మధ్యాహ్న భోజన ప‌థ‌కానికి ఆద్యుడు ఆయ‌నే | Who is the father of mid day meal full details here | Sakshi
Sakshi News home page

K. Kamaraj: పిల్లల నోటికి బువ్వ అందించారు

Published Sat, Feb 22 2025 7:43 PM | Last Updated on Sat, Feb 22 2025 7:50 PM

Who is the father of mid day meal full details here

మహనీయులు

పిల్లలూ! ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం పూట విద్యార్థులకు భోజనం పెడతారన్న విషయం మీకు తెలుసా? పిల్లలు టిఫిన్‌ బాక్సులు తీసుకెళ్లకుండా, అక్కడ వండి, వడ్డించే అన్నాన్నే తింటారు. ఈ పద్ధతి చాలా బాగుంది కదా? మరి ఈ విధానాన్ని ఆలోచించింది, ఆచరణలోకి తెచ్చింది ఎవరో తెలుసా? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న (Bharat Ratna) కె.కామరాజ్‌. ఆయన గురించి తెలుసుకుందామా?

కె.కామరాజ్‌ (K. Kamaraj) 1903 జులై 15న అప్పటి మద్రాసు రాష్ట్రంలోని విరుదుపట్టి అనే ప్రాంతంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కుమారస్వామి, శివగామి అమ్మాల్‌. వారికి కంచి కామాక్షి అమ్మవారు ఇష్టదేవత. అందుకే పుట్టిన మగబిడ్డను ‘కామాక్షి’ అని, ‘రాజా’ అని పిలిచేవారు. చివరకు ఆ పేరు ‘కామరాజ్‌’గా స్థిరపడింది. ఆయనకు ఆరేళ్ల వయసు ఉండగానే ఆయన తాత, ఆ తర్వాత ఆయన తండ్రి మరణించారు. దీంతో కుటుంబం ఇబ్బందులు పడింది. అతికష్టమ్మీద చదువుకున్న కామరాజ్‌ 12వ ఏట చదువు మానేసి, తన మేనమామ నడిపే బట్టల దుకాణంలో పనికి వెళ్లడం మొదలుపెట్టాడు.

అక్కడ ఉన్న సమయంలో స్థానికంగా ఉండే సమస్యలు, చుట్టుపక్కల జరిగే విషయాలను గమనిస్తూ తనకు తోచిన విధంగా ఇతరులకు సాయపడుతూ ఉండేవాడు. అప్పట్లో స్వాతంత్య్రోద్యమం మొదలవడంతో పలువురు ప్రముఖులు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆ కార్యక్రమాలు వెళ్లే కామరాజ్‌ వారి ప్రసంగాలతో ఉత్తేజితుడయ్యేవాడు. బంకించంద్ర ఛటర్జీ, సుబ్రహ్మణ్య భారతి రాసిన పుస్తకాలను ఇష్టంగా చదివేవాడు. అనీ బీసెంట్‌ ‘స్వపరిపాలన’ ఉద్యమానికి ఆకర్షితుడయ్యాడు.

ఆ తర్వాత 1921లో తొలిసారి కామరాజ్‌ మహాత్మాగాంధీని మదురైలో కలిశారు. ఆయన భావాలు, ఆలోచనలకు ఆకర్షితుడైన కామరాజ్‌ తను కూడా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనాలని నిశ్చయించుకున్నాడు.  ఆ తర్వాత అనేక ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి, జైల్లో ఉంచారు. అలా సుమారు 3 వేల రోజులు కామరాజ్‌ జైల్లోనే గడిపారు.  అయినా ఆయన ఏమాత్రం చలించలేదు.  దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత  మద్రాసు రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా సేవలందించారు.

ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తమిళనాడు రాష్ట్రంలోని విద్యావిధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు.  పిల్లలు ఆకలితో పాఠాలు వినకుండా దేశంలోనే మొదటిసారిగా వారికి మధ్యాహ్న భోజనం (Midday Meal) అందించే ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్కూళ్లల్లో యూనిఫారం వేసుకునే విధానం సైతం ఆయనే అమల్లోకి తెచ్చారు. ఆయన అమలు చేసిన విధానాలను ఆ తర్వాత దేశమంతా అమలు చేశారు.

ఇలా ఎన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నా కామరాజ్‌ మాత్రం చాలా నిరాడంబరంగా జీవించేవారు. ఆయన మరణించేనాటికి ఆయనకున్న ఆస్తి 130 రూపాయలు, రెండు జతల చెప్పులు, నాలుగు చొక్కాలు, ధోతీలు, కొన్ని పుస్తకాలు. ఆయన మరణాంతరం కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించింది.

చ‌ద‌వండి: నేను బాషా.. ఒక్కసారి రాస్తే 400 భాషల్లో రాసినట్టు!

చూశారుగా! మామూలు స్థాయి నుంచి ఎదిగిన కామరాజ్, దేశానికి ఎన్ని సేవలందించారో! మీరు కూడా అలా అందరికీ ఉపయోగపడే పనులు చేసి పేరు తెచ్చుకోవాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement