బుధవారం మెదక్ జిల్లా మల్కాపూర్‌లో ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో హరీశ్‌రావు, పద్మా దేవేందర్‌రెడ్డి తదితరులు
సాక్షి, మెదక్: ‘‘కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శం. ఎంత డబ్బు ఖర్చయినా రాష్ట్రం అంతటా పథకం అమలు చేస్తాం. రాష్ట్రంలోని రూ.3.70 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి అద్దాలు ఇస్తాం. అవసరమైతే కాటరాక్ట్ ఆపరేషన్లు చేయిస్తాం’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. బుధవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో సీఎం కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
ఆ పిల్లల మాటలు కదిలించాయి: ‘‘ఆదర్శ గ్రామమైన మల్కాపూర్ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించటం సంతోషంగా ఉంది. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నందుకు గర్వంగా ఉంది. ఎర్రవల్లి గ్రామంలో కంటి వైద్య శిబిరం నిర్వహించగా 217 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు తేలింది. దృష్టి లోపం ఉన్న చిన్నపిల్లలకు అద్దాలు అందజేస్తే ‘ఇప్పుడు మాకు కళ్లు బాగా కనిపిస్తున్నాయని.. థ్యాంక్స్ అంకుల్’ అని పిల్లలన్న మాటలు నన్ను కదిలింపజేశాయి. అక్కడి అనుభవంతోనే రాష్ట్రం అంతటా కంటి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నా’’ అని సీఎం వివరించారు. కంటి అపరేషన్ అంటే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
కంటి పరీక్షల అనంతరం సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్న మహిళ
‘‘నేనూ ఆపరేషన్ అంటే భయపడ్డా.. రెండు కళ్లకు కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నా. వైద్యులు ఆపరేషన్ చేసిన గంటలోపల ఇంటికి పంపారు’’ అని తెలిపారు. ఆపరేషన్ల కోసం ఎవ్వరూ పైసా ఖర్చు చేయాల్సిన పనిలేదన్నారు. ‘‘దేశంలో కులాలు, మతాల పంచాయతీలు ఉండటం దుర్మార్గం. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ ఆడమగా బేధం ఉంది. కుల మతాలను వీడి అందరూ ఐకమత్యంగా పనిచేయాలి. లింగవివక్ష కూడా పక్కపెట్టాలి. ఆడవాళ్లలో గొప్పవాళ్లు లేరా? మెదక్ ఎస్పీ, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, వాకాటి కరుణ, మెదక్ జెడ్పీ చైర్‌పర్సన్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి.. జెడ్పీటీసీ అందరూ మహిళలే’’ అని వివరించారు. రష్యాలో 82 శాతం పైలట్లు మహిళలే ఉన్నట్లు తెలిపారు. అవకాశాలిస్తే మహిళలు అద్భుతాలు సృష్టిస్తారన్నారు. మల్కాపూర్ మహిళలకు చేతులు జోడిస్తున్నానని.. ఈ గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దటంలో వారి పాత్ర చాలా ఉందని కొనియాడారు. ఈ గ్రామం తెలంగాణకు మణిహారం అని, ఇక్కడి నుంచి తాను నేర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
పంపిణీకి సిద్ధం చేసిన కంటి అద్దాలు
రైతుల కష్టాలు తీరాలె
‘‘తెలంగాణ రైతుల కష్టాలు తీరేలే.. బాజాప్తా గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణ పంట పొలాలకు మళ్లాలి. రాష్ట్రంలో కరెంటు పీడపోయింది. త్వరలో రైతుల సాగునీటి తిప్పలు పోతాయి. దేశంలోని ఏ రాష్ట్రం ఖర్చు చేయని విధంగా తెలంగాణలో సాగునీటి రంగానికి నిధులు ఖర్చు చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నాం. ఎంతో బాధ ఉంటేనే ఈ స్థాయిలో సాగునీటి రంగానికి ప్రాధ్యాత ఇస్తాం’’ అని సీఎం అన్నారు. ఇక్కడి రైతులు సాగునీరు కోసం బోర్లు వేసి ఎన్నో తిప్పలు పడ్డారన్నారు. తాను కూడా 50 బోర్లు వేసినట్లు చెప్పారు. ఈ కష్టాలు తీరడానికి కృష్ణా, గోదావరి నీళ్లు బాజాప్తా రావాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో త్వరలోనే రైతుల బాధలు తీరుతాయని చెప్పారు. 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న కొండపోచమ్మ సాగర్‌ను ఏడాదిలో పూర్తిచేసి ప్రపంచంలోనే రికార్డు నెలకొల్పనున్నట్లు చెప్పారు. మిషన్‌కాకతీయ ద్వారా చెరువులు నింపి 365 రోజులు నీళ్లు ఉండేలా చూస్తామన్నారు.
గ్రామాల్లో మోరీల బాధ తీరుస్తాం
తెలంగాణలో డ్రెయినేజీ (మోరీ)ల బాధ తీర్చేలా అమెరికా తరహాలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ నిర్మించనున్నట్లు సీఎం ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో మోరీలతో ప్రజలు ఇబ్బందులు పడటమే కాదు రోగాల బారిన పడుతున్నారని, వారి కష్టాలు తీర్చేందుకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామన్నారు. మండలం లేదా పది గ్రామాలను యూనిట్‌గా తీసుకుని నీటి శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థకు సంబంధించిన కసరత్తు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, రాజ్యసభ సభ్యులు కేశవరావు, సంతోష్‌కుమార్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేత్రదానం సర్టిఫికెట్లు ఆందజేత
సీఎం కేసీఆర్‌కు మల్కాపూర్ గ్రామస్తులు ప్రత్యేక కానుక అందజేశారు. గ్రామానికి చెందిన 756 మంది నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చారు. నేత్రదానం చేస్తున్నట్లు అంగీకార పత్రాలను కంటి వెలుగు సభా వేదికపై సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వారిని సీఎం అభినందించారు. తూప్రాన్‌కు చెందిన 40 మంది జర్నలిస్టులు కూడా నేత్రదానం పత్రాలపై సంతకాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment