సంగారెడ్డి జిల్లా సింగూరు హరిత రిసార్ట్‌లో ఘటన
మునిపల్లి(అందోల్)/నారాయణఖేడ్: పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదంటూ ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం సింగూరు ప్రాజెక్టు హరిత రిసార్ట్‌లో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..నిజాంపేటకు చెందిన కరిపే ఉదయ్‌కుమార్ (21), మంగలి రోహిత(19) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలకు చెందినవారు అంగీకరించలేదు.
ఈ క్రమంలో గురువారం ఉదయ్, రోహితలు సింగూరు ప్రాజెక్టు సమీపంలోని హరిత రిసార్ట్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఒకే ఫ్యాన్‌కు ఇద్దరూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ప్రేమజంట ఆత్మహత్య విషయం రిసార్ట్ నిర్వాహకులకు శుక్రవారం తెలిసింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ రాసి ఉంచిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ ప్రేమకు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు అందులో పేర్కొన్నట్టు తెలిసింది.
ఉదయ్‌కుమార్‌ది మిర్చి వ్యాపారం కాగా, రోహిత నారాయణఖేడ్‌లోని మోడల్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (బీజెడ్‌సీ) ఫైనలియర్ చదువుతోంది. గురువారం ఆమె క్లాసులకు హాజరు కాలేదు. శుక్రవారం ఉదయం రోహిత తండ్రి దుర్గేష్ కళాశాలకు ఫోన్ చేసి కూతురు ఆచూకీ గురించి ఆరా తీసినట్టు తెలిసింది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. కాగా ఉదయ్‌కుమార్ తండ్రి బాల్‌కిషన్ కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హరిత రిసార్ట్ మేనేజర్ సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ రాజేశ్‌నాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment