బడి పంట! | Maintenance of kitchen gardens in public schools | Sakshi
Sakshi News home page

బడి పంట!

Published Thu, Aug 29 2019 3:16 AM | Last Updated on Thu, Aug 29 2019 3:16 AM

Maintenance of kitchen gardens in public schools - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాజా కూరగాయలు, అప్పటికప్పుడు కోసుకొచ్చిన ఆకుకూరలతో చేసిన వంట రుచికరంగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా. ఇక ఆ కూరగాయలు, ఆకుకూరలను సహజసిద్ధ్దంగా, సేంద్రియ ఎరువులతో పండిస్తే అంతకుమించి కావాల్సింది ఏముంటుంది? ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇదే తరహా భోజనాన్ని అందించాలనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ తలపెట్టిన కిచెన్‌ గార్డెన్స్‌ సత్ఫలితాలిస్తోంది. 2018–19 వార్షిక సంవత్సరంలో రాష్ట్రంలోని 1,328 పాఠశాలలను విద్యాశాఖ ఇందుకు ఎంపిక చేయగా మంచి ఫలితాలొచ్చాయి. దీంతో 2019–20లో ఏకంగా 13,694 స్కూళ్లకు ఈ కార్యక్రమాన్ని విస్తరించింది. 

లక్షణమైన లక్ష్యం... 
విద్యార్థులకు శ్రమ, పంటల సాగుపై అవగాహన కల్పించడంతోపాటు మధ్యాహ్న భోజనంలో తాజా కూరలు అందించాలనే ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ కిచెన్‌ గార్డెన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఇందులో భాగస్వామ్యులను చేసింది. అవసరాలు, సీజన్‌కు తగిన విధంగా ఈ పంటలు సాగు చేసుకోవాలని సూచించింది. కిచెన్‌ గార్డెన్ల సాగు పూర్తిగా సేంద్రియ పద్ధ్దతిలో చేపట్టాలి. అప్పటికప్పుడు సేకరించే అవకాశం ఉండంతో పూర్తిగా తాజా కూరగాయలను వండుకోవచ్చు. తాజా దిగుబడులతో చేసిన వంటల్లో సూక్ష్మ పోషకాలు అత్యధికంగా ఉంటాయి. అంతేకాకుండా రసాయనాలు దు్రష్పభావాలు చూపిస్తాయనే ఆందోళన కూడా ఉండదు. పంటల సాగులో విద్యార్థులను భాగస్వామ్యం చేయడంతో వీరికి శ్రమతో పాటు పంటల సాగుపై అవగాహన కలుగుతుంది. 

నిర్వహణకు కమిటీలు 
రాష్ట్రవ్యాప్తంగా 13,694 ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్‌ గార్డెన్లు ఏర్పాటుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలో ఉన్న స్థలంలో 5 నుంచి 10శాతం జాగాలో వీటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.  జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో కిచెన్‌ గార్డెన్ల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారి కనీ్వనర్‌గా వ్యవహరిస్తారు.    కిచెన్‌గార్డెన్ల నిర్వహణకు విద్యాశాఖ ప్రత్యేకించి ఎలాంటి నిధులు కేటాయించలేదు.  స్థానిక ప్రజాప్రతినిధులు, దాతల సహకారాన్ని తీసుకుని పక్కాగా నిర్వహించాలని సూచించింది.  పాఠశాలల్లో టమాట, వంకాయ, బెండ, దొండ, పాలకూర, మెంతికూర, తోటకూర, కొత్తమీర, పుదీనాలను పండిస్తున్నారు. ఆకుకూరలను పప్పు కలిపి వారంలో 3 రోజులు వండుతుండగా.. మిగిలిన 3 రోజులు కూరగాయలను వండుతున్నారు.  

కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు.. 
రాష్ట్రంలో కిచెన్‌ గార్డెన్ల నిర్వహణపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో కిచెన్‌ గార్డెన్ల నిర్వహణపై పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చింది. ఇవి చూసిన కేంద్ర ప్రభుత్వం కిచెన్‌ గార్డెన్ల ఆలోచనను ప్రశంసించింది. 

పాఠ్యాంశంలో భాగంగా... 
మా స్కూళ్లో స్థలం ఎక్కువగా లేదు. దీంతో 200 గజాల జాగాలో కూరగాయలు పండిస్తున్నాం. వారంలో మూడు రోజుల పాటు ఇవి సరిపోతున్నాయి. మిగతా రోజుల్లో మార్కెట్లో కొనుగోలు చేసి వండుతున్నారు. కిచెన్‌ గార్డెన్లతో విద్యార్థులకు సాగు విధానంపై అవగాహన పెరుగుతుంది. పాఠ్యాంశంలో భాగంగా ఉన్న రైతులు, పంటలకు సంబంధించిన అంశాలను సులభతరంగా బోధించే వీలు కలిగింది. ఒక్కో రకం పంటను ఒక్కో తరగతికి బాధ్యతగా అప్పగించడంతో వారు ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకుంటున్నారు. 
– శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు, ముచ్చర్ల ప్రాథమిక పాఠశాల, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా 

సేంద్రియ ఆవశ్యకత తెలియజేయాలి 
అధిక దిగుబడులు, తక్కువ సమయంలో పంటలు వచ్చేందుకు ప్రస్తుత రైతాంగం పురుగుల మందులు, ఎరువులను విరివిగా వాడుతున్నారు. ఈ పద్ధతి మారాలంటే భావితరానికి సేంద్రియ సాగు ఆవశ్యకతను తెలియజేయాలి. పాఠశాల స్థాయిలోనే ప్రయోగాత్మకంగా విద్యార్థులకు పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు కిచెన్‌ గార్డెన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. మా స్కూల్లో ఉన్న స్థలంలో పంటలు సాగు చేస్తున్నాం. కూరగాయల పంటలతో పాటు పండ్ల మొక్కలు సైతం నాటాం
– జాక్విలిన్, సిరిసిల్ల కేజీబీవీ ప్రిన్స్‌పల్‌ 

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు 29,343
మొత్తం విద్యార్థులు 28,29,135 
గతేడాది కిచెన్‌ గార్డెన్లు ఏర్పాట్లు చేసిన స్కూళ్లు 1,328 
ప్రస్తుత ఏడాదిలో కిచెన్‌ గార్డెన్లు్ల ఏర్పాటు చేసిన స్కూళ్లు  13,694 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement