వారంతా వ్యవసాయం చేసుకునే సాధారణ మహిళలు.. కానీ సేంద్రియ ఉత్పత్తులు తయారుచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. వృథాగా భూమిలో కలిసి పోయే వేప గింజల నుంచి విలువైన వేప నూనె, వేప పిండిని తయారు చేసి విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి విజయ గాథలోకి వెళదాం...
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గ్‌ల్ గ్రామంలో సుమారు 15 మంది మహిళలు మూడు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడ్డారు. ఐదుగురికి ఒక్కో యూనిట్ చొప్పున మూడు యూనిట్లు స్థాపించుకున్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలోని వివిధప్రాంతాలకు వెళ్లి వేప గింజలను కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటారు. ఇటు వ్యవసాయం చేసుకుంటూనే సమయం దొరికినప్పుడు వేప నూనె, వేప పిండిని తయారు చేస్తున్నారు.
ఏటా వేప చెట్లకు కాసే వేప కాయలు పండి రాలిపోతుంటాయి. ఇలా రాలిపోయిన గింజలను ఆయాప్రాంతాల్లోని మహిళలు, గిరిజనులు సేకరిస్తుంటారు. ఇలా సేకరించి తెచ్చిన గింజలకు అంటుకున్న మట్టిని తొలగించి, ఎండబెట్టి ్రపాసెస్ చేస్తుంటారు. క్వింటాలు గింజలకు ఐదు లీటర్ల వరకు వేప నూనె, 70 నుంచి 90 కిలోల వరకు నూనె తీసిన వేప పిండి (కేకు) తయారవుతుంది. గింజల నాణ్యత బాగుంటే నూనె కాస్త ఎక్కువ వస్తుంది. వేప నూనెను వ్యవసాయంలో పంటలపై చీడపీడల నివారణకు పిచికారీ చేస్తుంటారు. ఔషధాల తయారీకి, చర్మవ్యాధుల నివారణకూ వాడుతుంటారు. వేప పిండిని పంటల సాగులో సేంద్రియ ఎరువుగా వినియోగిస్తుంటారు. వివిధ జిల్లాల్లో సేంద్రియ సాగు చేసే రైతులు వచ్చి కొనుగోలు చేసుకొని తీసుకెళుతుంటారు. ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ తీసుకొని ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపుతున్నారు.
దారి చూపిన డీడీఎస్..
చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటలు సాగు చేసే సేంద్రియ రైతులను ప్రోత్సహించే స్వచ్చంద సంస్థ డక్కన్ డవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) వీరికి వేప కాయలతో సేంద్రియ ఉత్పత్తుల తయారీ పద్ధతిని నేర్పించింది. సుమారు రెండు దశాబ్దాల క్రితమే వేప గింజల నుంచి నూనె, వేప పిండి తీసే యంత్రాల కొనుగోలు చేసేందుకు రుణ సహాయం అందించింది. ఇప్పుడు ఆ యంత్రాలు పనిచేయడం లేదు. అప్పటి మహిళలకు వయస్సు మీద పడటంతో వారి కోడళ్లు, కూతుళ్లు ఈ యూనిట్లను నడుపుతున్నారు. పాతయంత్రాలు పనిచేయకపోవడంతో కొత్త యంత్రాలను కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం బ్యాంకుల ద్వారా కొంత మొత్తాన్ని రుణంగా పొందారు. ఈ రుణంపై వడ్డీలు పెరిగిపోతుండటం తమకు భారంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ రుణాలను మాఫీ చేసిప్రోత్సహించాలని, లేదంటే కనీసం రుణంపై వడ్డీనైనా మాఫీ చేయాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. – పాత బాలప్రసాద్, సాక్షి, మెదక్ జిల్లా ఫొటోలు: మాతంశెట్టి మల్లన్న, జహీరాబాద్ టౌన్
అప్పు భారమైంది..
ఇటు వ్యవసాయం పని చేసుకుంటూనే ఏడాదిలో 6నెలల పాటు వేప నూనె, వేప చెక్క (కేక్) తయారు చేస్తున్నాం. మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలి. ఎక్కువ ధర వచ్చేలా చూడాలి. ప్రస్తుతం సరైన మార్కెట్ లేకపోవడంతో చేసిన కష్టమంతా వృథా అవుతోంది. బ్యాంకు రుణాలను వడ్డీతో కలిపి చెల్లిస్తే మాకు ఏమీ మిగలడం లేదు. బ్యాంకు రుణం రద్దు చేయాలి. కనీసం వడ్డీ అయినా రద్దు చేయాలి. – దవలమ్మ, స్వయం సహాయక
బృందం సభ్యురాలు
ఆర్టీసీ కార్గో ద్వారా పంపుతాం..
జడ్చర్ల, కోస్గి వంటిప్రాంతాలకు వెళ్లి వేపగింజలను కొనుగోలు చేసి తెచ్చుకొని వేప నూనె, వేప చెక్క తయారు చేస్తున్నాం. ఇప్పుడు గింజలు దొరకడం కష్టమవుతోంది. ఏడాదిలో ఆరు నెలలు ఈ పనే చేస్తున్నాం. వేప గింజల రేట్లు పెరిగినా వేప నూనె (కిలో రూ.400), వేప చెక్క/కేక్ (కిలో రూ. 35) రేటు పెంచలేదు. వివిధ జిల్లాల్లో సేంద్రియ సాగు చేసే రైతులు ఇక్కడి వచ్చి కొనుగోలు చేసుకొని తీసుకెళుతుంటారు. ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ తీసుకొని ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపుతున్నాం. – సువర్ణమ్మ (88979 04571), స్వయం సహాయక బృందం సభ్యురాలు
Comments
Please login to add a commentAdd a comment