ఆమె పుట్టింది రష్యా దేశంలోని వార్సాలో. ఐదుగురు పిల్లల్లో ఈ పాప చిన్నది. పదేళ్ల వయసులో తల్లి క్షయ వ్యాధితో మరణించింది. దీంతో తోబుట్టువులే ఆమెను పెంచారు. చిన్ననాటి నుంచి ఆమెకు విజ్ఞాన శాస్త్రమంటే చాలా ఇష్టం. ఆ విషయాల గురించి ఆ పాప తెలుసుకుంటూ ఉండేది.
ఇంట్లో పేదరికం కారణంగా ఆమె ఎక్కువగా చదువుకోలేకపోయింది. తనకొచ్చిన చదువుతో ఉపాధ్యాయురాలిగా మారింది. విశ్వవిద్యాలయానికి వెళ్లాలనే ఉద్దేశంతో 1891లో ఫ్రాన్స్‌కు వెళ్లి అక్కడ సోర్బోన్ యూనివర్సిటీలో చేరింది. అక్కడ భౌతిక, గణిత శాస్త్రాలను చదివింది. 1894లో ప్యారిస్ నగరంలో శాస్త్రవేత్త పియరీ క్యూరీని కలుసుకుంది. ఏడాది తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పరిశోధనలు చేశారు. యురేనియంపై పలు ప్రయోగాలు చేసి కీలకమైన విషయాలు కనుక్కున్నారు. ఆ సమయంలోనే రేడియో ధార్మికతను కనిపెట్టారు. ఆ పరిశోధనలకుగానూ 1903లో ఆమెతోపాటు ఆమె భర్త పియర్, హెన్రీ బెక్వెరెల్‌లకు భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇచ్చారు.
1906లో పియరీ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. జీవితంలో మరోసారి ఆమెను విషాదం చుట్టుముట్టింది. అయినా కుంగిపోక పరిశోధనలు కొనసాగించింది. ప్రపంచానికి ఎన్నో కొత్త విషయాలు నేర్పింది. రేడియో ధార్మికతను కొలిచే సాధనాన్ని రూపొందించినందుకు 1911లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకుందామె. ఇలా రెండు వేర్వేరు విభాగాల్లో నోబెల్ బహుమతి అందుకున్న ఏకైక మహిళ ఆమె.
ఆమె కనిపెట్టిన రేడియో ధార్మికత ఇవాళ అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సలో దానికి కీలకపాత్ర ఉంది. తన జీవితమంతా పరిశోధనలకే అంకితం చేసిన ఆమె పేరు ‘మేరీ క్యూరీ’. ఆమెనే ‘మేడమ్ క్యూరీ’ అని కూడా అంటారు. తన జీవితంలో ఆమె ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా ఏనాడూ వెనకడుగు వేయకుండా కష్టపడి అనుకున్నది సాధించారు. ఆమె స్ఫూర్తితో మీరూ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి.
Comments
Please login to add a commentAdd a comment