Organic agriculture
-
మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది?
హరిత విప్లవానికి పట్టుగొమ్మ వంటి పంజాబ్ రాష్ట్రంలో రైతులు పునరలోచనలో పడ్డారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు అత్యధిక మోతాదులో వాడుతూ ఏడు దశాబ్దాలుగా మార్కెట్ కోసం వరి, గోధుమ వంటి పంటలు పండిస్తూ వచ్చిన రైతులు.. ఆ ఆహారం తిని తమ కుటుంబ సభ్యులు వ్యాధిగ్రస్తులుగా మారుతుండటాన్ని గురించారు. తమ కుటుంబం కోసమైనా రసాయనాలు వాడకుండా పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించుకోవటమే ఆరోగ్యాన్ని తిరిగి పొందే మార్గమని పంజాబ్ రైతులు ఎట్టకేలకు గ్రహిస్తున్నారు.తేజ్‌పాల్ సింగ్ 30 ఎకరాల ఆసామి. పొలం అంతా (గత సెప్టెంబర్‌లో) పచ్చని వరి పంటతో నిండి ఉంది. పటియాలా జిల్లా కక్రాల గ్రామ పొలిమేరల్లోని తన వరి పొలానికి 4 టన్నుల యూరియా వేశానని, పురుగుల మందు ఒకసారి చల్లానని చెప్పారు. ఇది మార్కెట్లో అమ్మటం కోసం అతను పండిస్తున్నాడు. ఈ పంట అమ్మటం కోసం కాదుఈ ప్రధాన పొలానికి పక్కనే అతనిదే 4 ఎకరాల పొలం మరొకటి ఉంది. అందులో కొంత మేరకు వరి పంట, దాని పక్కనే కూరగాయల తోట కూడా ఉంది. ‘ఈ 4 ఎకరాల పంట అమ్మటం కోసం కాదు, మా కుటుంబం కోసమే పూర్తిగా సేంద్రియంగా పండిస్తున్నా. పచ్చిరొట్ట ఎరువు, వర్మీకంపోస్టు, జీవన ఎరువులు ఈ పొలంలో వాడుతున్నా. మా కుటుంబం తినగా మిగిలినవి ఏమైనా ఉంటే అమ్ముతా’ అన్నారు తేజ్‌పాల్ సింగ్.ఈ మార్పు ఎందుకొచ్చిందని అడిగితే.. మూడేళ్ల క్రితం తన భార్య అనారోగ్యం పాలైంది. టెస్ట్ చేయిస్తే యూరిక్ యాసిడ్ పెరిగిందన్నారు. ఆ రోజుల్లో మరో దగ్గరి బంధువుకు కేన్సర్ వచ్చింది. అప్పటి నుంచి మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది అని ఆలోచించటం మొదలు పెట్టాడు. తాను రసాయనాలతో పండించిన ఆహారోత్పత్తుల్ని పరీక్ష చేయించాడు. యూరియా, పొటాష్, పురుగుమందుల అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఆ ఆహారంలో ఉన్నట్లు తేలింది.మా కోసం ఆర్గానిక్ పంటలు‘అప్పుడు నేను నిర్ణయించుకున్నా. మా కుటుంబం తినేదంతా సేంద్రియ పద్ధతుల్లోనే పండించుకోవాలని గట్టి నిర్ణయానికొచ్చా. అప్పటి నుంచి ఈ 4 ఎకరాల్లో మా కోసం ఆర్గానిక్ పంటలు పండించుకొని తింటున్నాం. నా భార్య దేహంలో యూరిక్ యాసిడ్ తగ్గింది. మేం తింటున్న సేంద్రియ ఆహారం రుచిగా, నాణ్యంగా ఉంది. ఈ ఆహారం అంతకు ముందు తిన్న దానికన్నా ఎంతో మేలైనదని మాకు అర్థమైంది’ అన్నారు తేజ్‌పాల్ సింగ్. ఇది ఆయన ఒక్కడి మాటే కాదు. తినే ఆహారంలో రసాయనాల అవశేషాల్లేకపోతే ఆరోగ్యం బాగుంటుందని గట్టిగా గుర్తించిన రైతులు చాలా మందే కనిపిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు.చదవండి: సహకారం రాష్ట్ర సబ్జెక్ట్.. కేంద్రం చట్టాలు ఎలా చేస్తుంది?కొద్ది నెలల క్రితం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం.. పంజాబ్‌లో 2023–24లో ఎకరానికి 103 కిలోల రసాయనిక ఎరువులు వాడారు. దేశవ్యాప్తంగా రైతులు వాడుతున్న 58 కిలోలతో పోల్చితే ఇది దాదాపుగా రెట్టింపు. 1980–2018 మధ్యలో పంజాబ్ రైతులు వాడిన ఎన్‌పికె ఎరువులు ఏకంగా 180% పెరిగిందట.దీనికి తగ్గట్టే జబ్బులూ పెరిగాయి. ఐసిఎంఆర్ సంస్థ నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం.. పంజాబ్‌లో 2021లో 39,521 మంది కేన్సర్ బారిన పడితే.. అది 2024 నాటికి 42,288కి పెరిగింది. పొలాల్లో రసాయనాల వాడకం పెరగటానికి, మనుషుల్లో జబ్బులు పెరగటానికి మధ్య సంబంధం స్పష్టంగానే కనిపిస్తోంది. ఇది పంజాబ్ రైతులు, వినియోగదారులూ గుర్తిస్తున్నారు. మన సంగతేంటి? -
వరిలోనే గోనె సంచుల్లో కూరగాయల సాగు!
నీరు నిల్వగట్టే రబీ వరి పొలాల్లో కూరగాయల సాగుతో పౌష్టికాహార భద్రతతో పాటు అదనపు ఆదాయంఅధిక ఉష్ణోగ్రతల్లోనూ నిశ్చింతగా కూరగాయల దిగుబడిహెక్టారులో 4–5 టన్నుల వరి ధాన్యంతో పాటు 60 క్వింటాళ్ల టొమాటోలు లేదా 30 క్వింటాళ్ల క్యారట్/ ముల్లంగి దిగుబడి పొందవచ్చుఐసిఎఆర్ సంస్థ ‘క్రిజాఫ్’ పరిశోధనల్లో వెల్లడిసార్వా, దాళ్వా సీజన్లలో (వర్షాకాలం, ఎండాకాలాల్లో) విస్తారంగా వరి పంట సాగయ్యే ప్రాంతాల్లో గట్ల మీద తప్ప పొలంలో అంతర పంటలుగా కూరగాయ పంటలను నేలపై సాగు చేయటం సాధ్యపడదు. అయితే, వరి సాళ్ల మధ్యలో వరుసలుగా ఏర్పాటు చేసిన గోనె సంచుల్లో సాధ్యపడుతుంది. గోనె సంచిలో అడుగు ఎత్తున మట్టి + మాగిన పశువుల ఎరువు/ఘన జీవామృతాల మిశ్రమం నింపి.. అందులో రకరకాల కూరగాయ మొక్కలు సాగు చేసుకునే అవకాశం మెండుగా ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. స్వల్ప ఖర్చుతోనే వరి రైతులు అధికాదాయం పొందేందుకు అవకాశం ఉంది. వరి సాగయ్యే ప్రాంతాల్లో స్థానికంగా కూరగాయల లభ్యత పెరగటంతో ప్రజలకు పౌష్టికాహార భద్రత చేకూరుతుందని ఈ పద్ధతిపై సుదీర్ఘ పరిశోధన చేసిన విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.కె. ఘోరాయ్ అంటున్నారు. పశ్చిమ బెంగాల్ బారక్పుర్లోని (ఐసిఎఆర్ అనుబంధ సంస్థ) సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అల్లీడ్ ఫైబర్స్ (ఐసిఎఆర్ – క్రిజాఫ్)లో ఈ పరిశోధనలు చేశారు. అధిక ఉష్ణోగ్రతల్లోనూ నిశ్చింతగా కూరగాయల దిగుబడి పొందవచ్చని ఈ పరిశోధనల్లో తేలింది.పదేళ్ల పరిశోధన2011–2021 మధ్యకాలంలో క్రిజాఫ్ ఆవరణలో, మరికొన్ని జిల్లాల్లో రబీ వరి పొలాల్లో గోనె సంచుల్లో కూరగాయలను అంతర పంటలుగా ప్రయోగాత్మకంగా సాగు చేశారు. నీరు నిల్వ ఉండే చోట నేలలో ప్రాణవాయువు లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ ద్విదళ జాతికి చెందిన కూరగాయ పంటలు సాగు చేసుకోవచ్చని తేలింది. మట్టి లోతు తక్కువగా ఉండే రాళ్ల నేలల్లో, చౌడు నేలల్లో కూడా ఈ విధంగా గోనె సంచుల్లో మట్టి మిశ్రమం నింపుకొని కూరగాయ పంటలు నిశ్చింతగా పండించుకోవచ్చు. ఎండాకాలంలో మంచి ధర పలికే టొమాటోలు, క్యారట్, ముల్లంగి, వంగ, పొద చిక్కుడు, కాళీఫ్లవర్, క్యాబేజి వంటి పంటలతో పాటు బీర, పొట్ల, సొర, ఆనప, గుమ్మడి, బూడిద గుమ్మడి వంటి తీగజాతి కూరగాయలను, కొత్తిమీర, ఉల్లి, కంద తదితర పంటలను పండించి మంచి ఆదాయం గడించవచ్చని డాక్టర్ఘోరాయ్ తెలిపారు. తీగలు పాకడానికి మూడు కర్రలు పాతి, పురికొస చుట్టి ఆసరా కల్పించాలి. వరి పంట కోసిన తర్వాత నేల మీద పాకించవచ్చు. అవసరాన్ని బట్టి తాత్కాలిక పందిరి వేసుకోవచ్చు. ఈ మడుల్లో ఒక పంట పూర్తయ్యాక మరో పంటను వేసుకోవచ్చు.గోనె సంచుల్లో సాగు ఎలా?ప్లాస్టిక్ వాడకం జోలికి పోకుండా వాడేసిన గోనె సంచిని అడ్డంగా ముక్కలుగా చేయాలి. బ్లైటాక్ నాడ్ రోగార్ కలిపిన నీటిలో గోనె సంచిని శుద్ధి చేస్తే శిలీంధ్రాలు, పురుగులను తట్టుకోవడానికి వీలుంటుంది. వాటికి నిలువుగా నిలబెట్టి, మట్టి+ సేంద్రియ ఎరువు నింపాలి. బయట ఏర్పాటు చేసి తీసుకెళ్లి పొలంలో పెట్టకూడదు. నీటిని నిల్వగట్టిన వరి పొలంలోనే వీటిని తయారు చేసుకోవాలి. గోనె అడుగున మొదట 2 అంగుళాల మందాన ఎండు వరి గడ్డి వేయాలి. దానిపై వరి పొలంలోని బురద మట్టినే 4 అంగుళాలు వేయాలి. ఆపైన మాగిన పశువుల ఎరువు లేదా ఘన జీవామృతం 2 అంగుళాల మందాన వేయాలి. ఆపైన మళ్లీ 2 అంగుళాల మందాన ఎండు వరి గడ్డి, మట్టి, ఎరువు పొరలుగా వేసి ఆపైన కొంచెం మట్టి కలపాలి. అంతే.. కూరగాయ మొక్కలు నాటడానికి గోనె సంచి మడి సిద్ధమైనట్టే. వరి గడ్డి క్రమంగా కుళ్లి పోషకాలను అందించటంతో పాటు మట్టి పిడచకట్టుకుపోకుండా గుల్లబరుస్తుంది. ఈ గోనె సంచుల మడులకు పనిగట్టుకొని నీరు పోయాల్సిన అవసరం లేదు. కాపిల్లరీ మూమెంట్ ద్వారా మట్టి అడుగున ఉన్న నీటి తేమను ఎప్పటికప్పుడు పీల్చుకొని మొక్కల వేర్లకు అందిస్తుంది. అప్పుడప్పుడూ ద్రవజీవామృతం తదితర ద్రవరూప ఎరువులను ఈ మడుల్లో పోస్తుంటే మొక్కలకు పోషకాల లోపం లేకుండా పెరిగి ఫలసాయాన్నిస్తాయి. వరి పంటను కంబైన్ హార్వెస్టర్‌తో కోత కోసే పనైతే.. అది వెళ్లడానికి వీలైనంత దూరంలో ఈ కూరగాయ మొక్కలను వరుసలుగా ఏర్పాటు చేసుకోవాలి.హెక్టారుకు 3 వేల మడులు95 సెం.మీ. పొడవుండే 50 కిలోల గోనె సంచిని అడ్డంగా 3 ముక్కలు చేసి మూడు మడులు ఏర్పాటు చేయొచ్చు. హెక్టారుకు వెయ్యి గోనె సంచులు (3 వేల మడులకు) సరిపోతాయి. మడి ఎత్తు 30 సెం.మీ. (అడుగు), చుట్టుకొలత 45 సెం.మీ. ఉంటుంది. వరిపొలంలో 5–10 సెం.మీ. లోతు నీరుంటుంది. కాబట్టి కూరగాయ మొక్కలకు ఇబ్బంది ఉండదు. హెక్టారుకు 3 వేల గోనె సంచి మడులు పెట్టుకోవచ్చు. 3వేల వంగ మొక్కల్ని లేదా 6 వేల క్యాబేజి మొక్కల్ని వేసుకోవచ్చు. సమ్మర్ కేరట్ లేదా ముల్లంగి హెక్టారుకు 30 క్వింటాళ్లు దిగుబడి తీసుకోవచ్చు. టొమాటో మొక్కకు 2 కిలోల చొప్పున హెక్టారుకు 60 క్వింటాళ్ల టొమాటోల దిగుబడి పొందవచ్చు. హెక్టారుకు 4–5 టన్నుల వరి ధాన్యానికి అదనంగా కూరగాయలను పుష్కలంగా పండించుకోవచ్చని డాక్టర్ ఘోరాయ్ వివరించారు. రబీ వరిలో అంతరపంటలుగా కూరగాయల సాగుపై మన యూనివర్సిటీలు / కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తే రైతులు అందిపుచ్చుకుంటారు. ఈ పంటల వీడియోలను డాక్టర్ ఘోరాయ్ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. నీరు నిల్వ గట్టే వరి పొలాల్లో గోనె సంచుల్లో వరుసలుగా ఈ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తే రైతుల కుటుంబాలకు, స్థానిక ప్రజలకు పుష్కలంగా కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. ఒకే స్థలంలో అవే వనరులతో వరితో పాటు అనేక రకాల కూరగాయ పంటలు పండించుకోవచ్చు. వరి రైతులు రూ;eయి అదనంగా ఖర్చుపెట్టి పది రెట్లు ఆదాయం సమకూర్చుకోవచ్చు. వరి పొలంలో నీరు నిల్వ ఉండటం వల్ల ఆరుబయట కూరగాయ తోటలతో పోల్చితే 6–8 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎండలు ముదిరిన తర్వాత కూడా కూరగాయల దిగుబడి బాగుంటుంది. వేసవిలో నీరు తదితర వనరులను మరింత ఉత్పాదకంగా వినియోగించుకోవటానికి ఈ పద్ధతి తోడ్పడుతుంది. – డాక్టర్ ఎ.కె. ఘోరాయ్, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అల్లీడ్ ఫైబర్స్ (ఐసిఎఆర్ – క్రిజాఫ్),బారక్‌పుర్, పశ్చిమ బెంగాల్. -
పుష్కలంగా కూరగాయలు కావాలా? అయితే ఇలా చేయండి!
సేంద్రియ ఆహారం ఆవశ్యకతపై వినియోగదారుల్లో పెరుగుతున్న చైతన్యంతో కిచెన్ గార్డెన్ల సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో కూరగాయలు, పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఇంటిపట్టునే 13 రకాల కూరగాయలను సేంద్రియంగా పండించుకొని తింటున్న కుటుంబాల సంఖ్య దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. పఠాన్‌చెరులోని ‘ఇక్రిశాట్’ ఆవరణలో గల వరల్డ్ వెజిటబుల్ సెంటర్ దక్షిణాసియా కేంద్రం సేంద్రియ పెరటి తోటల సాగుపై పరిశోధనలు చేపట్టింది (లాభాపేక్ష లేని ఈ సంస్థ కేంద్ర కార్యాలయం తైవాన్‌లో ఉంది). రెండు నమూనాల్లో సేంద్రియ పెరటి తోటల సాగుకు సంబంధించి ‘సెంటర్’ అధ్యయనంపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం. వరల్డ్ వెజిటబుల్ సెంటర్ జాతీయ, అంతర్జాతీయ ప్రభుత్వ / ప్రైవేటు వ్యవసాయ పరిశోధనా సంస్థలతో కలసి కూరగాయలు, మిరప వంటి పంటలపై పరిశోధనలు చేసింది. టాటా ట్రస్టులతో కలిసి 36 చదరపు మీటర్ల స్థలంలో పౌష్టిక విలువలతో కూడిన 13 రకాల సేంద్రియ కూరగాయల పెరటి తోటల (న్యూట్రి గార్డెన్స్) పై తాజాగా క్షేత్రస్థాయిలో ఈ పరిశోధన జరిగింది. కుటుంబానికి వారానికి 5.1 కిలోల (ప్రతి మనిషికి రోజుకు 182 గ్రాముల) చొప్పున.. ఏడాదికి 266.5 కిలోల పోషకాలతో కూడిన తాజా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సమకూరాయి. తద్వారా ఒక కుటుంబానికి అవసరమైన ప్రొటీన్లు 75% అందాయి. బీటా కెరొటెన్ (విటమిన్ ఎ), విటమిన్ సి అవసరానికన్నా ఎక్కువే అందాయి. 25% ఐరన్ సమకూరిందని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ తెలిపింది.జార్కండ్లో పెరటి తోటల పెంపకం ద్వారా కుటుంబాలకు కూరగాయల ఖర్చు 30% తగ్గింది. అస్సాంలో సేంద్రియ న్యూట్రిగార్డెన్ల వల్ల పది వేల కుటుంబాలు విషరసాయనాలు లేని కూరగాయలను సొంతంగానే పండించుకుంటున్నారు. మార్కెట్లో కొనటం మానేశారని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ తెలిపింది. వ్యవసాయ దిగుబడులు పెంచే పరిశోధనలతో పాటు భవిష్యత్తు తరాల ప్రజల ఆరోగ్యదాయక జీవనానికి ఉపయోగపడే క్షేత్రస్థాయి పరిశోధనలు చేస్తున్నామని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ఇండియా కంట్రీ డైరెక్టర్ అరవఝి సెల్వరాజ్ చెప్పారు. స్క్వేర్ గార్డెన్ నిర్మాణం ఎలా?గ్రామీణ కుటుంబాలకు సర్కిల్ గార్డెన్తో పోల్చితే నలుచదరంగా ఉండే స్క్వేర్ గార్డెనే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. 6 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు ఉండే స్థలాన్ని ఎంపికచేసుకొని మెత్తగా దున్నాలి. మాగిన పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువుతో వేప పిండి కలిపి చల్లితే చీడపీడలు రావు. 6-6 స్థలాన్ని 7 బెడ్స్ (ఎత్తుమడులు) గా ఏర్పాటు చేయాలి. వాటిని అడ్డంగా విభజించి 14 చిన్న మడులు చేయాలి. ఒక్కో మడిలో ఒక్కో పంట వేయాలి. పాలకూర, గోంగూర, ఉల్లి, క్యారట్, టొమాటో, బెండ, వంగ వంటి పంటలు వేసుకోవాలి. బెడ్స్ మధ్యలో అంతరపంటలుగా బంతి, మొక్కజొన్న విత్తుకుంటే రసంపీల్చే పురుగులను నియంత్రించవచ్చు. ఇంటిపంటల ఉత్పాదకత 5 రెట్లు! సేంద్రియ ఇంటిపంటలు పౌష్టిక విలువలతో కూడి సమతులాహార లభ్యతను, ఆహార భద్రతను పెంపొందిస్తున్నాయి. తాము తినే ఆహారాన్ని తమ చేతుల్లోకి తీసుకునే సామర్ధ్యాన్ని కుటుంబాలకు ఇస్తున్నాయి. ఫలితంగా మరింత సుస్థిరమైన, ఆరోగ్యదాయకమైన జీవనానికి మార్గం సుగమం అవుతోంది. ప్రణాళికాబద్ధంగా సేంద్రియ ఇంటిపంటలను వ్యక్తిగత శ్రద్ధతో సాగు చేస్తే పొలాల ఉత్పాదకతో పోల్చినప్పుడు దాదాపు 5 రెట్ల ఉత్పాదకత సాధించవచ్చు. భారత్‌లో పొలాల్లో కూరగాయల దిగుబడి హెక్టారకు సగటున 12.7 టన్నులు ఉండగా, సేంద్రియ ఇంటిపంటల ద్వారా హెక్టారుకు ఏడాదికి 73.9 టన్నుల దిగుబడి పొందవచ్చు. విస్తారమైన కూరగాయ తోటల్లో సైతం సమీకృత వ్యవసాయ పద్ధతులు పాటిస్తే రసాయనాల వినియోగం తగ్గటంతో పాటు 20% అధిక దిగుబడి పొందవచ్చు. – ఎం. రవిశంకర్, సీనియర్ హార్టీకల్చరిస్ట్, ప్రాజెక్టు మేనేజర్, వరల్డ్ వెజిటబుల్ సెంటర్, దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం, పఠాన్చెరుసర్క్యులర్ కిచెన్ గార్డెన్ ఎలా?పట్టణ ప్రాంతాల్లో స్థలం తక్కువగా ఉన్న చోట సర్క్యులర్ గార్డెన్ అనుకూలంగా ఉంటుంది. చూపులకూ ముచ్చటగా ఉంటుంది. 3 మీటర్ల చుట్టుకొలత ఉండే మడిలో 11 రకాల పంటలు పండించవచ్చు. మధ్యలో ఉండే చిన్న సర్కిల్లో కొత్తిమీర, పుదీన వంటి ఆకుకూరలు వేసుకోవచ్చు. పెద్దగా ఉండే వెలుపలి సర్కిల్లో అనేక మడులు చేసి వేర్వేరు కూరగాయ మొక్కలు వేసుకోవచ్చు. ఒక మడిలో భూసారం పెంపుదలకు వాడే పచ్చిరొట్ట పంటలు వేసుకోవాలి. చీడపీడల నియంత్రణకు పసుపు, నీలం జిగురు అట్టలు పెట్టుకోవాలి. వేపనూనె, పులిసిన మజ్జిగ పిచికారీ చేస్తుంటే తెగుళ్ల నుంచి పంటలను రక్షించుకోవచ్చు. ఈ సస్యరక్షణ చర్యల ద్వారా రసాయనిక పురుగుమందులు వాడకుండానే పంటలను రక్షించుకోవచ్చు. స్క్వేర్ గార్డెన్ దిగుబడి ఎక్కువగుండ్రంగా, దీర్ఘ చతురస్త్రాకారంలో ఉండే రెండు రకాల గార్డెన్ డిజైన్లు పెరటి కూరగాయ తోటల సాగుకు అనుకూలం. స్థలం లభ్యతను బట్టి గార్డెన్ డిజైన్‌ను ఎంపిక చేసుకోవాలి. 6 మీటర్ల చుట్టుకొలత గల సర్కిల్ గార్డెన్లో 150 రోజుల్లో 56 కిలోల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, దుంపలు పండాయి. ఎరువులు, విత్తనాలు తదితర ఉత్పాదకాల ఖర్చు రూ. 1,450. అయితే, 6“6 మీటర్ల విస్తీర్ణంలో పెరటి తోట (స్క్వేర్ గార్డెన్)లో అవే పంటలు సాగు చేస్తే 67 కిలోల దిగుబడి వచ్చింది, ఉత్పాదకాల ఖర్చు రూ. 1,650 అయ్యింది. ఈ గార్డెన్లు విటమిన్లు, ఖనిజాలు, పీచు, యాంటీఆక్సిడెంట్లతో కూడిన సమతుల ఆహారాన్ని కుటుంబానికి అందించాయి. ఆమేరకు మార్కెట్‌పై ఆధారపడకుండా రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే పౌష్టికాహారాన్ని ఆ కుటుంబం పండించుకొని తినవచ్చని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ పేర్కొంది. ఇళ్లు కిక్కిరిసి ఉండే అర్బన్ ప్రాంతాల్లో కంటెయినర్ గార్డెన్లను ఏర్పాటు చేసుకొని ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలను నగరవాసులు పండించుకోవటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. సేంద్రియ ఇంటిపంటలపై వరల్డ్ వెజిటబుల్ సెంటర్ పరిశోధన36 చ.మీ. స్థలంలో వారానికి 5.1 (ఏడాదికి 266.5) కిలోల సేంద్రియ ఆకుకూరలు, కూరగాయల దిగుబడికుటుంబానికి అవసరమైన ప్రొటీన్లు 75%, ఐరన్ 25%, పుష్కలంగా ఎ, సి విటమిన్లు(ఇతర వివరాలకు.. వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ప్రతినిధి వినయనాథ రెడ్డి 99125 44200) -
Sagubadi: వేపతో స్వయం ఉపాధి..
వారంతా వ్యవసాయం చేసుకునే సాధారణ మహిళలు.. కానీ సేంద్రియ ఉత్పత్తులు తయారుచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. వృథాగా భూమిలో కలిసి పోయే వేప గింజల నుంచి విలువైన వేప నూనె, వేప పిండిని తయారు చేసి విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి విజయ గాథలోకి వెళదాం...సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గ్ల్ గ్రామంలో సుమారు 15 మంది మహిళలు మూడు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడ్డారు. ఐదుగురికి ఒక్కో యూనిట్ చొప్పున మూడు యూనిట్లు స్థాపించుకున్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలోని వివిధప్రాంతాలకు వెళ్లి వేప గింజలను కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటారు. ఇటు వ్యవసాయం చేసుకుంటూనే సమయం దొరికినప్పుడు వేప నూనె, వేప పిండిని తయారు చేస్తున్నారు.ఏటా వేప చెట్లకు కాసే వేప కాయలు పండి రాలిపోతుంటాయి. ఇలా రాలిపోయిన గింజలను ఆయాప్రాంతాల్లోని మహిళలు, గిరిజనులు సేకరిస్తుంటారు. ఇలా సేకరించి తెచ్చిన గింజలకు అంటుకున్న మట్టిని తొలగించి, ఎండబెట్టి ్రపాసెస్ చేస్తుంటారు. క్వింటాలు గింజలకు ఐదు లీటర్ల వరకు వేప నూనె, 70 నుంచి 90 కిలోల వరకు నూనె తీసిన వేప పిండి (కేకు) తయారవుతుంది. గింజల నాణ్యత బాగుంటే నూనె కాస్త ఎక్కువ వస్తుంది. వేప నూనెను వ్యవసాయంలో పంటలపై చీడపీడల నివారణకు పిచికారీ చేస్తుంటారు. ఔషధాల తయారీకి, చర్మవ్యాధుల నివారణకూ వాడుతుంటారు. వేప పిండిని పంటల సాగులో సేంద్రియ ఎరువుగా వినియోగిస్తుంటారు. వివిధ జిల్లాల్లో సేంద్రియ సాగు చేసే రైతులు వచ్చి కొనుగోలు చేసుకొని తీసుకెళుతుంటారు. ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ తీసుకొని ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపుతున్నారు.దారి చూపిన డీడీఎస్..చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటలు సాగు చేసే సేంద్రియ రైతులను ప్రోత్సహించే స్వచ్చంద సంస్థ డక్కన్ డవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) వీరికి వేప కాయలతో సేంద్రియ ఉత్పత్తుల తయారీ పద్ధతిని నేర్పించింది. సుమారు రెండు దశాబ్దాల క్రితమే వేప గింజల నుంచి నూనె, వేప పిండి తీసే యంత్రాల కొనుగోలు చేసేందుకు రుణ సహాయం అందించింది. ఇప్పుడు ఆ యంత్రాలు పనిచేయడం లేదు. అప్పటి మహిళలకు వయస్సు మీద పడటంతో వారి కోడళ్లు, కూతుళ్లు ఈ యూనిట్లను నడుపుతున్నారు. పాతయంత్రాలు పనిచేయకపోవడంతో కొత్త యంత్రాలను కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం బ్యాంకుల ద్వారా కొంత మొత్తాన్ని రుణంగా పొందారు. ఈ రుణంపై వడ్డీలు పెరిగిపోతుండటం తమకు భారంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ రుణాలను మాఫీ చేసిప్రోత్సహించాలని, లేదంటే కనీసం రుణంపై వడ్డీనైనా మాఫీ చేయాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. – పాత బాలప్రసాద్, సాక్షి, మెదక్ జిల్లా ఫొటోలు: మాతంశెట్టి మల్లన్న, జహీరాబాద్ టౌన్అప్పు భారమైంది..ఇటు వ్యవసాయం పని చేసుకుంటూనే ఏడాదిలో 6నెలల పాటు వేప నూనె, వేప చెక్క (కేక్) తయారు చేస్తున్నాం. మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలి. ఎక్కువ ధర వచ్చేలా చూడాలి. ప్రస్తుతం సరైన మార్కెట్ లేకపోవడంతో చేసిన కష్టమంతా వృథా అవుతోంది. బ్యాంకు రుణాలను వడ్డీతో కలిపి చెల్లిస్తే మాకు ఏమీ మిగలడం లేదు. బ్యాంకు రుణం రద్దు చేయాలి. కనీసం వడ్డీ అయినా రద్దు చేయాలి. – దవలమ్మ, స్వయం సహాయక బృందం సభ్యురాలుఆర్టీసీ కార్గో ద్వారా పంపుతాం..జడ్చర్ల, కోస్గి వంటిప్రాంతాలకు వెళ్లి వేపగింజలను కొనుగోలు చేసి తెచ్చుకొని వేప నూనె, వేప చెక్క తయారు చేస్తున్నాం. ఇప్పుడు గింజలు దొరకడం కష్టమవుతోంది. ఏడాదిలో ఆరు నెలలు ఈ పనే చేస్తున్నాం. వేప గింజల రేట్లు పెరిగినా వేప నూనె (కిలో రూ.400), వేప చెక్క/కేక్ (కిలో రూ. 35) రేటు పెంచలేదు. వివిధ జిల్లాల్లో సేంద్రియ సాగు చేసే రైతులు ఇక్కడి వచ్చి కొనుగోలు చేసుకొని తీసుకెళుతుంటారు. ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ తీసుకొని ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపుతున్నాం. – సువర్ణమ్మ (88979 04571), స్వయం సహాయక బృందం సభ్యురాలు -
సేంద్రీయ వ్యవసాయం : ఏడాది పొడవునా ఆదాయం!
ఆ రైతు క్షేత్రం దట్టమైన ఆహారపు అడవిపదేళ్లుగా పాలేకర్ పద్థతిలో గడ్డి మందు సహా, 100% రసాయనాల్లేని సాగు 20 ఎకరాల్లో లక్ష్మణ ఫలం నుంచి అవకాడో వరకు పండ్లు, కూరగాయల సాగుపంటలతో పాటు గొర్రెలు, నాటుకోళ్లు, చేపల పెంపకంతో నిరంతరాదాయం ఆదర్శంగా నిలుస్తున్న మాజీ ప్రభుత్వాధికారి అంజిరెడ్డి సేద్యంఏదుళ్ల అంజిరెడ్డి 2013లో హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత నేలతల్లికి ప్రణమిల్లి ప్రకృతి వ్యవసాయదారుడిగా మారారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో అన్ని సంపదల్లో కెల్లా ఆరోగ్య సంపద గొప్పదని భావించి కార్యాచరణకు ఉపక్రమించారు. నల్లగొండ సమీపంలోని చర్లపల్లి వద్ద తన 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని దట్టమైన ఆహారపు అడవిగా మార్చారు. తొలుత కుటుంబ అవసరాల కోసం పురుగుమందుల అవశేషాలు లేని పండ్లు, కూరగాయలు సాగు చేయనారంభించి.. వ్యవసాయాన్ని క్రమంగా 20 ఎకరాలకు విస్తరించారు.మామిడి నుంచి అవకాడో వరకు 11 రకాల పండ్లతో పాటు 10 రకాల పంటలను సాగు చేస్తున్నారు. శ్రీగంధం, ఎర్రచందనం, చింత, రావి, వెదురు, సరుగుడు, మహాగని మొక్కల్ని నాటారు. బహురూపి దేశీవరిని సాగు చేస్తున్నారు. గత పదేళ్లుగా భూసారం సమృద్ధిగా వృద్ధి చెందటం ఆ వ్యవసాయ క్షేత్రంలో కనిపిస్తుంది. ఆరోగ్యంగా పెరుగుతూ పచ్చగా ఉన్న తోటలో అనేక చోట్ల పుట్టలు కనిపిస్తాయి. పంటలతో పాటే గొర్రెలు, కోళ్లు..ఏ చెట్టు కింద మట్టిని తీసినా వానపాములు ఉంటాయి. పండ్లు, కూరగాయల సాగే కాకుండా 500కు పైగా గొర్రెలతో అధునాతన ఫామ్‌ను అంజిరెడ్డి గత రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. గొర్రెల మేత కోసం ఆరోగ్యవంతమైన గడ్డిని పెంచుతున్నారు. తోటలో నాటు కోళ్లను పెంచి గుడ్లను అమ్ముతున్నారు. సీమ కోళ్లు, బాతులు ఉన్నాయి. ఈ సమీకృత వ్యవసాయ క్షేత్రంలోని చిన్న కొలనులో కొర్రమీను చేపలనూ పెంచుతున్నారు. డ్రిప్ ద్వారా ద్రవ జీవామృతాన్ని చెట్లు, మొక్కలకు అందిస్తున్నారు. భూమిని దున్నకుండా అవసరం ఉన్న చోటనే పరిమితంగా దున్ని కూరగాయలను సాగు చేస్తుండటం విశేషం. క్రిమికీటకాల నివారణకు వేప నూనెను స్ప్రే చేస్తున్నారు.నేరుగా అమ్మకాలుతన సమీకృత వ్యవసాయ క్షేత్రం దగ్గర, నల్లగొండలోని తన నివాసం వద్ద పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లను ప్రజలకు నేరుగా విక్రయిస్తూ ఏడాది పొడవునా ఆదాయం పొందుతున్నారు అంజిరెడ్డి. కలుపు మందు సహా ఏ రసాయనాలు వాడకుండా సాగు చేస్తున్నందున దిగుబడుల నాణ్యతను గుర్తించిన నల్గొండ నగర ప్రజలు వచ్చి కొనుక్కెళ్తున్నారు. కూరగాయలు ఏ రకం అయినా కిలో రూ.80 చొప్పున అమ్ముతున్నారు. కేజీ రూ.420 లెక్కన గొర్రెలను విక్రయిస్తున్నారు. నాటు కోడిగుడ్డు రూ.15, జామ కాయలు కిలో రూ.60, సపోట కిలో రూ.40, నిమ్మ వేసవిలో కిలో రూ.100, వానాకాలంలో కిలో రూ.50, బత్తాయి కిలో రూ.80, మామిడి రూ.100 – 150, కూర అరటి డజన్ రూ.70, అరటి పండ్లు డజన్ రూ.80, నెయ్యి కిలో రూ. 1,200, ΄ాలు లీ. రూ.80 చొప్పున విక్రయిస్తూ అంజిరెడ్డి రోజూ ఆదాయం పొందుతున్నారు. మొత్తంగా 20 ఎకరాలలో ఖాళీ స్థలం లేకుండా బహుళ పంటలను సాగు చేస్తూ.. జీవాలు, కోళ్లను పెంచుతుండటంతో అంజిరెడ్డి క్షేత్రం ఏడాది పొడవునా దిగుబడులనిచ్చే అక్షయపాత్రగా మారింది. – కుంభం వెంకటేశ్వర్లు గౌడ్, సాక్షి, నల్లగొండ రూరల్ ఫొటోలు: కంది భజరంగ్ ప్రసాద్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ప్రతి రైతూ కుటుంబం కోసమైనా రసాయనాల్లేకుండా పండించాలిభూసారాన్ని కాపాడుకుంటే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే. క్యాన్సర్, గుండె΄ోటు, బీపీ, షుగర్ వంటి అనేక రకాల వ్యాధులు రావడానికి రసాయనాలతో పండించిన ఆహరమే కారణం అని గ్రహించాను. రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని మా కుటుంబంతో పాటు ప్రజలకూ అందించటం కోసమే రైతుగా మారాను. ప్రతి రైతూ మిశ్రమ పంటలను తన కుటుంబ అవసరాల కోసమైనా రసాయనాలు లేకుండా సాగు చేసుకోవాలి. విద్యార్థులకు ఇటువంటి వ్యవసాయ క్షేత్రాలు చూపిస్తే వారిలో ప్రకృతి సేద్యంపై, ఆరోగ్యదాయకమైన ఆహారంపై అవగాహన పెరుగుతుంది. రైతు కుటుంబ నేపధ్యం ఉన్న వారు భవిష్యత్తులో వ్యవసాయాన్ని వృత్తిగా చేపడతారన్న ఆశతో క్షేత్ర పరిశీలనకు వచ్చిన విద్యార్థులకు వ్యవసాయం గురించి వివరిస్తున్నా. – ఏదుళ్ల అంజిరెడ్డి (99482 55544), ప్రకృతి వ్యవసాయదారుడు, నల్గొండ -
సేంద్రియ సేద్యంపై 21 రోజుల ఉచిత శిక్షణా శిబిరం..
సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలో ఇమిడి ఉండే అన్ని అంశాలతో పాటు పిజిఎస్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ విషయాలపై పూర్తిస్థాయి శిక్షణ పొందాలనుకునే తెలుగు వారికి ఇదొక గొప్ప అవకాశం. సేంద్రియ/ప్రకృతి సేద్యంలో అన్ని విషయాలతో పాటు పిజిఎస్ సర్టిఫికేషన్‌పై లోతైన అవగాహన కల్పించేందుకు 21 రోజుల పాటు తెలుగులో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణా శిబిరం జరగనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్/నేచురల్ ఫార్మింగ్ (ఎన్సిఓఎన్ఎఫ్) తోడ్పాటుతో సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ), కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రోఎకాలజీ (కెఎస్ఎ) సెప్టెంబర్ 5 నుంచి ఉమ్మడిగా ఈ శిబిరాన్ని నిర్వహించనున్నాయి. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, సిఎస్ఎ, కెఎస్ఎల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం జరగనుండటం విశేషం.విజయవాడకు 50 కిమీ దూరంలో ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సమీపంలో శ్రీపద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ నెలకొల్పిన కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రోఎకాలజీ ఆవరణలో ఈ శిబిరం జరగనుంది. 38 ఎకరాలలో అత్యాధునిక సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేస్తూ ఆచణాత్మక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటైన కెఎస్ఎకు సుస్థిర వ్యవసాయ కేంద్రం నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఈ 21 రోజుల శిబిరంలో బోధన పూర్తిగా తెలుగులో ఉంటుంది. శిక్షణ, భోజన వసతులు ఉచితం. అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. 30 మందికి అవకాశం.సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలోను, సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపారంలోను స్థానికంగా కీలక పాత్ర పోషించాలన్న ఆసక్తి, నిబద్ధత కలిగిన వారికి సంపూర్ణ అవగాహన కలిగించేందుకే ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు డా. రామాంజనేయులు వివరించారు. స్థానిక స్వయం సహాయక బృందాలు/ ఎఫ్పిఓలు / ఐసిఎస్/ ఆత్మ, పికెవివై, నామని గంగే లేదా ఏదైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సేంద్రియ వ్యవసాయ పథకాలలో నమోదైన వారికి ్రపాధాన్యం ఉంటుందన్నారు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. గూగుల్ ఫామ్‌లో వివరాలు పొందుపరచటం ద్వారా ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 85002 83300. జుట్చఃఓటజీటజిn్చ uఛీజ్చిఅఛ్చిఛ్ఛీఝy.ౌటజముచ్చింతల్లో ‘సిరిధాన్యాలతో జీవన సిరి’ శిబిరం..రైతునేస్తం ఫౌండేషన్, స్వర్ణభారత్ ట్రస్ట్ సహకారంతో.. కర్షక సేవా కేంద్రం నిర్వహణలో హైదరాబాద్ సమీపంలో ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో సిరిధాన్యాలతో జీవన సిరి అనే అంశంపై ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్‌వలి, డా. సరళా ఖాదర్లచే ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. 3 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇతర వివరాలకు.. 97053 83666, 70939 73999. -
తిరుపతిలో 3,4 తేదీల్లో.. ఆర్గానిక్ ఉత్పత్తుల మేళా!
ఆగస్టు 3, 4 తేదీల్లో తిరుపతిలోని తుడా బిల్డింగ్ వెనుక గల కచ్ఛపీ కళాక్షేత్రంలో ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులు, చేనేత వస్త్రాల మేళాను కనెక్ట్ టు ఫార్మర్స్ సంస్థ నిర్వహించనుంది. ఉ. 11 గం. నుంచి రాత్రి 8 వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 3వ తేదీ(శనివారం) ఉ. 11 గం.కు ప్రకృతి వనం వ్యవస్థాపకులు ఎంసీవీ ప్రసాద్ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారు. దేశవాళీ వరి విత్తన ప్రదర్శన ్రపారంభం. 4(ఆదివారం)న ఉ. 10.30 గం.కు దేశవాళీ వరి విత్తన పరిరక్షణ ్రపాముఖ్యతపై అక్బర్, బాపన్న అవగాహన కల్పిస్తారు. మట్టి వినాయక బొమ్మల తయారీపై శిక్షణ ఉంటుంది.హైదరాబాద్‌లో పాలేకర్‌తో చర్చాగోష్టి నేడు..సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో పర్యావరణ హితమైన అల్కలైన్ ఆహారోత్పత్తుల ఉత్పత్తి, మార్కెటింగ్ తదితర అంశాలపై ఈ నెల 30 (మంగళవారం)న హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో తెలుగు రాష్ట్రాల రైతులు, సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు, రచయితలు, వైద్యులు, పాత్రికేయులతో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ చర్చాగోష్టి జరగనుంది. ఈ నెల 30(మంగళవారం)న మధ్యాహ్నం 3–6 గంటల మధ్య జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఫిలింనగర్ క్లబ్)లో చర్చాగోష్ఠి జరుగుతుందని నిర్వాహకులు వి.నరసింహారెడ్డి (98662 46111), నరేశ్ (99481 58570), విజయరామ్ (63091 11427) తెలిపారు. పాలేకర్ ఆంగ్ల ప్రసంగాన్ని అప్పటికప్పుడు తెలుగులోకి అనువదిస్తారు. ప్రవేశం ఉచితం.4న మిరప, అపరాల సేంద్రియ సాగుపై శిక్షణ..సేంద్రియ పద్ధతిలో మిరప, అపరాల సాగు, వివిధ రకాల కషాయాలపై ఆగస్టు 4 (ఆదివారం) ఉ. 10 గంటల నుంచి హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆవరణలో రైతులకు నాగర్‌కర్నూల్‌కు చెందిన సీనియర్ ప్రకృతి వ్యవసాయదారు లావణ్యా రెడ్డి శిక్షణ ఇస్తారని నిర్వాహకులు, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 95538 25532ఇవి చదవండి: 'ఇండ్ గ్యాప్' సాగు బాట.. రసాయనాల్లేని పంట! -
బయోచార్ కంపోస్టు.. నిజంగా బంగారమే!
– వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే క్రమంలో ఇటీవల అందుబాటులోకి వస్తున్న ఒక పద్ధతి ‘బయోచార్’ వినియోగం. దీన్నే మామూలు మాటల్లో ‘కట్టె బొగ్గు’ అనొచ్చు. పంట వ్యర్థాలతో రైతులే స్వయంగా దీన్ని తయారు చేసుకొని పొలాల్లో వేసుకోవచ్చు.– బయోచార్ ఎరువు కాదు.. పంటలకు వేసే రసాయనిక ఎరువులు గానీ, సేంద్రియ ఎరువులు గానీ కనీసం 30–40% ఎక్కువ ఉపయోగపడేందుకు బయోచార్ ఉపయోగపడుతుంది అంటున్నారు స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి.– మట్టిలో పేరుకుపోయిన రసాయనిక అవశేషాలను తొలగించడానికి, వరిసాగులో మిథేన్ వాయువు కాలుష్యాన్ని తగ్గించడానికి బయోచార్ తోడ్పడుతుంది.– ఒక్కసారి వేస్తే వందల ఏళ్లు నేలలో ఉండి మేలు చేస్తుంది.. సీజనల్ పంటలకైనా, పండ్ల తోటలకైనా బయోచార్ నిజంగా బంగారమే అంటున్న డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డితో ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖి.బయోచార్.. ఈ పేరు చెప్పగానే ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి(55) పేరు చప్పున గుర్తొస్తుంది. 20 ఏళ్ల క్రితం నుంచి ‘బయోచార్’ అనే పేరును ఖరారు చేసి.. వ్యవసాయకంగా, పర్యావరణపరంగా దీని ప్రయోజనాల గురించి దేశ విదేశాల్లో విస్తృతంగా పరిశోధనలు, క్షేత్ర ప్రయోగాలు చేస్తూ ఇప్పటికి 5 పుస్తకాలను వెలువరించారు. వెబ్సైట్ ద్వారా ఈ ఓపెన్ సోర్స్ పుస్తకాలను అందుబాటులో ఉంచారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసంగాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఆయనతో ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..బయోచార్ (కట్టె బొగ్గు) అంటే..?వ్యవసాయ వర్గాల్లో ఈ మధ్య తరచూ వినవస్తున్న మాట బయోచార్. బయో అంటే జీవం.. చార్ (చార్కోల్) అంటే బొగ్గు. బయోచార్ అంటే ‘జీవం ఉన్న బొగ్గు’ అని చెపొ్పచ్చు. భూసారానికి ముఖ్యమైనది సేంద్రియ కర్బనం. ఇది మట్టిలో స్థిరంగా ఉండదు. అంటే ఇది అస్థిర కర్బనం (ఒలేటైల్ కార్బన్). దీన్ని పెంపొందించుకోవటానికి ఫిక్స్డ్ కార్బన్ ఉపయోగపడుతుంది. అదే బయోచార్.బయోచార్ కోసం కట్టెలు కాలబెట్టడం వల్ల అడవులకు, పర్యావరణానికి ముప్పు లేదా?బొగ్గు నల్ల బంగారంతో సమానం. బంగారం అని ఎందుకు అన్నానంటే.. ప్రపంచంలో తయారు చేయలేనిది, డబ్బుతో కొనలేనిది మట్టి ఒక్కటే. హరిత విప్లవం పేరుతో మట్టిని మనం నాశనం/ విషతుల్యం/ నిర్జీవం చేసుకున్నాం. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం బయోచార్. అడవులను నరికి బయోచార్ తయారు చేయమని మనం చెప్పటం లేదు. పత్తి కట్టె, కంది కట్టె, వరి పొట్టు వంటి పంట వ్యర్థాలను వట్టిగానే తగులబెట్టే బదులు వాటితో బయోచార్ తయారు చేసుకోవచ్చు. వూరికే పెరిగే సర్కారు తుమ్మ వంటి కంప చెట్ల కలపతో లేదా జీడి గింజల పైపెంకులతో కూడా బయోచార్ తయారు చేసుకోవచ్చు. వరి పొట్టును బాయిలర్లలో, హోటళ్ల పొయ్యిల్లో కాల్చిన తర్వాత మిగిలే వ్యర్థాలను కూడా బయోచార్గా వాడుకోవచ్చు.పరిమితంగా గాలి సోకేలా లేదా పూర్తిగా గాలి సోకకుండా ప్రత్యేక పద్ధతిలో, పెద్దగా పొగ రాకుండా, 450 నుంచి 750 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో కాల్చితే (ఈ ప్రక్రియనే ‘పైరోలిసిస్’ అంటారు) తయారయ్యే నల్లని కట్టె బొగ్గే బయోచార్. ఆరుబయట కట్టెను తగుటబెడితే బూడిద మిగులుతుంది. ఈ పద్ధతిలో అయితే బూడిద తక్కువగా బయోచార్ ఎక్కువగా వస్తుంది. రైతు స్థాయిలో ఇనుప డ్రమ్ములో లేదా కందకం తవ్వి కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. బయోచార్ వందల ఏళ్ల ΄ాటు మట్టిలో ఉండి మేలుచేసే సూక్ష్మజీవరాశికి, పోషకాలకు, మొత్తంగా పర్యావరణానికి ఎంతగానో తోడ్పడుతుంది. సాగు నీటిలో విషాలను పరిహరిస్తుంది. దీనితో వ్యవసాయంలో కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలతో పోల్చితే.. దీన్ని తయారు చేసేటప్పుడు వెలువడే కొద్ది΄ాటి పొగ వల్ల కలిగే నష్టం చాలా తక్కువ.‘బయోచార్ కంపోస్టు’ అంటే ఏమిటి?బయోచార్ అంటే.. పొడిగా ఉండే కట్టె బొగ్గు. దీన్ని నేరుగా పొలాల్లో వేయకూడదు. బయోచార్ కంపోస్టు తయారు చేసుకొని వేయాలి. చిటికెడు బొగ్గులో లెక్కలేనన్ని సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. నేరుగా వేస్తే మట్టిలోని పోషకాలను బొగ్గు పెద్దమొత్తంలో పీల్చుకుంటుంది. అందువల్ల వట్టి బయోచార్ను మాత్రమే వేస్తే పంటకు పోషకాలు పూర్తిగా అందవు. అందుకనే. వట్టి బయోచార్ను కాకుండా బయోచార్ కంపోస్టును తయారు చేసుకొని వేస్తే ఈ సమస్య ఉండదు.మాగిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు లేదా బయోగ్యాస్ స్లర్రీ లేదా జీవామృతం లేదా పంచగవ్య వంటి.. ఏదైనా సేంద్రియ ఘన/ ద్రవరూప ఎరువులలో ఏదో ఒకదాన్ని బయోచార్ను సమ΄ాళ్లలో కలిపి కుప్ప వేసి, బెల్లం నీటిని చిలకరిస్తూ రోజూ కలియదిప్పుతూ ఉంటే 15 రోజుల్లో బయోచార్ కంపోస్టు సిద్ధం అవుతుంది. అప్పుడు దీన్ని పొలాల్లో వేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. మన పొలంలో మట్టి గుణాన్ని బట్టి తగిన మోతాదులో వేసుకోవటం ముఖ్యం. బయోచార్ ఒకటి రెండు సీజన్లలో ఖర్చయిపోయే ఎరువు వంటిది కాదని రైతులు గుర్తుంచుకోవాలి. వంద నుంచి వెయ్యేళ్ల వరకు నేలలో స్థిరంగా ఉండి మేలు చేస్తుంది.రసాయనిక ఎరువులు వాడే రైతులకు కూడా బయోచార్ ఉపయోగపడుతుందా? బయోచార్ సేంద్రియ ఎరువులు లేదా రసాయనిక ఎరువులు వాడే రైతులు కూడా వాడుకోవచ్చు. కట్టెబొగ్గుతో యూరియా, ఫాస్పేటు వంటి వాటిని కలిపి వేసుకోవచ్చు. వట్టిగా యూరియా వేస్తే 20–30 శాతం కన్నా పంటకు ఉపయోగపడదు. అదేగనక బయాచార్తో యూరియా కలిపి వేస్తే 30–40% ఎక్కువగా పంటకు ఉపయోగపడుతుంది. బొగ్గులోని ఖాళీ గదులు ఉంటాయి కాబట్టి యూరియాను కూడా పట్టి ఉంచి, ఎక్కువ రోజుల ΄ాటు పంట మొక్కల వేర్లకు నెమ్మదిగా అందిస్తుంది.వరి సాగుకూ ఉపయోగమేనా?వరి పొలాల్లో నీటిని నిల్వగట్టే పద్ధతి వల్ల మిథేన్ వంటి హరిత గృహ వాయువులు గాలిలో కలుస్తూ వాతావరణాన్ని అమితంగా వేడెక్కిస్తున్నాయి. రసాయనిక ఎరువులు వాడే పొలాల వాయుకాలుష్యం మరింత ఎక్కువ. ఈ పొలాల్లో బయోచార్ వేస్తే.. నీటి అడుగున మట్టిలో ఆక్సిజన్‌ను లభ్యత పెరుగుతుంది. మిథేన్ తదితర హరిత గృహ వాయువులను బొగ్గు పీల్చుకుంటుంది. కాబట్టి, వాతావరణానికి జరిగే హాని తగ్గుతుంది. అందుకనే బయోచార్ వాడితే కార్బన్ క్రెడిట్స్ పేరిట డబ్బు ఇచ్చే పద్ధతులు కూడా సమీప భవిష్యత్తులోనే అమల్లోకి రానున్నాయి.బయోచార్‌పై మరింత సమాచారం కోసం చూడండి.. www.youtube.com/@biocharchannelhttps://biochared.comఏ పొలానికి ఎంత వెయ్యాలో తెలిసేదెలా?మీ భూమికి ఖచ్చితంగా ఎంత మొత్తంలో బయోచార్ కంపోస్టు వేస్తే సరిపోయేదీ ఒక టెస్ట్ ద్వారా మీరే స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ విషయం ఎవరినో అడిగితే తెలియదు. మీ పొలంలో ఎత్తయిన ప్రదేశంలో 5 చిన్న మడులు చేసుకొని, వాటిల్లో బయోచార్ కంపోస్టును వేర్వేరు మోతాదుల్లో వేసి.. ఆ 5 మడుల్లోనూ ఒకే రకం పంటను సాగు చేయండి. 3 నెలల్లో మీకు ఫలితం తెలిసిపోతుంది. 1 చదరపు మీటరు విస్తీర్ణం (ఈ విసీర్ణాన్ని మీరే నిర్ణయించుకోండి)లో పక్క పక్కనే 5 మడులు తయారు చేసుకోండి. అంటే.. మొత్తం 5 చ.మీ. స్థలం కేటాయించండి. ఒక్కో దాని మధ్య గట్టు మాత్రం ఎత్తుగా, బలంగా వేసుకోండి.1వ మడిలో బయోచార్ కంపోస్టు అసలు వెయ్యొద్దు. 2వ మడిలో బయోచార్ కంపోస్టు 0.5 కిలో, 3వ మడిలో 1 కిలో, 4వ మడిలో 2 కిలోలు, 5వ మడిలో 4 కిలోలు వెయ్యండి. ఈ 5 మడుల్లో 3 నెలల్లో చేతికొచ్చే ఒకే రకం పంట విత్తుకోండి లేదా కూరగాయ మొక్కలు నాటుకోండి.– బయోచార్ కంపోస్టుపై శిక్షణ ఇస్తున్న డా. సాయి భాస్కర్ రెడ్డిబయోచార్ కంపోస్టు విషయంలో వత్యాసాలు ΄ాటించి చూడటం కోసమే ఈ ప్రయోగాత్మక సాగు. ఇక మిగతా పనులన్నీ ఈ మడుల్లో ఒకేలా చేయండి. అంటే నీరు పెట్టటం, కలుపు తీయటం, పురుగుమందులు లేదా కషాయాలు పిచికారీ చేయటం అన్నీ ఒకేలా చెయ్యండి.ఆ పంటల్లో పెరిగే దశలో వచ్చే మార్పులన్నిటినీ గమనించి, రాసుకోండి. ప్రతి వారానికోసారి ఫొటోలు/వీడియో తీసి పెట్టుకోండి. కాండం ఎత్తు, లావు, పిలకలు/కొమ్మల సంఖ్య, పూత, దిగుబడి, గింజ/కాయల సైజు, ఆ మొక్కల వేర్ల పొడవు వంటి అన్ని విషయాలను నమోదు చేయండి. 3 నెలల తర్వాత ఆ పంట పూర్తయ్యే నాటికి బయోచార్ కంపోస్టు అసలు వేయని మడితో వేర్వేరు మోతాదుల్లో వేసిన మడుల్లో వచ్చిన దిగుబడులతో పోల్చిచూడండి. బయోచార్ కంపోస్టు ఏ మోతాదులో వేసిన మడిలో అధిక దిగుబడి వచ్చిందో గమనించండి. ఇదే మోతాదులో మీ పొలం అంతటికీ వేసుకోండి. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
ఈ వేసవిలో ఎల్‌నినో పుణ్యాన సాధారణం కన్నా ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్నిప్రాంతాల్లోనూ ఉద్యాన తోటలు సాగు చేసే రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా సీజనల్ పండ్ల తోటలైన మామిడి, జామతో పాటు కూరగాయలు, డ్రాగన్ వంటి తోటలకు నిప్పుల కుంపటి వంటి వేడి ఒత్తిడి తీవ్ర సమస్యగా మారింది.47 డిగ్రీలకు చేరిన పగటి గరిష్ట ఉష్ణోగ్రత వల్ల భూమి విపరీతంగా వేడెక్కి రాత్రి 7–8 గంటల వరకు శగలు కక్కుతూ ఉంది. దీన్నే ‘రిఫ్లెక్టెడ్ రేడియేషన్’ అంటారు. పొలాల్లో కన్నా కాంక్రీటు అరణ్యాలుగా మారిన నగరాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. చెట్లు, మొక్కలు వేర్ల ద్వారా తీసుకునే నీటి కన్నా ఎక్కువగా నీరు ఆవిరైపోతుండటం వల్ల లేత ఆకుల చివర్లు ఎండిపోతున్నాయి. లేత కణాలు ఉంటాయి కాబట్టి లేత ఆకుల చివరలు మాడిపోతున్నాయి.పగటి గరిష్ట ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీల సెల్షియస్ వరకు ఉన్న వాతావరణం పంటల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. 40 డిగ్రీలు దాటిన తర్వాత పంటలు, తోటలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇప్పుడు 47–48 డిగ్రీల సెల్షియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో కూరగాయ పంటలు, పండ్ల తోటలు సన్ బర్న్‌తో సతమతమవుతూ ఉన్నాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం మాజీ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ పీవీ రావు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.సాధారణంగా ఎండను రక్షణకు కొన్ని పంటలపై 50% సూర్యరశ్మిని ఆపే గ్రీన్ షేడ్‌నెట్‌ను వాడుతుంటారు. అయితే, ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోవటం వల్ల 80% ఎండను ఆపే గ్రీన్ షేడ్నెట్లు వేసుకోవాల్సి వస్తోందని డా.పివి రావు అన్నారు.సన్‌బర్న్‌కు గురైన మామిడి కాయసూర్యకాంతి తీవ్రత..పంటలపై ప్రతికూల ప్రభావం ఎంతగా ఉందన్నది ఉష్ణోగ్రతతో పాటు సూర్యకాంతి తీవ్రత (లైట్ ఇంటెన్సిటీ)పై కూడా ఆధారపడి ఉంటుందని డా. రావు వివరించారు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్న రోజుల్లో చదరపు మీటరుకు 20,000 – 25,000 కిలో లక్స్ వరకు సూర్యకాంతి ఉంటుంది. వేసవిలో సాధారణంగా ఇది 80,000 కిలో లక్స్‌కు పెరుగుతూ ఉంటుంది. అయితే, ఈ ఏడాది ఇది విపరీతంగా పెరిగి, ఏకంగా 1,20,000 కిలో లక్స్‌కు చేరటం పండ్ల తోటలకు, కూరగాయల పంటలకు ముప్పుగా మారిందని డాక్టర్ పి వి రావు తెలిపారు.ఫొటో ఆక్సిడేషన్ వల్ల ఆకులలో కిరణజన్య సంయోగ క్రియ సజావుగా జరగటం లేదు. లేత ఆకుల్లో క్లోరోఫిల్ మాలిక్యూల్ చిట్లి పోవటం వల్ల ఆకుపచ్చగా ఉండాల్సిన ఆకులు జీవం కోల్పోయి పసుపు రంగుకు మారి ఎండిపోతున్నాయన్నారు.తారస్థాయికి చేరిన యువి రేడియేషన్..అతినీలలోహిత కిరణాల (యువి) రేడియేషన్ సూచిక సాధారణంగా 3–4 వరకు ఉంటుంది. వేసవిలో ఈ సూచిక 8–9 వరకు పెరుగుతుంది. అయితే, ఈ ఏడాది మాత్రం ఇది 12కు పెరగటంతో సూర్యరశ్మిని పంటలు, తోటలు తట్టుకోలేకుండా ఉన్నాయని డా. పి వి రావు వివరించారు. మామిడి, జామ తదితర కాయలు ఎండ పడిన చోట ఎర్రగా మారి దెబ్బతింటున్నాయి. వెనుక వైపు పచ్చిగానే ఉంటూ ఎండ సోకిన దగ్గర రంగు మారుతుండటంతో పండ్లు నాణ్యతను కోల్పోతున్నాయి. అల్ఫాన్సో, పచ్చడి రకాల మామిడి కాయలు బాగా రాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.సన్‌బర్న్‌కు గురైన జామ కాయ, - సన్‌బర్న్‌కు గురైన డ్రాగన్ పంట పోషకాలు, హార్మోన్ అసమతుల్యత..వేసవిలో టొమాటో, మిర్చి వంటి కూరగాయ పంటల మొక్కలు నాటుకునేటప్పుడు వీటికి ఉత్తర, దక్షిణ వైపున నీడనిచ్చే మొక్కలను వేసుకుంటే ఎండ బారి నుంచి కొంత మేరకు కాపాడుకోవచ్చు. ఉదాహరణకు.. టొమాటో మొక్కలు ఉత్తర దక్షిణాల్లో మొక్కజొన్న లేదా ఆముదం మొక్కలు వత్తుకోవాలి. వడగాలుల నుంచి పంటలను రక్షించుకోవటానికి పొలం సరిహద్దుల్లో విండ్ బ్రేకర్‌గా పనికొచ్చే ఎత్తయిన చెట్లు పెంచుకోవాలి. ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న వారి తోటలు ఉపశమనం పొందుతాయి.దాదాపు మరో నెల రోజులు మండే ఎండలు కొనసాగే పరిస్థితి ఉండటంతో తోటలకు చాలినంతగా నీటి తడులు ఇవ్వటంతో పాటు, చెట్లపైన కూడా సాయంత్రం 3 గంటల తర్వాత నీటిని పిచికారీ చేయాలి. వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ నేల నుంచి వేర్ల ద్వారా పోషకాలను తీసుకునే సామర్ద్యం తగ్గుతుందని, అందుకు తగినట్లు నీరు, పోషకాలు సైతం అందిస్తే తోటలకు ఉపశమనం కలుగుతుందని డాక్టర్ పివి రావు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కాలంలో పంటలు పోషకాలను నేల నుంచి తీసుకోవటంలో ఇబ్బంది వస్తుంది. జింక్ లోపం ఏర్పడుతుంది. హోర్మోన్లను కూడా చెట్లు, మొక్కలు తయారు చేసుకోలేవు. హార్మోన్ అసమతుల్యత ఏర్పడుతుంది.ఎండ తీవ్రతకు రెస్పిరేషన్ రేటు ఎక్కువ అవటం వల్ల కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారయ్యే పిండి పదార్థం మొక్క/చెట్టు నిర్వహణకే సరిపోతాయి. పెరుగుదల లోపిస్తుంది. అదనపు పిండిపదార్థం అందుబాటులో వుండక పూలకు, కాయలకు పోషకాలను అందించలేని సంక్షోభ స్థితి నెలకొంటుంది. అందువల్ల పూలు, కాయలు రాలిపోయే పరిస్థితి ఎదురవుతుంది. అతి వేడి వత్తిడి ఎదుర్కొంటున్న మామిడి తోటలపై జింక్, ΄్లానోఫిక్స్, బోరాన్‌లను సాయంత్రం 3 గంటల తర్వాత పిచికారీ చేయాలి. టొమాటో, మిరప, వంగ తదితర కూరగాయ మొక్కలపైన నాఫ్తలిన్ అసిటిక్ యాసిడ్‌ను 5 లీటర్ల నీటికి 1.5 నుంచి 2 ఎం.ఎల్. మోతాదులో కలిపి పిచికారీ చేయాలని డా. రావు తెలిపారు.అల్ఫాన్సో, పచ్చడి కాయలు 80% రాలిపోతున్నాయి..ఈ ఏడాది ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల అల్ఫాన్సో, దేశీ పచ్చడి రకాల చిన్న కాయలు రాలిపోతున్నాయి. ఆర్గానిక్ మామిడి తోటల్లో గతంలో 10–20% రాలే కాయలు ఈ సీజన్లో 70–80% రాలిపోతున్నాయి. ఇతర రకాల్లో కూడా జనవరిలో వచ్చిన ఆఖరి పూత ద్వారా వచ్చిన చిన్న కాయలు ఎక్కువగా ఎండదెబ్బకు రాలిపోతున్నాయి. ఎండలు ముదిరే నాటికి నిమ్మకాయ సైజు ఉన్న కాయలకు ్రపోబ్లం లేదు.సన్‌బర్న్ సమస్య వల్ల కాయలు ఒకవైపు అకాలంగా రంగుమారిపోతుంటే, వెనుక వైపు మాత్రం పచ్చిగానే ఉంటున్నాయి. బంగనిపల్లి పూత రాలిపోవటంతో ఈ ఏడాది 20% కూడా కాయ మిగల్లేదు. దశేరి కాపు మాత్రం అన్నిచోట్లా బాగుంది. మామిడి చెట్లకు రోజూ నీరు స్ప్రే చేస్తున్నాం. చెట్ల కింద మల్చింగ్ చేసి నీటి తేమ ఆరిపోకుండా కాపాడుకుంటున్నాం. ఇదిలాఉంటే, మధ్య్రపాచ్య దేశాల్లో యుద్ధం వల్ల నౌకల్లో వెళ్లే సరుకు విమానాల ద్వారా ఎగుమతి అవుతోంది. దీనికితోడు, దుబాయ్‌లో భారీ వరదల వల్ల అమెరికా తదితర దేశాలకు మామిడి పండ్ల ఎగుమతి ఈ ఏడాది బాగా దెబ్బతింది.గత 15 రోజుల్లో 350 ఎమిరేట్స్ విమానాలు రద్దయ్యాయి. దీంతో ఖతర్ తదితర దేశాల విమానాలు ధరలు పెంచేశాయి. అమెరికాకు కిలో మామిడి రవాణా చార్జీ రూ. 180 నుంచి 600కు పెరిగిపోయింది. అమెరికాలో 4 కిలోల మామిడి పండ్ల బాక్స్ గతంలో 40 డాలర్లకు అమ్మేవాళం. ఇప్పుడు 60–70 డాలర్లకు అమ్మాల్సివస్తోంది. దీంతో అమెరికాకు మామిడి ఎగుమతులు బాగా తగ్గిపోయాయి.– రఫీ (98480 02221), సేంద్రియ మామిడి రైతు, ఎగుమతిదారు, ఏఆర్4మ్యాంగోస్, హైదరాబాద్యు.వి. రేడియేషన్ పండ్లను దెబ్బతీస్తోంది!అతి నీలలోహిత వికిరణాల (యు.వి. రేడియేషన్) తీవ్రత బాగా పెరిగిపోయి మామిడి, జామ పండ్లు ఎండదెబ్బకు గురవుతున్నాయి. యు.వి. రేడియేషన్ ఏప్రిల్ ఆఖరి, మే మొదటి వారాల్లో తీవ్రస్థాయికి చేరింది. యు.వి. ఇండెక్స్ ఇప్పుడు 12–13కి పెరిగిపోయింది. మామిడి, జామ వంటి పండ్ల తోటల్లో కాయలపై ఎండ మచ్చలు ఏర్పడుతూ పండ్ల నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. టొమాటోలు వంటి కూరగాయలపై కూడా ఈ ఎండ మచ్చలు సమస్యగా మారాయి.ఎండ తగిలిన వైపు పండినట్లు రంగు మారుతుంది. వెనుకవైపు పచ్చిగానే ఉంటుంది. నాణ్యత కోల్పోయిన ఈ కాయలను కొయ్యలేక, చెట్లకు ఉంచలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అధిక వేడికి అనేక పోషకాలు అందక కొన్ని కాయలు రాలిపోతున్నాయి. యు.వి. రేడియేషన్ ఉద్యాన తోటల రైతులను ఈ ఏడాది చాలా నష్టపరుస్తోంది. నత్రజని కోసం ఫిష్ అమినో యాసిడ్ లేదా పంచగవ్యలను ద్రవజీవామృతంతో కలిపి చల్లాలి. బోరాన్ కోసం జిల్లేడు+ఉమ్మెత్త కషాయం, పోటాష్ కోసం అరటి పండ్ల (తొక్కలతో కలిపి తయారు చేసిన) కషాయాన్ని పిచికారీ చేయాలి. – ఎం.ఎస్.సుబ్రహ్మణ్యం రాజు (76598 55588), తెలంగాణ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం.నీరు, పోషకాలు పిచికారీ చేయాలి..విపరీత ఉష్ణోగ్రతలకు తోడైన వడగాడ్పులకు కూరగాయ తోటలు, పండ్ల తోటల్లో లేత ఆకులు మాడిపోతున్నాయి. ఉష్ణోగ్రత, అతినీలలోహిత వికిరణాలతో పాటు సూర్యరశ్మి తీవ్రత చాలా పెరిగిపోయింది. ప్రతి రోజూ సాయంత్రం 3 గంటల తర్వాత నీటిని పిచికారీ చేయటం ద్వారా పంటలకు రక్షించుకోవచ్చు. వారం, పది రోజులకోసారి ఇంటిపంటలపై నానో యూరియా/ వర్మీవాష్ / జీవామృతం / ఆవు మూత్రంను ఒకటికి పది (1:10) పాళ్లలో నీటిలో కలిపి పిచికారీ చేసుకొని, అతి వేడి వత్తిడి నుంచి తోటలకు ఉపశమనం కలిగించాలి.– డాక్టర్ పి.వి. రావు (94901 92672), రిటైర్డ్ డీన్ ఆఫ్ అగ్రికల్చర్, ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ అధ్యక్షులు, హైదరాబాద్.సేంద్రియ సేద్యం, వ్యాపార నైపుణ్యాలపై 6 రోజుల శిక్షణా శిబిరం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఔత్సాహికులను సేంద్రియ వ్యవసాయంలో మెళకువలు నేర్పటంతో పాటు.. సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపార అవకాశాలను సృష్టించటంలో నిపుణులైన ఫెసిలిటేటర్‌గా మారడానికి నైపుణ్యం, విజ్ఞానాభివృద్ధి శిక్షణా కోర్సును నిర్వహించనుంది కృష్ణ సుధా అకాడమీ ఫర్ అగ్రోఎకాలజీ. 20 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయ శిక్షణలో విశేష కృషి చేస్తున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు సారథ్యంలో నూజివీడుకు సమీపంలోని కొండపర్వలో సకల వసతులతో కృష్ణ సుధా అకాడమీ ఫర్ అగ్రోఎకాలజీ అంతర్జాతీయ స్థాయి వసతులతో ఇటీవలే ప్రారంభమైంది. సేంద్రియ వ్యవసాయంలో క్షేత్రస్థాయిలో లోతైన పరిశోధనలు చేయటంతో పాటు సేంద్రియ వ్యవసాయం, వ్యాపారం తదితర అంశాలపైప్రామాణికమైన శిక్షణ ఇవ్వటమే ఈ అకాడమీ లక్ష్యంగా పెట్టుకుంది. అగ్రికల్చర్ స్కిల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా తదితర సంస్థల తోడ్పాటుతో మే 22 నుంచి 27 వరకు తెలుగులో నిర్వహించనున్న ఉచిత రెసిడెన్షియల్ శిక్షణా శిబిరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డా. రామాజంనేయులు తెలిపారు. గుగుల్ ఫామ్ ద్వారా అభ్యర్థులు విధిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవటం తప్పనిసరి. 30–35 మందికి మాత్రమే అవకాశం. ఇతర వివరాలకు.. 85002 83300.ఇవి చదవండి: Women of My Billion: కలిసి నడిచే గొంతులు -
ప్రయోగాత్మకంగా.. నీటి పంటను 'షెల్ఫ్'లో పండిద్దాం!
శరవణన్ తాత సేంద్రియ సేద్యం చేశాడు, తండ్రి కెమికల్ ఫార్మింగ్ వెంట పరుగెత్తి దిగుబడి పెంచాడు. ఆ పరుగునే వారసత్వంగా అందుకున్న శరవణన్ కూడా 2006 వరకు కొనసాగించాడు. ఆ తర్వాత అతడు తన జీవితానికి తానే పరిశోధకుడయ్యాడు. పంటపొలం నుంచి ఇంటి అల్మరాల వరకు సాగిన ప్రయోగాల్లో మొక్కజొన్నను ఇంటిలోపల అరల్లో నీటితో పండిస్తున్నాడు. శరవణన్ ప్రయోగాలకు మెచ్చిన శాస్త్రీయమైన శాస్త్రవేత్తల సమాఖ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అతడిని ‘ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డ్’తో సత్కరించింది. శరవణన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే తమిళనాడు, నమక్కల్ జిల్లాలోని ‘అరియగౌండమ్ పట్టి’ బాట పట్టాల్సిందే. మట్టిలేని పంట.. అది 2005, ప్రభుత్వం వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు చేపడుతూ మైక్రో ఇరిగేషన్ విధానాన్ని తెచ్చింది. డ్రిప్, స్ప్రింక్లర్ సాగును పరిచయం చేసింది. అందుకు అవసరమైన పరికరాలను రాయితీతో ఇచ్చింది. అప్పుడు ఓ తొలి అడుగు వేశాడు శరవణన్. అది తనను గేమ్ చేంజర్‌గా మారుస్తుందని ఊహించలేదతడు. ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టాలనే ఆలోచన అలా ఉండగానే అతడు అప్పటి వరకు సాగు చేస్తున్న రసాయన ఎరువుల పంటను అంతు చిక్కని తెగులు తినేసింది. కృషి విజ్ఞానకేంద్రాల శిక్షణతో కొత్తపంథాలో నడిచాడతడు. వర్మీ కంపోస్ట్, పంచగవ్య, వేపచెక్క వంటి ప్రయోగాలన్నీ చేశాడు. ఆరు ఎకరాల పొలంలో పసుపు, వేరు శనగ, కూరగాయలు పండించాడు. వీటితోపాటు అక్వాకల్చర్, పాడి, కోళ్ల పరిశ్రమ, బయోగ్యాస్ ప్లాంట్లను కూడా నిర్వహించాడు. ఒక వ్యర్థాలు మరొక పంటకు ఎరువుగా మారే విధానాలన్నింటినీ ఏర్పాటు చేశాడు. తనకైతే వ్యవసాయ భూమి ఉంది కాబట్టి పాడి పశువులకు కావలసిన గడ్డికి సమస్య లేదు. పొలం లేని వాళ్లు పాడిపరిశ్రమ మీద ఉపాధి పొందేవారి కోసం ఓ ప్రత్యామ్నాయం ఉండాలనుకున్నాడు. ఆ ప్రయోగంలో భాగంగా హైడ్రోఫోనిక్ కల్చర్ మొదలు పెట్టారు. అంటే నీటితో పంటలు పండించే విధానం అన్నమాట.హైడ్రోఫోనిక్ కల్చర్‌లో కూరగాయలు పండించుకునే వాళ్లు సంబంధిత సామగ్రిని ఇంటి పైకప్పు మీద ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. శరవణన్ అదే ప్రయత్నాన్ని మొక్కజొన్న పంటను ఒక అల్మైరాలో చేసి చూపించాడు. శరవణన్ ప్రయోగాన్ని రైతులకు మోడల్‌గా చూపించింది కృషి విజ్ఞాన్ కేంద్రం. షెల్ఫ్ అరల్లో దశలవారీగా మొక్కజొన్న గింజలను వేస్తూ ఏడాదంతా పాడి పశువులకు పచ్చిగడ్డి అందేలా రూపొందించాడు. రైతులకు సౌకర్యంగా ఉండేటట్లు ఒక కిట్‌ను రూపొందించాడు. అర కేజీ మొక్కజొన్న గింజలతో ఐదుకేజీల గడ్డిని వారం రోజుల్లో సాధించవచ్చు. ఎనిమిదవ రోజు ఆ అరను ఖాళీ చేసి మళ్లీ కొత్తగింజలను వేసుకోవచ్చన్నమాట. ఇంట్లో నాలుగు షెల్ఫ్లుంటే చాలు రెండు పాడిగేదెల కడుపు నింపే మేత చేతికొస్తుంది. విజయవంతమైన ప్రయోగాలు చేయాలంటే పెద్ద పెద్ద చదువులు చదివి ఉండాల్సిన అవసరం లేదు, ఆసక్తి, నిరంతర శ్రమ ఉంటే సాధించవచ్చని నిరూపించాడు శరవణన్. అతడు రైతులకు మార్గదర్శనం చేయడంతోపాటు వ్యవసాయ విద్యార్థులకు పాఠ్యాంశం అవుతున్నాడు. ఇవి చదవండి: Jahnavi Falki: 'సామాన్య శాస్త్రానికి' తను ఒక మారుపేరు! -
‘సేంద్రియా’నికి నూతనోత్సాహం
(సాక్షి సాగుబడి డెస్్క) ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ పంటల విస్తీర్ణం 2021తో పోలిస్తే 2022 నాటికి సగటున 26.6% (2.03 కోట్ల హెక్టార్లు) పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా భారత్‌లో 77.8%, గ్రీస్‌లో 73%, ఆ్రస్టేలియాలో 48% సేంద్రియ సాగు పెరిగిందని పేర్కొంది. అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయోత్పత్తుల మార్కెట్ 2000 సంవత్సరంలో 15.1 బిలియన్ యూరోలుండగా 2022 నాటికి దాదాపు 135 బిలియన్ యూరోల (రూ. 12.13 లక్షల కోట్ల)కు పెరిగిందని... రిటైల్ అమ్మకాల్లో అమెరికా 56.6 బిలియన్ యూరోలతో అగ్రగామి మార్కెట్‌గా కొనసాగగా జర్మనీ, చైనా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని వివరించింది. ఈ మేరకు 188 దేశాల నుంచి సేకరించిన సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ గణాంకాలతో కూడిన తాజా వార్షిక నివేదిక ‘ది వరల్డ్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్–2024’ను స్విట్జర్లాండ్‌కు చెందిన సేంద్రియ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎఫ్ఐబీఎల్, ఐఫోమ్–ఆర్గానిక్ ఇంటర్నేషనల్ విడుదల చేశాయి. గత 25 ఏళ్లుగా ఏటా ప్రపంచ సేంద్రియ వ్యవసాయ గణాంకాలను ఈ సంస్థలు ప్రచురిస్తున్నాయి. ఆస్ట్రేలియా ఫస్ట్, ఇండియా సెకండ్.. ♦ ఈ నివేదిక ప్రకారం 2022 చివరికి ప్రపంచవ్యాప్తంగా 9.64 కోట్ల హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయం జరుగుతోంది. 2021తో పోలిస్తే ఇది 26.6 శాతం లేదా 2.03 కోట్ల హెక్టార్లు ఎక్కువ. ♦ సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ విస్తీర్ణం 2022లో 2 కోట్ల హెక్టార్లకుపైగా పెరిగింది. 5.3 కోట్ల హెక్టార్ల సేంద్రియ సాగు విసీర్ణంతో ఆ్రస్టేలియా అత్యధిక విస్తీర్ణంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న దేశంగా నిలిచింది. 2022లో 48.6% వృద్ధిని సాధించింది. ♦ 47 లక్షల హెక్టార్ల సేంద్రియ/ప్రకృతి సేద్య విస్తీర్ణంతో భారత్ రెండో స్థానంలో ఉంది. 2022లో సేంద్రియ/ప్రకృతి సేద్య విస్తీర్ణం ఏకంగా 78% పెరిగింది. ♦ ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల సంఖ్య 1999లో 2 లక్షలు ఉండగా 2022 నాటికి 45 లక్షలకు పెరిగింది. 2021లోకన్నా ఇది 26 శాతం ఎక్కువ. భారత్ అత్యధిక సంఖ్యలో 25 లక్షల మంది రైతులు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం చేస్తున్న దేశంగా నిలిచింది. ♦ సేంద్రియ సాగు ప్రాంతం సగానికిపైగా ఓషియానియా (5.32 కోట్ల హెక్టార్లు) దేశాల్లోనే కేంద్రీకృతమైంది. 22 దేశాల్లోని వ్యవసాయ భూమిలో 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రియ సాగు జరుగుతోంది. అయినా మొత్తం సాగు భూమిలో ఇప్పటికి సేంద్రియ సాగు వైపు మళ్లింది 2% మాత్రమే. సేంద్రియ సేద్య ప్రోత్సాహక కార్యాచరణ ప్రణాళికలతో కూడిన ప్రత్యేక చట్టాలు 2023 నాటికి 75 దేశాల్లో అమల్లోకి వచ్చాయి. -
సహకార ‘భారత్ ఆర్గానిక్స్’!
సహకార రంగంలో పాల ఉత్పత్తులకు కొండగుర్తుగా మారిన ‘అమూల్’ బ్రాండ్ మాదిరిగానే ప్రకృతి/సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయానికి ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్‌ను కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఇటీవల ఆవిష్కరించింది. ప్రకృతి /సేంద్రియ వ్యవసాయదారులు దేశవ్యాప్తంగా పండిస్తున్న ఆరోగ్యదాయక ఆహారోత్పత్తులకు ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్ ఇక చిరునామాగా మారనుంది. ఇందుకోసం రూ. 500 కోట్ల అధీకృత మూలధనంతో ‘నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్)’ పేరిట ఓ మెగా మల్టీస్టేట్ కోఆపరేటివ్ ఏర్పాటైంది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పిఓల) నుంచి పంట దిగుబడులను ఎన్‌సిఓఎల్ కొనుగోలు చేస్తుంది. వాటిని శుద్ధి చేసి, విలువను జోడిస్తుంది. ఆ సేంద్రియ ఆహారోత్పత్తులను ‘భారత్ ఆర్గానిక్స్’ పేరిట దేశవిదేశాల్లో విక్రయిస్తుంది. ప్రస్తుతం బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, బెల్లం, రాజ్మా అమూల్ నెట్వర్క్ ద్వారా విక్రయాలు ప్రారంభమయ్యాయి. 2024 జనవరి నుంచి మరో 14 రకాలు కూడా అమ్ముతారు. లాభాల్లో 50%ను రైతులకు తిరిగి చెల్లించనున్న ఈ మెగా ఆర్గానిక్ మార్కెటింగ్ కోఆపరేటివ్ గురించి కథనం.. సేంద్రియ / ప్రకృతి సేద్యంలో పండించిన రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయక ఆహారోత్పత్తుల ప్రాధాన్యాన్ని ప్రపంచం అర్థం చేసుకుంటోంది. 27 లక్షల హెక్టార్లలో సేంద్రియ/ప్రకృతి సాగుతో ప్రపంచంలో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 34 లక్షల మంది సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులలో 16 లక్షల మంది మన దేశీయులే. అయినప్పటికీ, విశ్వ విపణిలో మన సేంద్రియ ఉత్పత్తుల వాటా మాత్రం 2.7% మాత్రమే. సేంద్రియ ఉత్పత్తులు పండించే రైతులు, సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పిఓ) నుంచి ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించి, కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి, మార్కెట్ చేయడానికి దేశంలో తగినన్ని ప్రభుత్వ /సహకార రంగంలో సదుపాయాలు లేకపోవటం ఇందుకు ఒక కారణంగా చెప్పొచ్చు. రసాయనిక అవశేషాల్లేని పంటలు పండించే రైతుల్లో చాలా మందికి ఆ పంట దిగుబడులను మంచి ధరకు అమ్ముకోవటం సమస్యగా మారింది. అదేమాదిరిగా, పూర్తిగా నమ్మదగిన సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులను ప్రజలకు నేరుగా విక్రయించే దేశవ్యాప్త వ్యవస్థ కూడా ఇన్నాళ్లూ కొరవడింది. ఇప్పుడు ఆ కొరత తీరనుంది. రూ.500 కోట్ల అథీకృత మూలధనం ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు మూడు అతిపెద్ద మల్టీస్టేట్ కోఆపరేటివ్‌లను కేంద్ర సహకార శాఖ ఇటీవల నెలకొల్పింది. సర్టిఫైడ్ విత్తనాలు/దేశీ వంగడాల పరిరక్షణ, సరఫరా కోసం ఒకటి.. సహకార కళాకృతులు, ఇతర ఉత్పత్తుల మార్కెటింగ్‌కు మరొకటి.. ఈ కోవలోనిదే ‘నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్)’ కూడా. రూ.500 కోట్ల అథీకృత మూలధనంతో ఎన్‌సిఓఎల్ ఏర్పాటైంది. మల్టీ–స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 కింద నమైదైంది. దేశంలోని 5 ప్రధాన సహకార సంఘాలు, సంస్థలు సేంద్రియ/ప్రకృతి రైతులకు సౌలభ్యకరమైన, ఆధారపడదగిన, శక్తివంతమైన, సహకార మార్కెటింగ్ వ్యవస్థను అందించటంతో పాటు.. దేశంలోనే కాదు విదేశాల్లోని వినియోగదారులకు విశ్వసనీయతతో కూడిన సేంద్రియ సహకార ఆహారోత్పత్తులను ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్ ద్వారా అందుబాటులోకి తేవటమే ఎన్‌సిఓఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. సేంద్రీయ రైతు ఉత్పత్తి సంస్థలకు మార్కెట్లోకి ప్రత్యక్ష ప్రవేశం కల్పించడం ద్వారా ఉత్పత్తులపై రాబడిని పెంచడం ఎన్‌సిఓఎల్ లక్ష్యం. బలమైన బ్రాండ్‌తో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించటం ద్వారా సహకార సంఘాల్లో సభ్యులైన రైతులు తమ సేంద్రియ ఉత్పత్తులకు మెరుగైన రాబడిని పొందుతారు. సంబంధిత మంత్రిత్వ శాఖల సహకారంతో దేశవ్యాప్తంగా వివిధ సహకార సంఘాలు, సంబంధిత సంస్థలు ఉత్పత్తి చేసే సేంద్రియ ఉత్పత్తుల మొత్తం సరఫరా గొలుసును నిర్వహించడం ద్వారా ఎన్‌సిఓఎల్ ఒక గొడుగు సంస్థగా పనిచేస్తుంది. దక్షిణాది తొలి సభ్యత్వం ఏదైనా సహకార సంఘం లేదా వ్యక్తుల సంఘం (సెంట్రల్ రిజిస్ట్రార్ అనుమతించిన విధంగా) ఎన్‌సిఓఎల్‌లో సభ్యత్వం పొందవచ్చు. దాదాపు 2,000 సహకార సంఘాలు ఇప్పటికే ఎన్‌సిఓఎల్‌లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎన్‌సిఓఎల్‌లో తొలి సభ్యత్వాన్ని పొందిన ఘనత ఎఎస్ఆర్ జిల్లాకు చెందిన ‘ఎం.నిట్టపుట్టు గిరిజన రైతు సేవా మరియు ఉత్పత్తిదారుల మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ’కి దక్కింది. ఎన్‌సిఓఎల్ మెంబర్షిప్ సర్టిఫికెట్‌ను అమిత్‌షా నుంచి సొసైటీ సీఈవో పి. గంగరాజు అందుకున్నారు. సభ్యత్వ ధృవీకరణ అందుకున్న తొలి ఐదుగురిలో ఈయన ఒకరు కావటం విశేషం. అతిపెద్ద బ్రాండ్ కానున్న ‘భారత్ ఆర్గానిక్స్’ రానున్న పదేళ్లలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్గానిక్ ఫుడ్ బ్రాండ్‌గా ‘భారత్ ఆర్గానిక్స్’ రూపుదాల్చుతుందని ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌సిఓఎల్ ఆవిర్భావ సభలో కేంద్ర సహకార మంత్రి అమిత్‌షా ఆశాభావం వ్యక్తం చేశారు. భూసారం, సేంద్రియ ఆహారోత్పత్తుల పరీక్షల కోసం ప్రతి జిల్లా, తహసీల్‌లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్(ఎన్‌పిఓపి) గుర్తింపు పొందిన లేబరేటరీలు ఏర్పాటు కానుండటం విశేషం. ప్రకృతి సేద్యానికి మరింత ప్రోత్సాహం నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్) ఆవిర్భావంతో సర్టిఫైడ్ ఆర్గానిక్ ఆహారోత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థ జాతీయ స్థాయిలో వ్యవస్థీకృతం అవుతుండటం ఆనందదాయకం. మార్కెటింగ్ సదుపాయం పెరిగితే ప్రకృతి సేద్య విస్తీర్ణం మరింత పెరగటానికి వీలవుతుంది. ఎన్‌సిఓఎల్ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏపీ రైతు సాధికార సంస్థ నోడల్ ఏజన్సీగా పనిచేస్తోంది. ఎన్‌సిఓఎల్‌లో వ్యక్తిగతంగా రైతులు సభ్యులుగా చేరలేరు. 1964 సహకార చట్టం, 1995 మాక్స్ చట్టం కింద రిజిస్టరైన ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘాలు, ఎఫ్పిఓలు (కంపెనీ చట్టం కింద నమోదైన ఎఫ్పిఓలు అర్హులు కాదు), మండల మహిళా సమాఖ్యలు ఎన్‌సిఓఎల్‌లో సభ్యులుగా చేరొచ్చు. కనీస మద్దతు ధర లేదా మార్కెట్ ధరలో ఏది ఎక్కువ ఉంటే దాని మీద అదనంగా 10–15 శాతం ప్రీమియం చెల్లించి ఎన్‌సిఓఎల్ కొనుగోలు చేస్తుంది. లాభాల్లో 50% సభ్యులకు తిరిగి చెల్లిస్తుంది. ఏపీలో ప్రతి జిల్లాకు రెండు చొప్పున ఎఫ్పిఓలు /సహకార సంఘాలు /మండల సమాఖ్యలను సభ్యులుగా చేర్చుతున్నాం. ప్రస్తుతానికి ప్రాసెసింగ్ చేసిన బియ్యం, బెల్లం, కందిపప్పు, పెసరపప్పు,శనగపప్పు, రాజ్మా గింజలను ఎన్‌సిఓఎల్ కొనుగోలు చేస్తున్నది. వచ్చే జనవరి నుంచి 20 రకాల సేంద్రియ ఆహారోత్పత్తుల్ని కొనుగోలు చేస్తుంది. చిత్తూరు జిల్లాలోని అమూల్ సంస్థ ఆవరణలో ప్రాసెసింగ్ యూనిట్‌ను ఎన్‌సిఓఎల్ నెలకొల్పనుంది. అమూల్ ఆర్గానిక్స్ బ్రాండ్‌తో ఈ ఉత్పత్తులు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్ ఉత్పత్తులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఉత్తరాదిలో సఫల్, మదర్ డెయిరీ, అమూల్ రిటైల్ ఔట్లెట్లలో సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయం ప్రారంభమైంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌సిఓఎల్ ఆవిర్భావ సభలో ఏపీ ఆర్‌వైఎస్‌ఎస్ నుంచి వచ్చిన 55 మంది ప్రతినిధులం పాల్గొన్నాం. ప్రతి జిల్లాకు రెండు చొప్పున ఎఫ్పిఓలు, సహకార సంఘాలు, మాక్స్ చట్టం కింద నమోదైన మండల సమాఖ్యలను సభ్యులుగా చేర్పిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం విస్తారంగా జరుగుతున్న ఏపీ నుంచే ఎక్కువ సభ్యులు చేరే అవకాశం ఉంది. ఏపీ నుంచి ఎన్‌సిఓఎల్‌లో చేరదలచిన సంస్థలు మమ్మల్ని సంప్రదించవచ్చు. – బొడ్డు ప్రభాకర్ (97714 63539), మార్కెటింగ్ హెడ్, రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. prabhakar@ryss.ap.gov. త్వరలో ఆన్లైన్ విక్రయాలు ప్రకృతి/సేంద్రియ వ్యవసాయోత్పత్తులను సహకార సంఘాలు, ఎఫ్పిఓల నుంచి కనీస మద్దతు ధరకన్నా కొంత అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తాం. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. ఎన్‌సిఓఎల్ పొందే నికర లాభాల్లో 50 శాతం మొత్తాన్ని రైతులకు తిరిగి చెల్లిస్తాం. ప్రకృతి/సేంద్రియ ఆహారోత్పత్తులను ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్‌తో ప్రజలకు రిటైల్‌గా ఆన్లైన్లో విక్రయించే సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం ఈ ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయి. ఎన్‌సిఓఎల్‌లో సభ్యులుగా చేరదలచిన సహకార సంఘాలు, ఎఫ్పిఓలు, మండల సమాఖ్యలు ఏ రాష్ట్రం వారైనప్పటికీ ఈ కింది మెయిల్ ఐడి ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. – కోదండపాణి, మేనేజింగ్ డైరెక్టర్, నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్), న్యూఢిల్లీ. cooporganics@gmail.com వినియోగదారుల సందేహాలకు తావుండదు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారోత్పత్తులను కొనేటప్పుడు వినియోగదారులు వీటిని ఎవరు, ఎక్కడ పండించారు? నిజంగా ఆర్గానిక్గానే పండించారా అనే సందేహాలు వస్తుంటాయి. ఎన్‌సిఓఎల్ ద్వారా ‘భారత్ ఆర్గానిక్స్’ సేంద్రియ ఆహారోత్పత్తులు మార్కెట్లో అందుబాటులోకి వస్తే ప్రజలకు ఈ సందేహాలు తీరిపోతాయి. మా గిరిజన సహకార సంఘం దక్షిణాది నుంచి ఎన్‌సిఓఎల్‌లో తొలి సభ్యత్వం పొందటం ఆనందంగా ఉంది. గతంలో ఉన్న మార్కెటింగ్ సమస్యలు తీరిపోతాయి. ఎఎస్ఆర్ లల్లా జి. మాడుగుల మండలంలో 3683 మంది గిరిజన రైతులు మా సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. ఇందులో 2012 మంది సర్టిఫైడ్ ఆర్గానిక్ రైతులు. కాఫీ, మిరియాలు, పిప్పళ్లు, పసుపు, అల్లం, రాజ్మా ఎగుమతుల కోసం విక్రయిస్తున్నాం. ఇతర పంట దిగుబడులను స్థానిక మార్కెట్లలో అమ్ముతున్నాం. ప్రభుత్వ ధరకన్నా ఎక్కువ ధరనే రైతులకు చెల్లిస్తున్నాం. గత ఏడాది రూ. 4 కోట్ల కాఫీ, మిరియాలు విక్రయించాం. ఏపీ ఆర్‌వైఎస్‌ఎస్, ఉద్యానశాఖ తోడ్పాటుతో 10 టన్నుల గోదాములు నిర్మించాం. ప్రకృతి వ్యవసాయంలో ఆరితేరిన మా రైతులు 20 మంది మేఘాలయ వెళ్లి అక్కడి రైతులకు ప్రకృతి సేద్యం నేర్పిస్తున్నారు. గత ఏడాది మా సొసైటీకి జాతీయ జైవిక్ ఇండియా పురస్కారం కూడా లభించింది. ఎన్‌సిఓఎల్ ద్వారా రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుంది. – పి. గంగరాజు (63018 76177), సీఈఓ, ఎం.నిట్టపుట్టు గిరిజన రైతుల సొసైటీ, అరకు, ఎఎస్ఆర్ జిల్లా – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (చదవండి: వరి ఆకారపు మిల్లెట్లు! మిల్లెట్లు తినేవారిగా మార్చేలా) -
వ్యర్థాలూ ఆదాయ మార్గం కావాలి!
పంట వ్యర్థాలను సేకరించే శ్రమను తీసుకోవాలంటే రైతులకు ఒక ప్రేరణ అవసరం. అన్ని రకాల వ్యవసాయ వ్యర్థాలూ ఎరువులను ఉత్పత్తి చేయడానికి అనువైనవి. దీని నుంచే వచ్చే ఘన ఎరువు స్వయంగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న సేంద్రియ ఎరువు. ఇందులో వెలువడే మీథేన్‌ను వెంటనే వాడుకునే వీలుగా వేరే చోటికి పైపుల ద్వారా తరలించాలంటే, దానిలోని ఇతర వాయువులను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రాంతంలో లభించే పంట అవశేషాలు, ఇతర వ్యవసాయ వ్యర్థాల పరిమాణంపై ప్రభుత్వం నమ్మదగిన అంచనాలతో ముందుకు వస్తే, వ్యవస్థాపకులు తగిన పరిమాణాలలో బయోడైజెస్టర్లను ప్లాన్ చేయవచ్చు. అప్పుడు కాలుష్యానికి కారణమయ్యేలా పంట వ్యర్థాలను వృథాగా కాల్చే పనివుండదు. ప్రభుత్వ సీనియర్ అధికారులు కచ్చితంగా క్వాంటమ్ కణాలకు చాలా భిన్నమైనవారు. అయినప్పటికీ, కణాలకూ, అధికారులకూ ఒక సారూప్యమైన గుణం ఉంటుంది. గమనించినప్పుడు స్థితి మార్చుకోవడం! పరిశీలనకుసంబంధించిన తక్షణ చర్యే మార్పును ప్రేరేపిస్తుంది. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం పంట అవశేషాల దహనానికి స్వస్తి చెప్పాలని ఉత్తర భారత రాష్ట్రాల అధికారులను ఆదేశించినందున, అది ఎలా చేయాలో వారికే వదిలేస్తే, మనం ఎంతో కొంత చర్యను ఆశించవచ్చు. తదుపరి పంటను వేయడానికి తమ పొలాల్లోని పంట అవశేషాలను తొలగించాల్సిన రైతులతో విభేదాలు లేకుండా కోర్టు ఆదేశాలపై ఎలా చర్య తీసుకోవాలనే విషయంపై ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి. ప్రపంచంలోని ఐదు అత్యంత కాలుష్య నగరాలలో నాలుగు దక్షిణాసియా నగరాలే. అవి: లాహోర్, ఢిల్లీ, ముంబై, ఢాకా. భారత దేశం, పాకిస్తాన్ సరిహద్దుకు ఇరువైపులా ధాన్యాన్ని వేరుచేసిన తర్వాత పొలాల్లో మిగిలినదాన్ని తగుల బెట్టే ఆచారం సమస్యలకు కారణం అవుతోంది. వాస్తవానికి, గాలిలో సాంద్రతలో ఈ మసి గరిష్ఠంగా 40 శాతం వరకు ఉంటుంది. దీంతో గాలి వేగాన్ని తగ్గించే వాతావరణం ఏర్పడడం వల్ల, కురుస్తున్న వర్షాన్ని అరికట్టడం వల్ల ఈ కాలుష్య కారకాలు చాలాకాలం పాటు అలా గాలిలో నిలిచివుంటాయి. ఇది గాలి నాణ్యతను గణనీయంగా క్షీణింపజేస్తుంది. వాహనాల పొగ, నిర్మాణపరమైన పనుల వల్ల ఏర్పడే దుమ్ము కాలుష్య కారకాలలో ఎక్కువ భాగంగా ఉంటున్నాయి. ఈ కాలుష్య మూలాలను అరికట్టడం చాలా కష్టం. వాహనాల కాలుష్యాన్ని తొల గించాలంటే, శిలాజ ఇంధనాలను వినియోగించే అంతర్గత దహన యంత్రాల స్థానంలో వాహనాలకు విద్యుచ్ఛక్తిని ఇవ్వాల్సి ఉంటుంది. శుభ్రపర్చిన ఇంధనాలు, మెరుగైన ఇంజన్లు తాత్కాలికంగా సహాయ పడతాయి. కాలుష్య కారక వాహనాలను శుభ్రపరిచి వాటిని మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దీనికి సమయం పడుతుంది. రోడ్డుపై నుండి వాహనాలు వెలువరించే ధూళిని ఎలా తగ్గించవచ్చు అంటే... అన్ని రోడ్ల పక్కన బహిర్గతమైన నేల, బహిరంగ ప్రదేశాలను కప్పడానికి గడ్డిని నాటడం ద్వారా. వెంటనే మొదటి గాలికే దుమ్మును దులిపే రకం చెట్లను కాకుండా, ఆ దుమ్మును నిలుపుకోగలిగే పచ్చద నాన్ని నాటడం కూడా మేలుచేస్తుంది. అయితే ఎడారి నేల మీదుగా వీచే గాలుల ద్వారా కొట్టుకువచ్చే దుమ్మును తగ్గించడానికి చేయ గలిగేది తక్కువ. నగరాల్లో జరిగే నిర్మాణ పనుల్లో దాని స్థానిక రూపంలోని పొడి సిమెంట్‌ను కాకుండా ముందే కలిపిన కాంక్రీట్‌ను మాత్రమే ఉపయో గించేట్టు చేయాలి. కాంక్రీట్ కలపడం కూడా బహిరంగంగా కాకుండా పరివేష్టిత ప్రదేశాలలో జరగాలని పట్టుబట్టడం ద్వారా చాలావరకు నిర్మాణాల పరమైన ధూళిని అరికట్టవచ్చు. ఇవి అవసరమైన చర్యలు. సంపూర్ణంగా ఆచరణీయమైనవి. అలాగని 19వ శతాబ్దానికి చెంది నట్లుగా ఇంకా పంట అవశేషాలను తగులబెట్టడం కొనసాగాలని అర్థం కాదు. ఆ అలవాటు అంతరించిపోవాలి. కానీ ఎలా? పంట వ్యర్థాలు, అలాగే అన్ని రకాల వ్యవసాయ వ్యర్థాలు, జీవ జీర్ణక్రియలో చిక్కుకున్న శక్తిని విడుదల చేయడానికీ, ఎరువులను ఉత్పత్తి చేయడానికీ అనువైనవి. నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, పేడనీళ్లతో కలిపిన మొక్కల అవశేషాలు మీథేన్‌గా కుళ్లిపోతాయి. దీని నుండి అవసరమైతే ఘన ఎరువులను తీయవచ్చు. దీనికిదే స్వయంగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న సేంద్రియ ఎరువు. ఇందులో వెలువడే మీథేన్‌ను వెంటనే వాడుకునే వీలుగా వేరే చోటికి పైపుల ద్వారా తరలించాలంటే, దానిలోని ఇతర వాయువు లను శుభ్రం చేయాల్సి ఉంటుంది. బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించడం, వాటిని నిర్వహించడం అనేవి వ్యవసాయానికి భిన్నమైన కార్యకలాపాలు. బయోగ్యాస్ ప్లాంట్ నిర్వాహకులు కొనుగోలు చేయగలిగిన పంట అవశేషాలను కుప్పలుగా సేకరించడానికి రెతుకు ఒక ప్రేరణ అవసరం. పంట వ్యర్థా లను వదిలించుకోవడానికి ఒక మార్గం ఏమిటంటే, హ్యాపీ సీడర్ అనే యంత్రాన్ని ఉపయోగించడం. ఇది పొలాల నుండి వ్యర్థాలను అటు తీస్తూనే, ఇటు తదుపరి పంట విత్తనాలను నాటుతుంది. ఆ వ్యర్థాలను పొలంలోనే నశించేట్టు చేస్తుంది. అయితే ఈ పరికరం విస్తృతమైన కొనుగోలుకు లేదా అద్దెకు నోచుకోలేదు. తదుపరి పంటను నాటడా నికి ఉన్న విరామం చాలా స్వల్పం. రైతులందరికీ ఆ వ్యవధిలో పని చేయడానికి సరిపడా హ్యాపీ సీడర్లు అందుబాటులో లేవు. బయోగ్యాసును ఉత్పత్తి చేసే శక్తిమంతమైన కొత్త పరిశ్రమకు ముడి పదార్థంగా ఈ పంట అవశేషాలను అందించడమే మేలైన ప్రత్యామ్నాయంగా కనబడుతోంది. దీనిద్వారా రైతులు తమ పంట అవశేషాలను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందు తారు. పైగా సింథటిక్ ఎరువుల ధరతో పోల్చదగిన ధరకు సేంద్రియ ఎరువులు అందుబాటులో ఉంటాయి. కానీ పంట అవశేషాలు అనేవి చురుకైన కాలుష్య కారకాల నుండి అదనపు వ్యవసాయ ఆదాయానికి పనికొచ్చే ప్రయోజనకరమైన ప్రవాహంగా మారడం దానంతటదే జరగదు. దానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బయోడైజెస్టర్లు వివిధ స్థాయుల సాంకేతిక అధునాతనత్వంతో రావచ్చు. ఇది ఎక్కువగా ముడి పదార్థంగా ఉపయోగించే వివిధ రకాల సేంద్రియ పదార్థాల ముందస్తు చికిత్సపై ఆధారపడి ఉంటుంది. ఒక భారతీయ బహుళజాతి సంస్థ బయోగ్యాస్ కోసం పెద్ద ప్రణాళికలను కలిగి ఉంది. బహుశా అధునాతన బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించి సరఫరా చేస్తుంది. ఇది ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో చెరకు పంట వ్యర్థాలను నిర్వహిస్తోంది. ప్రతి ప్రాంతంలో లభించే పంట అవశేషాలు, ఇతర వ్యవసాయ వ్యర్థాల పరిమాణంపై ప్రభుత్వం నమ్మదVýæ్గ అంచనాలతో ముందుకు వస్తే, వ్యవస్థాపకులు తగిన పరిమాణాలలో బయోడైజెస్టర్లను ప్లాన్ చేయవచ్చు. ఈ ప్రక్రియ పట్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఆలో చించి సబ్సిడీతో బలం చేకూర్చినప్పటికీ, ప్లాంట్లను నిర్మించడం, గ్యాçసు కోసం పైప్‌లైన్ నెట్వర్క్ వేయడం, గ్యాసును ఎలా ఉపయోగించాలో నిర్ణయించడం వంటి వాటికి కాస్త సమయం పడుతుంది. అయితే ఇప్పుడు పంట వ్యర్థాలను తగలబెట్టడం ఆపేయాలని కోర్టు ఆదేశం. దీని వల్ల మంటలను ఎలాగైనా ఆర్పడానికి పోలీసులను ఉపయోగించాలనే ఆలోచన కలిగించవచ్చు. ఇది ఓటర్లుగా కూడా ఉన్న రైతుల్లో భిన్నమైన మంటలను రేకెత్తిస్తుంది. అందువల్ల పంట వ్యర్థాలను సేకరించడం, నిల్వ చేయడమే సరైన పరిష్కారం. వ్యర్థా లను బయటకు తీయడానికి, రవాణా చేయడానికి రైతులకు అయ్యే ఖర్చును భరించడానికి ఒక సేకరణ ఏజెన్సీ సరిపోతుంది. భాక్రానంగల్ డ్యామ్ నిర్మిస్తున్నప్పుడు, దాని నిర్మాణానికి చెల్లించాల్సిన పన్ను గురించి రైతులు నిరసన వ్యక్తం చేసినప్పుడు, రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు ఆ ప్రాంతాన్ని రైతులు సందర్శించేలా చూశారు. తమ ముందు రూపుదిద్దుకుంటున్న ఆధునిక అద్భుతాన్ని స్వయంగా చూసేందుకు రైతులను ప్రాజెక్ట్ స్థలానికి తీసుకెళ్లారు. ప్రతాప్ సింగ్ ౖకైరోన్(పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి), అప్పటి వ్యవసాయ కార్యదర్శి ఆర్ఎస్ రంధావా, అప్పటి శాఖ డైరెక్టర్ డాక్టర్ అర్జున్ సింగ్ వంటి వారు గ్రామీణ ప్రాంతాలలో పర్యటించారు. రైతులు మరింత ఆహా రాన్ని పండించాలనీ, మార్పునకు ఏజెంట్లుగా ఉండాలనీ కోరారు. నేడు పంజాబ్‌లోని రాజకీయ, పరిపాలనా నాయకులు మార్పుకు ఏజెంట్లుగా మారడానికి అవకాశం ఉంది. అయితే వారు ఈ సంద ర్భానికి తగినట్టుగా ప్రవర్తించగలరా అనేది ప్రశ్న. టి.కె. అరుణ్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
విప్రోలో ఉద్యోగం వదిలి.. వ్యవసాయంతో రూ.205 కోట్లు సంపాదన
దేశంలోనే దిగ్గజ ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం.. దాదాపు 17 ఏళ్లు పనిచేసిన అనుభవం.. ఉద్యోగానికి రాజీనామా.. ఏదైనా ఐటీ కంపెనీ స్థాపిస్తాడేమోనని అనుకుంటాం. కానీ వ్యవసాయం ప్రారంభించాడు. ఏటా ఏకంగా రూ.205 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఏ పద్ధతులు ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నాడు? అంత సంపాదన ఎలా సాధ్యమైందో ఈ కథనంలో తెలుసుకుందాం. కర్ణాటకకు చెందిన శశికుమార్ 17 ఏళ్లపాటు ఐటీరంగంలో సేవలందించారు. అందులో 13 ఏళ్లు దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ విప్రోలో విధులు నిర్వర్తించారు. దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ వ్యవసాయానికి మాత్రం ప్రత్యామ్నాయం లేదని గ్రహించారు. రసాయనాలు కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, సేంద్రియ ఆహారం అందించాలని భావించారు. దాంతో ఆర్గానిక్ పద్ధతులతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే తను చేస్తున్న ఉద్యోగం మానేశారు. ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పడంతో వారూ తనకు సహాయం అందించారు. దాంతో 2010లో 9 మంది మిత్రులు కలిసి అక్షయకల్ప ఆర్గానిక్‌ని ప్రారంభించారు. శశికుమార్ మొదట్లో కేవలం ముగ్గురు రైతులతో పాల వ్యాపారం మొదలుపెట్టారు. అయితే అక్షయకల్ప ఆర్గానిక్ నిర్వాహకులు పాలతో ఆగకుండా.. సేంద్రియ కూరగాయలు, పండ్లను పండించడం ప్రారంభించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని ప్రజలకు ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రత్యేకతను వివరిస్తూ వారికి చేరువవుతున్నారు. ఆర్గానిక్ పద్ధతులతో పండిస్తున్న రైతుల ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రైతులకు, కొనుగోలుదారులకు మధ్య వారధిగా నిలుస్తున్నారు. రైతుల ఆదాయాలను పెంచుతున్నారు. ప్రస్తుతం అక్షయకల్ప ఆర్గానిక్ ద్వారా పాలఉత్పత్తిలో భాగంగా 700 మంది రైతులు సహకారం అందిస్తున్నారు. దాదాపు 60,000 లీటర్ల సేంద్రియ పాలను ఉత్పత్తి చేస్తున్నట్లు శశికుమార్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో మార్కెటింగ్ సేవలందించేందుకు 500 మందికి పైగా శిక్షణ ఇస్తున్నారు. సేంద్రియ పాలపై మొదట్లో వినియోగదారులకు అవగాహన కల్పించడం పెద్ద సవాలుగా మారిందని శశికుమార్ తెలిపారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో తన స్నేహితులు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారని చెప్పారు. ఇటీవల రూ.10 కోట్లతో కొత్త డెయిరీ ప్లాంట్ ప్రారంభించామన్నారు. దాని ద్వారా రోజుకు లక్ష లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇదీ చదవండి: 11వేల కార్మికులపై కేసులు నమోదు.. 150 ఫ్యాక్టరీలు మూసివేత సేంద్రియ కూరగాయలు, పండ్ల వ్యాపారం గతంలో కంటే మెరుగవుతుందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో అక్షయకల్ప ఆర్గానిక్ స్టార్టప్ రూ.205 కోట్లు ఆర్జించింది. 2023-24లో ఆదాయం మరో 25 శాతం పెరుగుతుందని శశి కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కంపెనీ 5 వేల గ్రామాలు, 5 వేల మంది రైతులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. -
రాష్ట్రంలోనే అత్యధికంగా సేంద్రీయ వ్యవసాయం
సాక్షి, అమరావతి: దేశ ంలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లో పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) కింద అత్యధికంగా సేంద్రీయ వ్యవసాయం కొనసాగుతోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రంలో పీకేవీవై కింద అత్యధికంగా 2.06 లక్షల హెక్టార్లలో 2.65 లక్షల మంది రైతులు సేంద్రీయ సాగు చేస్తున్నారని తాజాగా వెల్లడించింది. పీకేవీవై కింద రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.317.21 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత పీకేవీవై కింద అత్యధికంగా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారని తెలిపింది. ఉత్పత్తి నుంచి విక్రయం వరకు మద్దతు.. ఈ పథకం కింద రైతులకు ఉత్పత్తి నుంచి విక్రయం వరకు మద్దతును అందిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రాసెసింగ్ సర్టిఫికేషన్ విధానం ద్వారా మార్కెటింగ్ కోసం అవసరమైన శిక్షణ ఇచ్చి రైతుల్లో సామర్థ్యాలను పెంచుతున్నట్లు పేర్కొంది. ప్రాసెసింగ్‌తో పాటు పంట కోత అనంతరం ఉత్పత్తుల నిర్వహణ, ప్యాకింగ్, మార్కెటింగ్ ఇలా వివిధ అంశాల్లో రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు వివరించింది. క్లస్టర్ విధానంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది. పీకేవీవై కింద సేంద్రీయ సాగు చేస్తున్న ఒక్కో రైతుకు హెక్టార్‌కు మూడేళ్లలో రూ.50 వేలు అందిస్తున్నట్టు వెల్లడించింది. ఇందులో ఆర్గానిక్ ఇన్‌ఫుట్‌ల కోసం రూ.31 వేలను రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయనున్నట్లు వివరించింది. అలాగే మార్కెటింగ్, ప్యాకేజీ బ్రాండింగ్, విలువ జోడింపునకు రూ.8,800, సర్టిఫికేషన్‌కు రూ.2,700, అవసరమైన శిక్షణ, సామర్థ్యం పెంచేందుకు రూ.7,500 సాయం అందించనున్నట్లు తెలిపింది. సేంద్రీయ వ్యవసాయంలో రాష్ట్రాలను ప్రోత్సహించడానికి పలు చర్యలను చేపట్టామని పేర్కొంది. యూరియా అధిక వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువులను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
క్రమక్రమంగా పెరుగుతున్న సేంద్రియ రైతుల సంఖ్య...!
-
ఆర్గానిక్ పద్ధతిలో బొప్పాయి సాగు చేస్తే లాభం..!
-
క్రమంగా సేంద్రియ సాగువైపు మళ్లుతున్న రైతులు
-
ఆర్గానిక్ పద్ధతిలో సాగుచేస్తే చీడపీడల బెడద కూడా తక్కువే
-
బ్లాక్ రైస్, రెడ్ రైస్ సాగుతో అధిక దిగుబడిని పొందిన రైతు
-
క్రమంగా సేంద్రియ సాగుబాట పడుతున్న రైతన్నలు
-
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయంపై విదేశీయుల ఆసక్తి
-
సేంద్రియ వ్యవసాయంతో రైతుకు కలుగుతున్న లాభాలు
-
ఆరోగ్యకర జీవనానికి ఔషధ మొక్కలు
-
రైతులకు అందుబాటులో దేశీయ విత్తనాలు
-
సేంద్రియ పంటలతో ఆరోగ్యంతో పాటు ఆదాయ మార్గం
-
పైసా పెట్టుబడి లేదు సేంద్రియ పద్దతుల్లో ఇంట్లోనే కూరగాయల సాగు...
-
ఆదర్శ గ్రామం ..పూర్తి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం
-
ప్రకృతి వ్యవసాయం చేయండి, అదొక్కటే ఎన్నో సమస్యలకు పరిష్కారం
కళ్యాణదుర్గం: రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. గురువారం కళ్యాణదుర్గం మండల పరిధిలోని మల్లాపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న పంట పొలాలను కలెక్టర్ గౌతమి, ఏటీఎం మోడల్ రూపకర్త, ఏపీసీఎన్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్‌కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంఘాలను అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. రైతే రాజు అన్న నినాదాన్ని ప్రకృతి వ్యవసాయం నిజం చేస్తుందన్నారు. కలెక్టర్ ఎం. గౌతమి మాట్లాడుతూ పొలాల్లోకి దిగిన ప్రతిసారీ ఆదాయం పొందే విధంగా ‘ఏటీఎం మోడల్’ను అవలంబించాలని ఆకాంక్షించారు. ఈ విధానం రైతులకు లాభసాటిగా ఉండటంతో పాటు నాణ్యమైన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించేందుకు దోహదపడుతుందన్నారు. అతి తక్కువ పెట్టుబడితో, తక్కువ విస్తీర్ణంలో, రసాయనాలు అవసరం లేకుండా వివిధ రకాల పంటలు ఏకకాలంలో పండిస్తూ సొమ్ము చేసుకుంటున్న రైతులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఏటీఎం మోడల్‌పై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఏపీసీఎన్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ సూచించారు. అనంతరం పలువురు రైతులు సాగు చేసిన చిరుధాన్యాల పంటలను వారు పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ నిశాంత్‌రెడ్డి, డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సేంద్రియ సాగు ‘డబుల్’
సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. పురుగు మందులు, ఎరువులతో పండించిన ఆహార పదార్థాలు, కూరగాయలు విష పూరితంగా మారడంతో వినియోగదారులు సేంద్రియ ఆహార పదార్థాలను ఎంచుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో ఏడాదికేడాదికి సేంద్రియ పంటల సాగు పెరుగుతోంది. మూడేళ్లలో రెట్టింపునకు మించి సేంద్రియ పంటల సాగు పెరిగినట్లు కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. 2019–20 ఏడాదిలో రాష్ట్రంలో 56,355 ఎకరాల్లో సేంద్రియ పంటలను సాగు చేయగా 2,294 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యాయి. 2020–21లో మాత్రం కాస్తంత తగ్గి 51,662 ఎకరాల్లో సాగవగా , 20,665 మెట్రిక్ టన్నుల సేంద్రియ పంటలు ఉత్పత్తి అయ్యాయి. ఇక 2021–22లో ఆర్గానిక్ పంటలు 1.32 లక్షల ఎకరాల్లో సాగవగా. 3,871 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయింది. దేశంలో తెలంగాణ 12వ స్థానం: వివిధ రాష్ట్రాలతో పోలిస్తే సేంద్రియ సాగులో తెలంగాణ 12వ స్థానంలో ఉందని కేంద్రం వెల్లడించింది. 2019– 20లో దేశంలో ఆర్గానిక్ పంటలు 73.54 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఆ ఏడాది 27 లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రియ ఉత్పత్తులు పండాయి. 2020– 21లో 95 లక్షల ఎకరాల్లో ఆర్గానిక్ పంటల సాగు విస్తీర్ణం జరగ్గా, 34.68 లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రియ ఆహార పదార్థాలు ఉత్పత్తి అయ్యాయి. ఇక 2021–22లో సేంద్రియ పంటల సాగు పెరిగింది. ఆ ఏడాది ఏకంగా 1.47 కోట్ల ఎకరాల్లో ఆర్గానిక్ పంటల సాగు జరగ్గా, 34.10 లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రియ పంట ఉత్పత్తి జరిగింది. అత్యధికంగా ఆర్గానిక్ పంటలు సాగు చేసే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 2021–22లో 42 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. మహారాష్ట్ర రెండో స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో 29.12 లక్షల ఎకరాల్లో పంటలు సాగైంది. మూడో స్థానంలో గుజరాత్ , నాల్గవ స్థానంలో రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6.32 లక్షల ఎకరాలతో ఐదో స్థానంలో సేంద్రియసాగు చేస్తున్నటు వెల్లడించింది. -
Nature Farming: సేంద్రియ సారం.. పుడమికి జీవం
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో వ్యవసాయం సాహసోపేతం. ఇక్కడ సాగుకు వర్షాలు, కొండవాగుల నీరే ఆధారం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ప్రకృతి సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. దీంతో రైతులు కూడా సేంద్రియ విధానాలపై ఆసక్తి చూపుతూ సత్ఫలితాలు పొందుతున్నారు. కేఆర్‌పురం ఐటీడీఏ, ప్రకృతి వ్యవసాయ అధికారుల చొరవతో మూడేళ్లుగా గిరిజన రైతుల్లో ప్రకృతి వ్యవసాయంపై చైతన్యం పెరిగింది. గిరిజన ప్రాంతంలో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలతో పాటు కూరగాయలను అత్యధికంగా సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సుమారు 15 వేల మందికి పైగా రైతులు సుమారు 9,400 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీటిలో 2,100 ఎకరాల్లో చిరుధాన్యాలు, 7 వేల ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో కూరగాయలు వంటివి పండిస్తున్నారు. ప్రోత్సాహం ఇలా.. గిరిజన ప్రాంతంలోని సన్న, చిన్నకారు గిరిజన రైతులను ప్రకృతి సాగు వైపు మొగ్గు చూపేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. విత్తనం నాటిన నుంచి ఎరువులు వినియోగించకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తక్కువ మోతాదులో ఎరువులు వాడుతున్న వారు, సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్న వారిని ఏ, బీ కేటగిరీలుగా విభజించారు. ఇద్దరు క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను, ఒక క్లస్టర్ కార్యకలాపాల నిర్వాహకుడు, ఎంపీఈఓ, సీఆర్పీలను నియమించి రైతులకు సాంకేతిక సలహాలను అందిస్తున్నారు. క్లస్టర్ పరిధిలో ఐదు పురుగు మందుల అవశేషాలు లేని ఎరువుల దుకాణాన్ని ఏర్పాటుచేశారు. కొందరు రైతులకు ఈ దుకాణాల బాధ్యతలను అప్పగించారు. ఇందుకు రూ.50 వేల రాయితీలపై రుణాలను కూడా అందించారు. వీరు ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూనే దుకాణాల ద్వారా రైతులకు కషాయాలను, సేంద్రియ ఎరువులను తయారు చేసి అవసరమైన సామగ్రిని విక్రయించేలా ఏర్పాటుచేశారు. అలాగే 30 మంది రైతులకు ఆవుల కొనుగోలుకు రూ.10 వేల చొప్పున రాయితీలతో రుణాలను అధికారులు అందించారు. కషాయాల తయారీకి ఉపయోగపడే పరికరాలను సమకూర్చారు. అలాగే షెడ్, నైట్ నీడలో కూరగాయల సాగు చేసుకునేలా ఏర్పాట్లుచేశారు. 200 ఎకరాల్లో కూరగాయలు.. సుమారు 200 ఎకరాల్లో 250 మంది రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. పొట్ల కాయ, ఆనబకాయ, కాకరకాయ, దోసకాయలు, చిక్కుడు, బీర, వంకాయ, టమాట, బెండకాయ, గోరు చిక్కుళ్లు వంటి కూరగాయలతో పాటు గోంగూర, బచ్చలకూర, తోటకూర వంటి ఆకుకూరలను ప్రకృతి వ్యవసాయంలో రైతులు పండిస్తున్నారు. 2,100 ఎకరాల్లో సుమారు 1,800 మంది రైతులు చిరుధాన్యాల సాగు చేస్తున్నారు. 2,100 ఎకరాల్లో చిరు ధాన్యాలు జొన్నలు, గంట్లు, పెసర, మినుము, ఉలవలు, బొబ్బర్లు, పెసలతో పాటు జీలుగు, జనుము వంటి పంటలను పండిస్తున్నారు. వీటికి ఆదరణ పెరగడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం కూడా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. 7 వేల ఎకరాల్లో వరి ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలకు తిరుమల, తిరుపతి దేవస్థానం వారు కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున ఈ ఏడాది 7 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే దాదాపు 2,000 ఎకరాల్లో వరి కోతలు పుర్తయ్యాయి. అయితే ఎకరానికి 400 బస్తాల దిగుబడి రావడంతో రబీలో కూడా వరి పంటలు వేసేలా రైతులు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడమే కాకుండా గిట్టుబాటు ధర కూడా మెండుగా ఉంది. విస్తరిస్తున్న సేంద్రియ సాగు ప్రకృతి సాగు ఏటా పెరుగుతోంది. జిల్లాలో ఈ ఏడాది 39,873 మంది రైతులు 78,479 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల పంటలు సాగుచేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది. రైతులకు అవగాహన పెంచి సాగును మరింత పెంచేలా కృషి చేస్తున్నాం. – పైడపల్లి లలితాసుధ, ఏపీసీఎన్ఎఫ్ డీపీఎం, ఏలూరు ప్రోత్సహిస్తున్నాం ప్రభుత్వం, ఐటీడీఏ అధికారుల సహకారం మరువలేనిది. రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. – వై.ముసలయ్య, ప్రకృతి వ్యవసాయ సబ్ డివిజనల్ యాంకర్, కేఆర్‌పురం లాభదాయకంగా ఉంది ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా ఉంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది. సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యవంతమైన పంటలు పండించడం ఆరోగ్యంగా ఉంది. నేను ఈ ఏడాది సుమారు రెండు ఎకరాల్లో బీర, ఆకుకూరల పంటలను సాగుచేస్తున్నాను. – సలాది కొండరాజు, గిరిజన రైతు, నిమ్మలగూడెం, బుట్టాయగూడెం మండలం -
ప్రజాఉద్యమంగా ప్రకృతి సేద్యం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ రూరల్: ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం ప్రజాఉద్యమంగా మారాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. రైతులు, వినియోగదారులు, ప్రభుత్వాలు, మీడియాసహా సమాజంలో అందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ముప్పవరపు ఫౌండేషన్, రైతునేస్తం సంయుక్త ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో ఆదివారం రైతునేస్తం మాసపత్రిక 18వ వార్షికోత్సవంలో పలువురికి ‘పద్మశ్రీ ఐ.వి.సుబ్బారావు రైతునేస్తం’పురస్కా రాలను ప్రదానం చేశారు. పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని వెంకయ్య సూచించారు. ప్రజలకు ఆరోగ్యం, రైతుకు రాబడి సేంద్రీయ సాగుతోనే సాధ్యమవుతుందన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు మంచి తరుణం ఇదేనని, రైతులతోపాటు అధికారులు, శాస్త్రవేత్తలు ఈ దిశగా దృష్టి కేంద్రీకరించాలన్నారు. మనదేశంలో రైతులకు అందించే ప్రోత్సాహకాలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. కరోనా సమయంలో కూడా మన ఆహార అవసరాలను తీర్చగలిగిన రైతులను రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పురస్కారాల ప్రదానం నాబార్డు మాజీ చైర్మన్ చింతల గోవిందరాజులుకు జీవిత సాఫల్య పురస్కారం, డా. వై.ఎస్.ఆర్. విశ్వవిద్యాల యం వైస్ చాన్సలర్ డాక్టర్ టి.జానకిరామ్‌కు ‘కృషిరత్న’ బిరుదు, అహ్మదాబాద్‌కి చెందిన ‘గోకృపామృతం’ రూపశిల్పి గోపాల్‌భాయ్ సుతారియాను ‘గోపాలరత్న’బిరుదు తో సత్కరించారు. 16 మంది అభ్యుదయ రైతులకు, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విశేష కృషిచేసిన 10 మంది శాస్త్రవేత్తలకు, విస్తరణకు కృషి చేసిన 11 మందికి, అగ్రిజర్నలిజం విభాగంలో ఐదుగురికి రైతునేస్తం పురస్కారాలు ప్రదానం చేశారు. ‘సాక్షి సాగుబడి’తరఫున సీనియర్ న్యూస్ ఎడిటర్ పంతంగి రాంబాబు పురస్కారాన్ని అందుకు న్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కామి నేని శ్రీనివాసరావు, నాబార్డు తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ చింతల సుశీల, ‘నార్మ్’డెరైక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
Cuba: పట్టణ సేంద్రియ వ్యవసాయంతో వినూత్న పరిష్కారం..
క్యూబా.. నగర, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు సంస్కృతికి ప్రపంచంలోనే అతి పెద్ద ఉదాహరణగా నిలిచింది. 70% క్యూబా ప్రజలు అర్బన్ ప్రాంతాల్లో నివాసం ఉంటారు. దేశానికి కావాల్సిన ఆహారంలో 50% ఇప్పుడు సేంద్రియ ఇంటిపంటలే అందిస్తున్నాయి. స్థానిక సహజ వనరులతో ఆరోగ్యదాయకమైన పంటలు పండించుకుంటూ ఆహార సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోగలమని క్యూబా ప్రజలు ప్రపంచానికి చాటుతున్నారు. సోవియట్ యూనియన్ పతనానికంటే ముందు వరకు క్యూబా.. పెట్రోల్, డీజిల్‌తోపాటు 60%పైగా ఆహారోత్పత్తుల్ని, రసాయనిక ఎరువులు, పురుగుమందులను సైతం ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటూండేది. పొగాకు, చక్కెర తదితరాలను ఎగుమతి చేస్తూ ఆహారోత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటూ ఉండేది. ఆ దశలో సోవియట్ పతనం(1990–91)తో కథ అడ్డం తిరిగింది. అమెరికా కఠిన ఆంక్షల నేపథ్యంలో సోషలిస్టు దేశమైన క్యూబా అనివార్యంగా ఆహారోత్పత్తిలో స్వావలంబన దిశగా అడుగేయాల్సి వచ్చింది. క్యూబా ఆకలితో అలమటించిన కష్టకాలం అది. ఈ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో క్యూబా సమాజం ఉద్యమ స్ఫూర్తిని చాటింది. నగరాలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలన్నీ సేంద్రియ పొలాలుగా మారిపోయాయి. అర్బన్ ప్రజలు సైతం తమ ఇళ్ల పరిసరాల్లోనే సీరియస్‌గా సేంద్రియ ఇంటిపంటల సాగు చేపట్టారు. గ్రామీణ రైతులు కూడా పొలాల్లో ఎగుమతుల కోసం చెరకు, పొగాకు వంటి వాణిజ్య పంటల సాగు తగ్గించి ఆహార పంటల సాగు వైపు దృష్టి సారించారు. సగం కంటే తక్కువ రసాయనాలతోనే రెండు రెట్లు ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయవలసి వచ్చింది. డీజిల్ లేక ట్రాక్టర్లు మూలనపడ్డాయి. పూర్తిగా ఎద్దులతోనే వ్యవసాయం చేయాల్సి వచ్చింది. అటువంటి సంక్షోభం నుంచి ‘పట్టణ సేంద్రియ వ్యవసాయం’ వినూత్న పరిష్కారాన్ని ఆవిష్కరించింది. నగర/పట్టణ ప్రాంతాల్లో స్థానిక సేంద్రియ వనరులతోనే జీవవైవిధ్య వ్యవసాయ సూత్రాల ఆధారంగా సేద్యం సాధ్యమేనని రుజువైంది. నగరాలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలన్నీ సేంద్రియ క్షేత్రాలుగా మారాయి. అక్కడ వీటిని ‘ఆర్గానోపోనికోస్’ అని పిలుస్తున్నారు. ‘సమీకృత సస్య రక్షణ, పంటల మార్పిడి, కంపోస్టు తయారీ, భూసార పరిరక్షణ చర్యలు పెద్ద ఎత్తున అమలయ్యాయి. అడుగు ఎత్తున మడులను నిర్మించి, డ్రిప్‌తో పంటలు సాగు చేశారు. వర్మి కంపోస్టు, పశువుల ఎరువు, జీవన ఎరువులతో పాటు 25% మట్టిని కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసి ఈ ఎత్తు మడుల్లో పంటల సాగుకు వినియోగిస్తున్నారు. ఇలా అమలు చేసిన పర్మాకల్చర్, వర్మికల్చర్ తదితర సాంకేతికతలనే ఇప్పుడు క్యూబా ఇతర దేశాలకు అందిస్తోంద’ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ క్యూబా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ స్టీఫెన్ విల్కిన్సన్ చెప్పారు. 1993లో క్యూబా వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ప్రపంచంలోనే తొట్టతొలి పట్టణ వ్యవసాయ విభాగం ఏర్పాటైంది. నగరాలు, పట్ణణాల్లో పంటల సాగుకు ఆసక్తి చూపిన కుటుంబానికి లేదా చిన్న సమూహానికి ఎకరం పావు (0.5 హెక్టారు) చొప్పున ప్రభుత్వం స్థలం కేటాయించింది. వాళ్లు తమకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకొని తింటూ.. మిగిలినవి ఇతరులకు అమ్ముతుంటారు. ఈ ప్లాట్లు కాకుండా.. నగరం మధ్యలో, పరిసరాల్లో 5–10 ఎకరాల విస్తీర్ణంలో డజన్ల కొద్దీ పెద్దస్థాయి సేంద్రియ క్షేత్రాలు (ఆర్గానోపోనికోలు) ఏర్పాటయ్యాయి. సహకార సంఘాలే వీటిని నిర్వహిస్తున్నాయి. బచ్చలి కూర, పాలకూర, టమాటాలు, మిరియాలు, గుమ్మడికాయలు, బత్తాయిలు, ఔషధ మొక్కలు, అనేక ఇతర పంటలను భారీ పరిమాణంలో పండించి తక్కువ ధరకు ప్రత్యేక దుకాణాల్లో సహకార సంఘాలు విక్రయిస్తూ ఉంటాయి. హవానా నగరంలో దేశాధినేత కార్యాలయానికి అతి దగ్గర్లోనే 3 హెక్టార్లలో ‘ఆర్గానోపోనికో ప్లాజా’ క్యూబా ఆహార సార్వభౌమత్వాన్ని చాటుతూ ఉంటుంది. 1995 నాటికే క్యూబా రాజధాని నగరం హవానాలో ఇలాంటి 25,000 సేంద్రియ తోటలు వెలిశాయి. 2020 నాటికి వీటి సంఖ్య 30 వేలకు చేరింది. ఆ విధంగా క్యూబా సమాజం తనపై విరుచుకుపడిన ఆంక్షలను, ఆకలిని అర్బన్ అగ్రికల్చర్ ద్వారా జయించింది. (క్లిక్ చేయండి: అర్బన్ ఫుడ్ హీరో మజెదా బేగం!) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
అర్బన్ ఫుడ్ హీరో మజెదా బేగం!
కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఆహార, ఆదాయ కొరత సమస్యల నుంచి బయటపడటానికి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పేద కుటుంబాలకు.. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) కొత్త బతుకు బాట చూపింది. అందుబాటులో ఉన్న స్థలాల్లో మెరుగైన పద్ధతుల్లో సేంద్రియ కూరగాయల సాగు నేర్పించింది. ఎక్కడో మారుమూల గ్రామాల్లో వ్యవసాయక కుటుంబాల్లో పుట్టి పొట్ట చేతపట్టుకొని నగరాలకొచ్చి స్థిరపడిన పేదలకు స్వీడన్ నిధులతో ఎఫ్.ఎ.ఓ. అర్బన్ గార్డెనింగ్‌లో ఇచ్చిన శిక్షణ వారికి కొత్త భరోసా ఇస్తోంది. దీంతో 2.2 కోట్ల జనాభాతో కాంక్రీటు నివాసాలతో కిటకిటలాడే ఢాకా నగరం అంతటా కోవిడ్ కష్టకాలంలో సేంద్రియ కూరగాయ తోటలు వెలిశాయి. ఇవి పేదలకు సేంద్రియ ఆహారాన్ని రుచి చూపించాయి! ‘సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలో, ఎలా ఉపయోగించాలో, నా కుటుంబం కోసం సేంద్రియ కూరగాయలను ఎలా పండించాలో శిక్షణకు హాజరైన తర్వాత నాకు తెలిసింది’ అని మజెదా బేగం ఆనందంగా చెబుతోంది. ఢాకాలో నివాసం ఉండే పేద కుటుంబాల్లో ఆమె కుటుంబం ఒకటి. భర్త, ఐదుగురు పిల్లలతో కలసి రెక్కల కష్టం మీద మజెదా బేగం కుటుంబాన్ని లాక్కొస్తుంటుంది. కోవిడ్ విరుచుకుపడే సమయానికి టీ స్టాల్ నడుపుకుంటూ, చిన్నా చితకా వస్తువులు అమ్ముతూ, మురికివాడలో జీవనం సాగించేవారు. టీ స్టాల్ ప్రారంభించిన తర్వాత జీవన పరిస్థితులు అంతకుముందుకన్నా మెరుగుపడినప్పటికీ, వచ్చే ఆదాయం కుటుంబానికి పూర్తిగా సరిపోయేది కాదు. ఐదుగురు పిల్లలకు మరింత మెరుగైన పోషకాహారాన్ని అందించడం ఎలాగూ సాధ్యపడదు. అయితే, ఆహార వ్యవసాయ సంస్థ తోడ్పాటు వల్ల మజెదా ఏర్పాటు చేసుకున్న అర్బన్ కిచెన్ గార్డెన్ ఈ కొరత తీర్చింది. అసంఘటిత రంగంలో ఆహార, ఆర్థిక అభద్రత మధ్య జీవనం సాగించే అనేక మందిలాగే మజెదా కుటుంబాన్ని కూడా కోవిడ్ దారుణంగా దెబ్బ తీసింది. లాక్డౌన్ వల్ల జీవనాధారమైన టీ స్టాల్‌ను మూసివేయవలసి వచ్చినప్పుడు మజెదా చేతిలో డబ్బేమీ లేదు. పనులు దొరకడం కష్టమైపోయింది. పైగా, ఆమె భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ విధంగా ఏడుగురితో కూడిన కుటుంబానికి ఆమే జీవనాధారమైంది. అయినా, ఆమె నిరాశ పడకుండా ధైర్యంగా నిలబడింది. వ్యవసాయం అంటే ఆమెకు బాల్యం నుంచి ఉన్న ఇష్టం ఇప్పుడు ఉపయోగపడింది. ఇళ్లకు దగ్గర్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో సేంద్రియ కూరగాయలు పండించటం, కుటుంబం తినగా మిగిలిన కూరగాయలను అమ్మి ఆదాయం పొందటంలో పేద మహిళలకు ఎఫ్.ఎ.ఓ. శిక్షణ ఇచ్చింది. దీంతో, ఢాకా నగరం మధ్యలో ఇళ్ల వెనుక స్థలాలు, ఖాళీ స్థలాల్లో, నదీ తీర ప్రాంతాల్లో ఆర్గానిక్ కిచెన్ గార్డెన్లు వెలిశాయి. మజెదా కూడా కూరగాయల సాగు చేపట్టింది. ‘సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలో, చీడపీడల్ని ఎలా అదుపులో ఉంచాలో అంతకుముందు నాకు తెలీదు. కానీ ఇప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలో, నా కుటుంబం కోసం సేంద్రియ కూరగాయలను ఎలా పండించాలో ఇప్పుడు తెలిసింది. ఇప్పటికైనా రైతును కావడం గొప్ప అదృష్టం’ అంటోంది మజెదా సంతృప్తితో. పురుగుమందులు వాడకుండా తమ కళ్ల ముందే ఆమె పండించే కూరగాయలకు స్థానికంగా చాలా డిమాండ్ ఉంది. కూరగాయల తోట ద్వారా తన కుటుంబ అవసరాలు పోను నెలకు 1500 టాకాల (సుమారు రూ. 2 వేలు) ఆదాయం పొందుతోంది మజెదా. ఐదుగురు బిడ్డలున్నా ఎన్నడూ లేనిది ఇప్పుడు ఒక బిడ్డను ఆమె బడికి పంపగలుగుతోంది. కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలవగలిగినందుకు తనకు చాలా గర్వంగా ఉందని మజెదా పట్టలేని సంతోషంతో చెబుతోంది. ప్రపంచ ఆహార దినోత్సవం–2022 సందర్భంగా ఎఫ్.ఎ.ఓ. ఆమెను ‘ఫుడ్ హీరో’గా గుర్తించి గౌరవించింది అందుకే! (క్లిక్ చేయండి: నేచర్ అర్బైన్.. అతిపెద్ద రూఫ్‌టాప్ పొలం!) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
మీరు తినే ఆహారంలో పోషకాలెన్ని? విష రసాయన అవశేషాలతో భద్రం!
ఆహారమే ఔషధం అనే రోజులు పోయి, ఆహారమే రోగకారకమైన రోజులు వచ్చాయి. ఆహారం కంటి నిండా, చేతి నిండా, గోదాముల నిండా వుంది. కానీ, అందులో పోషకాలు మాత్రం అంతకంతకూ అడుగంటి పోతున్నాయి. అరకొర పోషకాలతో పాటు విష రసాయన అవశేషాలు అదనం. వెరసి, ఇప్పుడు మనకు అన్ని విధాలా అనారోగ్యకారకమైన ఆహారం అత్యాధునిక రూపాల్లో పుష్కలంగా అందుబాటులో వుంది! ఏదో ఒక ఆహారం పండిస్తే చాలు ఆకలి తీరుతుంది అనుకున్నాం. ఎక్కువ దిగుబడి తెస్తే చాలనుకుంటూ బోల్తా పడ్డాం. వినాశకర సేద్యంతో భూముల్ని సర్వ నాశనం చేసుకున్నాం. జీవం లేని ఆ నేలల్లో పండించుకుంటున్న అరకొర పోషకాల కెమికల్ తిండితో ఇదే ప్రాప్తమనుకొని సరిపెట్టుకుంటున్నాం. ఆహారంలో 18 పోషకాలు ఉన్నాయని ఐరాసకు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ చెబుతోంది. అయితే, రసాయన వ్యవసాయంలో పండించిన పంటలో పోషకాల సాంద్రత, సమతుల్యత లోపించి ప్రజలు రోగాల పాలవుతున్నారు. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వంటి రోగాల పంట పండించుకొని తింటున్నాం. కొని తెచ్చుకొని జీవితాంతం నెత్తిన మోస్తున్నాం. ఈ విపత్కర ఆహార ఆరోగ్య పర్యావరణ విధ్వంసక దుస్థితి నుంచి బయటపడే మార్గం ఉందా? సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తిరిగి అందరికీ అందుబాటులోకి తెచ్చుకోగలమా? ఈ ప్రశ్నలన్నిటికీ ‘అవును. ప్రకృతి వ్యవసాయంతో ఇది ముమ్మాటికీ సాధ్యమే! ఇంకా చెయ్యి దాటిపోలేదంటూ’ శుభవార్త చెబుతున్నారు నిపుణులు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారోత్పత్తుల్లో 50కి పైగా పోషకాలు వుంటాయని, రసాయనాలతో పండించిన ఆహారంలో కన్నా ఈ సహజాహారంలో పోషకాల సాంద్రత రెండు రెట్లు ఎక్కువగా వుంటుందని సూచిస్తున్నారు. ∙∙ ప్రపంచ జనాభా 798 కోట్లు. ప్రజలందరికీ అవసరమైన దానికన్నా ఎక్కువగానే ఇప్పుడు తిండి గింజలు పండించుకుంటున్నాం. గోదాములు కిటకిటలాడుతున్నాయి. ఆ మేరకు ఆహార భద్రత వుంది. అయితే పేదరికం వల్ల అందరికీ ఆహారం అందటం లేదు. దాదాపు 310 కోట్ల మందికి నాణ్యమైన ఆహారం తినే ఆర్థిక స్థోమత లేదు. మరో 82.8 కోట్ల మంది నిరుపేదలు అనుదినం అర్ధాకలితో ఈసురో మంటున్నారు. సామాజిక, ఆర్థిక అసమానతలతో సతమతం అవుతున్న వీరి సంగతి అటుంచితే, పుష్కలంగా ఆహారం తింటున్నప్పటికీ ఆహార సంబంధమైన జబ్బుల పాలవుతున్నవారు చాలామంది వున్నారు. ఈ సమస్యనే ‘హిడెన్ హంగర్’ అంటారు. ‘హిడెన్ హంగర్’ మూలంగా 200 కోట్ల మంది క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, ఆటో ఇమ్యూన్ డీసీజెస్ వంటి ప్రాణాంతక జబ్బుల పాలవుతున్నారని ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) అంచనా. అంతేకాదు, ప్రతి 8 మందిలో ఒకరు స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఈ సమస్య ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ అంతకంతకూ పెరుగుతోంది. గత ఏడు దశాబ్దాల్లో మన ఆహారంలో విటమిన్లు, పోషకాల సాంద్రత అడుగంటడమే ఇందుకు మూల కారణమని ఎఫ్.ఏ.ఓ. అధినేత క్యూ డోంగ్యు వాపోయారు. ఇప్పటి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు దశాబ్దాల క్రితం పెరిగిన వాటి కంటే తక్కువ ప్రోటీన్, కాల్షియం, భాస్వరం, ఇనుము, రిబోఫ్లావిన్, విటమిన్ సి కలిగి ఉన్నాయని అనేక శాస్త్రీయ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. అందువల్ల, మనం తింటున్న ఆహారంలో ఆరోగ్యం ఎంత? పోషకాల సాంద్రత ఎంత? అన్నవే ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఇప్పుడు చర్చనీయాంశాలయ్యాయి. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. ఇది పూర్వకాలపు మాట. ఇప్పటి ఆహారంలో క్యాలరీలు ఉంటున్నాయి గానీ పోషకాల సాంద్రత, సమతుల్యత లోపించాయి. ఇప్పటికి ఆకలి తీర్చుతూనే మనల్ని రోగగ్రస్తులుగా మారుస్తోంది. ప్రసిద్ధ సాయిల్ ఎకాలజిస్ట్ డాక్టర్ క్రిస్టీన్ జోన్స్ (ఆస్ట్రేలియా) చెప్తున్నదేమంటే, 1940లో తిండి పదార్థాల్లో వున్నన్ని పోషకాలు ఇప్పుడు మనం పొందాలంటే మాంసం అయితే ఎప్పటికన్నా రెట్టింపు తినాలి. పండ్లయితే మూడింతలు, కూరగాయలైతే ఏకంగా నాలుగైదు రెట్లు తినాల్సిన దుస్థితి నెలకొంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో రొడేల్ ఇన్స్టిట్యూట్ 70 ఏళ్లుగా సేంద్రియ, రసాయన సేద్యం, ఆహారంలో వస్తున్న మార్పులపై తులనాత్మక పరిశోధన చేస్తోంది. ‘పారిశ్రామిక వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా నేలలను క్షీణింపజేసింది. సంకుచిత దృష్టితో దిగుబడుల పెంపుదల గురించి మాత్రమే సాగు చేస్తున్నారు. పోషకాలపై దృష్టి లేదు. ఈ రోజు మనం తినే ఆహారంలో అర్ధ శతాబ్దం క్రితం పండించిన ఆహారం కంటే తక్కువ ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, రిబోఫ్లావిన్, విటమిన్–సి ఉన్నాయ’ని రొడేల్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. మనుషులు 1950కు ముందు కన్నా ఇప్పుడు దీర్ఘకాలం జీవిస్తున్నారు, అయితే ఆహారంలో పోషకాల సాంద్రత బాగా తగ్గిపోవటంతో జీవన నాణ్యత తగ్గిపోయింది. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, ఆటో ఇమ్యూన్ డీసీజెస్ వంటి జబ్బులు పెచ్చరిల్లటానికి రసాయనిక పురుగుమందుల అవశేషాలతో పాటు పోషకాల సాంద్రత తగ్గిపోవటం కూడా ఓ ముఖ్య కారణం. ఈ జబ్బులతో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 71% మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని పేర్కొంది రొడేల్ ఇన్స్టిట్యూట్ కార్యనిర్వాహక సంచాలకుడు జాన్ మేయర్ అన్నారు. ఆహారం రోగ కారకంగా ఎలా మారింది? ఆహార సమస్య మూలాలను అర్థం చేసుకోవాలంటే భూమి లోపలికి తొంగి చూడాల్సిందే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూముల్లోకి రసాయనిక ఎరువులు, పురుగు/ తెగుళ్లు/ కలుపు మందులు వచ్చి చేరాయి. అవి ఆహారం గుణగణాలను, స్వరూప స్వభావాలను గుణాత్మకంగా మార్చేశాయి. పంట భూములను విష రసాయనాలతో నింపేయటం మొదలు పెట్టిన తర్వాత మట్టిలో సహజ సేంద్రియ పోషక వ్యవస్థ నాశనమవ్వటం ప్రారంభమైంది. నేల ఉత్పాదక శక్తిని కోల్పోయింది. మొక్కలకు, తద్వారా మన ఆహారానికి పోషకాలు అందించే శిలీంద్రాలు, సూక్ష్మజీవులు, వానపాములు సహా జీవ పర్యావరణ వ్యవస్థ అంతా నిర్జీవం అయిపోయింది. సహజసిద్ధంగా పోషకాలు పంటలకు అందే మార్గం బాగా పరిమితం అయిపోయింది. రసాయనిక వ్యవసాయం చేసే భూముల్లో మట్టి గట్టి పడిపోతుంది. పంట మొక్కల వేర్లు 10–20 సెంటీమీటర్ల వరకే చొచ్చుకు వెళ్ళ గలుగుతాయి. ఆ మేరకు పోషకాల లభ్యత కూడా తగ్గిపోతుంది. రసాయనిక ఎరువుల ద్వారా నత్రజని, భాస్వరం, పొటాష్‌తో పాటు అతికొద్ది రకాల పోషకాలను మాత్రమే అందిస్తుండటంతో.. ఆ పొలాల్లో పండిన పంట దిగుబడుల్లో పోషకాల సమగ్రత లోపించింది. ప్రాకృతిక పుష్కలత్వం నుంచి రసాయనిక పరిమితత్వంలోకి వ్యవసాయం దిగజారిపోయింది. ఈ పరిణామమే మన ఆహారాన్ని అతికొద్ది రకాల పోషకాలకే పరిమితం చేసేసింది. ఆలా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో మన ఆహారం ‘అరకొర పోషకాల’తో పోషకాల సమగ్రత, సమతుల్యతను కోల్పోయింది. మూలిగే నక్క మీద తాటి పండు మాదిరిగా రసాయనాల అవశేషాలు కూడా తోడవటంతో.. అమృతాహారం ‘రోగకారక ఆహారం’గా మారిపాయింది. ఎఫ్.ఏ.ఓ. సమాచారం ప్రకారం.. ప్రకృతిలో 92 రసాయన మూలకాలు ఉంటాయి. మొక్కలకు భూమి నుంచి 15 (6 స్థూల, 9 సూక్ష్మపోషకాలు) అందుతున్నాయి. మరో మూడింటిని మొక్కలు వాతావరణం నుంచి గ్రహిస్తున్నాయని ఎఫ్.ఏ.ఓ. చెబుతోంది. గత 70 ఏళ్లలో ఆహారంలో విటమిన్లు, పోషకాల సాంద్రత బాగా తగ్గిందని కూడా సెలవిచ్చింది. సహజాహారంలో 50+ పోషకాలు అడవిలో లేదా ప్రకృతి వ్యవసాయం ద్వారా పునరుజ్జీవింపజేసిన భూముల్లో పండించిన ఆహారోత్పత్తుల్లో రసాయనిక సేద్యంలో పండించిన ఆహారంలో కన్నా పోషకాల సాంద్రత రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆస్ట్రేలియాకు చెందిన ప్రసిద్ధ సాయిల్ మైక్రోబయాలజిస్ట్, రీజెనెరేటివ్ అగ్రికల్చర్ నిపుణుడు డాక్టర్ వాల్టర్ ‘సాక్షి’కి ఇచ్చిన జూమ్ ఇంటర్వ్యూలో తెలిపారు. రసాయన వ్యవసాయ భూమి బండబారి ఉంటుందని, సీజనల్ పంట మొక్కల వేర్లు 10–20 సెంటీమీటర్ల కన్నా లోతుకు వెళ్ళలేవని అన్నారు. ప్రకృతి వ్యవసాయ భూముల్లో పంటల వేర్లు 2 మీటర్ల వరకూ చొచ్చుకు వెళ్లగలవు. ఆ మేరకు పోషకాల సాంద్రతతో పాటు ఉత్పాదకత కూడా పెరుగుతాయి. ఈ ఆహారంలో సుమారు 50కి పైగా పోషకాలు ఉంటాయి. చాలా సూక్ష్మపోషకాలు అతి తక్కువ పాళ్లలోనే ఉన్నప్పటికీ.. పోషకాల సమతుల్యత, సమగ్రతలో ఇవి చాలా కీలకం అన్నారాయన. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారంలో వున్న పోషకాలలో మూడింట ఒక వంతు కన్నా తక్కువ పోషకాలు మాత్రమే రసాయన వ్యసాయంలో పండించిన ఆహారంలో వుంటాయని పరిశోధనల్లో తేలిందన్నారు డాక్టర్ వాల్టర్. రసాయనాలు వేయని ప్రకృతి వ్యవసాయ భూమిలో సేంద్రియ కర్బన నిల్వలతో కూడిన వ్యవస్థ (సాయిల్ ఆర్గానిక్ స్పాంజ్) ఏర్పడుతుంది. సహజ పోషక పునర్వినియోగ చక్రం పునరుద్ధరణకు ఇదే మూలం. 98% పోషకాలు దీని ద్వారానే పంట మొక్కలకు అందుతాయి. శిలీంద్రాలు, సూక్ష్మజీవుల పాత్ర కీలకం ఆహారంలో పోషకాల సాంద్రత ఒక్కటే కాదు.. ఆ పోషకాలు తగిన నిష్పత్తిలో సమతుల్యంగా ఉండటం అతి ముఖ్యమైన విషయం. ఏయే పోషకాన్ని ఎంత నిష్పత్తిలో స్వీకరించాలో ఎంపిక చేసుకునే సెలెక్టివ్ మెకానిజం సజీవమైన భూమిలో శిలీంద్రాలు, సూక్ష్మజీవుల వ్యవస్థకు ఉంటుంది. శిలీంద్రపు పోగులు తమ ఆహారపు అవసరాల కోసం చేసే ఈ పని వల్ల మొక్కల వేర్లకు కూడా పోషకాలు సమతుల్యంగా అందుతాయి. సాధారణంగా మట్టిలో వుండే ముడి పోషకాలను నేరుగా మొక్కల వేర్లు తీసుకోలేవు. అందుకే వీటి రూపం మార్చి వేర్లకు అందించేందుకు ప్రకృతిలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైంది. సకల పోషకాలను అందించే ఈ పని మైకోరైజా వంటి ఇంటెలిజెంట్ శిలీంద్రాలకు, అశేష సూక్ష్మజీవ రాశి, వానపాములకి ప్రకృతి అప్పగించింది. చదరపు మీటరుకు 25 వేల కిలోమీటర్ల పొడవున విస్తరించి వుండే శిలీంద్రపు పోగులు, సూక్ష్మజీవులు, వానపాములు ఈ బృహత్ కార్యం చేస్తూ ఉంటాయి. ఈ సహజ జీవరసాయన ప్రక్రియల ద్వారా మొక్కల వేర్లకు సకల పోషకాలు అందుతాయి. శిలీంద్రాలు, సూక్ష్మజీవరాశులు చేసే ఈ సేవకు మొక్కలు ప్రతిసేవ చేస్తాయి. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తాము తయారుచేసుకున్న పోషక ద్రవం (సుగర్స్)లో నుంచి 30–40 శాతాన్ని వేర్ల ద్వారా మట్టిలోకి జారవిడుస్తూ ఉంటాయి. ఈ సుగర్స్‌ను సూక్ష్మజీవులు, శిలీంద్రాలు తీసుకుంటూ మనుగడ సాగిస్తాయి. ఈ సుగర్స్‌ను ‘రూట్ ఎక్సుడేట్స్’ అంటారు. మొక్కలు తయారు చేసుకునే పోషక ద్రవాహారంలో ఇంకో 30% కాండం, ఆకులు, గింజలు, కాయలు, పూల పెరుగుదలకు.. మిగతా 30%ని వేరు వ్యవస్థ పెరుగుదలకు చెట్లు, మొక్కలు ఉపయోగిస్తాయి. మన ఆహారంలోనూ తగ్గుతున్న పోషకాలు సీఎస్ఏ అధ్యయనంలో వెల్లడి ఆహారోత్పత్తుల్లో పోషకాల సాంద్రత బాగా తగ్గటం, సాగు భూములు నిస్సారం కావడానికి మధ్య సంబంధం వుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామమే మన దేశంలో కూడా జరుగుతున్నట్లు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సుస్థిర వ్యవసాయ కేంద్రం నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. మన దేశంలో ఆహారోత్పత్తుల్లో పోషకాలపై జాతీయ పోషకాహార సంస్థ (ఎన్.ఐ.ఎన్.) 1987, 2017 సంవత్సరాల్లో వెలువరించిన ఇండియన్ ఫుడ్ కంపోజిషన్ టేబుల్స్ ఆధారంగా ప్రధానంగా ఈ అధ్యయనం చేశారు. ఈ 30 ఏళ్ళ కాలంలో శక్తి, రిబోఫ్లావిన్, నియాసిన్ భారీగా తగ్గాయి. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, ప్రోటీన్, థయామిన్ తదితర పోషకాల్లో కూడా తగ్గుదల కనిపించింది. వ్యవసాయంలో రసాయనాల వాడకం వల్ల ఆహారంలో పోషకాలు తగ్గుతున్న సంగతిని గుర్తించి పాలకులు, పరిశోధన సంస్థలు విధానాల రూపకల్పనలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు అన్నారు. ఈ అధ్యయనం వివరాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో ప్రచురితం అయ్యాయి. జన్యుమార్పిడితో పోషకాల సమతుల్యతకు భంగం రెండో ప్రపంచ యుద్ధానికి ముందు స్థాయితో పోల్చితే ఆహారంలో ఇప్పుడు మూడో వంతు పోషకాలు మాత్రమే మిగిలాయి. జన్యుమార్పిడి వంటి టెక్నాలజీల ద్వారా ఎక్కువ ఇనుము, మాంగనీస్ వాటి పోషకాలను టొమాటోల్లోకి జొప్పించటం వల్ల ప్రయోజనం ఉండదు. అందులో పోషకాల సమతుల్యతకు భంగం కలగవచ్చు. కాబట్టి మనుషుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించటానికి ఇది సహాయం చేయదు. సమస్యలకు దగ్గరి దారిలో పరిష్కారం వెతికే క్రమంలో సహజ సమతుల్యతలకు భంగం కలిగిస్తున్నాం. ఆ క్రమంలో మరిన్ని సమస్యలను సృష్టిస్తున్నామని మనం గుర్తించాలి. బియ్యానికి అదనపు ఇనుము జోడించి గోల్డెన్ రైస్ తయారు చేస్తున్నారు. ఈ విధంగా అదనపు పోషకాలను కృత్రిమంగా జోడించడం వలన సహజ ఆహారంలో మాదిరిగా పోషకాల సమగ్రతను గానీ, పోషకాల మధ్య కూర్పును గానీ, సమతుల్యతను గానీ సాధించలేం. ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ ద్వారా చాలా సమయాన్ని, చాలా శ్రమను వృథా చేసుకుంటున్నాం. ఈ శక్తి యుక్తులను ప్రకృతి వ్యవసాయాన్ని సర్వవ్యాప్తం చేసే దిశగా ఖర్చు చేయటం మేలు. ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ, రసాయనిక వ్యవసాయాల ద్వారా పండించిన ఆహారోత్పత్తుల మధ్య వ్యత్యాసాన్ని అంచనా వేసేటప్పుడు వాటి బరువును బట్టి కాకుండా వాటి పోషకాల సమగ్రతను, వాటి ఆరోగ్యపరమైన విలువను గుర్తించాలి. మనం తినే ఆహారంలోని పోషకాల సమగ్రతపైనే మన దేహంలో జరిగే జీవ రసాయన ప్రక్రియలు, రోగ నిరోధక శక్తి 90 శాతం వరకూ ఆధారపడి ఉంటుంది. – డాక్టర్ వాల్టర్ యన, ప్రసిద్ధ సాయిల్ మైక్రోబయాలజిస్ట్, రీజెనరేటివ్ అగ్రికల్చర్ నిపుణుడు, ఆస్ట్రేలియా ఔషధ గుణాలు ఎలా వచ్చాయి? సహజ ఆహారానికి ఔషధ గుణాలు ఎలా వస్తాయి అనేది ఆసక్తికరమైన ప్రశ్న. ప్రకృతిసిద్ధంగా పెరిగే పంటల ఆహారంలో ఏయే పోషకాలు ఏయే నిష్పత్తిలో ఉండాలో ఎంపిక చేసే ఇంటెలిజెంట్ శిలీంద్ర వ్యవస్థ ఉంటుందని తెలుసుకున్నాం కదా! చాలా ముఖ్యమైన ఇంకో విషయం ఏమిటంటే, మట్టిలో నుంచి పోషకాలను సమతుల్యంగా ఎంపిక చేసి సంగ్రహించటంతో పాటు (అల్యూమినియం, లెడ్ వంటి హెవీ మెటల్స్) హానికరమైన విషతుల్యాలను గుర్తించి పక్కనపెట్టేసే విజ్ఞతతో కూడిన నాణ్యత నియంత్రణ శక్తి కూడా శిలీంద్ర వ్యవస్థకు ఉంది. ఈ కారణంగానే పూర్తిగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించినప్పుడు ఆ ఆహారం పోషకాల సాంద్రత, సమగ్రత, సమతుల్యతలతో పాటు ఔషధ గుణాలనూ కలిగి సంతరించుకుంటుంది. ఈ ఆహారంలో క్యాన్సర్ కణాలను మట్టుబెట్టే సెలీనియం ఉంటుంది. అందుకే ఆర్గానిక్ ఆహారాన్ని ‘డిసీజ్ ప్రివెంటెటివ్ ఫుడ్’ అని వ్యవహరిస్తున్నారు. సాగు భూముల్లో సేంద్రియ కర్బనం 0.5%–03%కి తగ్గిపోయింది. ఇప్పటికే 33% వ్యవసాయ భూమి వ్యవసాయ యోగ్యం కాకుండా పోయింది. దీనికి మూలం రసాయనిక సేద్యమే. పాలకులు, ప్రజలు ఇప్పటికైనా మేల్కొని భూముల్ని పునరుజ్జీవింపజేసే ప్రకృతి సేద్యం వైపు మళ్లితే ఆహారం పోషకాల సాంద్రతను, సమతుల్యతను మళ్ళీ సంతరించుకుంటుంది. పనిలో పనిగా భూతాపోన్నతిని కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 60% మంది ప్రజలు ఇంకా గ్రామాల్లో నివసించే భారత్ వంటి దేశాలకు పునరుజ్జీవ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లటం సులభమని డాక్టర్ వాల్టర్ అంటున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని అనుభవం వున్న రైతుల ద్వారా మిగతా రైతులకు నేర్పించటంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతి సాధిస్తోంది. కొన్నేళ్లలోనే రాష్ట్రంలో పొలాలన్నీ ప్రకృతి సేద్యంలోకి మారిపోయి పోషకాల సాంద్రతతో కూడిన అమృతాహారాన్ని ప్రజలకు అందించే సుదినం రానుంది. పోషకాల సాంద్రత, సమగ్రత సాధన కృషిలో దేశీ వంగడాలు, సిరిధాన్యాలకున్న ప్రాధాన్యాన్ని కూడా గుర్తించటం అవసరం. పర్యావరణ అనుకూల వ్యవసాయ, పోషకాహార, ఆరోగ్య గొలుసును పునర్నిర్మించుకోవటానికి ‘ప్రకృతిని తిరిగి తలదాల్చటం’ తప్ప ఏ ఇతర ఖరీదైన అత్యాధునిక ఉపకరణలూ, టెక్నాలజీలూ అక్కరలేదని కూడా అనుభవాలు తెలియజెపుతున్నాయి. ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ సందర్భంగా మన భూముల్ని, మన ఆహారారోగ్యాలను తిరిగి సుసంపన్న పోషకవంతంగా మార్చుకోవటానికి పునరంకితమవుదాం. – పంతంగి రాంబాబు -
పేదల ఆకలి తీర్చే ఆర్గానిక్ గార్డెన్స్!
మురికివాడల్లో నిరుపేదల సంక్షేమం కోసం ఆహార ధాన్యాలు, పప్పులు ఉప్పులను ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వటం మనకు తెలుసు. వాటితో పాటు సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలను అందుబాటులోకి తెస్తోంది రియో డి జనీరో (బ్రెజిల్) నగరపాలక సంస్థ! రియో ఎంతో అందమైన నగరం. అంతే కాదు.. విశాలమైన మనసున్న మహానగరం కూడా! సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలను మడుల్లో పెంచటాన్ని నేర్పించటం ద్వారా సేంద్రియ ఆహారాన్ని వెనుకబడిన ప్రజల్లోనూ ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే బృహత్తర లక్ష్యాన్ని పెట్టుకున్నారు రియో నగర మేయర్ ఎడ్వర్డో పేస్. తొలినాళ్లలో ప్రభుత్వ నిధులతో గార్డెన్లను నిర్వహించటం, తదనంతరం స్థానికులే స్వయంగా నిర్వహించుకుని కూరగాయల సాగులో స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తోంది రియో నగర పర్యావరణ శాఖలోని ప్రత్యేక ఉద్యాన విభాగం. పేదల ఇళ్ళకు దగ్గర్లోనే ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసింది. వీటిల్లో వేలకొలది ఎత్తు మడులు నిర్మించి, అక్కడి వారితోనే సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయించి, ఇంటింటికీ పంపిణీ చేస్తోంది. 2006లో ప్రారంభమైన ఈ అర్బన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ ‘హోర్టాస్ కారియోకాస్’ (‘రియోవాసుల కూరగాయల తోట’ అని దీని అర్థం) సంఖ్య గత 16 ఏళ్లలో 56కి పెరిగింది. వీటిలో 29 మురికివాడల్లో, 27 నగరంలోని పాఠశాలల్లో ఉన్నాయి. దాదాపు 50,000 కుటుంబాలు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో నిమగ్నమై ఉన్నాయి. గత సంవత్సరానికి మొత్తం 80 టన్నుల ఆకుకూరలు, కూరగాయలను వీటిలో పండించి, పంపిణీ చేశారు. ఇది కొందరికి తాజా ఆహారం దొరికింది. మరికొందరికి ఈ గార్డెన్స్‌లో పని దొరకటంతో ఆదాయం సమకూరింది. కరోనా కష్టకాలంలో ఈ గార్డెన్లు తమని ఎంతో ఆదుకున్నాయని ప్రజలు సంతోషపడుతున్నారు. ఆహారం ఎంతో అవసరమైన జనం నివాసమున్న చోటనే కమ్యూనిటీ అర్బన్ గార్డెన్లను మరింతగా విస్తరించాలని రియో నగర పాలకులు సంకల్పించారు. రియో నగర ఉత్తర ప్రాంతంలోని మూడు మురికివాడల్లో నిర్మించిన గార్డెన్లను విస్తరింపచేసి ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ కమ్యూనిటీ కిచెన్ గార్డెన్‌ను నెలకొల్పాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. ఆ గార్డెన్ ఏకంగా 15 ఫుట్ బాల్ కోర్టులంత ఉంటుందట. అంటే, దాదాపు 11 హెక్టార్ల విస్తీర్ణం అన్నమాట! 2024 నాటికి ఈ కల సాకారం కాబోతోంది! ప్రతినెల లక్ష కుటుంబాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం పొందుతాయి. అర్బన్ అగ్రికల్చర్‌కు ఉన్న శక్తి ఏపాటిదో దీన్ని బట్టి అర్థం అవుతుంది అంటున్నారు జూలియో సీజర్ బారోస్. ‘హోర్టాస్ కారియోకాస్’ పథకం అమలుకు రియో డి జనీరో మునిసిపల్ పర్యావరణ విభాగం తరఫున ఆర్గానిక్ గార్డెనింగ్ డైరెక్టర్ హోదాలో శ్రీకారం చుట్టిన అధికారి ఆయన. ‘మా ప్రాజెక్ట్ లక్ష్యం అందమైన తోటను నిర్మించడం కాదు. నగరంలోనే సేంద్రియ ఆహారాన్ని పండించి ఎంత మందికి అందించగలమో చూడాలన్నదే’ అని బారోస్ చెప్పారు. మురికివాడల్లో నివాసం ఉండే వారినే తోట మాలులుగా, సమన్వయకర్తలుగా నియమిస్తారు. వారికి స్టైఫండ్ ఇస్తారు. పండించిన కూరగాయల్లో 50% మురికివాడల్లోని పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. మిగిలిన 50% తోటమాలులకు ఇస్తారు. వాళ్ళు ఇంట్లో వండుకొని తినొచ్చు లేదా అక్కడి వారికే సరసమైన ధరలకు అమ్ముకోనూ వచ్చు. ప్రతి తోటకు కొంత కాలమే ప్రభుత్వ సాయం అందుతుంది. చివరికి స్వతంత్రంగా మారాల్సి ఉంటుంది అని బారోస్ చెప్పారు. ఆర్థిక లాభాలతో పాటు, ఒకప్పుడు పరిసరాల్లో సాధారణంగా ఉండే మాదకద్రవ్యాల అక్రమ రవాణా నుంచి ప్రజలు దూరంగా ఉండటంలో ఈ ప్రాజెక్ట్ మరింత పెద్ద సామాజిక ప్రయోజనాన్ని అందిస్తుందని బారోస్ అంటారు. – పంతంగి రాంబాబు -
లక్షల్లో వేతనాలు వదిలిన జంట.. ‘పంట’ భద్రులైంది!
ఆ దంపతులు ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆ అర్హతతో మెట్రో నగరాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందారు. లక్షల్లో వేతనాలు తీసుకుంటూ ఆనందమయమైన జీవితం గడుపుతూ వచ్చారు. అయితే వారి మదిలో ఓ వినూత్న ఆలోచన మెదిలింది. వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులను గమనించి తాము కూడా వ్యవసాయంలో ఏదో ఒక విజయాన్ని సాధించాలని భావించారు. అనుకున్నదే తడవుగా తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలి పల్లెబాట పట్టారు. పల్లెలో తమకున్న 25 ఎకరాల పొలంలో రకరకాల పంటలు సాగు చేస్తూ ఆదాయం ఆర్జించడమే గాక, అందరినీ అబ్బుర పరుస్తున్నారు. దాదాపు 30 ఆవులను సైతం పెంచుతూ ప్రకృతి వ్యవసాయంలో పరవశించిపోతున్నారు. భర్త చేస్తున్న వ్యవ‘సాయం’లో భార్య సైతం భాగస్వామి అవుతూ భర్తకు తోడునీడగా ఉంటోంది. సాక్షి, రాయచోటి : అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం గోపగుడిపల్లె పంచాయతీలోని నాగరాజుపల్లెకు చెందిన అశోక్‌రాజు, అపర్ణలు ఇంజినీరింగ్ పట్టభద్రులు. సుమారు పదేళ్లపాటు హైదరాబాదు, ఢిల్లీలోని పలు ప్రైవేటు కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేశారు. అశోక్‌కు నెలకు రూ. 1.20 లక్షల వరకు వేతనం వచ్చేది. అపర్ణకు రూ. 60–70 వేల వరకు వచ్చేది. ఎప్పటినుంచో వ్యవసాయంపై మక్కువ ఉన్న వారు సెలవు రోజుల్లో ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలను వెళ్లి పరిశీలించేవారు. ఈ క్రమంలోనే అందరి కంటే భిన్నంగా వ్యవసాయం చేయాలన్న తలంపు వారిలో మొదలైంది. అనుకున్నదే తడవుగా ఉన్న ఉద్యోగాలను వదిలేసి సొంతూరి వైపు నడిచారు. అమ్మానాన్నల సమక్షంలో ఉన్న 25 ఎకరాల పొలంలో రకరకాల పంటలను వేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. 30 ఆవులను పెంచుతున్నారు. అరుదైన పంటల సాగు ప్రస్తుతం అశోక్‌రాజు తనకున్న పొలంలో అరుదైన పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఐదేళ్ల క్రితం డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలను ఎకరాలో సాగు చేశారు. ఒక్కసారి మొక్కలు నాటితే 30 ఏళ్ల వరకు స్థిరమైన ఆదాయం ఉంటుందని భావించి మొక్కలను పెంచుతున్నారు. డ్రాగన్‌ఫ్రూట్స్ వంగడాలను థాయిలాండ్ (తైవాన్) నుంచి దిగుమతి చేసుకుని పొలంలో ఒక్కొక్క రాతి స్తంభానికి నాలుగు మొక్కలను నాటారు. తోటలో 350 రాతి స్తంభాలు అంటే 1500 డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి. రూ. 8 లక్షల వరకు డ్రాగన్ ఫ్రూట్స్ మీదనే ఖర్చు చేశారు. జూన్ నుంచి మొదలైతే డిసెంబరు వరకు ప్రతి 45 రోజులకు ఒక క్రాప్ వస్తూనే ఉంటుంది. కిలో రూ. 200 చొప్పున నెల్లూరు, హైదరాబాదు, తిరుపతి, మదనపల్లె, చిత్తూరు, పుత్తూరు, కడప ఇలా ఆర్డర్ల మీదనే సరఫరా చేస్తున్నారు. ఎవరికి అవసరమైనా బాక్సులో భద్రపరిచి బస్సుల ద్వారా రవాణా చేస్తున్నారు. నీరు లేకున్నా.. చెట్లు తట్టుకుని నిలబడతాయి. ఎప్పటికీ పంట కాస్తూనే ఉండడంతో మంచి ఆదాయం వస్తోంది. ఏడాదికి సుమారు 4–5 టన్నుల వరకు దిగుబడి వస్తుండగా, రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు టన్ను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం తోటలోని డ్రాగన్ ఫ్రూట్స్ అంట్లు తయారు చేసి ఒక్కొక్క మొక్క రూ. 80 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్క డ్రాగన్ ఫ్రూట్స్‌నే కాకుండా వరిలో కూడా వినూత్న వంగడాలు జీర సాబ, కుచిపటాలై, క్షేత్రాయ మహరాజ్, నవారు (షుగర్‌ను కంట్రోల్ చేసే వంగడంగా గుర్తింపు) లాంటివి సాగు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయంతోనే వేరుశనగ, మామిడి, నన్నారి సాగుకు కూడా శ్రీకారం చుట్టారు. చెరకు వేసి.. బెల్లం తీసి.. అశోక్‌రాజు దంపతులు ప్రకృతి వ్యవసాయంతో చెరకు పంటను పండిస్తున్నారు. సుమారు రెండు ఎకరాల్లో చెరకు పండించి తర్వాత రెండు నెలలపాటు కటింగ్ చేస్తూ వస్తారు. ప్రతిరోజు తోట సమీపంలోనే ఇంటి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గానుగ మిషన్ ద్వారా పాలు బయటికి తీసి పాకం పట్టి బెల్లం తయారు చేస్తున్నారు. రోజూ 200 కిలోలు చొప్పున తీస్తున్న బెల్లానికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు తయారు చేసిన బెల్లంను నేరుగా వచ్చి కొనుగోలు చేసి తీసుకు వెళుతున్నారు. వినూత్న పంటలతోపాటు వ్యవసాయంలోనూ తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న అశోక్‌రాజు దంపతులు 2021లో రైతు నేస్తం అవార్డును అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఆనందంగా ఉంది వ్యవసాయంలో చాలా సంతృప్తి ఉంది. అంతకంటే ఆరోగ్యం, ఆనందం కూడా ఉన్నాయి. అందుకే అందరి కోసం ప్రకృతి వ్యవసాయం ద్వారా రకరకాల పంటలను పండిస్తున్నాము. డ్రాగన్ ఫ్రూట్స్ ద్వారా ఇప్పటికే లక్షల్లో ఆదాయం వచ్చింది. ఆర్డర్ల మీద వాటిని పంపిస్తుంటాము. అలాగే చెరకు ద్వారా బెల్లం కూడా తయారు చేస్తున్నాము. వరిలో కూడా అద్భుతమైన వంగడాలను తీసుకొచ్చి పండిస్తున్నాం. ఈసారి కొత్తగా నన్నారి సాగు కూడా మొదలెట్టాం. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కంటే ప్రకృతి మధ్య చేసే వ్యవసాయంలో ఉన్న ఆనందమే వేరు. – ముప్పాళ్ల అశోక్‌రాజు, ప్రకృతి వ్యవసాయ రైతు, నాగరాజుపల్లె, రామాపురం మండలం -
వ్యవసాయ ప్రగతిలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు చెప్పారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఈ రంగాల్లో మంచి వృద్ధిరేటు నమోదవుతోందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ సాధిస్తోన్న పురోగతి అభినందనీయమన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో మూడురోజులు నిర్వహిస్తున్న 4వ ఆర్గానిక్మేళాను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన రైతుల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతులు కష్టపడినంతగా దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ చూడలేదన్నారు. కరోనా గడ్డు పరిస్థితుల్లోనూ దేశం 4.5 శాతం వృద్ధిరేటు సాధించడానికి ఆంధ్రప్రదేశ్‌లో సాధిస్తున్న పురోగతే కారణమని చెప్పారు. విదేశీమారక ద్రవ్యలోటును తీర్చగలిగే శక్తి దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఉందన్నారు. ప్రపంచ మార్కెట్లో ఎగుమతి అవకాశాలున్న పంటలన్నీ ఇక్కడ పండుతున్నాయన్నారు. బియ్యం, పత్తి, పసుపు, పప్పుధాన్యాలు, అల్లం, పొగాకు ఇలా ఇక్కడ పండేవన్నీ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. అరుకు కాఫీకి ఎగుమతి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఎగుమతి చేయని స్థాయిలో ఏటా రూ.15 వేల కోట్ల విలువైన రొయ్యలు అమెరికా తదితర దేశాలకు ఎగుమతవు తున్నాయన్నారు. డెయిరీ ఉత్పత్తుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. మన భీమవరం నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలను అదే ప్యాకింగ్‌తో అమెరికా వాల్‌మార్ట్‌లో విక్రయిస్తున్నారని తెలిపారు. అదేరీతిలో మిగిలిన వ్యవసాయ ఉత్పత్తులు కూడా విదేశాల్లో మన బ్రాండింగ్‌తో అమ్మే స్థాయికి ఎదగాలన్నారు. సేంద్రియ సాగును ప్రోత్సహించాలి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లీడ్ తీసుకుని మిగిలిన రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలవాలన కోరారు. జిల్లాల వారీగా లభించే ఉత్పత్తులు (డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ప్రొడక్టస్)ను గుర్తించి అవి ఇతరదేశాలకు ఎగుమతి అయ్యేలా జిల్లాల మధ్య పోటీవాతావరణం తీసుకురావాలని చెప్పారు. డిమాండ్ ఉన్న దేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా రైతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహక సంస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. అప్పుడే ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో కొనసాగడమే కాదు.. ప్రపంచపటంలో నిలబడుతుందని చెప్పారు. సేంద్రియ సాగులో కూడా రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. సేంద్రియ సాగును లాభసాటి చేయాలన్నారు. విదేశీమారక ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు పామాయిల్ సీడ్ మిషన్‌ను ప్రారంభిస్తున్న కేంద్రం పెట్రోల్ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించుకునేందుకు మొక్కజొన్న తదితర ఆహార ఉత్పత్తుల నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోందని చెప్పారు. రానున్న ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా ప్రధానమంత్రి నరేంద్రమోది కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని తెలిపారు. సేంద్రియ రైతులు, పాత్రికేయులకు సత్కారం ఈ సందర్భంగా సేంద్రియ రైతులు తిప్పేస్వామి (అనంతపురం జిల్లా), రమణారెడ్డి (వైఎస్సార్), గంగాధరం (చిత్తూరు), పాపారావు (గుంటూరు), మలినేని నారాయణప్రసాద్ (కృష్ణా), ఝాన్సీ (పశ్చిమగోదావరి జిల్లా), తాతారావు, లక్ష్మీనాయక్ (జెడ్పీఎన్ఎఫ్), రాజ్కృష్ణారెడ్డి (ఉద్యానశాఖ ఏడీ), ధర్మజ (ఉద్యానశాఖ డీడీ), రామాంజనేయులు, సురేంద్ర (ఎన్జీవోలు), సీనియర్ పాత్రికేయులు ఆకుల అమరయ్య, మల్లిఖార్జున్, సుబ్బారావు, శ్రీనివాసమోహన్లను సత్కరించారు. ఉద్యానశాఖ కమిషనర్ డాక్టర్ ఎస్.ఎస్.శ్రీధర్, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ చిరంజీవిచౌదరి, రైతుసాధికారసంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ టి.విజయకుమార్, ఆర్గానిక్మేళా నిర్వహణాధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, భారతీయ కిసాన్‌సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు జలగం కుమారస్వామి, గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం అధ్యక్షుడు బి.రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
అలా పరిమితం కావడం సరికాదు!
కేంద్ర ప్రభుత్వం రసాయనిక వ్యవసాయం నుంచి, ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టడం ఆహ్వానించదగిన పరిణామం. ఇది మాత్రమే చాలదు. కేవలం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (జడ్.బి.ఎన్.ఎఫ్.) ఒక్కదాని పైనే దృష్టి కేంద్రీక రించడంలో అర్థం లేదు. ప్రకృతి వ్యవసాయం అనేది జపాన్‌కు చెందిన డా. మసనోబు ఫుకుఓకా వాడుకలోకి తెచ్చిన విషయం. దీనితోపాటు ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయం, బయోడైనమిక్ వ్యవసాయం వంటి అనేక రసాయనికేతర వ్యవసాయ పద్ధతులు అమల్లో ఉన్నాయి. మొత్తంగా కలిపి సమగ్ర సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై ప్రభుత్వం దృష్టి సారిస్తే మరింత మేలు జరుగుతుంది. కేవలం దేశీ ఆవులు, కేవలం జీవామృతం చాలు అనలేం. మన దేశంలో 85% భూముల్లో వర్షాధారంగానే వ్యవసాయం జరుగుతోంది. రైతుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. అనంతపురం వంటి కరువు పీడిత జిల్లాలో మేం దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. మెట్ట భూములు జీవాన్ని కోల్పోయాయి. మట్టిని సారవంతం చేసుకుంటేనే ఈ భూముల్లో వ్యవసాయాన్ని చేపట్టగలం. భూసారం, నీటి పారుదల బాగా ఉండే ప్రాంతాల్లో జీవామృతం సరిపోవచ్చు. కానీ మెట్ట ప్రాంతాల్లో విధిగా కంపోస్టు తయారు చేసుకోవాలి. అంటే రైతుకు పశువులు కావాలి. దేశీ ఆవు మంచిదే. 2 వేల దేశీ ఆవులు రైతులకు పంచాం. అయితే, ఇతర ఆవులైతే పాలు ఎక్కువ ఇస్తాయి కాబట్టి రైతుకు ఆసరాగా కూడా ఉంటుంది. పాలు తక్కువ ఇచ్చే ఆవులను చిన్న రైతు పెంచుకోవటం భారమే. వారికి ప్రభుత్వం అండగా ఉండాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడం మంచిదే. అయితే, జడ్.బి.ఎన్.ఎఫ్.కు మాత్రమే పరిమితం కావటం అరకొర ప్రయత్నమే అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా నేచర్ బేస్డ్ వ్యవసాయ పద్ధతుల్లో ఉన్న అనుభవాలను సైతం ఇముడ్చుకునే విధంగా ప్రభుత్వ విధానం సమగ్రంగా ఉంటే బాగుంటుంది. (చదవండి: ప్రకృతి సేద్యమే వెలుగు బాట) - సి.కె. గంగూలి (బబ్లూ) సహ వ్యవస్థాపకులు, టింబక్టు కలెక్టివ్, చెన్నేకొత్తపల్లి -
ప్రకృతి సేద్యమే వెలుగు బాట
ప్రకృతి వ్యవసాయ బాటన నడుస్తున్న రైతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వమూ ఈ బాటకు వచ్చింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ రంగంలోకి వచ్చాక ప్రకృతి వ్యవసాయ విస్తరణకు కొత్త ఊపు వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం ఆదేశాలతో, ఇన్నాళ్లూ రసాయనిక సేద్యంపైనే దృష్టి పెట్టిన భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అనుబంధ సంస్థలన్నీ.. ఇప్పుడు ప్రకృతి సేద్యాన్ని చేపడుతున్నాయి. వ్యవసాయ కోర్సుల్లో ప్రకృతి సేద్య పాఠ్య ప్రణాళిక రచనకు సైతం పీజేటీఎస్ఏయూ వీసీ డా. ప్రవీణ్‌రావు సారధ్యంలో శాస్త్రవేత్తల కమిటీ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో పలువురు వ్యవసాయ రంగ ప్రముఖుల అభిప్రాయాలు.. ‘సాక్షి సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. కమిటీలో ప్రకృతి వ్యవసాయదారులకూ చోటివ్వాలి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రాచుర్యంలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. రసాయనిక వ్యవసాయం సృష్టించిన సంక్షోభాన్ని పరిష్కరించడంతోపాటు భూతాపోన్నతి సమస్యకు కూడా ఇది సరైన పరిష్కారం. అయితే, వ్యవసాయ విద్య కోసం సిలబస్ తయారు చేయడానికి ప్రకృతి వ్యవసాయంలో బొత్తిగా అనుభవం లేని విద్యావేత్తలతోనే కమిటీ వేయటం సరికాదు. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా రైతులే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రైతు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇది ప్రజా ఉద్యమం. దీనికి నాయకత్వం వహిస్తున్న వారికి ఈ కమిటీలో భాగస్వామ్యం ఉండాలి. ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, సెనెగల్, క్యూబా వంటి దేశాల్లో ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మన దేశంలో డా. పాలేకర్, డా. నమ్మాళ్వార్, దీపక్ సచ్దే, భాస్కర్ సావే, సుభాష్ శర్మ, చింతల వెంకటరెడ్డి, భరత్ మనసట, కపిల్ షా.. ఆస్ట్రేలియాకు చెందిన డా. వాల్టర్ యన వంటి వారెందరో శాస్త్ర విజ్ఞానాన్ని సంప్రదాయ విజ్ఞానంతో మేళవించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై విశేష కృషి చేశారు.. చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వెనుక సార్వత్రికమైన సైన్స్ ఉంది. ప్రిన్సిపుల్స్ ఎక్కడైనా ఒకేలా ఉంటాయి. సాగు పద్ధతులే ప్రాంతాన్ని బట్టి వైవిధ్యపూరితంగా ఉంటాయి. పాఠ్యప్రణాళిక తయారు చేసే కమిటీలో ప్రకృతి వ్యవసాయంలో కృషి చేస్తున్న రైతులు, రైతు సంస్థలతోపాటు ఆం.ప్ర., హిమాచల్‌ప్రదేశ్ వంటి ప్రభుత్వాల ప్రతినిధులకూ చోటు ఉండాలి. – టి. విజయకుమార్ ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రకృతి సేద్య విభాగం, ఏపీ వ్యవసాయ శాఖ, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ, గుంటూరు vjthallam@gmail.com మహిళా సంఘాల పాత్ర కీలకం ఇది వ్యవసాయ పరిశోధన, విద్యా రంగాల్లో ఐసిఎఆర్ అనుబంధ సంస్థలు కేంద్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం తీసుకొని ముందుకు సాగినా.. ప్రకృతి వ్యవసాయం విస్తరణ వీళ్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.. ప్రకృతి వ్యవసాయం ఆచరణ ఇప్పటికే ముందుకు వెళ్లింది. దీని వెనకాల సైన్స్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. పర్వాలేదు. విస్తరణ ముఖ్యంగా రైతు నుంచి రైతుకు, మహిళా రైతుల నుంచి మహిళా రైతులకు ఎలా ముందుకు పట్టుకెళ్లాలి అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఏపీసిఎన్ఎఫ్ ప్రభుత్వ కార్యక్రమంలో ఆచరించి, సత్ఫలితాలను చూపటం జరుగుతోంది. ఇదే విధానాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అనుసరిస్తే మంచిదని మా అభిప్రాయం. అదేవిధంగా, ప్రకృతి వ్యవసాయం ముందరికి వెళ్లాలీ అంటే.. ఒక్కొ క్క రైతుతోటి వ్యక్తిగతంగా పనిచేయ వలసి వచ్చిన పాత నమూనా ప్రకారం కాకుండా.. క్షేత్ర స్థాయి సామాజిక సంస్థల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు పట్టుకెళ్లాలి. ఏపీలో కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ ప్రభుత్వ కార్యక్రమంలో మహిళా సంఘాల ద్వారా ఇలాంటి కృషి జరుగుతోంది. ఇదే మాదిరి మహిళా సంఘాల వ్యవస్థను రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్‌లో దేశమంతా రకరకాల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గతంలోనే నెలకొల్పటం జరిగింది. కాబట్టి, ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలంటే.. కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీలపైనే ఆధారపడకుండా.. కమ్యూనిటీ సంస్థలను ముఖ్యంగా క్షేత్ర స్థాయి మహిళా సంఘాలను ఆధారం చేసుకొని కృషి చేయాలి. వేరే రాష్ట్రాల్లో కూడా అందరి రైతులకూ ప్రకృతి వ్యవసాయాన్ని అలవాటు చేయాలంటే ఏపీలో మాదిరిగా చేయాలి. – కవిత కురుగంటి సమన్వయకర్త, అలియన్స్ ఫర్ సస్టయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ (ఆషా), బెంగళూరు kavitakuruganti@gmail.com సేంద్రియ నిపుణులకూ కమిటీలో చోటివ్వాలి మంచి ప్రయత్నం. అనేక సంవత్సరాలుగా వ్యవసాయ విద్యలో మార్పు తేవటానికి మేము, ఇంకా చాలా మంది ప్రయత్నాలు చేసినా భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అడ్డుపడుతూ వస్తోంది. ప్రైవేటు యూనివర్సిటీల ద్వారా కూడా ఈ ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. ఇప్పుడు ఒక ప్రయత్నం చేయటానికి కమిటీ వేయటం అభినందించాల్సిన విషయం. అయితే, ఈ కమిటీలో చాలా మంది ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల పైన పనిచేసిన వాళ్ళు కాదు.. దాంతో ఫలితం ఎంత అన్నది అనుమానమే. అలాగే కేవలం వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచే కాకుండా, సేంద్రియ వ్యవసాయం పైన పనిచేస్తున్న ఇతరులను కూడా ఈ కమిటీ సభ్యులుగా నియమిస్తే బావుంటుంది. – డా. జీ వీ రామాంజనేయులు స్వతంత్ర వ్యవసాయ శాస్త్రవేత్త, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్ ramoo@csaindia.org ప్రభుత్వ నిర్ణయం ఆనందదాయకం వ్యవసాయానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ సంస్థలు ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేసి, పరిశోధనా ఫలితాలను ప్రజలకు అందజేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఎంతో ఆనందదాయకం. సేంద్రియ వ్యవసాయంపై ఎం.ఎస్.సి. కోర్సు చేయదలచిన విద్యార్థులకు పాఠ్య ప్రణాళికను ఐ.సి.ఎ.ఆర్. ఇప్పటికే తయారు చేసింది. డిసెంబర్ 3న కేంద్ర వ్యవసాయ మంత్రి దీన్ని విడుదల చేశారు. సమగ్ర వ్యవసాయం, సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం – ఇటువంటి పలు రకాల పేర్లతో ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. ఒక్కొ క్క అడుగూ ముందుకు వేయడమే సరైన యోజన అవుతుంది. విధానాలు వేరైనా, రసాయనాలు వేయని పంటలు మంచివి అనేది మొదట అడుగు. ఒక్కొక్క విధానంపై పరిశోధనా ఫలితాలు అందిన తర్వాత మరొక అడుగు ముందుకు వేయవచ్చు. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి అధ్యక్షతన నియామకమైన కమిటీ ఈ విషయమై పరిశోధన జరిపి, ఆచరణయోగ్యమైన ఒక కార్యక్రమ రూపాన్ని (రోడ్ మ్యాప్‌ను) ఇవ్వగలదని ఆశిద్దాం. – పి. వేణుగోపాల్‌రెడ్డి చైర్మన్, ఏకలవ్య ఫౌండేషన్, హైదరాబాద్ pvg@ekalavya.net సేంద్రియ, ప్రకృతి సేద్యంపై రైతులకు శిక్షణ వెంకటరామన్నగూడెంలోని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో సేంద్రియ సాగు వ్యవసాయ విధానాలను వివిధ ఉద్యాన పంటల్లో పరిశీలించి స్థిరీకరించాం. ‘ఉద్యాన పంటల్లో సేంద్రియ వ్యవసాయం’ పేరుతో 3 నెలల సర్టిఫికెట్ కోర్సు ప్రారంభానికి పాఠ్య ప్రణాళికను, నియమ నిబంధనలను సిద్ధం చేశాం. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు సేంద్రియ సాగు విధానాలపై 25 రోజుల శిక్షణ నిర్వహించాం. ‘ఉద్యాన పంటలలో సేంద్రియ సాగు విధానాలు’ పుస్తకాన్ని కూడా రైతులకు అందుబాటులో ఉంచాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు కె.వి.కె.ల ద్వారా వివిధ పంటల్లో సేంద్రియ సాగు చేస్తున్న రైతులతో ముఖాముఖి నిర్వహించి సాగు పద్ధతులను నిర్వచించి, తగు రీతిన ప్రచారం చేసేలా నెలవారీ ప్రణాళికలను రూపొందిస్తున్నాం. ప్రతి కె.వి.కె.లో ఒక ఎకరం ప్రదర్శన క్షేత్రంలో సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేసి.. రైతులకు, విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించబోతున్నాం. వివిధ జిల్లాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం జరిగే క్షేత్రాలను శాస్త్రవేత్తలు సందర్శిస్తున్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణకు, సలహాల కోసం విశ్వవిద్యాలయ పరిధిలోని పరిశోధనా స్థానాలు, కె.వి.కె.లను రైతులు సంప్రదించవచ్చు. – డా. టి. జానకిరామ్ ఉప కులపతి, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం vc@drysrhu.edu.in వ్యవసాయ అనుబంధ రంగాలకూ వర్తింపజేయాలి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, విద్యారంగంలో కూడా ఇందుకు అనుగుణంగా మార్పు తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సరైన దిశగా ముందడుగు. హరిత విప్లవ ప్రారంభం అయినప్పటి నుంచి రసాయనిక ఎరువులు, పురుగుమందులు, సాగు నీటిని విచక్షణారహితంగా వాడి భూసారాన్ని క్షీణింపజేసుకున్నాం. భూసారాన్ని పెంపొందించుకోవడానికి ఇప్పటికైనా సేంద్రియ పదార్థాన్ని భూమికి అందించడం ప్రారంభించాలి. వివిధ పంటలు, ఉద్యాన తోటలు, పశుపోషణ, చేపలు, రొయ్యల సాగులో రసాయనాల వాడకాన్ని తగ్గించటం ద్వారా ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని ప్రజలకు అందించడం ఇప్పటి అవసరం. ఖర్చు తగ్గించుకొని, ఆదాయాన్ని పెంచుకోవాలి. పంటల మార్పిడి ద్వారా, ప్రకృతి సేద్యం ద్వారా నాణ్యమైన, పోషకాల సాంద్రతతో కూడిన వైవిధ్యపూరితమైన సమతుల ఆహారాన్ని ప్రజలకు అందించటం సాధ్యమవుతుంది. – డా. విలాస్ కె తొనపి సంచాలకులు, భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్ director.millets@icar.gov.in ప్రయోగాల ఫలితాలను రైతులకు అందిస్తాం మా విశ్వవిద్యాలయ పరిశోధనా క్షేత్రంతో పాటు రైతుల క్షేత్రాల్లో సమగ్ర ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి వివిధ పంటలపై పరిశోధనాత్మక సాగును సమదృష్టితో చేపడతాం. ఆ క్షేత్రాల్లో గడించే అనుభవాల ఆధారంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. – డా. ఎ. విష్ణువర్ధన్‌రెడ్డి ఉప కులపతి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు vicechancellor@angrau.ac.in -
గో ఆధారిత వ్యవసాయానికి టీటీడీ చేయూత
తిరుపతి కల్చరల్(చిత్తూరు జిల్లా): గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తాము కూడా అండగా ఉంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రైతుల నుంచి పంట ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. జాతీయ గో మహాసమ్మేళనం శనివారం తిరుపతిలో వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. శ్రీవారికి గో ఆధారిత ఉత్పత్తులతో నైవేద్యం, దేశీయ ఆవు పాలతో చిలికిన వెన్న సమర్పించేందుకు నవనీత సేవ చేపట్టామన్నారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. సీఎం జగన్ ఆదేశాలతో దేశవ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించామన్నారు. ప్రస్తుతం 74 ఆలయాల్లో గుడికో గోమాత కార్యక్రమం మొదలుపెట్టామని.. త్వరలో ఈ సంఖ్యను 100 ఆలయాలకు పెంచుతామన్నారు. గోవుల విశిష్టతను ప్రపంచానికి తెలియజేసేందుకే ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు. అనంతరం మాతా నిర్మలానంద యోగ భారతి ఆధ్యాత్మిక సందేశమిచ్చారు. కార్యక్రమంలో టీటీడీ సభ్యులు పోకల అశోక్‌కుమార్, మొరం శెట్టి రాములు, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మయ్య, సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి, ఎస్వీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి, యుగతులసి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివకుమార్, సేవ్ ఫౌండేషన్ అధ్యక్షుడు విజయరామ్ పాల్గొన్నారు. -
సాగు సమస్యలకు ప్రకృతి సేద్య పిత భాస్కర్ సావే సూచనలివే!
భారతీయ ప్రకృతి సేద్య సంస్కృతికి ఊపిర్లూదిన అతికొద్ది మహారైతుల్లో భాస్కర్ సావే ఒకరు. ఆరేళ్ల క్రితం 2015 సెప్టెంబర్ 24న తన 93వ ఏట ఆ మహోపాధ్యాయుడు ప్రకృతిలో కలసిపోయినా.. ఆయన వదలివెళ్లిన ప్రకృతి సేద్య అనుభవాలు రైతు లోకానికి ఎప్పటికీ దారి దీపం వంటివే! రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడే వ్యవసాయం హింసాయుతమైనదని అంటూ.. అహింసాయుతమైన ప్రకృతి సేద్యాన్ని అక్కున చేర్చుకున్నారు సావే. ప్రకృతి సేద్య గాంధీగా పేరుగాంచిన సావేను మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్మరించుకోవటం మరో విశేషం. ప్రకృతి వ్యవసాయ మహాపాధ్యాయుడిగానే కాక, స్వతహాగా తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన సాధించి చూపిన సుసంపన్న ప్రకృతి సేద్య ఫలాల గురించి మననం చేసుకోవటం స్ఫూర్తిదాయకం. ‘వన్ వరల్డ్ అవార్డ్ ఫర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ పురస్కారంతో అంతర్జాతీయ సేంద్రియ సేద్య ఉద్యమాల సమాఖ్య (ఐఫోమ్) 2010లో ఆయనను సత్కరించింది. ‘హరిత విప్లవం’ దుష్ఫలితాలపై ఆయన 15 ఏళ్ల క్రితం రాసిన బహిరంగ లేఖలు చాలా ప్రాచుర్యం పొందాయి. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి (స్వచ్ఛంద సంస్థల నిరసనలు, బహిష్కరణల నడుమ) ‘ఆహార వ్యవస్థల పరివర్తనా శిఖరాగ్రసభ–2021’ను ఇటీవల నిర్వహించిన నేపథ్యంలో.. ఇప్పటికీ, ఎప్పటికీ రైతులకు అనుసరణీయమైన (రైతులు, ప్రజలు, జంతుజాలం, భూగోళం మేలు కోరే) భాస్కర్ సావే ఎలుగెత్తి చాటిన ప్రకృతి సాగు పద్ధతి గురించి వివరంగా తెలుసుకుందాం.. భాస్కర్ సావే సన్నిహిత సహచరుడు భరత్ మన్సట రచన ‘ద విజన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్’ నుంచి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం.. భాస్కర్ సావే భావాలకు, ఆచరణకు నిలువెత్తు నిదర్శనం ఆయన బిడ్డలా సాకిన 14 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ‘కల్పవృక్ష’. పశ్చిమ తీరాన కోస్టల్ హైవేకి దగ్గరలో గుజరాత్‌లోని వల్సద్ జిల్లా దెహ్ర గ్రామంలో ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ఉంది. 10 ఎకరాల్లో (45 ఏళ్ల నాటి) పండ్ల తోట.. భాస్కర్ సావే పచ్చని సంతకంలా విరాజిల్లుతూ ఉంది. ఎన్నో జాతుల సమాహారంగా ఉండే ఈ తోటలో కొబ్బరి, సపోట చెట్లు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. 2 ఎకరాల్లో సీజనల్ పంటలను పంటల మార్పిడి పద్ధతిలో సాగు చేస్తున్నారు. మిగతా రెండెకరాల్లో కొబ్బరి నర్సరీని నిర్వహిస్తున్నారు. ఒక్క దిగుబడే కాదు (పంటల దిగుబడి, పోషకాల నాణ్యత, రుచి, జీవవైవిధ్యం, పర్యావరణ సుస్థిరత, నీటి సంరక్షణ, విద్యుత్తు వినియోగ సామర్థ్యం, ఆర్థిక లాభదాయకత వంటి) ఏ కోణంలో చూసినా.. రసాయనిక వ్యవసాయ క్షేత్రం కన్నా ‘కల్పవృక్ష’ మిన్నగానే ఉంటుంది. బయటి నుంచి తెచ్చి వాడేవి దాదాపు ఏమీ ఉండవు. ఖర్చు (ఇందులో కూడా చాలా వరకు కోత కూలి ఉంటుంది) చాలా తక్కువ. ‘కల్పవృక్ష’ సుసంపన్నత కల్పవృక్ష క్షేత్రంలోకి అడుగుపెట్టగానే ‘సహకారమే ప్రకృతి మౌలిక సూత్రం’ వంటి ఎన్నో సూక్తులు భాస్కర్ సావే భావాలకు ప్రతిరూపంగా సందర్శకులకు కనిపిస్తాయి. ప్రకృతి, వ్యవసాయం, ఆరోగ్యం, సంస్కృతి, ఆథ్యాత్మికతలకు సంబంధించిన సావే ప్రజ్ఞను ఇవి చాటుతుంటాయి. కల్పవృక్ష క్షేత్రం.. ఆహారోత్పత్తి సామర్థ్యానికి దానికదే సాటి. ఏడాదికి ఒక్కో కొబ్బరి చెట్టు 350 నుంచి 400 కాయల దిగుబడినిస్తుంది. 45 ఏళ్ల క్రితం నాటిన సపోటా చెట్టు ఒక్కోటి ఏటా 300 కిలోల పండ్లనిస్తుంది. పండ్ల తోటలో కొబ్బరి, సపోటాతోపాటు అరటి, బొప్పాయి, వక్క, ఖర్జూరం, మునగ, మామిడి, పనస, తాటి, సీతాఫలం, జామ, చింత, వేపతోపాటు అక్కడక్కడా వెదురు, కరివేపాకు, తులసి, మిరియాలు, తమలపాకు, ప్యాషన్ ఫ్రూట్ తీగ జాతులు కూడా వత్తుగా ఉంటాయి. పదెకరాల్లో 150 క్వింటాళ్ల దిగుబడి తోట అంతటా వత్తుగా పెరిగే రకరకాల చెట్ల కింద రాలిన ఆకులు కొన్ని అంగుళాల మందాన పరచుకొని నేలతల్లికి ఆచ్ఛాదన కల్పిస్తూ ఉంటాయి. ఎండ నేలను తాకే పరిస్థితి ఉండదు. సూక్ష్మ వాతావరణం నెలకొనటం వల్ల వానపాములు, సూక్ష్మజీవరాశి నేలను నిరంతరం సారవంతం చేస్తూ ఉంటాయి. ఎండ, వాన, చలి నుంచి నేలను ఆకుల ఆచ్ఛాదన కాపాడుతూ ఉంటుంది. ‘ఏ రైతైతే తన పొలం మట్టిలో వానపాములు, సూక్ష్మజీవరాశి చక్కగా వృద్ధి చెందేలా జాగ్రత్త తీసుకుంటారో.. ఆ రైతు తిరిగి పురోభివృద్ధిని పుంజుకున్నట్లే’ అంటారు భాస్కర్ సావే. నేలకు ఇలా రక్షణ కల్పిస్తూ రసాయనాలు వాడకుండా శ్రద్ధగా సాకుతూ సుసంపన్నం చేయటాన్నే ప్రకృతి వ్యవసాయ మార్గం అని ఆయన వివరించేవారు. పదెకరాల తోటలో ఎకరానికి ఏడాదికి 150 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి తీస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఆహారంలో వుండే పోషకాల సాంద్రత రసాయనిక వ్యవసాయంలో పండించిన పంటలో కన్నా ఎక్కువగా ఉంటాయి. రెండెకరాల్లో సీజనల్ పంటలు రెండెకరాల్లో దేశవాళీ ‘నవాబీ కోలం’ అనే రుచికరమైన, ఎత్తయిన వరి పంటతోపాటు, అన్ని రకాల పప్పుధాన్యాలు, చలికాలంలో గోధుమ, కూరగాయలు, దుంప పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఈ పంట దిగుబడులతోనే భాస్కర్ సావే కుటుంబం, అతిథుల ఆహారపు అవసరాలు పూర్తిగా తీరుతాయి. బియ్యం మిగిలితే బంధు మిత్రులకు కానుకగా ఇస్తూ ఉంటారు. రసాయనిక సేద్యాన్ని వదలి రైతులు సేంద్రియ / ప్రకృతి వ్యవసాయం చేపట్టిన తర్వాత ఏటేటా నేల సారం పెరుగుతూ ఉండే కొద్దీ పంట దిగుబడులు మెరుగుపడుతూ ఉంటాయి. ప్రకృతి సేద్య మెళకువలు పాటిస్తే కొన్ని ఏళ్లలో భూమి సంపూర్ణ స్వయం పోషకత్వాన్ని సంతరించుకుంటుంది. కలుపు తీవ్రత తగ్గుతుంది. 2–3 ఏళ్ల తర్వాత కలుపు తీయాల్సిన అవసరం ఉండదు. అప్పటివరకు కలుపు మొక్కల్ని కోసి ఆచ్ఛాదనగా వేస్తూ పోవాలి. ‘అన్నపూర్ణమ్మ తల్లి ఆశీస్సులతో ప్రకృతి వ్యవసాయం ప్రతి జీవికీ సమృద్ధిగా ఆహారాన్ని అందిస్తుంది’ అంటారు భాస్కర్ సావే! సాగు సమస్యలు సావే అనుభవాలు వ్యవసాయంలో రైతులంతా సాధారణంగా ముఖ్యమైన సమస్యలుగా భావించే అంశాలు ఐదు.. దుక్కి, భూసారాన్ని పెంపొందించే ఎరువులు, కలుపు, నీరు, చీడపీడల నుంచి పంటలను కాపాడుకునే పద్ధతులు. ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతే ఏ విధంగా చూసినా రైతుకు, ప్రజలకు, భూగోళానికి, జంతుజాలానికి మేలు చేకూర్చుతుందని మనసా వాచా కర్మణా నమ్మే దిగ్గజ రైతు భాస్కర్ సావే భావాలు విభిన్నంగా ఉంటాయి.. ►దుక్కి పండ్ల తోటల్లో మొక్కలు నాటేటప్పుడు మాత్రమే ఒక్కసారి దుక్కి చేయటం తప్ప తర్వాత ఇక తవ్వే అవసరమే లేదు. ఆకులు అలములు నేలను కప్పి ఉంచేలా ఆచ్ఛాదన నిరతరం ఉండేలా చూడాలి. పండ్ల తోట ఎన్నేళ్లున్నా ఇంకేమీ చెయ్యనవసరం లేదు, దిగుబడులు పొందటం తప్ప. అయితే, విత్తనాలు వేసిన కొద్ది నెలల్లో దిగుబడినిచ్చే సీజనల్ పంటల పరిస్థితి వేరు. వరి, కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనె గింజ పంటల విషయంలో ప్రతి పంట కాలంలోనూ తేలికపాటి దుక్కి చేయాల్సి వుంటుంది. అందుకే.. తోటల సాగుకు ‘ప్రకృతి వ్యవసాయ పద్ధతి’ పూర్తిగా తగినదని భావించే భాస్కర్ సావే.. సీజనల్ పంటల సాగును ‘సేంద్రియ వ్యవసాయం’గా చెప్పేవారు. ►కలుపు కలుపు తీయకూడదు అనేది భాస్కర్ సావే అభిప్రాయమే కాదు అనుభవం కూడా. కలుపు మొక్కలను పూర్తిగా పీకేసి లేదా కలుపు మందు కొట్టేసి పొలంలో పంట మొక్కలు తప్ప కలుపు మొక్కలు అసలు కనపడకుండా తుడిచిపెట్టడం సరికాదు. పంట మొక్కల కన్నా ఎక్కువ ఎత్తులో కలుపు మొక్కలు పెరిగి, పంటలకు ఎండ తగలకుండా అడ్డుపడే సంకట స్థితి రానివ్వకూడదు. ఆ పరిస్థితి వస్తుందనుకున్నప్పుడు కలుపు మొక్కలను కత్తిరించి, అక్కడే నేలపై ఆచ్ఛాదనగా వేయటం ఉత్తమ మార్గం అని భాస్కర్ సావే భావన. ►నీటి పారుదల భూమిలో తేమ ఆరిపోకుండా చూసుకునేంత వరకు మాత్రమే పంటలకు నీరు అవసరమవుతుంది. తోటల్లో అనేక ఎత్తులలో పెరిగే వేర్వేరు జాతుల మొక్కలు, చెట్లను వత్తుగా పెంచాలి. పొలాల్లో మట్టి ఎండ బారిన పడకుండా ఆచ్ఛాదన చేసుకుంటే నీటి అవసరం చాలా వరకు తగ్గిపోతుంది. ►సస్యరక్షణ మిత్రపురుగులే ప్రకృతిసిద్ధంగా శతృపురుగులను అదుపులో ఉంచుతాయి. రసాయనాలు వాడకుండా బహుళ పంటలను సాగు చేస్తూ ఉంటే.. భూమి సారవంతమవుతూ చీడపీడలను నియంత్రించుకునే శక్తిని సంతరించుకుంటుంది. అయినా, చీడపీడలు అసలు లేకుండా పోవు. నష్టం కనిష్ట స్థాయిలో ఉంటుంది. మరీ అవసరమైతే, వేప ఉత్పత్తులు, నీటిలో కలిపిన దేశీ ఆవు మూత్రం వంటి ద్రావణాలు పిచికారీ చేస్తే చాలు. అసలు ఇది కూడా అవసరం రాదు అని భాస్కర్ సావే తన అనుభవాలు చెబుతారు. రసాయనిక సేద్యంలో పనులన్నీ తనే భుజాన వేసుకొని రైతు కుదేలైపోతూ ఉంటే.. ప్రకృతి సేద్యంలో ప్రకృతే చాలా పనులు తనంతట తాను చూసుకుంటుంది కాబట్టి రైతుకు సులభమవుతుంది. భూమి పునరుజ్జీవం పొందుతుంది అంటారు సావే సాధికార స్వరంతో! చదవండి: 7 యేళ్లలో 17 లక్షలు సంపాదించిన రైతు.. ఏం పండించాడో తెలుసా? -
‘నమ్మభూమి’ని నమ్ముకొంది
చెన్నైకు చెందిన జయలక్ష్మి, పెళ్లి తర్వాత భర్తతో కలిసి పద్నాలుగేళ్లపాటు కెనడాలో ఉంది. కొన్ని కారణాలతో 1992లో ఇండియా తిరిగి వచ్చింది. తన కూతురుకు ఫుడ్ అలెర్జీలు ఎదురవుతుండడంతో, రసాయనాలు వాడకుండా పండించిన కూరగాయలు ఎక్కడ దొరుకుతాయని స్థానిక మార్కెట్లన్నింట్లోనూ వెదికింది. కానీ సేంద్రియ కూరగాయలు ఎక్కడా దొరకలేదు. దీంతో తనే సేంద్రియ పద్ధతిలో కూరగాయల్ని పండించాలనుకుంది. ఆమె కోరిక తెలిసిన జయలక్ష్మి కజిన్ తనకున్న పది ఎకరాల పొలంలో ఐదెకరాలను సేంద్రియ వ్యవసాయం చేసుకోమని ఇచ్చింది. ఐదెకరాల భూమిలో వరి, ఆకుకూరలు, ములక్కాడలు పండించడం ప్రారంభించింది. అయితే దిగుబడి పెద్దగా వచ్చేది కాదు. మరోపక్క జయలక్ష్మి భర్తకు హార్ట్ ఎటాక్ రావడం, కోమాలోకి వెళ్లడంతో పలుమార్లు సర్జరీలు చేశాక కానీ ఆయన కోలుకోలేదు. భర్త వైద్యానికి ఖర్చు, పంట దిగుబడి సరిగా లేక నష్టాలు చవి చూడడం, దానికి తోడు జయలక్ష్మి దగ్గర అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వక పోవడంతో ఆర్థికంగా బాగా చితికిపోయింది. దీంతో సేంద్రియ వ్యవసాయం వదిలేసి కుటుంబంతో తిరిగి కెనడాకు వెళ్లిపోదామనుకుంది. కానీ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇండియాలోనే ఉండిపోయింది. ∙ పెట్టుబడిలేని వ్యవసాయం.. రకరకాల సమస్యలతో కృంగిపోయిన జయలక్ష్మికి 2002లో రామకృష్ణ ఆశ్రమ మిషన్ స్కూల్లో పనిచేస్తోన్న డాక్టర్ షణ్ముగ సుందరం.. పెట్టుబడి లేని సేంద్రియ వ్యవసాయం ఎలా చేయవచ్చో చెప్పే వర్క్‌షాపును పరిచయం చేసి జీవితం మీద ఆశను చిగురింపచేశారు. షణ్ముగానికి ఉన్న 30 ఎకరాల్లో మూడెకరాల పొలాన్ని ఇచ్చి వ్యవసాయం చేసుకోమనడంతో... జయలక్ష్మి ఆ పొలంలో ఈసారి వరి మాత్రమే పండించడం మొదలుపెట్టింది. దిగుబడి బాగుండడంతో క్రమంగా మరో పది ఎకరాలకు వ్యవసాయాన్ని విస్తరించి... మూలికా మొక్కలు, మెంతికూర, పాలకూర వంటి ఆకు కూరలు, ములక్కాడ, మామిడి, జామ, సపోటా వంటి పండ్ల చెట్లను కూడా పెంచింది. ఇక్కడ వరకు అంతా సాఫీగా సాగినప్పటికీ పండిన పంటను లాభసాటిగా ఎలా విక్రయించాలో తనకి తెలియలేదు. ఈ సమయంలో.. నగరంలో 300 అపార్టుమెంట్లలో సేంద్రియ కూరగాయలు, ఆర్గానిక్ వేస్ట్‌ను కంపోస్టుగా ఎలా తయారు చేయవచ్చో వర్క్‌షాపులు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తోన్న ఆరుల్ ప్రియను ఆమెకు షణ్ముగం పరిచయం చేశారు. ఆరుల్ జయలక్ష్మిని కలిసి ఆమె కష్టాల గురించి తెలుసుకుని సలహాలు ఇచ్చేది. ఈ క్రమంలోనే వీరిద్ద్దరు కలిసి ‘నమ్మ భూమి’ పేరుతో ఎకో ఫ్రెండ్లి ఉత్పత్తులను విక్రయించేవారు. నమ్మ అంటే తమిళంలో మన అని అర్థం. 2010 నుంచి జయలక్ష్మి పొలంలో పండించిన రసాయనాలు లేని కూరగాయలను ఇంటింటికి తిరిగి అమ్మేది. అలా అమ్ముతూ ఏడేళ్లలో పట్టణంలోని కస్టమర్లకు తన కూరగాయలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. అలా గత కొన్నేళ్లుగా సేంద్రియ కూరగాయలను దేశంలోని ఇతర ప్రాంతాలు, ఉత్తరాఖండ్, కశ్మీర్ ప్రాంతాలకు పంపిస్తున్నారు. వ్యవసాయంలో కొత్తకొత్త పద్ధతులను అనుసరిస్తూ లాభాలు పొందుతున్నారు. ఒక పక్క కస్టమర్లకు అవగాహన కల్పిస్తూ సేంద్రియ వ్యవసాయం చేయమని ఇతర రైతులను ప్రోత్సహిస్తున్నారు. -
పదేళ్ల మన ‘ఇంటిపంట’
సేంద్రియ ఇంటిపంటల సాగులో ఆధునిక పద్ధతులను తెలుగునాట విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చిన కాలమ్ ‘ఇంటిపంట’. మేడలపై కుండీల్లో, మడుల్లో పంటలు పండించి తినటం అయ్యేపనేనా అని మొదట్లో సందేహించినా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాలే కాదు గ్రామాల్లో కూడా పెరట్లోనో, ఇంటి ముందున్న కొద్ది పాటి స్థలంలోనో, మేడ మీదనో ఎవరికి తోచిన విధంగా వారు లక్షలాది మంది సాగు చేస్తూ ఆనందిస్తున్నారు. దేశ, విదేశాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు విశేషాలతో పాఠకులను ఆరోగ్యదాయకమైన ఆచరణ వైపు పురిగొల్పిన ‘సాక్షి’ దినపత్రికలోని ‘ఇంటిపంట’ తెలుగు పత్రికా రంగంలో ఓ ట్రెండ్‌సెట్టర్. మార్కెట్లో అమ్ముతున్న కూరగాయలు, ఆకుకూరల్లో రసాయనాల అవశేషాల వల్ల ప్రజారోగ్యానికి వాటిల్లుతున్న నష్టాన్ని గురించి ‘కాయగూరల్లో కాలకూటం’ శీర్షికన కథనాన్ని ‘సాక్షి’ ప్రచురించింది.. కథనం రాశాం. అంతటితో మన బాధ్యత తీరింది అని అంతటితో సరిపెట్టుకొని ఉంటే.. ‘ఇంటిపంట’ కాలమ్ 2011 జనవరి 21న ప్రారంభమయ్యేదే కాదు! అప్పట్లో వారానికి రెండు రోజులు ప్రచురితమైన ‘ఇంటిపంట’ కథనాలు పెద్ద సంచలనమే రేపాయంటే అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు. సీన్ కట్ చేస్తే.. సరిగ్గా పదేళ్ల తర్వాత.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది సేంద్రియ ఇంటిపంటలను ఎంతో మక్కువతో సాగు చేస్తున్నారు. టెర్రస్ మీద కిచెన్ గార్డెన్ కలిగి ఉండటం ఆరోగ్యదాయకమే కాదు ఇప్పుడు అదొక స్టేటస్ సింబల్‌గా మారిపోయింది అంటారు మిద్దె తోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి. దాదాపు అన్ని పత్రికలు, టీవీ ఛానల్స్ ఈ ట్రెండ్‌ను అనుసరిస్తున్నాయి. సోషల్ మీడియా సంగతి అయితే ఇక చెప్పనక్కరలేదు. రఘోత్తమరెడ్డి వంటి వారు ఫేస్బుక్లో అనుదినం రాస్తూ ఉంటే.. తమ టెర్రస్‌లపై ఇంటిపంటల సాగు అనుభవాలను ప్రజలకు ప్రభావశీలంగా అందించడానికి ఏకంగా సొంత యూట్యూబ్ ఛానళ్లనే ప్రారంభించారు కొందరు సీనియర్ కిచెన్ గార్డెనర్లు! హైదరాబాద్‌కు చెందిన పినాక పద్మ, లత, నూర్జహాన్, శాంతి ధీరజ్.., వైజాగ్‌కు చెందిన ఉషా గజపతిరాజు.. ఈ కోవలోని వారే! ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రైతులందరినీ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించటమే. అందుకు చాలా ఏళ్లు పట్టవచ్చు. అయితే, అప్పటి వరకు ఆగకుండా ఇప్పటికిప్పుడు ప్రజలు (ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు) తమ ఆరోగ్యం కోసం తాము చేయదగినదేమైనా ఉందా?? ఈ ప్రశ్నే ‘ఇంటిపంట’ కాలమ్ పుట్టుకకు దోహదం చేసింది. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ రోజే సేంద్రియ ఇంటిపంటల సాగు ప్రారంభించండి అంటూ ప్రోత్సహించి.. దారి దీపం అయ్యింది ‘ఇంటిపంట’. కరోనా, ఏలూరు హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో సేంద్రియ ఇంటిపంటల సాగు ఎంత అవసరమో కాదు.. కాదు.. ఎంతటి ప్రాణావసరమో ప్రతి ఒక్కరికీ బోధపడింది! వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ‘సాక్షి’ మీడియా గ్రూప్ చైర్పర్సన్ వైఎస్ భారతి రెడ్డి గారికి, అనుదినం వెనుక ఉండి నడిపిస్తున్న సంపాదకులు వర్ధెల్లి మురళి గారికి, ‘ఇంటిపంట’, ‘సాగుబడి’ భావనలకు ఊపిర్లూదిన అప్పటి ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి.. ఈ మహాయజ్ఞంలో నన్ను ‘కలం’ధారిగా చేసినందుకు వేన వేల వందనాలు!! – పంతంగి రాంబాబు, ఇంటిపంట / సాగుబడి డెస్క్ -
గమ్యం మార్చిన పుస్తకం
సాఫ్ట్వేర్ ఇంజినీరైన ఖుషీ చంద్ వడ్డె ఓ రోజు కంపెనీ పనిమీద ముంబై వెళ్లాల్సి ఉంది. ఇంటి నుంచి బయలుదేరి లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఓ స్వీట్‌హౌస్ వద్ద ఆగాడు. రైతు, సైంటిస్టు సుభాష్ పాలేకర్ రాసిన ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే పుస్తకాన్ని కొనుగోలు చేశాడు. హైదరాబాద్ నుంచి విమానంలో ముంబై బయలుదేరాడు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే వరకు 60 పేజీల ఆ పుస్తకాన్ని తిరగేశాడు. రసాయన ఎరువుల వాడకం, భూమి కాలుష్యం, కల్తీ ఆహార పదార్థాలతో రోగాల బారిన పడుతున్న బాధితుల తీరును తెలుసుకొని చలించిపోయాడు. అప్పటి నుంచి అతడిలో ఎన్నో ప్రశ్నలు.. కల్తీ ఆహార పదార్థాలతో క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నామని గ్రహించాడు. తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆర్నెళ్ల పాటు నగర శివార్లలో ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులను కలిశాడు. దిగుబడి, నాణ్యత, మార్కెటింగ్ గురించి తెలుసుకొని రోగాల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రకృతి వ్యవసాయంలో తానూ భాగస్వామి కావాలనుకున్నాడు. – గచ్చిబౌలి ‘కృషి’ చంద్గా.. కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కూచిపూడి గ్రామానికి చెందిన ఖుషీ చంద్ చెన్నైలోని ఎస్‌ఎంకెఎఫ్‌ఐటీలో (బీఈ) కంప్యూటర్ సైన్స్ 2006లో పూర్తి చేశారు. క్యాంపస్ సెలక్షన్లో హెచ్‌పీ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ సంస్థలో ఇంజినీర్‌గా ఎన్నికయ్యాడు. 2008లో ఐబీఎంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసి.. 2009 నుంచి 2013 వరకు డెలాయిట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా నెలకు రూ.80 వేల జీతం తీసుకున్నాడు. అమెరికా వెళ్లి బాగా స్థిరపడాలనే కోరిక ఉండేది. పాలేకర్ రాసిన ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ పుస్తకం చదివిన తర్వాత పొలం బాట పట్టాడు. చదవండి: ‘ఆన్లైన్ రమ్మీ’ కేసుల్లో పోలీసుల మీమాంస క్యాన్సర్ నుంచి తల్లిని రక్షించుకుని ఖుషీచంద్ తండ్రి వడ్డె జయ ప్రసాద్ 2011 గుండెపోటుతో మరణించారు. ఆ బాధలో నుంచి కోలుకున్న కొద్ది సంవత్సరాలకు 2016లో తల్లి శివలీలకు క్యాన్సర్ అని తేలింది. 2017లో ఆమె డయాలసిస్ స్టేజ్‌కు వెళ్లింది. అయినా కుంగిపోలేదు. చదవండి: ఫుడ్ హీరోలు!: పంటల పుట్ట రామకృష్ణ పొలం! ఆర్గానిక్ ఉత్పత్తులను రోజూ ఇచ్చి తల్లిని కాపాడుకుంటాననే నమ్మకం అతడిలో కలిగింది. ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు, రైస్ ఇచ్చే వారు. మూడేళ్లలో ఎలాంటి మెడిసన్ వాడకుండా ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులతోనే అమ్మను కాపాడుకోగలిగానని చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయమంటే చిన్నచూపు మన దేశంలోనే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువ. ప్రపంచంలో 36 శాతం జనాభాకు ఆహార ధాన్యాలు అందించే అన్నపూర్ణ అయినా రసాయన ఎరువులతో పండించిన పంటలు ప్రజల ఆరోగ్యాన్ని పీడిస్తున్నాయి. వ్యవసాయం అంటేనే సమాజం అదోలా చూస్తోంది. ప్రకృతి వ్యవసాయం అంటే మరీ చిన్నచూపు. ఆ ఆలోచన మార్చుకోవాలి. – ఖుషీ చంద్ వడ్డె ‘కోశాగారం’.. ఆర్గానిక్ స్టోర్ 2013లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి షాద్‌నగర్‌లో 12 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని ఆవుపేడ, ఆవు మూత్రం, బెల్లం, పిండి మిశ్రమంతో చేసిన జీవామృతంతో ఆకు కూరలు, కూరగాయలు పండించడం మొదలుపెట్టాడు. మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా రెండేళ్ల పాటు వ్యవసాయం చేసి ప్రకృతి సేద్యంపై అనేక మంది రైతులకు అవగాహన కల్పించాడు. అనంతరం ఓయూ కాలనీలో ‘కోశాగారం’ పేరిట ఆర్గానిక్ స్టోర్ నెలకొల్పాడు. అప్పటి నుంచి వ్యవసాయం మానేసి ప్రకృతి సేద్యం చేసిన రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను ఆర్గానిక్ స్టోర్‌లో విక్రయిస్తున్నాడు. ఇటీవల గచ్చిబౌలిలోనూ మరో స్టోర్ ప్రారంభించాడు. -
వనితకు వ్యవసాయమే ప్రాణం..
కుబేరునికైనా.. బికారికైనా కడుపు నింపేది పట్టెడన్నమే.. ఈ బువ్వను సృష్టించేది రైతే.. మట్టితో సహవాసం చేస్తూ చెమటే ఇంధనంగా పోరాడే అన్నదాత లేకుంటే ఈ లోకం ఏమైపోతుందో.. ఈ విలువ చిన్నారి వనితకు 6వ తరగతిలోనే తెలిసింది అప్పటి నుంచి వ్యవసాయమే ప్రాణంగా భావిస్తోంది... బాలల దినోత్సవం సందర్భంగా ఈ పాప జీవనశైలి మిగతా బుడతలకు ఆదర్శంగా మారాలని ఆశిద్దాం.. సాక్షి, ఒంగోలు: నాగార్జున సాగర్‌కు సమీపంలో ఉంటుంది గేన్యా నాయక్ తండా.. అక్కడే వడిత్య వనిత తల్లిదండ్రులు రెండకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. కానీ ఎప్పట్లాగానే వ్యవసాయంలో నష్టాలు వచ్చాయి. ఇక లాభం లేదనుకొని ముగ్గురు పిల్లలతో ఒంగోలు వలస వచ్చారు. బిడ్డలను బాగా చదివించాలనుకున్నారు. వీరిలో మధ్య సంతానంగా వనిత జన్మించింది. మంగమూరు రోడ్డులో ఉన్న శ్రీ షిరిడీ సాయి హైస్కూలులో వనిత మూడో తరగతిలో చేరింది. అలా ఆరో తరగతికి రాగానే అక్కడ పనిచేస్తున్న డ్రాయింగ్ మాస్టారు ఎన్. మాల్యాద్రి స్ఫూర్తి ఆమెపై పడింది. దీనికి కారణం ఆయన సేంద్రియ వ్యవసాయం చేయడమే. క్షేత్ర పర్యటనల్లో భాగంగా పిల్లలతో పాటు ఆయనకు ఒంగోలు సమీపంలో ఉన్న కొనగానివారిపాలెం వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లేవారు. ఇది నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. స్వతహాగా వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అనితకు ఆ పరిసరాలు ఎంతగానో నచ్చాయి. ( చదవండి: ‘దేశీ’ ఉత్పత్తులే దివ్యౌషధాలు! ) భవితపై ఆలోచన.. ఆ క్షేత్రంలో శ్రీగంధం, టేకు చెట్లు ఉంటాయి. ఇక అంతర సేద్యంగా జామ, దానిమ్మ, బత్తాయి వంటి పండ్లతో పాటు వరి కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేయడానికి మాల్యాద్రి విశేషంగా కృషి చేస్తున్నారు. ఇక్కడ కేవలం కషాయాలతోనే వైరస్‌లను కట్టడి చేస్తారు. ఇక బలం కోసం దిబ్బ ఎరువు వాడతారు. ఇలాంటి విషయాలే వనితను విస్తృతంగా ప్రభావితం చేశాయి. తల్లిదండ్రులు లెక్కకు మించి.. శక్తికి మించి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి చేతులు కాల్చుకున్న వైనాన్ని చూసిన అనితకు సేంద్రియ వ్యవసాయం ఎంతో మంచిదని అర్థం అయింది. అందుకే అప్పటి నుంచి వ్యవసాయంలో అన్ని పద్ధతులు తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. 4 అన్ని పనులు నేర్చుకుంటూ.. ప్రస్తుతం తొమ్మిదో తరగతికి వచ్చిన వనిత వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనులనూ తన గురువు సహాయంతో నేర్చుకోగలిగింది. చేలో కట్టలు కట్టడం, పాదులు, కలుపు తీయడం, వివిధ రకాల గారర్డెనింగ్లో మెళకువలు తెలుసుకుంది. లాక్డౌన్ కారణంగా ఈ పాప తల్లిదండ్రులు తమ స్వగ్రామం అయిన గేన్యా నాయక్ తండాకు వెళ్లారు. దీంతో అనిత.. తమ గురువుగారి ఇంట్లోనే కుటుంబ సభ్యురాలిగా ఉంటోంది. ఇలా ఆరు నెలలుగా ఆ పాపను మాస్టారు కుటుంబం ప్రేమతో చేరదీస్తోంది. అక్కడే ఉంటూ వ్యవసాయంలో ఇంకా లోటు పాట్లను తెలుసుకునేందుకు ఈమె ప్రయత్నిస్తోంది. ‘వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు పడిన కష్టాల గురించి విన్నాను. వారు ఆ బాధలు భరించ లేక ఒంగోలు వచ్చారు. మానాన్న ఆటో తోలుతూ ఉంటాడు. అమ్మ ఓ అపార్టుమెంటులో వాచ్‌ఉమెన్‌గా పని చేస్తోంది. అన్న మా ఊర్లో హాస్టళ్లో చదువుతుండగా.. తమ్ముడు మా స్కూల్లోనే ఏడో తరగతి చదువుతున్నాడు. సేంద్రియ వ్యవసాయమే చాలా మంచిది. రసాయన ఎరువులు వాడటం వల్ల అందరికీ రోగాలు వస్తున్నాయి. ఇలాంటి ఉత్పత్తులు వాడకూడు. నేను పెద్దయ్యాక అగ్రికల్చర్ బీఎస్సీ చదవాలని ఉంది. అంతా ప్రకృతి పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి. అప్పుడే మంచి దేశం ఉత్పత్తి అవుతుంది. సేంద్రియ ఉత్పత్తులు పండించి దేశానికి అన్నం అందించాలన్నదే నాకల’ అని ఎంతో నమ్మకంతో చెప్పిందీ పాప. అడిగిన వారికి సేంద్రియ ఉత్పత్తులు మాల్యాద్రి మాస్టారికి లాయర్ పేటలో ఫ్రీడమ్ బర్డ్స్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది. ఇందులోని సభ్యులకు, తమ స్కూల్‌కి చెందిన తల్లిదండ్రులకు తమ వ్యవసాయ క్షేత్రంలోని ఉత్పత్తులను విక్రయిస్తుంటారు. ముఖ్యంగా జామ, నిమ్మ, ఆకుకూరలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది రెండెకరాల్లో వరి కూడా సాగు చేశారు. ‘వనితకు వ్యవసాయం పట్ల చాలా ఇష్టం ఉంది. నేను చేయగలిగిన అన్ని పనులూ నేర్చుకుంది. పాప తల్లిదండ్రులు కూడా ఆమె ఇష్టాన్ని గుర్తించారు. చిన్నతనంలోనే రైతులను బతికించాలని.. సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతం చేయాలనే ఆలోచనలతో అగ్రికల్చర్ ఆఫీసర్ కావాలని కలలు కనడం నిజంగా అభినందనీయం. ఆమె భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు చేరుకోవాని ఆశిస్తున్నా’ అని ఆమె గురువు నాయుడు మాల్యాద్రి చెప్పారు. -
మిడతల దాణా మంచిదేనా?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యం, హార్న్ ఆఫ్రికా దేశాలతోపాటు భారత్ సహా పలు దక్షిణాసియా దేశాలు నేడు అనూహ్య సంఖ్యలో మిడతల దాడులను ఎదుర్కొంటున్నాయి. భారత్‌కన్నా ముందుగా మిడత దాడులను ఎదుర్కొన్న పాకిస్థాన్ వాటిని నిర్వీర్యం చేయడం కోసం మూడు లక్షల లీటర్ల క్రిమిసంహారక మందులను వాడడమే కాకుండా మరో కొత్త ప్రయోగానికి తెరతీసింది. క్రిమిసంహారక మందులు వాడని పొలాల్లో వాలిన మిడతలను కూలీల ద్వారా సేకరించి వాటిని కోడి దాణాగా మార్చి కోళ్ల ఫారమ్‌లకు పంపించింది. 45 శాతం ప్రొటీన్లు ఉండే సోయాబీన్ కిలో పాకిస్థాన్‌లో 90 రూపాయలు పలకుతుండగా, 70 శాతం ప్రొటీన్లు ఉండే మిడతలను కిలోకు 20 రూపాయలు చెల్లించి కూలీల ద్వారా సేకరించింది. మిడతలను కోడి దాణాకా మార్చేందుకు కిలోకు 30 రూపాయలు ఖర్చు అవుతుందని, సేకరణ ఖర్చుతో కలిపితో కోళ్ల ఫారాలకు కిలోకు 50 లేదా 55 రూపాయల చొప్పున సరఫరా చేయవచ్చని పాక్‌లోని ఓక్రా జిల్లోలో ఈ ప్రయోగం నిర్వహించిన ‘పాకిస్థాన్ అగ్రికల్చరల్ రిసర్చ్ కౌన్సిల్‌కు చెందిన బయోటెక్నాలజిస్ట్ జోహర్ అలీ తెలిపారు. మిడతలను చంపేందుకు క్రిమి సంహారక మందులను వాడినట్లయితే వాతావరణ కాలుష్యం పెరగుతుందని, వాటిని తిన్నట్లయితే మనుషులకూ ప్రమాదమని, వాటిని సేకరించి కోడి దాణాగా ఉపయోగించడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయన మాటలతో ఏకీభవించిన పలువురు పర్యావరణ వేత్తలు భారత్ కూడా పాక్ అనుసరించిన కొత్త విధానాన్నే అనుసరించాలంటూ సూచనలు కూడా చేశారు. వాస్తవానికి ఇది కొత్తగా కనిపిస్తోన్న పాత విధానం. గతంలో రైతులు వ్యవసాయ బావుల వద్ద కోళ్లను, బాతులను పెంచేవారు. అవి మిడతలను ఎక్కువగా తిని బలంగా తయారయ్యేవి. ప్రకృతిసిద్ధంగా పిచ్చుకలు, కాకులు కూడా మిడతలను ఎక్కువగా తింటాయి. పిచ్చుకలు కనిపించడమే కష్టంకాగా కాకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. గతంలో పలు దేశాల ఆదిమ జాతులు కూడా మిడతలను తినేవి. ఇక్కడ క్రిమిసంహారక మందులు వాడని పొలాల్లో తాము ప్రయోగం చేసినట్లు జోహర్ అలీ తెలిపారు. క్రిమిసంహారక మందులు వాడుతున్న పొలాల సంగతి ఏమిటి? వాటిపై మిడతల దాడిని ఎలా ఆపాలి? భారత్‌లో 80 శాతాకిపైగా క్రిమిసంహారక మందులతో వ్యవసాయం జరుగుతోంది. పంటలపై చల్లే క్రిమి సంహారక మందుల ప్రభావం మిడతలపై ఎక్కువగా ఉంటుంది కనుక ఆ మందులు వాడని పొలాలపై మాత్రమే తాము ప్రయోగం చేసినట్లు అలీ చెప్పారు. (ఇవి అత్యంత వినాశకారి 'మిడతలు') మిడతల కోసం భారత వ్యవసాయదారులు క్రిమిసంహారక మందుల వాడకాన్ని వదిలేయాలా? సేంద్రీయ వ్యవసాయం వైపు మల్లండంటూ పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ఇస్తామంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చినా పెద్దగా ఫలితాలు రాలేదు. మిడతలను నిర్మూలించేందుకు సాధారణంగా ‘ఆర్గనోఫాస్ఫేట్, కార్బమేట్, పైర్‌థ్రాయిడ్’ క్రిమిసంహారక మందులను వినియోగిస్తున్నారు. ఇవి అత్యంత విష పూరితమైనవి. వీటి ప్రభావం మిడతలపై చనిపోయిన తర్వాత కూడా ఉంటుందని రుజువైంది. కనుక ఈ మందుల వల్ల చనిపోయిన మిడతలను మనుషులుగానీ పక్షులుగానీ తినకూడదు. తిన్నట్లయితే మనుషుల్లో కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె చెడిపోయే అవకాశం, ఎముకలు పెలసవుతాయి. మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అందుకని మనుషులెవరూ మిడతలను తినరాదంటూ అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మనుషులు లేదా జంతువులకు ఆహారంగా మిడతలు పనికి రావని దక్షిణ కొరియాలోని యాన్‌డాంగ్ నేషనల్ యూనివర్శిటీ, పోస్ట్ డాక్టోరల్ రిసర్చర్ జూస్ట్ వాన్ ఇట్టర్ బీక్ హెచ్చరిస్తున్నారు. (మిడతలపై దాడికి చైనా ‘డక్ ఆర్మీ’) -
సేంద్రియం సైసై.. వైరస్ బైబై..!
బొప్పాయి.. బొప్పాయి పంట అనగానే వైరస్ తెగులు గుర్తొస్తుంది. వైరస్ ఒక్కసారి తోటలో కనిపించిందంటే ఇక ఆ తోటపై ఆశలు వదులుకోవల్సిందే అన్న బెంగతో రైతులు వణకిపోతూ ఉంటారు. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడే బొప్పాయి తోటల్లోనే వైరస్ పంటకు మరణశాసనంగా మారుతోందని, పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాటిస్తే వైరస్ అసలు సమస్యే కాదని డా. జి. శ్యామసుందర్ రెడ్డి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. మెదక్ జిల్లా తునికిలోని ‘డా. రామానాయుడు – ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)’ లో ఆయన సేంద్రియ బొప్పాయి తోటను ప్రయోగాత్మకంగా సాగు చేసి ఎకరానికి 50 టన్నుల దిగుబడి తీశారు. ఆ విశేషాలు... ‘రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడే తోటలో నేల సారాన్ని కోల్పోయి బలహీనమవుతుంది. అప్పుడే పంటకు వైరస్ సోకుతుంది. విజృంభించి దిగుబడిని దారుణంగా దెబ్బతీస్తుంది. మట్టిని ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో బలోపేతం చేస్తే, వైరస్ తెగులును తట్టుకునే శక్తి పంటకు ప్రకృతిసిద్ధంగానే మట్టి ద్వారా వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మట్టి ఆరోగ్యమే మొక్క ఆరోగ్యం, మొక్క ఆరోగ్యమే మనిషి ఆరోగ్యం..’ అంటున్నారు డాక్టర్ గున్నంరెడ్డి శ్యాంసుందరరెడ్డి. మెదక్ జిల్లా తునికిలోని ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రం అధిపతిగా ఉన్న ఆయన సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించి రెడ్‌లేడీ బొప్పాయిని 9 నెలలుగా సాగు చేస్తున్నారు. రింగ్ స్పాట్ వైరస్ నాటిన 6 నెలల తర్వాత ఒక మొక్కకు వచ్చింది. నెలలు గడిచినా మరో 3 మొక్కలకు మాత్రమే సోకింది తప్ప తోట మొత్తానికీ పాకలేదు. పిండినల్లి సోకితే కషాయాలు, పుల్లమజ్జిగ పిచికారీ చేస్తే పోయిందన్నారు. సేంద్రియ పద్ధతులను పూర్తిగా పాటిస్తే తోటకు ఒకవేళ వైరస్, పిండినల్లి సోకినా తీవ్రత అంతగా ఉండదని, పంట ఎదుగుదలకు, అధిక దిగుబడులకు ఆటంకం కాబోవని రూఢిగా చెబుతున్నారు. ఈ తోటలో చెట్టుకు 60 కాయల వరకు వచ్చాయి. ఒక్కోటి కిలో నుంచి 3 కిలోలు ఉన్నాయి. కోత ప్రారంభమైంది. కనీసం 50 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. కిలో రూ. 40 చొప్పున విక్రయిస్తున్నామని డా. శ్యాంసుందరరెడ్డి తెలిపారు. రింగ్ స్పాట్ వైరసే ఎక్కువ బొప్పాయి మొక్కల్ని ఆశించే వైరస్ తెగుళ్లు మూడు రకాలు: 1. రింగ్ స్పాట్ వైరస్: ఇది చాలా ఎక్కువ తోటల్లో కనిపిస్తుంది. మొక్కలు నాటిన రెండు నెలల నుంచి తర్వాత ఎప్పుడైనా ఈ వైరస్ సోకవచ్చు. ఆకు తొడిమె మీద నూనె లాంటి మరకలు ఉంటాయి. కాయలు, పిందెలపై వలయాకారపు నూనెలాంటి మచ్చలు వస్తాయి. 2. లీఫ్ కర్ల్ వైరస్: ఆకులు ముడుచుకుపోతాయి. 3. మొజాయిక్ వైరస్: ఆకుపచ్చగా ఉండాల్సిన ఆకులపై పసుపు, పచ్చ, తెలుపు మచ్చలు చుక్కలు చుక్కలుగా కనిపిస్తాయి. ఆకు ముడుచుకుపోదు కానీ సైజు తగ్గుతుంది. సేంద్రియ సాగులో 6 సూత్రాలు సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో బొప్పాయి సాగు చేసే క్రమంలో తాము 6 సూత్రాలు పాటించామని డా. శ్యాంసుందరరెడ్డి అన్నారు. రైతులు వీటిని తూ.చ. తప్పకుండా పాటిస్తే వైరస్, తదితర చీడపీడల బెడద లేకుండా నిస్సందేహంగా అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. ఆరు సూత్రాలు : 1. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు పూర్తిగా ఆపెయ్యాలి. 2. చివికిన పశువుల ఎరువు వాడాలి. 3. మొక్కల చుట్టూ మట్టి ఎగదోయాలి. 4. సేంద్రియ వ్యర్థాలతో ఆచ్ఛాదన చేయాలి. 5. డ్రిప్‌నకు బదులు మైక్రోస్ప్రింక్లర్లతో నీటి తడులివ్వాలి. జీవామృతం, పంచగవ్య, పుల్ల మజ్జిగ వాడాలి. 6. చీడపీడల యాజమాన్య మెలకువలు పాటించాలి. మొక్కల చుట్టూ మట్టి ఎగదోయడం బొప్పాయి మొక్కలు నాటిన తర్వాత 7వ నెలలో మొక్కలకు ఇరువైపులా 2 అడుగుల దూరం వరకు 2 అంగుళాల మందాన పశువుల ఎరువు వేశారు. 2 అడుగుల అవతల అడుగు–అడుగున్నర వెడల్పుతో అడుగు లోతున గాడి తీశారు. తీసిన మట్టిని మొక్కల వరుసలో బెడ్‌లా వేశారు. ద్రవజీవామృతంతోపాటు డబ్లు్య.డి.సి. బొప్పాయి మొక్కలకు ద్రవజీవామృతం ఇచ్చిన పది రోజులకు వేస్ట్ డీ కంపోజర్ (డబ్లు్య.డి.సి.) ద్రావణాన్ని మార్చి మార్చి ఇదొకసారి అదొకసారి ఇస్తున్నారు. తొలి దశలో పాదుల్లో పోశారు. మొక్కలు పెరిగిన తర్వాత మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా భూమికి ఇస్తున్నారు. పూత దశలో 15 రోజలకోసారి పంచగవ్య పిచికారీ చేశారు. పిండినల్లి పరారీ వైరస్ తర్వాత బొప్పాయి మొక్కల్ని పీడించే మరో సమస్య పిండినల్లి. మొక్కలు నాటిన రెండో వారం నుంచే పిండినల్లి సోకింది. పంచగవ్య పిచికారీతో తొలిదశలో అదుపులోకి వచ్చింది. మొక్కలు నాటిన తర్వాత 6వ నెలలో ఎడతెరపి లేకుండా 2 నెలల పాటు వర్షాలు కురిశాయి. పంచగవ్య పిచికారీ చేసినా వర్షం వల్ల ప్రభావం చూపలేకపోయింది. అప్పుడు లొట్టపీసు కషాయం, గంజిద్రావణం, పుల్లటి మజ్జిగ 5 రోజుల వ్యవధిలో ఒక్కోసారి పిచికారీ చేస్తే పిండినల్లి పత్తాలేకుండా పోయిందని డా. శ్యాంసుందరరెడ్డి తెలిపారు. 10 లీటర్ల నీటిలో ఒక కిలో చొప్పున లొట్టపీసు (తూటి) మొక్క ఆకులు వేసి పొయ్యిమీద పెట్టి 3 పొంగులు వచ్చే వరకు మరిగించి, దించి, చల్లారిన తర్వాత (నీరు కలపకుండా) పిచికారీ చేశారు. మొక్కలు, కాయలు, పందెలు పూర్తిగా తడిసి ముద్దయ్యేలా పిచికారీ చేశారు. 5 రోజుల తర్వాత లీటరు నీటికి 100 గ్రాముల చొప్పున వేసి గంజి ద్రావణం కాచి, చల్లారిన తర్వాత పిచికారీ చేశారు. మరో 5 రోజులకు బాగా పుల్లటి మజ్జిగ పిచికారీ చేశారు. లీటరు పెరుగుకు 9 లీటర్ల నీటిని కలిపి మజ్జిగ చేసి 5 రోజులు పులియబెట్టి పిచికారీ చేశారు. ఈ మూడు పిచికారీలతో పిండినల్లి పత్తాలేకుండా పోయింది. 3 నెలలు గడచినా మళ్లీ కనిపించలేదు. బూడిద తెగులు కూడా రాలేదు. పిండినల్లి నేలను సుసంపన్నం చేయాలి నేలను సుసంపన్నం చేసినప్పుడే బొప్పాయి మొక్కలు వైరస్ సహా చీడపీడలను సమర్థవంతంగా తట్టుకోగలుగుతాయి. మొక్కకు కావలసిన శక్తిని, బలాన్ని ఇచ్చేలా మట్టిని బలోపేతం చేయడం సహజ పద్ధతుల ద్వారానే సాధ్యమవుతుందని గ్రహించాలి. రసాయనాలు వేస్తే నేలలో స్వతహాగా ఉండే శక్తి సన్నగిల్లిపోతుంది. కాబట్టి, అసలు రసాయనిక ఎరువులు వేయనే వేయకూడదు. రసాయనిక ఎరువులు వేయపోతే మంచి దిగుబడులు రావని, కాయల సైజు రాదని రైతులు అనుకుంటూ ఉంటారు. అది అపోహ మాత్రమే. సేంద్రియసాగులో పశువుల ఎరువుతో కూడా మంచి దిగుబడులు రావడమే కాదు మంచి రుచి కూడా వస్తుంది. నిల్వసామర్థ్యం కూడా పెరుగుతుంది. ∙కట్టెలకు నిప్పు పెట్టి గుంతల్లోనే బయోచార్ తయారుచేస్తున్న దృశ్యం కోనేరు గుంతలు.. పశువుల ఎరువు.. డా. శ్యాంసుందర రెడ్డి అనుసరించిన సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వివరాలు.. కోనేరు గుంతలు తవ్వి మొక్కలు నాటారు. కోనేరు గుంత అంటే.. పైన ఎక్కువ వెడల్పుతో, కిందికి వెళ్లే కొద్దీ తక్కువ వెడల్పుతో మెట్లు మెట్లుగా గుంత తీయడం అన్నమాట. గుంత 3 అడుగుల వెడల్పున తీయాలి. వెడల్పు 3 అడుగులతో ప్రారంభమై.. అడుగుకు వెళ్లే టప్పటికి అడుగు వెడల్పు, అడుగు లోతు ఉండేలా తీశారు. ప్రతి గుంతలో కట్టెలను తగులబెట్టి బొగ్గు(బయోచార్)ను తయారు చేశారు. గుంతలో మూడో వంతు వరకు కట్టెలు వేసి మంటపెట్టారు. కట్టెలు బాగా ఎర్రగా కాలుతున్నప్పుడు (కట్టెలను పూర్తిగా కాలిపోకముందే చెయ్యాలి. మొత్తం కాలిపోతే బూడద మిగులుతుంది) మట్టితో గుంతను కప్పేశారు. మంటలు ఆరిపోయి బొగ్గు మిగిలింది. ప్రతి గుంతలో కనీసం 5 కిలోల బొగ్గు ఉంటే సరిపోతుంది. కట్టెలు కాల్చి మట్టితో పూడ్చిన వారం తర్వాత ప్రతి గుంతలోనూ 10 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు వేసి మొక్కలు నాటారు. మొక్కలు నాటిన 3వ నెలలో చుట్టూ గాడి తీసి ఎరువు వేశారు. మొక్కకు 2 అడుగుల దూరంలో గుండ్రంగా.. అడుగు వెడల్పు, అడుగు లోతులో గాడి తీశారు. ఆ గాడిలో 4–6 అంగుళాల మందాన పశువుల ఎరువు వేశారు. అంతే. ఈ ఎరువుతోనే చక్కటి కాపు వచ్చింది. చెట్టుకు 40–50 కాయలు వచ్చాయి. మొక్కలు నాటిన 3 నెలల తర్వాత చెట్టుకు 50 కిలోల పశువుల ఎరువు వేశారు. 7 నెలల తర్వాత 20 కిలోల పశువుల ఎరువు వేశారు. కొబ్బరి వ్యర్థాలతో ఆచ్ఛాదన మొక్కల వరుసలో మట్టిని బెడ్‌లా పోసిన తర్వాత దానిపైన కొబ్బరిపీచు వ్యర్థాలతో ఆచ్ఛాదన చేశారు. కొబ్బరి బొండాలను ష్రెడ్డర్‌లో వేసి పీచును తయారు చేస్తారు. పీచుతోపాటు కొంత వృథాపొట్టు వంటి పదార్థం పోగుపడుతుంది. పీచు ధర ఎక్కువ ఉంటుంది. పొట్టు వంటి వ్యర్థ పదార్థాన్ని కిలో రూపాయికి కొని మల్చింగ్ చేశారు. ∙కొబ్బరి వ్యర్థాలతో బొప్పాయి చెట్ల చుట్టూ ఆచ్ఛాదన మైక్రో స్ప్రింక్లర్ల వాడకం మంచిది బొప్పాయి మొక్కల వేర్లు పైపైనే అనేక మీటర్ల దూరం పాకుతాయి. 80% వేర్లు 4–6 అంగుళాల లోతు మట్టిలోనే ఉంటాయి. ఎంత విస్తారంగా ఆచ్ఛాదన, తేమ గల నేల దొరికితే అంత దూరం వేరు వ్యవస్థ విస్తరిస్తుంది. ఎంత ఎక్కువగా వేరు వ్యవస్థ విస్తరిస్తే అంత ఎక్కువ పోషకాలను మొక్క తీసుకోగలుగుతుంది. డ్రిప్‌తో నీరిస్తే డ్రిప్పర్లున్న చోటే 10–20 అడుగుల లోతు వరకు నీటి తేమ దిగుతుంది. కానీ, అడుగు లోతుకన్నా తేమ బొప్పాయి వేర్లకు అవసరం లేదు. అందువల్ల నీరు వృథా అవుతుంది. ప్రయోజనమూ అంతగా ఉండదు. అందువల్ల మైక్రో స్ప్రింక్లర్లు వాడటమే బొప్పాయి తోటలో నీటియాజమాన్యంలో ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్త అని డా. శ్యాంసుందరరెడ్డి తెలిపారు. మల్చింగ్ చేయకుండా కొందరు రైతులు రసాయనిక కలుపు మందులు వాడుతున్నారు. ఈ కారణంగా ఆ తోటల్లో బొప్పాయి చెట్లకు వైరస్‌ను తట్టుకునే శక్తి సన్నగిల్లుతుంది. సేంద్రియ పదార్థాలతోనే మల్చింగ్ చెయ్యాలి. ప్లాస్టిక్ షీట్‌తో మల్చింగ్ చేయడం కూడా మంచిది కాదు. ఆ షీట్ వేసినంత ప్రాంతంలో కలుపు రాకుండా, తేమ ఆరకుండా ఉంటుందే గాని, జీవామృతం, పంచగవ్య వంటి పోషక ద్రావణాలను నేల మొత్తంలో అందించడం వీలు కాదు. సేంద్రియ వ్యర్థాలతో మల్చింగ్ చేసి, జీవామృతం, పంచగవ్య వంటి వాటిని మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా నీటితోపాటు ఇచ్చినప్పుడు నేల అన్ని చెరగులా పరచుకొని ఉండే వేర్లకు పోషకాలు పుష్కలంగా అందుతాయి. చెట్లు బలంగా పెరుగుతాయి. ఎకరానికి 50 టన్నుల సేంద్రియ బొప్పాయిల దిగుబడి బొప్పాయి తోట రెండేళ్లు కాపునివ్వాలి. అయితే, వైరస్ బెడద వల్ల ఏడాదికే అంతా అయిపోతోంది. కనీసం మొదటి 8 నెలలు వైరస్ రాకుండా చూసుకోగలిగితే, ఆ తర్వాత వైరస్ వచ్చినా 50% కాపునకు ఢోకా ఉండదు. మొక్క చుట్టూ గాడి తీసి పశువుల ఎరువు వేసి, మట్టిని ఎగదోస్తే మొక్కలకు వైరస్ రానే రాదు. ఇది మా అనుభవం. రెండో కాపు కూడా బలంగా వస్తున్నది. కింది కాయల సైజులోనే పై కాయలు కూడా పెరుగుతుండటం గమనించాం. సేంద్రియ బొప్పాయిసాగులో 6 మెలకువలు తు.చ. తప్పకుండా పాటిస్తే వైరస్, పిండినల్లి వంటి చీడపీడలను విజయవంతంగా అధిగమించడమే కాకుండా ఎకరానికి కనీసం 50 టన్నుల దిగుబడి సాధించవచ్చు. కిలోకు రూ. 5 ఖర్చవుతుంది. రైతులే నేరుగా వినియోగదారులకు అమ్ముకోవడం ఉత్తమం. మార్కెటింగ్ ఖర్చులు కిలోకు మరో రూ.5 పోయినా మిగతాదంతా నికరాదాయమే. నేరుగా వినియోగదారులకు కిలో రూ. 20కి అమ్మవచ్చు. దీని వల్ల సేంద్రియ రైతుకు, వినియోగదారులకు కూడా మేలు జరుగుతుంది. – డా. గున్నంరెడ్డి శ్యాం సుందర రెడ్డి (99082 24649), అధిపతి, డా. రామానాయుడు ఏకలవ్య కె.వి.కె., తునికి, మెదక్ జిల్లా 2020వ దశకానికి ప్రేమ పూర్వక స్వాగతం.. విషపూరితమైన రసాయనిక, విధ్వంసక సేద్య యుగం నుంచి విముక్తి పొందుదాం.. పంటల జీవవైవిధ్య సేద్యం దిశగా పరివర్తనకు దోవ చూపే దశాబ్దంలోకి అడుగిడదాం.. శిలాజ ఇంధనాలపై ఆధారపడే దుర్గతి ఇక వద్దు.. మన పశు సంపదపై ఆధారపడదాం. మన మట్టి మీద ఆధారపడదాం. జీవవైవిధ్యంతో నిండిన ప్రకృతిపై ఆధార పడదాం. మన ఆరోగ్యం మట్టిలోనే ఉంది మన ఆరోగ్యం ఆహారంలోనే ఉంది మన ఆరోగ్యం జీవ వైవిధ్యంలోనే ఉంది మట్టి ఆరోగ్యానికి మనం ఇవ్వాల్సిందేమీ లేదు.. వైవిధ్యభరితమైన గుప్పెడు బాక్టీరియాని తప్ప రండి.. చెలకల్లో మట్టితో కలిసి పని చేద్దాం..! రండి.. ప్రేమ నిండిన పంటలను విత్తుదాం..!! – డా. వందనా శివ, జీవవైవిధ్య సేంద్రియ సేద్య ఉద్యమకారిణి – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఉద్యోగం రాక.. వ్యవసాయంలో లక్షలు సంపాదిస్తున్న యువకుడు
నల్లగొండ రూరల్ : ఉద్యోగం రాకపోవడంతో వ్యవసాయం మీద మక్కువ పెంచుకున్నాడు ఓ యువరైతు. ఉన్న ఆరెకరాల భూమిలో రెండెకరాలు పందిరి విధానంలో తీగజాతి కూరగాయల సాగు చేపడుతూ రోజుకు రూ. వెయ్యి నుంచి రూ. 1500 వరకు ఆదాయం పొందుతున్నాడు. నల్లగొండ మండలంలోని దండెంపల్లి గ్రామానికి చెందిన బిట్ల నర్సిరెడ్డి ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేశాడు. రెండేళ్ల పాటు ప్రైవేట్‌గా విద్యాబోధన చేస్తూ ఉద్యోగ ప్రయత్నం చేశాడు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, ప్రైవేట్ రంగంలోనూ సరైన జీతాలు రాకపోవడంతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. పందిరి విధానంలో రెండెకరాల్లో కూరగాయల సాగు చేపట్టాడు. మొత్తం తీగజాతికి చెందిన బీర, కాకర, సొరకాయ, ఖీరా, పొట్లకాయ వంటి కూరగాయల సాగును చేపట్టి 360 రోజులూ దిగుబడి వచ్చేలా ప్లాన్ చేశాడు. పందిరి విధానంలో సాగు చేపట్టడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందుతున్నాడు. పందిరి కింద భోజలు (కట్టలు) పోసి ఒక భోజను ఖాళీగా ఉంచి మరో భోజలో విత్తనాలు నాటాడు. దిగుబడి పూర్తి కావచ్చే నెల రోజుల్లో ఖాళీగా ఉన్న భోజలో మరో రకం కూరగాయల సాగు చేపడతాడు. ఫలితంగా ఏడాది పొడవునా కూరగాయల దిగుబడి లభిస్తుంది. రోజూ కూరగాయలను నల్లగొండ మార్కెట్లో విక్రయిస్తుంటాడు. ప్రయోజనకరంగా ఉంది ఏడాదికి రెండెకరాల పందిరి కూరగాయల సాగు ద్వారా రూ. 5లక్షల ఆదాయం వస్తోంది. ఉద్యోగం రాకపోయినా వారికి వచ్చే జీతంతో సమానంగా సంపాదిస్తున్నా. భోజలు ఖాళీగా ఉంచి సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు చేపడుతున్నా. ఉద్యాన శాఖ ఇచ్చే ప్రోత్సాహం, వారి సూచనలు సద్వినియోగం చేసుకుంటున్నా. కూరగాయల సాగు చిన్న రైతులకు ప్రయోజనకరంగా ఉంది. – నర్సిరెడ్డి, దండెంపల్లి -
ఒక ఇంటిపైన పచ్చధనం
కూరగాయలు, ఆకుకూరల సాగులో వాడే రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుష్ప్రభావం ఆరోగ్యంపై ఎంత ఎక్కువగా ఉంటున్నదీ తెలిసివస్తున్నకొద్దీ ఆర్గానిక్ ఆహారంపై ఆకర్షితులవుతున్న నగరవాసుల సంఖ్య పెరుగుతోంది. తమ ఇళ్లపైన ఖాళీల్లో కుండీలు, మడులు పెట్టుకొని, తమ తీరిక సమయాన్ని ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవడానికి గృహిణులు మొగ్గు చూపుతూ ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నారు. గుంటూరు జెకేసీ కాలేజీరోడ్డులోని విజయపురి కాలనీకి చెందిన గృహిణి మున్నంగి హరిప్రియ ఈ కోవకు చెందిన వారే. శిక్షణ పొంది మరీ ఇంటిపంటలను విజయవంతంగా సాగు చేస్తూ మంచి దిగుబడులు పొందుతున్నారు. తాము తినటంతోపాటు ఇద్దరు కుమారు ల కుటుంబాలకూ సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలను అందిస్తుండటం విశేషం. మూడు మడులు, మూడు వరలతోపాటు అనేక ప్లాస్టిక్ తొట్లలో రకరకాల మొక్కలు నాటారు. సేంద్రియ కూరగాయల సాగు సంతృప్తినివ్వడంతో పాటు, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆమె అనందం వ్యక్తం చేస్తున్నారు. నల్లమట్టిలో ఘనజీవామృతం, వర్మీ కంపోస్టు, ఇసుక, వేపపిండి, కొబ్బరి పొట్టు కలిపి మడులు, వరలు, ప్లాస్టిక్ తొట్లలో నింపి మొక్కలు విత్తినట్లు చెప్పారు. ఆవు పంచకం, పుల్ల మజ్జిగ, అల్లంవెల్లుల్లి ద్రావణం, బూడిద, పసుపు చల్లటం ద్వారా చీడపీడలను నివారిస్తున్నట్లు ఆమె వివరించారు. సొర, బీర, కాకర, అలసంద, పొట్ల వంటి పాదులతోపాటు.. టమోట, వంగ, బెండ, మిర్చి, తోటకూర, మెంతికూర, పాలకూర, బచ్చలి కూర పండించుకుంటున్నారు. కిచెన్ గార్డెన్లో సీతాకోకచిలుకలు, తేనెటీగలు తిరుగాడుతూ పరపరాగ సంపర్కం బాగా జరిగి మంచి దిగుబడులు రావాలంటే పూల మొక్కలను కూడా పెంచుకోవాలి. ఈ దృష్టితోనే హరిప్రియ గులాబి, మందార, పారిజాతం, సెంటుమల్లి, బోగన్‌విలా, గన్నేరు, నందివర్థనం, మల్లెలు, వంటి పూల మొక్కలను కూడా నాటారు. కూరగాయలు కొనే అవసరం లేకుండానే హాయిగా ఆరోగ్యదాయకమైన కూరలు తినగలుగుతున్నామన్నారు. తమ ఇద్దరు కుమారుల కుటుంబాలకు కూడా కూరగాయలు పంపుతున్నామని, పూలు కూడా కొనకుండా సరిపోతున్నాయన్నారు సంబరంగా. రోజుకు 2 గంటల పనితో సంతోషం! నాకు వ్యవసాయం అంటే మొదటి నుంచి మక్కువ. ప్రస్తుతంమార్కెట్‌లో అమ్ముతున్న కూరగాయల సాగులో రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వాడుతున్నారు. దీని ప్రభావం ఆరోగ్యంపై కనిపిస్తున్నది. సేంద్రియ ఇంటిపంటల సాగులో శిక్షణ పొందిన తరువాత రూఫ్‌పైనే రూ. 50 వేల ఖర్చుతో మడులు, వరలతో తోట తయారు చేసుకున్నాను. విత్తనాలు తెచ్చుకొని నారు పోసి మొక్కలు నాటుతున్నాను. పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో వీటిని పండిస్తున్నాను. వంటింటి వ్యర్థాలు, రాలిన ఆకులు, రెమ్మలతో నేనే వర్మీ కంపోస్టు తయారు చేసుకుంటున్నాను. గో పంచకం మా తమ్ముని దగ్గర నుంచి తెచ్చుకొంటున్నాను. తోటపనిలో రోజూ రెండు గంటలు పాదులు సరిచేసుకుంటూ, నీరు పెట్టుకుంటూ సంతోషంగా ఉన్నాను. తోట నాకు ఆరోగ్యంతోపాటు అనందాన్ని కూడా అందిస్తున్నది. నాకు తెలిసినంతలో ఇతరులకూ సలహాలు ఇస్తూ ఇంటిపంటల సాగును ప్రోత్సహిస్తున్నాను. – మున్నంగి హరిప్రియ (98493 46517), జెకేసీ కాలేజీ రోడ్డు, విజయపురి కాలనీ, గుంటూరు – ఓబులరెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి, అమరావతి బ్యూరో, గుంటూరు ఫొటోలు: గజ్జల రామగోపాలరెడ్డి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
ప్రయాణం చేసొచ్చాయి; జాగ్రత్త : మంత్రి హరీష్ రావు
సాక్షి, సిద్ధిపేట : రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ధరతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం దొరుకుతుందని ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో ఆయన 200 మంది రైతులకు పాడి ఆవులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆవులు మంచి సెంటిమెంట్ అని ఏ పూజ చేసినా, పుణ్యకార్యం చేసినా గోపూజ ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆవులను తరలించామని, అలసిపోయుంటాయి కాబట్టి రైతులు వాటికి వేడి నీళ్లతో స్నానం చేయించాలని సూచించారు. లక్ష రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఆవులకు తగిన ఇన్సూరెన్స్ కూడా చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు సహకరించిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఒక ప్రక్రియలా నిరంతరం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సేంద్రీయ వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించిన నియోజకవర్గ రైతులను హరీష్‌రావు సన్మానించారు. -
సేంద్రియ యూరియా!
రెండేళ్లుగా సేంద్రియ యూరియా తయారు చేసి వాడుకుంటూ చక్కని దిగుబడులు సాధిస్తున్న ఆదర్శ యువ రైతు సోదరుల విజయ సూత్రాలే నేటి నేటి సాగుబడిగా మీ ముందు... ఆరుగాలం చెమటోడ్చి వ్యవసాయం చేసే రైతులు స్వతహాగా స్వేచ్ఛా జీవులు. అయితే, విత్తనాలు, ఎరువులకు, పురుగుమందులకు పూర్తిగా మార్కెట్‌పైనే ఆధారపడడంతో సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఉత్సాదకాలన్నిటినీ దుకాణాల్లో కొనుక్కొని వాడుకోవడానికి అలవాటు పడిన రైతులు ఆర్థికంగా నష్టపోవడంతోపాటు తమకున్న స్వేచ్ఛను కోల్పోతున్నారు. యూరియా వంటి రసాయనిక ఎరువు బస్తాల కోసం తెలంగాణ జిల్లాల్లో రైతులు రోజుల తరబడి క్యూలలో నిలబడుతూ నానా బాధలు పడుతున్నారు. అయితే, జగిత్యాల జిల్లాలో కొందరు ప్రకృతి వ్యవసాయదారులు మాత్రం తమ స్వేచ్ఛను నిలబెట్టుకుంటున్నారు. తమ పంటలకు అవసరమైన సేంద్రియ యూరియాను ఇసుక, ఆవు మూత్రంతో తామే తయారు చేసుకుంటూ నిశ్చింతగా పంటలు పండించుకుంటున్నారు. అటువంటి ఓ యువ రైతు సోదరుల విజయగాథ ఈ వారం ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. ♦ దండవేని నరేష్, సురేష్ అన్నదమ్ములు, యువకులు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని అల్లీపూర్ వారి స్వగ్రామం. ఐదేళ్లుగా 8 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు సాగుచేస్తున్నారు. పాలేకర్, చౌహాన్ క్యు, సీవీఆర్ మట్టిసేద్యంపై యూట్యూబ్‌లో వీడియోలు చూసి ప్రకృతి వ్యవసాయం చేపట్టి అభివృద్ధి పథంలో కొనసాగుతున్నారు. ♦ రెండెకరాల్లో 16 రకాల కూరగాయలు, 3 ఎకరాల్లో వరి, మిగతా 3 ఎకరాల్లో చిరుధాన్యాలు, పసుపు తదితర పంటలు పండిస్తున్నారు. రసాయనాలు వాడకుండా తాము పండించిన సేంద్రియ ఉత్పత్తులను జగిత్యాల పట్టణంలో సొంతంగా స్టాల్ ఏర్పాటు చేసుకొని మార్కెట్ ధరపై 10% అధిక ధరకు స్వయంగా అమ్ముకుంటూ మంచి ఆదాయం పొందుతున్నారు. ♦ నరేష్, సురేష్ పంటలకు ఘనజీవామృతం, జీవామృతం, లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా, మట్టి ద్రావణం, చేప అమినోయాసిడ్ ద్రావణం, జీవన ఎరువులు వంటి వాటిని పంటల పోషక అవసరాలకు తగినట్లుగా వాడుతూ ఉంటారు. వీటిని స్వయంగా తామే తయారు చేసుకుంటారు. అయితే, రెండేళ్లుగా ఇసుక, ఆవు మూత్రంతో సేంద్రియ యూరియాను కూడా తయారు చేసుకొని పంటలకు వేసుకుంటున్నారు. వాడకానికి సిద్ధమైన సేంద్రియ ఇసుక యూరియా 30 రోజుల్లో సేంద్రియ యూరియా సిద్ధం సేంద్రియ యూరియాకు కావాల్సిన ముడి పదార్థాలు.. ఇసుక, నాటు ఆవు మూత్రం. యూరియా తయారీకి నాటు ఆవు మూత్రం శ్రేష్టమని, దీనితోపాటు ఏ పశువు మూత్రమైనా వాడుకోవచ్చని నరేష్, సురేష్ చెబుతున్నారు. దగ్గరలో ఉన్న వాగు నుంచి ఇసుకను సేకరించుకోవాలి. అందులో రాళ్లు, రప్పలు లేకుండా జల్లించుకోవాలి. వర్షం, ఎండ పడకుండా కొష్టం/షెడ్లో సేంద్రియ యూరియా తయారు చేసుకోవాలి. ఇందుకు 30 రోజులు పడుతుంది. మొదటి 20 రోజులు ఇసుకలో ఆవు మూత్రం రోజూ కలుపుతూ తడిగా ఉంచాలి. తర్వాత 10 రోజులు ఆ ఇసుకకు గాలి తగలకుండా ప్లాస్టిక్ షీట్లో మూటగట్టి ఉంచాలి. తయారు చేసే విధానం: ఇసుకను ఒక పెద్ద నల్లని ప్లాస్టిక్ కవర్‌పై పోయాలి. 100 కిలోల ఇసుకపై 10–12 లీటర్ల నాటు ఆవు మూత్రాన్ని పోసి, ఇసుక పూర్తిగా తడిసేలా కలగలపాలి. తర్వాత, గాలి చొరబడకుండా కవర్ కట్టేయాలి. 19 రోజుల పాటు రోజూ కవర్‌ను విప్పి, ఇసుక తడి ఆరకుండా ఉండేంత ఆవు మూత్రాన్ని చల్లి.. మళ్లీ కవర్‌ను గట్టిగా తాడుతో కట్టి నీడలో ఉంచాలి. 20 రోజులకు ఇసుక యూరియా పసుపు నుంచి నల్లని రంగులోకి మారుతుంది. ఇక సేంద్రియ యూరియా వాడకానికి సిద్ధమైనట్టే. సేంద్రియ యూరియా తయారీకి మరో పద్ధతి సేంద్రియ యూరియాను మరింత సులభంగా తయారు చేసుకునే పద్ధతి మరొకటి ఉందని రైతు శాస్త్రవేత్త కొక్కు అశోక్‌కుమార్(98661 92761) తెలిపారు. పశువుల చావిడిలో నేలపైన ఇసుక పోసి, అక్కడ పశువులను కట్టేయాలి. అవి పేడ వేస్తాయి, మూత్రం పోస్తాయి కదా. పేడను విడిగా తీసుకొని.. మూత్రంతో తడిసిన ఇసుకను ఏరోజుకారోజు తీసి పక్కన కుప్పగా పోసుకోవాలి. పశువుల మూత్రమే కాదు మనుషుల మూత్రం కూడా సేంద్రియ యూరియా తయారీకి అద్భుతంగా పనిచేస్తుంది. అలా 20 రోజులు చేయాలి. 21వ రోజున ఆ ఇసుకకు గాలి ఆడకుండా ఉండేలా మూటగట్టి 10 రోజుల తర్వాత తీయాలి. అంతే.. సేంద్రియ యూరియా సిద్ధం! రసాయనిక యూరియా పంటపై చల్లితే ఎక్కువ తక్కువగా పంటకు అందుతుందని, అది కూడా 20% మాత్రమేనని, మిగతాది వృథా అవుతుందని కొక్కు అశోక్‌కుమార్ అన్నారు. సేంద్రియ యూరియా పంటపై చల్లినప్పుడు సమానంగా, పుష్కలంగా అందుతుందని తెలిపారు. పర్యావరణ కాలుష్యం, నీటి కాలుష్యం దీని వల్ల ఉండదని, మోతాదు ఎక్కువైనా పంటకు నష్టం ఉండదని, చీడపీడల విజృంభించవని అన్నారు. రైతులందరూ సేంద్రియ యూరియాను తయారు చేసుకొని వాడుకుంటే ఆర్థికంగా, పర్యావరణపరంగా, భూసారం పరంగా ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఎకరానికి 200 కిలోలు రైతు శాస్త్రవేత్త కొక్కు అశోక్‌కుమార్ గత ఖరీఫ్‌కు ముందే జగిత్యాలలో రైతులకు సేంద్రియ యూరియా తయారీపై శిక్షణ ఇచ్చారు. నరేష్, సురేష్ కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నారు. వాళ్లు వరి సాగుకు సేంద్రియ యూరియా వాడటం ఇది వరుసగా మూడో సీజన్. నాటు వేసిన 20 రోజులకు ఎకరానికి 200 కిలోలు, పొట్ట దశలో మరో 200 కిలోల సేంద్రియ యూరియా చల్లుతున్నారు. 2018 ఖరీఫ్‌లో ఎకరానికి 28 క్వింటాళ్లు, రబీలో 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి పొందారు. రసాయనిక యూరియా కోసం తోటి రైతులు రోజుల తరబడి క్యూలలో నిల్చుంటూ ఉంటే.. ఈ యువ రైతులు మాత్రం.. స్వల్ప ఖర్చుతో ముందే తాము తయారుచేసి పెట్టుకున్న సేంద్రియ యూరియాను సకాలంలో వరి పంటకు అందించడంతోపాటు పొటాషియాన్ని అందించే పొగాకు కషాయం పిచికారీ చేసి నిశ్చింతగా ఉన్నారు. వర్షం పడని చోట దాచుకుంటే 1–2 రెండేళ్ల వరకు నిల్వ ఉంచుకొని వాడొచ్చని నరేష్(96409 63372), సురేష్ తెలిపారు. ప్టాస్టిక్ కవర్‌కు బదులు సిమెంటు తొట్టెలో సైతం సేంద్రియ యూరియాను సులభంగా, పెద్దమొత్తంలో తయారు చేసుకునే వీలుంది. ఎకరానికి విడతకు 100 నుంచి 200 కిలోలు వేసుకోవచ్చు. రసాయనిక యూరియా వేసిన తర్వాత పంటకు చీడపీడల బెడద ఎక్కువ అవుతుందని, సేంద్రియ యూరియా వల్ల ఆ సమస్య రాలేదన్నారు. సేంద్రియ యూరియాపై భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి లోతైన పరిశోధనలు చేసి ఫలితాలను వెల్లడిస్తే రైతులకు మరింత మేలు జరుగుతుంది. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
తాటి పండ్లతో జీవామృతం
ప్రకృతి వ్యవసాయదారులు జీవామృతం తయారీలో సాధారణంగా నల్లబెల్లం వాడతారు. దీనికి తీవ్ర కొరత ఏర్పడింది. సాధారణ బెల్లం కిలో ధర రూ. 70ల నుంచి రూ.100లకు చేరింది. దీంతో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఖర్చులు పెరిగాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి. వెలంవారిపల్లెకు చెందిన వెన్నెల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహకులు, అభ్యుదయ రైతు కొమ్ములూరు విజయకుమార్ బెల్లం బదులుగా తాటి పండ్లను వాడుతున్నారు. ఈ పద్ధతిని స్థానిక రైతులకూ అలవాటు చేశారు. ఆయన మాటల్లోనే.. ఎకరాకు దుక్కిలో వేసే ఘన జీవామృతం తయారీకి 8 కిలోల బెల్లం కావాలి. ద్రవ జీవామృతం తయారీకి మొత్తం పంట కాలంలో ఆరుసార్లు పిచికారీకి 12 కిలోల బెల్లం అవసరమవుతుంది. దీనికి గాను రూ. 2 వేలు ఖర్చు చేయాలి. బెల్లానికి బదులుగా మాగి కింద పడిన తాటి పండ్లు వాడుకోవచ్చు.50 మాగిన తాటి పండ్లు తీసుకొని వాటిని పీచుతో సహా బాగా పగల పీకాలి. వీటిని ఒక పట్టపై ఉంచుకుని 200 లీటర్ల డ్రమ్ము తీసుకుని ఆ డ్రమ్ములో పీచుతో పగల పీకిన పండ్లను వేయాలి. ఆ తరువాత నిండుగా నీరు పోయాలి. రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో కలియబెట్టాలి. అవి తెల్లగా పీచు తేలుతూ కనిపిస్తాయి. ఆ డ్రమ్ములో నీరు పచ్చగా మారిపోతాయి. అలా నాలుగైదు రోజులకు ద్రావణం తయారవుతుంది. తాటి పండ్లు ఏడాది పొడవునా దొరకవు. కానీ, ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని 6 నెలల వరకు నిల్వ చేసుకొని, జీవామృతంలో బెల్లానికి బదులుగా వాడుకోవచ్చు. ఇలా తయారైన తాటి పండ్ల ద్రావణాన్ని బెల్లం ఎన్ని కిలోలు వాడతామో అన్ని లీటర్ల మేరకు ఈ ద్రావణాన్ని వాడుకోవాలి. అదే విధంగా ‘సేద్య సంజీవని ఎరువు’ తయారు చేసుకునే రైతులు కూడా 1 ఎకరానికి ఎరువు తయారు చేసుకునేటప్పుడు 50 కిలోల బెల్లానికి బదులుగా 50 లీటర్ల ఈ తాటిపండు ద్రావణం వాడుకుంటే సరిపోతుంది. ఈ ద్రావణం మదపు వాసన వస్తుంది. ఈ వాసనకు తేనెటీగలు విపరీతంగా పంటపై వాలుతాయి. అదే విధంగా ఈ ద్రావణం పంటలకు మేలు చేసే కీటకాలను కూడా ఆకర్షిస్తుంది. పూత బాగా రావడానికి ఈ ద్రావణం తోడ్పతుంది. వానపాములు కూడా సమృద్ధిగా పెరుగుతాయని విజయకుమార్ (98496 48498) తెలిపారు.– మాచుపల్లె ప్రభాకరరెడ్డి,సాక్షి అగ్రికల్చర్, వైఎస్సార్ జిల్లా టమాటా పంట బాగా పండింది టమాటా పంటకు తాటి పండ్లతోనే ఘన జీవామృతం, ద్రవ జీవామృతం తయారు చేసుకొని ఉపయోగించాను. తేనెటీగల ఉధృతి పెరిగింది. పంటపై పిచికారీ చేయడం వల్ల దోమ లేకుండా పోయింది. పంట దిగుబడిని పెంచే మిత్ర కీటకాలు విపరీతంగా వచ్చాయి. దీనివల్ల నాణ్యమైన పంటను పండించగలిగాను.–పి.రెడ్డెయ్య, రైతు, అనిమెల, వీరపునాయునిపల్లె మండలం, వైఎస్సార్ జిల్లా కూరగాయ పంటలకు మేలు తాటిపండు ద్రావణం తయారీ చాలా సులభం. దీని నుంచి మంచి సువాసన వస్తుంది. ఈ వాసనకు కీటకాలు ఆకర్షితమై పంటపైకి వస్తాయి. పూత దశలో పరపరాగ సంపర్కం పెరుగుతుంది. దీంతో పంట దిగుబడి పెరిగి పంట పుష్కలంగా పండుతుంది. ఈ ద్రావణంతో చేసిన జీవామృతం వల్ల కూరగాయ పంటలకు మేలు జరిగింది.–యశోదమ్మ, రైతు, చిన్ననరస్సుపల్లె,చిననమండెం మండలం, వైఎస్సార్ జిల్లా అన్ని పంటలకు చక్కగా పనిచేస్తుంది తాటిపండు జీవామృతం వ్యవసాయ, ఉద్యాన పంటలన్నిటికీ చక్కగా పనిచేస్తుంది. గతంలో బెల్లం దొరక్క నానా అవస్థలు పడుతుండే వాళ్లం. తాటిపండుతో తయారైన జీవామృతం అన్ని పంటలకూ పనిచేస్తుంది.–టి. వెంకటకృష్ణ, రైతు, బోలగొంది చెరువు,వేంపల్లె మండలం, వైఎస్సార్ జిల్లా -
సంప్రదాయసాగుపై అ‘సెస్’మెంట్
సాక్షి, హైదరాబాద్: ‘మెట్ట రైతులు అనాదిగా అనుసరిస్తున్న సమీకృత సంప్రదాయ వ్యవసాయకజ్ఞానం ప్రతికూల వాతావరణంలో సైతం పౌష్టికాహార, ఆదాయ భద్రతను అందిస్తుంది. రైతుల భావోద్వేగాలు, ఆచారాలు, సంస్కృతితో ఈ వ్యవసాయం ముడిపడి ఉంది. వర్షం ఉన్నప్పుడు ఏ పంటలు వేయాలి, కరువొచ్చినప్పుడు ఏ యే భూముల్లో ఏ యే పంటలు కలిపి వేసుకోవాలన్న సంప్రదాయ విజ్ఞానం జీవవైవిధ్య సంప్రదాయ సేంద్రియ వ్యవసాయంలో అంతర్భాగం’అని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) తదితర సంస్థలు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం చెబుతోంది. సెస్, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డి.డి.ఎస్.), న్యూఫీల్డ్ ఫౌండేషన్(యు.ఎస్.) ఆధ్వర్యంలో గత ఏడాది ఖరీఫ్, రబీల్లో జహీరాబాద్ ప్రాంత రైతుల సాగు, జీవన స్థితిగతులపై తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ పరిశోధనా సంచాలకులు ఆర్.ఉమారెడ్డి, సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ బి.సురేశ్‌రెడ్డి, డీడీఎస్ కమ్యూనిటీ మీడియా ట్రస్టు అధిపతి చిన్న నరసమ్మ, డీడీఎస్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ దంతలూరి తేజస్వి, డీడీఎస్ డైరెక్టర్ పి.వి.సతీష్ అధ్యయనం చేశారు. వివరాలను వారు మంగళవారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం... జహీరాబాద్ ప్రాంతంలోని 11 గ్రామాల్లో 20–30 మంది రైతులను 2017 జూన్ నుంచి 2018 మే వరకు అనేక దఫాలుగా కలుసుకొని, వారి సాగువిధానాన్ని సునిశితంగా పరిశీలించామని సెస్ అసోసియేట్ ప్రొఫెసర్, వ్యవసాయ శాస్త్రవేత్త సురేశ్‌రెడ్డి తెలిపారు. తాము వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేర్చుకోని విషయాలెన్నో ఆ రైతుల వద్ద నుంచి తెలుసుకున్నామన్నారు. ‘విత్తనాన్ని బుట్టల్లో బూడిద, వేపాకు, ఎర్రమట్టి కలిపి దాచుకుంటారు. దిగుబడి ఎన్ని బస్తాలు? అనేది ఒక్కటే కాదు, పశువులకు మేత, భూమికి బలిమినిచ్చేవి ఏ పంటలు అని వాళ్లు చూసుకుంటారు. వాళ్ల పొలాల్లో సాగు చేయకుండా పెరిగే మొక్కలు పోషక, ఔషధ విలువలున్న అద్భుతమైన ఆకుకూరలు, వాళ్ల భూములు కూడా జవజీవాలతో ఉన్నాయి. వీళ్ల వ్యవసాయం జూదప్రాయం కాదు. అప్పులు, ఆత్మహత్యలుండవు. వ్యవసాయ సంక్షోభం నివారణకు ఇది అనుసరణీయం’ అని సురేశ్‌రెడ్డి అన్నారు. -
ఇంటిపంటలకు బలవర్థకం
సేంద్రియ ఇంటిపంటలను మనసు పెట్టి సాగు చేసే అనుభవజ్ఞులు కొత్త ఆలోచిస్తూ, కొత్త కొత్త ద్రావణాలు తయారు చేసి వాడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ కోవలోని వారే పినాక పద్మ శ్రీనివాస్ దంపతులు. హైదరాబాద్ మియాపూర్‌లో 850 చదరపు అడుగుల మేడ మీద దగ్గర దగ్గరగా పేర్చిన 500 కుండీలు, టబ్‌లు, గ్రోబాగ్స్‌లో దట్టమైన ఇంటిపంటల అడవినే సృష్టించారు. మండు వేసవిలోనూ షేడ్‌నెట్ అవసరం లేకుండా ఇంటిపంటలను చల్లగా సాగు చేసుకుంటున్నారు. పోషక లోపం రాకుండా చూసుకోవడం విజయవంతంగా ఇంటిపంటల సాగుకు ఒకానొక కీలకాంశం. ఇందుకోసం పద్మ శ్రీనివాస్ కోడిగుడ్లు+నూనెల ద్రావణాన్ని వాడుతున్నారు. ఆమె మాటల్లోనే.. ‘‘వేపనూనె + కొబ్బరి నూనె + రైస్ బ్రాన్ (బియ్యం తవుడు) ఆయిల్.. ఈ నూనెలన్నీ కలిపి 150 ఎం.ఎల్. తీసుకోవాలి. ఈ నూనెలను తొలుత మిక్సీ జార్లో పోసి గ్రైండ్ చెయ్యాలి. ఆ తర్వాత రెండు కోడిగుడ్లు పగులగొట్టి జార్లో పోసి.. మళ్లీ గ్రైండ్ చెయ్యాలి. తర్వాత ఒక గ్లాస్ నీటిని పోసి మళ్లీ గ్రైండ్ చెయ్యాలి. అంతే.. కోడుగుడ్లు + నూనెల ద్రావణం రెడీ. ఈ ద్రావణాన్ని డ్రమ్ములోని వంద లీటర్ల నీటిలో కలిపి.. ఆ నీటిని మొక్కలకు మట్టిలో ఉదయం వేళలో పోయాలి. సాయంత్రం పోస్తే ఆ వాసనకు పందికొక్కులు మట్టి తవ్వేస్తాయి. సాధారణంగా రోజూ పోసే నీటికి బదులు, అదే మోతాదులో, ఈ ద్రావణాన్ని పోయాలి. నేను 15 రోజులకు ఒకసారి మొక్కల మొదళ్లలో ఈ ద్రావణం పోస్తున్నాను. అప్పుడప్పుడూ లీటరు నీటికి 5 ఎం.ఎల్. కోడిగుడ్డు+నూనెల ద్రావణాన్ని కలిపి మొక్కలపై పిచికారీ కూడా చేస్తాను. అవే నూనెలు ప్రతిసారీ వాడకూడదు. మార్చుకోవాలి. ఆవ నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూ¯ð ల్లో ఏదో ఒక నూనెను మార్చి మార్చి కలుపుకోవాలి. ఈ ద్రావణం వల్ల మొక్కలు దృఢంగా, గ్రీన్‌గా, కాయలు కూడా పెద్దగా పెరుగుతాయి. చీడపీడలు కూడా ఆశించవు. కోడిగుడ్లు, రకరకాల నూనెల్లోని పోషకాలతో కూడి ఉన్నందువల్ల ఈ ద్రావణం మొక్కలు, చెట్లకు ఒకవిధంగా బూస్ట్ లాగా పనిచేస్తుంది. దీన్ని తయారు చేసుకున్న రోజునే వాడాలి. మరో రకం ద్రావణం కూడా వాడుతుంటాను. వేరుశనగ చెక్క అర కేజీ, ఆవాల చెక్క అర కేజీ, బెల్లం 200 గ్రాములు వేసి కలిపి 20 లీటర్ల నీటిలో కలిపి.. ఆ ద్రావణాన్ని 3 రోజులు పులియబెడతాను. 5 లీటర్ల ద్రావణాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి మొక్కలకు పోస్తుంటాను.’’ – పినాక పద్మ శ్రీనివాస్ (94406 43065), మియాపూర్, హైదరాబాద్ -
6 నుంచి ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు శిల్పారామంలో ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఈ ఫెస్టివల్‌ను ప్రతి సంవత్సరం ఢిల్లీలో నిర్వహించేవారు. అయితే ఈ సారి హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ తెలిపారు. ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ఏర్పాట్ల నేపథ్యంలో సోమవారం శిల్పారామంలోని సంప్రదాయ హాల్లో సంచాలకులు బోయి విజయేందిరతో కలసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సేంద్రియ పద్ధతుల్ని ప్రోత్సహించి ఆరోగ్య భారతాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 150 మంది మహిళా ప్రతినిధులు ఇందులో పాల్గొంటారన్నారు. సేంద్రియ రంగంలో కృషి చేస్తున్న మహిళలు ఇక్కడ ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేసి సేంద్రియ సాగు ఉత్పత్తులు, విత్తనాలు, బేకరీ ఉత్పత్తులు, తినుబండారాలను ఇక్కడ ప్రదర్శిస్తారని తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు స్టాళ్లు తెరిచి ఉంటాయని చెప్పారు. సేంద్రియ పద్ధతుల్ని మరింత ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని, పురుగుమందులు, రసాయనిక ఎరువుల వినియోగం అధికమవుతుండటంతో మనుషులపై వాటి దుష్ప్రభావాలు పెరిగాయన్నారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. -
పల్లె విల్లా
నగరపు రొదకు దూరంగా.. అచ్చమైన పల్లె పొలాల్లో.. నిండు మనసున్న కొందరు పట్నవాసులు ప్రకృతి మాతకు ప్రణమిల్లుతూ ఆకు పచ్చని విల్లాలై కొలువు దీరితే? అది పల్లె తనాన్ని గుండె నిండా నింపుకున్న ‘రూర్బన్ కమ్యూనిటీ’ అవుతుంది! అటువంటి అపురూపమైన సామూహిక వ్యవసాయ జీవన సముదాయమే ‘ఆర్గానో నాంది’! సేంద్రియ రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ‘పల్లె విల్లా’ ఊసులు విందాం రండి.. ప్రకృతితో మమేకమై స్వయం పోషకంగా కాలుష్య రహితమైన విధంగా కలిసి జీవించడం.. సహజ వనరులను పరిమితంగా వినియోగించుకోవడం.. ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఆహారాన్ని తమకు తాము పండించుకొని తినటం.. పనిలో పనిగా పరిసర గ్రామాల్లో రైతులు, ప్రజల అభ్యున్నతికి కూడా చేతనైనంత దోహదపడటం – ఈ ఉదాత్త లక్ష్యాలతో ముగ్గురు వ్యక్తులు ఐదేళ్ల క్రితం వేసిన తొలి అడుగే ‘ఆర్గానో నాంది’ అనే గేటెడ్ కమ్యూనిటీని అపురూపంగా కొలువుదీర్చింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి పరిసరాల్లో 37.5 ఎకరాల్లో ఈ పల్లెపట్నం జీవన సముదాయం (రూర్బన్ కమ్యూనిటీ) ఏర్పాటైంది. ఆర్కిటెక్చర్ నిపుణులైన నగేష్ బత్తుల, విజయదుర్గ అడిగోపుల, రాజేంద్ర కుమార్ గూరకంటి – ఈ ముగ్గురి మదిలో మెదిలిన ఆలోచనే ‘ఆర్గానో’ కంపెనీ తొలి వెంచర్ ‘నాంది’గా రూపుదాల్చింది. ఈ సామూహిక వ్యవసాయ జీవన సముదాయంలో 73 ఫామ్ యూనిట్లు ఉన్నాయి. యూనిట్ యజమానికి అరెకరం భూమిపై అవిభాజిత హక్కు ఉంటుంది. యూనిట్‌కు ఒకటి చొప్పున 5 సెంట్లలో 1300 చదరపు అడుగుల 3 బెడ్రూం విల్లాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికి 50 మంది విల్లాలు నిర్మించుకున్నారు. 20 కుటుంబాలు పూర్తిగా అక్కడ నివసిస్తున్నాయి. భావసారూప్యత కలిగిన వృత్తి నిపుణులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఒక చోట కూడటం విశేషం. వాననీటిని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టుకొని పొదుపుగా వాడుకోవటం, సుమారు 20 ఎకరాల భూమిలో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకొని తింటున్నారు. 35 గిర్ ఆవులు, మరికొన్ని లోకల్ ఆవులు ఉన్నాయి. ఇక్కడి గోశాలలో ఫామ్ యూనిట్‌కు ఒక ఆవు చొప్పున ఉంటుంది. ఆవరణలో ప్రతి ఇంటికీ రోజుకు ఒక లీటరు చొప్పున స్వచ్ఛమైన తాజా ఆవు పాలు అందిస్తారు. విల్లాలకు చుట్టూతా పంట పొలాలు, అటవీ / కలప జాతుల చెట్ల జీవవైవిధ్యం పరచుకొని ఉంటుంది. జలచైతన్యం.. ఆర్గానో నాంది రూర్బన్ గేటెడ్ కమ్యూనిటీ డిజైన్లోనే జలచైతన్యం ఉట్టిపడుతుంది. ‘ఊర్ధ్వం’ సంస్థ సాంకేతిక నైపుణ్యంతో వాన నీటి సంరక్షణ నిర్మాణాలు నిర్మించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేయడానికి 6 రీచార్జ్ వెల్స్ నిర్మించారు. అవసరం మేరకు నీటిని తోడేందుకు 9 బోర్లు వేశారు. వర్షపు నీటిని నూటికి నూరు శాతం ఒడిసిపట్టి భూమిలోకి ఇంకింపజేస్తున్నారు. ఇందుకోసం పర్మాకల్చర్ పద్ధతుల్లో డిజైన్ చేశారు. వర్షపు నీటిని భూముల్లో ఎక్కడికక్కడే ఇంకింపజేసేలా శాస్త్రీయ పద్ధతుల్లో కాంటూరు కందకాలు, స్వేల్స్, 4 చెరువులు నిర్మించారు. వరద నీటిని సైతం ఆవరణ నుంచి బయటకుపోకుండా భూమిలోకి ఇంకింపజేసేలా శ్రద్ధ తీసుకుంటున్నారు. బోరు నీటిని తోడి శుద్ధి చేసిన తర్వాత ఇళ్లకు సరఫరా చేస్తారు. ఇళ్ల నుంచి వెలువడే మురుగునీటిని డి.ఆర్.డి.ఓ. ధృవీకరించిన సాంకేతికతతో కూడిన బయోరియాక్టర్ ద్వారా శుద్ధి చేసి పంటలకు డ్రిప్ ద్వారా ఇస్తున్నారు. నీటి లభ్యత ఉన్నంత మేరకే పంటలు పండిస్తామన్నారు ఆర్గానో నాంది మేనేజింగ్ డైరెక్టర్ నగేష్ బత్తుల. అతిగా భూగర్భ జలాలను తోడెయ్యకుండా జాగ్రత్తపడుతున్నామని, అందువల్లనే ఈ ఐదేళ్లలో తమ ఆవరణలో భూగర్భ జలమట్టం పెరిగిందన్నారు. తమ ఆవరణలో ఏటా 11 కోట్ల లీటర్ల వాన నీరు కురుస్తుందని, అయితే, ఈ ఏడాది 30% తక్కువ వర్షం పడిందన్నారు. ఎంత నీరు ఇంకింపజేస్తున్నాం, ఎంత నీరు వినియోగిస్తున్నాం అన్న విషయంలో ప్రతి నీటి చుక్కనూ లెక్కలోకి తీసుకుంటుండటం విశేషం. కూరగాయలు, పండ్లు.. ఆర్గానో నాంది ఆవరణలో తమకు అవసరమైన ఆహార పంటలను మాత్రమే పండిస్తారు. చిక్కుడు, టమాటొ, క్యాబేజి, కాలీఫ్లవర్, బీన్స్, ముల్లంగి, వంగ, బెండ, బీర, పొట్ల కాయలు, 7 రకాల ఆకుకూరలు.. జామ, మామిడి, బొప్పాయి, దానిమ్మ, సపోట, సీతాఫలం, నేరేడు పండ్ల చెట్లు పెంచుతున్నారు. 20 రకాల ఔషధ మొక్కలతోపాటు టేకు, ఎర్రచందనం, చందనం, సిల్వర్ ఓక్, అడవి మద్ది, వేప వంటి దీర్ఘకాలపు కలప చెట్లను సైతం పెంచుతున్నారు. జీవామృతం, వర్మీ కంపోస్టు, కునపజలం, పంచగవ్య, దశపర్ణి కషాయం, వేప కషాయం, అల్లం వెల్లుల్లి కషాయం, ఎన్.ఐ.పి.హెచ్.ఎం. నుంచి తెచ్చిన 16 రకాల జీవన ఎరువులు, శిలీంధ్రనాశనులను వాడుతున్నారు. శాస్త్రవేత్త డా. జి. శ్యాంసుందర్‌రెడ్డి(99082 24649) సేంద్రియ వ్యవసాయ సలహాదారుగా ఉన్నారు. పరిసర గ్రామాల రైతులకు సేంద్రియ శిక్షణ మొయినాబాద్ మండలంలోని ఎన్కేపల్లి, బాకారం, అజీజ్‌నగర్ తదితర గ్రామాలకు చెందిన సుమారు 100 మంది రైతులకు ఆర్గానో నాంది యాజమాన్యం సేంద్రియ వ్యవసాయాన్ని పరిచయం చేసింది. జీవామృతం, కషాయాలు, జీవన ఎరువులు అందించడం ద్వారా రైతులు తమకున్న భూమిలో కొద్ది విస్తీర్ణంలో సేంద్రియ వ్యవసాయం చేపట్టేలా ప్రోత్సహిస్తున్నారు. వీరికి అధిక ఆదాయం రాబట్టేందుకు గాను 2 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయించారు. ఈ రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలను మార్కెట్ ధరకన్నా 30% అధిక ధరకు కొనుగోలు చేసి ఆర్గానో స్టోర్ల ద్వారా విక్రయిస్తున్నారు. ఆర్గానో నాంది ఆవరణలో ఒక దుకాణం ఉంది. హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి, నానక్‌రాంగూడ, బోయినపల్లిలలో ఆర్గానో స్టోర్లు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన సిరిధాన్యాలు, రెడ్/బ్లాక్/ఆర్గానిక్ వరి బియ్యం, పప్పులను ఈ స్టోర్ల ద్వారా విక్రయిస్తున్నారు. సేంద్రియ రైతుల ఉత్పత్తులకు స్థానిక గ్రామాల్లోనే వినియోగం పెంచేందుకు ప్రత్యేక సంతను నిర్వహించబోతున్నారు. దేశంలోనే పెద్ద వెదురు నిర్మాణం ఆర్గానో నాంది ఆవరణలో క్లబ్ హౌస్ కళాత్మకత చూపరులను కట్టిపడేస్తుంది. పడవను బోర్లించినట్టుండే ఈ అద్భుత నిర్మాణం 10,750 చదరపు గజాల్లో విస్తరించి ఉంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి తెప్పించిన వెదురును దీని నిర్మాణంలో వాడారు. క్లబ్ హౌస్‌లోనే కామన్ కిచెన్ ఉంది. వీకెండ్స్‌లో కామన్ కిచెన్లోనే భోజనం చేయడానికి ఆర్గానో నాందివాసులు ఇష్టపడుతుంటారు. సోలార్ విద్యుత్తు, బయోగ్యాస్ ప్రభుత్వ గ్రిడ్ నుంచి విద్యుత్తును వినియోగించకుండా సోలార్, బయోగ్యాస్ ద్వారానే తమ ఇంధన అవసరాలను తీర్చుకోవడం ఆర్గానో నాందివాసుల ప్రత్యేకత. ప్రతి విల్లాపైనా సోలార్ ప్యానల్స్‌ను అమర్చారు. ఇవన్నిటినీ అనుసంధానం చేసి గ్రిడ్‌ను ఏర్పాటు చేశారు. మీటర్లు ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉంటాయి. గోశాలలో ఆవుల పేడతో ఉత్పత్తయ్యే బయోగ్యాస్‌తో కూడా విద్యుత్తును తయారు చేసుకుంటున్నారు. బయో పూల్ ప్రకృతిసిద్ధంగానే నీటిని శుద్ధి చేసేలా దేశంలోనే అతిపెద్ద బయో స్విమ్మింగ్ పూల్‌ను ఆర్గానో నాంది ఆవరణలో నిర్మించడం విశేషం. 25 అడుగుల పొడవు, 3–6 అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పున బయో పూల్ ఉంది. నెలకోసారి నాచును తొలగించడం తప్ప దీన్ని శుద్ధి చేయడానికి ఎటువంటి రసాయనాలనూ వినియోగించకపోవటం విశేషం. ప్రశాంతంగా ఉంది.. అపార్ట్మెంట్లో ఉండేవాళ్లం. 7 నెలల క్రితం ఇక్కడి విల్లాలోకి వచ్చాం. ప్రశాంతంగా ఉంది. స్వచ్ఛమైన వాతావరణం, సేంద్రియ కూరగాయలు, పాలు.. బాగాఉన్నాయి. కిచెన్ గార్డెనింగ్ కూడా చేస్తున్నాం. ప్రశాంతంగా ఉంది. – శ్రీలక్ష్మి, గృహిణి, ఆర్గానో నాందియన్ మందుల్లేకుండా పండిస్తం.. నాకు 7 ఎకరాల భూమి ఉంది. 3 గుంటల్లో మందుల్లేకుండా టమాటో, వంకాయలు, మెంతికూర పండిస్తం. మేమూ ఇవే తింటున్నం. – వై. నారాయణరెడ్డి (96180 22356), ఎన్కేపల్లి, మొయినాబాద్ మం,, రంగారెడ్డి జిల్లా రైతులను మారుస్తున్నాం.. 9 నెలలుగా ఇక్కడే ఉంటున్నా. ఈ జీవనం చాలా బాగుంది. నేనూ సేంద్రియ కూరగాయలు పండిస్తున్నా. జీవామృతం, జీవన ఎరువులు, కషాయాలు ఇచ్చి పొరుగు గ్రామాల రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఆవులు కూడా ఇస్తున్నాం. – విజయదుర్గ అడిగోపుల (98490 23039), ఆర్గానో నాంది, ఎన్కేపల్లి కార్బన్ ఫుట్‌ప్రింట్ తగ్గుతుంది సుస్థిర జీవన, వ్యవసాయ పద్ధతుల వల్ల కార్బన్ / రిసోర్స్ ఫుట్ ప్రింట్ తగ్గుతుంది. కలిగిన వారు నగరం నుంచి పల్లెకు వచ్చి ఉంటే.. గ్రామాలతోపాటు రైతులూ బాగుపడతారు. రూరల్, అర్బన్ కాంబినేషన్‌తో ఏర్పడిందే ‘ఆర్గానో నాంది’. ఇక్కడ ఉన్న వారంతా చాలా సంతృప్తిగా ఉన్నారు. బెంగళూరు, చేవెళ్లలో వెంచర్లు ప్రారంభించబోతున్నాం. – నగేష్ బత్తుల (98480 23039), మేనేజింగ్ డైరెక్టర్, ఆర్గానో నాంది, ఎన్కేపల్లి, మొయినాబాద్ మం., రంగారెడ్డి జిల్లా -
తిరుపతిలో నవంబర్ 17–18 తేదీల్లో దేశీ విత్తనోత్సవం
ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం తెలుగు రాష్ట్రాల్లో పుంజుకుంటున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన వివిధ రాష్ట్రాలకు చెందిన దేశవాళీ విత్తనాలను అందుబాటులోకి తెచ్చేందుకు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో నవంబర్ 17–18 తేదీల్లో దేశీయ విత్తనోత్సవం జరగనుంది. సౌత్ ఆసియా రూరల్ రీకన్స్ట్రక్షన్ అసోసియేషన్(సార) ఈడీ కోడె రోహిణీరెడ్డి, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన ప్రమోషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్–సైంటిఫిక్ ఎక్స్‌లెన్స్(పర్స్) సమన్వయకర్త ప్రొ. సాయిగోపాల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సీడ్ ఫెస్టివల్లో 14 రాష్ట్రాలకు చెందిన దేశీయ విత్తన సంరక్షకులు 50కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. సుసంపన్నమైన భారతీయ వ్యవసాయ జీవవైవిధ్యానికి ఈ ప్రదర్శన అద్దంపడుతుందని రోహిణీరెడ్డి తెలిపారు. 500 రకాల దేశీ వరి, 48 రకాల కూరగాయలు, 30 రకాల పప్పుధాన్యాలు, రాజస్తాన్ ఆల్వర్ నాటు సజ్జలతోపాటు 15 రకాల చిరుధాన్యాల రకాల దేశీ వంగడాలు అందుబాటులోకి తేనున్నారు. వివరాలకు.. 99859 47003, 98496 15634. ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే. -
28న కొర్నెపాడులో రబీలో వరి, కూరగాయల సాగుపై శిక్షణ
గుంటూరు జిల్లా పుల్లడిగుంట కొర్నెపాడులో ఈ నెల 28(ఆదివారం)న రబీలో సేంద్రియ వరి, కూరగాయల సాగుపై రైతులు శివనాగమల్లేశ్వరరావు, మీసాల రామకృష్ణ, ఉద్యాన అధికారి రాజా కృష్ణారెడ్డి శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 0863–2286255 -
సేంద్రియ సాగు
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ప్రస్తుతం తినే తిండి రసాయనాల మయమైంది.. కూరగాయలు, ఆకుకూరలు తింటే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెప్పేమాట.. కానీ అదే కూరగాయలు, ఆకుకూరలు మోతాదుకు మించిన రసాయన ఎరువులతో పండించడం కారణంగా ప్రజలు రోగాల బారిన పడక తప్పడం లేదు. రసాయనాల ఎరువుల ద్వారా ఇటు ప్రజల ఆరోగ్యంతోపాటు రైతుల పెట్టుబడి ఖర్చులూపెరిగిపోతున్నాయి. ఈ దృష్ట్యా కొంతమంది జిల్లా రైతులు ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల ఆరోగ్యం గురించి వారు ఆలోచిస్తున్నారు. వీరికి కలెక్టర్ దివ్యదేవరాజన్ అండగా నిలుస్తూ ప్రభుత్వం నుంచి సేంద్రియ సాగు కోసం సహాయాన్ని అందిస్తున్నారు. తాను ఆచరణలో ఉండి ఇతరులకు చెబుదామనే ఉద్దేశంతో కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో దాదాపు ఎకరం స్థలంలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలను సాగు చేసేలా దృష్టి సారించారు. వ్యవసాయానికి సంబంధించిన ప్రతి సమావేశంలో సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన కల్పించేలా కృషి చేస్తున్నారు. యువ రైతులకు సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ కల్పిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి గతంలో సేంద్రియ పద్ధతిలో రైతులు పంటలు సాగు చేసేవారు. దీంతో కూరగాయలు, ఆకుకూరలు, ఇతర పప్పుదినుసులు తీసుకోవడం వల్ల ప్రజల జీవన ప్రమాణం మెరుగుగా ఉండేది. 70 నుంచి 80 సంవత్సరాల వయస్సు వచ్చిన కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా యువతతో పోటీ పడి పనులు చేసే విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారింది. పంట పొలాలన్ని రసాయనమయం అయ్యాయి. దీంతోపాటు రైతుల పెట్టుబడి సైతం పెరిగిపోయింది. గతంలో ఆవుపేడ, గోమూత్రం, వేప కషాయం, తదితర వాటిని కలిపి సేంద్రియ ఎరువులను పంట పొలాల్లోనే తయారు చేసేవారు. ఎలాంటి రసాయనాలు లేకుండానే అన్నిరకాల పంటలను పండించేవారు. కొంత మంది రైతులు ఎలాంటి అవగాహన లేక రసాయన ఎరువులను వాడుతున్నారు. వీటిని చూసిన మిగతా రైతులు సైతం దిగుబడి బాగా వస్తుందనే ఆశతో రసాయన ఎరువుల వాడకాన్ని మొదలు పెట్టారు. క్రమంగా ఈ విధానానికి అలవాటు పడ్డారు. రసాయన ఎరువుల సాగుతో మొదట్లో దిగుబడి వచ్చినా, రానురాను భూసారం తగ్గడం, పెట్టుబడి పెరిగిపోవడంతో రైతులకు సైతం గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. మరోవైపు ప్రజల ఆరోగ్యంపై సైతం ప్రభావం పడే ప్రమాదం ఉంది. 110 ఎకరాల్లో సాగు.. సేంద్రియ పంటల శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ అడుగుజాడల్లో జిల్లాకు చెందిన కొంతమంది రైతులు నడుచుకుంటున్నారు. ఇంతకాలం రసాయన ఎరువులతో పంటలు సాగు చేయడంతో భూమి సారవంతం కోల్పోయి దిగుబడిపై ప్రభావం చూపింది. ప్రస్తుతం సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నారు. మొదట సాగు వల్ల కొంత దిగుబడి తగ్గినప్పటికీ మూడేళ్ల తర్వాత రైతు అనుకున్న దిగుబడులను పొందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 110 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. జైనథ్ మండలం అడ, సాంగ్వి, తలమడుగు మండలం కుచులాపూర్, పల్లి, ఇచ్చోడ మండలం నవేగాం, ఆదిలాబాద్‌రూరల్ మండలం వాగాపూర్, ఉట్నూర్ మండలం హస్నాపూర్, ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లిలో ప్రస్తుతం సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు, కూరగాయలు, అల్లం, వెల్లుల్లి, కంది, శనగ, తదితర పంటలను పండిస్తున్నారు. వీరందరు గత మూడు నాలుగేళ్లుగా ఈ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం పెట్టుబడి ఖర్చులు తగ్గి దిగుబడి పొందుతున్నారు. పండించిన పంటను విక్రయించడానికి మార్కెట్ లేకపోవడంతో వారు ఆశించిన ధర రావడంలేదని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. కలెక్టర్ దివ్యదేవరాజన్ చొరవతో గత శుక్రవారం జిల్లా కేంద్రంలో సేంద్రియ పంటల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. సాధారణ మార్కెట్లో ఉండే ధర కంటే వీటి ధర రూ.20 వరకు అధికంగా విక్రయించుకునే అవకాశాన్ని వీరికి కల్పించారు. రసాయనాల గురించి తెలిసిన వారు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
మోడల్ టెర్రస్ కిచెన్ గార్డెన్!
మేడ మీద నాలుగు పూల మొక్కలు పెంచుకునే ఒక సాధారణ గృహిణి.. ఏకంగా ముప్పై రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతోపాటు నాటు కోళ్లను సైతం సునాయాసంగా సాగు చేసుకునే సేంద్రియ ఇంటిపంటల నిపుణురాలిగా మారిపోయారు! ‘సాక్షి’ ఏడేళ్ల క్రితం ప్రారంభించిన ‘ఇంటిపంట’ ప్రచారోద్యమంతోపాటు ఫేస్బుక్లో ఇంటిపంట గ్రూప్ ఆమెకు ప్రేరణ, మార్గదర్శి కావటం విశేషం!! ఆమె పేరు వి. ఎం. నళిని, మెహదీపట్నం(హైదరాబాద్). తమ రెండంతస్తుల మేడ పైన 1300 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తిస్థాయి ఇంటిపంటల జీవవైవిధ్య క్షేత్రాన్ని నిర్మించుకున్నారు. బాల్యం నుంచీ పూల మొక్కలపై మక్కువ కలిగిన నళిని.. మెట్టినింటి మేడ మీద పూల మొక్కలను పెంచుకుంటూ ఉండేవారు. ఆ దశలో సాక్షిలో సేంద్రియ ఇంటిపంట కాలమ్ గురించి, ఫేస్బుక్లో ఇంటిపంట గ్రూప్ గురించి తెలుసుకొని పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు సాగుపై దృష్టిపెట్టారు. ఇనుప స్టాండ్లపై 300 గ్రోబాగ్స్, కుండీలు.. తండ్రి న్యాయవాది, భర్త ఇంజనీరు. వ్యవసాయ నేపథ్యం లేకపోయినప్పటికీ, కంపోస్టు నుంచి చీడపీడల యాజమాన్యం వరకు ఒక్కో విషయం నేర్చుకున్నానని నళిని తెలిపారు. ఇంటిపంట మిత్రబృందం అడపా దడపా కలుసుకొని విత్తనాలు, మొక్కలు పంచుకోవడం, అనుభవాలు కలబోసుకోవడం ద్వారా ఆమె తన గార్డెన్‌ను పరిపూర్ణమైన మోడల్ టెర్రస్ కిచెన్ గార్డెన్‌గా ఆహ్లాదకరంగా, ముచ్చటగా తీర్చిదిద్దుకోవడం విశేషం. చిన్నా పెద్దా అన్నీ కలిపి 300కు పైగా సిల్పాలిన్ గ్రోబాగ్స్, టబ్‌లలో 22 రకాల పండ్ల మొక్కలు, 10 రకాల ఆకుకూరలు, 8 రకాల కూరగాయలు, ఐదారు రకాల తీగ జాతి కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇనుప స్టాండ్లపైన గ్రోబాగ్స్‌ను ఏర్పాటు చేయడంతో.. టెర్రస్‌పై పడిన నీరు, ఆకులు అలములను సులభంగా శుభ్రం చేసుకోవడానికి వీలుగా ఉంది. మూడు వైపులా కొంత భాగంలో షేడ్‌నెట్ వేశారు. నీడను ఇష్టపడే మొక్కలు, తీగజాతి పాదులను దీనికింద పెంచుతున్నారు. గత ఏడాది నుంచి రెండు గూళ్లలో కింద నాటు కోళ్లను, పైన లవ్‌బర్డ్స్‌ను పెంచుతున్నారు. అరుదైన జాతులు.. అనేక రకాలు.. ఒకే జాతి పండ్లు/కూరగాయల్లో అనేక రకాల మొక్కలను నళిని శ్రద్ధగా సేకరించి సాగు చేస్తున్నారు. వంగలో ఏడు రకాలు.. ముల్లు వంగ(గుండ్రం/పొడవు), వైట్ (రౌండ్/లాంగ్), వెంగోరి బ్రింజాల్, సన్న వంకాయ, ముసుగు(తొడిమతోపాటు ఉండే పొర కాయను చాలా వరకు కప్పి ఉంచుతుంది) వంకాయ, భర్తా బేంగన్ రకాలున్నాయి. తమ్మ (చమ్మ) కాయల తీగతోపాటు చెట్టు కూడా ఉంది. ‘365 డేస్’ చిక్కుడు ఉంది.సాధారణ చిక్కుడు కన్నా 2 నెలలు ముందు నుంచి కాపునివ్వడంతోపాటు.. సాధారణ చిక్కుడు కాపు ముగిసిన తర్వాత నెల అదనంగా చిక్కుడు కాయలను అందిస్తుంది. ఇప్పటికే రెండు నెలలుగా కాస్తున్నదని నళిని తెలిపారు. పొట్టి పొట్ల, చిట్టి కాకర, రెగ్యులర్ కాకర, టమాటా, తెల్లకాకర, ముల్లంగి, రెడ్ బెండ, దొండ పాదులున్నాయి. కాప్సికం గ్రీన్, రెడ్, ఎల్లో రకాలున్నాయి. మిర్చిలో రౌండ్, బ్లాక్, ఉజ్వల(గుత్తులుగా ఆకాశం వైపు తిరిగి ఉండే) రకాలున్నాయి. టమాటా ఎల్లో/రెడ్/బ్లాక్/మదనపల్లి/బెంగళూరు రకాలున్నాయి. మలేషియన్ జామ, బ్లాక్ గాల్, అలహాబాద్ సఫేద్,లక్నో 49 రకాల జామ మొక్కలున్నాయి. ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్ బెర్, సీతాఫలం, బొప్పాయి, మల్బరీ, ఫాల్స ఫ్రూట్, అరటి, ఆరెంజ్, సీడ్నిమ్మ, సీడ్ లెస్ నిమ్మ, అంజీర, డ్రాగన్ ఫ్రూట్, పునాస మామిడి, వాటర్ ఆపిల్ (వైట్/పింక్), ఆల్‌బకర (3 ఏళ్ల నుంచీ కాపు రాలేదు), చైనీస్ లెమన్, లక్ష్మణ ఫలం మొక్కలున్నాయి. చేమ ఆకు, మునగాకు, పాలకూర, చుక్కకూర, గోంగూర, పెరుగుతోటకూర, ఎర్ర తోటకూర, సిలోన్ బచ్చలి, ఎర్ర బచ్చలి, గ్రీన్ బచ్చలి తదితర ఆకుకూరలున్నాయి. కూరగాయలు, పండ్లు 70% మావే ఒకే రకం కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు ఎన్ని ఉన్నా.. వాటిని పక్క పక్కనే పెట్టకుండా వేర్వేరు చోట్ల పెట్టడం ద్వారా చీడపీడల బెడదను చాలా వరకు నివారించవచ్చునని నళిని తెలిపారు. ఒకే కుండీలో కొన్ని రకాల మొక్కలను కలిపి పెంచుతున్నారు. వంగ+మిర్చి, టమాటా+తులసి+ఉల్లి, మామిడి+టమాట+ముల్లంగి.. కలిపి పెంచుతున్నారు. పురుగుల రాకను గుర్తించి తొలిదశలోనే చేతులతో తీసేయడం ముఖ్యమైన విషయమని నళిని అంటారు. ఆవ, బంతి మొక్కలను గార్డెన్లో అక్కడక్కడా పెంచుతున్నారు. పురుగులు తొలుత ఈ రెండు మొక్కలను ఆశిస్తాయి. కనిపించిన రోజే పురుగులను ఏరి నాశనం చేస్తామన్నారు. కాబట్టి పురుగుల బెడద మొక్కలకు ఉండదన్నారు. టమాటా మొక్కను బక్కెట్‌కు అడుగున బెజ్జం పెట్టి నాటి.. తల్లకిందులుగా పెంచుతున్నారు. టమాటాకు అలా పెరగడమే ఇష్టమని నళిని అంటారు. తమ ఇంట్లో ఐదుగురు పెద్దవాళ్లుంటామని, కిచెన్ గార్డెన్ నుంచి పండ్లు, కూరగాయలను 70 శాతం వరకు సమకూర్చుకుంటున్నామని ఆమె సంతృప్తిగా చెప్పారు. కంపోస్టు.. జీవామృతం.. కోళ్ల ఎరువు, పశువుల ఎరువు, గొర్రెల ఎరువుకు ఎండు ఆకులు, అలములతోపాటు వంటింటి వ్యర్థాలు కలిపి స్వయంగా తయారు చేసుకున్న కంపోస్టుతోపాటు.. స్వయంగా తయారు చేసుకునే జీవామృతాన్ని 15 రోజులకోసారి మొక్కలకు ఇస్తూ నళిని చక్కని దిగుబడులు సాధిస్తున్నారు. గ్రాఫ్టెడ్ పండ్ల మొక్కలను నాటడం, ఒకసారి తెచ్చిన కూరగాయ/ఆకుకూర మొక్కల నుంచి విత్తనాలను స్వయంగా తయారు చేసుకొని వాడుకోవడం ఆమె ప్రత్యేకత. ఇంటిపంట ఫేస్బుక్ గ్రూప్ నుంచే తాను అన్ని విషయాలూ నేర్చుకున్నానంటున్న నళిని.. గ్రూప్‌లో ఏదైనా అంశంపై సాధికారంగా, శాస్త్రీయంగా సమాధానాలు ఇస్తూ ఇతరులకు లోతైన అవగాహన కల్పిస్తుండటం ప్రశంసనీయం. నగరంలో పుట్టి పెరుగుతూ.. గడప దాటెళ్లే పని లేకుండా.. రోజుకు కేవలం ఓ గంట సమయాన్ని కేటాయించడం ద్వారా తన కుటుంబానికి కావాల్సిన వైవిధ్యభరితమైన, అమూల్యమైన సేంద్రియ పౌష్టికాహారాన్ని సమర్థవంతంగా సమకూర్చుకుంటున్న ఆదర్శప్రాయురాలైన గృహిణి నళిని గారికి ‘సాక్షి’ జేజేలు పలుకుతోంది! ముసుగు వంగ, పునాస మామిడి, టమాటో, చెట్టు తమ్మ (చెమ్మ) ఉజ్వల మిరప, నాటు కోళ్లు, ఆపిల్ బెర్ -
దేశవిదేశాల్లో డోర్ డెలివరీ!
ముగ్గురు బిడ్డల తల్లి ఆరిఫా రఫీ.. సేంద్రియ మామిడి సేద్యంలో కష్టానికి తగిన లాభాల కమ్మదనాన్ని ఆస్వాదిస్తున్న అరుదైన మహిళా రైతు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం లేకపోయినా సేంద్రియ సేద్యం చేస్తూనే నేర్చుకుంటూ ఒక్కో అడుగూ ముందుకు నడిచిన రైతు ఆమె. రసాయనాలు వాడకుండా పండించడం విశేషం. దేశవిదేశాల్లో, ముఖ్యంగా అమెరికా మార్కెట్లలోకి నేరుగా అడుగుపెట్టగలగడం అంతకంటే విశేషం. విదేశాల్లోనూ డోర్ డెలివరీలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. తెలుగు నేల గర్వించదగిన మహిళా రైతు ఆరిఫా రఫీ! ఆమెకు, ఆమెకు వెన్నుదన్నుగా ఉన్న కుటుంబానికి పవిత్ర రంజాన్ మాసంలో ‘సాక్షి సాగుబడి’ సగర్వంగా సలాం చెబుతోంది!! ఆరిఫా.. హైదరాబాద్ నగరంలోనే పుట్టి పెరిగిన మహిళ. ఎమ్మే చదివారు. వ్యవసాయ నేపథ్యం లేదు. అయితే, కర్నూలు జిల్లా వ్యవసాయ కుటుంబానికి చెందిన రఫీని పెళ్లాడి, దుబాయ్‌లో కొన్నాళ్లున్న తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ముగ్గురు సంతానం. అబ్బాయి.. తర్వాత ఇద్దరు అమ్మాయిలు. పిల్లలను చూసుకోవడం కోసం బ్యాంక్ పీవో ఉద్యోగాన్ని ఏడాదికే వదిలేశారు. అటువంటి పరిస్థితుల్లో పదేళ్ల క్రితం సేంద్రియ మామిడి సాగు వైపు దృష్టి సారించారు. ఫ్రెండ్స్‌తో కలసి యాదగిరిగుట్ట దగ్గర మల్లాపూర్‌లో 21 ఎకరాలు కొని మామిడి నాటారు. చేవెళ్ల దగ్గర 20 ఎకరాల్లో కూడా దశల వారీగా మామిడి నాటారు. మామిడి తోటల సాగు పనుల వద్ద నుంచి దేశవిదేశాల్లో ఆన్లైన్ మార్కెటింగ్ పనుల వరకు ఆరిఫాయే స్వయంగా చూసుకుంటున్నారు. ప్రైవేటు టెలికం కంపెనీలో డీజీఎంగా పనిచేస్తున్న తన భర్త రఫీ పూర్తి సహాయ సహకారాలతోనే తాను రాణిస్తున్నానని ఆమె అన్నారు. ఏఆర్4 ఆర్గానిక్ మాంగో ఫామ్స్ సీఈవో ఆరిఫా ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే.. ‘‘నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరగడం వల్ల వ్యవసాయం తెలియదు. మా మామగారు రైతు. మా వారికి వ్యవసాయం మీద ఆసక్తి ఉండేది. చేవెళ్ల దగ్గర భూమి కొన్నారు. డెయిరీ పెడదామనుకున్నా.. కుదరలేదు. తర్వాత ఫ్రెండ్స్‌తో కలసి యాదగిరిగుట్ట దగ్గర మల్లాపూర్‌లో భూమి తీసుకున్నాం. మన యూనివర్సిటీ సైంటిస్టులను కలిస్తే.. ఆ భూమి పనికిరాదు.. సేంద్రియ సేద్యం సాధ్యం కాదు. తోటలకు సరిపడా నత్రజనిని అందించలేరన్నారు. తమిళనాడు, కర్ణాటక వ్యవసాయ అధికారులను కలిశాం. సేంద్రియ మామిడి తోటలు పెట్టమన్నారు. కొంచెం ఖరీదైనా పంచగవ్య వాడితే మంచి ఫలితాలు వస్తాయని ప్రోత్సహించారు. జీవామృతం, ఫిష్ అమినో యాసిడ్ వాడుతున్నాం. బయోడైనమిక్ వ్యవసాయ పద్ధతిని పాటిస్తున్నాం. యాదగిరిగుట్ట, చేవెళ్లలో కలిపి 41 ఎకరాల్లో మొత్తం 22 రకాల మామిడి రకాలు వేశాం. ఏటా కొన్ని ఎకరాల్లో మొక్కలు పెట్టాం. బంగినపల్లి 30“30, హిమాయత్ 24“24, దసేరి 18“18 అడుగుల దూరంలో నాటాం. ఏడాదికి కొన్ని ఎకరాల్లో తోటలు పెడుతూ వచ్చాం. హిమాయత్ అంటే ఇష్టం. ఎక్కువ మొక్కలు అవే పెట్టాం. మల్లాపూర్ తోటలో కేసర్, దసేరి బాగా వస్తున్నాయి. గత ఏడాది 18–20 టన్నుల మామిడి పండ్ల దిగుమతి వచ్చింది. చేవెళ్ల తోటలు లేతవి కావడంతో ఎక్కువగా మల్లాపూర్ తోట నుంచే దిగుబడి వస్తోంది. వర్షాలు, పూత, పిందె.. ఆలస్యం కావడం వల్ల ఈ ఏడాది దిగుబడి 40–50% తగ్గింది. జూన్ తొలి వారం వరకు కోస్తాం. 10–12 టన్నులు రావచ్చు. మాకు 7 వేలకు పైగా కస్టమర్ బేస్ ఉంది. 1,500 మంది యాక్టివ్ కొనుగోలుదారులున్నారు. ఎక్కువ మంది హైదరాబాదీయులే. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైవాసులూ ఉన్నారు. మా వెబ్సైట్లో బుక్ చేసుకున్న వారికి దేశవ్యాప్తంగా ఆరేళ్లుగా డోర్‌డెలివరీ చేస్తున్నాం. అదేవిధంగా సింగపూర్, దుబాయ్‌తోపాటు అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో వినియోగదారులకూ మూడేళ్లుగా నేరుగా డోర్ డెలివరీ చేస్తున్నాం. పండును చూడకుండా, ముట్టుకోకుండానే ఆన్లైన్లోనే విక్రయించడంలో తొలుత కొన్ని సమస్యలు వచ్చాయి. అయితే, పండ్ల నాణ్యత విషయంలో రాజీలేని ధోరణే మాపై వినియోగదారులకు విశ్వాసాన్ని పెంచింది. గత ఏడాది 8 షిప్‌మెంట్స్ వెళ్లాయి. ఈ ఏడాది ఇప్పటికి 3 వెళ్లాయి.. మరో రెండు ఉంటాయి. పిల్లలకు ఇబ్బంది అవుతుందని ఉద్యోగం వద్దనుకున్నాను. కానీ, తోటలు పెట్టడం ప్రారంభించినప్పుడు ఇంతస్థాయిలో ఆన్లైన్ మార్కెటింగ్/ షిప్‌మెంట్స్ చేయగలమని ఊహించలేదు! రెండో అమ్మాయి స్కూలింగ్ ఇప్పుడే పూర్తయింది. బొప్పాయి, మునగ, సీతాఫలాల గురించి కూడా ఆలోచిద్దామనుకుంటున్నాను. మా సంపాదనలో 2.5% బాలికా విద్యకు ఖర్చుపెడుతున్నాం..’’ అంటున్న ఆరిఫా రఫీకి సలాములు! (0-9-9-1-23 40-4-04 www.ar4mangoes.com) అమెరికాకు ఎగుమతి అవుతున్న మాంగో బాక్సులు, పిల్లలు, భర్త రఫీతో ఆరిఫా -
సాగు ఖర్చులన్నీ పెట్టుబడి కిందకే..
న్యూఢిల్లీ: పంట పెట్టుబడి కంటే మద్దతు ధర కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేలా చేస్తామన్న తమ ప్రభుత్వ హామీపై ప్రతిపక్ష పార్టీల నేతలు కావాలని గందరగోళం సృష్టిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. పంట పండించడానికి అయ్యే అన్ని ప్రధాన ఖర్చులనూ పెట్టుబడి కింద లెక్కలోకి తీసుకుంటామని ఆయన భరోసానిచ్చారు. మూడు రోజులపాటు ఢిల్లీలో జరుగుతున్న వ్యవసాయ సదస్సు ‘కృషి ఉన్నతి మేళా–2018’ని మోదీ శనివారం సందర్శించి అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టకుండా కాలుష్యాన్ని తగ్గించడంలో తోడ్పడాలన్నారు. ‘మద్దతు ధర పెట్టుబడి కంటే కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేలా చూస్తామని 2018–19 బడ్జెట్లో హామీనిచ్చాం. పెట్టుబడి కిందకు ఏయే ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారో స్పష్టత లేదంటూ కొందరు గందరగోళం సృష్టిస్తున్నారు. కౌలు డబ్బు, మూలధనంగా తీసుకొచ్చిన డబ్బుకు అయ్యే వడ్డీ, విత్తనాలు, ఎరువులు, రైతు కుటుంబం శారీరక శ్రమకు పరిహారం, కూలీలు, సొంత లేదా అద్దెకు తెచ్చుకున్న ట్రాక్టర్ల వంటి యంత్రాలు, ఎద్దులు, సాగునీటికి అయ్యే ఖర్చు, ప్రభుత్వానికి చెల్లించే డబ్బు తదితరాలన్నింటినీ పెట్టుబడి కింద పరిగణిస్తాం. దీనికి కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేలా మద్దతు ధరను నిర్ణయిస్తాం’ అని మోదీ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని మండీలను వ్యవసాయ మార్కెట్ కమిటీలతో అనుసంధానించేందుకు కృషి చేస్తున్నామనీ, పల్లెల్లోని 22 వేల సంతల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని ఇదివరకే బడ్జెట్లో పేర్కొన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీవో) ద్వారా రైతులు తమ పంటను మరింత మెరుగైన పద్ధతుల్లో విక్రయించి అధిక ఆదాయాన్ని పొందొచ్చని మోదీ సూచించారు. సేంద్రియ విధానంలో పండించిన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ‘జైవిక్ ఖేతీ’ అనే ఓ ఆన్లైన్ పోర్టల్‌ను కూడా ఆయన ప్రారంభించారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనీ, ఆ దిశగా చకచకా అడుగులు వేస్తోందని మోదీ తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం ఎన్నో ఆదర్శ చట్టాలను రూపొందించిందనీ, వాటిని రాష్ట్రాలు అమలు చేయాలని ఆయన కోరారు. కృషి ఉన్నతి మేళాలో దాదాపు 800 స్టాళ్లు ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులు, నూతన విధానాలపై అవగాహన కల్పించారు. ఆదివారంతో ఈ కార్యక్రమం ముగియనుంది. ఉపయోగమో కాదో చూడండి కృషి ఉన్నతి మేళా వంటి అవగాహన కార్యక్రమాలు రైతులకు ఏ మేరకు మేలు చేస్తున్నాయో పరిశీలించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌ను మోదీ కోరారు. ఆధునిక వ్యవసాయ విధానాలను, ప్రభుత్వ కార్యక్రమాలను రైతుల వద్దకు చేర్చాలంటే ఇలాంటి మేళాలను మారుమూల ప్రాంతాల్లో నిర్వహించాలన్నారు. అవగాహన సదస్సుల్లో్ల రైతులు కొత్త పద్ధతులను క్షుణ్నంగా తెలుసుకోవాలని మోదీ సూచించారు. ఢిల్లీలో కృషి ఉన్నతి మేళాను సందర్శించేందుకు వేలాది మంది రైతులు తరలివస్తున్నారు. -
‘మ్యాచింగ్’ కాక.. నిధులు రాక..!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు (మ్యాచింగ్ గ్రాంట్) నిధులు విడుదల చేయకపోవటం, ఇప్పటికే కేంద్రం విడుదల చేసిన వాటికి సంబంధించిన యుటిలైజెషన్ సర్టిఫికెట్లు (యూసీ) పంపకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో అన్ని విభాగాల్లో కేంద్ర పథకాల అమలు నిస్తేజంగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రూ.10,962 కోట్లు రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం రూ.5,615 కోట్లు మాత్రమే రాష్ట్ర ఖజానాకు జమయ్యాయి. ఆ ప్రకారం సగం నిధులే కేంద్రం విడుదల చేసింది. మిగిలింది మూడు నెలలే.. మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో మూడు నెలల వ్యవధి మాత్రమే మిగిలింది. తొమ్మిది నెలల్లో కేంద్రం నుంచి సగం నిధులే రావటం.. మిగతా నిధులు ఇచ్చేందుకు కొర్రీలు పెడుతుండటం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కేంద్ర పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను మ్యాచింగ్ గ్రాంట్ వాటాగా జోడించి ఖర్చు చేయాలి. అంటే ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన నిధులకు మరో రూ.2,200 కోట్ల వాటాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. కానీ రాష్ట్రం కేటాయించలేదు. దీంతో కీలకమైన శాఖల్లో కేంద్ర పథకాల అమలు, సంబంధిత బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రధానంగా వ్యవసాయ శాఖలో రైతు రుణమాఫీకి భారీగా నిధులు కేటాయించటంతో వ్యవసాయ యాంత్రీకరణ, సేంద్రియ వ్యవసాయం.. తదితర కేంద్ర పథకాలకు నిధుల కొరత ఏర్పడింది. మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి, ప్రజా పంపిణీ వ్యవస్థల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇప్పటివరకు ఇచ్చిన నిధులకు సంబంధించిన వినియోగ ధ్రువీకరణ పత్రాలు(యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) పంపిస్తేనే తదుపరి విడత నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటును సర్దుబాటు చేయటంతోపాటు యూసీలు పంపించేందుకు ఇప్పటికిప్పుడు హడావుడి పడుతోంది. కేంద్ర, రాష్ట్రాల చెరో తీరు.. నిధుల మంజూరు, కేటాయింపులకు సంబంధించి కేంద్రం ఒక తీరుగా.. రాష్ట్రం మరో తీరుగా లెక్కలు చెప్పుకుంటున్నాయి. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో.. తెలంగాణకు కేంద్రం రూ.లక్ష కోట్లు విడుదల చేసిందని వ్యాఖ్యానించారు. అయితే అందులో సగం కూడా రాలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గణాంకాలతో సహా ఎండగట్టిన తీరు అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికీ నిధుల విడుదల విషయంలో కేంద్ర, రాష్ట్రాలు తలోతీరుగానే లెక్కలేసుకుంటున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు తెలంగాణకు రూ.21 వేల కోట్లు మంజూరు చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అందులో రూ.19,601 కోట్లు విడుదల చేసినట్లు వెబ్సైట్లో వెల్లడించింది. కానీ ఇవన్నీ రాష్ట్రానికి వచ్చిన నిధులు కావని రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. ఈ ఏడాది కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేవలం రూ.5,615 కోట్లు మాత్రమే జమయ్యాయని చెబుతోంది. కేంద్ర సంస్థల నిధులూ రాష్ట్రం లెక్కలకిందే.. తెలంగాణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, వాటి నిర్వహణకు కేటాయించిన నిధులను సైతం రాష్ట్రానికి ఇచ్చినట్లుగా కేంద్రం లెక్కలేసుకుంటోంది. సీసీఎంబీ, ఐఐసీటీలకు ఇచ్చిన నిధులను రాష్ట్రానికి ఇచ్చినట్లు చెప్పుకుంటోంది. అందుకే కేంద్రం చెప్పే లెక్కలకు, రాష్ట్రం చెప్పే గణాంకాలకు పొం తన కుదరటం లేదు. కేవలం కేంద్ర ప్రాయోజిత పథకాలకు విడుదల చేసిన నిధులనే రాష్ట్రానికి ఇచ్చిన నిధులుగా కేంద్రం గతంలో పరిగణించేది. అయితే అందుకు భిన్నమైన విధానాన్ని ప్రస్తుతం కేంద్రం ఎంచుకోవటంతో ఈ పరిస్థితి తలెత్తింది. -
ఆర్గానిక్ వ్యవసాయంతో ప్రమాదం
సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్గానిక్ వ్యవసాయంతో ప్రమాదా లు ఉన్నాయని ప్రకృతి శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ తెలిపారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ వద్ద ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసా యం’పై రైతులకు ఇస్తున్న రాష్ట్ర శిక్షణ సదస్సులో సోమవారం రెండో రోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడుతూ విదేశీ వానపాములు, వర్మికంపోస్టు దుష్ఫలితాల గురించి, స్వదేశీ వానపాముల వలన లాభాలను వివరించారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం గురించి నాలుగు అంశాలు వివరించారు. ముఖ్యంగా పంటకయ్యే ఖర్చు అంతర్ పంటల ఆదాయంతో భర్తీ చేయవచ్చని తెలిపారు. మొక్కల పెంపుదలకు కావాల్సిన ఏ ముడిపదార్ధాలు కొనుగోలు చేయకుండానే తయారు చేసుకోవచ్చని వివరించారు. యోగ వ్యవసాయ గురించి, దీనివల్ల కలిగే మోసాలు, అగ్నిహోత్ర గురించి ప్రత్యేకంగా తెలిపారు. రెండో రోజు శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు విజయకుమార్, జాయింట్ కలెక్టర్ –2 ముంగా వెంకటేశ్వరరావు, జేడీ విజయభారతితోపాటు రైతులు పాల్గొన్నారు. -
సేంద్రియంపై సెమినార్
► అన్నా యూనివర్సిటీలో జాతీయస్థాయి సెమినార్ ► 9,10,11 తేదీల్లో చెన్నైలో నిర్వహణ ► వేలాది మంది రైతులతో చర్చాగోష్టి, శిక్షణ సాక్షి ప్రతినిధి, చెన్నై: విషతుల్యమైన రసాయనాల వాడకం ద్వారా స్వల్ప వ్యవధిలో అధిక దిగుబడుల మోజులో కొట్టుకుపోతున్న అన్నదాతల్లో వస్తున్న అనూహ్యమైన మార్పు దేశాన్ని సేంద్రియ వ్యవసాయం వైపు నడిపిస్తోంది. ధైర్యంగా పట్టెడన్నం కూడా తినలేని ప్రజలకు సేంద్రియ వ్యవసాయం భరోసా కల్పిస్తోంది. రోజురోజుకూ కలుషితమై కాలకూట విషంగా మారిపోతున్న సాగుభూములకు సేంద్రియ విధానం రక్షణ కల్పిస్తూ భూమాతను కాపాడుతోంది. దేశంలో విస్తరిస్తున్న సేంద్రియ సంప్రదాయానికి, విత్తన సంపదకు చెన్నై అన్నాయూనివర్సిటీలో జరగనున్న జాతీయ సెమినార్ అద్దం పట్టబోతోంది. తాగే నీరు కాలుష్యం, పీల్చేగాలి కాలుష్యం, తినే ఆహారం కాలుష్యం..ఇలా అనేక కోణాల్లో కాలుష్యపు కాటుకు మానవుడు బలైపోతున్నాడు. కొన్ని కాలుష్యాలను గత్యంతరం లేక భరిస్తున్నాడు. అయితే ఆహార కాలుష్యానికి మాత్రం సేంద్రియ ఉత్పత్తుల ద్వారా పరిష్కారం దొరుకుతుందని ‘సేఫ్ ఫుడ్ అలయన్స్’ కో ఆర్డినేటర్ అనంతశయనన్ స్పష్టం చేశారు. ఈనెల 9, 10, 11 తేదీల్లో మూడు రోజులపాటు చెన్నై అన్నాయూనివర్సిటీలో ‘నేషనల్ సీడ్స్ డైవర్సిటీ ఫెస్టివల్–4’ నిర్వహిస్తున్నారు. ‘భారత్ బీజ్ స్వరాజ్ మంచ్’, ‘అలయన్స్ ఫర్ సస్టైనబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్’ (ఆషా) సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు సెమినార్ జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న వేలాది మంది రైతులు దేశం నలుమూల నుంచి ఈ సెమినార్‌కు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ దేశంలోని రైతుల్లో ఎంతో మార్పు వచ్చిందని, పెద్ద సంఖ్యలో సేంద్రియ వ్యవసాయం పట్ల ఆకర్షితులవుతున్నారని తెలిపారు. ఢిల్లీ, చండీగడ్, హైదరాబాద్‌లలో మూడు సెమినార్లు నిర్వహించగా, చెన్నైలో జరగనున్న నాల్గవ సెమినార్‌కు గతంలో కంటే పెద్ద సంఖ్యలో రైతులు ఉత్సాహం చూపుతున్నట్లు చెప్పారు. సేంద్రియ వ్యవసాయం మాత్రమే కాదు సేంద్రియ విత్తనాలను విస్తృత వాడకంలోకి తేవడమే తమ సెమినార్ల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. చెన్నై సెమినార్లో సైతం వందలాది రకాల విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. ప్రతిరైతు తన పరిధిలో ఉత్పత్తి చేస్తున్న వివిధ రకాల సేంద్రియ ఉత్పత్తులు, విత్తనాలను చెన్నై సెమినార్లో ప్రదర్శించి ఒకరి అనుభవాలను ఒకరు పంచుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని, టెర్రకోట ఉత్పత్తులను ప్రతినిధుల చేత స్వయంగా తయారుచేయిస్తామని. అలాగే రైతులకు శిక్షణ తరగతులను నిర్వహించడంతోపాటు రైతులే తమ అనుభవాలను పరస్పరం పంచుకుంటారని చెప్పారు. వివిధ రకాల పంటల విత్తనాలతోపాటు వైద్యపరమైన విత్తనాలను సైతం ప్రదర్శించనున్నారు. అలాగే ప్రజలకు టెర్రస్గార్డెన్పై అవగాహన శిక్షణ ఇవ్వనున్నారు. సేంద్రియ పానీయాలు, బియ్యం, సంప్రదాయ పత్తితో చేతితో నేసిన వస్రాల అమ్మకం ఇలా ఎన్నో ఆకర్షణలకు సెమినార్ వేదిక కానుందని అన్నారు. సేంద్రియం అంటే ఇంకా తెలియని వారిని దృష్టిలో ఉంచుకుని కొన్ని కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. బెంగళూరులో సహజ సమృధ పేరుతో సేంద్రియ ప్రాధాన్యతను ప్రచారం చేసే కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నెట్ వర్క్ ఆఫ్ సీడ్స్ సేవర్స్ ఇన్ ఇండియాకు వ్యవస్థాపకులని, నాలుగేళ్ల కిత్రం ప్రారంభమైన ఈ నెట్ వర్క్ కిందనే సెమినార్లు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెట్ వర్క్ కింద వందలాది మంది రైతులు సభ్యులుగా ఉన్నట్లు చెప్పారు. తొలిరోజుల్లో రైతుల కోసం మాత్రమే పనిచేయగా ప్రస్తుతం అర్బన్‌పై కూడా దృష్టిపెట్టి పట్టణవాసుల్లో సేంద్రియపద్ధతుల్లో టెర్రస్‌గార్డెన్, టెర్రస్ సీడ్స్‌ను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. సేంద్రియ సాగుపై విదేశీయులు సైతం ఎంతో ఆసక్తి చూపడమేకాదు, ఆచరిస్తున్నారని తెలిపారు. సేంద్రియ వల్ల మనిషి ఆరోగ్యాన్నే కాదు, భూమాతను కాలుష్యం కోరల నుంచి రక్షించినట్లేనని అన్నారు. ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేకతతో సెమినార్ సాగుతుందని, సేంద్రియ ప్రియులందరికీ ఆహ్వానం పలుకుతున్నామని ఆయన చెప్పారు. -
లఘు చిత్రాలతో రైతుల్లో చైతన్యం
రాంబిల్లి: సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి, అవగాహన పెంచేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ లఘు చిత్రాలను చిత్రీకరిస్తోంది. పాలేకర్ ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా సాగుపై రైతులు దృష్టిని కేంద్రీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆత్మ విభాగానికి చెందిన బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ పర్యవేక్షణలో అయిదుగురు వీఆర్పీ(వీడియో రీసోర్స్ పర్సన్)లతో బృందాలను ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన ఈ బృందాలకు హరిపురంలోని కేవీకేలో 5 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ మూడో రోజు గురువారం పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. డిజిటల్ గ్రీన్ అనే సంస్థ ఈ శిక్షణ ఇస్తోంది. లఘు చిత్రాల చిత్రీకరణ, సుస్థిర, సేంద్రియ వ్యవసాయం చేస్తూ విజయాలు సాధించిన రైతుల గాథలను ఈ చిత్రాల్లో పొందుపరుస్తారు. ఆయా రైతుల అభిప్రాయాలను చిత్రీకరిస్తారు. 5 మంది వీఆర్పీలు ఈ లఘు చిత్రాల్లో నటిస్తున్నారు. రైతుల యాసలో మాట్లాడుతూ, రైతులకు ఆసక్తిని క లిగించేలా ఈ లఘు చిత్రాలను రూపొందిస్తున్నారు. ప్రత్యేకించి శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటే వాటికి హాజరయ్యే రైతులు తక్కువగా ఉంటున్నారు. పని ఒత్తిడి కారణంగా ఇటువంటి శిక్షణలకు రైతులు హాజయ్యేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఈ తరహా ప్రయోగం మేలని భావించిందని శ్రీకాకుళం జిల్లా బీటీఎం అరుణమణి తెలిపారు. ఈ లఘు చిత్రాలను ప్రతి గ్రామంలో రైతులు పని ముగించుకొని తీరిగ్గా ఉన్నప్పుడు సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య ప్రదర్శించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ప్రకృతి సేద్యం వైపు రైతులను మళ్లించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. -
'రాయితీపై రైతులకు ఆవులు'
తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి) : సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు రాయితీపై ఆవులను అందజేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఆయన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పలాల వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. -
సేంద్రీయ వ్యవసాయంతో అధిక దిగుబడులు
ఆముదాలవలస (శ్రీకాకుళం జిల్లా) : సేంద్రీయ వ్యవసాయం చేయడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ విజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆముదాలవలస మండలం నిమ్మతుర్లివాడ గ్రామంలో వ్యవసాయ జీడీ అప్పల స్వామి ఆధ్వర్యంలో జరిగిన సేంద్రియ వ్యవసాయంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రసాయనిక ఎరువుల వాడకం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు విషపూరితం అవుతున్నాయన్నారు. వీటిని వినియోగించిన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆయన చెప్పారు. సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా నాణ్యమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయవచ్చని, తద్వారా ప్రజలు రోగాలకు దూరంగా ఉండవచ్చని ఆయన సూచించారు. పాడి పరిశ్రమలను రైతులు అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. -
సేంద్రియ వ్యవసాయం భేష్
శాయంపేట, న్యూస్‌లైన్ : జిల్లాలో రైతులు సేంద్రియ సాగు పద్ధతులు అవలంబించడం అభినందనీయమని బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్ అన్నారు. మారి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శాయంపేట మండల కేంద్రంలోని సంస్థ కార్యాలయంలో బుధవారం ఆయన రైతులతో సమావేశమయ్యూరు. ముందుగా సంస్థ బాధ్యులు, రైతులు ఆయనకు భారతీయ సంప్రదాయం ప్రకారం ఆహ్వానం పలికారు. అనంతరం మారి సంస్థ ఆధ్యర్యంలో అమలు చేస్తున్న సేంద్రియ వ్యవసాయ పద్ధతులను సొసైటీ డెరైక్టర్లు, రైతులు తెలిపారు. జీవ సంబంధ ఎరువుల వినియోగం.. ఉపయోగంపై మహిళా రైతు రజిత వివరించారు. అదేవిధంగా వ్యవసాయ సాగు పద్ధతులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను అలిస్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రసాయనిక, సేంద్రియ ఎరువులకు గల తేడాలపై ఆరా తీయగా... రైతులు చెప్పిన సమాధానంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రసాయనికి ఎరువుల వాడకాన్ని తగ్గించి... సేంద్రియ వ్యవసాయంపై మొగ్గుచూపడం శుభపరిణామమన్నారు. రైతులతో సమావేశం ముగిసిన అనంతరం శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామంలోని ఆలేటి తిరుపతికి చెందిన పత్తి పంటను అలిస్టర్ పరిశీలించారు. సాగు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతులు గ్రామంలో ఏర్పాటు చేసుకున్న సొసైటి వివరాల రికార్డులను పరిశీలించారు. అరుణ్పిల్లే, మృణాలి, శంకన్సర్కార్, జేడీఏ రామారావు, డబ్ల్యూడబ్ల్యూఫ్ సీనియర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఉమేశ్కృష్ణ, మారి సంస్థ కార్యదర్శి మురళి, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నర్సింహారెడ్డి, రామ్మూర్తి, కృష్ణమూర్తి, డిప్యూటీ తహసీల్దార్ కె.కేదారి, మారి సంస్థ క్లస్టర్ కోఆర్డినేటర్ గౌస్, సిబ్బంది పల్నాటి రాంబాబు, రైతులు పాల్గొన్నారు.