ravindra nath tagore
-
తొలి ఐఎఎస్ సెలక్షన్ ఎలా జరిగింది? మొదటి ఐఎఎస్ అధికారితో ఠాగూర్కున్న సంబంధం ఏమిటి?
మన దేశానికి తొలి ఒలింపిక్ పతకం ఎవరు సాధించిపెట్టారు? మన దేశానికి మొదటి క్రికెట్ ప్రపంచకప్‌ను అందించిన జట్టుకు కెప్టెన్ ఎవరు? దేశ మొదటి రాష్ట్రపతి ఎవరు? మొదటి ప్రధాన మంత్రి ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు మనకు సమాధానం తెలిసేవుంటుంది. కానీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన మొదటి భారతీయుడు ఎవరో మీకు తెలుసా? ఆయన మరెవరో కాదు.. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి చాలా ఏళ్లముందు సత్యేంద్రనాథ్ ఠాగూర్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. నాటిరోజుల్లో బ్రిటీష్ వారు మనదేశాన్ని పరిపాలిస్తున్నారు. వారు భారతీయులను చాలా ఏళ్లపాటు సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతించలేదు. అయితే సత్యేంద్ర ఠాగూర్ తన అపార ప్రతిభతో ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 17వ శతాబ్దంలో బ్రిటీష్ వారు వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చి, ఇక్కడ పాలన ప్రారంభించారు. అప్పట్లో వారి ప్రభుత్వం ఉండేది. సమస్తం వారి నియంత్రణలో ఉండేది. చాలా ఏళ్లపాటు బ్రిటీష్ ప్రభుత్వంలోని ఉన్నత స్థానాల్లో భారతీయులు పనిచేసేందుకు వీలు కల్పించలేదు. 1832లో మొదటిసారిగా మున్సిఫ్, సదర్ అమీన్ పదవులకు భారతీయులు ఎన్నికయ్యేందుకు అనుమతించారు. తరువాత డిప్యూటీ మేజిస్ట్రేట్, కలెక్టర్ పదవులకు పోటీపడేందుకు భారతీయలను అనుమతించారు. కానీ 1860ల వరకు భారతీయులు సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరు కాలేదు. 1861లో ఇండియన్ సివిల్ సర్వీస్ యాక్ట్ ప్రవేశపెట్టారు. ఇండియన్ సివిల్ సర్వీస్ స్థాపితమయ్యింది. ఫలితంగా భారతీయులను సివిల్ సర్వీసెస్ పరీక్షకు అనుమతించారు. అయితే ఈ పరీక్షకు హాజరుకావడం భారతీయులకు అంత సులభం కాలేదు. ఈ పరీక్షలకు హాజరు కావడానికి లండన్‌కు వెళ్లవలసి వచ్చేది. పాఠ్యాంశాలు గ్రీక్, లాటిన్ భాషలలో ఉండేవి. గరిష్ట వయోపరిమితి 23 ఏళ్లుగా ఉండేది. 1842 జూన్‌లో జన్మించిన సత్యేంద్రనాథ్ ఠాగూర్ చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో అడ్మిషన్ పొంది తన ప్రతిభచాటారు. ఇండియన్ సివిల్ సర్వీస్ చట్టం ఆమోదం పొందిన తరువాత సత్యేంద్రనాథ్ ఠాగూర్ తన స్నేహితుడు మోనోమోహన్ ఘోష్‌తో కలిసి ఈ పరీక్షకు వెళ్లాలని భావించారు. ఇద్దరూ లండన్ వెళ్లి పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. అయితే ఘోష్ ఈ పరీక్షలో విజయం సాధించలేకపోయారు. సత్యేంద్ర ఠాగూర్ (1863లో) ఎంపికయ్యాడు. అక్కడ శిక్షణ పూర్తి చేసుకుని, 1864లో భారతదేశానికి తిరిగి వచ్చారు. అతను తొలుత బాంబే ప్రెసిడెన్సీలో నియమితులయ్యారు. తరువాత అహ్మదాబాద్‌లో అసిస్టెంట్ కలెక్టర్/మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. సత్యేంద్ర ఈ పదవిలో 30 సంవత్సరాల పాటు ఉన్నారు. 1896లో మహారాష్ట్రలోని సతారా నుండి న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాడు. భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహణ 1922లో ప్రారంభమైంది. అప్పుడు దానిని ఇండియన్ ఇంపీరియల్ సర్వీసెస్ అని పిలిచేవారు. ఆ తర్వాత దానిని సివిల్ సర్వీసెస్‌గా మార్చారు. ఇది కూడా చదవండి: ‘సిటీ ఆఫ్ డోర్స్’ అంటే ఏమిటి? మనదేశంలోని ఆ నగరానికి ఎందుకంత ప్రత్యేకత? -
చైతన్య భారతి.. జె.సి.బోస్ / 1858–1937
జగదీశ్ చంద్రబోస్ చనిపోయిన అరవై ఏళ్ల తరువాత 1998లో చెలరేగిన వివాదం ఆయన కాలంలో భారతీయ విజ్ఞాన శాస్త్రానికి ఉన్న పేరు ప్రతిష్టలకు ప్రతీకగా నిలిచింది. ‘మార్కోనీ వైర్‌లెస్‌ను కనుగొన్నది బోసే’ అని శీర్షిక పెట్టి ఓ వార్తాపత్రిక ప్రచురించింది. కొహెరర్ అనే పరికరాన్ని జగదీశ్ చంద్రబోస్ కనిపెట్టారని, అది జరిగిన రెండేళ్లకు 1902లో దానిని వినియోగించుకుంటూ గుగ్లీల్మో మార్కోనీ వైర్లెస్ రేడియోను అభివృద్ధి చేశారనీ కథనాలు వచ్చాయి. ఆ కథనాల ఆధారంగా ఈ వార్తను ప్రచురించారు. నిజానికి, శాస్త్ర విజ్ఞానాన్ని స్వేచ్ఛగా పరస్పరం పంచుకోవాలని, తమకు తెలిసిన దానిని తోటి శాస్త్రవేత్తలతో చెప్పాలని బోస్ భావించేవారు. 1901లో ఆయన తన మిత్రుడైన రవీంద్రనాథ్ టాగూర్‌కు ఇలా రాశారు : ‘‘చేతిలో పేటెంట్ కాగితం పట్టుకొని, ఒక ప్రముఖ టెలిగ్రాఫ్ సంస్థ యజమాని నా దగ్గరకు వచ్చారు. లాభంలో సగం తీసుకుని బదులుగా వ్యాపారానికి సహాయం అందించవచ్చని నాకు ప్రతిపాదించారు. మిత్రమా! ఒకసారి ఆ విష వలయంలో చిక్కుకుంటే ఇక నాకు నిష్కృతి లేదు’’.. అని. రేడియో తరంగాలను కనిపెట్టడానికి సెమీ కండక్టర్‌ను వాడిన తొలి వ్యక్తి బోస్. ప్రస్తుతం ప్రతి చోటా కనిపిస్తున్న మైక్రోవేవ్‌కు సంబంధించిన అనేక విడి భాగాలను ఆయనే కనిపెట్టారు. విద్యుత్ చలనాలను గ్రహించే పరికరానికి ఆయన పేటెంట్ సంపాదించారు. అది ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలలో ఒకటి. 1900 తర్వాత జగదీశ్ చంద్ర బోస్ జంతువులు, వృక్షాల శరీర ధర్మ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. భౌతిక శాస్త్రానికీ, శరీర ధర్మ శాస్త్రానికీ మధ్య ఉన్న సరిహద్దులపై దృష్టి పెట్టడం ద్వారా అన్ని అంశాలకూ అంతర్లీనంగా ఉన్న సమైక్యతను చూపెట్టవచ్చని ఆయన భావించారు. 1917లో ఆయన కలకత్తాలో బోస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. భారత్‌లోని మొట్టమొదటి శాస్త్ర పరిశోధనా సంస్థ అది. అదే సంవత్సరం ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన ‘సర్’ బిరుదు లభించింది. 1920లో ఆయన గ్రేట్ బ్రిటన్‌కు చెందిన ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీకి ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన తొలి భారతీయ శాస్త్రవేత్త ఆయనే. బోస్ విజ్ఞానవేత్తే కాక, కథా రచయిత కూడా. విజ్ఞాన శాస్త్ర పరిశోధనలో మార్గదర్శి అయిన బోస్ వారసత్వం భారత విజ్ఞాన శాస్త్రానికి నిత్యం స్ఫూర్తిదాయకం. – ఆర్.ఎ.మషేల్కర్, శాస్త్రీయ పరిశోధనా మండలి మాజీ డైరెక్టర్ జనరల్ -
నోబెల్‌ను టాగూర్ తిరస్కరించారట!
అగర్తలా: ఇటీవల తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ మరోసారి నోరుజారి విమర్శలను ఎదుర్కొంటున్నారు. జాతీయ గీత రచయిత, ప్రముఖ కవి రవీంద్ర నాథ్ టాగూర్ అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన సాహిత్య నోబెల్ బహుమతిని వెనక్కు ఇచ్చారని విప్లవ్ దేవ్ అన్నారు. గీతాంజలి నవలకు 1913లో టాగూర్‌కు నోబెల్ ఇచ్చారు. వాస్తవానికి బ్రిటిష్ ప్రభుత్వం తనకు ఇచ్చిన ‘బ్రిటిష్ నైట్‌హుడ్’ బిరుదును జలియంవాలా బాగ్ ఊచకోతకు నిరసనగా 1919లో టాగూర్ వదిలేశారు. నోబెల్‌ను తిరస్కరించలేదు. కానీ విప్లవ్ దేవ్ మాత్రం బ్రిటిష్ పాలనకు నిరసనగా టాగూర్ నోబెల్‌నే వెనక్కు ఇచ్చారని చెప్పడం విమర్శలకు దారితీసింది. విప్లవ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సరదా వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. -
జగతి గుండె తట్టిన అక్షర వర్షం
1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ముగిసిన మూడేళ్లకి టాగోర్ (1861) జన్మించారు.జీవితం మొత్తం వలస సామ్రాజ్యంలో సాగింది. అక్షరాల మీద ఆంక్షలు. భావాల మీద నిషేధాల బరువు. అయినా ఎంత ఎత్తుకుఎదిగారాయన! ‘నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు/ కానీ కలమెత్తితే నాకు/ ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది...’ అంటారు శేషేంద్ర. మరి మూడు దేశాల జెండాల రెపరెపల మధ్య వినిపించే గీతాల కోసం ఎత్తిన ఆ కవి కలానికి ఇంకెంత ఘనత ఉండాలి? అంతటిది– విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ కలం.ప్రపంచ చరిత్రలో, భారత దేశచరిత్రలో టాగోర్ శిఖరాయమానమైన వ్యక్తి. కవితలలో తాను పోహళించిన పదాల మీద పాదముద్రలు వేయమని దేశద్రిమ్మర విహంగాలను కోరినవాడు (స్ట్రేబర్డ్స్) కదా! ఆ పక్షులు విశ్వకవి నామం మీద తమ పాదముద్రలను వేసి ఉంటాయి. అందుకే ఆ పేరు రెక్కలు ధరించి ఖండాంతరాలకు దూసుకుపోయింది. కాబట్టే ఈ జగత్తు అనంతత్వం అనే తన మహా ముసుగును తొలగించుకుని ఒక చిన్నపాటగా ఆ కవీశ్వరుడి కలంలో ఒదిగిపోయి ఉంటుంది. అలాంటివి ఎన్ని పాటలో! ‘ప్రభు’కు సమర్పించిన ‘గీతాంజలి’ నిండా అలాంటి పాటలే. ఏ గీతంలో అయినా విశ్వమంత భావ వైశాల్యం. సాగర గర్భమంత తాత్వికత. 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ముగిసిన మూడేళ్లకి టాగోర్ (1861) జన్మించారు. జీవితం మొత్తం వలస సామ్రాజ్యంలో సాగింది. అక్షరాల మీద ఆంక్షలు. భావాల మీద నిషేధాల బరువు. అయినా ఎంత ఎత్తుకు ఎదిగారాయన! తాత ద్వారకానా«థ్ టాగోర్ బ్రహ్మసమాజంలో తిరుగుబాటు వర్గానికి నాయకుడు. తండ్రి దేవేంద్రనాథ్ టాగోర్. ఆయన సంస్కర్త, దాత, సమాజ సేవకుడు. పదకొండో ఏట తండ్రితో కలసి హిమాలయాలను దర్శించారు రవికవి. తండ్రి చేయి పట్టుకుని భారతావనిని దర్శిస్తూనే కాళిదాసునీ చదివారాయన. సంప్రదాయ విద్య అంటే అప్పటికే లోపల తీవ్ర నిరసన. ఇంగ్లండ్‌లో చదివినా పట్టా పుచ్చుకోకుండానే తిరిగి స్వదేశం చేరుకున్నారు. చిన్నారులకు మాతృభాషలోనే చదువు చెప్పాలన్నది టాగోర్ ప్రగాఢ విశ్వాసం. విదేశీ భాషతో బరువైన విషయాలు పిల్లల మనసుల్లో దట్టించాలని చూడడం సరికాదన్నారాయన. నాలుగు గోడల మధ్య బంధించి చదువు చెప్పడం అసలే మంచిది కాదంటారాయన. రుషి వాటికలలోని గురుకులాలను పోలిన వాతావరణంలో ప్రకృతి పరిసరాల నడుమ, ఆడుతూ పాడుతూ పాఠాలు చెప్పాలి. పిల్లలు అలాగే వినాలి. ప్రకృతే ఉత్తమ గురువన్నది ఆయన అభిప్రాయం. అందుకే శాంతినికేతన్ ఏర్పాటు చేసిన తరువాత తరగతి గదులలో పిల్లలని బంధించకుండా చెట్ల నీడను చదువు చెప్పేవారాయన. వందేళ్ల క్రితమే ఆయన పిల్లల కోసం రాసిన ‘చిలుక కథ’ సంప్రదాయ విద్య పట్ల టాగోర్‌కు ఎంత ఏవగింపో తెలియచేస్తుంది. ఆ కథ ఒక అద్భుతం. రాజగురువులు చెప్పిన చదువును తట్టుకోలేక ప్రాణాలు వదిలిందా చిలుక– ఇప్పటి చిన్నారుల బాధను గుర్తుకు తెస్తూ. ‘చిలుక కథ’ మాత్రమేనా! ఎన్నెన్ని గొప్ప రచనలు చేశారని! నవలలు, నాటకాలు, నాటికలు, కథలు, చిన్న పిల్లల కథలు... ఇక కవిత్వం సరేసరి. ద్విపదుల వంటి స్ట్రేబర్డ్స్ కవితలు, మరణం కూడా ఉత్తరం లాంటిదేనని చెబుతూ రాసిన ‘పోస్టాఫీస్’ నాటకం అమోఘం బెంగాల్‌కే కాదు, భారతదేశం మొత్తం మీద చెప్పుకోదగిన కళాహృదయుడు టాగోర్. ఆయన రాసిన 103 గీతాల మాలిక ‘గీతాంజలి’. ఎలాంటి గీతాలు! ‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో/ ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతాడో/ ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో... ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి, తండ్రీ నా దేశాన్ని మేల్కాంచేటట్టు అనుగ్రహించు’ అన్నారాయన (అను: బెల్లంకొండ రామదాసు). ఈ గీతం మధ్యలోనే రాసిన మరో వాక్యం చదివితే జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది, ‘ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలో ఇంకిపోదో...’ అలాంటి చోటికి దేశాన్ని నడిపించాలని ఆకాంక్షించారాయన. అందుకే మరి, విఖ్యాత ఇంగ్లిష్ నాటకకర్త బెర్నార్డ్‌షా ఉండగా, బానిసదేశంలో ఎదిగిన కవికి సాహిత్య నోబెల్ (1913) ఇవ్వడం ఏమిటని శ్వేత దురహంకారం ప్రశ్నించినా, వాటికి విలువ లేకుండా పోయింది. టాగోర్‌కు పురస్కారం సబబేనంటూ విలియం బట్లర్ యేట్స్ అక్కడ ఉద్యమించాడు. గీతాంజలి ఆంగ్లానువాదానికి ఆ ఐరిష్ మహాకవే ముందుమాట రాశారు. అందులో అంటారాయన, ‘ఈ అనువాదాల వ్రాత ప్రతిని కొన్ని రోజుల పాటు నా వెంట తీసుకుని రైళ్లలో, బస్సులలో, రెస్టారెంట్లలో చదివేవాడిని. అది నన్ను ఎంతగా కదిలించి వేసిందో.. కొత్తవారు ఎవరైనా చూస్తారేమోనని తరుచుగా పుస్తకం మూసివేయవలసి వచ్చేది’. చిత్రమేమిటంటే నోబెల్ బహుమతి స్వీకారోత్సవానికి టాగోర్ హాజరు కాలేదు. ఆ సంవత్సరం నవంబర్‌లో విజేతలను ప్రకటించారు. డిసెంబర్లో ఉత్సవం జరిగింది. 1914 జనవరిలో నాటి బెంగాల్ గవర్నర్ దానిని రవీంద్రుడికి అందచేశారు. జనులందరిలోను నిన్ను నీవు, నీలో జనులందరినీ దర్శించుకుంటే నీవు ఎవరినీ ద్వేషించవు’ అని అర్థం చెప్పే ఒక ఉపనిషత్ శ్లోకంతో కూడిన ఉపన్యాసాన్ని టాగోర్ నోబెల్ కమిటీకి పంపారు. దానిని అప్పుడు చదవలేదు. ఎనిమిదేళ్ల తరువాత అది బయటపడింది. స్వీడిష్ అకాడమి దానిని భద్రపరచింది. టాగోర్‌కు వచ్చిన పుష్కరం తరువాత 1925లో షాకి ఆ పురస్కారం దక్కింది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలోను, యుద్ధం తరువాత తాము ఎదుర్కొన్న సంకట స్థితికి ప్రాగ్దిశ నుంచి వచ్చిన సమాధానంగా ‘గీతాంజలి’ని పాశ్చాత్యులు భావించారు. అంత సాంత్వన ఇచ్చిందా కవిత్వం. గాంధీజీ, టాగోర్‌ల బంధాన్ని గమనించినా ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. గాంధీజీని ‘మహాత్ముడు’ అని మొదటిగా సంబోధించినవారిలో టాగోర్ ఒకరు. గాంధీజీ టాగోర్‌ను గురుదేవ్ అని పిలిచేవారు. గాంధీజీ ఉద్యమకారుడు. జనాన్ని కదిలించారాయన. కానీ ఉద్యమానికి తాత్వికతను అందించినవారు టాగోర్. జాతీయోద్యమం పట్ల టాగోర్ ఒక కవిగా, తాత్వికునిగానే స్పందించారు. 1915లో గాంధీజీ భారతదేశానికి వచ్చిన తరువాత కలుసుకున్నవారిలో టాగోర్ ఒకరు. కానీ గాంధీజీ చెప్పిన ప్రతి మాటనీ, ప్రతి చర్యనీ టాగోర్ సమర్థించలేదు. 1921 నాటికి గాంధీజీ సహాయ నిరాకరణోద్యమంతో భారతదేశం ఊగిపోయింది. కానీ ఆ ఉద్యమాన్ని టాగోర్ సమర్థించలేదు. గాంధీజీ శాంతినికేతన్‌కు వచ్చి మద్దతు అడిగినా అంగీకరించలేదు. అలాగే రోజూ అరగంట చరఖా వడకమని, దీనితో స్వాతంత్య్రం వస్తుందని గాంధీజీ చేసిన ప్రకటనకు ‘చరఖా వడకడంతోనే ఆరు మాసాలలో వచ్చే స్వాతంత్య్రం కోరుకోదగిన స్వాతంత్య్రం కాబోదు’ అని టాగోర్ జవాబు ఇచ్చారు. టాగోర్ మహోన్నత దేశభక్తుడు. భారత స్వాతంత్య్రోద్యమాన్ని ఎంతో ప్రేమించారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 1886లో భారత జాతీయ కాంగ్రెస్ తొలి వార్షిక సమావేశం కలకత్తాలోనే జరిగింది. ఇందుకోసం టాగోర్ ఒక దేశభక్తి గీతం రాశారు. బెంగాల్ విభజన (1905)కు వ్యతిరేకంగా పెల్లుబికిన వందేమాతరం ఉద్యమంలో టాగోర్ చురుకుగా పాల్గొన్నారు. 1911 నాటి కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో ‘జనగణమన అధినాయక జయహే...’ అంటూ ఎలుగెత్తి పాడారు. నిజమే, గాంధీజీలో తనకు నచ్చని అంశాన్ని టాగోర్ నిర్మొహమాటంగా వ్యక్తీకరించారు. బ్రిటిష్ ప్రభుత్వం విషయంలోనూ అంతే. అందుకే ఆయన నిజమైన కవి అనిపిస్తాడు. నోబెల్ పురస్కారం అందుకున్న తరువాత టాగోర్‌కు బ్రిటిష్ ప్రభుత్వం 1915లో ‘సర్’ బిరుదుతో సత్కరించింది. కానీ 1919లో జరిగిన జలియన్‌వాలాబాగ్ మారణహోమానికి నిరసనగా ఆ బిరుదాన్ని తిరిగి ఇచ్చేశారాయన. టాగోర్ అంతర్జాతీయవాది. కానీ ఆయన అంతర్జాతీయవాద దృష్టిని దారుణంగా భగ్నం చేసిన ఘట్టం మొదటి ప్రపంచ యుద్ధం. ఆ యుద్ధం ఆయనను కలచివేసింది. అంతర్జాతీయ కవిగా, విశ్వమానవునిగా ఎదుగుతున్న క్రమంలోనే ఎన్నో విషాదాలను టాగోర్ చవి చూడవలసి వచ్చింది. తం్రyì 1905లో మరణించారు. అంతకు ముందే, అంటే 1902లోనే భార్య మృణాళిని కన్నుమూసింది. తనకు స్ఫూర్తినిచ్చిన పెద్దన్న ద్విజేంద్రనాథ్ మరణించారు. ఆయన కవి, గాయకుడు. తత్వవేత్త. పెద్దన్నయ్య టాగోర్‌కు గొప్ప ప్రేరణ. ద్విజేంద్రనాథ్ భార్య కాదంబరి. ఆమె కూడా టాగోర్‌కు ఎంతో ఆప్తురాలు. ఆమె తన 25వ ఏట ఆత్మహత్య చేసుకున్నారు. ఇది కూడా టాగోర్‌ను కుంగదీసింది. టాగోర్‌కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందులో ఒక కూతురు, ఒక కుమారుడు మాత్రమే మిగిలారు. ఎన్నోసార్లు ఆరోగ్యం క్షీణించింది. అయినా తుది శ్వాస విడిచేవరకు టాగోర్ కలాన్ని విడిచిపెట్టలేదు. జనగణమన అధినాయక జయహే పాటలోని భారత భాగ్యవిధాత పదం జార్జి చక్రవర్తిని గురించి రాసినదని టాగోర్ వ్యతిరేకులు ప్రచారం చేసినా, పండిట్ నెహ్రూ ఆ గీతాన్ని జాతీయ గీతంగా ప్రకటించారు. తరువాత బంగ్లాదేశ్ ఆవిర్భవించిన తరువాత ‘అమర్ సోనార్ బంగ్లా’ (నా బంగరు బంగ్లా) అన్న పాటను ఆ దేశం జాతీయగీతంగా స్వీకరించింది. ఇది టాగోర్ గీతమే. అయితే శ్రీలంక జాతీయగీత రచన మీద కూడా రవీంద్రుని ప్రభావం ఉంది. ఈ పాటను (నమో నమో మాతా, అప శ్రీలంక) ఆనంద సమరాకూన్ అనే సింహళీయుడు రాశారు. ఆయన శాంతినికేతన్ విద్యార్థి. నమో నమో అంటూ టాగోర్ రాసిన ఒక గీతాన్ని ఆయన సింహళంలోకి అనువదించుకున్నారు. దానినే తరువాత జాతీయ గీతం పోటీలకు పంపితే అందుకు ఎంపికైంది. ఇది కొద్దిమందికే తెలుసు. మరొక్క సంగతి కూడా కొద్దిమందికే తెలుసు. మైఖేల్ జాక్సన్ ఆఖరిరోజులలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్‌ను కలుసుకున్నారు. రహమాన్‌తో కలసి పనిచేయాలనీ, అంతర్జాతీయ సమాజానికి కానుకగా ఒక గీతాన్ని అందించాలనీ ఆకాంక్షను వెలిబుచ్చారు. సంగీతం రహమాన్. గానం జాక్సన్. పాట మాత్రం రవీంద్రనాథ్ టాగోర్ రాసినది తీసుకోవాలని కోరాడు జాక్సన్. టాగోర్ వీరాభిమాని జాక్సన్ విషాదంగా మరణించాడు. టాగోర్ ఇప్పటికీ కవితా ప్రపంచంలో జీవించే ఉన్నారు. కానీ ఆయన భౌతికంగా మరణించింది 1941లో. ఆఖరికి మృత్యువు గురించి ఎంత గొప్పగా రాశారో! మృత్యువును అతిథిగా భావించారాయన. ‘ఓ.. నా అతిథి ఎదుట నా పూర్ణ జీవిత కలశాన్ని ఉంచుతాను. రిక్తహస్తాలతో అతడిని ఎప్పటికీ తిరిగిపోనివ్వను’ (గీతాంజలి–90). టాగోర్ జీవితం ఒక సంక్షుభిత ప్రపంచానికి ప్రత్యక్ష సాక్షి. స్వదేశంలో బ్రిటిష్ జాతి దారుణాలను చూశారాయన. రెండు ప్రపంచ యుద్ధాలు ఈ భూమ్మీద సృష్టించిన ఉష్ట రక్తకాసారాలను వీక్షించారు. నియంతలను చూశారు. అయినా మనిషి మీద నమ్మకం పోగొట్టుకోలేదు. అందుకే ‘ఇక్కడి నుంచి నిష్క్రమించే ముందు నేనొక తుది మాట చెప్పి వెళ్లిపోతాను. నేను దర్శించినదంతా అద్భుతం’ (గీతాంజలి–96, అను: నండూరి రామమోహనరావు) అన్నారాయన. జీవితమంటే, లోకమంటే ఎంత ప్రేమ! నడుస్తున్న చరిత్ర నుంచి కవి, కవిత్వం నుంచి మామూలు మనిషి నేర్వాల్సింది ఇదే! – డా. గోపరాజు నారాయణరావు -
జాతీయ గీతం వివాదం వెనుక..
న్యూఢిల్లీ: ‘జన గణ మన అధినాయక జయ హే’ అనే జాతీయ గీతంపై మళ్లీ వివాదం రేగింది. రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ఈ గీతంలో ‘అధినాయక జయ హే’ అన్న చరణాన్ని మార్చాలని డిమాండ్ చేయడంతో ఈ గీతం పూర్వాపరాల్లోకి వెళ్లి చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ గీతంపై వివాదం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. వందేళ్ల క్రితమే వివాదం మొదలైంది. భారత పర్యటనకు వచ్చిన కింగ్ జార్జ్-5 గౌరవార్థం కోల్‌కతలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 1911, డిసెంబర్ 27వ తేదీన ఓ భారీ సదస్సును ఏర్పాటు చేసింది. ఆ సదస్సు సాధారణ దేవుడి ప్రార్థనాగీతంతో ప్రారంభమైంది. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘జన గణ మన అధినాయక జయ హే’ అన్న గీతాన్ని తొలిసారిగా బాలబాలికలు ఆలపించారు. అనంతరం ఐదవ కింగ్ జార్జ్‌ను సన్మానించి ఓ తీర్మానాన్ని ఆమోదించారు. చివరను కింగ్ జార్జ్‌ను ప్రశంసిస్తూ రాంభూజ్ చౌదరి రాసిన హిందీ గీతాన్ని ఆలపించారు. దీన్ని ఆంగ్లో-ఇండియా ప్రెస్ తప్పుగా కవర్ చేయడం వివాదానికి దారితీసింది. ‘బ్రిటిష్ ఎంపరర్ గౌరవార్థం రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రత్యేకంగా రాసిన గీతాలాపనతో సదస్సు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి-ది ఇంగ్లీష్‌మేన్, డిసెంబర్ 28, 1911’. ‘ఎంపరర్‌కు స్వాగతం చెబుతూ బెంగాల్ కవి ఠాగూర్ రాసిన గీతాలాపనతో సదస్సు ప్రారంభమైంది-ది స్టేట్స్‌మేన్, డిసెంబర్ 28, 1911’. ఇలాంటి కథనాలు ఆ తర్వాత ఠాగూర్ రాసిన జాతీయ గీతంపై వివాదానికి కారణమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఠాగూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఠాగూర్ ఆధ్వర్యంలో నడుస్తున్న శాంతినికేతన్ పాఠశాలలో పిల్లలను చదివించకూడదంటూ కూడా ఆదేశాలు జారి చేసింది. 1930లో మళ్లీ దీనిపై వివాదం రేగింది. బంకిం చంద్ర ఛటర్జీ రాసిన ‘వందేమాతరం’ను జాతీయ గీతంగా ఎంపిక చేద్దామంటూ కాంగ్రెస్‌లోని ఒక వర్గం పట్టుబట్టడంతో ఈ వివాదం ఏర్పడింది. అయితే వందేమాతరం గీతంలో దేశాన్ని దుర్గాదేవితో పోల్చడం వల్ల అది ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తుందని (వారు అల్లాను తప్పించి మరొకరిని ప్రార్థించరు కాబట్టి) అభిప్రాయపడి ఠాగూర్ గీతం జోలికి వెళ్లలేదు. ఠాగూర్ వివరణ పులిన్ బిహారి సేన్‌కు ఠాగూర్ 1937, నవంబ ర్ 10వ తేదీన రాసిన లేఖలో తాను రాసిన జాతీయ గీతం గురించి ప్రస్తావించారు. తాను కింగ్ జార్జ్ ఐదు లేదా ఆరు రాజుల గురించి రాయలేదని, అంత టి దౌర్భగ్య పరిస్థితికి తాను ఎన్నడూ దిగజారబోనని స్పష్టం చేశారు. తాను అధినాయక్ అన్న పదా న్ని భారత దేశానికి, ఉద్యమానికి నాయకత్వం వహించే సారథి అనే అర్థంలోనే రాశానని వివరించారు. ఒక్క చరణం చదివి విశ్లేషిస్తే ఇలాగే ఉంటుం దని, మొత్తం తాను రాసిన ఐదు చరణాలను చదివి, తన ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవాలని అన్నారు. ఠాగూర్ వ్యక్తిత్వం, సాహిత్యోద్యమం గురించి బాగా తెలిసిన వారు కూడా గీతంలో బ్రిటీష్ ఎంపరర్‌ను ప్రశంసిస్తూ రాయలేదని ఇప్పటికీ వాదిస్తారు. ఎప్పుడో సద్దు మణిగిందనుకున్న ఈ వివాదం బాబ్రీ మసీదుకు వ్యతిరేకంగా 1980 దశకంలో హిందుత్వ శక్తుల ఉద్యమంతో మళ్లీ రాజుకుంది. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం వరకు కొనసాగింది. అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్‌కు కూడా ఈ వివాదం సుపరిచితమే.