
సంగారెడ్డి, సాక్షి: కొండాపూర్ మండలం మల్కపూర్ గ్రామంలో చోటు చేసుకున్న ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే మనస్థాపంతో సుభాష్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి.. తాను బలవన్మరణానికి పాల్పడ్డారని తొలుత అంతా భావించారు. అయితే ఆమె వివాహేతర సంబంధమే ఈ ఘోరానికి కారణమైందని తేలింది ఇప్పుడు.
సుభాష్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్‌లో నివాసం ఉండేవాడు. అతని భార్య మంజుల మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో భర్త ఎంత మంచి చెప్పినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ మధ్య ఓరోజు గొడవ ముదిరి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన సుభాష్.. తన ఇద్దరు పిల్లలు మారిన్ (13), ఆరాధ్య (10) ఉరివేసి చంపి తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
‘‘డబ్బు ఆశ చూపించి నా భార్యను వాడుకున్నారు. ఎంత మంచి చెప్పినా ఆమెలో మార్పు రాలేదు. అందుకే ఈ ఘాతుకానికి పాల్పడుతున్నాం..’’ అంటూ సుభాష్ రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.