
బుధవారం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మల్కాపూర్‌లో బాలుడి కాళ్లూ,చేతులు కట్టేసిన దృశ్యం
నవీపేట (బోధన్): బాలుడని చూడకుండా కాళ్లూ, చేతులను కట్టేశాడు. ఈడ్చుకుంటూ.. తన్నుకుంటూ లాకెళ్లాడు. గొడ్డును బాదినట్లు బాదాడు. నన్ను కొట్టొద్దు అని ఎంత బతిమిలాడినా కనికరించలేదు. ఇంతకు ఈ బాలుడు చేసిన నేరం ఏమిటంటే.. పనికి వెళ్లకపోవడమే! ఇంతటి దాష్టీకానికి పాల్పడింది సదరు బాలుడి పెద్దనాన్నే. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కాపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాలుడు (14) చదువు మధ్యలో ఆపేసి కంకర సరఫరా చేసే పనిలో కూలీగా పని చేస్తున్నాడు.
తల్లిదండ్రులు మందలిస్తే పలుమార్లు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయి, మళ్లీ తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని బాలుడి తల్లి భీమక్క వరుసకు బావ అయిన ముద్దంగుల పెద్ద బాలయ్యకు వివరించింది. దీంతో సదరు బాలుడిని ఎక్కడికి వెళ్లకుండా తన దగ్గర పనికి రావాలని మందలించాడు. అయినా వినకపోవడంతో కోపోద్రిక్తుడైన బాలయ్య.. బాలుడి కాళ్లూ, చేతులను తాడుతో కట్టేశాడు. కొట్టొద్దని ఎంత వేడుకున్నా వినకుండా విచక్షణారహితంగా చితకబాదాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎస్సై యాకూబ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. నిందితుడు బాలయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment