మోడల్‌ టెర్రస్‌ కిచెన్‌ గార్డెన్‌! | Model Terrace Kitchen Garden | Sakshi
Sakshi News home page

మోడల్‌ టెర్రస్‌ కిచెన్‌ గార్డెన్‌!

Published Tue, Sep 18 2018 4:35 AM | Last Updated on Tue, Sep 18 2018 4:35 AM

Model Terrace Kitchen Garden - Sakshi

తమ ఇంటిపైన కిచెన్‌ గార్డెన్‌లో నళిని

మేడ మీద నాలుగు పూల మొక్కలు పెంచుకునే ఒక సాధారణ గృహిణి.. ఏకంగా ముప్పై రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతోపాటు నాటు కోళ్లను సైతం సునాయాసంగా సాగు చేసుకునే సేంద్రియ ఇంటిపంటల నిపుణురాలిగా మారిపోయారు! ‘సాక్షి’ ఏడేళ్ల క్రితం ప్రారంభించిన ‘ఇంటిపంట’ ప్రచారోద్యమంతోపాటు ఫేస్‌బుక్‌లో ఇంటిపంట గ్రూప్‌ ఆమెకు ప్రేరణ, మార్గదర్శి కావటం విశేషం!!

ఆమె పేరు వి. ఎం. నళిని, మెహదీపట్నం(హైదరాబాద్‌). తమ రెండంతస్తుల మేడ పైన 1300 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తిస్థాయి ఇంటిపంటల జీవవైవిధ్య క్షేత్రాన్ని నిర్మించుకున్నారు. బాల్యం నుంచీ పూల మొక్కలపై మక్కువ కలిగిన నళిని.. మెట్టినింటి మేడ మీద పూల మొక్కలను పెంచుకుంటూ ఉండేవారు. ఆ దశలో సాక్షిలో సేంద్రియ ఇంటిపంట కాలమ్‌ గురించి, ఫేస్‌బుక్‌లో ఇంటిపంట గ్రూప్‌ గురించి తెలుసుకొని పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు సాగుపై దృష్టిపెట్టారు.

ఇనుప స్టాండ్లపై 300 గ్రోబాగ్స్, కుండీలు..
తండ్రి న్యాయవాది, భర్త ఇంజనీరు. వ్యవసాయ నేపథ్యం లేకపోయినప్పటికీ, కంపోస్టు నుంచి చీడపీడల యాజమాన్యం వరకు ఒక్కో విషయం నేర్చుకున్నానని నళిని తెలిపారు. ఇంటిపంట మిత్రబృందం అడపా దడపా కలుసుకొని విత్తనాలు, మొక్కలు పంచుకోవడం, అనుభవాలు కలబోసుకోవడం ద్వారా ఆమె తన గార్డెన్‌ను పరిపూర్ణమైన మోడల్‌ టెర్రస్‌ కిచెన్‌ గార్డెన్‌గా ఆహ్లాదకరంగా, ముచ్చటగా తీర్చిదిద్దుకోవడం విశేషం. చిన్నా పెద్దా అన్నీ కలిపి 300కు పైగా సిల్పాలిన్‌ గ్రోబాగ్స్, టబ్‌లలో 22 రకాల పండ్ల మొక్కలు, 10 రకాల ఆకుకూరలు, 8 రకాల కూరగాయలు, ఐదారు రకాల తీగ జాతి కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇనుప స్టాండ్లపైన గ్రోబాగ్స్‌ను ఏర్పాటు చేయడంతో.. టెర్రస్‌పై పడిన నీరు, ఆకులు అలములను సులభంగా శుభ్రం చేసుకోవడానికి వీలుగా ఉంది. మూడు వైపులా కొంత భాగంలో షేడ్‌నెట్‌ వేశారు. నీడను ఇష్టపడే మొక్కలు, తీగజాతి పాదులను దీనికింద పెంచుతున్నారు. గత ఏడాది నుంచి రెండు గూళ్లలో కింద నాటు కోళ్లను, పైన లవ్‌బర్డ్స్‌ను పెంచుతున్నారు.

అరుదైన జాతులు.. అనేక రకాలు..
ఒకే జాతి పండ్లు/కూరగాయల్లో అనేక రకాల మొక్కలను నళిని శ్రద్ధగా సేకరించి సాగు చేస్తున్నారు. వంగలో ఏడు రకాలు.. ముల్లు వంగ(గుండ్రం/పొడవు), వైట్‌ (రౌండ్‌/లాంగ్‌), వెంగోరి బ్రింజాల్, సన్న వంకాయ, ముసుగు(తొడిమతోపాటు ఉండే పొర కాయను చాలా వరకు కప్పి ఉంచుతుంది) వంకాయ, భర్తా బేంగన్‌ రకాలున్నాయి. తమ్మ (చమ్మ) కాయల తీగతోపాటు చెట్టు కూడా ఉంది. ‘365 డేస్‌’ చిక్కుడు ఉంది.సాధారణ చిక్కుడు కన్నా 2 నెలలు ముందు నుంచి కాపునివ్వడంతోపాటు.. సాధారణ చిక్కుడు కాపు ముగిసిన తర్వాత నెల అదనంగా చిక్కుడు కాయలను అందిస్తుంది. ఇప్పటికే రెండు నెలలుగా కాస్తున్నదని నళిని తెలిపారు.

పొట్టి పొట్ల, చిట్టి కాకర, రెగ్యులర్‌ కాకర, టమాటా, తెల్లకాకర, ముల్లంగి, రెడ్‌ బెండ, దొండ పాదులున్నాయి. కాప్సికం గ్రీన్, రెడ్, ఎల్లో రకాలున్నాయి. మిర్చిలో రౌండ్, బ్లాక్, ఉజ్వల(గుత్తులుగా ఆకాశం వైపు తిరిగి ఉండే) రకాలున్నాయి. టమాటా ఎల్లో/రెడ్‌/బ్లాక్‌/మదనపల్లి/బెంగళూరు రకాలున్నాయి. మలేషియన్‌ జామ, బ్లాక్‌ గాల్, అలహాబాద్‌ సఫేద్,లక్నో 49 రకాల జామ మొక్కలున్నాయి. ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్‌ బెర్, సీతాఫలం, బొప్పాయి, మల్బరీ, ఫాల్స ఫ్రూట్, అరటి, ఆరెంజ్, సీడ్‌నిమ్మ, సీడ్‌ లెస్‌ నిమ్మ, అంజీర, డ్రాగన్‌ ఫ్రూట్, పునాస మామిడి, వాటర్‌ ఆపిల్‌ (వైట్‌/పింక్‌), ఆల్‌బకర (3 ఏళ్ల నుంచీ కాపు రాలేదు), చైనీస్‌ లెమన్, లక్ష్మణ ఫలం మొక్కలున్నాయి. చేమ ఆకు, మునగాకు, పాలకూర, చుక్కకూర, గోంగూర, పెరుగుతోటకూర, ఎర్ర తోటకూర, సిలోన్‌ బచ్చలి, ఎర్ర బచ్చలి, గ్రీన్‌ బచ్చలి తదితర ఆకుకూరలున్నాయి.

కూరగాయలు, పండ్లు 70% మావే
ఒకే రకం కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు ఎన్ని ఉన్నా.. వాటిని పక్క పక్కనే పెట్టకుండా వేర్వేరు చోట్ల పెట్టడం ద్వారా చీడపీడల బెడదను చాలా వరకు నివారించవచ్చునని నళిని తెలిపారు. ఒకే కుండీలో కొన్ని రకాల మొక్కలను కలిపి పెంచుతున్నారు. వంగ+మిర్చి, టమాటా+తులసి+ఉల్లి, మామిడి+టమాట+ముల్లంగి.. కలిపి పెంచుతున్నారు. పురుగుల రాకను గుర్తించి తొలిదశలోనే చేతులతో తీసేయడం ముఖ్యమైన విషయమని నళిని అంటారు. ఆవ, బంతి మొక్కలను గార్డెన్‌లో అక్కడక్కడా పెంచుతున్నారు. పురుగులు తొలుత ఈ రెండు మొక్కలను ఆశిస్తాయి. కనిపించిన రోజే పురుగులను ఏరి నాశనం చేస్తామన్నారు. కాబట్టి పురుగుల బెడద మొక్కలకు ఉండదన్నారు. టమాటా మొక్కను బక్కెట్‌కు అడుగున బెజ్జం పెట్టి నాటి.. తల్లకిందులుగా పెంచుతున్నారు. టమాటాకు అలా పెరగడమే ఇష్టమని నళిని అంటారు. తమ ఇంట్లో ఐదుగురు పెద్దవాళ్లుంటామని, కిచెన్‌ గార్డెన్‌ నుంచి పండ్లు, కూరగాయలను 70 శాతం వరకు సమకూర్చుకుంటున్నామని ఆమె సంతృప్తిగా చెప్పారు.  

కంపోస్టు.. జీవామృతం..
కోళ్ల ఎరువు, పశువుల ఎరువు, గొర్రెల ఎరువుకు ఎండు ఆకులు, అలములతోపాటు వంటింటి వ్యర్థాలు కలిపి స్వయంగా తయారు చేసుకున్న కంపోస్టుతోపాటు.. స్వయంగా తయారు చేసుకునే జీవామృతాన్ని 15 రోజులకోసారి మొక్కలకు ఇస్తూ నళిని చక్కని దిగుబడులు సాధిస్తున్నారు. గ్రాఫ్టెడ్‌ పండ్ల మొక్కలను నాటడం, ఒకసారి తెచ్చిన కూరగాయ/ఆకుకూర మొక్కల నుంచి విత్తనాలను స్వయంగా తయారు చేసుకొని వాడుకోవడం ఆమె ప్రత్యేకత. ఇంటిపంట ఫేస్‌బుక్‌ గ్రూప్‌ నుంచే తాను అన్ని విషయాలూ నేర్చుకున్నానంటున్న నళిని.. గ్రూప్‌లో ఏదైనా అంశంపై సాధికారంగా, శాస్త్రీయంగా సమాధానాలు ఇస్తూ ఇతరులకు లోతైన అవగాహన కల్పిస్తుండటం ప్రశంసనీయం. నగరంలో పుట్టి పెరుగుతూ.. గడప దాటెళ్లే పని లేకుండా.. రోజుకు కేవలం ఓ గంట సమయాన్ని కేటాయించడం ద్వారా తన కుటుంబానికి కావాల్సిన వైవిధ్యభరితమైన, అమూల్యమైన సేంద్రియ పౌష్టికాహారాన్ని సమర్థవంతంగా సమకూర్చుకుంటున్న ఆదర్శప్రాయురాలైన గృహిణి నళిని గారికి ‘సాక్షి’ జేజేలు పలుకుతోంది!


ముసుగు వంగ,  పునాస మామిడి, టమాటో, చెట్టు తమ్మ (చెమ్మ)


ఉజ్వల మిరప, నాటు కోళ్లు, ఆపిల్‌ బెర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement