మధ్యాహ్న భోజనంపై ‘లెక్క’లేనితనం!
► పాఠశాలల్లో విద్యార్థుల లెక్కలు సరిగ్గా ఇవ్వని టీచర్లు
► రోజువారీగా భోజనం తినే విద్యార్థుల లెక్కలపై కేంద్రం అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థుల వివరాలను టీచర్లు ఇవ్వడం లేదు. రోజువారీగా పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు భోజనం తింటున్నారు.. ఎంత మంది గైర్హాజర్ అవుతున్నారో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టం రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు కావడంలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖ చీవాట్లు పడాల్సి వస్తోంది. రాష్ట్రంలో 28,689 పాఠశాలలు ఉన్నాయి.
వీటిల్లో ఎన్ని పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు భోజనం చేశారన్న వివరాలను మధ్యాహ్న భోజనం బాధ్యతలు చూసే టీచర్లు సరిగ్గా పంపించడం లేదు. దీంతో గత నెల, ఈ నెలలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లేఖ రాసింది. రాష్ట్రంలో ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టం అమలు కావడం లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ నెల 12, 14 తేదీల్లో 2 శాతం పాఠశాలలు కూడా మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థుల సంఖ్యను తెలియజేయలేదని పేర్కొంది. ఇప్పటికైనా సరిగ్గా వివరాలను పంపించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
ఇతర రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి..
వివిధ రాష్ట్రాల్లోనూ మధ్యాహ్న భోజనం లెక్కలు కేంద్రానికి సరిగ్గా అందడం లేదు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఉండే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో నిధులకు పక్కాగా లెక్కలు ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టంను ప్రవేశ పెట్టింది. ఈ నెల 12వ తేదీన మన రాష్ట్రంలోని 473 పాఠశాలల నుంచి (1.65 శాతం) మాత్రమే భోజనం చేసిన విద్యార్థుల వివరాలు కేంద్రానికి వెళ్లాయి. ఈ నెల 14న కేవలం 232 పాఠశాలలు మాత్రమే ‘భోజనం’ వివరాలను ఇచ్చాయి.