vegetables crops
-
ఒక పంట తర్వాత మరో పంట చేతికి వచ్చేలా ప్రణాళిక ప్రకారం సాగు..!
-
ఆదర్శ రైతుగా మారిన విలేజ్ ట్రైబల్
-
విధ్వంసం: నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త!
నత్తలు.. నత్తలు.. నత్తలు దండు కడుతున్నాయి.. పంటలపై దాడి చేస్తున్నాయి.. రాత్రివేళ యథేచ్ఛగా పొలాల్లో చేరిపోతున్నాయి.. మొక్క మొదళ్లలోని మృదువైన భాగాలను తినేస్తున్నాయి.. ముఖ్యంగా వివిధ రకాల కూరగాయలను ఆరగించేస్తున్నాయి.. డ్రిప్ పైపుల్లోకి దూరి నీటి సరఫరాను అడ్డుకుంటున్నాయి.. తోటల్లోకి ప్రవేశించి తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాయి.. ఆరుగాలం కష్టించిన అన్నదాతకు ఫలితం దక్కకుండా చేస్తున్నాయి. నివారణకు ఏంచేయాలో తెలియక తలలు పట్టుకునే పరిస్థితి కల్పిస్తున్నాయి. పలమనేరు(చిత్తూరు జిల్లా): కూరగాయ పంటలు సాగుచేసే రైతులకు కొత్త కష్టం వచ్చిపడింది. పలమనేరు హార్టికల్చర్ డివిజన్ పరిధిలోని 32 మండలాల్లో నత్తల దండు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. టమాట, బంగాళాదుంప, బీన్సు, బీర, మిరప తదితర పంటల మొదళ్లలోని మృధువైన భాగాన్ని నత్త పురుగులు తినేస్తున్నాయి. మొక్కకు అందాల్సిన సూక్ష్మ పోషకాలు తగ్గి పంట ఎదుగుదల దెబ్బతింటోంది. మొక్కలకు రోగనిరోధక శక్తి తగ్గి ఫంగస్ కారణంగా తెగుళ్లు సోకుతున్నాయి. వీటిని ఎలా అరికట్టాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో దాడి డివిజన్ పరిధిలోని పలు రకాల పంటలు ప్రస్తుతం పూత, పిందె దశలో ఉన్నాయి. గతంలో కురిసిన వర్షాలతో పంటకు ఆకు మాడు, ఫంగస్ తెగుళ్లు సోకుతున్నాయి. అన్నింటికీ మించి నత్తల సమస్య ఎక్కువగా ఉంది. పగటిపూట కనిపించని నత్తలు రాత్రి సమయాల్లో తోటల్లోకి ప్రవేశిస్తున్నాయి. డ్రిప్పులు అమర్చిన పొలాల్లో మలి్చంగ్‌షీట్ కిందకు చేరి మొక్క మొదళ్లను నాశనం చేస్తున్నాయి. మరోవైపు డ్రిప్పులేటర్లలోకి నత్తలు వెళ్లడంతో పైపుల్లో నీళ్లు రాకుండా బ్లాక్ అవుతున్నాయి. ఉదయం పూట ఓ తోట నుంచి మరో పొలంలోకి పాకిపోతున్నాయి. ఇవి జిగటలాంటి ద్రవాన్ని విసర్జిస్తూ వెళుతున్నట్టు రైతులు చెబుతున్నారు. గత ఏడాది రబీలో అక్టోబర్, నవంబర్‌లో అక్కడక్కడా కనిపించిన నత్తలు ఈ దఫా వేల సంఖ్యలో తోటలపై పడి సర్వనాశనం చేస్తున్నాయని రైతులు వెల్లడిస్తున్నారు. ఈ మండలాల్లోనే అధికం తేమ వాతావరణం కలిగిన భూముల్లో అధిక సంఖ్యలో నత్తలు చేరుతున్నాయి. కొబ్బరి చెట్ల నీడలోని పొలాలు, మామిడి తోటల్లోని అంతర పంటలు, చెరువు కింద ఆయకట్టు భూములు వీటికి ఆవాసాలుగా మారాయి. వి.కోట, బైరెడ్డిపల్లె, పలమనేరు, రామసముద్రం మండలాల్లోని బంగాళదుంప, గంగవరం, పలమనేరు, బైరెడ్డిపల్లె, వి.కోట మండలాలతోపాటు పుంగనూరు, మదనపల్లె, వాల్మీకిపురం నియోజకవర్గాల్లో సాగు చేస్తున్న టమాటా పంటకు సమస్య ఎక్కువగా ఉంది. నష్టాల బెంగలో రైతులు టమాటా ఎకరా సాగుకు రూ.60 వేలు, బంగాళాదుంపకు రూ.80 వేలు, మిరపకు రూ.30 వేలు, బీన్సుకు రూ.50 వేలు ఇతర తీగ పంటలకు ఎకరానికి రూ.30 నుంచి రూ.40 వేల దాకా పెట్టుబడి పెడుతున్నట్టు రైతులు చెబుతున్నారు. ఈ తరుణంలో నత్తల కారణంగా లక్షలాది రూపాయల్లో పంటకు నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నత్తల సమస్య నిజమే నత్తల దాడులు నిజమే. ఈ ప్రాంతంలో ప్రస్తుతం తేమ వాతావరణం ఉంది. నత్తలనబడే స్లగ్స్ కూరగాయ పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. వీటి నివారణకు డ్రిప్పుల్లోగానీ నేరుగా కానీ క్లోరిఫైరిపాస్, కాఫర్‌ఆక్సిక్లోరైడ్‌ను పిచికారీ చేయాలి. పొలం చుట్టూ సున్నం వేస్తే మంచిది. ఇవి అక్కడికి చేరి కొంతవరకు చనిపోతాయి. – శ్రీనివాసులురెడ్డి, ఉద్యానశాఖ అధికారి, పలమనేరు నివారణ తెలియజేయాలి ప్రస్తుతం పలు రకాల పంటలకు నత్తల సమస్య అధికంగా ఉంది. నవంబర్, డిసెంబర్లో మంచు కురుస్తుంది కాబట్టి వీటి సంచారం మరింత ఎక్కువ కావొచ్చు. అధికారులు వెంటనే స్పందించి వీటి నివారణ మార్గాలపై అవగాహన కల్పించాలి. – గోవిందరెడ్డి, ఆత్మా చైర్మన్, పలమనేరు -
ఇంటిపంటలే ఆరోగ్యదాయకం
హైదరాబాద్ కుషాయగూడలో లత, కృష్ణమూర్తి వృద్ధ దంపతులు రెండేళ్ల నుంచి తాము నివాసం ఉంటున్న బంధువుల ఇంటిపైన సేంద్రియ ఇంటిపంటలు పండించుకొని తింటూ ఆరోగ్యంగా, సంతోషంగా గడుపుతున్నారు. కృష్ణమూర్తి ప్రభుత్వ రంగ సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా రిటైరైన తర్వాత కుషాయగూడలోని బావ గారి ఇంటి మొదటి అంతస్థులో నివాసం ఉంటున్నారు. ఆకుకూరలు, కూరగాయలను కలుషిత జలాలతో పండిస్తున్నారన్న వార్తలు చదివిన తర్వాత తమ ఆరోగ్యం కోసం మిద్దె తోటలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకోవాలని నిర్ణయించుకున్నామని లత కృష్ణమూర్తి తెలిపారు. బరువు తక్కువగా ఉంటుందని గ్రోబాగ్స్‌లోనే ఎక్కువ భాగం ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వారి మిద్దెపై 300–400 గ్రోబాగ్స్‌లో పచ్చని పంటలు పండుతున్నాయి. ఆకుకూరలు, కూరగాయలతోపాటు పండ్ల మొక్కలు కూడా ఇందులో ఉన్నాయి. బోరు లేదు. నీటి అవసరాలకు కుళాయి నీరే ఆధారం కాబట్టి డ్రిప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గ్రోబాగ్స్‌లో కొయ్య తోటకూర, మెంతికూర, చుక్క కూరలతో ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టానని లత తెలిపారు. మొదట్లో చాలా సమస్యలు వచ్చినా అనుభవం నుంచి నేర్చుకున్నారు. చౌహన్ క్యు, పాలేకర్ బాటలో... ఎర్రమట్టి 20 శాతం, కొబ్బరిపొట్టు 25 శాతం, 55 శాతం పశువుల ఎరువు+వర్మీకంపోస్టుతోపాటు గుప్పెడు వేపపిండి కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకొని గ్రోబాగ్స్‌లో నింపి ఇంటిపంటలను దిగ్విజయంగా సాగు చేస్తున్నారు లత కృష్ణమూర్తి. సౌత్ కొరియా ప్రకృతి వ్యవసాయ నిపుణుడు చౌహన్‌క్యు చూపిన బాటలో ఇంటిలో లభించే ముడి సరుకులతోనే పోషకద్రావణాలను తయారు చేసుకొని పంటలకు ప్రతి వారం, పది రోజులకోసారి పిచికారీ చేయడం, మొక్కల మొదళ్లలో పోయడం ద్వారా మంచి దిగుబడులు సాధిస్తున్నారామె. జీవామృతం స్వయంగా తయారు చేసుకొని ప్రతి 15 రోజులకోసారి పంటలకు అందిస్తున్నారు. మునగాకు లేదా వేపాకు బరువుతో సమానంగా బెల్లం కలిపి 20 రోజుల తర్వాత లీటరుకు 1–2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయడం, మట్టిలో పోయడం ద్వారా అధిక దిగుబడి పొందుతున్నామని, చీడపీడల బెడద లేకుండా చక్కని ఆరోగ్యదాయకమైన కూరగాయలు పండుతున్నాయని లత సంతృప్తిగా చెప్పారు. ఈ ఏడాది జూలై నుంచి గత వారం వరకు అసలు కూరగాయలు కొనాల్సిన అవసరం లేకుండా పూర్తిగా తమకు ఇంటిపంటలే సరిపోయాయని ఆమె తెలిపారు. అందరూ ఇంటిపంటలు పండించాలి కలుషితనీరు, విషరసాయనాలతో పండించే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లకు బదులు నగరవాసులు అందరూ తమ ఇళ్లమీద పండించుకోవడం మంచిది. వారానికి కనీసం 3–4 రోజులైనా తాము పండించిన సేంద్రియ, తాజా కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటారు. వాకింగ్‌కు వెళ్లేబదులు ఉదయం గంట, సాయంత్రం గంట పాటు ఇంటిపంటల్లో పనులు చేసుకుంటే మేలు. ఇంటిపంటల పనుల్లో నిమగ్నం అయితే టైం కూడా తెలవదు. మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మేము మంచి ఆహారం తీసుకోవడంతోపాటు విదేశాల్లో ఉన్న మా పిల్లలకు కూడా పొన్నగంటి కూర వంటి ముఖ్యమైన ఆకుకూరలను నీడలో ఆరబెట్టి పంపుతున్నందుకు ఆనందంగా ఉంది. – లత కృష్ణమూర్తి, ఇంటిపంటల సాగుదారు, కుషాయగూడ, హైదరాబాద్ కాకర కాయను చూపుతున్న లత కృష్ణమూర్తి లత కృష్ణమూర్తి మిద్దెతోటలో పండిన కూరగాయలు -
బడి పంట!
సాక్షి, హైదరాబాద్: తాజా కూరగాయలు, అప్పటికప్పుడు కోసుకొచ్చిన ఆకుకూరలతో చేసిన వంట రుచికరంగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా. ఇక ఆ కూరగాయలు, ఆకుకూరలను సహజసిద్ధ్దంగా, సేంద్రియ ఎరువులతో పండిస్తే అంతకుమించి కావాల్సింది ఏముంటుంది? ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇదే తరహా భోజనాన్ని అందించాలనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ తలపెట్టిన కిచెన్ గార్డెన్స్ సత్ఫలితాలిస్తోంది. 2018–19 వార్షిక సంవత్సరంలో రాష్ట్రంలోని 1,328 పాఠశాలలను విద్యాశాఖ ఇందుకు ఎంపిక చేయగా మంచి ఫలితాలొచ్చాయి. దీంతో 2019–20లో ఏకంగా 13,694 స్కూళ్లకు ఈ కార్యక్రమాన్ని విస్తరించింది. లక్షణమైన లక్ష్యం... విద్యార్థులకు శ్రమ, పంటల సాగుపై అవగాహన కల్పించడంతోపాటు మధ్యాహ్న భోజనంలో తాజా కూరలు అందించాలనే ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఇందులో భాగస్వామ్యులను చేసింది. అవసరాలు, సీజన్‌కు తగిన విధంగా ఈ పంటలు సాగు చేసుకోవాలని సూచించింది. కిచెన్ గార్డెన్ల సాగు పూర్తిగా సేంద్రియ పద్ధ్దతిలో చేపట్టాలి. అప్పటికప్పుడు సేకరించే అవకాశం ఉండంతో పూర్తిగా తాజా కూరగాయలను వండుకోవచ్చు. తాజా దిగుబడులతో చేసిన వంటల్లో సూక్ష్మ పోషకాలు అత్యధికంగా ఉంటాయి. అంతేకాకుండా రసాయనాలు దు్రష్పభావాలు చూపిస్తాయనే ఆందోళన కూడా ఉండదు. పంటల సాగులో విద్యార్థులను భాగస్వామ్యం చేయడంతో వీరికి శ్రమతో పాటు పంటల సాగుపై అవగాహన కలుగుతుంది. నిర్వహణకు కమిటీలు రాష్ట్రవ్యాప్తంగా 13,694 ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలో ఉన్న స్థలంలో 5 నుంచి 10శాతం జాగాలో వీటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్ల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారి కనీ్వనర్‌గా వ్యవహరిస్తారు. కిచెన్గార్డెన్ల నిర్వహణకు విద్యాశాఖ ప్రత్యేకించి ఎలాంటి నిధులు కేటాయించలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు, దాతల సహకారాన్ని తీసుకుని పక్కాగా నిర్వహించాలని సూచించింది. పాఠశాలల్లో టమాట, వంకాయ, బెండ, దొండ, పాలకూర, మెంతికూర, తోటకూర, కొత్తమీర, పుదీనాలను పండిస్తున్నారు. ఆకుకూరలను పప్పు కలిపి వారంలో 3 రోజులు వండుతుండగా.. మిగిలిన 3 రోజులు కూరగాయలను వండుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు.. రాష్ట్రంలో కిచెన్ గార్డెన్ల నిర్వహణపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో కిచెన్ గార్డెన్ల నిర్వహణపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఇవి చూసిన కేంద్ర ప్రభుత్వం కిచెన్ గార్డెన్ల ఆలోచనను ప్రశంసించింది. పాఠ్యాంశంలో భాగంగా... మా స్కూళ్లో స్థలం ఎక్కువగా లేదు. దీంతో 200 గజాల జాగాలో కూరగాయలు పండిస్తున్నాం. వారంలో మూడు రోజుల పాటు ఇవి సరిపోతున్నాయి. మిగతా రోజుల్లో మార్కెట్లో కొనుగోలు చేసి వండుతున్నారు. కిచెన్ గార్డెన్లతో విద్యార్థులకు సాగు విధానంపై అవగాహన పెరుగుతుంది. పాఠ్యాంశంలో భాగంగా ఉన్న రైతులు, పంటలకు సంబంధించిన అంశాలను సులభతరంగా బోధించే వీలు కలిగింది. ఒక్కో రకం పంటను ఒక్కో తరగతికి బాధ్యతగా అప్పగించడంతో వారు ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకుంటున్నారు. – శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు, ముచ్చర్ల ప్రాథమిక పాఠశాల, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా సేంద్రియ ఆవశ్యకత తెలియజేయాలి అధిక దిగుబడులు, తక్కువ సమయంలో పంటలు వచ్చేందుకు ప్రస్తుత రైతాంగం పురుగుల మందులు, ఎరువులను విరివిగా వాడుతున్నారు. ఈ పద్ధతి మారాలంటే భావితరానికి సేంద్రియ సాగు ఆవశ్యకతను తెలియజేయాలి. పాఠశాల స్థాయిలోనే ప్రయోగాత్మకంగా విద్యార్థులకు పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు కిచెన్ గార్డెన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. మా స్కూల్లో ఉన్న స్థలంలో పంటలు సాగు చేస్తున్నాం. కూరగాయల పంటలతో పాటు పండ్ల మొక్కలు సైతం నాటాం – జాక్విలిన్, సిరిసిల్ల కేజీబీవీ ప్రిన్స్‌పల్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు 29,343 మొత్తం విద్యార్థులు 28,29,135 గతేడాది కిచెన్ గార్డెన్లు ఏర్పాట్లు చేసిన స్కూళ్లు 1,328 ప్రస్తుత ఏడాదిలో కిచెన్ గార్డెన్లు్ల ఏర్పాటు చేసిన స్కూళ్లు 13,694 -
మోడల్ టెర్రస్ కిచెన్ గార్డెన్!
మేడ మీద నాలుగు పూల మొక్కలు పెంచుకునే ఒక సాధారణ గృహిణి.. ఏకంగా ముప్పై రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతోపాటు నాటు కోళ్లను సైతం సునాయాసంగా సాగు చేసుకునే సేంద్రియ ఇంటిపంటల నిపుణురాలిగా మారిపోయారు! ‘సాక్షి’ ఏడేళ్ల క్రితం ప్రారంభించిన ‘ఇంటిపంట’ ప్రచారోద్యమంతోపాటు ఫేస్బుక్లో ఇంటిపంట గ్రూప్ ఆమెకు ప్రేరణ, మార్గదర్శి కావటం విశేషం!! ఆమె పేరు వి. ఎం. నళిని, మెహదీపట్నం(హైదరాబాద్). తమ రెండంతస్తుల మేడ పైన 1300 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తిస్థాయి ఇంటిపంటల జీవవైవిధ్య క్షేత్రాన్ని నిర్మించుకున్నారు. బాల్యం నుంచీ పూల మొక్కలపై మక్కువ కలిగిన నళిని.. మెట్టినింటి మేడ మీద పూల మొక్కలను పెంచుకుంటూ ఉండేవారు. ఆ దశలో సాక్షిలో సేంద్రియ ఇంటిపంట కాలమ్ గురించి, ఫేస్బుక్లో ఇంటిపంట గ్రూప్ గురించి తెలుసుకొని పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు సాగుపై దృష్టిపెట్టారు. ఇనుప స్టాండ్లపై 300 గ్రోబాగ్స్, కుండీలు.. తండ్రి న్యాయవాది, భర్త ఇంజనీరు. వ్యవసాయ నేపథ్యం లేకపోయినప్పటికీ, కంపోస్టు నుంచి చీడపీడల యాజమాన్యం వరకు ఒక్కో విషయం నేర్చుకున్నానని నళిని తెలిపారు. ఇంటిపంట మిత్రబృందం అడపా దడపా కలుసుకొని విత్తనాలు, మొక్కలు పంచుకోవడం, అనుభవాలు కలబోసుకోవడం ద్వారా ఆమె తన గార్డెన్‌ను పరిపూర్ణమైన మోడల్ టెర్రస్ కిచెన్ గార్డెన్‌గా ఆహ్లాదకరంగా, ముచ్చటగా తీర్చిదిద్దుకోవడం విశేషం. చిన్నా పెద్దా అన్నీ కలిపి 300కు పైగా సిల్పాలిన్ గ్రోబాగ్స్, టబ్‌లలో 22 రకాల పండ్ల మొక్కలు, 10 రకాల ఆకుకూరలు, 8 రకాల కూరగాయలు, ఐదారు రకాల తీగ జాతి కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇనుప స్టాండ్లపైన గ్రోబాగ్స్‌ను ఏర్పాటు చేయడంతో.. టెర్రస్‌పై పడిన నీరు, ఆకులు అలములను సులభంగా శుభ్రం చేసుకోవడానికి వీలుగా ఉంది. మూడు వైపులా కొంత భాగంలో షేడ్‌నెట్ వేశారు. నీడను ఇష్టపడే మొక్కలు, తీగజాతి పాదులను దీనికింద పెంచుతున్నారు. గత ఏడాది నుంచి రెండు గూళ్లలో కింద నాటు కోళ్లను, పైన లవ్‌బర్డ్స్‌ను పెంచుతున్నారు. అరుదైన జాతులు.. అనేక రకాలు.. ఒకే జాతి పండ్లు/కూరగాయల్లో అనేక రకాల మొక్కలను నళిని శ్రద్ధగా సేకరించి సాగు చేస్తున్నారు. వంగలో ఏడు రకాలు.. ముల్లు వంగ(గుండ్రం/పొడవు), వైట్ (రౌండ్/లాంగ్), వెంగోరి బ్రింజాల్, సన్న వంకాయ, ముసుగు(తొడిమతోపాటు ఉండే పొర కాయను చాలా వరకు కప్పి ఉంచుతుంది) వంకాయ, భర్తా బేంగన్ రకాలున్నాయి. తమ్మ (చమ్మ) కాయల తీగతోపాటు చెట్టు కూడా ఉంది. ‘365 డేస్’ చిక్కుడు ఉంది.సాధారణ చిక్కుడు కన్నా 2 నెలలు ముందు నుంచి కాపునివ్వడంతోపాటు.. సాధారణ చిక్కుడు కాపు ముగిసిన తర్వాత నెల అదనంగా చిక్కుడు కాయలను అందిస్తుంది. ఇప్పటికే రెండు నెలలుగా కాస్తున్నదని నళిని తెలిపారు. పొట్టి పొట్ల, చిట్టి కాకర, రెగ్యులర్ కాకర, టమాటా, తెల్లకాకర, ముల్లంగి, రెడ్ బెండ, దొండ పాదులున్నాయి. కాప్సికం గ్రీన్, రెడ్, ఎల్లో రకాలున్నాయి. మిర్చిలో రౌండ్, బ్లాక్, ఉజ్వల(గుత్తులుగా ఆకాశం వైపు తిరిగి ఉండే) రకాలున్నాయి. టమాటా ఎల్లో/రెడ్/బ్లాక్/మదనపల్లి/బెంగళూరు రకాలున్నాయి. మలేషియన్ జామ, బ్లాక్ గాల్, అలహాబాద్ సఫేద్,లక్నో 49 రకాల జామ మొక్కలున్నాయి. ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్ బెర్, సీతాఫలం, బొప్పాయి, మల్బరీ, ఫాల్స ఫ్రూట్, అరటి, ఆరెంజ్, సీడ్నిమ్మ, సీడ్ లెస్ నిమ్మ, అంజీర, డ్రాగన్ ఫ్రూట్, పునాస మామిడి, వాటర్ ఆపిల్ (వైట్/పింక్), ఆల్‌బకర (3 ఏళ్ల నుంచీ కాపు రాలేదు), చైనీస్ లెమన్, లక్ష్మణ ఫలం మొక్కలున్నాయి. చేమ ఆకు, మునగాకు, పాలకూర, చుక్కకూర, గోంగూర, పెరుగుతోటకూర, ఎర్ర తోటకూర, సిలోన్ బచ్చలి, ఎర్ర బచ్చలి, గ్రీన్ బచ్చలి తదితర ఆకుకూరలున్నాయి. కూరగాయలు, పండ్లు 70% మావే ఒకే రకం కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు ఎన్ని ఉన్నా.. వాటిని పక్క పక్కనే పెట్టకుండా వేర్వేరు చోట్ల పెట్టడం ద్వారా చీడపీడల బెడదను చాలా వరకు నివారించవచ్చునని నళిని తెలిపారు. ఒకే కుండీలో కొన్ని రకాల మొక్కలను కలిపి పెంచుతున్నారు. వంగ+మిర్చి, టమాటా+తులసి+ఉల్లి, మామిడి+టమాట+ముల్లంగి.. కలిపి పెంచుతున్నారు. పురుగుల రాకను గుర్తించి తొలిదశలోనే చేతులతో తీసేయడం ముఖ్యమైన విషయమని నళిని అంటారు. ఆవ, బంతి మొక్కలను గార్డెన్లో అక్కడక్కడా పెంచుతున్నారు. పురుగులు తొలుత ఈ రెండు మొక్కలను ఆశిస్తాయి. కనిపించిన రోజే పురుగులను ఏరి నాశనం చేస్తామన్నారు. కాబట్టి పురుగుల బెడద మొక్కలకు ఉండదన్నారు. టమాటా మొక్కను బక్కెట్‌కు అడుగున బెజ్జం పెట్టి నాటి.. తల్లకిందులుగా పెంచుతున్నారు. టమాటాకు అలా పెరగడమే ఇష్టమని నళిని అంటారు. తమ ఇంట్లో ఐదుగురు పెద్దవాళ్లుంటామని, కిచెన్ గార్డెన్ నుంచి పండ్లు, కూరగాయలను 70 శాతం వరకు సమకూర్చుకుంటున్నామని ఆమె సంతృప్తిగా చెప్పారు. కంపోస్టు.. జీవామృతం.. కోళ్ల ఎరువు, పశువుల ఎరువు, గొర్రెల ఎరువుకు ఎండు ఆకులు, అలములతోపాటు వంటింటి వ్యర్థాలు కలిపి స్వయంగా తయారు చేసుకున్న కంపోస్టుతోపాటు.. స్వయంగా తయారు చేసుకునే జీవామృతాన్ని 15 రోజులకోసారి మొక్కలకు ఇస్తూ నళిని చక్కని దిగుబడులు సాధిస్తున్నారు. గ్రాఫ్టెడ్ పండ్ల మొక్కలను నాటడం, ఒకసారి తెచ్చిన కూరగాయ/ఆకుకూర మొక్కల నుంచి విత్తనాలను స్వయంగా తయారు చేసుకొని వాడుకోవడం ఆమె ప్రత్యేకత. ఇంటిపంట ఫేస్బుక్ గ్రూప్ నుంచే తాను అన్ని విషయాలూ నేర్చుకున్నానంటున్న నళిని.. గ్రూప్‌లో ఏదైనా అంశంపై సాధికారంగా, శాస్త్రీయంగా సమాధానాలు ఇస్తూ ఇతరులకు లోతైన అవగాహన కల్పిస్తుండటం ప్రశంసనీయం. నగరంలో పుట్టి పెరుగుతూ.. గడప దాటెళ్లే పని లేకుండా.. రోజుకు కేవలం ఓ గంట సమయాన్ని కేటాయించడం ద్వారా తన కుటుంబానికి కావాల్సిన వైవిధ్యభరితమైన, అమూల్యమైన సేంద్రియ పౌష్టికాహారాన్ని సమర్థవంతంగా సమకూర్చుకుంటున్న ఆదర్శప్రాయురాలైన గృహిణి నళిని గారికి ‘సాక్షి’ జేజేలు పలుకుతోంది! ముసుగు వంగ, పునాస మామిడి, టమాటో, చెట్టు తమ్మ (చెమ్మ) ఉజ్వల మిరప, నాటు కోళ్లు, ఆపిల్ బెర్ -
ఆకుపచ్చని ఆహారాలయం!
వ్యవసాయ కుటుంబాల్లో పుట్టి పెరిగిన కట్కూరి నారాయణరెడ్డి, స్వరూప దంపతులు విశ్రాంత జీవితంలో సొంత ఇంటిపైనే విషం లేని స్వచ్ఛమైన ఆకుపచ్చని ఇంటిపంటల ఆహారాలయాన్ని అపురూపంగా నిర్మించుకున్నారు. హన్మకొండ రాఘవేంద్రనగర్ కాలనీలో స్థిరపడిన నారాయణరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా ఉద్యోగ విరమణ చేశారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లయ్యాయి. ఒక బిడ్డ హన్మకొండలోనే కాపురం ఉంటుండగా, మరో బిడ్డ బెంగళూరులో స్థిరపడ్డారు. నారపల్లికి చెందిన మిద్దె తోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి స్ఫూర్తితో నారాయణరెడ్డి, స్వరూప దంపతులు తమ ఇంటిపై రెండేళ్ల క్రితం చక్కటి మిద్దెతోట నిర్మించుకున్నారు. తమ చేతులతో మనసుపెట్టి పండించుకున్న చక్కని సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తింటూ ఆరోగ్యంగా ఉన్నారు. పాత ఎయిర్ కూలర్ డబ్బాను మూడు చిన్న మడులుగా మలచారు. 4 అడుగుల వెడల్పున అడుగు లోతుండే ఎత్తు మడులు ఇటుకలు, సిమెంటుతో నిర్మించారు. మట్టి గోడల రంగులోని మడులపై ముగ్గులతో ఆహ్లాదకరంగా శిల్పారామాన్ని తలపిస్తుండటం విశేషం. రఘోత్తమరెడ్డి రెండుసార్లు స్వయంగా వచ్చి తగిన సూచనలు ఇవ్వటం విశేషం. ప్రస్తుతం ఎరుపు, తెలుపు గుండ్రని వంగ మొక్కలు, ఎర్ర బెండ మొక్కలు, గోరుచిక్కుడు మొక్కలు కాస్తున్నాయి. పాలకూర, బచ్చలికూర, ఉల్లిఆకు, మెంతికూర, కొత్తిమీర తదితర ఆకుకూరలు వారి ఇంట్లో అందరి ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నాయి. టమాటా మొక్కలు, బోడకాకర, దొండ పాదులు పూత దశలో ఉన్నాయి. సొర, చిక్కుడు, చమ్మ(తమ్మ) కాయ పాదులను నేల మీద పెట్టి.. మిద్దె మీదకు పాకించారు. గ్రీన్ లాంగ్ వంగ నారు పోశారు. డ్రమ్ముల్లో సపోట, మామిడి మొక్కలను, ద్రాక్ష పాదును నాటారు. ఇంటిపక్కనే పెంచుకున్న బంగినపల్లి మామిడి చెట్టు కాచే పండ్లు పన్నెండేళ్లుగా తింటున్నారు. తమ ఇంటిపంటల ఆరోగ్య రహస్యం ప్రతి ఆకునూ ప్రతిరోజూ స్వయంగా తడిమి చూసుకుంటూ ఉండటమేనని స్వరూప అన్నారు. అవసరం మేరకు అడపాదడపా వర్మీకంపోస్టు వేస్తున్నారు. వంటింటి వ్యర్థాలను మిక్సీలో వేసి ఏరోజు కారోజు మొక్కలకు పోస్తుంటానని, నాలుగైదు రోజుల్లో మట్టిలో కలిసిపోతాయన్నారు. దీనివల్ల పంట మొక్కలు, పూల మొక్కలు బలంగా పెరుగుతున్నాయని తెలిపారు. వాడేసిన టీపొడి కూడా మడుల్లో వేస్తున్నారు. రోజూ సహజ ఇంటిపంటలు తింటూ చాలా ఆరోగ్యంగా ఉన్నామన్నారు. తన భర్తకు రెండుసార్లు బైపాస్ సర్జరీ అయ్యిందని స్వరూప తెలిపారు. రోజూ 3 గంటల పాటు పచ్చని ఇంటి పంటల మధ్య గడపడం వల్ల తగినంత స్వచ్ఛమైన ఆక్సిజన్ అందటమే కాకుండా.. బీపీ లేకుండా.. మానసిక ప్రశాంతత లభిస్తున్నాయని స్వరూప, నారాయణరెడ్డి(98494 50629) సంతృప్తిగా చెప్పారు. కోతుల వల్ల గత ఏడాది ఇబ్బందులు పడ్డామని, ఇనుప జాలీని అమర్చుకోవడమే మేలని భావిస్తున్నామన్నారు. కట్కూరి నారాయణరెడ్డి మిద్దెతోటలో కాసిన కాయగూరలు, ఆకుకూరలు -
అనగనగా ఓ పల్లె
ఆకుకూరల సాగుతో నిత్యమూ ఆదాయమే సెంటు భూమిలోనూ పంట సాగు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రేకులకుంట... ఈ పేరు రైతులకు చిరపరిచయమే. వ్యవసాయ పంట ప్రయోగాలు, పంట సాగులో తగిన సూచనలు, సలహాలు ఇస్తూ అన్నదాతలను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తున్న వ్యవసాయ పరిశోధన కేంద్రం ఈ గ్రామంలోనే ఉంది. అయితే ఇక్కడి రైతులే కాదు... సామాన్య ప్రజలు సైతం వినూత్న పంటల సాగుతో నిత్యమూ ఆదాయం గడిస్తున్నారు. అదేమిటో మీరూ తెలుసుకోవాలంటే ఒక్కసారి రేకులకుంట గ్రామాన్ని సందర్శించాల్సిందే. మరెందుకు ఆలస్యం.. రండి రేకులకుంటను ఒకసారి చూసొద్దాం.... జిల్లా కేంద్రం నుంచి నార్పలకు వెళ్లే దారిలో అనంతపురం పాతూరు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే రేకులకుంట వస్తుంది. దాదాపు 200 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. వ్యవసాయంలో పంట నష్టాలు రానంతవరకూ ఇక్కడి రైతుల ప్రధాన సాగు వేరుశనగ, వరి. ఇప్పటికీ వంద ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. వేరుశనగ పంట సాగులో వరుస నష్టాలతో బెంబేలెత్తిన రైతులు ప్రత్యామ్నాయ పంట సాగు వైపు దష్టి సారించారు. ఇందులో భాగంగానే తక్కువ కాలంలో చేతికి వచ్చే ఆకుకూరల సాగు చేపట్టారు. ఎటు చూసినా ఆకుకూరలే... రేకులకుంట గ్రామంలో ఎటు చూసినా ఆకుకూరల సాగు కనిపిస్తుంది. ఆఖరుకు ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ సెంటు స్థలంలోనూ ఆకుకూరలను ఇక్కడి రైతులు పండిస్తున్నారు. మలక్కూర, తోటకూర, మెంతాకు, గోంగూర, చుక్కాకు, పలకలాకు, కొత్తిమీర, కరివేప వంటి ఆకుకూరల తోటలు దాదాపు 50 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. పెట్టుబడి తక్కువ ఎకరా విస్తీర్ణంలో ఆకుకూర సాగు చేసేందుకు రూ. పది వేల నుంచి రూ. 15 వేల వరకు పెట్టుబడి అవుతోంది. పంట చేతికి వచ్చిన తర్వాత రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు డిమాండ్‌ను బట్టి రైతులు ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇది కూడా కేవలం 15 రోజుల వ్యవధిలోనే వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఆకుకూరల సాగుకు కూలీల అవసరం లేకపోవడం రైతులకు అదనపు ఆదాయంగా మారింది. ప్రస్తుతం కరివేపాకు టన్ను రూ. 20–25 వేల ధర పలుకుతోంది. రోజూ డబ్బే ఒక్కసారి పెట్టుబడి పెట్టి ఆకుకూరలు సాగుచేస్తే 15 రోజుల తర్వాత పంట చేతికి వస్తుండడంతో రోజూ రైతుల చేతికి డబ్బు వచ్చి చేరుతోంది. ఇక్కడ సాగు చేస్తున్న ఆకు కూరలు జిల్లా వ్యాప్తంగానే కాక, తెలంగాణలోని హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాలకు ఎగుమతి అవుతోంది. అంతేకాక ఆకు కూరలు సాగు చేస్తున్న రైతుల కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు బయట పనులకు వెళ్లే అవసరం లేదు. నిత్యమూ వారికి వారి వ్యవసాయ క్షేత్రంలోనే చేతినిండా పని ఉంటోంది. ప్రతి రోజూ ఏదో ఒక చిన్నపాటి పనులు ఉంటుండడంతో నిత్యమూ ఇక్కడి రైతులు పనుల్లోనే నిమగ్నమై ఉంటారు. అందని ప్రోత్సాహం ఆకు కూరలు సాగు చేసే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు సక్రమంగా అందడం లేదు. ఆకుకూరల సాగుకు సంబంధించి విత్తనాలు బయటే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పంటసాగుకు సంబంధించి తుంపర సేద్యం పరికరాలు మంజూరు చేయడం లేదు. అంతేకాక సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడం కూడా ఇక్కడి రైతులకు శాపంగా మారుతోంది. బయటకు వెళ్లే పని లేదు వ్యవసాయ కూలి పనుల కోసం మరో రైతు పొలానికి వెళ్లే అవసరం లేదు. ఇంట్లో పని ముగించుకున్న తర్వాత రోజంతా ఆకుకూర తోటలోనే చిన్నపాటి పనులు చేసుకుంటున్నాం. శ్రమ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అయితే ఓపికతో పని చేసుకోవాల్సి ఉంటుంది. ఆదాయం కూడా బాగానే ఉంది. – సునీత, రేకులకుంట నిరంతర ఆదాయమే వరి, వేరుశనగ పంటలు సాగు చేయాలంటే 4 నుంచి 6 నెలల వరకు పంట కోసం వేచి చూడాలి. ఆ తరువాత కూడా పంట చేతికి వస్తుందో లేదో తెలీదు. అదే ఆకు కూర సాగు చేస్తే 15 రోజులకే ఆదాయం కచ్చితంగా చేతికి వస్తుంది. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఉంటాయి. – రవికుమార్, రేకులకుంట మార్కెట్ సౌకర్యం లేదు సరైన మార్కెట్ సౌకర్యం లేక ఆకుకూరలు సాగు చేసే రైతులు ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. అనంతపురం మార్కెట్లో ఆకు కూరలకు సరైన ధర ఇవ్వడం లేదు. ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – లక్ష్మినారాయణ, రేకులకుంట