![Higher Education For Poor Children With English Medium - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/28/SCHOOL.jpg.webp?itok=limpKudc)
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం సన్యాసిపుట్టుగ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గతంలో 23 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా ఈ ఏడాది 58కి చేరింది. ఇదే మండలం ధర్మవరం ఆదర్శ పాఠశాలలో గతంలో 33 మంది ఉండగా ఇప్పుడు విద్యార్థుల సంఖ్య 63కి పెరిగింది.
విజయవాడలో 1,600 మంది విద్యార్థులున్న ఏకేటీపీ హైస్కూలులో అడ్మిషన్ల కోసం పలువురు సిఫార్సులతో వస్తున్నారు. జీడీఈటీ హైస్కూలులో ఇప్పటికే 1,300 మంది విద్యార్థులు ఉండటంతో సీట్లు లేవని చెబుతున్నారు. ఇదే నగరంలో 800 మంది చదువుతున్న బీఎస్‌ఆర్కే హైస్కూల్లో, 700 మంది ఉన్న ఎస్పీఎస్‌ఎంసీ హైస్కూలులో సీట్లు లేవని సర్ది చెప్పాల్సి వస్తోంది. వీఎంసీ ఎలిమెంటరీ స్కూల్లో, ప్రశాంతి నగర్ ఎలిమెంటరీ స్కూల్లోనూ ఇదే పరిస్థితి.
కాకినాడ, విశాఖ, విజయనగరం, గుంటూరు, ఏలూరు, కర్నూలు, కడప, అనంతపురంలోని మున్సిపల్ స్కూళ్లలో సీట్ల కోసం తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది.
సాక్షి, అమరావతి: విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణలు, విద్యాభివృద్ధి కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్లు తగ్గడంతోపాటు విద్యార్థుల చేరికలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం, పేద విద్యార్థులు పెద్ద చదువులు చదివేలా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించి విద్యారంగం పట్ల సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం సర్కారీ స్కూళ్ల వైపు విద్యార్థులు మొగ్గు చూపటానికి ప్రధాన కారణం. 2019–20 విద్యా సంవత్సరంలో దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ రెండు నెలల వ్యవధిలోనే మరో 70,000 మందికిపైగా విద్యార్థులు సర్కారీ స్కూళ్లలో ప్రవేశాలు పొందారు. అడ్మిషన్లు ఇంకా కొనసాగుతున్నందున ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలను వీడి ప్రైవేట్ స్కూళ్లలో చేరిన వారి సంఖ్య దాదాపు 519 మాత్రమే ఉండటం గమనార్హం.
► ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతూ 1–10 వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతుండడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్ల వైపు బారులు తీరుతున్నారు.
► ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తూ చేపట్టిన ‘అమ్మ ఒడి’, జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తుండటంతో ప్రభుత్వ స్కూళ్ల పట్ల ఆసక్తి పెరిగింది. జగనన్న విద్యా కానుక ద్వారా రూ.650 కోట్లకు పైగా ఖర్చు చేసి 3 జతల దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, షూలు, సాక్సులు, బెల్టు, బ్యాగు ఇవ్వడం ప్రభుత్వ స్కూళ్లకు ఆదరణ పెంచుతోంది.
► ‘అమ్మ ఒడి’ద్వారా రూ.6,300కోట్లను విద్యార్థుల తల్లులకు ప్రభుత్వమిచ్చిన సంగతి తెలిసిందే.
► నాడు–నేడు కింద దాదాపు 45 వేల ప్రభుత్వ స్కూళ్లలో రూ.12 వేల కోట్లతో మరమ్మతులు చేపట్టడంతోపాటు మంచి నీటి సదుపాయం, రన్నింగ్ వాటర్‌తో మరుగుదొడ్లు, గ్రీన్ చాక్ బోర్డులు, అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్లు, ప్రహరీల నిర్మాణం, ఫర్నీచర్, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఇంగ్లిష్ ల్యాబ్‌లు, కంప్యూటర్, లైబ్రరీ బుక్స్, డిజిటల్ తరగతులు తదితర సదుపాయాలతో కార్పొరేట్ విద్యా సంస్థల తలదన్నేలా సర్కారీ స్కూళ్లను తీర్చిదిద్దడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు క్యూలు కడుతున్నారని మున్సిపల్ స్కూళ్ల టీచర్ల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను దశల వారీగా ప్రభుత్వ స్కూళ్లకు అనుసంధానం చేసి ప్రీ ప్రైమరీ కూడా ప్రవేశ పెడుతుండడంతో చేరికలు మరింత పెరగనున్నాయి.
అంచనాలకు మించి!
► కోవిడ్ వల్ల పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. దీంతో తల్లిదండ్రులు మాత్రమే వచ్చి తమ పిల్లల అడ్మిషన్లు తీసుకుంటున్నారు.
► ప్రస్తుతం 1– 9వ తరగతి వరకు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ వారి డేటాను ఆన్‌లైన్‌లో చేరుస్తున్నారు. టెన్త్ పూరై్తన దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు కాలేజీల్లో చేరనున్నారు. మరోవైపు కొత్తగా ఒకటో తరగతితోపాటు ఇతర తరగతుల్లోనూ ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని విద్యాశాఖ తాత్కాలిక తేదీని నిర్ణయించింది. ఆ తరువాత విద్యార్థుల చేరికలపై పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది లక్ష్యం 72,46,428 మంది విద్యార్థులకు గాను ఛైల్డ్ ఇన్ఫో ప్రకారం 62,94,005 మంది ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
► విద్యాశాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు 4,77,577 మంది విద్యార్థుల చేరికలకు సంబంధించి డేటా అప్‌లోడ్ అయింది. వీరు కాకుండా టీసీలు, డ్రాపవుట్లు 7,79,174 వరకు ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ స్కూళ్లవైపే అంతా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్లలోకి వచ్చే విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇప్పుడు మా స్కూలు బావుంది
గతంలో ప్రైవేట్ పాఠశాలలో చదివా. ఇటీవల మా ఊరిలో ప్రభుత్వ పాఠశాల సూపర్‌గా తయారైంది. బెంచీలు, గ్రీన్ బోర్డులు, ఫ్యాన్లు, రంగులతో బొమ్మలు చాలా బాగున్నాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే చేరా.
– మంతెన సాత్విక్ వర్మ, 5వ తరగతి, పోణంగి ఎంపీపీ స్కూల్, పశ్చిమగోదావరి
పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య..
మా ఇద్దరు అమ్మాయిలను ఇచ్ఛాపురంలో రెండు కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తుండేవాడిని. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటం చూసి ఆశ్చర్యమేసింది. పైసా ఖర్చు లేకుండా మా పిల్లలను అన్ని సదుపాయాలున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని నిర్ణయించి సన్యాసిపుట్టుగ ప్రాథమికోన్నత పాఠశాలలో చేర్పించా.
– లాబాల జానకిరావు, కేశుపురం, శ్రీకాకుళం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment