
కాదేదీ వైరల్‌కు అనర్హం అన్నట్టు ఉంటుంది సోషల్ మీడియా వ్యవహారం. ఎపుడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుందో తెలియదు. అనేక సామాజిక అంశాలతోపాటు, ప్రేయసీ ప్రియుల చిలిపి తగాదాలు, భార్యభర్తల సరసాలు ,ఫైటింగ్‌లు లాంటి వీడియోలు నెట్టింట సందడి చేస్తూ ఉంటాయి. అలా తన పతిదేవుడిపై ఒక సతీమణి ప్రతీకారం తీర్చుకున్న వైనం వైరల్‌గా మారింది. ప్రతీకారం అంటే అదేదో హింసా, ప్రతి హింస అనుకునేరు. చదవండి మరి!
తనకు చపాతి కావాలని అడిగాడు ఓ భర్త. ‘హే...పో.. ఇపుడెవరు చేస్తారు’ అంది భార్యామణి విసుగ్గా. నేనేమైనా మణులు, మాణిక్యాలు అడిగానా, చపాతియేగా..నాకోసం ఆ మాత్రం చేయలేవా అన్నాడు భర్త. అంతే క్షణాల్లో అక్కడి వాతావరణం మారిపోయింది. ముందు ఇల్లు పీకి పందిరేసినంత పనిచేసిన భార్య చివరికి చపాతీ తయారీకి రంగంలోకి దిగింది.
‘‘ఇగో.. నేను చపాతీ చేయాలంటే నువ్వు సాయం చేయాలి మరి అంది గోముగా.. ఓ..దానిదేముంది చేసేద్దాం అన్నాడు భార్యామణి అసలు ప్లాన్ తెలియని భర్త.
అంతే కిచెన్ లోకి వెళ్లి గోధుమపిండి తీసుకొచ్చింది. బాగా పిసికి మెత్తగా పిండిని రెడీ చేసేసింది. ఆ తర్వాత ఇంటి పక్కన ఉన్న ఖాళి ప్రదేశంలో, చపాతీలు కాల్చేందుకు కట్టెల పొయ్యి సిద్ధం చేసింది. ఇది చూసి ఇంకా ఉత్సాహంతో రంగంలోకి దిగాడు భర్త.
మాంచిగా మఠం వేసుకుని కూర్చున్నాడు. మరి చపాతీలు చేయడానికి పీట ఏది అని అడిగాడు.. దానికి ఆమె పీటా, గీటా లేదని చెప్పింది.
‘‘అదేమిటోయ్..పీట లేకుండా చపాతీ ఎలా చేసేది’’ అంటూ భార్యమీద గుర్రుమన్నాడు. అప్పుడు తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసే సమయం కోసం ఎదురు చూస్తున్న భార్యామణి అటు ఇటు చూసిన ఆమె మీ గుండుగా నున్న....గా, దాని మీద చేస్తాను అన్నది. ఓసి నీ దుంపదెగ ఇదేం పని హూంకరించాడు భర్త.
అవన్నీ జాన్తా నహీ.. మీకు చపాతి కావాలా? వద్దా? అని ఆమె ప్రశ్నించింది. సరే అలానే కానివ్వూ అని అన్నాడు. అలా అనడం ఆలస్యం, ఇంక ఏ మాత్రం సంకోచించకుండా, నున్నటి అతగాడి గుండు మీద తన ప్రతాపన్నంతా చూపించింది (చాలా రోజులనుంచి బోడి గుండు మీదు కోపం ఉన్నట్టుంది పాపం..) చపాతీలు వత్తడం మొదలుపెట్టింది. భర్త చక్కగా పిండిలో ముంచి ఇవ్వడం, ఆమె గుండ్రంగా చపాతీ వత్తడి, ఆ తరువాత దాన్ని ఆయనగారు తీసి పెనం మీద కాల్చడం.. ఇందులో చూడవచ్చు. గతేడాది నవంబరులో షేర్ అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఫన్నీగా కమెంట్స్ చేశారు.
అరే... ఇందేంది భయ్యా.. నవ్వి నవ్వి మేం పోతే ఎవరు గ్యారెంటీ అంటూ కామెంట్ చేస్తున్నారు. కిచెన్లో చపాతీలు తయారు చేయడానికి పీట కూడా లేదా? ఎంత బోడిగుండు అయితే మాత్రం భర్త తల మీద చపాతీలు చేస్తారా? రివెంజ్ ఇలా తీర్చుకుంటారా అన్నారు. అంతేకాదు కొంతమంది భార్యలు కూడా ఇదే ఫాలో అయితే బోడినెత్తి బంగారు బాబుల పరిస్థితి ఏంటి బాసూ అంటూ వ్యాఖ్యానించారు. మరికొందరేమో సోషల్ మీడియాలో హైప్ కోసం ఇలాంటి పనులు చేస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment