ్య టాగోర్‌కు గొప్ప ప్రేరణ. ద్విజేంద్రనాథ్‌ భార్య కాదంబరి. ఆమె కూడా టాగోర్‌కు ఎంతో ఆప్తురాలు. ఆమె తన 25వ ఏట ఆత్మహత్య చేసుకున్నారు. ఇది కూడా టాగోర్‌ను కుంగదీసింది. టాగోర్‌కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందులో ఒక కూతురు, ఒక కుమారుడు మాత్రమే మిగిలారు. ఎన్నోసార్లు ఆరోగ్యం క్షీణించింది. అయినా తుది శ్వాస విడిచేవరకు టాగోర్‌ కలాన్ని విడిచిపెట్టలేదు.

జనగణమన అధినాయక జయహే పాటలోని భారత భాగ్యవిధాత పదం జార్జి చక్రవర్తిని గురించి రాసినదని టాగోర్‌ వ్యతిరేకులు ప్రచారం చేసినా, పండిట్‌ నెహ్రూ ఆ గీతాన్ని జాతీయ గీతంగా ప్రకటించారు. తరువాత బంగ్లాదేశ్‌ ఆవిర్భవించిన తరువాత ‘అమర్‌ సోనార్‌ బంగ్లా’ (నా బంగరు బంగ్లా) అన్న పాటను ఆ దేశం జాతీయగీతంగా స్వీకరించింది. ఇది టాగోర్‌ గీతమే. అయితే శ్రీలంక జాతీయగీత రచన మీద కూడా రవీంద్రుని ప్రభావం ఉంది. ఈ పాటను (నమో నమో మాతా, అప శ్రీలంక) ఆనంద సమరాకూన్‌ అనే సింహళీయుడు రాశారు. ఆయన శాంతినికేతన్‌ విద్యార్థి. నమో నమో అంటూ టాగోర్‌ రాసిన ఒక గీతాన్ని ఆయన సింహళంలోకి అనువదించుకున్నారు. దానినే తరువాత జాతీయ గీతం పోటీలకు పంపితే అందుకు ఎంపికైంది. ఇది కొద్దిమందికే తెలుసు. మరొక్క సంగతి కూడా కొద్దిమందికే తెలుసు. మైఖేల్‌ జాక్సన్‌ ఆఖరిరోజులలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రహమాన్‌ను కలుసుకున్నారు. రహమాన్‌తో కలసి పనిచేయాలనీ, అంతర్జాతీయ సమాజానికి కానుకగా ఒక గీతాన్ని అందించాలనీ ఆకాంక్షను వెలిబుచ్చారు. సంగీతం రహమాన్‌. గానం జాక్సన్‌. పాట మాత్రం రవీంద్రనాథ్‌ టాగోర్‌ రాసినది తీసుకోవాలని కోరాడు జాక్సన్‌. టాగోర్‌ వీరాభిమాని జాక్సన్‌ విషాదంగా మరణించాడు.

టాగోర్‌ ఇప్పటికీ కవితా ప్రపంచంలో జీవించే ఉన్నారు. కానీ ఆయన భౌతికంగా మరణించింది 1941లో. ఆఖరికి మృత్యువు గురించి ఎంత గొప్పగా రాశారో! మృత్యువును అతిథిగా భావించారాయన. ‘ఓ.. నా అతిథి ఎదుట నా పూర్ణ జీవిత కలశాన్ని ఉంచుతాను. రిక్తహస్తాలతో అతడిని ఎప్పటికీ తిరిగిపోనివ్వను’ (గీతాంజలి–90). టాగోర్‌ జీవితం ఒక సంక్షుభిత ప్రపంచానికి ప్రత్యక్ష సాక్షి. స్వదేశంలో బ్రిటిష్‌ జాతి దారుణాలను చూశారాయన. రెండు ప్రపంచ యుద్ధాలు ఈ భూమ్మీద సృష్టించిన ఉష్ట రక్తకాసారాలను వీక్షించారు. నియంతలను చూశారు. అయినా మనిషి మీద నమ్మకం పోగొట్టుకోలేదు. అందుకే ‘ఇక్కడి నుంచి నిష్క్రమించే ముందు నేనొక తుది మాట చెప్పి వెళ్లిపోతాను. నేను దర్శించినదంతా అద్భుతం’ (గీతాంజలి–96, అను: నండూరి రామమోహనరావు) అన్నారాయన. జీవితమంటే, లోకమంటే ఎంత ప్రేమ! నడుస్తున్న చరిత్ర నుంచి కవి, కవిత్వం నుంచి మామూలు మనిషి నేర్వాల్సింది ఇదే!     
– డా. గోపరాజు నారాయణరావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement