malkapur
-
ఆధునిక యుద్ధ ట్యాంకులను పరీక్షించిన ఓడీఎఫ్
కొండాపూర్(సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ చెరువులో శనివారం రెండు యుద్ధ ట్యాంకుల ట్రయల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓడీఎఫ్ పరిశ్రమ అధికారులు మాట్లాడుతూ దేశంలో ఇలాంటి ట్యాం కులను చెన్నై, మెదక్‌లోని ఓడీఎఫ్‌లో మాత్రమే తయారు చేస్తారన్నారు. ఒక్కో ట్యాంక్‌లో పది మంది కూర్చునేందుకు వీలుంటుందని తెలిపారు. ఈ యుద్ధ ట్యాంక్‌కు కేవలం పగలు మాత్రమే కాకుండా రాత్రి వేళల్లోనూ ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని, నీటితో పాటు బురద, నేలపై దూసుకుపోతుందని పేర్కొన్నారు. శత్రువులపై దాడి చేసే సమయంలో పెద్దపెద్ద సరస్సులను దాటేందుకు అనువుగా ఈ యుద్ధ ట్యాంకులను తయారు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ బ్రిగేడియర్ నేవిబుట్ట, జాయింట్ కంట్రోలర్ శరవణన్, డిప్యూటీ కంట్రోలర్ బాలషణ్ముగం తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ తెరపైకి ‘మల్కాపూర్’!
సాక్షి, హైదరాబాద్: దేవాదుల ప్రాజెక్టులో మల్కాపూర్ వద్ద అదనపు రిజర్వాయర్ నిర్మిం చాలన్న ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. గోదావరి జలాల సమర్థ వినియోగం, గరిష్ట నీటిలభ్యతే దీని లక్ష్యం. మూడేళ్ల కిందటే దీనికి పరిపాలనా అనుమతులు ఇచ్చినా, టెండర్ల ప్రక్రియ పూర్తి అయినా కరోనా పరిస్థి తుల కారణంగా మూలనపడింది. ఈ రిజ ర్వాయర్ పనులను మళ్లీ మొదలు పెట్టాలని తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతిని ధులంతా కోరుతున్నారు. సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తేనే ఈ రిజర్వాయర్ పనులు కొనసాగించే అవకాశముండటంతో త్వరలోనే ఆయన్ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అరవై టీఎంసీల నీటిని వినియోగించుకుం టూ 6.21 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరిచ్చేలా దేవాదుల ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో మొత్తంగా 17 రిజర్వాయర్లు ఉన్నప్పటికీ వాటి సామర్థ్యం కేవలం 8 టీఎంసీలు మాత్రమే. ఈ నేపథ్యం లో అదనపు నీటినిల్వలకుగాను వరంగల్ జిల్లా ఘనపూర్ మండలం లింగంపల్లి– మల్కాపూర్ వద్ద 10.78 టీఎంసీల సామ ర్థ్యం, రూ.3,227 కోట్ల వ్యయంతో రిజర్వా యర్ నిర్మించాలని నిర్ణయించి 2018 ఏప్రిల్ లో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. గోదావరికి వరద ఉండే 3 నెలల కాలంలో ధర్మసాగర్ నుంచి నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా దీన్ని డిజైన్ చేసింది. దీని వల్ల 4,060 ఎకరాలకు ముంపు ఉంటుందని అధికారులు తేల్చారు. నీటిని ఎత్తిపోసేందుకు ఏటా రూ.67.55 కోట్ల వరకు విద్యుత్ ఖర్చు ఉంటుందని అంచనా వేశారు. రిజర్వాయర్‌ను రెండున్నరేళ్లలో పూర్తి చేసేలా ఎన్నికలకు ముందు ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి చేసింది. అయితే ఒప్పందాలు చేసుకొని పనులు మొద లుపెట్టాల్సిన సమయంలో కోవిడ్–19 వచ్చి పడింది. ద్రవ్యోల్బణం, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోవడం, నిర్మాణంలోని ఇతర ప్రాజెక్టులకే భారీ నిధుల అవసరాలుం డటంతో ఈ పనులను మొదలు పెట్టలేదు. మూడేళ్లుగా అస్పష్టతే.. మూడేళ్లుగా పనులు మొదలుకాకపో వడంతో ఈ రిజర్వాయర్‌ను పూర్తిగా పక్కన పెట్టారని భావించినా, రెండ్రో జుల కిందట జరిగిన ఉమ్మడి వరంగల్ సమావేశంలో జిల్లా మంత్రులు, ఎమ్మె ల్యేలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 ని యోజకవర్గాల తాగు, సాగు అవసరా లను తీర్చే రిజర్వాయర్ నిర్మాణం మొద లు పెట్టాలని ఈ భేటీలో మంత్రులు సహా నేతలందరూ సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు విన్నవించారు. -
పనికి వెళ్లలేదని కట్టేసి కొట్టాడు!
నవీపేట (బోధన్): బాలుడని చూడకుండా కాళ్లూ, చేతులను కట్టేశాడు. ఈడ్చుకుంటూ.. తన్నుకుంటూ లాకెళ్లాడు. గొడ్డును బాదినట్లు బాదాడు. నన్ను కొట్టొద్దు అని ఎంత బతిమిలాడినా కనికరించలేదు. ఇంతకు ఈ బాలుడు చేసిన నేరం ఏమిటంటే.. పనికి వెళ్లకపోవడమే! ఇంతటి దాష్టీకానికి పాల్పడింది సదరు బాలుడి పెద్దనాన్నే. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కాపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాలుడు (14) చదువు మధ్యలో ఆపేసి కంకర సరఫరా చేసే పనిలో కూలీగా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు మందలిస్తే పలుమార్లు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయి, మళ్లీ తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని బాలుడి తల్లి భీమక్క వరుసకు బావ అయిన ముద్దంగుల పెద్ద బాలయ్యకు వివరించింది. దీంతో సదరు బాలుడిని ఎక్కడికి వెళ్లకుండా తన దగ్గర పనికి రావాలని మందలించాడు. అయినా వినకపోవడంతో కోపోద్రిక్తుడైన బాలయ్య.. బాలుడి కాళ్లూ, చేతులను తాడుతో కట్టేశాడు. కొట్టొద్దని ఎంత వేడుకున్నా వినకుండా విచక్షణారహితంగా చితకబాదాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎస్సై యాకూబ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. నిందితుడు బాలయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పల్లెల్లో భగీరథ ప్రయత్నం
మెదక్ రూరల్: పల్లెల్లో తాగునీటి గోసను అధిగమించేందుకు గ్రామ సర్పంచ్‌లు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు నీటి సమస్యలు తలెత్తనీయకుండా జవాబుదారితనంగా వ్యవహరిస్తున్నారు. వేసవిలో నీటి ఎద్దడిని తీర్చేందుకు పల్లెల్లో కొనసాగుతున్న ప్రయత్నాల పై కథనం.. మెదక్ మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి ఏడాది ఎండాకాలం వచ్చిందంటే చాలు ఓ వైపు భానుడి భగభగలు మరోవైపు నీటి కోసం తంటాలు పడటం ప్రజలకు పరిపాటిగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిషన్‌భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో ట్యాంకులను ఏర్పాటుచేసింది. పల్లెల్లో సింగూరు నీటిని అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కాని కాలం కరుణించక ఈ సారి వర్షాలు సరిగ్గా కురువలేదు. దీంతో భూగర్భజలాల అడుగంటాయి. చెరువులు, కుంటలు వట్టిపోయాయి. నీటి మట్టం అందనంత కిందికి పడిపోయింది. ప్రభుత్వ, ప్రవేట్ బోర్లు చాలా వరకు ఎండిపోయాయి. దీంతో పల్లెల్లో నీటి కష్టాలు ప్రారంభమవుతున్న తరుణంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు అధికారుల సహకారంతో నీటి సమస్యను అధిగమించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఓటేసిన ప్రజలకు నీటి సమస్య తలెత్తనీయకుండా పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తూ ప్రజలు నీటికోసం రోడ్డెక్కకుండా చర్యలు చేపడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్ళు అందరికీ అందాలనే ఉద్ధేశ్యంతో పలు చోట్ల అవగాహన లేమితో కొందరు తొలగించిన చెర్రలను తిరిగి వేయింస్తున్నారు. దీంతో నీరు అందరికి సమానంగా వెళ్తాయి. అలాగే పాడయిన బోర్లను ఫ్లష్షింగ్ చేయించడం, అద్దెకు బోర్లు తీసుకోవడం, లీకేజీలను అరికట్టడం, కట్‌వాల్స్ ఏర్పాటు చేసి నీటినివిడుదల చేయడం వంటి ప్రయత్నాలను చేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నీటి వృథాను అరికట్టి నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో సమస్యలు తలెత్తనీయకుండా సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తుండటం పట్ల పలువరు హర్షంవ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నాము. ఇప్పటికే రెండు బోర్లను అద్దెకు తీసుకోగా, ఇటీవల ఒక బోర్ను వేశాము. నీటి సమస్య తలెత్తనీయకుండా చర్యలు చేపడుతున్నాము. గ్రామస్తులందరికీ నీటిని సరఫరా చేసేందుకు మిషన్ భగీరథ పైప్‌లైన్ కలిపాము. నీటి కోసం గ్రామస్తులు రోడ్డు పైకి రాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాము. నీటి వృథాను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. – దొడ్లె లక్ష్మి, సర్పంచ్, తిమ్మానగర్ నీటి సమస్య తలెత్తనీయకుండా చర్యలు.. వేసవిలో నీటి సమస్యను అధిగమించేందుకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నాము. పాడయిన బోర్లను ఫ్లష్షింగ్ చేయించాము. తొలగించిన మిషన్ భగీరథ చెర్రలను వేయించి నీటిని కంట్రోల్ చేశాము. దీంతో రెండు రోజులకోసారి మిషన్ భగీరథ నీళ్ళు అందరికి సమానంగా వస్తున్నాయి. కట్‌వాల్స్ ఏర్పాటు చేశాము. అద్దెకు ఓ బోరును మాట్లాడిపెట్టాము. అదనంగా పైప్‌లను సైతం వేయడం జరిగింది. నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఏమైనా సందేహాలు ఉంటే అధికారుల నుంచి తగు సలహాలు, సూచనలు తీసుకుంటున్నాము. – సరోజ, సర్పంచ్, మల్కాపూర్ -
రెండు రిజర్వాయర్లకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టు ల్లో భాగంగా చేపడుతున్న రెండు రిజర్వాయర్ల పనులను తాత్కాలికంగా పక్కనపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవాదులలో భాగం గా నిర్మిస్తున్న మల్కాపూర్, పాలమూరు–రంగారెడ్డిలో భాగంగా నిర్మిస్తున్న లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ పనులను ప్రస్తుతం చేపట్టరాదని నీటిపారుదల శాఖకు సంకేతాలు వచ్చినట్లుగా తెలిసింది. ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఇతర పనుల పూర్తికి నిధుల అవసరాలుండటం, అవి పూర్తయితే కానీ ఈ రిజర్వాయర్లతో ఉపయో గం లేకపోవడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. అంతా సిద్ధం.. ఆలోపే నిశ్శబ్దం.. గోదావరి జలాలను వినియోగించుకునేందుకు చేపట్టిన దేవాదుల ప్రాజెక్టులో అదనపు నీటి నిల్వలు పెంచేందుకు కొత్త రిజర్వాయర్ నిర్మా ణం చేయాలని సీఎం కేసీఆర్ తొలినుంచీ చెబుతున్నారు. సీఎం సూచనలకు అనుగుణంగా 10.78 టీఎంసీల సామర్థ్యంతో, రూ.3,672 కోట్లతో వరంగల్ జిల్లా ఘనపూర్ మండలం లింగంపల్లి వద్ద దీన్ని నిర్మించాలని నీరుపారుదల శాఖ నిర్ణయించింది. గోదావరికి వరద ఉండే 3 నెలల కాలంలో ధర్మసాగర్ నుంచి నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా దీన్ని డిజైన్ చేసింది. ఈ రిజర్వాయర్‌తో 4,060 ఎకరాల మేర ముంపు ఉంటుందని తేల్చింది. నీటిని ఎత్తిపోసేందుకు 72 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని, ఏటా రూ.67.55 కోట్ల వరకు విద్యుత్ ఖర్చు ఉంటుందని అంచనా వేసింది. రిజర్వాయర్‌ను రెండున్నరేళ్లలో పూర్తి చేసేలా ఇటీవలి రాష్ట్ర ఎన్నికలకు ముందు ఈ పనుల ను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులకు సిద్ధమైంది. దేవాదులలోని మూడో ఫేజ్‌లోని మూడో దశ పను ల్లో సొరంగం పనులు పూర్తి కాలేదు. ఇది పూర్తయితే కానీ 25 టీఎంసీల మేర నీటిని వినియోగించుకునే అవకాశం లేదు. ఇక్కడ 49 కి.మీ. సొరంగం పనుల్లో 7కి.మీలు పెండింగ్‌లో ఉంది. ఈ పనులను ప్రస్తుత ఏజెన్సీతో పూర్తి చేయ డం సాధ్యం కాకపోవడంతో మరో ఏజెన్సీతో పనులు చేయించాలని సీఎం ఆదేశిం చారు. ఈ పనుల పూర్తికే రెండేళ్లు పట్టనుంది. నిధుల అవసరాలు భారీగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుపై మరింత ఆర్థిక భారం వేయరాదన్న భావనలో ఉన్న ప్రభుత్వం, మల్కాపూర్ రిజర్వాయర్‌ను కొద్దికాలం పక్కనపెట్టాలని నిర్ణయించినట్లుగా నీటిపారుదల వర్గాలు చెప్పాయి. లక్ష్మీదేవునిపల్లిపై అదే మౌనం.. ఇక 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి తాగునీరు, పరిశ్రమలకు నీటివసతిని కల్పించే ఉద్దేశంతో రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు ప్రాజెక్టును చేపట్టగా ఇందులో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి వద్ద రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదే వునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులను 18 ప్యాకేజీలుగా విభజించి, మొత్తంగా రూ.30 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి రెండున్నరేళ్ల కిందటే పనులు ప్రారంభించారు. అయితే రెండున్నరేళ్లుగా ఉద్దండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి అనుసంధాన ప్రక్రియ, రిజర్వాయర్ నిర్మాణంపై స్పష్టత రాలే దు. 2.80 టీఎంసీల సామర్ధ్యంతో రూ.915 కోట్లతో దీని అం చనాలు సిద్ధం చేసినా టెండర్లు మాత్రం పిలవలేదు. అయితే ప్రస్తుతానికి పాలమూరు ప్రాజెక్టులో ఉద్దండాపూర్ వరకు పనులను వేగిరం చేయాలని సూచించిన ప్రభుత్వం, ఆ పనులు పూర్తయ్యాకే లక్ష్మీదేవునిపల్లిని చేపట్టాలనే సంకేతాలిచ్చింది. ఎగువ పనులు పూర్తవ్వాలంటే మరో రెండేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. అవి పూర్తయితేకానీ లక్ష్మీదేవునిపల్లి చేపట్టే అవకాశం లేదు. -
రాష్ట్రానికి కంటి వెలుగు
సాక్షి, మెదక్: ‘‘కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శం. ఎంత డబ్బు ఖర్చయినా రాష్ట్రం అంతటా పథకం అమలు చేస్తాం. రాష్ట్రంలోని రూ.3.70 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి అద్దాలు ఇస్తాం. అవసరమైతే కాటరాక్ట్ ఆపరేషన్లు చేయిస్తాం’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. బుధవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో సీఎం కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఆ పిల్లల మాటలు కదిలించాయి: ‘‘ఆదర్శ గ్రామమైన మల్కాపూర్ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించటం సంతోషంగా ఉంది. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నందుకు గర్వంగా ఉంది. ఎర్రవల్లి గ్రామంలో కంటి వైద్య శిబిరం నిర్వహించగా 217 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు తేలింది. దృష్టి లోపం ఉన్న చిన్నపిల్లలకు అద్దాలు అందజేస్తే ‘ఇప్పుడు మాకు కళ్లు బాగా కనిపిస్తున్నాయని.. థ్యాంక్స్ అంకుల్’ అని పిల్లలన్న మాటలు నన్ను కదిలింపజేశాయి. అక్కడి అనుభవంతోనే రాష్ట్రం అంతటా కంటి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నా’’ అని సీఎం వివరించారు. కంటి అపరేషన్ అంటే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కంటి పరీక్షల అనంతరం సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్న మహిళ ‘‘నేనూ ఆపరేషన్ అంటే భయపడ్డా.. రెండు కళ్లకు కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నా. వైద్యులు ఆపరేషన్ చేసిన గంటలోపల ఇంటికి పంపారు’’ అని తెలిపారు. ఆపరేషన్ల కోసం ఎవ్వరూ పైసా ఖర్చు చేయాల్సిన పనిలేదన్నారు. ‘‘దేశంలో కులాలు, మతాల పంచాయతీలు ఉండటం దుర్మార్గం. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ ఆడమగా బేధం ఉంది. కుల మతాలను వీడి అందరూ ఐకమత్యంగా పనిచేయాలి. లింగవివక్ష కూడా పక్కపెట్టాలి. ఆడవాళ్లలో గొప్పవాళ్లు లేరా? మెదక్ ఎస్పీ, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, వాకాటి కరుణ, మెదక్ జెడ్పీ చైర్పర్సన్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి.. జెడ్పీటీసీ అందరూ మహిళలే’’ అని వివరించారు. రష్యాలో 82 శాతం పైలట్లు మహిళలే ఉన్నట్లు తెలిపారు. అవకాశాలిస్తే మహిళలు అద్భుతాలు సృష్టిస్తారన్నారు. మల్కాపూర్ మహిళలకు చేతులు జోడిస్తున్నానని.. ఈ గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దటంలో వారి పాత్ర చాలా ఉందని కొనియాడారు. ఈ గ్రామం తెలంగాణకు మణిహారం అని, ఇక్కడి నుంచి తాను నేర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. పంపిణీకి సిద్ధం చేసిన కంటి అద్దాలు రైతుల కష్టాలు తీరాలె ‘‘తెలంగాణ రైతుల కష్టాలు తీరేలే.. బాజాప్తా గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణ పంట పొలాలకు మళ్లాలి. రాష్ట్రంలో కరెంటు పీడపోయింది. త్వరలో రైతుల సాగునీటి తిప్పలు పోతాయి. దేశంలోని ఏ రాష్ట్రం ఖర్చు చేయని విధంగా తెలంగాణలో సాగునీటి రంగానికి నిధులు ఖర్చు చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నాం. ఎంతో బాధ ఉంటేనే ఈ స్థాయిలో సాగునీటి రంగానికి ప్రాధ్యాత ఇస్తాం’’ అని సీఎం అన్నారు. ఇక్కడి రైతులు సాగునీరు కోసం బోర్లు వేసి ఎన్నో తిప్పలు పడ్డారన్నారు. తాను కూడా 50 బోర్లు వేసినట్లు చెప్పారు. ఈ కష్టాలు తీరడానికి కృష్ణా, గోదావరి నీళ్లు బాజాప్తా రావాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో త్వరలోనే రైతుల బాధలు తీరుతాయని చెప్పారు. 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న కొండపోచమ్మ సాగర్‌ను ఏడాదిలో పూర్తిచేసి ప్రపంచంలోనే రికార్డు నెలకొల్పనున్నట్లు చెప్పారు. మిషన్‌కాకతీయ ద్వారా చెరువులు నింపి 365 రోజులు నీళ్లు ఉండేలా చూస్తామన్నారు. గ్రామాల్లో మోరీల బాధ తీరుస్తాం తెలంగాణలో డ్రెయినేజీ (మోరీ)ల బాధ తీర్చేలా అమెరికా తరహాలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ నిర్మించనున్నట్లు సీఎం ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో మోరీలతో ప్రజలు ఇబ్బందులు పడటమే కాదు రోగాల బారిన పడుతున్నారని, వారి కష్టాలు తీర్చేందుకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామన్నారు. మండలం లేదా పది గ్రామాలను యూనిట్‌గా తీసుకుని నీటి శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థకు సంబంధించిన కసరత్తు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, రాజ్యసభ సభ్యులు కేశవరావు, సంతోష్‌కుమార్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేత్రదానం సర్టిఫికెట్లు ఆందజేత సీఎం కేసీఆర్‌కు మల్కాపూర్ గ్రామస్తులు ప్రత్యేక కానుక అందజేశారు. గ్రామానికి చెందిన 756 మంది నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చారు. నేత్రదానం చేస్తున్నట్లు అంగీకార పత్రాలను కంటి వెలుగు సభా వేదికపై సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వారిని సీఎం అభినందించారు. తూప్రాన్‌కు చెందిన 40 మంది జర్నలిస్టులు కూడా నేత్రదానం పత్రాలపై సంతకాలు చేశారు. -
నేడు మల్కాపూర్‌కు సీఎం కేసీఆర్
సాక్షి, మెదక్ : ప్రతిష్టాత్మకమైన ‘కంటి వెలుగు’ పథకం ప్రారంభానికి మెతుకుసీమ వేదిక కానుంది. ప్రజలందరికీ ఉచిత కంటి వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ తూప్రాన్ మండలం మల్కాపూర్ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆయన ఆదర్శ గ్రామమైన మల్కాపూర్ రానుండటంపై గ్రామస్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం రాకకోసం మల్కాపూర్ గ్రామస్తులు, యువకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రికి కానుకగా మల్కాపూర్ గ్రామానికి చెందిన 800 మంది నేత్రదానానికి అంగీకరించారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాలను బుధవారం సీఎంతో జరిగే కార్యక్రమంలో అధికారులకు అందజేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం నాటి కార్యక్రమంలో నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. సీఎం పర్యటకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనదీప్తి పర్యవేక్షించారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం పర్యటనకు పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎం కార్యక్రమం ఇలా! ముఖ్యమంత్రి బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో మల్కాపూర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా గ్రామంలోని రాక్ గార్డెన్ చేరుకుని అక్కడ హరితహారంలో భాగంగా మొక్కను నాటుతారు. అనంతరం గ్రామంలోని పలు ప్రాంతాలను సందర్శించి అక్కడ అమలువుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకుంటారు. ఆ తర్వాత గ్రామంలోని దుర్గమ్మ ఆలయం చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా కంటి వెలుగు శిబిరం వద్దకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కంటివైద్య నిపుణులు కంటి పరీక్షలు చేస్తారు. అనంతరం 972 మంది గ్రామస్తులతో ముఖాముఖి సమావేశమై మాట్లాడతారు. ముఖాముఖికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ముఖాముఖి అనంతరం సీఎం కేసీఆర్ గ్రామస్తులనుద్ధేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా మల్కాపూర్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ వరాలు కురిపించనున్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్తారు. 20 వైద్య బృందాల ఏర్పాటు సీఎం చేతుల మీదుగా జిల్లాలో పథకం ప్రారం భం కానుండటంతో అధికారులు జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు 20 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. వైద్య బృందంలో కంటి వైద్యుడు, ఏఎన్ఎం, సూపర్వైజర్, ఆశవర్కర్లు ఉంటారు. జిల్లాలో 19 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఆయా పీహెచ్‌సీల్లో ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించేందుకు 19 బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో లక్షల మందికిపైగా కంటి సమస్యల ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారుల అంచనా. కంటివెలుగులో భాగంగా 86 వేల మందికి కళ్ల అద్దాలు పంపిణీ చేయనున్నారు. డిటెక్టర్ సైరన్‌తో కలకలం సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం గ్రామం సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ హెలీప్యాడ్‌ను మధ్యాహ్నం బాంబు స్క్వాడ్ మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలో డిటెక్టర్లు బీప్.. బీప్ అంటూ సైరన్ ఇవ్వటం ప్రారంభించాయి. దీంతో సిబ్బందికి, భద్రతా సిబ్బందికి ముచ్చెమటలు పట్టాయి. సౌండ్ వచ్చిన ప్రాంతంలో బాంబుస్క్వాడ్ అధికారులు తవ్వించగా భూమిలో నుంచి ఇనుపచువ్వలు వెలువడ్డాయి. దీంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. -
ఆటో ట్యాంకర్ ఢీ : నలుగురు మృతి
-
కూలికి వెళ్తూ కానరాని లోకాలకు..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ /కొత్తపల్లి: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ బైపాస్ రోడ్డు ఎస్సారెస్పీ బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో.. పాల ట్యాంకర్‌ను ఢీ కొన్న ఘటనలో మొత్తం ఆరుగురు మృత్యువాత పడగా, మరో పది మందికి తీవ్ర గాయాల య్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఆటోడ్రైవర్‌తోపాటు ఐదు గురు మహిళా కూలీలున్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామన్‌పల్లి గ్రామానికి చెందిన కూలీలు పత్తి ఏరేందుకు రాజన్న సిరి సిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నర్సక్క పేటకు ఏపీ 15 ఎక్స్ 4399 నంబరు గల ప్యాసింజర్ ఆటోలో వెళ్తున్నారు. ఆటోలో పరిమితి(నలుగురు)కి మించి 16 మంది వరకు కూలీలు ఉన్నారు. కూలీలు ఉన్న ఆటో మల్కపూర్ నుంచి బద్దిపల్లి వైపు వెళ్తూ మల్కాపూర్ ఎస్సారెస్పీ బ్రిడ్జి సమీపానికి వచ్చింది. ఇక్కడే నాలుగు రోడ్ల కూడలి ఉంది. కాగా, మరో వైపు కొత్తపల్లి నుంచి చింతకుం టకు వెళ్లే రోడ్డు ఉండగా.. ఆ దారిలో ఏపీ 29 టీబీ 4649 నంబరు గల పాల ట్యాంకర్ వస్తోంది. పాల ట్యాంకర్ రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ ఒన్న వెంకట మాధవరావు (46), మేకల దేవమ్మ (50), మేకల సాయిలీల (20), నాం పల్లి అంజలి(40) అక్కడికక్కడే మృతి చెందా రు. కనకరాజుల ఓదమ్మ(40), మేకల లలిత (40) ఆస్పత్రిలో మరణించారు. తీవ్రంగా గాయపడిన బోగండ్ల లత(25), విలాసాగరం శ్వేత (28) పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మేకల స్వప్న, నేరెళ్ల శిరీష, బొజ్జ లక్ష్మీనర్సవ్వ, విలా సాగరం గౌరమ్మ, మేకల విజయ, మేకల రేణుక, మేకల అనూష, విలాసాగరం మాధవి గాయపడ్డారు. వీరిని కరీంనగర్లో మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు తరలించారు. రూ.3.50 లక్షల తక్షణ సహాయం.. ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న మంత్రి ఈటెల రాజేందర్ వెంటనే స్పందించారు. మృతులు, క్షతగాత్రులకు ప్రభుత్వం సహాయాన్ని ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురికి ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, పాల ట్యాంకర్ యజమాని ద్వారా రూ.లక్ష, ఆపద్బంధు పథకం కింద రూ.50 వేలు కలిపి రూ.3.50 లక్షలు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులు భరించడంతోపాటు వారికి కూడా డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
మల్కాపూర్‌ను సందర్శించిన యూనిసెఫ్ బృందం
తూప్రాన్ : కలెక్టర్ దత్తత గ్రామమైన తూప్రాన్ మండలం మల్కాపూర్‌ను యూనిసెఫ్ బృందం సభ్యులు బుధవారం సందర్శించారు. వీరిలో ఢిల్లీకి చెందిన ఫ్రాంక్ బధియాంబో వాష్ స్పెషలిస్ట్, లండన్‌కు చెందిన జెమ్స్కారీ, హైదరాబాద్‌కు చెందిన వాష్స్పెషలిస్టు సెలాధియత ఆర్ నల్టీ, మధుసూదన్‌రెడ్డి, కేశవరెడ్డి ఉన్నారు. వారికి స్థానికులు పూల దండలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సమష్టిగా చేపట్టిన వంద శాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, మిషన్ భగీరథ, మొక్కల పెంపకం తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం వారు గ్రామస్తుల తీరును అభినందించారు. ఇదే స్ఫూర్తితో ఇతర గ్రామస్తులు ఐక్యంగా ఏర్పడితే ప్రభుత్వాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ రాఘవరావు, సర్పంచ్ స్వామి పాల్గొన్నారు. -
బీరు పరిశ్రమలో అగ్ని ప్రమాదం
మెదక్: బీరు పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుని భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ సంఘటన మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం మాల్కాపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. మాల్కాపూర్లోని ఓ బీరు పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే చాలా ఆస్తి నష్టం జరిగింది. -
కూతుళ్లతో సహా దంపతుల ఆత్మహత్య
మెదక్ : మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ వద్ద నాలుగు మృతదేహాలు బయటపడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. జాతీయ రహదారి సమీపంలో నాలుగు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో భార్యా,భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతులంతా మహబూబ్ నగర్ జిల్లా కమలుద్ధీన్కు చెందిన వారిగా నిర్థారించారు. ఆర్థిక సమస్యల కారణంగానే కుటుంబం అంతా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలం వద్ద దొరికిన ఫోటో ఆధారంగా మృతుల పేర్లు రాజు, అనిత, అఖిల, ఉమగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజు కుటుంబీలకు పోలీసులు సమాచారం అందించారు. కాగా వీరంతా ఎప్పుడు ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం తెలియరాలేదు.