Midday meal
-
మధ్యాహ్న భోజనం తిని 9మంది విద్యార్థులకు అస్వస్థత
చాట్రాయి: మధ్యాహ్న భోజనం తిని తొమ్మిదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఏలూరు జిల్లా, చాట్రాయి మండలంలోని కోటపాడు యూపీ స్కూల్లో బుధవారం మధ్యాహ్నం 39 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం దుంప కుర్మా వారికి వడ్డించారు. భోజనం తిన్న అర గంట తర్వాత ఎన్.కల్పన, టి.క్రాంతి మేఘన, ఉమా యశ్వంత్, ఎం.దుర్గామనీష్, ఎన్.అమృత, ఎన్.లాస్య, టి.సిరి స్పందన, ఎన్.ఉదయకుమార్, టి.వర్షిణి కడుపు నొప్పితో బాధపడ్డారు. విషయం తెలిసిన చాట్రాయి పీహెచ్సీ వైద్యాధికారి విజయలక్ష్మి పాఠశాలకు వెళ్లి వారికి వైద్యం అందించారు. మళ్లీ గురువారం చనుబండ పీహెచ్సీ వైద్యాధికారి దుర్గాప్రసాద్ వెళ్లి విద్యార్థులకు వైద్యం చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. గురువారం మధ్యాహ్నం భోజనం చేయగానే వీరిలో ఒకరికి కడుపు నొప్పి, మరొకరికి వాంతులు అవడంతో ఎంఈవో బ్రహ్మచారి 9 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బుధవారం మెనూలో దుంప కుర్మా కూరలో రాగి పిండి కలిపి భోజనం పెట్టారని, విద్యార్థుల్లో అరుగుదల లేకపోవడం వలన గ్యాస్ కారణంగా కడుపు నొప్పి వచ్చిందని చాట్రాయి పీహెచ్సీ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. -
టీడీపీపై తల్లిదండ్రుల ఆగ్రహం
-
TG: మాగనూరులో మళ్లీ ఫుడ్ పాయిజన్
సాక్షి, నారాయణపేట: తెలంగాణలోని పలు పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఫుడ్ పాయిజన్ జరిగిన పాఠశాలలోనే మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తాజాగా జరిగిన ఘటనలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు సమాచారం.వివరాల ప్రకారం.. నారాయణపేట మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం మధ్యాహ్న భోజనం చేసిన 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి రావడంతో విలవిల్లాడిపోయారు. దీంతో, వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కారులో ఆసుపత్రికి తరలించారు.ఇది కూడా చదవండి: మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటన..హెచ్ఎం సహా మరొకరిపై సస్పెన్షన్ఇక, ఇటీవలే మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అందులో 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కాగా, ఈ ఘటన జరిగిన మరుసటి రోజు మధ్యాహ్న భోజనంలో కూడా పురుగులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే నాలుగైదు రోజులు గడవకముందే మరోసారి నేడు విద్యార్థులు అస్వస్థతకు గురికావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా చదవండి: మళ్లీ పురుగుల అన్నమే! -
వికటించిన మధ్యాహ్న భోజనం
గంగాధర (చొప్పదండి): కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. శుక్రవారం మధ్యాహ్నం అన్నం తిన్న పలువురు విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 205 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో శుక్రవారం 180 మంది హాజరయ్యారు. మధ్యాహ్న సమయంలో పాఠశాలలో వండిన భోజనం తిన్నారు. కాసేపటికి ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు.ఇది చూసిన మరో 20 మంది విద్యార్థులు కడుపునొస్తోందని ఉపాధ్యాయులకు చెప్పారు. వెంటనే వారు ప్రభుత్వ వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వైద్యం అందించి, మాత్రలు ఇచ్చారు. విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. మధ్యాహ్న భోజనానికి వండిన బియ్యం కొత్తవి కావడంతో పాటు అన్నం మెత్తగా కావడం వల్ల విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని ఎంఈవో ప్రభాకర్‌రావు వివరించారు. -
పరువు పోతోంది పరిష్కారమేంటి?
సాక్షి, హైదరాబాద్: మధ్యాహ్న భోజనం పురుగులతో విద్యార్థులు ఏదో ఒకచోట అస్వస్థతకు లోనవుతూనే ఉన్నారు. ‘ఒకరోజు ఖమ్మం జిల్లాలో, మరోరోజు నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తినే మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వం పరువు పోతోంది. ఏం చేద్దాం..ఎలా పరిస్థితిని చక్కబెడదాం’అంటూ ఉన్నతాధికారులు హెచ్ఎంల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.‘నాణ్యత లేని భోజనం పెడితే కటకటాలు లెక్కబెట్టిస్తాం’అని సీఎం నవంబర్ 14న ప్రకటించారు. అయినా వరుస ఘటనలు చోటు చేసుకోవడంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను సీఎంవో ఆదేశించింది. ఘటన జరిగినప్పుడు హెచ్ఎంనో, డీఈవోనో సస్పెండ్ చేస్తే కొత్త సమస్యలొస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. టీచర్ల నుంచి వ్యతిరేకత కొని తెచ్చుకుంటున్నామని సీఎం భావిస్తున్నారు. ఇవేవీ లేకుండా పురుగుల అన్నంతో పరువు పోకుండా ఏం చేయాలో నివేదిక ఇవ్వడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. సమస్య ఎక్కడ? రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ స్కూళ్లున్నాయి. విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి పౌర సరఫరాల శాఖ నుంచి బియ్యం అందజేస్తారు. మిగతా సరుకులన్నీ స్వయం సహాయ బృందాల నిర్వహణలో ఉంటాయి. ఎక్కువ మంది విద్యార్థులుంటే కొంత వరకూ నిర్వహణ సాధ్యమవుతోంది. మరీ తక్కువగా విద్యార్థులుంటేనే నిర్వహణ వ్యయం ఇబ్బందే. 13,005 స్కూళ్లలో 50 లోపు విద్యార్థులే ఉన్నారు.ఈ కారణంగా వచ్చే నిధులు తక్కువ. స్వయం సహాయ బృందాలకు నెలవారీ బిల్లులు కూడా చెల్లించడం లేదు. అప్పు తెచ్చి వంట చేస్తున్నామని, వడ్డీ తామే కడుతున్నామంటున్నారు. ఈ సమస్యలు పరిష్కరించకుండా ఏం చేసినా నాణ్యత ఎలా పెరుగుతుందని వారు ప్రశి్నస్తున్నారు. అదీగాక సివిల్ సప్లై నుంచి వచ్చే బియ్యంలో పురుగులు ఉంటున్నాయని, వాటిని రీ సైక్లింగ్ చేస్తే తప్ప పురుగులు అరికట్టడం సాధ్యం కాదంటున్నారు. దీనికి బడ్జెట్ ఉండదని హెచ్ఎంలు అంటున్నారు. ఇక్కడో రీతి... అక్కడో తీరు కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన మెనూ అమలు చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన ఆహారం ఇస్తారు. గుడ్లు కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. అన్నం, వెజిటబుల్స్, రసం, కోడిగుడ్డు, ఆకుకూరపప్పు, నెయ్యి, పెరుగు ఇస్తున్నారు. కాబట్టి నిర్వహణ వ్యయం సరిపోతుందనేది హెచ్ఎంల వాదన. ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం బియ్యం, కూరగాయలు, పప్పు మాత్రమే ఇస్తున్నారు. పప్పు, కోడిగుడ్డు రోజూ ఉండదు. కూరల రేట్లు రోజుకో విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ నిర్వహణ సమస్యగా ఉన్నాయని ప్రధానోపాధ్యాయులు విద్యాశాఖకు తెలిపారు.విధాన పరమైన లోపాలున్నాయి మధ్యాహ్న భోజన నాణ్యత పెంచాలంటే ముందుగా విధానపరమైన మార్పులు అవసరం. సంబంధిత ఏజెన్సీలకు ముందుగా బిల్లులు చెల్లించాలి. నాణ్యత పెంచేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలి. నిధులు పెంచాలి. తప్పు జరిగినప్పుడు హెచ్ఎంలనే బాధ్యులను చేయడం అన్యాయం. – పి.రాజాభాను చంద్రప్రకాశ్, తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు టీచర్లనే ప్రశ్నించడం సరికాదు మధ్యాహ్న భోజన పథకం అమలులో హెచ్ఎంల పాత్ర నామమాత్రమని 2014లో ముంబై హైకోర్టు తీర్పు చెప్పింది. బోధన సంబంధమైన విధులే హెచ్ఎంలకు తలకు మించి ఉన్నాయి. తప్పు జరిగితే బాధ్యులను చేయాలనే విధానం మంచిది కాదు. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు -
మధ్యాహ్న భోజనం వికటించి 89 మందికి అస్వస్థత
నవీపేట(బోధన్)/గాంధారి (ఎల్లారెడ్డి)/నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): మధ్యాహ్న భోజనం వికటించి పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పాఠశాలల్లో శుక్రవారం మొత్తం 89 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న 188 మంది విద్యార్థులు మధ్యాహ్నం ఎప్పటిలాగే భోజనం చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పితో వరుసగా 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను ఆస్పత్రికి తరలించగా ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లతో చికిత్స చేశారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడిన ఏడుగురు విద్యార్థులకు సెలైన్ ఎక్కించారు. అలాగే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 305 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయగా 25 నుంచి 30 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. ఇందులో ఇద్దరికి సెలైన్ ఎక్కించారు. నాగిరెడ్డిపేట మండలంలోని చీనూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వీరికి వైద్య చికిత్సలు అందించారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది. -
మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత
మాగనూర్: పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనం తిని 83 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీహెచ్ఎస్లో సోమవారం జరిగింది. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం భోజనం చేయగా దాదాపు 83 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హెచ్ఎం నర్సింహులు, ఉపాధ్యాయులు విద్యార్థులను పీ హెచ్‌సీకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. మధ్యాహ్న భోజనం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్య సిబ్బంది స్పష్టం చేశారు. చికిత్స అనంతరం కోలుకున్న విద్యార్థులను ఇళ్లకు పంపించారు. మరో ఏడుగురు విద్యార్థులకు వాంతులు తగ్గకపోవడంతో తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. -
ఉద్యోగాలు 4... దరఖాస్తులు 675!
అనంతపురం: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ పర్యవేక్షణకు సంబంధించి నాలుగు కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొత్తం 675 దరఖాస్తులు అందినట్లు డీఈఓ కె.శామ్యూల్ తెలిపారు. మరుగుదొడ్ల నిర్వహణ నిధి ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మధ్యాహ్న భోజన పథకం డేటా అనలిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మరుగుదొడ్ల నిర్వహణ నిధి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పోస్టుకు మొత్తం 166 దరఖాస్తులు, డేటా ఆపరేటర్ ఉద్యోగానికి 199 దరఖాస్తులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సంబంధించి డేటా అనలిస్ట్‌కు 122 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు 188 మంది దరఖాస్తు చేశారు. (చదవండి: ఆస్తి కోసం అంధురాలిపై హత్యాయత్నం) -
YSR-YVR Canteen: రూ.6కే మధ్యాహ్న భోజనం
గుంతకల్లుటౌన్(అనంతపురం జిల్లా): ఒక్కపూట తిండి కోసం అలమటించే ఎందరో నిరుపేదలు, నిరాశ్రయుల ఆకలి తీర్చాలన్నదే తన అభిమతమని, ఇందులో భాగంగా రూ.6కే రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి పక్కన ఎమ్మెల్యే వైవీఆర్ ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్–వైవీఆర్ క్యాంటీన్’ను బుధవారం ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రారంభించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. చదవండి: గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ? ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్ మాట్లాడుతూ.. దేవుడి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఉడతాభక్తిగా ఈ చిరు అన్నదాన సేవా కార్యక్రమాన్ని తానుంత వరకూ నిస్వార్థంగా, నిరాటంకంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. రోజూ మధ్యాహ్నం 500 మందికి రుచికరమైన వేడి భోజనాన్ని రూ.6కే అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్‌ను ఆయన సోదరుడు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పుర ప్రముఖులు అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భవానీ, వైస్ చైర్పర్సన్లు నైరుతిరెడ్డి, మైమూన్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకియాబేగం, వీరశైవలింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ గుంతకల్లు, పామిడి ఎంపీపీలు మాధవి, మురళీరెడ్డి, వైస్ ఎంపీపీ ప్రభావతి, జెడ్పీటీసీ సభ్యుడు కదిరప్ప, ఏడీసీసీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎన్.రామలింగప్ప, రామాంజనేయులు, పార్టీ పట్టణ కన్వీనర్లు సుంకప్ప, హుసేన్‌పీరా, సీనియర్ నేతలు శ్రీనివాసరెడ్డి, మంజునాథరెడ్డి, సందీప్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బడి పిల్లల మధ్యాహ్న భోజనంలో మార్పులకు కేంద్రం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని (ప్రధానమంత్రి పోషక్ పథకం) సమూలంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు పోషక విలువలున్న ఆహారాన్ని అందించేందుకు కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని సూచించింది. విద్యార్థులందరికీ మధ్యాహ్నం పోషకాలు ఎక్కువగా ఉండే రాగిజావను ఇవ్వాలని, దీంతోపాటే మొలకలు, బెల్లం అందించాలని పేర్కొంది. దీని అమలుకు గల సాధ్యాసాధ్యాలపై రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు కోరింది. అయితే, దీనిపై సమగ్ర అధ్యయనం చేయాల్సిఉందని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అంటున్నారు. దీనికి అదనపు నిధులు ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనా స్పష్టత లేదని విద్యాశాఖలో అదనపు డైరెక్టర్ స్థాయి అధికారి ఒకరు చెప్పారు. గతంలో కూడా మధ్యాహ్నం భోజనంతోపాటు పల్లీ పట్టీ ఇవ్వాలని కేంద్రం సూచించిందని, పెరిగిన ధరల ప్రకారం దీన్ని అమలు చేయడం సాధ్యం కాలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాగిజావను విధిగా ఇవ్వాల్సిందేనని కేంద్రంనుంచి ఒత్తిడి వస్తున్నట్టు చెప్పాయి. ఇప్పుడిచ్చే ఆహారంలో స్వల్ప మార్పులు చేసి రాగిజావ, బెల్లం, మొలకలు అందించే విషయం పరిశీలిస్తున్నామని, దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. జాతీయ సర్వే ప్రకారమే.. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై కేంద్రస్థాయిలో కొన్నేళ్లుగా తరచూ సర్వేలు చేస్తున్నారు. స్కూలు సమయానికి విద్యార్థుల కుటుంబాల్లో సరైన పోషక విలువలున్న ఆహారం అందించడం లేదని సర్వేలో తేలింది. తల్లిదండ్రులు ఉపాధి కోసం హడావిడిగా ఉదయం వెళ్లాల్సి రావడం, విద్యార్థులు కూడా ఇంట్లో ఉన్నదేదో తిని వస్తున్నారని, దీంతో చాలామందిలో పోషకాహార లోపం కన్పిస్తోందని వెల్లడైంది. ఐదేళ్లుగా కనీసం 40 శాతం మంది విద్యార్థులు రక్తహీనత, ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. 32 శాతం మందిలో పోషక విలువలు లోపించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని వెల్లడైంది. వీళ్లంతా ఎక్కువ రోజులు స్కూలుకు హాజరవ్వడం లేదని, ఫలితంగా విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో బడిలోనే పోషకాలతో కూడిన ఆహారం అందించాలని ప్రతిపాదించింది. ఇందులో ప్రధానంగా రాగిజావ ఇవ్వాలని భావిస్తున్నారు. దీన్ని రోజూ ఇవ్వడమా? వారంలో కొన్ని రోజులు ఇవ్వడమా? అనే దానిపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు అంటున్నారు. నిధుల సర్దుబాటు ఎలా? మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం నిధులు మంజూరు చేస్తున్నాయి. ఈ పథకానికి ఏటా రూ.550 కోట్లు ఖర్చవుతుంది. ప్రస్తుతం విద్యార్థులకు రోజుకో విధంగా ఆహారం ఇస్తున్నారు. వారానికి మూడు రోజులు గుడ్డు, మిగతా రోజుల్లో ఆకు కూరలు, కాయగూరలు, సాంబార్, కిచిడీ ఇలా పలు రకాలుగా అందిస్తున్నారు. అయితే, కేంద్రం మెనూ ప్రకారం ధరలను నిర్ణయిస్తారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవి ఉండటం లేదని రాష్ట్ర అధికారులు అంటున్నారు. ఒక్కో గుడ్డు ధర దాదాపు రూ.6 ఉంటే.. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం రూ.2 మాత్రమే ఉంటోంది. దీంతో నిధుల సర్దుబాటు సమస్య వస్తోంది. ఇప్పుడు కూడా రాగిజావ, మొలకల కోసం ప్రత్యేక నిధులు అవసరమవుతాయని, లేని పక్షంలో పథకం అమలులో అనేక ఇబ్బందులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. (చదవండి: అంచు చీరలే ఆ‘దారం’) -
స్వాతంత్ర్యం రాకపూర్వం నుంచి నేటికీ నిరంతర అన్నదానం..
సాక్షి, వేటపాలెం(ప్రకాశం): గొల్లపూడి రాధాకృష్ణయ్య దాతృత్వం.. ముందుచూపు. 88 ఏళ్లగా పేదవిద్యార్ధుల ఆకలి తీరుస్తుంది. స్వాతంత్య్రంరాక పూర్వమే ప్రారంభించిన హాస్టల్ నేటికీ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కష్టపడి చదువు కొనే విద్యార్ధులకు కులమతాలకు అతీతంగా పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పానికి భవిష్యత్‌లోను డోకాలేని విదంగా శాశ్వత నిధి ఏర్పాటు చేసిన రాధాకృష్ణయ్యకు విద్యార్ధులు నిత్యం జ్యోహార్లు అర్పిస్తుంటారు. వేటపాలెంలో 1921 సంవత్సరంలో ఏర్పాటు చేసిన రావుసాహెబ్ బండ్ల బాపయ్య శెట్టి పాఠశాలకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్ధులు వస్తుండేవారు. రవాణా సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం లేక భోజనం కోసం ఇబ్బందులు పడుతుండేవారు. దీన్ని గొల్లపూడి రాధాకృష్ణయ్య గమనించారు. పేద విద్యార్ధులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దుస్తులు వ్యాపారం నిర్వహించే ఈయన మద్రాసులోని షావుకారు పేటలో ఉన్న హిందూ థీయోసాఫికల్ స్కూల్ ప్రధానోపాద్యాయుడు రంగస్వామి అయ్యర్ ప్రేరణతో 1933 సంవత్సరంలో మొదటి సారిగా వేటపాలెంలో బిబిహెచ్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు బోజనం సౌకర్యం కల్పించారు. మొదటి హాస్టల్ నిర్వహణకు తన వ్యాపారం నుంచి నిధులు సమకూర్చేవారు. కానీ తన అనంతరం కూడా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఆలోచన ట్రష్టును ఏర్పాటు చేసేలా చేసింది. శాశ్వత భవనం, పర్నిచర్‌తో పాటు మూలనిధిని కూడా ఏర్పాటు చేయడంతో పాటు 88 సంవత్సరాలుగా విద్యార్ధులు కడుపు నిండా బోజనం తింటున్నారు. రాధాకృష్ణయ్య అనంతరం ఆయన దత్తపుత్రుడు గొల్లపూడి సీతారం 1977లో హాస్టల్ నిర్వహణ బాద్యతలను చేపట్టి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. భోజనం ఎవరికి పెడతారంటే... ప్రతి ఏడాది బండ్ల బాపయ్య శెట్టి కళాశాల్లో అడ్మిషన్లు జరుగుతాయి. కళాశాల్లో చేరిన విద్యార్థులకు హాస్టల్ నిర్వాహకులు ఒక పద్యం నేర్పిస్తారు. ఈ పద్యం తప్పుపోకుండా చెప్పిన పేద విద్యార్థులను గుర్తించి వారికి బోజనం కోసం టోకేన్లు అందిస్తారు. ఈ టోకెన్ పొందిన విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం పాఠశాలకు వచ్చే ముందు వారు పొందిన టోకెన్లను హాష్టల్ వద్ద ఏర్పాటు చేసిన బాక్సులో వేసిరావాల్సి ఉంటుంది. టోకెన్లు ఆదారంగా హాస్టల్లో బోజనం తయారుచేస్తారు. ప్రతి రోజు 6 నుంచి ఇంటర్మీడియట్ చదువుకోనే 100 నుంచి 150 మంది విద్యార్థులు హాష్టల్లో భోజనం చేస్తుంటారు. బోజనానికి ముందుగా ప్రార్ధన చేయాల్సి ఉంటుంది. -
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ముంబై: రాష్ట్రంలోని పేదలు ఆకలితో పస్తులుండకుండా చూడటమే లక్ష్యంగా పేదలకు పది రూపాయలకే భోజనం అందించే అపూర్వమైన పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 'శివ్ భోజన్' పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆరంభించింది. ఈ పథకాన్ని మహారాష్ట్ర మంత్రి అస్లామ్ షేక్ రద్దీ ఎక్కువగా ఉండే నాయిర్ ఆసుపత్రి వద్ద ప్రారంభించారు. బండ్ర కలెక్టర్ కార్యాలయం సమీపంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ప్రయోగాత్మకంగా వీటిని ప్రారంభించారు. (ఠాక్రే కుటుంబం నుంచి మరో వారసుడు..) ఈ పథకాన్ని ప్రవేశపెడతామని శివసేన పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల తరువాత కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి 'మహా అఘాడీ' ప్రభుత్వం ఏర్పాటు కాగా, మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటీ అమలు చేసే దిశగా థాక్రే కదులుతున్నారు. శివ్ భోజన్ ప్లేటులో రెండు చపాతిలు, ఒక ఆకుకూర, అన్నం, పప్పు ఉంటుందని చెప్పారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పేదలకు అందుబాటులో ఉంటుందని వారు వివరించారు. ప్రతి క్యాంటీన్లో సుమారు 500 ప్లేట్ల శివ్ భోజన్ పథకాన్ని పేదలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నామని అధికారులు తెలిపారు. తొలి రోజునే అనూహ్యమైన స్పందన లభించిందని, పేదలు బారులు తీరి ఖరీదు చేశారన్నారు. ఇంత తక్కువ ధరకు అందిస్తున్నందున ఈ పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ('88 ఏళ్ల తర్వాత గుర్రాలపై పోలీసుల గస్తీ') -
సీఎం జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్న డీఎస్పీ
స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు. వారిని ప్రేమగా పలుకరించాలి. సమస్యలను తెలుసుకోవాలి. పరిష్కారానికి చొరవ చూపాలి. అవసరమైతే వారికి తాగునీరు, మజ్జిగ, అన్నం పెట్టి ఆకలి తీర్చాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు, పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు ఇవి.. సీఎం ఆదేశాలనూ పాటిస్తూ అర్జీదారుల పాలిట పెద్దన్నగా, అన్నం పెట్టే ఆపన్న హస్తం అయ్యారు ఆయన. తమ సమస్యలు విన్నవించేందుకు వచ్చిన అర్జీదారుల ఆకలి తీర్చేందుకు ప్రతి రోజూ ఉచితంగా భోజనం ఏర్పాటు చేసి, ఆదర్శంగా నిలుస్తున్నారు డీఎస్పీ సూర్యనారాయణ. సీఎం జిల్లాలోని కడప పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఫిర్యాదుదారులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. సాక్షి, కడప : అక్కడ భోజనాలు వడ్డిస్తున్నదీ.... భోజనం చేస్తున్నదీ.... ఏదో కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా పెడుతున్నారనీ భావిస్తే.... పప్పులో కాలేసినట్లే..ఓ పోలీస్ అధికారి చొరవ తీసుకుని మానవత్వంతో స్పందిస్తున్న తీరుకు నిదర్శనమది. అర్జీలు ఇవ్వడానికి వచ్చి ఆలస్యమైతే ఆకలితో పస్తులుండకుండా వారికి భోజనం పెడుతున్న చిత్రమిది. రాష్ట్ర ప్రభుత్వం స్పందన పేరుతో ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వచ్చిన వారిని మర్యాదగా చూడాలని..కనీసం మజ్జిగయినా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో అధికారులకు సూచించారు. ఈ మాటలను కడప డీఎస్పీ యు. సూర్యనారాయణ ప్రేరణగా తీసుకున్నారు. మజ్జిగో మంచినీళ్లో కాకుండా ఒకడుగు ముందుకేసి ఉచితంగా భోజన వసతి కల్పిస్తున్నారు. కడప పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో గడచిన వందరోజులుగా అమలు చేస్తున్నారు. పైసా ఎవరినుంచి తీసుకోకుండా ఇందుకయ్యే మొత్తాన్ని ఆయనే భరిస్తున్నారు. సబ్ డివిజన్ పరిధిలో కడప నగరంతో పాటు, చెన్నూరు, కమలాపురం, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల, చింతకొమ్మదిన్నె, వల్లూరు, పెండ్లిమర్రి మండలాలున్నాయి. ఈ ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం వినతులు చేతపట్టుకుని ప్రజలు వస్తుంటారు. వీటిని పరిష్కరించడానికి అధికారులకు కొంత సమయం పడుతుంది. తామిచి్చన దరఖాస్తుల పరిస్థితి ఏమిటంటూ వారు కార్యాలయానికి మళ్లీ వస్తుంటారు. ఇది వారం పొడవునా జరిగే ప్రక్రియ. ఇలా వచ్చేవారు చాలాసేపు నిరీక్షించాలి్సన సందర్భాలుంటాయి. మధ్యలో దూరం వెళ్లి భోజనం చేయడానికి ఇబ్బందులు పడటాన్ని డీఎస్సీ సూర్యనారాయణ గమనించారు. వారికి అలాంటి ఇబ్బంది కలుగకుండా ఆయన చొరవ తీసుకుని ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నారు. మూడు నెలలుగా రోజూ 50 మందికి తక్కువ కాకుండా భోజనం చేస్తున్నారని డిఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.. సిద్ధంగా ఉన్న అహారం ప్రతి ఫిర్యాది ఆనందంగా వెళ్లడమే ధ్యేయం సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. చిన్నతనంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలన్నా, ఎమ్మార్వో ఆఫీస్‌కు పోవాలన్నా ఎంతో యాతనయ్యేది. పనులుకాకపోతే ఉసూరుమంటూ ఇంటికి వచ్చేవాళ్లం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లు ‘స్పందన’కు సంబంధించి చెప్పిన మాటలు నాకు ఉత్సాహాన్ని ఇచ్చాయి. అందుకే ఫిర్యాదుదారులను ఆకలితో పంపకుండా భోజనం చేసి వెళ్లమంటున్నాను. దీన్ని పెద్ద సహాయంగా నేను భావించడం లేదు. –సూర్యనారాయణ, డీఎస్పీ, కడప, వైఎస్ఆర్ జిల్లా ఇలా ఎవరూ భోజనం పెట్టలేదు... మా ఊరిలో స్థలం విషయమై బంధువులతో కలిసి ఉదయం ఉదయం 9 గంటలకు వచ్చాను. ఇక్కడ మధ్యాహ్నం కాకమునుపే భోజనం పెట్టారు. ఎంతసేపయినా ఎదురుచూసి సమస్యను పరిష్కరించుకుని వెళతామనీ ధీమాగా వుంది. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ గతంలో భోజనం పెట్టిన దాఖలాలు లేవు. ఎన్.మునీంద్రబాబు, ఎర్రగుడిపాడు, కమలాపురం -
కమిషనర్‌కు పురుగుల అన్నం
కర్ణాటక, మైసూరు: పర్యాటక రాజధానిగా ప్రసిద్ధి చెందిన రాచనగరిలో కొందరి నిర్వాకం వల్ల చెడ్డపేరు వస్తోంది. భోజనం చేయడానికి హోటల్‌కు వెళ్ళిన మహా నగర పాలికే (కార్పొరేషన్) కమిషనర్‌కు హోటల్ సిబ్బంది పురుగుల అన్నం వడ్డించడంతో కంగుతిన్నారు. వెంటనే ఆరోగ్య శాఖ అధికారులకు తెలపడంతో వారు వచ్చి పరిశీలన జరిపి హోటల్ యజమానికి రూ.30 వేల జరిమానా విధించిన సంఘటన మైసూరు నగరంలో చోటు చెసుకుంది. కమిషనర్‌గీతా గురువారం మధ్యాహ్నం భోజనం చేయడానికి రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఆనందభవన హోటల్‌కు వెళ్లారు. ఆమె ఆర్డర్ ప్రకారం సిబ్బంది భోజనం తీసుకొచ్చారు. తినబోతుంటే.. ఆమె తినబోతూ చూస్తే భోజనంలో పురుగులు కనిపించాయి. వెంటనే ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన వచ్చి భోజనాన్ని పరిశీలించి పురుగులు ఉన్నట్లు తేల్చారు. హోటల్లో ఉన్న అపరిశుభ్రత, కుళ్ళిపోయిన, పురుగులు పట్టిన కూరగాయలను ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. -
50 మంది విద్యార్థినులు అస్వస్థత
సాక్షి, శంకరపట్న(కరీంనగర్) : జిల్లాలోని శంకరపట్నం మండలం కేశవపట్నం మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థినులు కలుషిత భోజనం తిని 50 మంది మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి ఆలుగడ్డ కూర విద్యార్థినులకు వడ్డించారు. గంట తర్వాత కొందరు కడుపునొప్పితో విలవిలలాడారు. హాస్టల్ ఏఎన్ఎం టాబ్లెట్లు ఇవ్వగా.. రాత్రంతా ఉండిపోయారు. మంగళవారం ఉదయం అల్పాహారంలో విద్యార్థినులకు ఉప్మా వడ్డించారు. అల్పాహారం తిన్న విద్యార్థినుల్లో కొందరు వాంతులు చేసుకున్నారు. స్థానిక పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది చికిత్స అందించారు. 32 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి పీహెచ్సీ వైద్యుడు షఖిల్ అహ్మద్ 108, పోలీసుల వాహనాల్లో తరలించారు. జిల్లా వైద్యాశాఖ అధికారి రాంమనోహర్‌రావు, ఆర్డీవో చెన్నయ్య, డీఐవో జువేరియా కేశవపట్నం పీహెచ్సీలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. హాస్టల్‌ను సందర్శించి ఉప్మా నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. అపరిశుభ్రంగా వాటర్ ట్యాంక్ హాస్టల్లో విద్యార్థినులకు తాగునీరు అందిస్తున్న వాటర్‌ట్యాంక్ అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెలుగుచూసింది. ట్యాంకు నీటిని భోజనంలో వాడిన కారణంగానే సోమవారం రాత్రి భోజనం తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. నాచు పట్టిన నీటితో వంట చేయడంతో ఆహారం విషతుల్యమై విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మోడల్‌స్కూల్ హాస్టల్లో 83 మంది విద్యార్థినులు ఉన్నారు. వంటకోసం హాస్టల్ భవనంపై వాటర్‌ట్యాంక్ నుంచి నీటిని వాడుతున్నారు. వాటర్‌ట్యాంక్‌లో నాచుపట్టగా ఇప్పటివరకు శుభ్రం చేయలేదు. రాత్రి వండిన ఆలుగడ్డ కర్రీ, ఉదయం అల్పాహారంలో చేసిన ఉప్మా, ప్యూరీపైడ్ వాటర్, వాటర్ ట్యాంక్ నీటి షాంపిల్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని బీజేపీ మండల అధ్యక్షుడు సమ్మిరెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు తాళ్ల సురేశ్, సీపీఎం మండల కార్యదర్శి రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్ ఆరోపించారు. వీరిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిలకడగా ఆరోగ్యం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 32 మంది విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి రీజినల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. పిల్లల వార్డులో చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తూ వారికి పెరుగు అన్నం తినిపించినట్లు డాక్టర్ తెలిపారు. ఆరోగ్యంగా ఉన్నారు విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే చేరుకొని విద్యార్థినులను వెంటనే కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించాం. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నాం. –డీఈవో వెంకటేశ్వర్లు, -
ఈ భోజనం మాకొద్దు
సాక్షి, ఆలూరు (ప్రకాశం):‘ఈ పాడు భోజనం మాకొద్దు, మురిగిపోయిన గుడ్లు అలసలే వద్దు, తిరిగి తీసుకెళ్లండి’ అని ఆలూరు పాఠశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. భోజనం సక్రమంగా లేదని, కూరలు రుచిగా లేవని, వండిన గుడ్లు దుర్వాస వస్తున్నాయంటూ విద్యార్థులు ఆహారాన్ని కింద పడేయడం పరిపాటిగా మారింది. మంగళవారం ఎంపీడీఓ పి.సుజాత బూత్‌ల పరిశీలన కోసం వచ్చిన సందర్భంగా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో మధ్యాహ్నం భోజనం వచ్చింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ భోజనం బాగులేదని, చెడిపోయిన గుడ్లు పంపిస్తున్నారని, కూర రుచికరంగా లేదని కాంట్రాక్టరుకు ఇచ్చినప్పటి నుంచి ఇదే విధంగా కొనసాగుతోందని ఎంపీడీఓ దృష్టికి తీసికెళ్లారు. నాశిరకం భోజనం వండిపెడుతున్నారని, తాజా భోజనం వండిపెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై నివేదిక తయారుచేసి జిల్లా అధికారుల దృష్టికి తీసికెళ్లతానని చెప్పారు. అనంతరం ఆలూరులో పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. పోలింగ్ బూత్‌లో విద్యుత్ ఉందా, ర్యాంపులు, తాగునీరు, మరుగుదొడ్లు ఉన్నాయా? లేదా? అని పరిశీలించారు. లేని వాటికి వెంటనే వేయించాలని ఆయా హెచ్ఎంలను ఆదేశింశారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం ఎల్వీఎన్ రమేష్, తోట రంగారావు, దొడ్ల రాజుగోపాల్‌రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. -
‘అక్షయ పాత్ర’లో అల్లం వెల్లుల్లి గొడవ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్) ఆధ్వర్యంలోని అనుబంధ సంస్థ ‘అక్షయ పాత్ర’ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనంపై మరోసారి వివాదం రాజుకుంది. గతంలో ఒడిశా రాష్ట్రంలో తలెత్తిన వివాదానికి ప్రధాన మీడియా ప్రాధాన్యత ఇవ్వగా, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో రాజుకున్న వివాదానికి ట్విట్టర్ వేదికగా మారింది. మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తోన్న కూరలు మసాలా దినుసుల వాసనలు లేకుండా చప్పగా ఉంటున్నాయని, విద్యార్థులు వాటిని తినలేక బోరుమంటున్నారంటూ ముందుగా స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దానిపై ట్విటర్లో వాదోపవాదాలు రాజుకున్నాయి. అక్షయపాత్ర వంటకాలు అలా ఉండడానికి కారణం వారు వంటల్లో అల్లం–వెల్లుల్లి, ఉల్లిపాయలు ఉపయోగించకపోవడం. వాటిని ఉపయోగించడానికి వారు విరుద్ధం. ఎందుకంటే అది వారి తాత్విక చింతనకు వ్యతిరేకం. వాటిని తినడం వల్ల మనుషుల్లో కామ, క్రోదాలు ప్రకోపిస్తాయనడానికన్నా ఆధ్యాత్మిక చింతన తగ్గుతుందన్నది ఆ సంస్థ వాదన. మరి వారు పూజిస్తోన్న శ్రీకృష్ణుడు ఇవేమీ తినకుండానే వెయ్యి మంది గోపికలతో శృంగార లీలలు ఎలా నెరపారబ్బ!... ట్విటర్లో ఓ గడుగ్గాయి కొంటె ప్రశ్న. దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును తప్పకుండా సరఫరా చేయాలంటూ భారత జాతీయ పోషకాల ప్రమాణాల సంస్థ ఆదేశాలను కూడా ఇస్కాన్ సంస్థ అమలు చేయడం లేదు. తాము శాకాహారానికి నిబద్ధులమని, కోడిగుడ్డు మాంసాహారం కనుక తాము సరఫరా చేయమన్నది వారి వాదన. అవసరమైతే తాము ఈ పథకం నుంచి తప్పుకుంటాంగానీ సరఫరా చేయమని వారు మొండికేశారు. ఒడిశాలో సామరస్య పరిష్కారం ఒడిశాలో కూడా అక్షయ పాత్ర ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థే అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా చెప్పిన గుడ్డును సరఫరా చేయడానికి సంస్థ నిరాకరించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం వారానికి మూడు సార్లు గుడ్లను ఉడకబెట్టి విద్యార్థులకు వడ్డించే బాధ్యతను పాఠశాలల హెడ్మాస్టర్లకు అప్పగించింది, ఆ మేరకయ్యే ఖర్చును ఇస్కాన్ సంస్థ నుంచే రాబట్టుకోవాలని సూచించింది. అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ విషయంలో మాత్రం ఆ ప్రభుత్వం కూడా ఏం చేయలేక వదిలేసింది. కర్ణాటకలోను ఉత్తర్వులు జాతీయ పోషక ప్రమాణాల సంస్థ సిఫార్సు మేరకు కూరల్లో అల్లం వెల్లులి, ఉల్లిపాయలను తప్పనిసరిగా వినియోగించాలంటూ 2018, నవంబర్ నెలలో కర్ణాటక రాష్ట్ర విద్యా శాఖ అధికారికంగా ఇస్కాన్ సంస్థకు ఉత్తర్వులు జారీ చేసింది. దానికి బదులు తాము ఈ పథకం నుంచి తప్పుకుంటామని బెదిరించడమే కాకుండా తమ వంటకాల్లో విద్యార్థులకు అవసరమైన పోషకాలు ఉంటున్నాయని వాదించింది. ఈ విషయంలో ‘ఆహారం ప్రాథమిక హక్కు’ కార్యకర్తలు జాతీయ పోషక ప్రమాణాల సంస్థకు కేసును నివేదించగా వారు కూడా పోషకాలు ఉన్నాయంటూ సమర్థించారు. విద్యార్థులకు సరఫరా చేస్తోన్న ఆహారం ఎంత?, అందులో వారు వృధా చేస్తున్నది ఎంత? ఎలా మీరు శాంపిల్‌ను తనిఖీ చేశారంటూ ఎన్జీవోలు సంధించిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం రాలేదు. అక్షయ పాత్ర భోజనం ఉచితం కాదు ఇస్కాన్ సంస్థ వెబ్సైట్లో ఉన్న వివరాలు ప్రకారం ఈ సంస్థ దేశంలోని 12 రాష్ట్రాల్లోని 15,024 ప్రభుత్వం, ప్రభుత్వ ఆర్థిక సహాయ పాఠశాలల్లో 17 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తోంది. ‘ఉచితంగా భోజనం సరఫరా చేస్తుంటే ఇది కావాలి, అది కావాలంటూ డిమాండ్ పెడతారా?’ అంటూ కొందరు అమాయకంగా ట్వీట్లు పెట్టారు. ఎంతమాత్రం ఈ సంస్థ ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. ప్రభుత్వం ప్రతి విద్యార్థి భోజనానికి ఐదున్నర రూపాయల చొప్పున చెల్లించడంతోపాటు భారత ఆహార సంస్థ నుంచి ఆహార ధాన్యాలను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఈ పథకం కింద ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపి దేశవ్యాప్తంగా 11.6 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లోని 9.40 కోట్ల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి. అయినా చాలడం లేదంటున్న ఇస్కాన్ అక్షయ పాత్ర కింద తాము ఖర్చు పెడుతున్న మొత్తంలో 60 శాతం మాత్రమే ప్రభుత్వం నుంచి వస్తోందని, 12 రాష్ట్రాల్లో 43 వంటశాలలను సొంత ఖర్చుతో నిర్మించామని, 5,500 మంది ఉద్యోగులకు తామే జీతాలు చెల్లిస్తున్నామని అక్షయ పాత్ర పర్యవేక్షకుల్లో ఒకరైన మోహన్‌దాస్ పాయ్ వివరించారు. ఇతర ఎన్జీవో సంస్థలకన్నా ఉన్నంతలో శుభ్రంగా విద్యార్థులకు భోజనాన్ని అందిస్తోందన్న కారణంగా అక్షయ పాత్ర సేవలను వదులు కోవడానికి పలు రాష్ట్రాలు సిద్ధంగా లేవు. అసలు ఈ పథకం ఎలా పుట్టింది? 1920లో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నప్పుడే మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ నిమ్న వర్గాల విద్యార్థుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశ స్వాతంత్య్రానంతరం తమిళనాడు ముఖ్యమంత్రులుగా ఉన్న కే. కామరాజ్, ఎంజీ రామచంద్రన్ అన్ని వర్గాల విద్యార్థులకు దీన్ని విస్తరించి పథకాన్ని మెరగుపర్చారు. 1995లో ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం చొరవ తీసుకుంది. పిల్లలను బడికి ఆకర్షించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని భావించింది. 2001లో సుప్రీం కోర్టు ‘ఆహారం ప్రాథమిక హక్కు’కు సంబంధించిన ఓ కేసులో అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో ఈ పథకాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
రేపటి నుంచి వేసవి సెలవులు
అనంతపురం/కదిరి: పాఠశాలలకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. 2018–19 విద్యా సంవత్సరానికి మంగళవారం చివరి పనిదినం. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ఈనెల 24 నుంచి వేసవి సెలవులు విధిగా పాటించాలని డీఈఓ జనార్దనాచార్యులు ఆదేశించారు. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయన్నారు. 24 నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ పాఠశాలలు నడపరాదని పేర్కొన్నారు. పదో తరగతి ప్రత్యేక తరగతులు, శిక్షణలు కూడా నిర్వహించరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తే సంబంధిత పాఠశాలల యాజమాన్యాలపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఇకపోతే జిల్లాలోని మొత్తం 63 మండాలాల్లో కేవలం 32 మండలాలను మాత్రమే ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. దీంతో ఆయా మండలాల్లోని పాఠశాలల్లో చదివే పిల్లలకు మాత్రమే మధ్యాహ్న భోజనం వడ్డించాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. మధ్యాహ్న భోజనం అమలయ్యే మండలాలివే.. అనంతపురం, బెలుగుప్ప, బొమ్మనహాళ్, డీ.హీరేహాళ్, గుత్తి, గుంతకల్లు, కణేకల్లు, కూడేరు, పెద్దవడుగూరు, పెనుకొండ, పుట్లూరు, రామగిరి, రొద్దం, తాడిపత్రి, ఉరవకొండ, యాడికి, అమరాపురం, బ్రహ్మసముద్రం, చిలమత్తూరు, గాండ్లపెంట, గోరంట్ల, గుడిబండ, గుమ్మఘట్ట, కదిరి, కళ్యాణదుర్గం, కంబదూరు, కూడేరు, ఎన్పీ కుంట, పుట్టపర్తి, సోమందేపల్లి, శెట్టూరు, తనకల్లు మండలాలను మాత్రమే ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తిస్తూ జీఓ ఎంఎస్ నెం.2ను ఈ ఏడాది ఫిబ్రవరి 13న విడుదల చేసింది. ఈ కరువు మండలాల పరిధిలోని పాఠశాలల్లో మాత్రమే వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన వసతి కల్పించాలని ప్రభుత్వం తాజాగా సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో(ఆర్సీ నెం.2/27021) స్పష్టం చేసింది. సెలవుల్లో బడికెళ్లిన టీచర్‌కు ఏం లాభం? వేసవి సెలవుల్లో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లి పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించి దగ్గరుండి అందించినందుకు అదనంగా రూ.2 వేలు గౌరవవేతనం రూపంలో అందజేస్తారు. హెచ్ఎం బదులుగా అదే పాఠశాలలో పనిచేసే మిగిలిన ఒకరిద్దరు టీచర్లు సైతం రొటేషన్ పద్ధతిలో మధ్యాహ్న భోజన పర్యవేక్షించి, పిల్లలకు భోజన ఏర్పాట్లు చూసినందుకు వారికి కూడా ఈ గౌరవవేతనం వర్తిస్తుంది. అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాత్రం రోజూ మధ్యాహ్న భోజనానికి హాజరైన విద్యార్థుల వివరాలు యాప్ ద్వారా ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. వాస్తవంగా ఉపాధ్యాయులు వేసవి సెలవులను వదులుకొని పాఠశాలకు హాజరై మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించినందుకు మెమో నెం.225780 ప్రకారం వేతనంతో కూడిన ఆర్జిత సెలవు(ఈఎల్) కూడా మంజూరు చేయాల్సి ఉంటుంది. కాకపోతే మధ్యాహ్న భోజనానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో(ఆర్సీ నెం.2/27021) ఆ విషయమై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. -
అధ్వాన భోజనం
ఫుడ్ కమిషన్ చైర్మన్ : మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఎందుకు వడ్డించలేదు? ప్రధానోపాధ్యాయుడు: నిజం చెప్పమంటారా.. అబద్దం చెప్పమంటారా సార్? ఫుడ్ కమిషన్ చైర్మన్ : నిజమే చెప్పు.. గుడ్లు ఎలా ఉంటున్నాయి? ప్రధానోపాధ్యాయుడు: ప్రభుత్వం సరఫరా చేసే గుడ్లు మానవమాత్రులు తినేవి కాదు సార్. అధ్వానంగా ఉంటున్నాయి. ఉలవపాడు మండలం రామాయపట్నం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోగురువారం మధ్యాహ్న భోజన సమయంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మధ్య జరిగిన సంభాషణ ఇది. ఉలవపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సక్రమంగా లేదనే అంశంపై ఇటీవల హైకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో గురువారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ జేఆర్ పుష్పరాజ్‌తో పాటు కమిషన్ సభ్యులు ఉలవపాడు మండలం రామాయపట్నం గ్రామానికి వచ్చారు. మధ్యాహ్న భోజన సమయంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని తనిఖీ చేశారు. దీంతోపాటు రెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాల, మరో రెండు అంగన్వాడీ కేంద్రాల్లో కూడా సభ్యులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రామాయపట్నం పాఠశాల హెచ్ఎం ఆదిశేషును విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, మెనూపై కమిషన్ చైర్మన్ ప్రశ్నించారు. గుడ్లు ఎందుకు పెట్టలేదని అడగగా ఏజన్సీ వారు ఇవ్వడం లేదని హెచ్ఎం బదులిచ్చారు. కొద్ది రోజుల క్రితమే అయిపోయాయని తెలిపారు. నాసిరకం భోజనం గురించి ప్రశ్నించగా ఇక్కడి రాజకీయ పరమైన కుకింగ్ ఏజన్సీ కారణంగా ఈ పరిస్థితులు వచ్చాయని తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను అటెండరుగా అయినా వెళ్తానని సమాధానమిచ్చారు. భోజన నాణ్యతపై ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు ఇక్కడ లేరని చెప్పారు. బియ్యం కూడా దారుణంగా ఉన్నాయని రామాయపట్నం డీలర్ వచ్చి తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు అంటున్నారని, స్టాక్ పాయింట్ కూడా తీసుకురావడం లేదని తెలిపారు. అనంతరం పాఠశాల రికార్డులు పరిశీలించిన సభ్యులు ఇద్దరు ఉపాధ్యాయులు గైర్హాజరు కావడం.. వారి సెలవు చీటీలో తేదీ వేయకుండా కేవలం సంతకాలు పెట్టి ఉండటం గమనించారు. బ్రహ్మయ్య అనే ఉపాధ్యాయుడు మెటర్నటీ లీవు అని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధ్యాయులు రెడీమేడ్ లెటర్లు రాసిపెడుతున్నట్లు గుర్తించారు. అంతటా అధ్వాన భోజనం పల్లెపాలెం పాఠశాల తనిఖీ చేయగా కందిపప్పు అ«ధ్వానంగా ఉందని గుర్తించారు. వీటిని తనిఖీ చేయాలని లీగల్ మెట్రాలజీ అధికారులకు సూచించారు. మధ్యాహ్న భోజనం వండే గదులు కూడా పరిశుభ్రంగా లేవని గుర్తించారు. ఇక అంగన్వాడీల్లో సైతం పౌష్ఠికాహారం సక్రమంగా లేదని గుర్తించారు. గుడ్లులేని విషయాన్ని తెలియచేశారు. ఇక గర్భవతులు తిని ఇంటికి వెళ్లారని వారు తెలపడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భవతుల, బాలింతల కార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని గుర్తించారు. అన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులు గుడ్లు ఈ మధ్య దాకా వచ్చాయని చెప్పడంతో ఎందుకు అబద్దాలు చెపుతారు.. పైనుంచి రాకపోతే మీరు ఈ మధ్య వరకు పెట్టామని అబద్దాలు చెపితే పిల్లలు కూడా అదే నేర్చుకోరూ..? అంటూ చైర్మన్ ప్రధానోపాధ్యాయులను మందలించారు. నోడల్ ఆఫీసర్‌గా ఉన్న ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలు ఎక్కడ ఉన్నాయో కూడా ఆయనకు తెలియదన్నారు. ఇక నాసిరకంగా గుడ్లు పంపిణీ జరగడం గురించి, తెలిపిన ప్రధానోపాధ్యాయురాలి నుంచి పంచనామా రిపోర్టు రాయాలని తహశీల్దార్ పద్మావతికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కమిషన్ మెంబర్ సెక్రటరీ రవిబాబు, కమిషన్ సభ్యులు కృష్ణమ్మ, డాక్టర్ గీత, ఎల్వీ వెంకటరావు, ఎం.శ్రీనివాసరావు, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, డీఈఓ సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ విశాలాక్షి, డీడీలు లక్ష్మీదుర్గ, లక్ష్మీసుధ, డీఎం లక్ష్మీపార్వతితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
సాంబార్లో పురుగులు
అనంతపురం, ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని మహానంది వసతిగృహంలో శుక్రవారం మధ్యాహ్నం వడ్డించిన సాంబార్లో పురుగులు కనిపించడంతో విద్యార్థులు ఆగ్రహించారు. పుచ్చుపట్టిన వంకాయలను సాంబార్‌లోకి యథాతథంగా వాడటంతో పురుగులు బయటపడ్డాయి. ఇటువంటి భోజనం ఎలా తినాలంటూ విద్యార్థులు యూనివర్సిటీ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. నాసిరకమైన ఆహారంతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వీరి ఆందోళనలకు వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు మద్దతు ప్రకటించారు. నాయకులు రాధాకృష్ణ, కళ్యాణ్ కుమార్, వినోద్, అనిల్, హేమంత్ మాట్లాడుతూ నాలుగు నెలల నుంచి నాణ్యమైన భోజనం అందించాలని అనేక దఫాలుగా విన్నవించినప్పటికీ అధికారుల వైఖరిలో మార్పు రాలేదన్నారు. ఇటీవల టెండర్లలో రేట్లు తగ్గించేలా ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. అయినా కిందిస్థాయి అధికారులు వాటిని సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. కూరగాయలు చెడిపోయినవి సరఫరా చేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులందరూ ర్యాలీగా వచ్చి ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. వార్డెన్ ప్రొఫెసర్ జ్యోతి విజయ్‌కుమార్ విద్యార్థులకు నచ్చచెప్పారు. స్టోర్ కీపర్, సప్లయర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం
సత్తెనపల్లి: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి విద్యార్థుల వివరాలు, నిర్వహణ చర్యలతో ప్రతిపాదనలు పంపించాలని ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ ఉదయలక్ష్మి నుంచి ఆర్జేడీ, ఆర్జేడీ నుంచి కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు అందాయి. డ్రాపౌట్స్ తగ్గించేందుకే.. ప్రాథమిక పాఠశాల నుంచి పదో తరగతి వరకు మథ్యాహ్న భోజన పథకం అమలవు తోంది. తద్వారా పదో తరగతి వరకు విద్యార్థులు డ్రాపౌట్లు (చదువు మానేస్తున్న వారు) ఎక్కువగా ఉండటం లేదు. పదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ నడుమ డ్రాపౌట్లు ఎక్కువగా ఉంటున్నాయి. దీన్ని నివారించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఈ ఏడాది నుంచి మధ్యాహ్న భోజనం అమలకు శ్రీకారం చుట్టింది. అన్నీ అనుకూలిస్తే జూలై మొదటి వారం నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలవుతుందని అధికారులు చెబుతున్నారు. కళాశాలల్లో నిరుపేదలే..... ఇంటర్మీడియెట్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు అంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. కూలి పనులకు, వ్యవసాయ పనులకు వెళ్లే కుటుంబాల విద్యార్థులు అత్యధిక సంఖ్యలో చేరుతున్నారు. పనులకు వెళ్లే కుటుంబాలు ఉదయం వెళితే సాయంత్రానికి తిరిగి వస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భోజనం వండి క్యారియర్లలో సర్ది పంపే పరిస్థితులు ఉండవు. దీంతో విద్యార్థులు అర్థాకలితో చదువుకునే పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. కళాశాలలకు వెళ్లిన విద్యార్థులు ఆకలికి తాళలేక మధ్యాహ్నం తర్వాత ఇంటి బాట పడుతున్నారు. సాయంత్రం వరకూ కళాశాలలో ఉన్నా ఆకలికి అధ్యాపకులు చెప్పే పాఠాలు విద్యార్థుల బోధపడటంలేదు. మరో వైపు పౌష్టికాహారం లోపం తలెత్తుతోంది. మధ్యాహ్న భోజనం పథకం అమలైతే విద్యార్థులకు అర్ధాకలి నుంచి బయట పడటంతో పాటు పౌíష్టికాహారం లోపాన్ని అధిగమించొచ్చని ఇంటర్మీడియెట్ బోర్డు ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి ముందు కు వచ్చింది. పాఠశాలల తరహాలో... జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఆరు రోజులు పౌíష్టికాహారంతో కూడిన భోజనాన్ని వంట ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు వడ్డిస్తున్నారు. వారంలో మూడు రోజులు కోడి గుడ్లను విద్యార్థులకు అందిస్తున్నారు. వంట ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజన పథకం ఎలా అమలవుతోంది? అమలులో లోపాలున్నాయా? అనే విషయాల పై పర్యవేక్షణ చేయాలని ఇంటర్ కళాశాలల కమిషనర్ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు జరీ చేశారు. పౌష్టికాహారంతో కూడిన భోజనం ఇంటర్మీడియెట్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. రోజూ పౌష్టికాహారంతో కూడిన భోజనం వడ్డించడంతో పాటు మజ్జిగ, అరటి పండు, గుడ్లను విద్యార్థులకు అందిస్తారు. తద్వారా హాజరు శాతం రోజూ పెరగడంతో పాటు కళాశాల ప్రవేశాలు పెరుగుతాయని ప్రిన్సిపాళ్లు భావిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు 22, 23 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి.వీటి పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు మొదటి సంవత్సరం విద్యార్థులు 5,239 మంది ప్రవేశాలు పొందారు. మరో 1,500 మంది వరకుప్రవేశాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం 5,340 మంది విద్యార్థులు చదువుతున్నారు. జూలై నుంచి అమలు జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పధకం ఎలా అమల వుతోంది. వంట ఏజెన్సీలు భోజనాన్ని విద్యార్థులకు ఏ విధంగా వండి వడ్డిస్తున్నారు తదితర వాటి పై కసరత్తు జరుగుతోంది. జులై నుంచి ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలులోకి వస్తుంది.–జెడ్.ఎస్.రామచంద్రరావు,ఆర్ఐఓ, గుంటూరు -
మురుగు నీళ్లతో మధ్యాహ్న భోజనం
చిలకలూరిపేటటౌన్: బావిలోని కలుషిత నీటితో వండిన ఆహారాన్ని తిని 19 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. నాదెండ్లలోని ఎస్సీ బాలుర వసతి గృహానికి చెందిన 90 మంది విద్యార్థులు గురువారం మధ్యాహ్న భోజనం తిని తరగతులకు వెళ్లారు. ఇందులో కొంత మందికి కడుపు నొప్పి, వాంతులు అవడంతో విశ్రాంతి తీసుకునేందుకు హాస్టల్‌కు వెళ్లారు. వీరిలో 19 మందికి తీవ్రమైన జ్వరం, వాంతులు రావడంతో హుటాహుటిన నాదెండ్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అడుగడుగునా నిర్లక్ష్యం విద్యుత్ సరఫరా లేని కారణంగా బావిలోని మురుగు నీటితో వంట చేశామని నిర్వాహకులు చెప్పారు. పూర్తిగా కలుషితమై మట్టితో కూడిన బావి నీటిని వంటకు వినియోగించారు. మినరల్ వాటర్ తీసుకొచ్చేందుకు నాదెండ్ల నుంచి గణపవరం గ్రామానికి 15 నిమిషాల ప్రయాణం. అక్కడి నుంచి చిలకలూరిపేటకు ఐదు నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. కానీ 90 మంది తినే ఆహారం విషయంలో నిర్వాహకుల అశ్రద్ధ స్పష్టంగా తెలుస్తోంది. కలెక్టర్ ఆగ్రహం.... సమాచారం అందుకున్న కలెక్టర్ కోన శశిధర్ సాయంత్రం నాదెండ్లకు చేరుకున్నారు. వసతిగృహం, ఆసుపత్రిని సందర్శించారు. రామాలయం సమీపంలోని కలుషిత బావిని పరిశీలించారు. ఇలాంటి నీటితో వంట ఎలా చేశారంటూ నిర్వాహకులపై మండిపడ్డారు. ఆనంతరం విద్యార్థులను పరామర్శించారు. కలెక్టర్ వెంట ఉప వైద్యాధికారి శ్యామల, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారులు మల్లికార్జునరావు, నిరీక్షణరావు, ఇతర అధికారులు ఉన్నారు. -
నిధులున్నా.. నిర్లక్ష్యమే!
నారాయణపేట రూరల్ : దేవుడు కరుణించినా.. పూజారి వరమివ్వలేదన్న చందంగా తయారైంది పాఠశాల వంటగది పరిస్థితి. ఒక పక్క సౌకర్యాల కల్పనకు నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ మాత్రం అనుమతి వచ్చి డబ్బులు మంజూరైనా పనులు చేపట్టడంలేదు. స్వయంగా ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేసి ఏడు నెలలు కావొస్తున్నా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నవిధంగా ఉంది. మండల పరిషత్‌కు అధ్యక్షుడిగా ఉన్న ఎంపీపీ మణెమ్మ స్వగ్రామం అప్పిరెడ్డిపల్లిలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఇక్కడ 8వ తరగతి వరకు 170మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యాహ్న భోజనం వండటానికి ప్రత్యేక గదిలేక ఆరుబయటనే ఏజెన్సీ నిర్వహకులు వంటలు చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి దష్టికి తీసుకుని వెళ్లగా గది నిర్మాణానికి రూ.2లక్షల నిధులు మంజూరు చేయించి హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి గది నిర్మాణానికి భూమిపూజ చేశారు. అయితే ఇప్పటి వరకు అక్కడ పనులు మొదులు కాలేదు. అక్కడ టీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష నాయకులు మేమంటే మేము యేస్తాం అంటూ పోటీ పడటంతో పనులు ప్రారంభం కానట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్ అధ్యక్షుడి బంధువు, ఎంపీపీ భర్త, ఎస్ఎంసీ చైర్మన్ల మధ్య ఏర్పడిన రాజకీయ విబేధాలతో పనులు కేటాయించలేదని గ్రామస్తులు వాపోతున్నారు. -
కొంచెం పప్పు వేయాలని అడిగినందుకు దారుణం
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మధ్యహ్నా భోజనంలో భాగంగా తనకు కొంచెం పప్పు వేయాలని అడిగినందుకు ఓ వంటమనిషి ఒకటో తరగతి చదువుతున్న బాలుడి ముఖంపై వేడిగా కాలుతున్న పప్పును విసిరికొట్టాడు. దీంతో ఆ బాలుడి ముఖం కాలింది. అలాగే చెంపలు, ఛాతీ భాగం, వెనుక భాగం కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం దిండోరిలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ప్రిన్స్ మెహ్రా అనే విద్యార్థి ఒకటో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజనం స్కూల్లోనే చేసే క్రమంలో నేమావతి బాయి అనే వంట చేసే మహిళను తనకు కొంచెం అదనంగా పప్పు వేయాలని కోరాడు. దాంతో ఆమె నేరుగా పప్పు అతడిపై విసిరి కొట్టింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఎంగిలి చేతులతో ఎందాక...
సర్కార్ బడుల్లో మౌలిక సదుపాయాలు లేవనడానికి ఈ చిత్రంలో వరుసగా నడిచి వెళ్తూ కనిపిస్తున్న విద్యార్థులే నిదర్శనం. పోలాకి మండలం చీడివలస ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలలో వీరంతా చదువుతున్నారు. ఇక్కడ ఉన్న బోరు సుమారు ఆరు నెలల క్రితం పాడవ్వడంతో విద్యార్థులకు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కంచాలు, చేతులు కడుక్కోవడానికి నీరు అందుబాటులో లేదు. దీంతో చేసేది లేక పాఠశాలకు సమీపంలో రోడ్డు ఆవలవైపు ఉన్న సాగునీటికాలువ వద్దకు వెళ్లి కంచాలు కడ్డుక్కోవాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు. సుమారు ఆరు నెలలుగా ఇదే పరిస్థితి. పిల్లల వెంట ఓ ఉపాధ్యాయుడు తోడుగా వెళ్లి..వస్తుండడం దినచర్యగా మారింది. బోరు పాడైన విషయాన్ని ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి సర్పంచ్ ముద్దాడ రాము తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదు. విద్యార్థులకు కష్టాలు తీరలేదు. అధికారులు స్పందించి నీటి సమస్య నుంచి తమ పిల్లలను గట్టెక్కించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.